పూజాఫలం - అచ్చంగా తెలుగు
పూజాఫలం
-       శ్రీమతి సుజాత తిమ్మన.
  

 “ఉన్నానో పోయానో చూడ్డానికి వచ్చావా....!” కనుబొమలు ఎగురవేస్తూ, కోపంగా అరిచాడు...సుధాకర్. జవాబెమీ చెప్పకుండా ”హమ్మయ్య...ఆ స్వామి కృప వల్ల అనుకున్నంత ప్రమాదం ఏమి జరగలేదు....” మనసులోనే వందనాలు తెలుపుకుంటూ, మౌనంగా ఉండిపోయింది సుగుణ. “వద్దు..వద్దు ..నాకు ఇష్టం ఉండదు..ఇలా గంటలు గంటలు పీటల మీద కూర్చొని పూజలు చెయ్యటం..నీ పూజలు..పునస్కారాలు...ఏవో నీ చావు నీవు చావు అని ఎంత చెప్పినా విన్నావా...” అన్నాడు పళ్ళు పట పట కొరుకుతూ... పొద్దున్నే నాలుగంట్లకి లేపావ్...స్నానం అంటూ...ఆ పంతులు వచ్చే సరికి ఐదైంది...ఆయన మెల్లగా పూజ ముగించే సరికి ఎనిమిది...ఇరవై మైళ్ళు రన్నింగ్ లా ఆఫిసుకోచ్చేసరికి...ఈ ట్రాఫిక్ లో...10.45..బాస్ని తప్పించుకొని..వర్క్ మొదలు పెట్టనా...అందులో..తప్పులని ఎంచుతూ...వాడే, మా బాస్ గాడు....ఎన్నెన్ని మాటలన్నాడు...సరే..అవన్నీ సరి చేసుకొని....ఆలస్యం అయినా సరే అని పనంతా పూర్తి చేసుకొని...బయలు దేరానా.....ఆ కుక్క నా బండి కిందే పడాలని అనుకుందేమో..రయ్యి మంటూ ఉరికొచ్చింది..దాన్ని తప్పిద్దామని పక్కకి జరిగాను..అంతే ...బైక్ అటు..నేను ఇటు..అదృష్టమా అని హెల్మెట్ పెట్టు కున్నా కాబట్టి సరిపోయింది...లేకపోతే ..ఈ పాటికి పాడె మీదుండే వాడిని...కొంచమైనా ఇంగితం ఉండాలి నీకు... నాచేత ఇష్టం లేని పనులు చేయించేందుకు...” అది హాస్పిటల్ అని గాని, డ్రసింగ్ చేస్తున్న డాక్టర్,  అతనికి సాయంగా నర్స్ పక్కనే ఉన్నారని గాని . అతనికి ధ్యాస లేదు. ఉన్న అక్కసంతా వెళ్ళబోస్తూనే ఉన్నాడు... కంటి రెప్పల నిండుగా  నిండిన నీటిని దాచాలనే  ప్రయత్నంలో, పక్కకి  తిరిగింది సుగుణ. తను చేసిన తప్పేంటో తెలియ రాలేదు. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలని మూడేళ్ళు గా అనుకుంటూ ,వాయిదా వేస్తూ వచ్చారు. ఈ రోజు ఏకాదశి. ఎలాగైనా పూజ చేసుకోవాలని పట్టు పట్టి వప్పించింది. అదే నా తను చేసిన తప్పు. అప్పుడు కూడా, అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మొక్కుకుంది. వీలుకాక చేసుకోలేకపోయింది. ఆతను  దేవుడిని కానీ, పూజలను  కానీ, అసలు నమ్మడు, సహకరించడు. తను పూర్తిగా విరుద్దం.. ”మనసులో తనలో తనే అనుకుంటూ...
“గంట తరువాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు...చిన్నగా హెయిర్ క్రాక్....అంతే ..తప్పితే..ప్రమాదం ఏమి లేదు..వెళ్ళే ముందు ఒకసారి వచ్చి నన్ను కలవండి..” అని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయారు.
  డాక్టర్ గది వరకు కూడా సుగుణ సహాయంతో నడుస్తూవచ్చాడు , ఇక సెలవు తీసుకుంటాము   అని చెప్పటానికి, సుధాకర్... కుర్చీ చూపించి కూర్చో మంటూ ,సుగుణ వైపు తిరిగి..”అమ్మా...కొంచము మీరు అలా  బైట వెయిట్ చేస్తారా..ప్లీజ్..” అని ఎంతో నమ్రతతో చెప్పారు డాక్టర్ గారు. “అలాగే నండి...” అంటూ గది బైటికి నడించింది సుగుణ. “ఇప్పుడెలా ఉంది సుధాకర్ గారు..”అన్నారు, ముందుగా కాలు వైపు చూస్తూ... “ఓకే...డాక్టర్...ఫైన్..జస్ట్..టుడేస్లో బాగా నడవ గలుగుతాను...” ఏంతో దైర్యంగా చెప్పాడు సుధాకర్. “గుడ్..గుడ్...కానీ పర్సనల్ అనుకోక పొతే..ఒక విషయం చెపుతాను..ఏమి అనుకోరు కదా..” చెప్పాలా వద్దా అనే మీమాంస తో అడిగారు డాక్టర్ గారు. “ఏం ఫరవాలేదు డాక్టర్.....చెప్పండి....తప్పకుండా వింటాను..అనుభవజ్ఞులు...మీ మాటకి గౌరవమిస్తాను...డాక్టర్..” ఎంతో నమ్రతగా అన్నాడు సుధాకర్. “అందుకే చెపుతున్నా..ఇందాక మీ భార్యని కేకలేసారు...అఫ్కోర్స్...అది  పూర్తిగా మీ స్వవిషయం...మీకు అధికారం ఉంది కాదనను..కానీ....అందుకు కారణం కూడా ఉండాలి కదా..సమయాసందర్బాలు చూసుకోవాలి...ఇంట్లో ఎదో అరుచుకుంటే, కొంచం ఓకే....అది ప్రతి ఇంట్లోను ఉండేదే! కానీ....నలుగురి ముందు, మీరు అలా మాట్లాడకుండా ఉండవలసింది...  భార్య ఎప్పుడు భర్త క్షేమమే కాంక్షిస్తుంది... మీరు ఇంటి నుండి వెళ్ళిన క్షణం నుంచి, మీరు తిరిగి ఇల్లు చేరుకునే దాకా, ఆమె మీ గురించే ఆలోచిస్తూ, ఆత్రపడుతూ ఉంటుంది. మీకు, మీ ఇంటికీ ఒక అర్ధాన్ని, రూపాన్ని ఇస్తుంది. మీరు చల్లగా ఉండాలనే ఎన్నో నోములూ, ఉపవాసాలు చేస్తుంది.  ఆ భగవంతుని కృప ఉంది కాబట్టే, మీకు పెద్ద గండం గడిచింది ,అనుకోవచ్చు కదా...!కలికి కంట నీరు చిలికిన చెరిగి పోవురా సిరులు... అనే పాట వినే ఉంటారు... అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను...తప్పుగా చెపితే...సారి...” కళ్ళద్దాలు సవరించుకుంటూ అనునయంగా చెప్పారు, డాక్టర్ గారు. “అయ్యో..!సారి నేనే చెప్పాలి డాక్టర్...ఇక ముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించను...నిజం...నా కళ్ళు తెరిపించారు..థాంక్యు సో మచ్...డాక్టర్...” తను చేసిన దానికి తనే సిగ్గు పడుతూ...ఇక ముందు నిజంగానే..ఎప్పుడు ఇలా కించ పరచి మాట్లాడ  కూడదు...సుగుణ ...పాపం ..నాకోసం ..నాకోసమే...అన్ని పూజలు చేస్తుంది...వట్టి పిచ్చిది...” భార్య మీద అంతులేని అనురాగం పొంగి పొర్లగా, తన తొందరపాటుకు చింతిస్తూ, డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నాడు సుధాకర్.    

No comments:

Post a Comment

Pages