రాజకీయ క్రికెట్
(emesco వారు ప్రచురించిన నా పుస్తకం 'వ్యంగ్యాస్తం' నుంచి )
ప్రతీ సారి ఎన్నికల ముందు, ఊరూరూ, వాడ వాడా తిరిగి, కాసులూ, ఆశలూ వెదజల్లి, ఎండకు మాడిన కాకుల్లా వడిలిపోయే బదులు, ఎన్నికల ప్రచారం వినూతనంగా చేస్తే ఇలా ఉంటుందా, అని రాజకీయ నాయకులంతా ఆలోచించారు. మరి క్రికెట్ కంటే అద్భుతమయిన ప్రచార సాధనం లేదు కనుక , అన్నీ పార్టీ ల వాళ్ళు, క్రికెట్ పోటీలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో, పెద్ద సాధన లేకుండానే, బరిలోకి దిగారు.
యే పార్టీ వాళ్లకి, ఆ రంగు చొక్కాలు, వాళ్ళ ఎన్నికల గుర్తులు ముద్రించి ఇచ్చారు. గోడ మీద పిల్లుల్లా, రోజుకో పార్టీ మార్చే వాళ్ళ కోసం ప్రతి పార్టీ లోను, అదనంగా కొన్ని చొక్కాలు పెట్టి ఉంచారు. ముందుగా ,పోటీ పడబోయే, ఇద్దరు పార్టీల నాయకులు రాగానే, ఒక్కక్కరినీ పది మంది, గన్ మాన్ లు చుట్టుముట్టారు. ఆశ్చర్య పోయిన అంపైర్ తో, ' వీళ్ళ ముత్తాత, మా ముత్తాత తండ్రిని హత్య చేసాడు, అప్పటి నుంచి కక్ష్యలు రగులుతున్నాయి. ఈయన, క్రికెట్ బాల్ లో బాంబు పెట్టి విసరడని ఏంటి నమ్మకం?' అడిగాడు, చేయ్యిచ్చే పార్టీ నాయకుడు. 'అయ్యా, మీ కక్షలు పక్కన పెడితే, మీ రక్షణ కోసం, ఈ లోహపు కవచాలు చేయించాము. ఇరు జట్ల నాయకులకి, వాళ్ళ పార్టీ గుర్తు కూడా వేయించి తయారుచేయించాం. ఇక టాస్ వేద్దామా? ' అన్నాడు అంపైర్ . ముందుగా నీలి చొక్కాల పార్టీ కి బాటింగ్ అవకాశం వచ్చింది. దీనికి మండి పడ్డ చేయ్యిచ్చే పార్టీ నాయకుడు, 'అధ్యక్షా! దీని వెనుక ప్రతి పక్షాల కుట్ర ఉంది అనిపిస్తోంది, మళ్ళి టాస్ వేసేదాకా నిరసన ప్రకటిస్తున్నాను,' అన్నాడు. అదిరిపోయిన అంపైర్, 'అయ్యా, అధ్యక్షా కాదు, అంపైర్ అనాలి, నాణెం పైకి విసిరాక, బొమ్మో, బోరుసో పడక చస్తుందా? మీరు నిరసన ప్రకటించుకోండి, నేను విశ్రాంతి తీసుకుంటాను. ప్రచారం అటక ఎక్కుతుంది, ఏవంటారు?' అన్నాడు. దిగి వచ్చిన నాయకుడు, ఆటకు సిద్ధమయ్యాడు.
ముందుగా, బౌలింగ్ చెయ్యడానికి వచ్చిన నాయకుడు, బాల్ వెయ్యబోతు, ఆగిపోయి,' ఈ విషయం మీద నేను వాకౌట్ చేస్తున్నా, అన్నాడు. మంటేక్కిన ప్రతిపక్ష నాయకుడు, ' యే విషయం మీదరా నెల తక్కువ వెధవా. అసలు నీ బుర్రలో గుంజుందా? అసలు ఆట మొదలవకుండానే, వాక్ ఔటా? పొద్దుట వాకింగ్ చేయ్యనప్పుడల్లా, సభ లోంచి బయటకు పోయి, టీ తాగి, చుట్టూ నడిచేసి వచ్చే నీ బొంత కాకి బుద్ధి నాకు తెలీదనుకుంటున్నావా ? బావురు కప్పు మొహమూ నువ్వునూ,' అంటూ తిట్ల దండకం మొదలెట్టాడు. రెండవ అంపైర్ చేయి ఎత్తడంతో ' నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా , అధ్యక్షా,' అంటూ వెనక్కి తగ్గాడు. ఆ సరికి , తిక్క నసాళానికి ఎక్కిన ప్రతిపక్ష నాయకుడు, విసురుగా విసిరిన బంతిని, లాఘవంగా కొట్టి, నాలుగు పరుగులు సాధించాడు.
ప్రత్యేకంగా చీరలు కట్టి ,అలంకరించబడ్డ 'చీర్ రౌడి' లు డప్పు డాన్సు చేస్తుండగా, అందరికీ అభివాదం చేసాడు, బాట్స్మన్. దానితో బుద్ధి తెచ్చుకున్న బౌలింగ్ నాయకుడు, జాగ్రత్తగా బౌలింగ్ చేయ్యసాగాడు. అందరూ, వయసయిపోయిన వాళ్ళే కావడంతో, గట్టిగా నాలుగు పరుగులు కూడా తియ్యలేక ఆయాసపడుతున్నారు. కొందరు డక్ అవుట్ అవుతున్నారు. కొందరు LBW కింద అవుట్ అవుతున్నారు. పరుగులు తీసే వారు లేరు కనుక రన్ అవుట్ లేదు.
ప్రతిపక్షాలకి, ఇంకో నాలుగు పరుగులు తగలగానే, అసమ్మతి ప్రకటించి, మైదానం లోనే బైటాయించాడు. ఆయనను, ఎలాగో సముదాయించి, పక్కకు లాక్కెళ్ళి, వేరే బౌలర్ నీ తెచ్చారు. అతను చిన్నప్పుడు కర్ర- బిళ్ళ తప్పితే, యే నాడు క్రికెట్ ఆడలేదు. అందుకే, నో బాల్ల్స్, వైడ్ లు ఇచ్చి, ఎదుటి పార్టీ వాళ్ళ స్కోరు మరింత పెంచారు. 'చీర రౌడి' ల సందడి మిన్నంటింది.
ఈ లోపు బాటింగ్ వంతు, బౌలింగ్ వంతు ఆడ వాళ్లకి వచ్చింది. ఆవిడ వేసిన బంతిని, ఈవిడ కొట్టకుండా, గోళ్ళు కొరుక్కుంటూ నుంచుంది. ఈవిడ బూతులన్కిన్చుకుంది. ' ఏమే, ఎంత పొగరే నీకు? నేను బాల్ వేస్తుంటే, నిల్చుంటావా? అసలు మీ వంశమే తేడా వంశమే . నీకు ఈ పదవి ఇలా వచ్చిందో తెలుసే, సుల్తాన్ బజార్ లో దువ్వేన్నలు అమ్ముకునే దానివి కాదే, ఏబ్రాసి పీనుగా' అనగానే, ఇవతలావిడ రెచ్చిపోయి, జుట్టు పట్టుకుని, 'ఒసాయ్, మండపేటలో బజ్జీలు అమ్ముకునే దానివి కదే, తాడి చెట్టుకు తీసిన తాటి కల్లుని, చెట్టు కిందే అమ్మేదానివి కదే, నీ చరిత్ర ఎవడికి తెలిదే? నీ జిమ్మడిపోను, దొరసానిలా ఎగిరిపడుతున్నవే! మర్యాదగా నా జుట్టు వదలవే,' , అంటూ లెంపకాయ్ కొట్టింది. ఈ లోపల అంపైర్ వచ్చి, ఈల వేసి, ' అమ్మ , ఇది లైవ్ , జనాలు చూస్తున్నారు,' అనగానే, ' పెద్ద చెప్పొచ్చావ్ లేవయ్యా, మా రోజూవారీ పోరు మాత్రం లైవ్ కాదేంటి? అయినా మేము కొట్టుకోవట్లా, జనాలకి ఇదేమి కొత్త కాదు, ' అన్నారు. ఎలాగో వాళ్ళిద్దరినీ విడదీసి, సముదాయించారు. ఈ సారి బాటింగ్ కు వచ్చినాయనకి, ఎప్పుడు బాల్ వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కుడా తెలీదు. అలా మొత్తానికి నీలి చొక్కా పార్టీ వాళ్ళు 20 -20 లో ముచ్చటగా యాభై పరుగులు తీసారు. చేయ్యిచ్చే పార్టీ నాయకుడికి, గుండెలు దడ దడ లాడాయి. వెంటనే, అవతల పార్టీ MLA లకు లంచాలిచ్చి, హామీలిచ్చి కొనేసాడు. చొక్కాల రంగులు, మారాయి, మ్యాచ్ ఫిక్స్ఇంగ్ లు జరిగాయి. డబ్బుకు గడ్డి తిన్న నేతలు, బౌలింగ్ అసలు రానట్టు, చాలా నీచంగా చేసారు. అయినా, బాటింగ్ రాని చేయ్యిచ్చే పార్టీ నేతలు పదిహేను ఓవర్ ల లో ముప్పై పరుగులు కూడా తియ్యలేక పోయారు. వెంటనే, రాజకీయం చూపించిన, వాళ్ళ నాయకుడు, లంచం పుచ్చుకున్న బౌలర్ కి కన్ను కొట్టాడు. వెంటనే, అతను బాట్స్మన్ చేతికి తగిలేలా, బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో, రక్తం కారుతున్న చేయ్యిచ్చే పార్టీ బాట్స్మన్ గగ్గోలు పెట్టాడు.
గొడవలు మొదలయ్యాయి, చీర రౌడీలు బరిలోకి దిగారు. బాట్, బాల్ వంటి సాధనాలతో, కొట్టుకు చస్తూ, అంతా పరిగెత్తబోయి, ఏమి తోచక ఆగిపోయారు. మ్యాచ్ కాన్సిల్ అయ్యింది. తను నెగ్గకపోయినా, అవతలి వాళ్ళను నెగ్గనివ్వకూడదనే వ్యూహం ఫలించింది.
నిర్వాహకులకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్ళు కూడా రాజకీయ నాయకుల స్థాయికి దిగజారిపోయి, ' ఓరి మీ మొహాలు మండ. మీ ఎండ్రగప్ప బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మీరు పైకి వెళ్ళరు, ఇంకొకరిని వెళ్ళనివ్వరు. ఇందుకు ఎంతయినా చేస్తారు, కుట్రలు, అభియోగాలు, తంత్రాలు, హత్యలు . ఒక ఏకాభిప్రాయానికి రారు. దేశాన్ని బాగుపడనివ్వరు. మీరు మాత్రం బందుపరివార సమేతంగా ఎదిగిపోతారు. మీ లాంటి వాళ్ళతో మ్యాచ్ కి వప్పుకున్నందుకు, మేము సిగ్గుతో చావాలి. ఇది క్రికెట్ ఆటకే అవమానం, బాగా బుద్ధి చెప్పారు, ఇంక మీకు మీ ప్రచారానికి ఒక దణ్ణం, వెళ్ళండి,' అంటూ తరిమేశారు.
No comments:
Post a Comment