సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి - అచ్చంగా తెలుగు

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి

Share This
సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి (అన్నమయ్య కీర్తనకు వివరణ )
                                                                                                - డా.తాడేపల్లి పతంజలి
                                                

పాప ఫలితము పోవాలంటే వేంకటేశ్వరునిపై భక్తి అవసరమని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోధిస్తున్నాడు (సంపుటము  03-377)
పల్లవిసకలశాంతికరము సర్వేశ నీపై భక్తిఅన్నింటికి అధిపతివైన ఓ వేంకటేశ్వరా! నీపై భక్తి కలిగియుండుటఅన్ని విధములైన శాంతులను కలిగిస్తుంది.
ప్రకటమై మాకు నబ్బె బదికించు నిదియెఆ భక్తి కీర్తనలరూపములో వెల్లడి అవుతూ మాకు అదృష్టవశాత్తు అబ్బింది.  నీపై ఉన్న భక్తియే బతికిస్తుంది.
 01వ చరణంమనసులో పాపబుద్ధి మరియెంత దలచినమనసులో పాపబుద్ధితో ఎన్ని విషపుటాలోచనలు చేసినప్పటికి
నినుదలచినంతనే నీరౌనుఒక్కసారి నిన్ను తలుచుకొన్నంతనే చాలు నీరులాగా ఆ పాపాలు కరిగిపోతాయి.
కనుగొన్న పాపములు కడలేనివైనానుతెలిసికొంటే ఒక గొప్ప విషయము తెలుస్తుంది. అంతులేని పాపాలు చేసినప్పటికీ
ఘనుడ నిన్ను జూచితే కడకు తొలగునుఓ గొప్పవాడైన వేంకటేశ్వరుడా! నిన్ను ఒక్కసారి దర్శిస్తే చాలు, పాపాలు చివరిఅంచువరకు-అంటే కొంచెమయినా మిగలకుండాతొలగిపోతాయి.
 02వ చరణంచేతనంటి పాతకాలు సేనగా నే జేసినానుచేయటానికి ఎంత శక్తి ఉందో , ఆ మొత్తం శక్తిని ఉపయోగించి ఎన్నో పాపాలు నేను చేసాను.
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయుతరువాతి కాలంలో నీకు మొక్కితే అ పాపాలన్ని తొలగిపోతాయి
ఘాతలజెవుల వినగా నంటిన పాపమునిందలను మా చెవులలో వింటే అంటుకొన్న పాపము
నీతితో నీ కథ వింటే నిమిషాన బాయునున్యాయమైన నీ కథ వింటే మరునిమిషములో నశిస్తుంది.
 03వ చరణంకాయమున జేసేటి కర్మపు పాపములెల్లఈ శరీరముతో అనుభవించే పూర్వజన్మ కర్మలకు సంబంధించినపాపములన్ని
కాయపునీ ముద్రలచే గక్కన వీడు కాయపు ముద్రలతో (=వెండితో చేసిన శంఖం, చక్రం, నామం ముద్రలను నిప్పుతో కాల్చి   ఎడమ భుజముపై శంఖం, కుడిభుజంపై చక్రం, వక్షంపై నామపు ముద్రలు వేయుట కాయపు ముద్రలు.)వెంటనే తొలగిపోతాయి.
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనావేంకటేశా! ఎక్కడెక్కడ ఏ పాపము చేసినా
 ఆయమైన నీ శరణాగతిచే నణగుజీవస్థానమైన నీ శరణాగతితో అన్ని అణగిపోతాయి.
  విశేషాలు 18 అంశాలను పాపకర్మలుగా కొందరు  చెప్పారు. . 1.హింస  2. అబద్ధాలు చెప్పడం 3. దొంగతనం 4. వ్యభిచారం 5. సంపదను దురాశతో పెంచుకోవడం 6. క్రోధం. 7. పొగరు/ దురహంకారం 8.వంచన. 9. అత్యాశ 10. వ్యామోహం 11. ఈర్ష్య. 12. గొడవ పడటం 13. దోషారోపణ 14.ఉబుసుపోక మాటలు 15.  ఇష్టాయిష్టాలు 16.ఆక్షేపించడం/ విమర్శించడం 17. స్వార్థదృష్టితో తప్పుడు వాదం చేయడం 18.తప్పు నమ్మకాలు . కొంతమంది పాపకర్మలు పది అన్నారు. హింస  2. దొంగతనం 3. ధర్మ విరుద్ధ కామం, 4. కొండేలు చెప్పడం 5. కటువుగా మాట్లాడటం 6. అబద్ధాలు చెప్పడం 7. సంభిన్నాలాపం ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం 8. చంపడం/ ద్రోహాన్ని తలపెట్టడం 9. పరాయి వారి సొమ్ము తినాలనుకోవడం 10. చెడ్డచూపు.  సంసార జీవితములో ఉన్నవారు వీటిలో కొన్నింటిని ఇష్టము లేకపోయినా చేయవలసిఉంటుంది. లేకపోతే జీవితాలు నడువవు. ఆ పాప ఫలితము పోవాలంటే వేంకటేశ్వరునిపై భక్తి అవసరమని అన్నమయ్య ఈ కీర్తనలో ప్రబోధిస్తున్నాడు. ‘’ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే . పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల ‘’  అని స్వామి వారి ఎదుట మనము చెప్పుకొనే మాటలను కీర్తనలో అన్నమయ్య పొదిగాడు.కాకపోతే చిన్న మార్పు. దేవాలయాల్లో స్వామి వారి చుట్టూ ప్రదక్షిణము  చేస్తే పాపము తొలగుతుంది. మన బొటి సామాన్యులము అన్నమయ్య కీర్తనలోని పదాల చుట్టూ నాలుకను ప్రదక్షిణము చేయిస్తే చాలు. పాపాలు తొలగిపోతాయి.   ఈ కీర్తన చివరి చరణములో అన్నమయ్య వైష్ణవులకు సంబంధించిన సమాశ్రయణ  దీక్షను చెప్పాడు. సమాశ్రయించటం అంటే శరణు కోరుట.. వైష్ణవ గురువును ఆశ్రయించి, వైష్ణవ దీక్షను తీసుకోవడం సమాశ్రయణము. గురువు . పంచసంస్కారాలు చేసి దీక్ష ఇస్తాడు. . తాపం, పుండ్రం, నామం, మంత్రం, యజ్ఞం అనేవి పంచ సంస్కారాలు .మొట్టమొదటి  తాపసంస్కారంలో వేడి చేసిన శంఖ చక్రాల ముద్రలను చేతుల విూదవేస్తారు. వెండితో చేసిన శంఖం, చక్రం, నామం ముద్రలను నిప్పుతో కాల్చి   ఎడమ భుజముపై శంఖం, కుడిభుజంపై చక్రం, వక్షంపై నామపు ముద్రలు వేసే పద్ధతి కూడా కొన్ని చోట్ల ఉందని చెబుతారు.  ఈ కాయపు ముద్రలు పాపాన్ని తొలగిస్తాయని వైష్ణవుల ప్రగాఢ విశ్వాసము.   చేయకూడనిది చేయడం, చేయాల్సింది చేయకపోవడం ఈరెండూ కూడా పాపాలే. అవి పోవాలంటే వేంకటేశునిపై భక్తి కావాలి. ఈ కీర్తనను మనస్సు పెట్టి చదివితే స్వామిపై భక్తి కలుగుతుంది. పాపవినాశనము కలుగుతుంది. సందేహము లేదు. స్వస్తి. ’ (నేదునూరి వారి అమృత గళములో ఈ అన్నమయ్య కీర్తన ఈ లంకెలో దొరుకుతుంది. https://archive.org/details/SakalaSantikaramu) ---------------

No comments:

Post a Comment

Pages