సప్తస్వరాల రారాజు.. శ్రీనివాస రాజు - అచ్చంగా తెలుగు
సప్తస్వరాల రారాజు.. శ్రీనివాస రాజు 

ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో  శైలి ఉంటుంది. కొందరు మెలోడీ పాటలకు ప్రసిద్ధి అయితే మరికొందరు ఫాస్ట్ బీట్ బాటలలో తమదైన శైలిని చూపిస్తుంటారు. అవి సినిమా పాటలైనా సరే.. ప్రైవేటు ఆల్బంలైనా సరే..  మెలోడీ, ఫాస్ట్ బీట్ లలో ఇప్పటి వరకు చాల మంది సంగీత దర్శకులు వెలుగులోకి వచ్చిన కేవలం  భక్తి పాటలతో తమదైన ముద్ర వేసుకున్న సంగీత దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో ఒకరైన  గాయకుడు, సంగీత దర్శకుడు ఈలపంటి  శ్రీనివాసరాజు గారితో శ్రీకాంత్ కానం ప్రత్యేక ఇంటర్వ్యూ … మీ కోసం…
అచ్చంగా తెలుగు:  మీ కుటుంబ  గురించి చెబుతారా?
ఈలపంటి శ్రీనివాసరాజు: నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా. నాన్న పేరు గంగమ  రాజు, అమ్మ పేరు ప్రమీల , నా శ్రీమతి పేరు మాలతి, ఇద్దరు పిల్లలు సాహితి, శ్రేయాస్.
అ. తె :సంగీత రంగం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు?
ఈ. శ్రీ : నాన్న బుర్ర కథ కళాకారుడు. ఆల్ ఇండియా రేడియోలో బుర్ర కథలు చెప్పేవారు. తనని చూస్తూనే చిన్నప్పటినుండి  పాటలు పాడటం పట్ల ఆసక్తి ఏర్పడింది.  స్కూల్ లో 7 వ తరగతి లో ఉన్నప్పుడు ఆగష్టు 15, జనవరి 26 రోజులలో జరిగిన పాటల  పోటిలలో రెండు సార్లు ప్రథమ బహుమతి వచ్చింది. అప్పటినుండి అది అలాగే కొనసాగుతూ పదవ తరగతికి వచ్చేసరికి, వివిధ కళా సంస్థలు జిల్లా, మండల స్థాయిలో నిర్వహించే స్థాయికి వచ్చింది. మాజీ ప్రధాని పి వి నరసింహ రావు గారి సతీమణి,  శ్రీమతి పి వి సత్యమ్మ గారి పేరు మీద ఏర్పాటు చేసిన కాంపిటిషన్ నాకు జిల్లా స్థాయిలో మొదటిది. అందులో మొదటి బహుమతి రావడంతో పి వి నరసింహ రావు గారి అబ్బాయి పి  వి రంగా రావు గారు వాళ్ళ సొంత ఊరు లకినేపల్లి లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మెడల్ ను, అవార్డు ను అన్దచెసారు. మరుసటి రోజు నా ఫోటో పేపర్లో రావడం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. అప్పటినుండి ఎక్కడ, ఏ  సంస్థ  కాంపిటిషన్ జరిగిన వెళ్ళడం, అందులో పాల్గొనడం, ఏదో ఒక బహుమతి పొందడం జరిగింది. వాటన్నింటిలో విజయవాడ NCV  సంగీత పరిషత్ వంటి సంస్థలు ఉన్నాయి.  నేటి ప్రముఖ నేపథ్య గాయని సునీత, నేను ఒకే సారి NCV  సంగీత పరిషత్ వారి పోటిలో పాల్గొంటే మహిళల క్యాటగిరిలో తనకు, పురుషుల క్యాటగిరిలో నాకు గోల్డ్ మెడల్ లు వచ్చాయి.
అ. తె : సంగీత రంగంలో గురువు ఎవరు? 
ఈ. శ్రీ : అప్పట్లో మాకు కరీంనగర్ లో  సంగీతం నేర్పించే గురువులు ఇద్దరే ఉండేవారు. అందులో ఒకరు ఘంటా సత్యనారాయణ గారు అయితే మరొకరు మోహన్ స్వామి గారు. వారిద్దరి వద్దే సంగీతం నేర్చుకున్నాను.
అ. తె : రేడియో, దూరదర్శన్ ఆ తర్వాత పాడుతా తీయగా కార్యక్రమమ్.. కాస్త ఈ ప్రయాణం గురించి మాతో చెబుతారా? 
ఈ. శ్రీ : సంగీతంలో శిక్షణ పొందాక 1987లో జానపద గాయకులకోసం జరిగిన ఆడిషన్లో ఎంపికయ్యి  ఆల్ ఇండియా రేడియో లో అడుగుపెట్టాను. కరీంనగర్ జిల్లా నుండి ఆల్ ఇండియా రేడియో లోపాటలు పాడిన మూడో గాయకుడిని నేను. నా కంటే ముందు ప్రణయ్ కుమార్, సుద్దాల బాలయ్య గారు పాడారు. అప్పట్లో ఆల్ ఇండియా రేడియో లో ఒక షరతు ఉండేది - జానపదాలు అంటే పూర్తిగా సేకరించిన పాటలే పాడాలి అని. పల్లెల్లో  నాట్లు వేసేటప్పుడు పాడుకునే పాటలు, వారి కోతలు కోసేటప్పుడు పాడుకునే పాటలు, బతుకమ్మ పాటలు వంటి వాటిని సేకరించి పాడాలి . అందుకోసం ఒక చిన్న వాక్ మన్ ను కొనుక్కుని ఊళ్లన్ని తిరిగి, అక్కడ ఎవరు పాటలు బాగా పాడుతారో కనుక్కుని వాళ్ళచే పాడించుకుని దానిని రికార్డు చేసుకుని.. అందులో కొన్ని మార్పులు చేసి ల్ ఇండియా రేడియో లో పాడేవాడిని. అలా సుమారుగా 1000కి పైగా పాటలు సేకరిస్తే అందులో దాదాపు రెండు వందలకు పైగా ల్ ఇండియా రేడియో లో పాడి వినిపించాను. ఆ తర్వాత బాలు గారి పాడుతా తీయగా మొదటి ధారావాహికకు ఎంపికయినా  అనివార్య కారణాల వల్ల పాడలేకపోయాను. అయితే రెండో ధారావాహికకు వాళ్ళే పిలిచారు. అందులో తొమ్మిది ఎపిసోడ్లు నెగ్గిన నేను మెగా సిరీస్ సెమి ఫైనల్లో ఓడిపోయాను. అప్పుడు బాలు గారు శాస్త్రీయ సంగీతం కూడా వచ్చుండాలమ్మ అని అన్నారు. జానపద సంగీత నేపథ్యం నుండి వచ్చానని తెలుసుకుని ఇంత మంచి మెలోడీ వాయిస్ ఉన్న నువ్వు ఎందుకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోకూడదు అంటూ సూచించారు. వారిచ్చిన ఆ స్పూర్తితో లలిత సంగీతం నేర్చుకుని, మల్లి ఆలిండియ రేడియోలో పాడను. అప్పుడు దూరదర్శన్లో పాల్గొనాలంటే ఆలిండియా రేడియో నే ప్రధానం. అందులో పాడిన గాయకులకు మాత్రమె దూరదర్శన్లో పాడే అర్హత ఉండేది. అలాంటి సమయంలో దూరదర్శన్లో వయోజన విద్య, పల్స్ పోలియో , కుటుంబ నియంత్రణ, దేశ భక్తి వంటి అంశాల మీద ప్రోగ్రామ్స్ చేసాను.
అ. తె : నాకు  తెలిసినంత వరకు ఈలపంటి  శ్రీనివాసరాజు అంటే గాయకుడు, సంగీత దర్శకుడు కూడా! అసలు మీ కెరీర్ ను గాయకుడు అవ్వాలని మొదలు పెట్టారా ? లేదా సంగీత దర్శకుడు అవ్వాలనా ?
ఈ. శ్రీ : నేను సంగీత దర్శకుడు అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైనా బైక్ నడిపిస్తుంటే నాలో నేనే హమ్ చేసుకునేవాడిని. అప్పుడు వచ్చే ట్యూన్ ను వెంటనే ఒక పేపర్ మీద పెట్టేవాడిని. వాటిలో పలానా ట్యూన్ నాకు బాగుంది అని అనిపిస్తే దానికి మిత్రుల ద్వారా పాటలు వ్రాయించేవాడిని. అలా కొన్ని బాణీలు చేశాను. కాని వాటిని ఎప్పుడు సంగీత దర్శకత్వం అనుకోలేదు. ఆ తర్వాత నా మొదటి ఆల్బం "శబరీ కొండలలో" కోసం కంపోజింగ్ కు వెళ్ళినప్పుడు సంగీత దర్శకుడు రవి అలగ గారికి చెప్పాను "అన్నా.. ఇలా కొన్ని ట్యూన్స్ అనుకుంటున్నాను. అర్కేస్త్రైజేషణ్ చేసివ్వాలని. ఆయన ఇచ్చిన సలహాలను కూడా తీసుకుని ఇద్దరం కలిసి ఆల్బం రెడీ చేసాము. అప్పుడు ఆయనే ఇవి 100% మీ బాణీలు . సంగీత దర్శకుడిగా మీ పేరే వేసుకోండి అన్నారు. మొదట్లో అంత సాహసం చేయలేకపోయాను. కాని వారు పడే పడే చెప్పడంతో వారిచ్చిన ధైర్యంతో సంగీత దర్శకుడిగా పేరు పెట్టుకున్నాను. ఆ తర్వాత చేసిన ఆల్బమ్స్ కి  గాయకుడిగా కంటే సంగీత దర్శకుడిగా భాద్యత పెరిగ్నట్టు అనిపించింది.  అది అలా కంటిన్యూ అవుతూ భక్తి పాటలలో 14 ఆల్బం లకు  చేరుకుంది.
అ. తె : మీరు ఎక్కువగా  సంగీతం అందించింది భక్తి పాటలకే! అందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
ఈ. శ్రీ : కుటుంబ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తూనే గాయకుడిగా ప్రదర్శనలు, అయ్యప భజనలు చేసేవాడిని. ఎందుకో తెలియదు కాని నాకు కూడా అయ్యప్ప స్వామి మాలధారణ చేయాలనిపించింది. అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు నన్ను అయ్యప్ప పాటల ఆల్బం చేయమని ప్రోత్సహించారు. అలా 1999 లో నేను చేసిన మొదటి ఆల్బం "శబరీ కొండలలో". ఆ తర్వాత దాదాపు  ప్రతి సంవత్సరం కార్తిక మాసం రాగానే ఒక అయ్యప్ప ఆల్బం చేయడం తో ఇప్పటివరకు 10 అయ్యప్ప పాటల ఆల్బం లు, బాసర సరస్వతి ఆల్బం, షిరిడి సాయి ఆల్బం, ఉమా మహేశ్వర స్వామి ఆల్బం, రెండు మూడు సార్లు గోల్కొండ బోనాలకు సంబంధించిన ఆల్బం .. ఇలా వరసగా చేసే సరికి నా ఏకాగ్రత ఎక్కువగా భక్తి పాటల అల్బంలకే పరిమితమయ్యింది.
అ. తె : తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆల్బమ్లు చేసినట్టున్నారు ?
ఈ. శ్రీ : మామూలుగా అయ్యప్ప దీక్ష అంటే ఎక్కువగా దక్షిణ భారత దేశంలోనే చూస్తాము మనము. అయితే ఉత్తర భారతంలో కూడా  అయ్యప్ప పాటల గురించి, అయ్యప్ప దీక్ష గురించి తెలియాలని మిత్రుడు శ్రీ వాత్సవ్ ముందుకు రావడంతో హిందీలో "అయ్యప్ప దీక్ష మహిమ" పేరుతో ఒక ఆల్బం చేశాను. అనూప్ జలోట , ప్లేబాక్ సింగర్ నిహాల్, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు వంటి ప్రముఖులు అందులో పాడారు.
అ. తె : సినిమా రంగం వైపు ఎందుకు ప్రయత్నించడం లేదు ?
ఈ. శ్రీ : నా దురదృష్టవశాత్తు ముందునుండి శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడం ఒక మైనస్ అయితే, నా ప్రయత్నలోపం కూడా ఉందనే చెప్పాలి. సినిమా రంగంలో ఎవరైనా అవకాశాలకోసం తిరగాల్సిందే. కాని ఆ విషయంలో నేను తప్పు చేశాను అనుకుంటున్నా. ఆ తర్వాత మళ్లీ చూసుకునేటప్పటికి కొత్త తరం వచ్చేసింది. ఇక ఈ కొత్త తరం గాయకులతో నేను అడ్జస్ట్ అవ్వగలుగుతానా లేదా అన్నది ఆ భగవంతుడే నిర్ణయించాలి. అయితే నేను అడపాదడపా శ్రీ నిలయం, మార్గదర్శి వంటి సినిమాలలో కొన్ని ట్రాక్స్ పాడిన అవేవి గాయకుడిగా నాకు సంతృప్తిని ఇవ్వలేవు. కాకపోతే శ్రీ నిలయంలో నేను పాడిన పాట (సినిమా లో ప్రొడ్యూసర్ బలవంతంతో నేను పాడిన ట్రాక్ తొలగించి వేరే వాళ్ళతో పాడించిన ట్రాక్ పెట్టారు) బయట మాత్రం నాకు మంచి పేరే తీసుకు వచ్చింది.
అ. తె : గాన గంధర్వుడు  ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు కూడా మీ ఆల్బమ్ లలో పాటలు పాడినట్టున్నారు?
ఈ. శ్రీ : మొదటి మూడు నాలుగు ఆల్బం లలో దాదాపు అన్ని పాటలు నేనే పాడాను. తర్వాత ఇతర ప్రముఖ గాయకులతో కూడా పాడిస్తే బాగుంటుంది  అనిపించింది. నిర్మాతలు కూడా నా నిర్ణయానికి ప్రోత్సాహం అందించడంతో రాము గారు, బాలు గారు, సురేష్ బాబు గారు, శ్రీకాంత్ గారు వంటి ప్రముఖుల గొంతు కూడా నా అల్బంలలో ఉండేలా చూసుకున్నాను.
అ. తె : నవంబర్ 5, 2009 న రవీంద్ర భారతిలో మీరు చేసిన మణికంఠ స్వరార్చన కార్యక్రమ వివరాలు?
ఈ. శ్రీ : ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష సమయంలో నేను భజనలలో పాల్గొంటున్నాను. ఒక సారి దీక్షలో ఉన్నప్పుడే కలలో అయ్యప్ప స్వామి కోసం ప్రత్యేకంగా  ఏదో ఒకటి నేను ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే 12 గంటలు ఏకదాటిగా అయ్యప్ప పాటలతో చేసిన మణికంఠ స్వరార్చన కార్యక్రమం. దానికోసం సాక్షాత్తు సరస్వతి నిలయమైన రవీంద్ర భారతి లాంటి వేదిక నాకు దొరకడం, కేరళలో నడిచే దైవంగా కీర్తింపబడుతున్న మహేశ్వరరు తంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆ దైవ కృపే అనుకుంటున్నాను.
అ. తె : ఇప్పటి వరకు ఎన్ని షో లు చేసారు?
ఈ. శ్రీ : 2008 లో  అమెరికాలో జరిగిన తెలుగు మహాసభలను కలుపుకుని సుమారు 4000 కు పైగా ప్రదర్శనలు చేసుంటాను.
అ. తె : ఈ సంగీత ప్రస్థానంలో మీరు మరువలేని సంఘటనలు ?
ఈ. శ్రీ : 2011 డిసెంబర్ లో అయ్యప్ప కచేరి చేయడానికి జేసుదాస్ గారు హైదరాబాద్ కు వచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆ కార్యక్రమంలో నిర్వాహకులు నేను 12 గంటలు నిర్విరామంగా చేసిన మణికంఠ స్వరార్చన గురించి వారికి తెలియజేయడంతో వారు నన్ను మెచ్చుకుని శాలువ కప్పి, మెమెంటో ఇచ్చి సన్మానించారు. అప్పుడు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.
అ. తె : ఇప్పటి వరకు అందుకున్న అవార్డుల వివరాలు తెలుపుతారా?
ఈ. శ్రీ : ఎస్వీ సంగీత పరిషత్ అవార్డు, రాగ సప్తస్వరం అవార్డు, ఏఎన్నార్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారి అవార్డు, చిలకలూరిపేట కళానిలయం వారి అవార్డు, కరీంనగర్ ఫోకా ఆర్ట్స్ అకాడమీ వారి అవార్డు, ఊర్వశి కళా స్రవంతి వారి నుండి బెస్ట్ సింగర్ అవార్డు ... ఇలా  చాలానే ఉన్నాయి.
అ. తె :  సంగీత దర్శకుడిగా, గాయకుడిగా  మీ ఆశయం ?
ఈ. శ్రీ : ప్రస్తుతానికయితే నేను ఆధ్యాత్మిక సంగీతంతో చాల సంతోషంగా ఉన్నాను. కాని కమర్షియల్గా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా ఒక సినిమా చేయాలనుంది. అది భక్తి సినిమా అయినా సరే.. కమర్షియల్ సినిమా అయినా సరే. అందరి గాయకులలాగానే  సినిమాలలో అవకాశం వస్తే పాడాలనుంది.
అ. తె : ప్రస్తుతం ఏమైనా కొత్త ఆల్బం లు చేస్తున్నారా ?
ఈ. శ్రీ : ప్రస్తుతం ఆడియో మార్కెట్ అంత బాగా ఏమి లేదు. 3 జి ఇంటర్నెట్, వైఫై  అందుబాటులో ఉండటంతో చేతి వేళ్ళతోనే ఏది కావాలన్న దొరికేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆడియో సిడి లు కొని వినే పరిస్థితిలో లేము అని అనుకుంటున్నాను. అందుకే ఈ సంవత్సరం  ఏ ఆల్బం చేయడం లేదు.
అ. తె : భవిష్యత్తు ప్రణాళికలు ?
ఈ. శ్రీ: గత ఏడాది నుండి 24 గంటలు అయ్యప్ప పాటలతో ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటున్నాను.  బహుశా వచ్చే ఏడాది రెండు కొత్త ఆల్బం లతో పాటు ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పం పెట్టుకున్నాను.
  ఈలపంటి శ్రీనివాస రాజు గారితో టెలిఫోన్ లో శ్రీకాంత్ కానం జరిపిన సంభాషణను, వారు పాడిన, సంగీత దర్శకత్వం వహించిన కొన్ని పాటలను ఈ క్రింది లింక్ లలో వినండి. [soundcloud url="https://api.soundcloud.com/tracks/103810661" params="auto_play=false&hide_related=false&show_comments=true&show_user=true&show_reposts=false&visual=true" width="100%" height="75" iframe="true" /]      

No comments:

Post a Comment

Pages