శ్రీ 'అమ్మ' రక్ష - అచ్చంగా తెలుగు
demo-image

శ్రీ 'అమ్మ' రక్ష

Share This
శ్రీ 'అమ్మ' రక్ష
- పూర్ణిమ సుధ

వెనకాల బట్టలు మడతపెడుతూ నిలబడ్డ అమ్మని ట్రేస్ చేసి, ’ఓకె. ఐ విల్ క్యాచ్ యూ లేటర్’ అని ఛాట్ బాక్స్ ని క్లోజ్ చేసింది సౌమ్య. కానీ నిర్మల కళ్ళనించీ తప్పించుకోలేదు ఆ లైన్. ఎవరే ? అని అడిగింది. మధు - మన మధు మమ్మీ అంది సౌమ్య. ఈ మధ్య ఈ క్రాస్ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి... అని నసుక్కుంటూ, నూడుల్స్ చేసుకోడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఎప్పుడూ ఆ జంక్ తినే బదులు, బొప్పాయి కోసి పెట్టాను. తినొచ్చుకదా ? అన్నది నిర్మల. యాక్ క్వైట్ బోరింగ్... కస్టర్డ్ చెయ్. ఇష్టంగా తింటా..! అంటూ నూడుల్స్ కోసం నీళ్ళు తెర్లబెడుతోంది...
ఈ మధ్య సౌమ్య కి చిరాకెక్కువైంది. కంప్యూటర్ లో ఆన్ లైన్ ఛాటింగ్ ఎక్కువైంది. అసలు బుక్స్ కన్నా ఫేస్ బుక్ మీదే ఎక్కువ ధ్యాస. ఎప్పుడు చూడు, సెల్ఫీస్, స్టేటస్ అప్డేట్స్, కామెంట్స్... ఛాటింగ్. ఈ మధ్యే గట్టి వార్నింగ్ ఇద్దామనుకున్న నిర్మల, ఇది చాలా నెమ్మదిగా డీల్ చెయ్యాల్సిన విషయం అని, తన ఫ్రెండ్ అరుణ ద్వారా తెలుసుకుని, కనపడీ కనపడకుండా మానిటర్ చెయ్యడం మొదలు పెట్టింది. వీలున్నప్పుడల్లా, చిన్నప్పటి, తన ఫ్రెండ్స్ అనుభవాలు చెప్తున్నట్టుగా, ఇన్ఫాక్చువేషన్, ఫాల్స్ లవ్, ఆకర్షణల మధ్య తేడాల గురించి చెప్తూ... తనని హెచ్చరిస్తోంది. సౌమ్య ఏమీ అమాయకురాలు కాదు, అవన్నీ తనకి జాగ్రత్తలు చెప్పడానికి, అమ్మ చేస్తున్న ప్రయత్నం అని అర్థం చేసుకుంది. నేనేం చిన్న పిల్లని కాదు, అంత త్వరగా మోసపోవడానికి. అయినా, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ - నువ్వనవసరంగా ఏదేదో ఊహించుకోకు... అని రొటీన్ ’టీన్’ డైలాగ్ ని అప్పచెప్పింది. పనిలో పని, ఇన్నాళ్ళూ, తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న అమ్మని బ్లాక్ చేసింది... ఇంక, లవ్ జీహాద్ లూ, నీతి బోధల పోస్ట్లు ఉండవు అనుకుంటూ..! ఇదే విషయం తన కన్న రెండేళ్ళు పెద్దదైన పక్కింటి రాజి అక్కకి చెప్పి వాపోయింది. చదువు సంస్కారం, వినయం, విచక్షణ, అందం కలిస్తే రాజీ. ఎక్కడ రాజీ పడాలో, ఎక్కడ పేచీ పెట్టైనా సాధించుకోవాలో తెలిసిన ఒక చలాకీ అమ్మాయి. తన డిసిషన్ మేకింగ్ ఎప్పుడూ కరక్టే అవుతుంది. తను చాలా ఈజీగా, ’లైట్ రా...! మన యూత్ లో ఇలాగే ఆలోచిస్తాం. వాళ్ళ భయాల వల్ల వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇది క్వైట్ కామన్. కొన్నాళ్ళ తరువాత, నువ్ హ్యాండిల్ చెయ్యగలవని వాళ్ళకే తెలుస్తుంది’, అని సర్ది చెప్పింది. రాజీకి యు.ఎస్ లో జాబ్ వచ్చింది. ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఈ వారాంతంలో వెళ్ళిపోతుంది. అయినా, తనతో టచ్ లోనే ఉంటానని మాటిచ్చింది.
సౌమ్య రోజూలాగే తన ఎఫ్ బి ఎకౌంట్ చెక్ చేస్తూ, రాజీ అక్కతో చాట్ చేస్తోంది.  ఈలోగా తన ఎక్కౌంట్ కి ఒక యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. పేరు మహేష్... ఎలా ఉంటాడో తెలీదు. ఎందుకంటే ప్రొఫైల్ పిక్ మహేష్ బాబుది. పేరేదైనా, సమంత మహేష్, కత్రీనా, రణ్బీర్ మొహాలే ప్రొఫైల్ పిక్ లు పెట్టడం ఈ మధ్య ట్రెండ్ కదా ? కానీ తను పెట్టిన మెసేజ్ బాగా నచ్చింది. అడిగింది ఫ్రెండ్ రిక్వెస్టే గానీ లవ్ ప్రపోజల్ కాదు కదా ? అని ఈ మధ్య వెటకారంగా పెట్టిన పోస్ట్ ల స్ఫూర్తితో యాడ్ చేసుకుంది. చాలా చలాకీగా మాట్లాడుతున్నాడు. తన కుటుంబం, ఫ్యూచర్ స్టడీస్, ప్యాషన్, హాబీస్... అన్నీ కలబోసుకున్నాడు. ఒక్క రోజు రెస్పాండ్ అవకపోతే, కంటిన్యువస్ గా పింగ్ చేస్తున్నాడు. నిన్న - ఏం డూయింగ్స్ ? అని మెసేజ్ పెట్టాడు. ఇప్పుడే స్నానం చేసి, వచ్చాను... అన్నది. మరి ఒకసారి, సెల్ఫీ పెట్టొచ్చు కదా ? అన్నాడు. గుండె వేగం పెరిగింది. కానీ, ఎందుకో తిట్టాలనిపించలేదు. యూ ఆర్ నాటీ అన్నది. థాంక్ యూ అండ్ విష్ ద సేమ్ ఫ్రం యూ అన్నాడు. ఇలా స్మైలీస్, సిల్లీ నథింగ్స్ ఎన్నో పెరిగి, ఛాట్ లో ఎడ్వాన్స్ అయాక, ఒక శుభ ముహూర్తాన, కెన్ వుయ్ మీట్ వన్స్ ? అని మెసేజ్ పెట్టాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు సౌమ్య ’ష్యూర్’ అనేసింది...ఈ శనివారం ఫిక్స్ అయింది.
అదే విషయం, రాజీకి - ఎఫ్ బి లో ఆన్లైన్ లో లేకపోయేసరికి, హ్యాంగ్ అవుట్ లో మెసేజ్ పెట్టింది. ’ఓహ్ బ్లైండ్ డేట్... సూపర్బ్. కానీ జాగ్రత్త. నీ గూగుల్ నావిగేషన్ ఆన్ లో పెట్టుకో. పానిక్, రెస్క్యూ ఆప్స్ అలర్ట్ గా పెట్టుకో. నువ్వే బిల్ కట్టు. లేకపోతే ’నేను పార్టీ ఇచ్చాను, మరి నువ్వు ?’ అన్నాడంటే, మనిషి నచ్చకపోయినా, నువ్వింకో సారి డేట్ కి వెళ్ళాలి. ఆర్డర్ కూడా నువ్వే ఇవ్వు. ఏ మాత్రం అనుమానం కలిగినా లేచి వచ్చెయ్. మరీ యాగీ చేస్తే, గట్టిగా అరువు. ఊరి బయట దూరంగా ఉన్న హోటల్స్ కాకుండా, కాస్త మనింటికి ఒక 3-4 కిమీ దూరంలో ఉన్న హోటల్ చూస్కో’ నువ్వు ముందే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కో, ఎటువంటి డ్రౌజీ డ్రగ్ కలపే అవకాశం లేకుండా... అలాగే, డ్రింక్స్ ఏవి ఆర్డర్ చేసినా తాగకు. ఆర్డర్ నువ్వే ఇవ్వు. బేరర్ తో ఏం మాట్లాడ్తున్నాడో ఒక కంట కనిపెట్టు. ఐ నో యువర్ సెలెక్షన్ వుడ్ బి ద బెస్ట్... బట్ ఇన్ కేస్... హోప్ యు గాట్ మై పాయింట్... రోజులసలే బాలేవు కదా ? అంటూ జాగ్రత్తలు చెప్పి, ’ఎంజాయ్ ద ఫస్ట్ డేట్’ అని ఎంకరేజ్ చేసింది. అక్కలో తనకు నచ్చేదదే. క్లాస్ ఉండదు. సలహా చెప్పి, సంరక్షణ నేర్పి, ప్రోత్సహిస్తుంది.
శనివారం పొద్దున్నే, అసలే దబ్బపండు రంగులో ఉండే సౌమ్య, మామిడి పండు రంగు చుడీదార్ వేసుకుని, జుత్తుని చిన్న క్లిప్ పెట్టి వదిలేసి, అట్రాక్టివ్ గా తయారయింది. అమ్మ టిఫిన్ పెట్టేలోపే, బాయ్ అమ్మా ! హావ్ ఎ నైస్ డే..! అంది. కాస్త టిఫెన్ అన్నా చేసి వెళ్ళవే..! అంటూ గుమ్మం దాటేలోపే, పరిగెత్తుకొచ్చి, రెండు ఇడ్లీలు, చకచకా తనకిష్టమైన టొమేటా పల్లీ చట్నీ నంచి పెట్టేసి, రెడీగా తెచ్చిన గ్లాసు నీళ్ళు అందించేసింది అమ్మ. నువ్వున్నావే ? అనుకుంటూ తిన్నది.
హోటల్ హనీమూన్ ముందు ఆటో ఆగింది. బయటే, ఒక మినరల్ వాటర్ బాటిల్ ని కొనుక్కుని, లోపలికొచ్చేసరికి, ఆల్రెడీ టేబుల్ నెం. 21 దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న మహేష్ ని చూసింది. సారీ ఫర్ ద డిలే... అంటూ కూర్చుంది. వావ్. నేనూహించిందానికన్నా వంద రెట్లు సమ్మోహనంగా ఉన్నావ్... అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి, బుగ్గలు ఎరుపెక్కాయి. ఇంతలో, బేరర్ వచ్చి, ఆర్డర్ ప్లీజ్ అన్నాడు. ఆ.... వన్ కర్డ్ రైస్ అంది. ఇంతోటి సంబరానికా డేట్ ? ముందు ఏదైనా వైన్, షాంపేన్ టైప్ డ్రింక్, అని ముద్దుగా విసుకున్నాడు. లేదు, సారీ, బట్ మా అమ్మ వద్దంటున్నా వినకుండా టిఫిన్ పెట్టేసింది. ఐయామ్ ఫీలింగ్ హెవీ... అంది. హు... అట్టర్ ఫ్లాప్ అన్నాడు మహేష్. ఏంటీ ? సౌమ్య అనగానే, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ డంబ్ డేట్ అన్నాడు. డేట్ అనేది మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికేగా ? తిండికేంటి సంబంధం అంది. సరే, నీ గురించి చెప్పు ? అన్నాడు. ఇప్పటి దాకా ఛాట్ లో తెలియనివన్నీ మాట్లాడుకుంటూ డైన్ ముగించారు. మధ్యలో రెండు మూడు సార్లు, బేరర్ తో ఏదో మాట్లాడాడు మహేష్. ఏంటీ అని అడిగితే, ఆ..! నిన్ను కిడ్నాప్ చెయ్యడానికి మాప్ ఏస్తున్నా...! లేకపోతే ఏంటి సమ్..? ఏం లేదు, మీ హోటల్ లో స్పెషల్స్ ఏంటి అని కనుక్కుంటున్నా, సెకండ్ డేట్ కయినా బాగా తినాలిగా ? అన్నాడు. మధ్యలో ఒకసారి బిల్లింగ్ వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. సర్వీస్ బాలేదని కంప్లైంట్ చెయ్యడానికిట. ఇంతలో బిల్ తెచ్చాడు బేరర్. నేను కడతానంటే నేను కడతానని వాదులాడుకున్నాక, రాజీ చెప్పిన టిప్ ని అమలు పరిచి, బిల్ సౌమ్యే కట్టింది. తిన్నదెక్కువ లేదు కాబట్టి, వెయ్యి కి చిల్లర గా, ఒక 500 నోటు, ఒక 100 నోటు, మిగతా చిల్లర ఇచ్చాడు. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటూండగా, అసలే ఈ మధ్య 500 నకిలీ నోట్లెక్కువ వస్తున్నాయిట. ఎందుకయినా మంచిది, ఒకసారి చెక్ చేసుకో... అన్నాడు మహేష్. బ్లాంక్ స్పేస్ లో గాంధీ బొమ్మని చెక్ చెయ్యడానికి దగ్గరగా పెట్టుకున్న సౌమ్యకి తన మొహమ్మీద ఏదో పౌడర్ పడ్డట్టై, దులుపుకునే లోగా, నెమ్మదిగా మగతలోకి జారుకోబోతున్నట్టనిపించి, రెస్క్యూ ఆప్ లో బటన్ ప్రెస్ చేస్తూ మగతలోకి జారుకుంది. వెంటనే మహేష్ కారు డ్రైవర్ కి ఫోన్ చేసి, త్వరగా రమ్మన్నాడు. ఈ లోపు హోటల్ లోని నడి వయసు వ్యక్తి ఒకతను, ఏమైందంటూ ముందుకొచ్చాడు. ఏం లేద్సార్..! ఈ మధ్య జీరో సైజ్ ఫ్యాషన్ అయిపోయిందిగా ? తినమంటే తిన్లా. నీరసమొచ్చి పడిపోయింది. నా మరదలే, పెళ్ళి చేసుకోబోతున్నాం. నేను తీసుకెళ్తాగా...! అన్నాడు. అలా కాదు, ఆంబులెన్స్ ని పిలవండి... అంటూ హడావుడి చెయ్యడంతో, క్యాషియర్ వైపు చూసాడు మహేష్. వీళ్ళు మా రెగ్యులర్ కష్టమరే సార్. మరేం ఫర్లేదు. మీరెళ్ళండి. అన్నాడు. డ్రైవర్ ఎంతకీ రాక, చిరాకేసి, మళ్ళీ కాల్ చేసాడు. ’ఇక్కడెవరో బైకోడు డ్యాషిచ్చి, ఉల్ట మన కాడ పైసలడుగుతున్నడు సర్’ అన్నాడు డ్రైవర్. ఎంతోకొంత ఇచ్చి పంపరా, త్వరగా రా...! ఇక్కడ ఇరుక్కునేట్టున్నా... అన్నాడు. ఈ లోపు, బైక్ మీద వచ్చిన ఇంకో వ్యక్తి, ఏమైంది ? అని అడిగాడు. ఏంటయ్యా ? అమ్మాయి పడిపోతే చాలు, ఓ గుమిగూడేస్తారు. మా క్లాస్ మేట్. ఆకలేస్తోందంటే లంచ్ కి వచ్చాం. ఈ లోపు పడిపోయింది... హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా... చాలా. నీకేమన్నా ప్రాబ్లెమా ? నువ్వు తీసుకెళ్ళు పోనీ..! అన్నాడు వెటకారంగా. ఇందాకటి నడివయస్కుడు, అదేంటి ? నీ కాబోయే భార్యన్నావ్ ? అన్నాడు. మళ్ళీ మధ్యలో దూరాడ్రా...! అనుకుంటుండగా, బైక్ మీద వచ్చిన వ్యక్తి, సరే నేనే తీసుకెళ్తాను... అంటూ సౌమ్యని లేపబోతుంటే, హెల్ప్, నా మరదల్ని ఎత్తుకెళ్తున్నాడు, అన్నాడు మహేష్. అవును, తీసుకెళ్తోంది, మీ మామే... అంటూ బైక్ అక్కడే పార్క్ చేసి, ఆటోలో ఇంటికి తీసుకెళ్ళాడు. దారిలో స్పృహ వచ్చిన సౌమ్య, నాన్న ద్వారా జరిగింది తెలుసుకుని, గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. సారీ డాడ్... ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను. అమ్మతో చెప్పొద్దు. క్లాస్ తో చంపేస్తుంది... అన్నది. సరేలేరా..! కానీ అమ్మ చెప్పేది కూడా నీ మంచికే. కాకపోతే, టీనేజ్ లో ఉన్న అమ్మాయికి మొదటి శత్రువు అమ్మే అని ఎక్కడో చదివాను. మళ్ళీ తను అమ్మయ్యాకే, ఆ ఆదుర్దా తెలుస్తుందిట. బట్ ఇట్ వుడ్ బీ టూ లేట్ బై దెన్. హౌ మీన్ కదా ? అన్నాడు.
ఇద్దరూ కలిసి ఇంటికి రావడంతో, ఖంగారు పడ్డ నిర్మల, బైక్ పంక్చర్ అవడంతో ఆటోలో వస్తుంటే, సందు చివర కనబడ్డ సౌమ్య ని కూడా పిక్ చేసుకున్నానని చేసిన కవరింగ్ కి స్థిమిత పడింది. ఆ రోజంతా, మనసులో రాజీ అక్కకి కొన్ని వేల సార్లు థాంక్స్ చెప్పుకుంది. ఆ రోజు రాత్రి, ఎఫ్ బి లో రాజీ ఆన్లైన్ లో ఉండడంతో, థాంక్యూ సో మచ్. నువ్విచ్చిన ఐడియా వల్లే ఇవాళ నేను గండం గట్టెక్కానంది. నేనా ? యూ ఎస్ వచ్చాక, హ్యాంగ్ అవుట్ అసలు ఓపెన్ చెయ్యలేదురా...! అనేసరికి, ఆశ్చర్యపోవడం సౌమ్య వంతయింది. నెమ్మదిగా, ఒక్కోటి గుర్తు చేసుకుంటుంటే, రాజీ అక్క, తన ఇంట్లో సిస్టంలో, ఒకరోజు మెయిల్ చెక్ చేసుకుంటూ, గూగుల్ కి, సేవ్ పాస్వర్డ్ కొట్టిన విషయం గుర్తొచ్చింది. డాడ్ టైమ్ కి హోటల్ దగ్గరకి ఎలా వచ్చారో, ఎవరు చెప్తే వచ్చారో ? పానిక్ బట్టన్ లో ఫీడ్ చేసిన రాజీ అక్క నంబర్ సిమ్ అమ్మ దగ్గర ఉండడం తెలుసుకుని, సలహాలిచ్చింది స్నేహితురాల్లాంటి అమ్మ అని తెలుసుకుని, ఇన్నాళ్ళూ తననెంత బాధ పెట్టిందీ తెలుసుకుని, పశ్చాత్తాపంతో దిండుని తడిపేసింది. తెల్లారగానే, కిచెన్ లో నిత్యకృత్యాల అష్టావధానం చేస్తున్న అమ్మని వెనకనుండి గట్టిగా కావలించుకుంది, మొట్టమొదటిసారి, వెరీ గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ...!
Comment Using!!

Pages