సూర్య చంద్రుల అభేద్య పర్వం " సంక్రాంతి "
- పిన్నలి గోపీనాథ్
శివ కేశవుల అభేద్యం గురించి చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించి ఉండవచ్చును. కానీ, మన కంటి యెదుటే కానవస్తున్న సూర్య చంద్రుల అభేద్యం గురించి యెవరూ ప్రస్తావించిన దాఖలాలు అంతగా లేవనే చెప్పాలి. చాంద్ర మానాన్ని స్మరిస్తూ సౌరమానం ప్రకారం పూజ చేయడం వొక్క సంక్రాంతిలోనే చూస్తాం. అదెలాగంటే..
యేటా మకర సంక్రాంతి రోజునే మేకు, కొద్దిగా బంగారం, బియ్యం, బెల్లం, నువ్వులు, గుమ్మడి కాయ, తగిన నగదు దక్షిణతో దానం చేసేవారు ...". స్వస్తి శ్రీ చాంద్రమానేన .." అంటూ సంకల్పం చెప్పు కుంటారు. దానం చేసేది మాత్రం సౌర మానం ప్రకారమే కదా. ! అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభగడియను పుస్కరించుకునే కదా ...
మరో విషయం. మన సంప్రదాయ పండుగలు అన్నీచాంద్రమానం ప్రకారమే జరుపుకుంటాము. అవన్నీ తథుల ప్రకారమో, నక్షత్రాల ప్రకారమో నిర్వహిస్తాము. కనుక వాటిలో యే ఒక్కటీ యేటా ఒకే రోజు వస్తుందనుకోలేము. కానీ, తెలుగు పండగే అయి ఉండీ సంప్రదాయ బద్ధంగానే జరుపుకునే సంక్రాంతి మాత్రం యేటా జనవరి 13, 14, 15 తేదీలలోనే వస్తున్నది. ఒక లీపు సంవత్సరంలో మాత్రం 14, 15, 16 తేదీలలో చేస్తాం. దీనికి కారణమూ సౌరమానమే కదా...!
ఇది పంటల పండుగ యని పలువురు వివరిస్తారు. నిజమే కానీ, దీనిని సౌర మానం ప్రకారమే యేల జరుపుకుంటున్నామనేది చర్చనీయాంశం. పంటలకు సూర్యుడి సహకారం అవసరమే. అలాగే అదే సమయాన సమస్త జీవులకూ సూర్య రశ్మి వల్లనే ఆరోగ్యం, ఆయువు లభిస్తున్నాయనేది నిర్వివాదాంశం. మన పూర్వీకులు సూర్య నమస్కారాలు ప్రవేశపెట్టారు. నిష్ఠగా చేసేవారు, చేయించేవారు కనుకనే వారి జీవన ప్రమాణాలు మనకంటే వొకింత యెక్కువగానే ఉంటున్నాయి . కదా ...
భోగి మంటలు నిర్వహణకు కారణం కేవలం చలి పోగొట్టుకోవడానికే కాదు. మనలోని దుర్గుణాలను 'దండ'గుచ్చి ఆ మంటలలో దగ్ధం చేయడానికేనంటారు పెద్దలు. తదుపరి సంక్రమణం. పితృ దేవతలకు తర్పణాదులు విడచి, గుమ్మడి వగైరా దానం చేయడం ద్వారా మనలోని మంచిని పెంపుచేసుకోవడమే ధ్యేయం. ఇక మూడో రోజు కనుమ. ఆరోజు పశువులను పూజిస్తాం. కారణం పంటలకే గాక, మన జీవితంలో వివిధ రకాల పశువులు రకరకాలుగా సాయం చేస్తుంటాయి కనుక అన్నిటినీ గాకపోయినా అందుబాటులో ఉన్న మేరకైనా కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి. కొందరు ఆరోజు గారెలు వంటివి చేసి పెంపుడు జంతువులకు ప్రధానంగా భైరవులకు నివేదిస్తుంటారు కూడా ....
సంప్రదాయాలు పూర్తిగా తెలియకున్నా, తెలిసీ పాటించలేకున్నా పండగనేది అందరం జరుపుకుంటాం గనుక పాఠక మిత్రులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు...
------------------------------ ------------------------------ ------------------------------ ---
No comments:
Post a Comment