వెన్నెల్లో లాంచీ ప్రయాణం -3 - అచ్చంగా తెలుగు
వెన్నెల్లో లాంచీ ప్రయాణం -3
---- వంశీ

(గోదావరి మధ్యనున్న తిప్ప మీద లాంచి లంగరేసి, లాంచి ఓనర్ మూర్తి, చక్రి, పద్మారావు, వంశీ కోయదొర ఇచ్చిన చిగురు తాగుతూ, వెన్నెల్ల రాత్రి గోదావరి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఓ ముప్పావు గంట తర్వాత వంట పనిగానిచ్చిన నల్ల శ్రీనూ, డ్రైవరు కృష్ణా, సరంగు పట్టాభితో పాటు ఇంకా తాతలూ, బుల్లబ్బాయి లాంటోళ్ళంతా వారి చుట్టూ మూగిపోయి మరి ఊసులాడ్డం మొదలెట్టారు.... రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే త్రోవలో దాదాపు ఐదారొందల దాకా లాంచీలు ఉన్నాయి. పనివారు, ప్రయాణికులు, కొండోళ్ళను ఆత్మీయంగా పలకరించేవాళ్ళు లాంచి యజమానులు. డబ్బులు లేకపోయినా  కొండోళ్ళను ఎక్కించుకునే వాళ్ళు...)

బలమైన బంధం మరి
ఒక్కోసారి చాలా పని బడి ఆ కొండోళ్ళు గోదారి రేవులో అన్నం కూడా తినకుండా లాంచీకోసం పడిగాపులు గాస్తుంటారు. అంత ఆకలితో లాంచీ ఎక్కినాల్లు లాంచీలోని వంటోడి దగ్గరకెళ్ళి “ఆకలేస్తంది... ఏదైనా ఉంటే పెట్టు...” అనడిగితే ఆ వంటోడు గబగబా పొయ్యెలిగించి, కాస్త గెంజన్నం కాసి వేడి వేడిగా కొండోడి గొంతులో పోసేటప్పిటికి ఆడి ప్రాణం లేచొస్తది. అప్పుడా కొండోడు నీళ్ళు నిండిన కళ్ళతో ఈ లాంచీలో వంటోడ్ని చూస్తాడు. అందుకేనేమో ఆళ్ళు లాంచీలోళ్ళడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తారు. కొండ చెట్లకు కాసే కాయలు, పళ్ళతో పాటు ఇప్పసారా, తాటి చిగురు, దుప్పి మాంసం ఒకటేంటి ఆళ్ళడగడమే తప్పు కొండలమీద్దోరికే ఎన్నో విలువైన వస్తువులు తెచ్చేసి లాంచీలోళ్ళ కాళ్ళ దగ్గర కుప్పలు కింద పోసేస్తారు.
లాంచీ పనోళ్ళాళ్ళ ప్రాణాలకి తెగించి గిరిజనులని కాపాడిన సంగతులెన్నో. ఓసారి గోదారి తీరాన కొలువై ఉన్న గండి పోసమ్మ తల్లి తీర్ధం జరుగుతుంటే అమ్మోరిని దర్శనంజేసుకోడానికోచ్చినో కుటుంబం మొక్కు చేల్లించుకుని, అక్కడ కోళ్ళు మేకలూ కోసి, వంటలు చేయించి సంతర్పణ జేస్తున్నారు. ఆళ్ళల్లో ఓ తల్లి సంటిపిల్లోడ్ని ఒడ్డునోదిలేసి, కుండామండా కడుక్కుంటుంటే, ఆ చంటోడు పాక్కుంటూ గోదాట్లోకెళ్ళిపోయాడు. గండిపోసమ్మ తీర్దానికి వచ్చేవోల్లని గోదాట్లో ఆ రేవు నుంచి ఈ రేవుకి చేరవేస్తున్న గూటాల మూర్తి, పిల్లోడు మునిగిపోతున్న సంగతి జూసి వెంటనే సరంగు సిమాద్రిని గోదాట్లోకి దూకేయమని అరిచేడు. అంతే ! సిమ్మాద్రి అమాంతంగా గోదాట్లోకి జంప్ జేసి ఆ చంటోణ్ని ఒడిసి పట్టేసుకుని పండుగోప్పలా ఈదుకుంటా ఒడ్డుకు చేరిపోయి ఆ బిడ్డని తల్లి ఒళ్లోకిజేర్చేడు. దీంతో ఆ తల్లి కన్నీరు గోదారి నీరైపోయింది. “ఆ గండిపోసమ్మే నీ రూపంలో వచ్చి నా పేగు బంధాన్ని నిలబెట్టింది...” అంటా కాళ్ళ మీద బడిపోయింది. ఇలాగెన్నో ప్రేణాలు నిలబెట్టారీలాంచీ జనాభా.
దేవీపట్నం అవతలేపున్న సింగన్న పల్లిలో గోదార్తల్లి అనే కొండ మనిషికి సుస్తీ చేసింది. ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని క్షణాలు లెక్కపెడ్తుంటే ఉమా పరమేశ్వరి లాంచీ సింగన్నపల్లి రేవులోకొస్తే, ఆ మనిషి కష్టం మీద లాంచీ ఎక్కింది. చాలా నీరసంగా ఉన్న ఆ మనిషిని పలకరించాడు లాంచీ సరంగు తాతబ్బాయి.
తన పరిస్థితి చెప్పింది.
వంటోడు రాజు, టిక్కెట్లు గొట్టే రామిరెడ్డి కలిసి ఎంతో కష్టపడి ఆళ్ళకిదెల్సిన డాక్టరు నాగాసామి గారి దగ్గరకి తీసుకెళ్ళారు.
అయితే ఆ మనిషికోచ్చింది చాలా పెద్ద జబ్బని, వేలకువేలు ఖర్చవుతాయని చెప్పాడా డాక్టరు. చూస్తే చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆ మనిషినలా వదిలేడానికి మనసోప్పలేదా లాంచీ పనోళ్ళకి. ఓనరూ, కృష్ణమూర్తి స్నేహితుడైన డాక్టరు మాటతో గవర్నమెంటు ఆసుపత్రిలో చేర్చారు. ఆ మనిషికి మంచి వైద్యం చేయించేరు. ఓ మూడ్నేల్లపాటు కంటికి రెప్పలా చూసుకున్నారు. లాంచీలోళ్ళ ఇల్లనుంచే రోజూ ఆమెకి అన్నాలూ అదీ పట్టుకెళ్ళేవోళ్ళు. చివరికి ఆ మనిషి ఆరోగ్యం సక్క బడ్డాక తీసుకొచ్చి సింగన్నపల్లిలో వదిలిపెట్టేరు.
ఇక గోదారికి వరదొచ్చిందంటే లాంచీ వర్కర్లు జేసే సేవలు అన్నీ ఇన్నీ గావు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ జేసినప్పటి నుంచే గోదారి తీరమంతా ఏ చప్పుడూ లేకుండా ఉంటది. లాంచీలన్నీ రెవిన్యూ అధికారుల చేతుల్లోకేల్లిపోతయ్యి. ఇంకాళ్ళ చెప్పు చేతల్లోనే లాంచీ పనోళ్ళంతా. చాలా కష్టపడ్తారు. గోదారి ఒడ్డునుంచే ఆళ్ళే కొండోళ్ళ గూడేలకి అన్నలూ, మందులు పట్టుకేల్తారు. వరదలో ఇరుక్కుపోయినోళ్ళని ఏదో ఒడ్డుకి చేరుస్తారు. సుడులు తిరిగే గోదారి ఒడిలో లాంచీ పనోళ్ళు ప్రాణాలకి తెగించి చాలా కష్టపడ్తారు. ఇలా ఆ లాంచీ పనోళ్ళు జెప్పినవి విని చప్పట్లు కొట్టెం మేమంతా.
నల్లటి విషాదం
“ఇప్పుడు మేం చెప్పినియ్యి పాతికముప్పయ్యేల్ల క్రితం నాటి సంగతులండీ”...
అదిరిపోయి నీళ్ళలోపడ్డాడు చెక్రీ, పద్మారావయితే గోడక్కోట్టిన మేకులాగుండిపోయేడు.
“ఔనండి... కాలం మారిపోయిందండీ... ఈయన గారు ఆళ్ళ పసలపూడి కథల్లో రాసినట్టు తీర్థం నాడు దేవుడి రధాన్ని మహేంద్రా ట్రాక్టర్ లాగుతున్న రోజులండి ఇయ్యి” అన్నాడు మూర్తి.
“నిజంగా ఆ కాలమే సెపరేటండి... ఆ రోజులే వేరండి, అయ్యి మళ్ళీ వస్తయ్యంటారా, వస్తే యెంత బాగుంటదండీ”
“చాల్లేరా చాదస్తం... ఇదిగో యావండీ... మళ్ళీ రమ్మన్నా రావండీ ఆ రోజులు” అన్నాడు కృష్ణ.
“మళ్ళీ జన్మం గానీ వుంటే మా దవిళేశ్వరంలోనే పుట్టి, మా జనార్ధన స్వామి గుడివున్న కొండ మీద కళ తిరిగి మా గోదారితల్లి ఒళ్లో ఈదాలనుందండీ”
“బాగా జెప్పేవురా పట్టాభీ... ఆ రోజులే అసలు రోజులు, ఆ కాలమే అసలు కాలం... అసలు సిసలైన బంగారపు బంగారపు కాలం” అంటా కళ్ళ నీళ్ళేట్టుకున్నాడు బుల్లబ్బాయి.
తాతాలైతే కళ్ళ నీళ్ళేట్టుకోడంగాదు కోరుటూర్నుంచి పోలవరం బయల్దేరుతున్నా బస్సుని జూసి ఏడుస్తుంటే మేమూ అదోలాగయిపోయేం, మా మనసులు కూడా కరిగి జారిపోయినియ్యి. మమ్మల్ని చూళ్ళేని పున్నమి చెంద్రుడు మబ్బుల్లోకెళ్ళి పోతుంటే మా ముఖాల్నిండా విషాదం... నల్లటి విషాదం.
-------------()--------------

No comments:

Post a Comment

Pages