అలా జరిగింది..!!
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
ఎవరో మెసేజ్ పెట్టారు పొద్దుటే..! యావాండోయ్ అప్పుడే లేచారా?.. "ఆ.. ఎప్పుడో లేచిపోయా..!.." ఆన్సర్ ఇచ్చాడు భగవత్ అలా నిద్రమత్తులో ఆన్సర్ ఇచ్చాక... భగవత్ కు , తాను కామేశ్వరి తో లేచిపోయిన రోజు గుర్తొచ్చింది..!!
***********
"కాల్ చేసుకుంటా అని చెప్పానా.." అవతలి నుంచి ఆడగొంతు.. "కాలు జేసుకుంటావా.. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం, పెళ్ళికిముందే కాలితో తంతానంటున్నావ్.. అందుకే మా బామ్మ చెప్పింది "ఆడోళ్ళతో జాగ్రత్తరారేయ్ " అని.. విన్నానా వినలే..! నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నిన్ను ప్రేమించినందుకు... కాదు … కాదు నీతో ఫోజులిచ్చి.. ఫొటోలు దిగినందుకు.. ఆ "" అన్నాడు భగవత్ "కాల్ చేసుకుని ఎంత సేపయ్యింది.. ఫోన్ ఎత్తవే..!" "మళ్లీ ఇదేంటీ..!!" "అదేబాబు.. నాదో భాష .. నీదో ఘోష... పొద్దుటి నుంచి ఎన్ని సార్లు నీకు కాల్ చేయాలి.. ఏంటి ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నావ్.. నేను రెడీ అయ్యి పెట్టె, బేడా సర్ధుకున్నా..! రాత్రి 12 గంటలకు .. మళ్ళీ ఫోన్ చెయ్యను.. వెహికిల్ తో రెడీగా ఉండు.." ఆదేశించినట్లు చెప్పింది అవతలి గొంతు.. "ఒఫ్ఫో .. అదా.. కాల్ చేశావా.. నేను మరోటనుకున్నాన్లే.. ఫోన్ నా దగ్గరలేదు, చార్జింగ్ పెట్టా.. సైలెంట్ లో ఉంది.. సరే.. 12 గంట్లకల్ల మీ ఇంటి బయట వుంటా..! కాస్త , ఆ మీ కుక్క గారికి చెప్పు నా వాసన ఎంత దూరం ఉన్నా గుర్తుపట్టి అరిచి ఛస్తుంది." “ ఆ సరేలే.. త్వరగా తెములు..ఆడోళ్లలా నాంచుతూ కూర్చోక.. అర్ధమైందా..?.. నేను ఒక్క నిముషం కూడా ఆగను.. నువ్వు రాలేదనుకో...!” “అంటే ఏంటే.. నేను రావడం ఆలస్యమైతే.. ఎవడు కనిపిస్తే వాడితో.. ఎగిరిపోతావా..??” “ఒరేయ్ చంపుతా.. అంతదూరం తెచ్చుకోకు.. నాకు మండిందంటే.. నువ్వకున్నదికూడా చేస్తా.. నేననుకున్నదీ చేస్తా..!” “అంటే నన్ను మర్డర్ చేసి కనిపించినోడితో.. !” “దేవుడా. ఫోన్ పెట్టి త్వరగా బి రెడీ..!” “ఇదిగో నేను రెడ్డి కాదు నాయుడు కాదూ..” “నీ తిక్క తగలెట్టా నేను రెడ్డి అనలా రెడీ అన్నాను. ఇప్పుడా జోకులు.. ఉదయం నుంచి ఒహటే టెన్షన్ .. నువ్వేమో ఫోన్ ఎత్తక పోతివి. “ “సరే..!” ఉన్నట్టుండి గుసగుసలాడాడు భగవత్ “ఏమైంది..??” అవతలి గొంతు... “మా అమ్మ.. వచ్చింది.. సరే ఉంటా .. మీ ఇంటి దగ్గర కొచ్చి కాల్ చేస్తా.. ఈ మధ్యలో కాల్ చెయ్యకు ... కుక్కకి మాత్రం చెప్పు..” “ఏంట్రా జాగ్రత్త నువ్ అప్పుడు కాల్ చెయ్యకు కాల్ మా నాన్న అటెండ్ అయితే నిన్ను నిజంగా తుపాకీతో కాల్చేస్తాడు.. అసలే మానాన్న మేజర్ చంద్రకాంత్ అని తెలుసుగా..!” బై బై
************
గజగజ చలిలో ఒణుకుతూ చంద్రకాంత్ ఇంటికి దూరంగా ఉన్న చెట్టు దగ్గర నిల్చున్నాడు. నెత్తికో మంకీ క్యాప్ .. స్వెటర్ దానిపైన జర్కిన్ .. అయినా ఒణుకుతున్నాడు భగవత్. భగవత్ .. కామేశ్వరి ఇంటర్ నుంచి క్లాస్ మేట్స్ ఇద్దరికీ స్నేహం ప్రేమగా మారింది.. చనువు కూడా ఎక్కువే.. మూడేళ్ళుగా సాగుతున్న ప్రేమాయణంలో అనుకోకుండా కామేశ్వరికి పెళ్ళిసంబంధం అనే అల..జడి సృష్టించింది. దీంతో ఇద్దరూ ఝండా ఎత్తేద్దామని ఫిక్స్ అయ్యారు. మరి కాసేపట్లో .. కామేశ్వరి సర్వం వదిలి తనతో రాబోతోందన్న ఊహ తో సంతోషం, భయం సగం సగం కలుగుతున్నాయి భగవత్ కి.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఊహలు, ఊసులు గుర్తొచ్చి భగవత్ పెదాలు విచ్చుకుంటున్నాయి. ఎలా వెళ్లాలి ఎటుకి వెళ్ళాలి? అని ఇంత వరకూ ఆలోచించని భగవత్ కు ఆ ప్రశ్న ఉదయించగానే వెన్నులో ఒణుకు పెరిగింది.. గుండె దడ తనకే స్పష్టంగా వినిపిస్తోంది.. వామ్మో వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అని నెమ్మదిగా బండి తీసి కిక్ కొట్టాడు.. భుజం మీద చెయ్యి పడింది.. సూట్ కేసుతో ఇంట్లోంచి వచ్చిన కామేశ్వరి నేరుగా బండెక్కి కూర్చుంది.. "భలే షార్ప్ రా నువ్వు.. ఇంత ఫాస్ట్ గా బైక్ స్టార్ట్ చేశావ్.. నేనంటే ఎంత ప్రేమరా నీకు.." అన్న కామేశ్వరి మాటలు వింటూ సిగ్గు తో .. తలకొట్టేసినట్లై ఆలోచిస్తూ బైక్ ముందుకు పోనిచ్చాడు భగవత్. "ఎక్కడికెళ్దాం.. ఎక్కడ పెళ్ళిచేసుకుందాం.. నాకు కాస్త భయంగా ఉంది కామూ" అంటూ భయాన్ని గోముగా చెప్పాడు.. " భగవత్ ..ప్లీజ్ బండి ఫాస్ట్ గా నడుపు తర్వాత ఆలోచిద్దాం..అంది ఇద్దరూ ఆలోచిస్తూ ఊరు పొలిమేరదాటారు... చలిగాలి రివ్వున ఇద్దరి చెంపలనూ తాకుతూ వెళ్ళింది.. అప్యాయతతో భగవత్ ను గట్టిగా వెనుక నుంచి కౌగిలించుకుని , ముందుకు ఒంగి బుగ్గ మీద ఓ చిన్న ముద్దు ఇచ్చింది కామేశ్వరి. అంత వరకూ చలి గజ కాస్తా, వేడి పొగలై భగవత్ నరాల్లో సర్రున ప్రాకింది. కొద్దిదూరంలో మసకలో ఎవరో రోడ్డుకు అడ్డంగా వస్తున్నట్టు చూసిన భగవత్ ఫాస్ట్ గా పోనిచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.. ఒకేసారి ముగ్గురు రోడ్డు మీదకు రావటంతో వాళ్ళకు బైక్ తగిలి ప్రమాదం జరుగుతుందని భయపడి బ్రేక్ వేశాడు భగవత్.. ముగ్గురూ దగ్గరికి చేరారు.. చుట్టుముట్టారు.. ఎవరు మీరు మేం పోలీసులం.. ఏవరీ అమ్మాయి?? ఏ కంపెనీ లో తెచ్చావ్.. అంటూ గొడవకు దిగారు.. మీరు పోలీసుల్లా లేరే అంటు భగవత్ ఏదో చెప్ఫేందుకు ప్ర్తయత్నస్తుండగా అందులో ఒకడు కామేశ్వరిని ఎక్కడెక్కడో తాకటం మొదలెట్టాడు. అందులో మరొకడు.. ఎవరికో ఫోన్ చేశాడు.. కత్తి దొరికింది.. కొరుక్కుతిందాం రా..! అంటూ.. ! కామేశ్వరికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. "ఏదైనా చెయ్ అంటూ భగవత్ "చొక్కా పట్టుకు లాగుతోంది.. భగవత్ వాళ్లను బ్రతిమాలుతున్నాడు.. " గురూ మేం లవర్స్ పెళ్ళి చేసుకోవడానికెళ్తున్నాం.. ప్లీజ్ వదిలేయండి.." "ఒరేయ్ ఫ్రెష్ అటరా.. ఐస్ క్రీం లా ఉంది.. చప్పరిస్తేపోలా"వాణ్ణి కట్టేయండ్రా.. వాడెదురుగానే.. పూర్తిచేద్దాం " అని ఒకడు వాగుతుండగా నాలుగవవాడు సర్రున బీరుబాటిల్ తో దిగాడు... "ఎవర్రా వీళ్లూ... పార్టీ ఏవూరిది "అంటూ... "ఒరేయ్ నువ్వు భగవత్ కదా?"... అన్నాడు బండి దిగుతూనే.. "అవును" ..ఎక్కడో ఆశాకిరణం .. భగవత్ కళ్ళలో.. "సురేంద్రగాడి పెద్దనాన్న కొడుకు కదా నువ్వు??" "అవును" "ఎవర్రా ఈ అమ్మాయి..నిజం చెప్పు" "నిజంగా నేనూ తనూ లవర్స్.. యాక్చువల్ గా తనూ నేను పెళ్ళిచేసుకోవడానికి వెళ్తున్నాం.." "ఏం పేరమ్మాయ్ నీపేరు.. ?" మందు ఖంపు కొడుతున్నా.. ఎవడో మంచాడనిపించి.. "అన్నా నా పేరు కా..కామేశ్వరన్నా.. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. ఇంట్లో ఒప్పుకోవట్లేదు అందుకే పెళ్ళిచేసుకోవడానికెళ్తున్నాం'" అంది కామేశ్వరి.. "సరే మీరు వెళ్లండి "అన్నాడు ఆ నాల్గవ శాల్తీ.. "ఒరేయ్ ఈడు మన క్రికెట్ సురేంద్రగాడి తమ్ముడ్రా వదిలేయండి..అంటూ హుకుం జారీ చేశాడు.. బ్రతుకు జీవుడా అంటూ బండిఎక్కి తుర్రు మన్నారిద్దరూ.. కొంత దూరం వెళ్ళా క రోడ్డు ప్రక్కనున్న అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆగి.. ఇద్దరూ నమస్కరించుకుని బయలుదేరారు.. "కామూ వెనక్కి వెళ్ళిపోదామా??" "రేయ్ ఏంట్రా నువ్ మాట్లాడుతోంది.. నేను అందరినీ కాదనుకుని వచ్చేశా.. నేనంటే ప్రేమ లేదా.. ఇన్నాళ్ళూ నటించావా??" "అయ్యో అదికాదు కామూ,.. ఐ నీడ్ యు మచ్.. బట్ లోకం చూశావుగా ఎంత చండాలంగా వుందో అ" అన్నాడు.. "లోకులు పలు కాకులు డోంట్ కేర్.. అన్నది అక్క ఫటాఫట్ గుర్తులేదా.. పోనీ సర్రున..." భగవత్ చలో తిరుపత్ అంది .. గట్టిగా వెనుకనుంచి వాటేసుకుని భద్రంగా ఫీలౌతూ భయాన్ని కప్పిపెట్టి కూర్చుంది కామేశ్వరి.. ఎన్నో ఆలోచనలతో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు భగవత్ . త్రాచు పాము మీద జారుతున్న నీటి బొట్టూలా... చీకటీని చీల్చుకుంటూ తారురోడ్డుపై వెళ్తోంది బైక్.. వెనుక కూర్చున్న కామేశ్వరి ప్రశాంతంగా భగవత్ కి తలానించి నిద్రపోయింది. కొంతదూరం ప్రయాణించాక మొక టీస్టాల్ కనబడుతోంది దూరంగా..! "కొద్దిగా టీ త్రాగకుంటే నిద్ర ముంచుకొచ్చేలా వుంది.. ఆ సినిమావాళ్ళు ఎట్లా నడుపుతారో లేపుకెళ్లేప్పుడు.. అనుకుంటూ నిద్రపోతున్న కామేశ్వరిని కామూ లే టీ త్రాగుదాం "అంటూ టీస్టాల్ దగ్గర ఆపి "టీ రెండివ్వండి" అన్నాడు భగవత్.. "ఇప్పుడె స్టౌ వెలిగించా కొద్దిసేపు పడుతుందయ్యా" అన్నాడు టీ స్టాల్ వాడు. "సరే ఓ గ్లాస్ నీళ్ళివ్వ"మని అడిగి మొఖం కడుక్కున్నాడు.. స్వెటర్ మీద శాలువా కప్పుకుని ఒణుకుతూ టీకొట్టూవాడిబల్ల మీద కూర్చుంది కామేశ్వరి.. అమాయకంగా కనిపిస్తున్న కామేశ్వరిని చూడగానే తనకి ఆమె మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా గుర్తొచ్చ్చింది.. తనంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ చెప్పే ధైర్యం చెయ్యలేదు.. చివరికి ఆమే ప్రపోజ్ చేస్తే మనసు ఎగిరి గంతేసింది.. దగ్గరలోని గులాబీ మొక్క నుండి ఓ రోజ్ తెంపి ఆమెకిచ్చి " I Love you too Kaameswari, I love not only what you were.. But , what I was when I was with you "అంటూ అందించాడు.. కామేశ్వరీ కూడా ఎగిరి గంతేసింది.. "సారూ టీ" అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు . " ఏంటలా చూస్తున్నావ్.. అసలే చలి.. తెరలు తొలగించి చూడటానికి తెరసల్లా కాదు తెలి మంచు.. అర్ధమైందా.. అలా వెర్రి చూపులు చూడకు.. " అంటూ మాటల్లో వయ్యారం ఒలకబోస్తూ.. చలికి ముద్ద ముద్దగా .. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వేడి టీ ఆస్వాదిస్తోంది కామేశ్వరి. టీత్రాగి బయలు దేరారు.. అప్పుడు సమయం తెల్లవారు ఝామున 3.30 అయ్యింది.. అంతలో... "ఆపండి" బండిపై చెయ్యి పడింది.. తలెత్తి చూసేలోగా "సారు రమ్మంటున్నా"రంటూ ఓ కానిస్టేబుల్ సారుని చూపించి కళ్ళెగరేస్తున్నాడు హోంగార్డు. " ఏంకావాలి "అమాయకంగా అడిగాడు భగవత్.. "ఈ అమ్మాయెవరు.. ఏ కంపెనీ నుంచి తెచ్చి వదిలేస్తున్నవ్ చెప్పు మర్యాదగా.. " అన్నాడు హోం గార్డు.. "సార్ మర్యాదగా మాట్లాడండి తను నా ఫ్రెండ్ "అన్నాడు భగవత్. "అవన్నీ స్టేషన్ కెళ్ళి మాట్లాడుకుందాం పద సారు పిలుస్తున్నా"రంటూ బైక్ కీస్ లాక్కున్నాడు హోంగార్డు. తప్పక దిగి కానిస్టేబుల్ దగ్గరకెళ్ళాడు భగవత్.. "సర్ తను నా ఫ్రెండ్.. మేం ఊరెళ్తూ మధ్యలో టీ త్రాగేందుకు ఆగాం.." అన్నాడు "ఎంతమందిని చూళ్ళేదు మేము.. అసలే చలిగా ఉంది..గానీ కొద్ది సేపు నువ్ ప్రక్కన కూర్చో దాన్ని వెంటనే పంపిస్తా..."అన్నాడు కానిస్టేబుల్ . "సర్, మర్యాదగా మాట్లాడండి.. చెబితే అర్ధం కావట్లా.". అనగా నే కానిస్టేబుల్ "ఏందిరా నీకు మర్యాదిచ్చేదీ.. దొ..నా..కొ.. లోపలేసి బొక్కలిరగదీస్తే మర్యాదొస్తుంది కొడకా..! గంజాయ్ కేసుబెట్టి బెయిల్ లేకుండా చేస్తా.. నా..కొ.. "అంటూ పొద్దుటే బూతులందుకున్నాడు కానిస్టేబుల్.. ! అంతలో టీ కొట్టు వాడు కల్పించుకుని, "సారూ వదిలేయండి వాళ్ళెవరో పెద్దింటోళ్లలావున్నారు.. పోనివ్వండి "అన్నాడు.. "ఏందిరా..! నువ్ చెబితేమేం వదిలేయాలా.. నువ్ బ్రోకరా దీనికి "అంటూ మళ్ళా నోటికి పని చెప్పాడు.. కంత్రీ కానిస్టేబుల్ సంగతి తెలిసిన టీకొట్టోడు భగవత్ ని పక్కకు తీసుకెళ్ళి ఓ ఐదొందలు వాడి మొఖాన కొట్టి వెళ్ళి పోండి లేకుంటే వాడు పెద్ద గోల చేస్తా"డంటూ ఐదొందలు భగవత్ దగ్గర నుంచి తీసుకెళ్ళి కానిస్టేబుల్ కిచ్చి వీళ్ళని వెంటనే వెళ్ళండంటూ సైగ చేశాడు. మరలా ఇద్దరూ బైక్ పై బయలుదేరారు.. మౌనం వారిద్దరికీ ఆభరణమైంది. దూసుకుపోతున్న బైక్ శబ్దం లోంచి నిశ్శబ్దాన్ని చేధిస్తూ "అందుకే వెనక్కి వెళ్ళిపోదాం అన్నాను.. నువ్వినలేదు.. చూడు ఇంకాస్త ఉంటే ఎంతదారుణం జరిగేదో.."అని భగవత్ ఏదో చెప్పబోతుంటే.. "ఏదైనా జరగరానిది జరిగితే నన్ను వదిలేస్తావా భగవత్" అంది కామేశ్వరి. సర్రున బైక్ ఆపి వెనక్కి తిరిగి కామేశ్వరి నుదురు పై ఓ ముద్దిచ్చి.. కామేశ్వరి కళ్ళలోంచి జారుతున్న నీరును తుడిచి.." ఊ..హు " అని తలూపాడు.. అందుకే "నువ్వంటే నాకు ప్రేమ..రా..! నీకోసం అందర్నీ వదిలి వచ్చిందందుకే..!" అంది.. అలా ఊసులాడూకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ తిరుపతి చేరారు.. తిరుపతిలో ఒకటే కోలాహలం .. కొండమీదకు వెళ్ళి తిరుమలలో పెళ్ళిచేసుకోవాలనుకున్నారు. బైక్ ని బస్టాండ్ లో పార్కింగ్ చేసి కొండకు వెళ్లేందుకు బస్సెక్కారు... తెల్లారు ఝాము కావడంతో మలుపులు తిరుగుతూ వెళ్తున్న బస్ లోంచి మంచు అందాలను.. లోయల సొగసులను ఆస్వాదిస్తోంది కామేశ్వరి.. బైక్ నడిపి అలసిపోయిన భగవత్ కామేశ్వరి భుజాలపై జారి నిద్రపోతూనే ఉన్నాడు.. మధ్య మధ్యలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని భయంతో, భగవత్ ని గట్టిగా పట్టుకున్న కామేశ్వరి మరలా కాసేపటకి ప్రకృతితో ప్రయాణం చేసింది.. బస్సు తిరుమల చేరగానే ఒకరొకరుగా క్రిందకి దిగుతున్నారు.. నిద్రపోతున్న భగవత్ ని లేపి సూట్ కేసు తీసుకుని క్రిందకి దిగిన కామేశ్వరికి అక్కడి వాతావారణం కొత్తగా తోచింది. "ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడితే..?" అన్న ఆలోచన రాగానే గుండెదడ పెరిగింది.. కొద్దిదూరం బస్టాండ్ నుంచి నడిచాక.. ".. పెళ్ళికి ఎక్కడో కనుక్కుని..రూం తీసుకుని వస్తా ఇక్కడే వుండు అని కళ్ళు నులుముకుంటూ పర్సు సరిచూసుకుంటూ వెళ్ళాడు భగవత్.. " రూం కోసం భగవత్ వెళ్ళగానే భయం వీడని కళ్ళతో ఖంగారుపడూతూ లేపాక్షి ప్రక్కనే ఉన్న ఓ బండపై సూట్ కేసును జాగ్రత్తగా పట్టుకుని కూర్చొని ఉంది. .. వెళ్ళి గంటైనా భగవత్ తిరిగి రాలేదు.. అనుమానం భయం ఒక్కసారిగా పెరుగుతున్నయ్ కామేశ్వరికి.. దారిన వెళ్లే ప్రతి ఒక్కరి కళ్ళు తనేనే పరికించి చూస్తున్నట్లు తెలుస్తోంది.. " రానీ చచ్చినోడు చంపి పాతరేయాలి.. అసలే వీణ్ణి నమ్మి అందర్నీ వదిలి వచ్చాను చూడు.. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలం”టు తనలో తాను తిట్టుకుంటోంది.. ఒకవేళ భగవత్ తిరిగి రాకపోతే..!? అరికాలి క్రింద భూమి తడిబారింది కామేశ్వరికి .. చుట్టూ వెళ్ళే తిరు గుండు ల మధ్య క్రాఫ్ ల కోసం వెతూకుతూనే ఉండి.. నెమ్మదిగా కామేశ్వరి కళ్ళు తడిబారుతున్నాయి.. గుండెలో భయం కంటికి సిగ్నల్స్ ఇచ్చింది.. అంతలో/.... కామేశ్వరి భుజం పై చెయ్యి పడింది.. కెవ్వ్ మని అరచి చూసే సరికి ఈ లేడీ కానిస్టేబుల్ ఆమె ప్రక్కనే కరుకు గా చూస్తూ నిలబడింది. గుండె ఝల్లుమంది కామేశ్వరికి .. నోట్లో కారాకిళ్ళీ నములుతూ భీతి కలిగించింది.. " ఎన్న ఊరు ఉంగల్ ది..?? ఎందెందు వారె.. తెలుంగా.. తమిళా?? పే పేసర్రియా?? పోలీస్ స్టేషన్ పోయిటంగులా వా..'అంది.. పోలీస్ స్టేషన్ అన్న మాట అర్ధం కాగానే.. కళ్ళనీళ్ళు జలజలా కారాయి కామేశ్వరికి.. "ఛీ దీనికి ఇన్ని వేల మంది ఉండగా నేనే కనబడ్డానా..? వాడేమో ఆమెనే పోయాడు.. పీక పిసికి చంపాలి వాణ్ణి.. అసలు ప్రేమ విలువ తెలుసా వాడికి??" అనుకుంటూ ఉంది.. లోలోపల. తాను ఏరాష్ట్రంలో ఉన్నానో అన్న అనుమానం కూడా కలిగింది కామేశ్వరికి . "వా.. పోలీస్ స్టేషన్ పో..వా..! వా.. పోలీస్ స్టేషన్ పోటింగ్లా వా.>! " అంటూ నెట్టుకెళ్ళింది. (కదులు కదులు అంటూ .. పోలీస్ స్టేషన్ కి ) ఇంత బ్రతుకు బ్రతికి ఇలా చిక్కిపోయానేంది రా గోవిందా..! అని దేవుడనే వాడే ఉన్నాడా? అని కాసేపు శ్రీవారినీ తిట్టుకుంది. ఇంత జరుగుతున్నా కామేశ్వరి కి అర్ధం కానిదొకటే.." భగవత్ ఏమైయ్యాడు.. మోసం చేశాడా..?" అలా కామేశ్వరిని కానిస్టేబుల్ లాకెళ్ళిన కొద్దిసేపటికే అక్కడికి పరుగు పరుగున చేరుకున్న భగవత్ కి కామేశ్వరి కనబడకపోవడంతో గుండె గతుక్కుమంది. "ఏమైందింతలో.. ఇక్కడే ఉండమన్నానుకదా.. ఎక్కడికి వెళ్ళింది?? కొంపదీసి వాళ్ళ అమ్మనాన్న ఏమైనా వచ్చుంటారా?? లేక ఎవరైనా ఒంటరి ఆడపిల్లని తీసుకెళ్ళి.... అని మదనపడుతున్న భగవత్ మెదడులో రకరకాల ఆలోచనలు తొలుస్తున్నాయి.. ప్రక్కనే టీ కొట్టువాణ్ణి అడిగాడు " అన్న ఇక్కడ ఒక అమ్మాయి ఉండాల చూశారా" ?అని.. ఎవర్నడిగినా "తెరియాదు" అనే సమాధానం వచ్చింది.. దీంతో కంగారు ఎక్కువైన భగవత్.. " అబ్బ , వద్దే వద్దే పెద్దల్ని ఒప్పించి పెళ్ళిచేసుకుందాం అంటే విన్నదా?? ఊ హూ లేచిపోవాల్సిందే అని పట్టుబట్టింది.. వీళ్ళెమ్మ... లేపుకు పోక పోతే ప్రేమ లేనట్టా ?? చ.. మధ్యలో వెనక్కి వెళ్ళిపోయినా బాగుండేది.. ఇప్పుడు ఒకవేళ తనకి ఏదైనాజరగరానిది జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకేం చెప్పాలి?? “ టెన్షన్ ఎక్కువైంది భగవత్ కి. “ ఓరి భగవంతుడా..! అనుకుంటూ అలా అదే బండ మీద కూలబడ్డాడు.. అంతలో ఒక ముసలమె దగ్గరికి వచ్చి " తంబి ఎన్నడా టవలియా ఉత్తామెరికె" (బిడ్డా ఏంటి దుగులుగాకూర్చున్నవ్??) పొంబల పుల్లె కోసమా" (ఆడపిల్ల కోసమా) " అంద పుల్లెయా పోలీస్ కూటికిది పోయిటాంగె" (ఆమెని పోలీసోళ్ళు తీసుకెళ్ళారు) అని చెప్పింది.. వెంటనే పోలీస్ స్టేషన్ పదం వినపడగానే తలెత్తిన భగవత్ .. ముసలామెకి నమస్కారం పెట్టి పోలీస్ స్టేషన్ ఎక్కడ అని అడిగాడు.. కుడివైపు చూపించింది ఆమె.. సర్రున పరుగులాంటి నడకతో ముందుకురికి వెనక్కొచ్చి “అమ్మ నీ పేరేంటో .. నాకు చాలా సాయం చేశావు..” అని మళ్ళా నమస్కారం పెట్టి పోలీస్ స్టేషన్ వైపు అడుగులేశాడు.. వెనుకనుంచి.. " నాంద ఆండాళ్.." అని లీలగా వినిపించింది.. వెళ్తూ వెళ్తూ వెనక్కు చూసిన భగవత్ కి ఆమె అక్కడ కనబడలేదు. ఆలోచించుకూంటూ ముందుకెళ్ళి అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ లోకి పరుగెట్టి వెళ్ళిన భగవత్ కి ఒక మూలన కూర్చొని కునుకు తీస్తున్న కామేశ్వరి కనబడింది.. కన్నీళ్ళు ఉప్పొంగుతుంటే " కామూ " అని కేకేశాడు.. ఒక్కసారి లేచిన కామేశ్వరి శివంగిలా భగవత్ మీదపడి చెంప ఛెళ్ళుమనిపించింది.. గట్టిగా పట్టుకుని గిచ్చింది.. పెద్దగా ఏడుపందుకుంది.. ఎక్కడికెళ్ళావ్ నన్నొదిలి ..?? "అంటూ గుండెలపై గుద్దింది. ఏడ్చి ఏడ్చిన ఆమె మొఖం ఉబ్బిపోయుంది.. అలా కామేశ్వరిని చూడగానే దుఖం పొంగుకొచ్చింది భగవత్ కి." కామేశ్వరి అరుపులకు అక్కడికొచ్చిన కానిస్టేబుల్ అరవద్దంటూ సైగ చేశాడు అంతలో .. " వీడేనా నిన్ను తెచ్చింది.. ఏరా ఆడపిల్లలంటే అలుసారా మీకు..? అంటూ డిప్పమీదొక్కట్టిచ్చాడు వెనుక నుండి వస్తున్న ఎస్సై.. ఎవర్రా ఆ అమ్మాయి..? చెప్పు .." అంటూనే “వీడ్ని ఆ లోపలి గదిలోకి తీసుకెళ్ళండి” అన్నాడు.. లోపలికెళ్ళాక.. ఒక సైకిల్ ట్యూబ్ తో భగవత్ ని అనుసరించిన ఎస్సై భగవత్ దుమ్ము దులిపేశాడు.. ఆడపిల్లల్ని అన్యాయంగా మోసం చేస్తార్రా?? ప్రతోడికీ ఇదో ఫ్యాషన్ అయ్యిందంటూ రెండు సార్లు లాఠీకి కూడా పనిచెప్పాడు. బయటకూర్చున్న కామేశ్వరికి లోపల ఏం జరుగుతుందో అర్ధం కాలేదు .... బిక్క మొఖం వేసుకుని బిత్తరచూపులు చూస్తున్న కామేశ్వరిని గదిలోంచి బయటికి వచ్చిన ఎస్సై కళ్ళెగరేసి.. టేబిల్ దగ్గరున్న కానిస్టేబుల్ కి ఒక కాగితం ఇచ్చి “ఈ ఫోన్ లైన్ కలిపి అడ్రస్ తీస్కోండి” అన్నాడు.. తాను పొద్దుటి నుంచి అడ్రస్ చెప్పలేదని భగవత్ నుంచి రాబట్టాడు ఎస్సై అని కామేశ్వరికి అర్ధమైంది.. వెంటనే ఒక లేడీ కానిస్టేబుల్ ని పిలిచి "ఆ పిల్లను జాగ్రత్తాగా ఆ అడ్రస్ లో దింపి రసీదు తీసుకో అలాగే వాడి అడ్రస్ కి వెళ్ళి వాళ్ళ వాళ్ళని వచ్చి వీణ్ణి తీసుకెళ్ళమను.. స్టేషన్ ఖర్చులు వగైరా వుంటాయ్ కదా.." అంటూ వెళ్ళిపోయాడు బయటకి..
***************
"ఏమండోయ్ శ్రీవారూ లేవండోయ్ పొద్దెక్కింది" అంటూ వచ్చిన భార్యామణిని దగ్గరకు తీసుకున్నాడు... "కామూ నీవు నామీద ఆటైంలో నమ్మకమెందుకు కోల్పోయావ్.. నాకిప్పటీ డౌటే.. “ అంటూ డిప్ప తడుముకున్నాడు. " ప్లీజ్ ఆ రోజును నాకు గుర్తుచేయోద్దు.. నాకు తల కొట్టేసినట్టౌతుంది.. ఇప్పటికి నాలో నేను ఎన్ని సార్లు సారీ చెప్పుకోని ఉంటానో నాకు తెలుసు" అంది.. బుంగమూతి పెట్టి. "నేనూ సారీ రా.. నిన్నుకూడా నాతో క్యూలోకి తీసుకెళ్ళి ఉండాల్సింది.. తప్పుచేశా.. అందుకే తన్నులు తిన్నా.. అన్నట్టు నీకోవిషయం చెప్పనా.. నిన్ను పోలీసులు పట్టుకెళ్ళారని చెప్పినామ పేరు ఆండాళ్ . తమిళ్ లో అలిమేలు మంగమ్మ ని ఆండాళ్ అని పిలుస్తారుట, వెంకన్న ని పెరుమాళ్ అంటారుట.. ఆండాల్ అన్న పేరు నేను మొదటి సారి విన్నా.. కానీ ఆమె వెనక్కి తిరిగేసరికి మాయమైంది.. కలో లేక వైష్ణవమాయో కదా.." అంటూ నిట్టూర్చాడు.
*************
ఇంతకీ వీళ్ళిద్దారూ భార్యాభర్తలెట్టా అయ్యారనేగా మీ డౌటు..?? కానిస్టేబుల్ తో కలిసి ఇంటికి వెళ్ళిన కామేశ్వరికి తలకొట్టేసినట్లైంది.. తానేదో తప్పుచేశాననే భావన తో తలదించుకుని లోపలికి వెళ్ళి గదిలో బెడ్ పై వాలిపోయింది.. భగవత్ గుర్తొచ్చాడు.. “అయ్యో తానెంత తప్పుచేశానో కదా.. ఆడదానికి అనుమానం పుట్టుకతో వస్తుందేమో.. పాపం ఎస్సై కొట్టిన దెబ్బలకి ఎలా వున్నాడో.. అతను కనబడలేదని తిట్టుకున్నానే గాని.. తాను మాత్రం అతన్ని కనీసం పట్టించుకోకుండా స్వార్ధ బుద్ధితో వచ్చేశానే ,”అని దిగులుపడుతూ నిద్రలోకి జారుకుంది..కామేశ్వరి. అప్పటికే తన టేబుల్ మీదున్న శుభలేఖలు ఆమె చూడలేదు.. ఇళ్ళంతా పెళ్ళి కోలాహలం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.... లేచి అటూ ఇటూ చూస్తున్న కామేశ్వరిని పెళ్ళి శుభలేఖ కంటపడింది.. కంగారుగా శుభలేఖ తీసి చూసిన కామేశ్వరి మొఖం నవుతో విచ్చుకుంది.. తన భగవత్ ను పోలీసుల చెర నుంచి పదివేలు కట్టి విడిపించుకొచ్చారని, కామేశ్వరి తల్లిదండ్రులు పెళ్ళి సంబంధం ఖరారు చేసుకుంది భగవత్ తో అని తెలుసుకుని ఆమె తల్లిదండ్రులను హత్తుకుని ఏడ్చేసింది.. చివరికి తాను కోరుకున్న వరుడినే పెళ్ళాడి కొంగుకు ముడేసుకుంది..
**********
No comments:
Post a Comment