అమ్మంటే!
- ఆదూరి హైమావతి
అమ్మ ఒక మనిషికాదు.
పంచభూతాలపరిష్వంగం,
గాలియై పిల్లలకు శ్వాస నిస్తుంది,
అగ్నియై బిడ్డలకు రక్షణ నిస్తుంది,
ఆకాశమై పిలల్లకు అండగా ఉంటుంది,
నీరై పిల్లల్లో ప్రవహిస్తుంది,
భూమియై పిలల్లకు బువ్వపెడుతుంది..
అమ్మంటే ఒక మనిషికాదు....
పంచభూతాల ఐక్యక.
వ్రేలుపట్టి లోకం చూపుతుంది,
నోరుపెట్టి మాటలు నేర్పుతుంది,
పాదాలపై నడకకు బాట వేస్తుంది.
మనస్సుతో మాయ తొలగిస్తుంది,
నవ్వులతో ‘నాకం’ చూపుతుంది,
ఒడిలో ‘ఊసు ‘ లందిస్తుంది.
గుండెపై వేసుకుని ‘భయం ’ బాపుతుంది,
అమ్మంటే ఒక మనిషి కాదు....
పంచభూతాల మానవాకారం.
రక్తమాంసాలు పంచి ‘జన్మ’ నిస్తుంది,
శ్రమ కోర్చి బిడ్డ శరీరాన్ని పెంచుతుంది,
అమ్మ’ ధర్మాని’ కే సరైన ‘మంచి బాట ‘,
మమతతో మమకారం చూపుతుంది.
సత్యమై బిడ్డలకు ’ స్తన్య ‘ మిస్తుంది,
అమ్మంటే సత్యానికి ‘ప్రతిరూపం ‘.
ప్రేమతో మానవత్వం నేర్పుతుంది..
ఓర్పుతో ’ ఓనమః ‘ లు చెప్తుంది.
అమ్మే ప్రేమ సరస్సు కు మంచినీటి ‘ఊట’
అమ్మంటే అమృతానికి ప్రతీక ,
మానవత్వానికి మచ్చుతునక,
అమ్మే సహనాల, సమ్మోహనాల సమాహారం .
అమ్మంటే ఒకమనిషికాదు,
మమకారాల మూట!
అనురాగాల కోట !
మంచికే ' ఊట '
దానగుణానికి 'నిధి '!
‘ దైవత్వాని ‘ కి ప్రతినిధి.!
అమ్మంటే ఒకమనిషికాదు!
అమ్మంటే 'అమ్మే ' !
**************
కానరానిలోకాలకు వెళ్ళిన కనరాని అమ్మ లందరికీ , ‘ అమ్మస్థానాల్లో ‘ ఉన్న అందరి అమ్మలకూనూ ఆంకితం.
No comments:
Post a Comment