అంతర్యామి - 8
- పెయ్యేటి రంగారావు
(లావా అనే నాస్తికుడు, రామదాసు అనే ఆస్తికుడు స్నేహితులు. రామదాసు ఇంటికి అంతర్యామి అనే ఆంజనేయ భక్తుడు వచ్చి పదిరోజులు ప్రవచనాలు ఇవ్వడం, ప్రజల సమస్యలకి పరిష్కారాలు చూపడం చేస్తాడు. చివరి రోజున అనేక మహిమలు చూపుతాడు. వారి దర్శనం కోసం ఎంతో దూరం నించి వచ్చిన ద్వారక అనే యువతికి కాళికాదేవి పూనుతుంది. అంతర్యామి తనను నిర్లక్ష్యం చేసాడని ఆవేశంగా లావా ద్వారా అంతర్యామిని చంపించబోతుంది. ఇక చదవండి.)
లావా రాక్షసంగా అంతర్యామి మీదకు దూకాడు. అంతర్యామి ప్రాణభయంతో కెవ్వున అరిచి జనంలోకి పరిగెట్టాడు. లావా ఆయన్ని తరమసాగాడు.అంతర్యామి రొప్పుతూ వెళ్ళి రామదాసు కాళ్ళమీద పడ్డాడు.' రామదాసుగారూ! నన్ను రక్షించండి. ఇదంతా మోసం, దగా, కుట్ర.....'లావా అంతర్యామి జుట్టు పట్టుకుని పైకి లేపాడు. ' ఎవరిదిరా మోసం, దొంగసన్యాసీ!' అంతర్యామి వణికిపోతూ అన్నాడు, ' నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ జనాన్ని ఇల్లా మోసం చెయ్యను. నన్ను వదిలెయ్యండి.' జనానికిదేం అర్థం కావటల్లేదు. అర్థం అయిన కొందరు ఆగ్రహంగా అరిచారు, ' వాణ్ణి వదలడానికి వీల్లేదు. ప్రాణం పోయేదాకా వాణ్ణి కుళ్ళబొడిచెయ్యండి.' రామదాసు అయోమయంగా అరిచాడు, ' లావా! ఆగు. అసలేమిటిదంతా?' జనంలోంచి కూడా కొందరు అరిచారు, ' ఔను. మాక్కూడా ఏమీ అర్థం కావటల్లేదు. దయ చేసి విషయమేమిటో వివరంగా చెప్పండి.' లావా గంభీరంగా అన్నాడు, ' అయ్యా, అందరూ దయ చేసి మీ మీ స్థానాల్లో కూర్చోండి. జరిగిందేమిటో మీ అందరికీ వివరంగా అర్థమయ్యేలా చెబుతాం.' లావా అంతర్యామిని ఈడ్చుకుంటూ వేదిక మీదకు లాక్కు వెళ్ళాడు. ' ఇక్కడికి విచ్చేసిన అమాయక ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. ఈ అంతర్యామి మోసగాడని ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి వుంటుంది. ఐతే, వీడి బండారం బయట పెట్టడానికి, ఇదుగో, ఈ మహాత్మురాలు నాకు మనస్ఫూర్తిగా తన సహకారాన్నందించింది.' అంటూ ద్వారకను చూపించాడు. ' వీడు చూపించిన మహిమలన్నీ మేము కూడా మీకందరకూ ఇంతకు ముందే చూపించాం. అవన్నీ మీరంతా గమనించారు. ఈ మహిమలు చూపించడమనేది అతీంద్రియ శక్తుల వల్ల కాదని, కేవలం హస్తలాఘవం వల్లను, కనుకట్టు వల్లను మాత్రమేనని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.' లావా అనుచరులందరూ హర్షోల్లాసంతో చప్పట్లు కొట్టారు. లావా మొహం విజయగర్వంతో వెలిగిపోతోంది. ఇన్నాళ్ళకి తన జీవితధ్యేయం నెరవేరింది. నిజంగా ద్వారక చేసిన సహాయం మరువరానిది. తను కోరగానే తనకు సహకరించడానికి ఒప్పుకుంది. రామదాసు వేదిక మీదకు వెళ్ళి ద్వారకనుద్దేశించి గంభీరంగా అన్నాడు, ' ద్వారకా! అసలు నువ్వెవరివి? ఈ అంతర్యామి మీద కక్ష గట్టి ఇంత దూరం రావల్సిన అవసరం నీకేమొచ్చింది? అంతర్యామి మోసగాడని నువ్వు ఋజువు చెయ్యడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, నీ బరి తెగించిన ప్రవర్తనని నేను మెచ్చుకోలేక పోతున్నాను. అసలు విషయమంతా లావా ద్వారా కాక, నీ ద్వారా వినాలనుకుంటున్నాను. దయ చేసి వివరంగా చెప్పు.' ద్వారక అందరికీ వినయంగా నమస్కరించింది. ' చెబుతాను. రామదాసుగారికే కాదు, మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటాను. నా కథ పూర్తయ్యే వరకు ఈ లావాగారు, ఈ అంతర్యామిగారు ఈ వేదిక మీదే వుండాలని, వీరిని ఇక్కడినించి కదలనివ్వకుండా చూడమని, నన్ను ఆడపడుచుగా భావించే వారెవరైనా వుంటే, వారిని అర్థిస్తున్నాను.' చురుకుగా ఇరవై మంది యువకులు, వారిలో లావా అనుచరులు కూడా వున్నారు, వచ్చి వేదిక చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు. ద్వారక చెప్పసాగింది. ' ఈ అంతర్యామికి ఆంజనేయస్వామి పూనడం ఎంత అబధ్ధమో, నన్ను కాళికాదేవి ఆవహించడం కూడా అంతే అబధ్ధం. ఐతే ఈ అంతర్యామి గుట్టు బయట పెట్టాలన్న కోరికతో నేనూ, లావాగారూ కలిసి ఈ నాటకం ఆడాం. ఐతే దీనికన్నా ముందు మీకు మరొక్క కథ చెప్పాలని వుంది. అది నా కథ......నా వ్యథ! దయచేసి మీరందరూ కదలకుండా, నా కథ పూర్తిగా వినమని ప్రార్థిస్తున్నాను. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతి గొన్న భరతఖండమిది, జగ జగాల చరిత పుటలలో పసిడివన్నె నొంది యున్నది, ఇట త్రివేణి సంగమం - ఘోరాఘ భగ్నకారకం, బహుజాతుల సంగమం - విశాల భావప్రేరకం, ఈ ధరణి పుణ్యచారిణి, క్షమయా ధరిత్రి రూపిణి, ఇచ్చోట జన్మనొందుట, ఇది ఎంతొ పుణ్యఫలమట ' అని కవులు ఉధ్ఘోషించిన పుణ్యభూమిలో నేను పుట్టాను. ఎక్కడైతే నారి పూజింప బడుతుందో, అక్కడ సకల సంపదలు నిలుస్తాయని, కలకంఠి కంట కన్నీరొలికిన, దరిద్రం తాండవిస్తుందని, ఈఅంతర్యామి లాంటి మహానుభావులు సెలవిచ్చిన సుసంపన్న భారతావనిలో నేను జన్మించాను. కాని, నా ఖర్మ కాలి, నాకు జన్మనిచ్చిన నా తలిదండ్రులు సుసంపన్నులు కారు. ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే దరిద్రం! మరి, పెరిగి అందాన్ని సంతరించుకుని యువతిగా ఎదగడం ఘోరనరకం! నన్నెల్లా వదిలించుకోవడమా అని నా పుట్టుకనించే నా తలిదండ్రులకి ఆరాటం. ఆసేతు శీతాచలం వెతికి ఆణిముత్యం లాంటి అల్లుణ్ణి తెచ్చుకున్నారు మా నాన్నగారు. అల్లా తెచ్చుకునే నిమిత్తమై తన సర్వస్వాన్ని పణంగా పెట్టి, చివరికి బికారిగా మిగిలిపోయారు. ఆ తర్వాత నా తలిదండ్రులు యాచకవృత్తినే స్వీకరించారో, ఉపవాసాలతో కృంగి, కృశించి మరణించారో నాకు తెలియదు. కాని, నా జీవితం లోకి ఏలిననాటి శని భర్త రూపంలో ప్రవేశించింది. ఆ తర్వాతి కథ నేను చెప్పక్కర్లేదు. భారతదేశంలో తరచుగా జరుగుతున్నదే. రోజూ మీరు పేపర్లలో చదువుతున్నదే. చదివిన తర్వాత, ' 'ఓస్! ఇంతేనా?' అని మీరంతా పెదవి విరిచి మర్చిపోతున్నదే. మావారికి డబ్బు కావాలి. ఆ డబ్బు, అప్పుడప్పుడు ఆయన అవసరాలు తీరేలా, నేను పుట్టింటి నించి తీసుకురావాలి. అల్లా తేలేక పోతున్నాను కనక, ఆయన పెట్టే చిత్రహింసలన్నీ నేను నోరు మూసుకు భరించాలి. దేనికదే చెప్పుకోవాలి. ఆయన మహా మేధావి. నన్ను చిత్రహింసలు పెట్టడంలో ఆయన రోజుకొక కొత్త పధ్ధతి కనిపెట్టే వారు. ఒకరోజు బ్లేడుతో చర్మం మీద గాట్లు పెట్టి కారం అద్దేవారు. మరొకరోజు సిగరెట్టుతో వాతలు పెట్టి పెట్రోలు చల్లేవారు. ఆయన చిత్రహింసలు రాను రాను పరాకాష్ఠకు చేరుకోవడం మొదలయ్యాయి. ఒకరోజు నేను నీళ్ళు తోడుతుండగా, బలవంతంగా నూతిలోకి తోసేసారు. నేను మరణభయంతో గావుకేకలు పెట్టేసరికి చుట్టుపక్కలవారు వచ్చి రక్షించారు. ఏం జరిగిందని అందరూ అడుగుతుంటే, నా కాపురంలో నిప్పులు పోసుకోవడం ఇష్టం లేక, నీళ్ళు తోడుతుంటే ప్రమాదవశాత్తు నూతిలో పడ్డానని అబధ్ధం చెప్పాను. కాని నన్ను భరించడం ఆయన శక్తికి మించిన పని అని తేలిపోయింది. నేను చచ్చిపోతే, మళ్ళీ బోలెడు కట్నంతో ఆయనకి వేరొక ఆడకూతురు పెళ్ళికానుకగా చేతికందుతుంది. ఏ క్షణాన ఆయన నా ప్రాణం తీస్తారో అన్న భయంతో రాత్రీ, పగలూ నిద్ర లేకుండా కుళ్ళిపోయేదాన్ని. ` ఒకరోజున చుట్టుపక్కల వాళ్ళు ఎగ్జిబిషన్ కి వెళ్ళగా చూసి, కలత నిద్రలో వున్న నా మొహం మీద దిండు పెట్టి గట్టిగా అదిమి, నన్ను హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. పది నిముషాల తీవ్ర ప్రతిఘటన తర్వాత అతి కష్టం మీద ఆయన్ని కిందకి నెట్టేసి, కంగారుగా వీధిన పడ్డాను. కట్టుబట్టలతో ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని సాయం అడగాలి? ఈ పురుషాధిక్య ప్రపంచంలో నాకు జరిగే న్యాయమేముంటుంది? అనాలోచితంగా వెళ్ళి బస్ స్టాండులో నిలుచున్నాను. ఒక పదిహేనేళ్ళ చంటి సన్నాసి నా చుట్టూ తిరుగుతూ ఒకటే ఆరాటపడిపోసాగాడు. అతడిని సైగ చేసి దగ్గిరకి పిలిచాను. లాటరీలో పదిలక్షలు దొరికినంత సంబరంగా పరిగెత్తుకుంటూ నా దగ్గిరకి వచ్చి చేతులు కట్టుకు నుంచున్నాడు. అతగాడికి నా దీనగాధంతా చెప్పి, ' ఈ పరిస్థితుల్లో నన్నేం చెయ్యమంటావు తమ్ముడూ?' అని అడిగాను. తమ్ముడూ అనగానే అతడి అంతరాత్మ మేలుకుంది. అతడిలోని కామవాసనలు దగ్ధమై, మానవత్వం మేలుకుంది. నా కథ వినగానే ఆ పసివాడు వెక్కి వెక్కి ఏడిచేసాడు. ' అక్కా! ఈ ఊళ్ళో దీనజన మహిళాపరిరక్షణ సమితి అని ఒకటుంది. దానికి లక్ష్మీనరసింహ మూర్తి అనే ఆయన ప్రెసిడెంటు. ఆయన యువకుడు. ఆవేశమున్న వ్యక్తి. ఆయన నీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు.' అని చెప్పి నన్ను వారింటికి తీసుకు వెళ్ళి దిగబెట్టాడు. ' నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను తమ్ముడూ!' అన్నాను. అతడు కళ్ళనీళ్లతో ' వస్తానక్కా.' అంటూ వెళ్ళిపోయాడు. అతడు చేసిన మేలు నేను మరిచిపోలేక పోయాను కూడా! ఆ కుర్రాడు మంచివాడైనప్పటికీ, మంచిగానే నాకు సాయం చేసినప్పటికీ, నా దురదృష్టం నన్ను వదిలి పెట్టలేదు. లక్ష్మీనరసింహమూర్తిగారు నన్ను చాలా ఆదరంగా లోనికి తీసుకు వెళ్ళారు. లోపల కరెంటు లేదు. ఎక్కడో ఓ మూల చిన్న కొవ్వొత్తి గుడ్డిగా వెలుగుతోంది. ఎక్కడ ఏ వస్తువుందో కూడా సరిగ్గా కనబడటల్లేదు. ఆ మసకవెలుగులో ఆయన నా కథంతా ఓపిగ్గా విని చాలా బాధ పడ్డారు. ఈ దుర్మార్గానికి ప్రతీకారం తీర్చుకోవలసిందేనన్నారు. నాకు తగిన న్యాయం చేకూర్చేంతవరకు నిద్ర పోనని నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేసారు.' లావాకి ఆమె కథ వింటూంటే హృదయం ద్రవించినట్లుంది. ఇంక వినలేనన్నట్లుగా లేచి వెళ్ళిపోబోయారు. ద్వారక అతడిని బుజం పట్ఘ్టి ఆపింది. ' లావాగారూ! ప్లీజ్, వెళ్ళిపోకండి. నా కథ మీలాంటి సున్నిత హృదయులు విని తట్టుకోలేరని నాకు తెలుసు. కాని నా కథ పూర్తి కాకుండా ఇక్కడినించి ఎవరూ కదలడానికి వీలు లేదు. అంతేనా తమ్ముళ్ళూ?' అంటూ చుట్టూ వలయంలా వున్న యువకుల కేసి తిరిగింది. వారు ఔనన్నట్లుగా తలలూపారు. ద్వారక కొనసాగించింది. ' ఆ విధంగా నరసింహమూర్తిగారు నన్ను ఆ రాత్రి ఆదరించారు. నాకు తగిన న్యాయం చేకూర్చేంత వరకు నిద్ర పోనని ప్రమాణం చేసారు కదా? అందుకని కరెంటు పోయిన ఆ రాత్రి వారు నిద్ర పోలేదు. నన్ను కూడా నిద్ర పోనివ్వలేదు. అది నా జీవితనికి తగిలిన మరొక చావుదెబ్బ! నరసింహమూర్తిగారిని పాదాలంటి బతిమాలాను. నన్ను తన చెల్లెలిగా అభిమానించి, నాకు దారి చూపించమని ప్రార్థించాను. కాని వారికి నా వంటి మీదున్న గాయాల మీదున్న సానుభూతి కన్నా, నా శరీరం మీద వ్యామోహమే ఎక్కువైంది. వారి ఆశయం మహిళలని ఉధ్ధరించడం కాదని, సంఘంలో సుస్థిరమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమేనని, మధ్య మధ్యలో ఆడవాళ్ళని తన కామానికి ఆహుతి చేయడమేనని నాకు తెలియదు. ఆ మహానుభావుడికి ఒక రాత్రికి సరిపడే ఆహారంగా నేను ఉపయోగపడ్డాను. ఇప్పుడు మీ అందరి ముందు గుట్టు బైట పెడుతున్నాను. ఆ సంఘసంస్కర్త, ఆ పరోపకార పరాయణుడు, ఆ మహానుభావుడు ఎవరో కాదు. వెంకట నాగ మల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వర ప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అనబడే ఈ లావాయే! అక్కడి దీన మహిళా పరిరక్షణ సమితి అధ్యక్షుడే నరసాపురం వచ్చి, ఇక్కడ హేతువాద సంఘానికి అధ్యక్షుడుగా మరొక అవతారం ఎత్తాడు. జనంలో కలకలం చెలరేగింది. ఉద్రేకంగా లావా మీదకి లంఘించబోయారు. ద్వారక వినమ్రంగా అందరికీ నమస్కరించింది. ' దయచేసి ఎవరూ ఆవేశపడకండి. నా కథ ఆసాంతం వినండి. అందువల్ల బహుశా మీక్కూడా సంఘంలో ఎదురయ్యే ఇలాంటి పెద్దమనుష్యుల గురించి అవగాహన ఏర్పడవచ్చు.' లావా నిస్సహాయంగా తల వంచుకు కూర్చుండిపోయాడు. ద్వారక తన కథ కొనసాగించింది. ' ఆ రోజు ఈ లావా తన క్షుద్రమైన పాశవిక వాంఛని తీర్చుకుని, సంతృప్తిగా ఆవలించి, నన్ను బైటికి గెంటి తలుపులేసుకుని గాఢంగా నిద్రపోయాడు. నా జీవితం ఎంత నిరర్ధకమైనదో అప్పుడు నాకు తెలిసి వచ్చింది. నా భర్త నన్ను చంపబోతుంటే, పవిత్ర భారతనారిలా వారి చేతుల్లో హాయిగా చచ్చిపోక, పిచ్చిదానిలా ఎందుకిల్లా రోడ్డున పడ్డానా అనే బాధ కూడ కలిగింది. సరే, ఆ చనిపోయేదేదో మరొకరి బలవంతం వల్ల కాక, హాయిగా, స్వేఛ్ఛగా, ఆనందంగా నాకు నేనే చచ్చిపోతే బాగుంటుందనిపించింది.` అప్పటికి తెల్లవారుఝామున మూడు గంటలై వుంటుంది. ఆ ఊరి చెరువులో పడి నాజీవితానికి మంగళం పాడేద్దామనుకున్నాను. కాని అక్కడ నా జీవితం మరొక కళాత్మకమైన మలుపు తిరగబోతోందని నాకేం తెలుసు? చివరిసారిగా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని చెరువులోకి దూకేసాను. నేను చచ్చి బతికేసరికి, పవిత్రతకి మారుపేరా అనిపించేటంతటి ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా కనుక్కున్నాను. ఆ ఆశ్రమాన్ని నడిపే వ్యక్తి ఒక మహానుభావుడు. సదాచారసంపన్నుడు. నిత్యపరోపకార పరాయణుడు. పరమ భాగవతోత్తముడు. ఆయన తెల్లవారుజామున వీధుల్లో తన శిష్యులతో కలిసి భజన చేసుకుంటూ అటు వచ్చి, నేను చెరువులో దూకడం చూసి, తన శిష్యుల ద్వారా నన్ను రక్షించాడు. వారి ఆశ్రమం నిజంగా స్వర్గధామమే. అందులో ఎందరో భక్తులు, భక్తురాండ్రు, అందరూ ఏ కల్లా కపటమూ లేకుండా, అరమరికలు లేకుండా కలిసి మెలిసి తిరుగుతూ వుంటారు. అక్కడ అంతా నియమబధ్ధమైన జీవితం. తెల్లవారుజామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, సామూహికంగా భగవధ్ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత కొద్దిగా పాలు తీసుకోవాలి. ఆ పైన ఎవరికి నిర్దేశించిన విధులను వారు నిర్వర్తించాలి. కొందరికి తోటపని, కొందరికి వంటపని, కొందరికి కుట్టుపని, మరి కొందరికి మరికొన్ని చేతిపనులు - ఇలా విధులన్నీ స్వామివారే నిర్ణయించేవారు. మధ్యాహ్నం భోజనాదికాలైన తర్వాత సత్సంగం, గీతాపారాయణ వుండేవి. రాత్రి కేవలం పళ్ళు, పాలు ఇస్తారు. అందరికీ ఎప్పుడూ ఒకే విధులుండేవి కావు. వీలును బట్టి స్వామివారు ఆశ్రమవిధులను మారుస్తూండేవారు. స్వామివారు అత్యంత దయామయులు. వారు అందర్నీ ' బిడ్డా!' అనే సంబోధించేవారు. వారి పాదసేవ చేస్తే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని సేవించుకున్నట్లేనని ఆశ్రమవాసులందరూ భావిస్తూండేవారు. వారి అనుగ్రహానికి పాత్రులవాలని అందరూ ఉవ్విళ్ళూరేవారు. కాని ఆ శ్రీకృష్ణభగవానునికి కుబ్జ ప్రీతిపాత్రురాలైనట్లు, స్వామివారికి నా మీద ప్రత్యేకమైన పుత్రికావాత్సల్యం ఉన్నట్లు నాకనిపిస్తూండేది. వారి సేవలోనే నా జీవితం గడిచిపోతే చాలనుకునే దాన్ని. అక్కడ నాకు రోజులు చాలా ప్రశాంతంగా గడవసాగాయి. స్వామివారు మెల్లిమెల్లిగా తన అంతరంగిక వ్యవహారాలు చూడడానికి కూడ నన్ను వినియోగించసాగారు. ఒక్కొక్కసారి వారు ఉపదేశించే ధర్మసూక్ష్మాలు వింటూ, రాత్రి పొద్దుపోయేదాకా వారి పాదాలవద్దనే పడివుండేదాన్ని. ఒకరాత్రి అల్లాగ వారి ఉపదేశాలు వింటుండగా, మాగన్నుగా నాకు నిద్ర పట్టేసి, అక్కడే పరుండిపోయాను. అర్థరాత్రి అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది. నా మీద ఎవరో బరువుగా వాలిపోయి వున్నారు. గట్టిగా అరవబోయాను. బలవంతంగా నా నోరు నొక్కి స్వామివారు, ' భయపడకు బిడ్డా1 నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాను.' అంటూనే నన్ను బలవంతంగా ఆక్రమించుకున్నారు. నాపై అత్యాచారం చేస్తున్నదెవరో తెలిసాక, ఆ షాక్ లో నిర్ఘాంతపడి వుండిపోయాను. ఆ స్వామివారు నాకు ఏడు జన్మలవరకు మర్చిపోలేని విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ స్వామివారే ఈ అంతర్యామి! ఆ తర్వాత వారు అక్కడ అవతారం చాలించి, మరెక్కడో వెలిసి, తిరిగి ఇన్నాళ్ళకు ఇక్కడ దర్శనమిచ్చి, నన్ను తరింపజేసారు. వీరి ఫొటో పేపర్లో చూడగానే, వీరిని దర్శించుకోవాలని, వీరి తత్వాలను మీ అందరికీ పాడి వినిపించాలని, అతి గాఢంగా వాంఛించి, ఇక్కడికి వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడే నాకు లావాగారు కూడా కనిపించారు. వీరిద్దరిలో ఒకరు ఆస్తికులు, మరొకరు నాస్తికులు! ఐనప్పటికీ ఇద్దరూ మహానుభావులే! ఇద్దరూ సంఘసంస్కర్తలే! ఇద్దరిదీ ఒక్కటే ధ్యేయం! ఈ సమస్త మానవాళినీ ఉధ్ధరించి పడెయ్యాలి! ఇప్పుడు మీరు చెప్పండి. ఆస్తికవాదం మంచిదో, నాస్తికవాదం మంచిదో మీరే న్యాయనిర్ణయం చెయ్యండి.'
(ముగింపు వచ్చేసంచికలో)
No comments:
Post a Comment