‘ఏమో! గుర్రమెగరావచ్చూ...’ - అచ్చంగా తెలుగు

‘ఏమో! గుర్రమెగరావచ్చూ...’

Share This

‘ఏమో! గుర్రమెగరావచ్చూ...’

- మల్లాది వేంకట గోపాలకృష్ణ


వరహాల్రావుకి లక్కంటే యమా పిచ్చి. ప్రతిదానికీ మీన మేషాలు లెక్కపెడుతూ జ్యోతిష పండితుల్ని సంప్రదిస్తూ ఆచి తూచి అడుగులేస్తూ ఉంటాడు. అడుగు వెయ్యడానికి ముందు ఓసారి అడుగు తియ్యడానికి ముందు ఓసారి న్యూమరాలజీ లెక్కలేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. సెకను సెకనుకీ లెక్కలేసుకునే పిచ్చి ఉందని తెలీక లలిత పొరపాటున వరహాల్రావుని పెళ్లి చేసుకుని చెప్పలేని బాధలు అనుభవిస్తోంది. పుట్టింటికి పంపించమంటే లెక్కలంటాడు. పోనీ తిరిగి తీసుకెళ్లమంటే అదీ లెక్కలంటూ ఒక్కోసారి రెండు నెలలు టైమ్ తీసుకుంటాడు. ఒక్కోసారి లలితకి అనుమానం కూడా వస్తుంది ఒకవేళ వరహాల్రావు పొరుగింటి పుల్లకూరకి ఏమైనా అలవాటుపడ్డాడా అని. కానీ కొద్దికాలంపాటు అతన్ని తరచి చూసిన తర్వాత అలాంటిదేం లేదు పూర్తిగా చాదస్తం అని తేలిపోయింది.
ప్రతిదానికీ లెక్కలేసుకునిమరీ ముందడుగు వేసే వరహాల్రావు ఒక్క గల్ఫ్ శీను బుట్టలో మాత్రం ఇట్టే పడిపోయాడు. రాబోయే రోజుల్లో కాబోయే కోటీశ్వరుడివి నువ్వే అంటూ శీను చెప్పిన మాటలు ఏ నిమిషంలో చెవిలో పడ్డాయో తెలీదుకానీ వరహాల్రావు ఫ్లాటైపోయాడు. నిజం చెప్పాలంటే అది పూర్తిగా శీను టాలెంటే అని చెప్పాలి. గల్ఫ్ లాటరీ అంటే మామూలు విషయం కాదని, లక్ష రూపాయలు మనవి కాదనుకుంటే పదికోట్లు జాక్ పాట్ తగలొచ్చని, గల్ఫ్ సేట్లు ఈ డబ్బులన్నింటినీ ఒంటెల పందేల్లో పెడతారు కాబట్టి అన్ని లాభాలు వస్తాయని గల్ఫ్ శీను వరహాల్రావు చెవిలో తెగ ఊదర కొట్టేశాడు. మామూలుగా అంతంత మాత్రానికి ఎవరి బుట్టలో పడని వరహాల్రావు ఏ మూడ్ లో ఉన్నాడో తెలీదుకానీ గల్ఫ్ శీను మాటలకు ఫుల్లుగా ఫ్లాటైపోయాడు. లక్కు వస్తే గిస్తే ఒకేసారి వస్తుందన్న ఫుల్లు నమ్మకంతో ఒకేసారి గల్ఫ్ శీను మాటల్ని నమ్మి దుబాయ్ లాటరీలో ఏకంగా పది లక్షలు పెట్టుబడి పెట్టేశాడు.
తెల్లారితే జాతకం తేలిపోతుంది. వరహాల్రావుకి నిద్రపట్టడం లేదు. ఎందుకైనా మంచిదని మూటా ముల్లే సర్ది రెడీగా పెట్టుకున్నాడు. తనకి రావాల్సినవాటికంటే తాను ఇవ్వాల్సిన లెక్కలే ఎక్కువున్నాయి కాబట్టి గప్ చుప్ గా మూడో కంటికి తెలీకుండా బిచాణా ఎత్తేసినా అడిగేవాళ్లు లేరని ముందే డిసైడైపోయాడు. కానీ విధి వక్రించింది. లాస్ట్ మినిట్ లో ఏం మాయ జరిగిందో ఏమో తెలీదుగానీ గన్ షాట్ గా వరహాల్రావు తీసుకున్న పది నెంబర్లలో తొమ్మిది నెంబర్లకి లాటరీ తలిగింది. అదికూడా లక్షకి లక్ష వరసన కాదు. లక్షకి పదికోట్ల వ్యవహారం. విషయం తెలిసే సరికి వరహాల్రావుకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వరహాల్రావు పది లక్షలు ఖర్చుపెట్టి ఊళ్లోవాళ్లందరికీ పార్టీ ఇచ్చేశాడు. అడిగినవాళ్లకు అడిగింది అడిగినంత. ముందే హోటేల్ వాళ్లకి ఆర్డర్ వేసి పారేశాడు. మొత్తం పార్టీ ఖర్చు అనుకున్నట్టుగానే దగ్గర దగ్గర ఓ తొమ్మిది లకారాలదాకా తేలింది. అయినా వరహాల్రావు ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
గల్ఫ్ లాటరీ డబ్బులు వరహాల్రావు చేతికొచ్చాయి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్ధం కాలేదు. ఎవడో ఓ అనామకుడు విదర్భదేశం పార్టీకి కోటి రూపాయల విరాళమివ్వమని సలహా చెప్పాడు. వరహాల్రావు తుచ తప్పకుండా ఆ సలహాని పాటించాడు. ముఖ్యమంత్రి గండ్ర సోమి నాయుడికి ఆయన వదాన్యత పిచ్చపిచ్చగా నచ్చింది. వెంటనే మంత్రివర్గంలో చోటిచ్చాడు. టూరిజం శాఖ మంత్రిగా నియమించాడు. అప్పట్నుంచీ అనుకోని అదృష్టం వరహాల్రావుని వరించింది. అదృష్టం దరిద్రం పట్టినట్టు విడిచిపెట్టకుండా డబ్బుల పిల్లల్ని పెట్టింది. ఓ దశలో అసలు వచ్చే డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలీక వరహాల్రావుకి చూచాయగా పిచ్చెక్కినట్టు సమాచారం కూడా. ఏనోట విన్నా వరహల్రావు పేరే, ఏ గల్లీలో చూసినా వరహాల్రావు ముచ్చట్లే, ఏ సందు చివర నలుగురు నిలబడ్డా వరహాల్రావు వ్యవహారాల గురించే కబుర్లు. చివరికి ఆ నోటా ఈ నోటా పాకి వరహాల్రావు ప్రాపకం ఢిల్లీ లెవెల్ కి చేరింది.
ప్రధానమంత్రి వరహాల్రావుకి కేంద్ర క్యాబినెట్ లో సీటిచ్చారు. అసలు గల్లీ లెవెల్ లీడర్ గా కూడా పనికిరాడనుకున్న వరహాల్రావు నేషనల్ లీడర్ గా ఎదగడం వెనకున్న అంతరార్ధం ఏంటో ఎంత తల పగలగొట్టుకున్నా ప్రతిపక్షాలకు అర్ధం కాలేదు. పైగా కలిసొచ్చే కాలం అన్నట్టుగా వరహాల్రావు గురించి ఎవరు ఏం మాట్లాడినా ప్రజల్లో తనకది ప్లస్ పాయింటే అవుతోంది తప్ప మైనస్ కావడం లేదు. నిజానికి అసలు ఇదంతా వరహాల్రావుకి కూడా చాలా విచిత్రంగానే ఉంది. కానీ ఓ విషయం మాత్రం అనుక్షణం తనని ఆవేదనకి గురి చేస్తోంది. అదే.. కుంభకోణం బాబా చెప్పిన విషయం. ఇలా జరుగుతుందని ఆయన చాలా ముందుగానే వరహాల్రావుకి చెప్పారు. ఎవరు ఎంత గింజుకున్నా తనకున్న చింత పిక్కల యోగం వల్ల చింతలేవీ లేకుండానే చివరిదాకా హాయిగా గడిచిపోతుందని చెప్పారు. అన్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్క పొరపాటు.. ఒక్కగానొక్క పొరపాటు గనుక జరిగితే మొత్తం వ్యవహారమంతా తిరగబడుతుంది. ఆ విషయం వరహాల్రావుకి బాగా తెలుసు. అందుకే కోట్ల రూపాయల్ని వదులుకోవడానికైనా సిద్ధపడతాడుగానీ, ఆ ఒక్క వస్తువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు.
ప్రతి పక్షాలకి మతి పోతోంది. సందు చివర చింతపండు వ్యాపారం చేసుకోవడానిక్కూడా పనికిరాని మనిషి సరాసరి నేరుగా ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఎవరికీ అంతు పట్టని విషయం. ఆ స్వామీ, ఈ స్వామీ, చివరికి అర్నబ్ గోస్వామీ కూడా రకరకాలుగా ప్రశ్నలు వేసీ వేసీ విసిగిపోయారు తప్ప అసలు చిట్కా ఏంటో ఎవరికీ అంతుబట్టలేదు. మహర్జాతకం కలిసొచ్చి వరహాల్రావు దాదాపు అంబానీకి సరిసాటిగా ఎదిగిపోయాడు. పట్టుకుంటే మట్టికూడా బంగారమవుతోంది. ఎవరో ఏదో సలహా చెప్పాడని ఈ మధ్యే ఓ ట్రస్టుకూడా ఏర్పాటు చేశాడు. అప్పట్నుంచీ విదేశాలనుంచికూడా ఒకటేమయిన డబ్బుల వరద. ఏం చేసుకోవాలో తెలీక పరుపుకింద నోట్ల కట్టలు పరుచుకునిమరీ పడుకుంటున్నాడు. వరహాల్రావుకి లైఫ్ లో తీరాల్సిన కోరికలన్నీ తీరేశాయి. ఇక చివరికి తాను ప్రయాణం మొదలుపెట్టిన చోటికి చేరుకున్నా దిగులే లేదు.
ఏంటో.. మరీ ఈ డబ్బులున్నోళ్లు ఎట్టా తట్టుకుంటారో ఏంటో.. ఉంటే ఓ గోల లేకపోతే ఓ గోల.. వేసినట్టుంటే ఓ గోల వేసీ వేయనట్టుంటే ఓ గోల.. ఎక్కడొచ్చిన ఖర్మరా బాబూ.. ఎందుకొచ్చిన బాధల్రా బాబూ.. సొంతూరుకెళ్లి ఉన్నంతలో హాయిగా బతక్క.. అని సలహాల్రావు ఈ మధ్య కాలంలో అనుకోని క్షణమే లేదు. అసలు తను ఈ స్థాయికి ఎలా వచ్చాడోకూడా తనకి స్పష్టంగా అర్ధమైపోయింది. రాజకీయాల్లో బినామీ పేరు కావాల్సొచ్చినవాళ్లకల్లా ఓ బకరా కావాల్సొచ్చాడు. రాష్ట్రంలోకెల్లా అత్యంత అమాయకుడ్ని, ఓ పే........ద్ద .... ని వెతికి పట్టకుంటే బాగుంటుందని రాజకీయ నాయకులు అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఏపీలో నెంబర్ వన్ .... వరహాల్రావ్ భలేగా దొరికాడు. అనుకున్నట్టుగానే రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా ప్లాన్ అమలు చేశారు. వరహల్రావు నేరుగా వాళ్లకి స్వామి ఇత్తడి ఆనందలా కనిపించాడు. ఊబిలోకి దిగుతున్నకొద్దీ వరహాల్రావుకి ఊపిరి సలపడం మానేసింది. ఉక్కిరి బిక్కిరై గిలగిలా కొట్టుకున్నాడు. బతికుంటే బలుసాకు తినొచ్చని నేరుగా ఎవరికీ చెప్పకుండా ఊరికి పారిపోయి వచ్చేశాడు.
మర్నాటి ఉదయమే ఆ ఊళ్లో ఓ ఆశ్రమం వెలిసింది. వడ్లగింజ బాబా గ్రామానికి వేంచేశారంటూ ప్రచారం మొదలయ్యింది. వరహాల్రావు చుట్టూ జనం మూగసాగారు. ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల ఊళ్ల జనం విపరీతంగా వచ్చేశారు. వరహాల్రావు ఉరఫ్ విన్నింగ్ బాబాకి తనకి తెలియకుండానే డిమాండ్ పెరిగిపోయింది. చక్కటి పల్లెటూరు వాతావరణం, చుట్టుపక్కల అంతా తెలిసినవాళ్లే, కానీ ఎవరితోనూ మాట్లాడ్డానికే వీల్లేదు. ఎందుకంటే తారాస్థాయి బందోబస్తు. వరహాల్రావుకి పిచ్చెక్కిపోయింది. సంచీలో భద్రంగా దాచిపెట్టుకున్న గుర్రపు నాడాని తీసి బైటికి విసిరేశాడు. కమలాపురం సుబ్బయ్యకి అది దొరికింది. తీసి సంచీలో పెట్టుకున్నాడు. వరహాల్రావుకి పట్టిన దివ్య యోగం మరు క్షణం నుంచే తనకీ పట్టింది. ఉన్నట్టుండి వరహాల్రావు బాబా సమాధిలోకి వెళ్లిపోయారు. రెండో రోజే కాలం చేశారు. మూడోరోజుకి ఖననం పూర్తయ్యింది. నాలుగో రోజునుంచి ఆయన సమాధినుంచి దివ్య కాంతులు వెలికి వచ్చాయి. ఐదో రోజున వరహాల్రావు బాబా సమాధినుంచే సుబ్బయ్యని తన వారసుడిగా ప్రకటించాడు. ఆరో రోజునుంచి వరహాల్రావు వాయిస్ వినిపించడం మానేసింది. ఎందుకంటే తను రాష్ట్రం విడిచిపెట్టి పెళ్లాం పిల్లల్తో కలిసి ఎవరికీ తెలీకుండా పారిపోయాడు కాబట్టి.
ఇంతకీ ఇంతటి యోగం వరహాల్రావుకి ఎలా పట్టిందంటారు. తను పూర్వాశ్రమంలో మలక్ పేట రేసుకోర్సులో గుర్రాల్ని తోమే ఉద్యోగం చేసేవాడు. పేరు పొందిన ట్రైనర్ దగ్గర నమ్మకంగా ఉండేవాడు. ఓ రోజున ఓ కోయదొర రోడ్డుమీద కలిసి ఓ వెయ్యి రూపాయలిస్తే నల్లగుర్రం నాడా ఇస్తానని చెప్పాడు. నల్లగుర్రం నాడా జేబులో పెట్టుకుంటే కోటీశ్వరుడివై పోతావ్, అదృష్టం వరిస్తుంది అని చెప్పాడు. ఆ.. ఈమాత్రం దానికి నీకు వెయ్యి రూపాయలు ఎందుకివ్వాలి, మా సేట్ దొడ్లో నల్లగుర్రాలు నాలుగున్నాయి. వాటిల్లో ఏదో ఒకదాని నాడాని జేబులో పెట్టుకుంటాను అని వరహాల్రావ్ ఎగతాళి చేశాడు. ఓహో అలాగా అయితే నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి విడిచిపెట్టకుండా ఏడిపించుకు తింటుంది అని కోయదొర ఓ శాపం పెట్టాడు. ఆ లైట్ అనుకున్న వరహాల్రావుకి ఇప్పటికి కోయదొర శాపం గుర్తొచ్చింది.
హాయిగా సందుచివరికెళ్లి పొగ పీల్చుకోవడానికి లేదు. నాలుగు చుక్కలు నచ్చిన మందు గొంతులో పోసుకోవడానికి నరకయాతన పడాల్సొస్తోంది. ఇష్టమైన దమ్ బిర్యానీ ఎట్టా మట్టి కొట్టుకుపోయిందోకూడా తెలియడం లేదు. ఇరవై నాలుగ్గంటరూ నాలుగు కూరముక్కలూ, ఐదు దోస చెక్కులూగా ఉంది తిండీ తిప్పల వ్యవహారం. సాయంత్రం వేళ ఎవరూ చూడకుండా నాలుగు ముక్కలు లాగించేద్దామంటే ట్రాన్సపరెన్సీ పేరుతో రాజకీయనాయకులంతా కలిసి ఆశ్రమంలో లైవ్ కెమెరాలు పెట్టి చచ్చారాయే. ఆఖరికి బాత్రూమ్ లో కూడా కెమెరా ఉంది.. దొంగ తిండి తిండానిని వీల్లేకుండా.. చేసేదేం లేదు.. నోరుమూసుకుని ఎండిన కూర ముక్కలు తినడం తప్ప. ఆ రోజే ఆ కోయదొర చెప్పినట్టు ఓ వెయ్యి రూపాయలు వాడి మొహాన కొట్టుంటే ఎంత బాగుండేది. కావాల్సినంత డబ్బు వచ్చేది. ఇప్పుడేమో వాడి శాపం మండిపోయినట్టుగానే ఉంది. వద్దంటే డబ్బొచ్చిపడి ఊపిరి సలపకుండా చేస్తోంది. దీనికి ఒక్కటే మార్గం. బాబా తనువు చాలించి దివ్య సమాధిని పొందడం.. అంతే.. అనుకున్నాడు వరహాల్రావ్ అలియాస్ వడ్లగింజ బాబా.
అనుకున్నదే తడవుగా ఓ వరహాల్రావుకి ఓ మంచి ఐడియా వచ్చింది. ఓ  మంచిరోజున ఆ పని చేసేసి, అటువైపుగా తవ్వించుకున్న సొరంగం దారినుంచి బైటికొచ్చేసి, గెడ్డాలూ మీసాలూ పూర్తిగా తీసేసి కామ్ గా తనుకూడా భక్తుల్లో భక్తుడిగా కలిసిపోయాడు. అప్పటికిగానీ పాపం తనకి మోక్షం రానేలేదు. అదేదో కథలో గుర్రం ఎగిరిందంటే ఏంటో అనుకున్నాడు. నిజంగానే గుర్రాలు ఎగురుతాయన్న విషయం ఇప్పుడు అనుభవానికి వస్తేనేగానీ తెలియరాలేదు. భక్తులు పూనకాలు తెచ్చుకుని పారవశ్యంతో ఊగిపోతున్నారు. భక్తుల్లో భక్తుడిగా తన సమాధి దగ్గరరికే చేరుకున్న వరహాల్రావు మాత్రం వడ్లగింజ బాబాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని చచ్చినా మళ్లీ ఈ చుట్టు పక్కల కనిపించే ప్రశ్నేలేదని వాగ్దానం చేసేసి చిటికెలో మాయమయ్యాడు.

No comments:

Post a Comment

Pages