అచ్చంగా తెలుగు హాస్యవైదుష్యం - జంధ్యాల
- పరవస్తు నాగసాయి సూరి ( చాణక్య )
" నవ్వడం యోగం... నవ్వించడం భోగం... నవ్వలేకపోవడం రోగం..." అని నవ్వుకు ఆయన నవ్య నిర్వచనాన్ని చెప్పారు. ఆరోగ్యకరమైన, ఆహ్లాదభరితమైన హాస్యసృష్టికి ఆయన పెత్తందారు. తెలుగు వాకిళ్ల ముందు హాస్య తోరణాలు కట్టి, తెలుగు వారిని నిండుగా, మెండుగా నవ్వించిన హాస్యబ్రహ్మ ఆయన. హాస్యకులాని దళపతిగా, హాస్యదళానికి కులపతిగా నవ్వులు పువ్వులు పూయించిన ఆయనే హాస్యబ్రహ్మ జంధ్యాల. హాస్యమంటే జంధ్యాలకు మక్కువ. ఎందుకంటే 1951 జనవరి 14న జంధ్యాల పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నవ్వుతూనే పుట్టారట. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీరవెంకట దుర్గా శివసుబ్రహ్మణ్య శాస్త్రి. చదువుకునే రోజుల్లోనే నటుడిగా, నాటక రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. జీవనజ్యోతి, ఏక్ దిన్ కా సుల్తాన్, బహుకృత వేషం, డాక్టర్ సదాశివం, మండోదరి మహిళా మండలి, గుండెలు మార్చబడును వంటి నాటికల్ని రాసి జంధ్యాల రచయితగా తన సత్తా చాటుకున్నారు. రచనల్లో హాస్యానికి పెద్దపీట వేసి ఆకట్టుకున్నారు. 1974లో జంధ్యాల సంధ్యారాగం నాటకాన్ని చూసిన ప్రఖ్యాతదర్శకులు బిఎన్ రెడ్డి... పుణ్యభూమి కళ్లు తెరువు చిత్రం కోసం స్క్రిప్టు పనిని జంధ్యాలకు అప్పగించారు. బిఎన్ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆ చిత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయింది. అనంతరం విశ్వనాధ్ సిరిసిరి మువ్వ ద్వారా మాటల రచయితగా పరిచయమయ్యారు. అక్కణ్నుంచి జంధ్యాల జీవితం కొత్త మలుపులు తిరిగింది. తెలుగు చలనచిత్ర సీమలో అగ్ర దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమాలకు జంధ్యాల పని చేశారు. కె. విశ్వనాధ్, జంధ్యాల కాంబినేషన్ ఎన్నో దృశ్యకావ్యాలకు ఊపిరి పోసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ శంకరాభరణంతో పాటు సప్తపది... జంధ్యాల రచనా వైదుష్యానికి తార్కాణాలు. కె. రాఘవేంద్ర రావు, జంధ్యాల జోడి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల రూపకల్పనకు కారణమైంది. అడవిరాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాల్ని జనరంజకంగా తీర్చిదిద్దడంలో జంధ్యాల కీలక భూమిక వహించారు. అడవి రాముడులో నాగభూషణం నోట జీవితసత్యాల్ని అలవోకగా పలికించినా, వేటగాడు చిత్రంలో రావుగోపాలరావు నోట అంత్యప్రాసల్ని అలవోకగా కదం తొక్కించినా జంధ్యాలకే చెల్లింది. ఈ సినిమాతో ప్రాసల పాదుషాగా తన రచనా చమత్కారాన్ని వెల్లడించారు. కేవలం మాటల రచయితగా సరిపెట్టుకోకుండా, దర్శకత్వం వైపు జంధ్యాల దృష్టి మళ్లించాడు. ముద్ద మందారం చిత్రం ద్వారా దర్శకునిగా తన విజయయాత్రను ఆరంభించారు. తన ప్రతిభకు రెండు వైపులా పదును ఉందని నిరూపించుకుని, దర్శక రచయితగా తన విశిష్టతని చాటుకున్నారు. ఎవర్ గ్రీన్ ప్రేమకథని తనదైన శైలిలో తెరకెక్కించి... ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలు పొందారు. ఆయన దర్శకత్వం హాస్యచిత్రాల రాజనాల్ని పండించి ప్రేక్షకుల హాస్యదాహాన్ని తీర్చారు జంధ్యాల.ఆయన నిర్మించిన ఒక్కో చిత్రం... ఒక్కో విధంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యరసంలో ఎన్ని కోణాలున్నాయో... అన్నింటినీ ఆయన ఆవిష్కరించారు. ఉషాకిరణ్ మూవీస్, జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ... ఎవర్ గ్రీన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పాత్రల చిత్రణ దగ్గర నుంచి, డైలాగులు, హావభావాలు తదుపరి హాస్య చిత్రాలకు దిక్సూచిగా నిలిచాయి. కామెడీ చిత్రాలన్నింటికి వినూత్న ఒరవడిని, ఉరవడిని సృష్టించిన ఈ సినిమా... ప్రేక్షకుల్ని నవ్వుల జడివానలో ముంచెత్తుతుంది. సీరియస్ పాత్రల్లో నటించే నటుల్ని సైతం హాస్య పాత్రల్లో చూపించిన జంధ్యాల... కొత్త ఒరవడికి రూపకర్తగా నిలిచారు. ఓ పక్క హాస్య చిత్రాల్ని సృష్టిస్తూనే... మరో పక్క సామాజిక అంశాల్ని తెరపై ఆవిష్కరించి సవ్యసాచిగా కీర్తినందుకున్నారు. ఇదే కోవలో ఆయన నిర్మించిన ఆనంద భైరవి... ఉత్తమ దర్శకునిగా నంది అవార్డుతో పాటు, దర్శకత్వానికే జాతీయ అవార్డు సాధఇంచిపెట్టింది. ఇక పడమటి సంధ్యారాగం చిత్రం... ఉత్తమ కథా రచయితగా, ఆపద్బాంధవుడు.. ఉత్తమ మాటల రచయితగా అవార్డు సంపాదించి పెట్టాయి. జంధ్యాల సృష్టించే హాస్యం పదహారణాల తెలుగు పడుచులా మురిపిస్తుంది. ఆయన వండిన హాస్య వంటకంలో మసాలా మచ్చుకైన కనిపించదు. తాజా కూరగాయలతో వండి వేడివేడిగా అరిటాకులో వడ్డించినట్టు ఉంటుంది. కాస్త ఇంగువ పోపు తగిలించినట్టుగా ఘుమఘుమలాడుతుంది. పాత్ర చిత్రణలో జంధ్యాల శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్కో పాత్రను ఒక్కో విధంగా మలిచి తనదైన ప్రత్యేకతను సృష్టించారీ హాస్యబ్రహ్మ. తన మాటల్లో కేవలం హాస్యాన్నే కాదు... కన్నీళ్లను ఒలికించడం జంధ్యాలకు పెన్నుతో పెట్టిన విద్య. శంకరాభరణంలో హాస్యనటుడు అల్లురామలింగయ్య చేత కన్నీళ్లు పెట్టించే విధంగా శంకరాశాస్త్రిని తిట్టించినా, శ్రీవారికి ప్రేమలేఖలో ఆడపిల్ల తండ్రి అసహనాన్ని ఆవిష్కరించినా.... అది జంధ్యాల బాణి. జంధ్యాల ఆశిస్సులతో సత్యాగ్రహం చిత్రం ద్వారా సినీక్షేత్రంలో మొలకెత్తిన బీజం ఈ నాడు హాస్యవటవృక్షమై... ప్రేక్షకులకు సేద తీరుస్తోంది. ఆయనే బ్రహ్మానందం. ఆయనలో ఎంతటి నటన దాగుందో.. దాన్ని పూర్తి స్థాయిలో తెరపై ఆవిష్కరించి మెప్పించడంలో జంధ్యాల ఘనాపాఠి. తిండియావతో పెళ్లి చూపులు చెడగొట్టుకున్న యువకుడిగా, ఇంటి యజమాని చేతిల్లో కష్టాలు పడే మధ్యతరగతి కుటుంబీకుడిగా... బాబాయ్ హోటల్లో యజమానిగా పనివాడిపై తిట్లను కురిపించినా... ఆ పాత్ర పేరు జంధ్యాల మార్కు బ్రహ్మానందం. బ్రహ్మానందాన్నే కాదు శ్రీలక్ష్మిని సైతం అదే విధంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులకు నవ్వుల నజరానా అందించారు. భర్తకు మస్కా కొట్టి సినిమాకు చెక్కేసే పతివ్రతగా... కవితలు, వంటకాలతో కన్నీళ్లు పెట్టించే కవయిత్రిగా.... బాబుచిట్టీ అంటూ ఏడుపుతో నవ్వించే తల్లిగా... శ్రీలక్ష్మిని ఆయన వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం. నరేష్, ప్రదీప్, సుత్తివీరభద్రరావు, సుత్తివేలు, పూర్ణిమ లాంటి ఎందరో నటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత జంధ్యాలదే. రావుగోపాల రావు, నూతన్ ప్రసాద్, కోటశ్రీనివాసరావు లాంటి అచ్చ తెలుగు సినీ దుష్ట దుర్మార్గుల చేత హాస్యాన్ని పండింప జేసిన ఘనత జంధ్యాలదే. ఆయన సినిమాల్లో పాత్రలకు మాటలు అవసరం లేదు... కేవలం హావభావాలతోనే ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించడంలో జంధ్యాల ఘనాపాఠి. నవ్వుల చిత్రాలు, హాస్యపాత్రలు, కామెడీ సన్నివేశాలు సృష్టించడంలో జంధ్యాలకు సాటిలేరు. భావాల సీమలో విహరించి, భావాన్ని భాషతో మేళవించి, హాస్యాద్భుతాన్ని ఆయన కాగితం మీద ఆవిష్కరించేవారు. ఆ సన్నివేశాల్ని తెరకెక్కించి ప్రేక్షకులకు గిలిగింతలు పెడతారు. తిట్లదండకం అనే పేరు వినడమే గాని, తెలియని ప్రేక్షకులకి వెండితెరపై దాన్ని సైతం ఆవిష్కరించి మెప్పించారు. ఏయన్నార్, చిరంజీవి, నరేష్, రాజేంద్ర ప్రసాద్, అలీ... ఇలా అన్న స్థాయిల నటులతో జంధ్యాల కలిసి పని చేశారు. ఎన్నో పాత్రలకి అక్షరాలు దిద్దించారు. డబ్బింగ్ కళాకారునిగా ఎన్నో పాత్రలకు గాత్రదానం చేసి, తన కళావైదుష్యాన్ని నిరూపించుకున్నారు. నటునిగా సైతం నటించి మెప్పించారు. ఆపద్బాంధవుడు చిత్రంలో కవిపాత్రలో నటించి తన ప్రజ్ఞను ప్రదర్శించారు. ఆ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా అవార్డునే గాక నటునిగా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరణానంత జీవితం అనే ఒక విషయాన్ని తీసుకుంటే... మరణించిన తర్వాత కూడా జీవించి ఉండే వ్యక్తి జంధ్యాల. జంధ్యాల గారికి వర్థంతులుండవు. ఆరోగ్యకరమైన హాస్యం బతికున్నంత కాలం ఆయన బతికే ఉంటారు. జంధ్యా మారుతంలా హాస్యచందన లేపనాన్ని పూసి, ప్రేక్షకుల మనోసీమల్ని రంజిపంజేశారు. నవ్వులు విరిసినన్నాళ్లు ఆయన అజరామరుడు.
No comments:
Post a Comment