ఇలా ఎందరున్నారు ?
- అంగులూరి అంజనీదేవి
anguluri.anjanidevi.novelist@gmail.com
www.angulurianjanidevi.com
ఎవరినైనా గొప్పగా ప్రేమించగలిగితే ఆప్రేమ మనిషిలోని అణువణువును ప్రకాశింపజేస్తుంది. ప్రతి కణాన్ని మాధుర్యంతో నింపుతుంది. మనసుని సన్నగా తట్టి పలకరిస్తుంది. కానీ ప్రేమంటే అర్ధం తెలియనివాళ్ళకి ఆ ప్రేమ వెళ్ళి అడుగు దూరంలో నిలబడుతుంది. కష్టాల్లో కూడా దగ్గిరకి రాదు. పొరపాట్లను క్షమించదు. శ్రేయస్సును కోరదు. అసలు తనంటూ ఒకటి వుందన్న సంగతి కూడా గుర్తు చెయ్యదు. ఆఫ్ట్రాల్ నువ్వెంత నా దృష్టిలో అన్నట్లు చాలా నిర్లిప్తంగా చూస్తుంది. నిర్జీవం చేస్తుంది. చివరికి జీవితం ఏమిటి? అన్నప్రశ్న తలెత్తేలా చేస్తుంది. నన్ను ఎవరు యిలా శపించారు? అన్న ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. అంతేకాదు..."ఇది నీకు తప్పనిసరిగా కావాలి. నేనిస్తాను తీసుకో!"అని తీసికొచ్చి ఎవరూ దోసిట్లో వెయ్యరు. అలా వేసినా దాని విలువ తెలియనప్పుడు అది దోసిట్లో ఎంతోసేపు వుండదు. అందుకే ఎవరికి ఏంకావాలో ఏం వద్దో వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకోవాలి. వాళ్ళకి వాళ్ళే ఎంచుకోవాలి. కావాలనుకున్నదాన్ని కష్టపడి సాధించుకోవాలి. దేన్ని సాధించుకోవాలన్నా ప్రపంచాన్నే మరచి అదే ప్రయత్నంలో ఉండాలి. ఏ సమస్యా లేని జీవితం వుంటుందా? జీవితం అంటేనే ఒక సమస్య నుండి ఒక సమస్యకు ప్రయాణం. అదొక పెద్ద అన్వేషణ! ఆ అన్వేషణ లేకుండా జీవితాన్ని ఎంతమంది దాటెయ్యగలరు? ఆ రోజు కాలేజి క్లాస్ రూంలో రెండవ వరుస బెంచీలో కూర్చునివున్న హిందూ తన స్నేహితురాలు సంకేతతో.... "ఇవాళ నెట్ కి వెళ్దామనుకుంటున్నాను. నువ్వొస్తావా?" అని అడిగింది. సంకేత ఏ ఆలోచనలో వుందో ఏమో మౌనంగా వుంది. హిందూ అదేం గమనించకుండా టేబుల్ పైన ఉన్న పుస్తకాన్ని కాలేజి బ్యాగ్ లో పెట్టుకుంటూ "ఇప్పుడు కాలేజినుండి హాస్టల్ కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయి వెళ్తాను. నువ్వు వస్తానంటే దారిలో నిన్ను పిక్ అప్ చేసుకుంటాను. ఓకేనా?"అంది. సంకేత మాట్లాడకుండా హిందూవైపు తిరిగి అనాసక్తంగా చూసింది.. హిందూ ఆ చూపుల్ని గ్రహించి.... "ఏం! రావా?" అంది హిందూ.. "రాను. బోర్!"అంది సంకేత. హిందూ ఆశ్చర్యపోతూ "నెట్ కెళ్ళటం బోరా! ప్రపంచంలో ఏది కావాలన్నా అందులో కనిపిస్తుంది కదే! బోరేంటి? చిన్నపిల్లలు కూడా సాయంత్రం వేళలో నెట్ కి వెళ్తుంటారు...” అంది. "వెళ్ళనీ! నాకేం?"అంది సంకేత. హిందూ సంకేతవైపు సూటిగా చూస్తూ "నిజం చెప్పు సంకేతా! నీకు నీ ప్రపంచాన్ని విశాలం చేసుకోవాలని, తక్కువ సమయంలో జ్ఞానాన్ని పెంచుకోవాలని లేదా! నెట్ వల్ల కొత్త కొత్త ఆలోచనలు, టెక్నిక్స్, లాజికల్ స్కిల్స్ పెరుగుతాయని నువ్వేగా అన్నావ్! కొత్త ప్రాజెక్ట్ ని హ్యండిల్ చేయాలన్న ఆలోచనలు కూడా వస్తాయన్నావ్! టెక్నాలజి స్కిల్స్ ని వంటబట్టించుకోవచ్చు అని కూడా అన్నావ్!"అంది. “అన్నాను. అంతేకాదు. అత్యధిక సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించుకోవచ్చు. ఆ సేకరణలో భాగంగా పరిశోధనలు కూడా చెయ్యచ్చు. ఏదైనా గాలివార్త, తప్పుడు సమాచారం కనిపిస్తే ఇంకా ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తితో దానికే బానిస కావచ్చు. అయితే ఏంటట ? ఎవరు ఏది కావాలనుకుంటారో అది అవుతూనే ఉంటారు. అందరూ అలాగే అవ్వాలని లేదుగా... !” అంది సంకేత. సంకేత వైపు అదోలా చూసి, “దేనికైనా ఇది ఉండాలి. అదే లేనప్పుడు...” అంటూ నుదుటి మీద అటునుండి ఇటుకి గీతగీసినట్లు వేలితో తిప్పి చూపించింది హిందు. సంకేత ఏ మాత్రం చలించలేదు. “ఇంతకీ నువ్వు వస్తావా ?రావా? “ అండి హిందూ. “రానని చెప్పానుగా !” “సరే ! నువ్వెందుకు రానంటున్నావో నాకు అర్ధమైంది. నువ్వుండేది శ్రీహర్ష వాళ్ళ ఇంట్లోనేగా ! అతని లాప్టాప్ వాడుకుంటున్నావేమో! అదేదో ముందే చెప్పచ్చుగా ! మీ ఇద్దరూ ఇంత దగ్గరగా ఎప్పుడయ్యారే ?” అంది హిందు. శ్రీహర్ష శివరామకృష్ణ గారి అబ్బాయి. వెంటనే సంకేత కనుబొమ్మలు ముడిపడ్డాయి. హిందూ వైపు కోపంగా చూసింది... “శ్రీహర్ష వాళ్ళ ఇంట్లో అంత బిల్డ్అప్ ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావో నాకు అర్ధం కావట్లేదు. ఒకప్పుడు అతని తల్లిదండ్రులు చదువు చెడిపోతుందని అతన్ని టీవీ కూడా చూడనిచ్చేవాళ్ళు కాదట ! మా నాన్న చెప్పాడు. అలాంటిది లాప్టాప్ కొనిస్తారా ? ఏ ఇంట్లో అయినా కంప్యూటర్, ఇంటర్నెట్ ఉండటం ఒక హోదాలా భావిస్తారు. కాని శ్రీహర్ష వాళ్ళు అలా కాదు. మరీ చాదస్తం. ‘ఇమెయిల్ , చాటింగ్ ‘ అంటూ కంటికి కనిపించని వ్యక్తులతో సంభాషించడం, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలని నమ్మటం అవివేకం అనుకుంటారు. ఆన్లైన్ ఫ్రెండ్స్ ని లైన్లోకి తెచ్చుకోవడం కన్నా బంధుమిత్రుల పరిచయాలు పెంచుకోవడం మంచిదనుకుంటారు. పోనీ ఆడినా చేస్తారో లేదో నాకు తెలీదు.” అంది సంకేత. సంకేత మాటల్ని శ్రధ్ధగా విన్నది హిందూ. శ్రీహర్ష తల్లిదండ్రుల అభిప్రాయంలో కూడా తప్పు లేదు. వాళ్ళకి శ్రీహర్ష ఒక్కడే కొడుకు...అతను ఎక్కువసేపు నెట్ ముందు గడిపితే ఎవరితో కలవలేక నిరాశ, నిస్పృహలకి లోనవుతాడని భయం కావచ్చు...కానీ ఇంటెర్ నెట్ అనేది 'గుప్పిట్లో బంధించిన శక్తి... ఆ శక్తిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. లేకుంటే గంటలు గంటలు నెట్ సెర్చింగ్ చేస్తూ మానిటర్ ముందే సెటిల్ అయిపోతే సమస్యలు వస్తాయ్...'ఏం నేర్చుకోవాలి?ఎంత నేర్చుకున్నాం?'అని సిస్టం ని ఉపయోగించటానికి ముందు తర్వాత ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోవాలి. శ్రీహర్షకి లాప్టాప్ లేదన్న విషయం తనకి తెలియదు. తెలిసుంటే అలా అడిగేది కాదు. "శ్రీహర్షకు నీ అభిప్రాయం చెప్పవే సంకేతా!"అంది హిందూ.. ఎన్నోరోజులుగా అడగాలనుకున్న ప్రశ్న అది. "తలిదండ్రులు ఎలా చెపితే అలా వింటాడు. చెప్పకపోయినా ఏం చెబుతారో ముందే ఊహించి మౌల్డ్ అవుతాడు. సొంత అభిప్రాయాలు వున్నాయో లేవో తెలియదు ,కానీ ఎక్కడికక్కడ అడ్జస్ట్ మాత్రం అవుతాడు. నాకు తెలిసి సినిమాలకి వెళ్ళడు. బేకరీలకు వెళ్ళడు. స్నేహితులతో ఎంజాయ్ చెయ్యడు. అమ్మయిలతో పొరపాటున కూడా మట్లాడడు. ఇప్పుడున్న కల్చర్ లో యింత ముసలి గెటప్ అవసరమా! ఎప్పుడు చేస్తాడే ఎంజాయ్! పళ్ళూడి, బట్టతల వచ్చాకనా!"అంది సంకేత. "శ్రీహర్ష మన సీనియర్! మన సీనియర్స్ లో శ్రీహర్షలాంటివాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళంతా ముసలిగెటప్ లో వున్నట్లా! నాకెందుకో నీ అభిప్రాయం తప్పనిపిస్తోంది..."అంది హిందూ. "తప్పొ,ఒప్పో నాకు తెలియదు హిందూ! నాకెందుకో ఆ యింట్లో వుండాలనిపించటం లేదు. ఆ యింటి వాతావరణం నాకు బొత్తిగా నచ్చటం లేదు.....నాకు మీతోపాటు కలిసి హాస్టల్లో వుండాలనిపిస్తోంది "అంది సంకేత. "హాస్టల్లో వుంటే నువ్వు చెడుస్నేహాలు చేస్తావని మీ నాన్నగారి భయం...అదీ గాక ఆయన వ్యవసాయదారుడు కాబట్టి నెలనెలా హాస్టల్ ఫీజు కట్టలేనంటున్నారు. ఆయన్ని కూడా అర్ధం చేసుకొవాలి కదా! ఆయనకొచ్చే ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా! నిజానికి నన్నడిగితే శ్రీహర్ష నాన్నగారు మీ నాన్నగారి మాట కాదనలేకనే నిన్ను వాళ్ళ ఇంట్లో వుంచుకున్నారు...దీన్ని బట్టి వాళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులో మనకు అర్ధమైపోతోంది. అందుకే అంటారు 'స్నేహాన్ని పంచుకుంటూ పెంచుకున్ననాడే జీవితానికి ఒక అర్ధం' అని" అంది హిందూ. "అది కరక్టే! మా నాన్నగారి ఆర్ధికపరిస్థితి బాగలేకనే ఆయన శివరామకృష్ణ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంచారు. నిజంగానే ఆయన మానాన్నగారికి మంచి స్నేహితుడు. నేను దాన్ని కాదనను. కానీ మానాన్న ఆయన ఆర్ధికపరిస్థితి చూసుకోకుండా నన్నెందుకు కనాలి...?" అంది సంకేత. వెంటనే హిందూ " ఛ ... ఛ ..కన్నతండ్రి గురించి అలా ఆలోచిస్తారా ఎవరైనా ?" అంది మందలింపుగా. "మా నాన్నను విమర్శించడం లేదు. నన్ను కని అనవసరంగా బరువు పెంచుకున్నారు ఆయన. నాకది కష్టంగా వుంది."అంది సంకేత. "అంతకష్టం ఏమొచ్చిందిప్పుడు"అంది హిందూ. కాలేజీ టైం అయిపోవడంతో విద్యార్ధులంతా క్లాసుల్లోంచి బయటికి నడుస్తున్నారు. "మానాన్న కష్టం నా కష్టం కాదా? నా కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నేను అర్ధం చేసుకోగలను..."అంటూ లేచి కాలేజీ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. సంకేతతో పాటూ హిందూ, పల్లవి కూడా తమ కాలేజీ బ్యాగులు భుజానికి తగిలించుకొని బయటకు నడిచారు.. శివాని కూడా అదేకారిడార్లోవున్న చివరిగదిలోంచి బయటకొచ్చింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి సంకేత వాళ్ళను చేరుకుంది. శివాని బ్రాంచ్ మెకానికల్. సంకేత, పల్లవి, హిందూ, సేం బ్రాంచ్ అంటే కంప్యుటర్ సైన్స్ థిర్డ్ ఇయర్. శివాని కూడా థర్డ్ ఇయరే! అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లాగే ఆ కాలేజీలో కూడా స్టూడెంట్స్ కి కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి.అత్యంత అధునాతనమైన విద్యాబోధనతోపాటు, ఆడుకోవడానికి పెద్దగ్రౌండ్, తినటానికి క్యాంటీన్ ప్రాక్టికల్స్ కోసం మంచి ల్యాబ్స్ వున్నాయి. చదివితే ఇంజనీరింగే చదవాలి ఇంకేం వద్దు... అన్నట్టుగా ఇంజనీరింగులో చేరి,క్లాసులోకి అడుగు పెట్టాక కొందరు విద్యార్ధులకు చదువుపట్ల ముందున్న అంకితభావం వుందా? లేదా?అన్నది వాళ్ళ ఆలోచనా విధానం పై ఆధారపడి వుంటుంది. శివాని ఎందుకో రోజులాగా లేకుండా చాలా నీరసంగా కనిపిస్తోంది. శివాని కాలేజీలో తప్ప బయట ఎప్పుడైనా తలను,ముఖాన్ని స్కార్ఫ్ తో కవర్ చేసుకుని, చెవిలో బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతూ కనిపిస్తుంది. ఎవరివైపూ కూడా పలకరింపుగా చూడదు,నవ్వదు. తనలోతనే గిలిగింతలు పెట్టినట్లు నవ్వుతుంది. వెంటనే సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కళ్ళని చక్రాల్లా తిప్పుతూ చాలా హుషారుగా మాట్లాడుతుంది. కూర్చున్నా అదేపని. నిలబడినా అదేపని, నడుస్తున్నా అదే పని....అవతలవైపు నుండి ఫోన్ లో ఏవరు మాట్లాడుతున్నరన్నది మిస్టరీ. అడిగితే చెప్పదు. గట్టిగా అడిగితే 'మా అయనతో...' అంటుంది. ఆశ్చర్యపోయి 'పెండ్లి చేసుకోబోతున్నావా?'అంటే.... "యా!"అంటుంది. ఏది అడిగినా "యా!"అనడంతప్ప ఇంకేం మాట్లాడదు. కుదురుగా ఒకచోట నిలబడదు. ఒక పక్షిపిల్ల రెక్కలు కదిలించి నేలమీదనే అటు ఇటు ఎగిరినట్టు గమ్మత్తు గమ్మత్తుగా తిరుగుతుంది. పొరపాటున కూడా సెల్వార్ కమీజును వెయ్యదు. జీన్స్ డ్రెస్స్ లోనే వుంటుంది. కాలేజీలో వున్నంతసేపు మాత్రమే ఫార్మల్ డ్రెస్స్ లో వుంటుంది. కానీ ఈరోజు ఎందుకో శివాని ముఖం విచారంగా వుంది. "ఇదేమైనా సమస్యలో ఇరుక్కుందా? ఇరుక్కుంటే అదెలాంటిది? ఎలాంటి సమస్య వచ్చినా భయపడాల్సిన పని లేకుండా ఈ మధ్యన ఆ కాలేజీ విద్యార్ధులు ఓ చక్కటి వాతావరణాన్ని సృష్టించుకున్నారు. సీనియర్స్,జూనియర్స్ అన్న తేడాల్లేకుండా, భయాలు లేకుండా,చాలా స్నేహ పూర్వకంగా మెలుగుతున్నరు. ఏ సందేహం వచ్చినా టక్కున వెళ్ళి ఒకరితో ఒకరు చెప్పుకునేటంత చనువుగా వుంటున్నారు. అదీగాక తమ కాలేజీలో చదివేందుకు వచ్చిన వాళ్ళు గ్రామీణ ప్ర్రాంతం నుండి వచ్చినవాళ్ళు కావటంతో వాళ్ళకి ఇంటర్నెట్ అంటే ఏమిటో తెలియదు కాబట్టి.... 'అరె! టెన్షన్ ఎందుకు? నేనున్నాను కదా'అంటూ నెట్ గురించి వివరంగా చెపుతున్నారు సీనియర్లు. అబ్బాయిలు కానీ,అమ్మాయిలు కానీ... అంతేకాదు ఇంజనీరింగ్ కాలేజీలలో పోటీల్లో ఎలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించాలి, పేపర్ ప్రజంటేషన్ ఎలా ఇవ్వాలి, లోపాలను ఎలా అధిగమించాలి, ఎలా నడుచుకోవాలి అన్నది ఖాళీ సమయంలో ముందుగానే వివరించేలా ఓ ప్రణాళిక వేసుకుని భయాన్ని పోగొడ్తున్నారు. విద్యాపరంగా కాలేజీ పరంగా అడ్డంకులు, పోటీపరంగా వెనుకబాటు, ఇలా సమస్య ఏదైనా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకబృందంగా ఏర్పడ్డారు విద్యార్ధులు. సీనియర్ బృందం నుండి యిద్దరు,జూనియర్ బృందం నుండి యిద్దరు కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. విద్యార్ధుల నుంచి వచ్చిన అన్ని సమస్యల్ని నేరుగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరకు తీసుకెళ్ళి చర్చిస్తారు. ....మరి దీని సమస్య ఏమిటో అని ఆలోచిస్తూ శివానివైపు చూసి "ఎందుకే అలా వున్నవ్? ఫేసేంటి అలా అయింది?" అనడిగింది హిందూ. మాట్లాడలేదు శివాని.... పల్లవి, హిందూవైపు చూస్తూ "నువ్వు తప్పుకో!అది నీకు చెప్పదు."అంటూ హిందూ రెక్క పట్టుకుని పక్కకిలాగి శివాని వైపుకి చేరింది..."చెప్పు శివా! ఎందుకంత విచారంగా వున్నావ్?సపొజ్ ఏదైనా బాధ వుంటే దాని ఎంజాయ్ చెయ్యలి కానీ ఫేస్ పైకి తెచ్చుకోకూడదని నీకు తెలియందేముంది చెప్పు. మంచివాళ్ళకే కదా కష్టాలు వస్తాయి...కన్నీరు, కోపం, ఆనందం, విషాదం అన్నీ మనిషికి తప్పవు. అనుభవించాల్సిందే! ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓ గాయమే అయిందనుకో దాన్ని కాలం మాన్పదా! దానికింతగా వర్రీ అవ్వాలా? ఏది కావాలో,ఏది వద్దో స్పష్టం గా తెలిసినా కూడా ఒక్కోసారి సవాళ్ళూ ఎదురవుతాయి...జీవితం అంటేనే ఆశ్చర్యం,అద్భుతం కదా! దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోకపోతే ఎలా! అంది చాలా ప్రశాంతంగా. ఆ మాటలు వినగానే శివానికి చిర్రెత్తుకొచ్చి అటు ఇటు చూస్తూ తన చూపుల్ని ఓ పెద్ద రాయిపై నిలిపింది. పల్లవికి శివాని చూపులు ఎక్కడ నిలిచాయో అర్ధమై కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ "వామ్మో! ఇది నన్ను రాయితో కొట్టి చంపేసేలా వుందే! నువ్వు ఇటు రావే సంకేతా! ఏదైనా తేడా వస్తే నువ్వయితేనే కాస్త గట్టిగా సాక్ష్యం చెబుతావు....లేకుంటే ఎంతోకాలం బ్రతకాలనుకుంటున్న నేను దీని చేతిలో ఇప్పుడే పొయ్యేలా వున్నాను."అంటూ సంకేతను లాగి అటువైపుకి వెళ్ళింది పల్లవి. అసలే లావుగా వున్న పల్లవి ఎవర్ని లాగినా అంత దూరాన వెళ్ళి ఆగుతారు. సంకేత పరిస్థితి కూదా ఇప్పుడు అలాగే అయ్యింది. సంకేత పల్లవి వైపు ఉక్రోషంగా చూస్తూ"మరి నువ్వు సమయం సందర్భం గురించి ఆలోచించకుండా నీ కొటేషన్స్ తో దాన్ని కొడితే అది వూరుకుంటుందా? ప్రస్తుతం వున్న పరిస్థితిని బట్టి నీ విషయం లో అది చెయ్యలనుకునేదే కరెక్ట్!" అంది. పల్లవి ముఖం మాడ్చుకుని రోషం గా అటువైపుకు తిరిగి చూస్తూ నడవటం ప్రారంభించింది. హిందూ అది చూసి"దారి సరిగ్గా చూసి నడువు. అసలే ఉదయం నుండి రెండుసార్లు కింద పడ్డావు. పడితే పడ్డావు..నీ బరువుకి ఎక్కడ పగిలేది అర్ధం కాక చస్తున్నాం...." అంది. స్నేహితురాళ్ళు కాబట్టి తన ఒబెసిటీ మీద ఎలా మాట్లాడినా ఏమీ అనుకోదు పల్లవి. అదే ఇంకెవరైనా అలా మాట్లాడితే కొట్టి మరీ వస్తుంది. పల్లవికి ఏదో గుర్తొచ్చినట్లు సంబరంగా చూస్తూ,"ఇవాళ మా డాడీ నాకు సెకెండ్ హ్యాండ్ స్కూటీ కొని తెసున్నాడు. ఈ పాటికి హాస్టల్ దగ్గిరకి తెచ్చేవుంటాడు. ఇకనుండి నాకు కాలేజీ నుండి రోడ్డు వరకు నడిచే బాధ వుండదు. ఆటో కోసం వెయిట్ చేసే అవసరమూ వుండదు."అంది. "ఆ సందర్భంగా పార్టీ ఇవ్వలి మరి...." అంది హిందూ. "పార్టీ గోల తర్వాత, దాని సంగతేంటో చూడు" అంటూ హిందూ భుజం మీద గిల్లి శివానిని గుర్తు చేసింది పల్లవి. "మనకెందుకు, అది చెబితేనే విందాం! లేకుంటే లేదు."అంది అనాసక్తిగా హిందూ.. వెంటనే శివాని తలతిప్పి హిందూ ని చూస్తూ"ఫ్రెండ్స్ అంటే ఇలానే వుంటారానే? చెప్పేదాకా ఆగరా? నా మొబైల్ ని మన పి.టి.సార్ తీసుకుని రెండు గంటలవుతోంది. నేను మాట్లాడాల్సిన ఫొన్ కాల్స్, చెయ్యవల్సిన మెస్సేజెస్ అన్నీ ఆగిపోయాయి. ప్రాణం తేలిపోతోంది తెలుసా!"అంది. "ఓస్! ఇంతేనా! ఇదేనా నీ బాధ?అయినా మొబైల్స్ నాట్ అలౌడ్ అంటూ కాలేజీ ఎంట్రన్స్ లోనే బ్యాగ్ లు చెక్ చేస్తున్నారు కదే! ఇంత సీరియస్ కండిషన్ లో మొబైల్ ఎలా తీసుకెళ్ళావ్! తీసుకెళ్ళేముందు ఏదైనా సీక్రెట్ ప్లేస్ లో పెట్టుకోవద్దా!"అంది. ఎక్కడని పెట్టుకోనే..అబ్బయిలైతే షూస్ లో పెట్టుకుంటారు. మనమెక్కడ పెట్టుకుంటాం? కాలేజీ బ్యాగ్ లో,టిఫిన్ బాక్స్ లో తప్ప...."అంది నీరసంగా.... "ఇవ్వాళ మాక్లాస్ రూం లో చెకింగ్ జరగలేదు. అవునూ! నీ మొబైల్ ఒక్కటేనా! మీ క్లాస్ బాయిస్ వి కూడా తీసుకున్నారా?"అని అడిగింది సంకేత. "మా క్లాసులో ఎవరెవరు మొబైల్ తెచ్చుకున్నారో వాళ్ళవి మాత్రమే తీసుకెళ్ళారు. నా మొబైల్ దొరకడానికి కారణం అది స్విచ్ ఆన్ లో వుంది." "అయితే నో ప్రోబ్లం. బయటికి వచ్చి ఈపాటికే ఆ సార్ ని సీక్రెట్ గా తిట్టుకోవడమో,రిక్వెస్ట్ చెయ్యడమో చేసి వుంటారు. నువ్వెంత బాధ పడ్డా ఈ రోజు మాత్రం నీ సెల్ల్ ఫొన్ నీకు రాదు. రేపు తప్పకుండా ఫైన్ వేసో ,వార్నింగ్ ఇచ్చో ఇస్తారు. మాక్లాస్ లో కూడా ఒకసారి ఇలాగే తీసుకున్నారు. క్లాస్ రూం లో కూర్చుని క్లాస్ వినకుండా బెంచీ చాటున మొబైల్ పెట్టూకుని మెసేజ్ లు ఇస్తున్నారని"అంది పల్లవి. "అయితే రేపటివరకు నీ సెల్ ఫోన్ ఇవ్వవా ప్లీజ్!"అంది శివాని. పల్లవి దడుసుకున్నట్లు చూసి బ్యాగ్ లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని వున్న తన మొబైల్ ని తడుముకుంటూ, "అందులో బ్యాలెన్స్ లేదు"అంది. "నాకు బ్యాలెన్స్ తో పని లేదు.రింగ్ ఇస్తే చాలు. అవతలివైపు నుండి నాకు కాల్ వస్తుంది. నేను మాట్లాడుతాను. నీకు అందులోంచి ఒక్క పైసా కూడా మిస్ కాదు."అంది హామీ ఇస్తూ. పల్లవి భయంగా ముఖం పెట్టి"అలాంటి రింగ్ లతో యమ డేంజర్ తెలుసా! వాడికి నీమాటలతో బోరెత్తిందనుకో! నావెంట పడతాడు. నేను ఇవ్వను."అంది. శివాని పల్లవిని కొట్టబోతూ"నా బాయ్ ఫ్రెండ్ నీకు వాడానే! ఇదేనా నువ్విచ్చే రెస్పెక్ట్ ?"అంది. "ఏదో తొందర్లో అనేశాన్లే! నా సెల్ల్ ఫోన్ మాత్రం ఈ రాత్రికి అడక్కు..అలా అని మాటివ్వు. లేకుంటే నేను హాస్టల్ కి రాకుండా సంకేతతో వెళ్ళి దాని పక్కన పడుకుంటాను."అంటూ బెదిరించింది. శివాని నవ్వి"దాని పక్కన యింకొకరికి ప్లేస్ కూడానా!నువ్వెళ్ళి పడుకుంటే శివరామకృష్ణ గారి పనమ్మాయి నీలిమ ఎక్కడ పడుకుంటుంది?" "నీలిమ పడుకునేది సంకేత బెడ్ మీద కాదు. కింద చాప వేసుకుని పడుకుంటుంది. నేను వెళ్ళి సంకేత బెడ్ మీద పడుకుంటాను."అంది పల్లవి. శివాని మళ్ళీ నవ్వి "వాళ్ళకుండేది ఒక్కతే పనమ్మాయి. నువ్ నిద్దట్లో దానిమీద పడ్డావనుకో ...అది పైలోకాలకెళ్ళిపోతుంది. ఆ ప్రయత్నం మానుకుని నాకు సెల్లివ్వు. నీకేంకాదు.” అంది. "ఇదెక్కడి ఖర్మే హిందూ.."అంది బేలగా చూస్తూ పల్లవి. "నీకేం కాదంటుందిగా! ఇవ్వు" అంది సంకేత శివాని వైపు మాట్లాడుతూ.. "అయ్యేది, కానిదీ దాని చేతిలో వుందా? నీ చేతిలో వుందా? నా నెంబర్ వెళ్ళి వాడి సెల్ ఫోన్ లో ఫీడయ్యిందనుకో ..ఆటొమటిక్ గా నా జుట్టు వాడి చేతిలోకి పోయినట్లే!"అంది. “అంత సీన్ లేదులే ! నేను ముందే చెబుతా ! పల్లవికి ఒబేసిటీ ప్రాబ్లం ఉంది అని...” అండి శివాని. ఒబేసిటీ నా శరీరానికి కాని, నా గొంతుకు కాదుగా ! ఏ అబ్బాయిలైనా ఎట్ట్రాక్ట్ అయ్యేది ముందుగా మనిషిని చూసి కాదు. ఎట్త్రాక్టివ్ గా మాట్లాడుతున్నట్టు గొంతు వినిపిస్తే చాలు ఫోన్ లో వదలకుండా వెంటబడతారు కొందరబ్బాయిలు .” అంది. “అలా అని నీకు నువ్వే డిసైడైపోయావా ? లేక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ?” అంది వ్యంగ్యంగా శివాని. “ఉంది. డిగ్రీ చేస్తున్న నా ఫ్రెండ్ లైఫ్ లోకి ఒకడు రాంగ్ కాల్ తో ఎంటరై దాన్ని చూడకుండానే దానితో మాట్లాడి, మాట్లాడి దాన్ని మెస్మరైస్ చేసాడు. ఆక్సిడెంట్ అయిందనో, హాస్పిటల్ లో ఉన్నాననో అబద్ధం చెప్పి అతని ఫ్రెండ్ ని పంపి దాని దగ్గర డబ్బులు తీసుకునేవాడు, ఒకసారి అది ఎక్షామ్ ఫీజు కోసం ఉంచుకున్న డబ్బుల్ని కూడా తీసుకున్నాడట. తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ అమ్మకి పసికర్లు అయ్యి, హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులు కావాలని యెంత అడిగినా ఇవ్వలేదట. అది ఆ బెంగతో డిప్రెషన్ లోకి పోయి, అదే హాస్పిటల్ లో వాళ్ళ అమ్మకన్నా ముందే చనిపోయింది. అది తెలిసి వాళ్ళ కాలేజీ వాళ్ళు దాని పేరు పక్కన శ్రద్ధాంజలి అని రాసి ఉన్న ఫ్లెక్షి ని కాలేజీ ముందు పెట్టారు. ఒక రోజు సెలవు కూడా ప్రకటించారు. అది చూసి నేను షాక్. నా మనసులోంచి ఆ సన్నివేశం ఇంకా చెదిరిపోలేదు.” అని చెబుతూ వెంటనే సెల్ ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని, “హలో! అమ్మా ! నాకు నిన్ను చూడాలని ఉంది, వస్తున్నా. నాన్నకి కూఒడా ఫోన్ చేసి చెబుతాను. మళ్ళి రేపు కాలేజీ టైం వరకూ వచ్చేస్తాలే !” అంటూ కాల్ కట్ చేసి, ఫ్రెండ్స్ వైపు తిరిగి, “ నేను మా ఊరు వెళ్లి రేపు వస్తానే.” అంటూ రోడ్ పై వస్తున్న ఆటో ను ఆపి ఎక్కి వెళ్ళిపోయింది పల్లవి. సంకేత, శివాని, హిందూ అవాక్కయ్యారు ! శివాని పల్లవి మాటల్ని పెద్దగా లక్ష్యపెట్టలేదు. సంకేత వైపు తిరిగి, “చూడవే సంకేతా ! ఎక్కడో ఏదో జరిగిందని, అన్ని చోట్లా అలాగే ఎందుకు జరుగుతుంది ? పల్లవి బాడీ కే కాదు, మనసుకు కూడా ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నట్లుంది. అందుకే అలా ఆలోచిస్తోంది.” సంకేతనే కాదు, హిందూ కూడా ఆ మాటలు విని, దాని మీద ఇంకేం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా శివాని వినే స్థితిలో లేదు. సెల్ ఫోన్ లేకపోతే యెంత పిచ్చి లేస్తుందో, నిత్యం హాస్టల్ లో చూసే హిందూ కి బాగా తెలుసు. సంకేత తప్ప హిందూ, పల్లవి, శివాని ఒకే హాస్టల్ లో ఉంటున్నారు. హాస్టల్ లో ఉండే అమ్మాయిల్లో ఎవరూ, ఎవరిలాగా ఉండరు. ఎవరికి వాళ్ళే ప్రత్యేకమైన అలవాట్లతో, ప్రత్యేకమైన తెగింపుతో, ఉంటారు. అది చదువు విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు.మాకు వ్యక్తిత్వం ఉంది. దాన్ని ప్రదర్శించుకునే స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కూడా మాకు ఉన్నాయి, అన్నట్లు అన్ని విషయాల్లో ముందుంటారు. కాని పైకి కనిపించరు. ఏదైనా ఎవరికి వాళ్ళే సీక్రెట్ గా నిర్ణయాలు తీసుకుని, ఫాలో అవుతారు. ఏదైనా సెల్ల్ఫొన్ల తోనే వాళ్లకు పని.... ! నాలెడ్జ్ ని పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా తమకు సరియన ఆయుధం సెల్ ఫోనే అన్నట్లు వ్యవహరిస్తారు. అదీ కాక, సెల్ ఫోన్ లో మాట్లాడిన ప్రతి మాటకు డబ్బులేం పెద్దగా ఖర్చు కావు. ఎందుకంటే కొన్ని సెల్ ఫోన్ కంపెనీ లు మిడ్ నైట్ బాలన్స్ వేసుకుంటే చాలు... రాత్రి 11 గంటల నుండి, ఉదయం 6 గంటల వరకు ఫ్రీ గా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అదికూడా ఏ టైం లో ఏ సిం తో ఫ్రీ గా మాట్లాడుకోవచ్చో చూసుకుని, దానికి వీలుగా సిం లు మార్చుకుని మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. అందుకే కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు నైట్ అంతా నిద్ర మానేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో శివాని ఒకరు. హిందూ ని ఫోన్ అడగాలంటేనే శివానికి జంకుగా ఉంటుంది. హిందూ దగ్గర ఫోన్ ఉండేదే ఇంటికి ఫోన్ చేసి, వాళ్ళమ్మ త్రిపురమ్మతో మాట్లాడడానికి... ఆమె ఎప్పుడు కాల్ చేస్తుందో తెలీదు. ఒకవేళ తను మాట్లాడుతున్న టైం లో ఆమె కాల్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ వచ్చింది అంటే “ఎవర్తో మాట్లాడుతున్నావే అంతసేపు?” అంటూ హిందుని చంపేస్తుంది . అందుకే చూపులన్ని హిందూ సెల్ ఫోన్ మీద వున్నా మనసుని మాత్రం కంట్రోల్ చేసుకుంది శివాని . ఈ రాత్రికి సెల్ ఫోన్ లేకుండా ఎలా గడపాలన్నదే ఆమెకు గడ్డు సమస్య అయింది . అయినా ఈ కాలేజీ వాళ్లకి అదేం పాడుబుద్దో !పిల్లల దగ్గర వున్న సెల్ఫోన్స్ తీసుకుంటారు ,అని మనసులో తిట్టుకుంటూ వేరే అమ్మాయిలతో వెళ్లి కలిసింది . అక్కడికి వేరే అబ్బాయిల గుంపు వచ్చి చేరింది . వాళ్ళలో రాజీవ్ అనే అబ్బాయి శివాని వైపు చూసి ఎగతాళిగా నవ్వి " డోంట్ వర్రీ శివాని నేను వెంటనే వెళ్లి మన ప్రాబ్లంని మన కో ఆర్డినేటర్ తో చెప్తాను . వెంటనే దీన్ని మన హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళతాను మన మొబైల్స్ మనకి వస్తాయి " అని అటుండగా వాళ్ళ సీనియర్ అనంత్ బైక్ మీద జెట్ వేగంతో వెళుతూ రాజీవ్ పక్కన ఆగి ఆ మాటలు విన్నాడు . వినగానే రాజీవ్ జబ్బమీద గట్టిగా చరిచాడు "ఒరేయ్ మామా కో ఆర్దినేటర్స్ వుండేది ఎందుకనుకుంటున్నావ్ ! జనరల్ నాలెడ్జి ఉండే మాట్లాడుతున్నావా ? రా బైక్ ఎక్కు వెళదాం !" అంటూ అతన్ని తీసుకు వెళ్ళాడు . శివాని వెర్రి చూపులు చూసి " మరి ఇలాంటి ప్రోబ్లమ్స్ ని ఎవరు చూస్తారు" అంది . .... ఆ దారిలో నడుస్తున్న అబ్బాయిలు , అమ్మాయిలు ఫార్మల్ డ్రెస్ లో ఉన్నారు . 'వీళ్ళు మన కాలేజీ కి సంభందించిన విద్యార్ధులు " అని గుర్తింపు కోసం ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ ని మెడలో వేసుకుని వున్నారు . వెంటనే వాళ్ళలో ఇంకో అబ్బాయి కల్పించుకుని "మన పిటి సర్ తీసుకు వెళ్ళిన మొబైల్స్ అన్ని మన వైస్ ప్రిన్సిపాల్ దగ్గర వున్నాయి . మనవాళ్ళు కొందరు వెళ్లి ఆయన్ని బాగా రిక్వెస్ట్ చేశారు . ఆయన ఇవ్వనన్నాడట , కనీసం రేపు అయినా ఇస్తాడో లేదో ! ఫైన్ ఎంత కట్టాల్సి వస్తుందో ఏమో ! నాదగ్గర ఒక్క రూపాయి కుడా లేదు ' అంటూ ఏడుపు ముఖం పెట్టాడు . అంతే కాదు ఈ పాటికి తన గర్ల్ ఫ్రెండ్ తనకి పంపిన మెసేజ్ లన్ని వైస్ ప్రిన్సిపల్ గారి దగ్గర వున్న తన మొబైల్ లోకి ఫీడ్ అవుతూ ఉంటాయన్నది గుర్తు రాగానే అవన్నీఆయన ఎక్కడ చూస్తాడో అన్న బెంగతో ఆయన మీద వస్తున్న కోపాన్ని ఆపుకోలేక పోతున్నాడు . పైకే తిట్టుకుంటూ మన మొబైల్స్ అన్నీ ఆయన ఏమ్చేసుకుంటాడో మీలో ఎవరికైనా తెలుసా మామా ! రాత్రికి డోర్ పెట్టుకుని ఆ మెసేజ్ లన్ని తన గర్ల్ ఫ్రెండ్ కి పాస్ ఆన్ చేస్తాడు . అలా పంపి ఆవిడగారి దగ్గర యువకుడై పోదామని ! ఎంత ఆశ ఎంత ఆశ అంటూ అందరికి వినిపించేలా అరిచాడు . వెంటనే ఆ అబ్బాయి గూబ గుయ్యి మంది . ఎవరు కొట్టారో తెలియనంత బిత్తర పోయాడు . వాళ్ళలో శ్రీహర్ష వున్నాడన్నది అప్పటి వరకు ఎవరు గమనించలేదు . కొట్టింది శ్రీహర్షే . ఆ అబ్బాయి చెంప తడుముకుంటూ "ఎంత సీనియర్ వి అయితే మాత్రం కొడతావా" అన్నట్లు చూశాడు . " తప్పు చేసేది కాక ఇది తప్పని దండించే వాళ్ళను ఇలాగేనా మాట్లాడేది ,ఇందుకేనా మనం చదివే ఈ చదువులు ? ఆయన విద్యాదానం చేసే దేవుడు . పిల్లల లైఫ్ బాగుండాలని, పిల్లలకి మేలు జరగాలని చూస్తాడు . ఆయనకీ పిల్లలకి పాఠాలు చెప్పే వ్యసనం తప్ప ఇలాంటి చిల్లర వ్యసనాలు లేవు . నువ్వు అలా అనడం నచ్చలేదు అందుకే కొట్టాను. నువ్వంటే నాకు ఎలాంటి కక్ష లేదు " అన్నాడు శ్రీహర్ష . ఆ అబ్బాయి వెంటనే సారీ చెప్పాడు . ఇది ఇలా జరుగుతూ వుండగా శివాని శ్రీహర్ష వైపు కోపంగా చూసి అక్కడి నుండి చక చకా నడుచుకుంటూ వెళ్లి సంకేత వాళ్ళతో కలసింది . ఆమె అలా వెళ్లి సంకేత వాళ్ళని కలవడంలో ఉద్దేశం శ్రీహర్ష తన దారిన తను వెళ్ళకుండా తన క్లాస్ మేట్ ను కొట్టడం సంకేతకి , హిందూ కి చెప్పాలని ... ముఖ్యంగా సంకేతకి చెప్తే సంకేత వెళ్లి శ్రీహర్ష్ తల్లి కాంచనమాల తో "ఆంటీ శ్రీహర్ష కాలేజీ లో పిచ్చి పిచ్చి గా అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు . ఒక్కోసారి చెయ్యి కూడా చేసుకుంటున్నాడు" అని చెప్పాలని . కాని హిందూ . సంకేత శివానిని పట్టించుకోకుండా '2జి స్పెక్ట్రమ్ స్కాం ' అంటే ఏమిటో మాట్లాడు కుంటున్నారు ... దాని గురించి సంకేత అడుగుతుంటే హిందూ చెబుతుంది . " స్పెక్ట్రమ్ అంటే రకరకాల ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు . గాలిలో అలలు అలలు గా వచ్చే శబ్దం . ఈ తరంగాలు వార్తలని అందించడానికి ఉపయోగిస్తారు . ఇందులో ముఖ్యమైన ఉపగ్రహం ద్వారా అందించే సమాచారం ముఖ్యమైన సాధనం . స్పెక్ట్రుణ్ అందులో అతి ముఖ్యమైనది . మొబైల్ ఫోనుల వాడకం విపరీతంగా పెరిగి పోవడం వాల్ల ఎన్నో కంపెనీలు లైసెన్సు ల కోసం పోటీ పడుతున్నాయి " అంది . సంకేత శ్రద్దగా వింటోండి . " అదీ కాక మనదేశంలో ప్రచార సాధనాలు కేంద్ర ప్రభుత్వపు కంట్రోల్ లో వుండటం వల్ల ప్రభుత్వం టెలి కమ్యునికేషన్సు ను -ప్రభుత్వ మంత్రిత్వ శాఖకి కేటాయించింది . వేల కోట్లు ,లక్షల కోట్లు ప్రభుత్వ టెలి కమ్యునికేషన్ శాఖకి కంపెనీ లు లైసెన్స్ ఫీజులుగా చెల్లించాలి . లైసెన్స్ ఇచ్చే అవకాశం టెలికం శాఖకి వుండటం వల్ల వందలు , వేలు కోట్లు దిగ మింగి కొందరు జైల్లో కూర్చోవడం మామూలైంది . మనదేశంలో ఇప్పటికి దాదాపు 80 కోట్ల మంది దాకా మొబైల్ ఫోన్లు వాడుతూ ఉన్నారట . ఎయిర్టెల్ ,రిలయన్సు , టాటా ,వోడాఫోనే , ఎయిర్సెల్ ఇలా చాలా కంపెనీ లు లైసెన్సు లు తీసుకుని విపరీతంగా సంపాదించు కుంటూ , అధికారం లో వున్నా వారికి ఈ లైసెన్సు ల కోసం వేల కోట్ల రూపాయలు లంచం గా ఇస్తున్నారు . అదే స్పెక్ట్రమ్ స్కాం అంటే " అంది హిందూ . ఆ తర్వాత వాళ్ళ టాపిక్ వేరే దాని మీదకి మళ్ళింది . శివాని వాళ్ళ వైపు విసుగ్గా చూసింది . ఎంతసేపు విన్నా చొప్పదంటు నమిలినట్లుగా అరుచిగా అనిపించాయి వాళ్ళ మాటలు . తను చెప్పాలనుకున్నది చెప్పే అవకాసం ఇవ్వడంలేదు వాళ్ళు . వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు . శివానికి క్షణం లో ఏదో ఆలోచన వచ్చినట్లు "హిందూ ! నేను హాస్టల్ కి రావడం లేదు . ఈ రాత్రికి మా ఫ్రెండ్ దగ్గర వుండి రేప్పొద్దున వస్తాను . తన దగ్గరికి వెళ్లి రికార్డు రాసుకునేది వుంది " అంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ వేరే దారిలోకి వెళ్ళింది . సంకేత ,హిందూ ముఖాలు చూసుకున్నారు . తిరిగి నడుచుకుంటూ సంకేత శివరామ కృష్ణ గారింటికి , హిందూ హాస్టల్ కి వెళ్లి పోయారు . * * * * శివరామ కృష్ణ తల్లి వరమ్మ . ఆమె పడక గది మూడేళ్ళుగా మెట్లకిందనే వుంది . ఆమె భర్త రామారావు చనిపోయి ఐదేళ్ళ పైనే అయింది. రామారావు బతికి ఉన్నంత కాలం ఆ దంపతులు ఇద్దరు చాలా కాలం హాల్లోనే పదుకున్నరు. కారణం శివరామ కృష్ణకి కాంచనమాలతొ పెళ్లయ్యాక కొడుకు , కోడలికి ప్రైవసీ ఉంటుందని రామారావు , వరమ్మ పడుకుంటున్న గదిని వాళ్లకి ఇచ్చి హాల్లోకి మారారు . ఆ తర్వాత వరమ్మ భర్త రామారావు చనిపోయారు . కాంచన మాల శివరామ కృష్ణతో ఏం చెప్పిందో ఏమో ...... " అమ్మా ! హాల్లో నీ పడక చూడటానికి బావుండదేమో ! మా సహా ఉద్యోగులు కూడా కొందరు అదే అన్నారు . వాయిదాల రూపంలో ఐనా ఓ సోఫా కొని వేసుకుంటే బావుంటుందేమో ! పైగా నాన్న కూడా లేదు కదా ! నాన్న వున్నప్పుడు అంటే మీరు పాడుకోడానికి ఇబ్బందిగా ఉంటుందని సోఫా , కుర్చీలు లాంటివేమీ కొనలేదు . శ్రీహర్ష పెద్దవాడవుతున్నాడు . ఆ మాత్రం మెయింటినెన్స్ లేకపోతే బాగుండదు . వాడిక్కుడా వాడి స్నేహితుల ముందు గౌరవం పెరగాలి . ఈ రోజుల్లో ముందు ఎవరైనా ఇంటిని ,ఇంటిలోని సామాన్లను చూసే మర్యాద ఇస్తున్నారు . నేనిలా అంటున్నానని శ్రీహర్ష కి చెప్పకు ..... వాడి అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవక పోతే నీ కోడలితో గొడవలు వస్తాయి . ... ఇంతకీ నేనేం చెప్పబోతున్నానంటే ఎలాగూ మెట్ల కింద స్తలం ఖాళీగా వుంది . నువ్వు అక్కడ పడుకుంటే ఎలా వుంటుందో ఆలోచించు .... బావుంటుందనే నేను అనుకుంటున్నాను . ఇక్కడైతే అందరు తిరుగుతూ నీక్కూడా ఇబ్బందిగా వుంటుంది .!" అన్నాడు శివరామ కృష్ణ . కొడుకు మాటకు తిరుగు లేదు . కాదని కుడా ఎప్పుడు అనదు వరమ్మ . కొడుకంటే ఆమెకి ప్రాణం . ... అందుకే "అలాగే శివయ్యా ! నువ్వు చెప్పింది కూడా సబబు గానే వుంది . ఈ రోజే నా పడకను మెట్ల కిందకు మార్చుకుంటాను . హాయిగా నిద్ర పడితే చాలు . ఎక్కడ పడుకుంటే ఏముంది . అంతా మన ఇల్లే కదా! " అంది . అలా అనక పోతే కొడుకును బాధ పెట్టినట్లు అవుతుంది . కాంచన మాల రౌద్ర రూపాన్ని చూస్తూ క్షణ క్షణం చావాల్సి వస్తుంది. నిజానికి ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆ స్తలమంతా తానే అయి తిరిగింది . కూలీలను ఎక్కువ పెడితే డబ్బు చాలక ఇంటి పని మధ్యలో ఆగిపోతుందని ఇటుకలు తడపడం , గోడలు తడపడం ,మాల్ అందివ్వడం లాంటి పనులు తనే చేసింది . తన భర్త వద్దన్నా వినేది కాదు . వంట గది , బెడ్ రూం , హాలు తన అభిరుచికి అనుగుణంగా కట్టించు కోవడం కోసం భర్తను నొప్పించకుండా చాలా సౌమ్యంగా " ఇదిగోండి ! ఇల్లు పూర్తయ్యాక మీరు ఉదయాన్నే ఇక్కడ కుర్చుని కాఫీ తాగొచ్చు , పేపరు చదవొచ్చు . కాస్త ఇటొచ్చి చూస్తే సూర్యోదయం కనిపిస్తుంది .... సూర్యాస్తమయాలు మనకు కనిపించవు . ఎందుకంటే మన ఇంటికి నైరుతిలో మన ఇంటికన్నా ఎత్తులో పెద్ద బిల్డింగ్ వుంది . దీన్ని బట్టి ఎప్పటికైనా మన శివరామ కృష్ణ గొప్ప వాడు అవుతాడు . ఇదిగో వాడి బుక్స్ కోసం , వాడి బట్టల కోసం ఇక్కడ షెల్ఫ్ లు వస్తాయి . మేస్త్రి తో మాట్లాడాను . మా బెడ్ రూం మాకే కాదు మా అబ్బాయి కి కుడా అనుకూలంగా ఉండేటట్లు కట్టమని ... ఏమంటారు ? నేను సరిగానే ఆలోచిస్తున్నాను కదా ! " అనేది . " నువ్వు ఏదైనా సరిగానే ఆలోచిస్తావు .... ఆలోచించే ముందు మన ఆర్ధిక పరిస్తితిని కూడా దృష్టిలో పెట్టుకో ...." అనే వాడు భర్త . "అందుకే మెట్ల దగ్గర పని ఆపేద్దాం ! మెట్లు కూడా ఖరీదుగా కట్టుకోవద్దు . ఏదో మేడ మీద ఎండేసిన వడియాల కోసమో , బట్టల కోసమో ఎక్కడానికి అనుకూలంగా వుంటే చాలు . అయినా అటు వైపు ఎవరు వెళ్తారు ? ఎవరు చూస్తారు . మెట్ల క్రింద నేల కూడా సిమెంట్ చేయొద్దు . అలాగే వదిలేద్దాం అంది . ఆమె అన్నట్లుగానే అప్పటినుండి ఇప్పటివరకు నెల అలాగే వుంది . ప్రస్తుతమ్.... మేడపైకి వెళ్లాలని మనుష్యులు ఒక్కో మెట్టు చెకచెకా ఎక్కుతున్నప్పుడు చెప్పులకు అంటుకున్న దుమ్ము వచ్చి మెట్ల కింద పడుకున్న వర్మ మీద పడుతుంటుంది . ఈ మెట్లపై క్లీన్ చేసే ఓపిక ఆ ఇంట్లో ఎవరికీ లేదు . అప్పుడప్పుడు నీలిమ వెళ్లి శుభ్రం చేస్తుంది. అంతలోనే కాంచనమాల ఓ కేకేసి...”అదేమైనా షాపింగ్ కాంప్లెక్సా ! ఇంట్లో పని వదిలేసి అక్కడికి వెళ్ళావ్ ! ఇలాంటి పనులే నాకు నచ్చవు... “అంటుంది. నీలిమ నోరెత్తదు. కాంచనమాల బైటికేల్లినప్పుడు మాత్రం మెట్ల మీద, మెట్ల కింద ఉన్న వరమ్మ మంచం చుట్టూ శుబ్రం చేస్తుంది. అలా చేసినప్పుడు,” ఏ తల్లి కన్నబిడ్డవో తెలీదుకాని, పనిమనిషివైనా మనసు బంగారం నీలిమా నీది... దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పెద్దవాళ్ళ దీవెనలు ఊరికే పోవు “ అంటుంది వరమ్మ. “చెయ్యకుండా అలాగే వదిలేస్తే మీరుండలేరు. ఇప్పటికే ఈగలు వస్తున్నాయ్. మీరు లేస్తే మీ పక్కబట్టలు మార్చి వాటిని ఉతికిస్తాను,” అంది నీలిమ. వెంటనే లేచింది వరమ్మ. ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా తిరగలేక పోతోంది. తన పన్లు కూడాతాను చేసుకోలేక పోతోంది. వంట్లో జ్వరం ఏమైనా ఉందో ఏమో ! అది తెలియక నీలిమ “ అప్పుడప్పుడు లేచి కొంచెం తిరుగుతూ ఉండండి ! అలాగే పడుకుంటే నడుం పట్టేస్తుంది !” అంది. “నీరసంగా ఉంటోంది నీలిమా !” అంది వరమ్మ. “అలాగే ఉంటుంది, వయసు కూడా ఉంది కదా ! బాగా తింటే నీరసం తగ్గుతుంది. నేను బైటికేల్లినప్పుడు పళ్ళు తెచ్చిస్తా ! దాచుకుని అప్పుడప్పుడూ తిందురుగాని...” అండి నీలిమ. “ నువ్వు బైటికేప్పుడు వెళ్తావు ?” ఆశగా అడిగింది. “కాంచన మేడం నన్ను కరెంటు బిల్లులు కట్టమనో, సెల్ రీఛార్జి చేయించామనో, మార్కెట్ కనో పంపుతుంది కదా ! అప్పుడు వెళ్తాను.” అంది . “అప్పుడా !”అంది తనలో తానే నిరాశగా . “మరి మీ కోసం ప్రత్యేకంగా వెళ్తే, పని వదిలేసి వెళ్లానని తిడుతుందేమో ! తిడితే తిడుతుంది. అయినా వెళ్తాను .” అంది నీలిమ. “వద్దు, వద్దు ! తిట్లు పడేది నువ్వే అయినా, వాటిని తింటున్నత సేపు అవే గుర్తొచ్చి, తిండి మీదే విరక్తి పుడుతుంది...” అండి వరమ్మ. ఒక్క నిముషం వరమ్మనే చూస్తూ అవాక్కయ్యింది నీలిమ. వరమ్మ ఇంకేమి మాట్లాడకపోవడంతో ,” మరి ఆ చీరలు కూడా ఇవ్వండి, వీటితో పాటే వాటిని కూడా ఉతికేస్తాను, మీరు ఎలాగూ ఉతకలేరు. ఈ మధ్యన మీలో చాలా మార్పు వచ్చింది.... యోగాలు, ఆసనాలు చెయ్యకపోయినా కనీసం అటూ ఇటూ అయినా తిరగండి!” అంటూ నీలిమ తనే మంచం కిందకి వంగి, వరమ్మ ఇప్పిన బట్టలు తీసుకువెళ్ళింది. వరమ్మ కళ్ళు చెమర్చాయి. నీలిమ ఎవరు ? తానెవరు ? 4 సం. క్రితం ఒక అనాధాశ్రమంలో ఏదో “నిజం “ చెప్పిన నేరానికి బైటికి గెంటబడిన అనాధ పిల్ల నీలిమ. దిక్కుతెలియక రోడ్డు పక్కన ఏడుస్తూ ఉంటే తన భర్త రామారావు “మా ఇంట్లో ఉందూగాని రా !” అంటూ జాలిపడి తీసుకొచ్చాడు. అప్పుడు నీలిమకు 15 సం. ఉంటాయి. అప్పటినుండి హాల్ లో తమ పక్కనే చాప వేసుకుని పడుకునేది.... ఇప్పటికీ అదే చాపపై అదే హాల్ లో పడుకుంటోంది. తను మాత్రం మెట్ల కిందకి మారింది. అయితే, కొత్తగా శివరామకృష్ణ తన స్నేహితుడు నరసింహం కూతురు సంకేతను తెచ్చి, అదే హాల్ల లో నీలిమ పక్కన ఒక బెడ్ వేసి, షెల్టర్ కల్పించాడు... చదువుకునే అవకాశం కల్పించాడు. మానవత్వంతో ఏ పని చేసినా మంచిదే అనేవాడు తన భర్త రామారావు. మరి ఇప్పుడు మెట్ల కింద తెగిపోయిన నవారు మంచంలో పడుకుని ఉన్నానన్నది పైలోకాల్లో ఉన్న తన భర్తకి కనిపిస్తుందా ? ఏదైనా ఒక వాడనుండో, పేట నుండో, తండా నుండో వచ్చిన పనిపిల్ల అయితే గిన్నెలు కడిగి, నేల తుడిచి, బట్టలు ఉతికి, వెళ్ళిపోయేది. కాని నీలిమకు ఇల్లు లేకపోవడంతో అక్కడే తింటూ, అక్కడే ఉంటూ, ఇంట్లో ప్రతి పని తనకోసమే ఎదురు చూస్తున్నట్టు బాధ్యతగా చేస్తుంది. భయంగా మసలుకుంటుంది, కృతజ్ఞతగా ఉంటుంది. అనాధ ఆశ్రమంలో పదొవ తరగతి వరకూ చదువుకోవడం వల్ల తెలుగు బాగా చదువుతుంది. ఇంగ్లీష్ కూడా చదువుతుంది... మాటల్లో సభ్యత, సంస్కారాలు ఉట్టి పడుతుంటాయి. చెబితేనే తప్ప పనమ్మాయి అనుకోరు చూసేవాళ్ళు, గొప్ప అందగత్తె. అయినా తన హద్దు మరచి ఏనాడూ ప్రవర్తించాడు నీలిమ. వరమ్మ చీరలు ఉతికి, వాటిని గట్టిగా పిండి, 2 చీరలు భుజమ్మీద వేసుకుని, ఒక చీరను చేత్తో పట్టుకుని, మేడ మీద వేస్తే త్వరగా ఆరిపోతాయని, వెళ్తున్న నీలిమకు ఎదురైంది సంకేత.... సంకేతతో పాటు సంకేత క్లాసు మేట్స్ పల్లవి, శివాని ఉన్నారు. వాళ్ళ ముగ్గురూ కాలేజీ నించి వస్తున్నారు. పల్లవి వెంటనే ముక్కు మూసుకుని, “ చి, చి, ముసలి కంపు, వాటిని నువ్వే ఉతికావా?” అంది. ఎలా పడుకుంటావే దీని పక్కన అన్నట్టు సంకేత వైపు చూసింది. పల్లవి ముఖంలోని భావాన్ని చదివి నివ్వెరపోతూ... “అవును నేనే ! ఐతే ఏం ?” అంది దబాయింపుగా నీలిమ. “ నీకేం కాదు, నువ్వు పనిమనిషివి, సంకేత దగ్గర పడుకుంటావ్ చూడు, అదే ఇబ్బంది...” అయినా ఎలా పడుకుంటున్నావే సంకేతా దీని పక్కన “ అని లోలోన గొణిగింది శివాని. సంకేత మాటల్ని పట్టించుకోకుండా “ ఇప్పుడేగా కాలేజీ కి వెళ్ళింది, అప్పుడే వచ్చారేంటి ?” అని అడిగింది సంకేత వైపు చూస్తూ నీలిమ. “కాలేజీ లో సమ్మె నడుస్తోంది...” అండి సంకేత. “మరి మీరు పాల్గొనలేదా !” అడిగింది నీలిమ. “నీకు మాటలేక్కువయ్యాయి “ అన్నట్లు ఉరిమి చూసింది పల్లవి. ఈ మధ్య పనయ్యకా పేపర్ తిరగెయ్యడం అలవాటైన నీలిమ వెంటనే 2 అడుగులు పల్లవి వైపు వేసి, “కంపు” అంటుందని, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి, “ మీ కాలేజీ లో సమ్మె చేస్తే ఇండియా లో ఉండే పేదరికం పోతుందా ? ఆహారం, నీరు, వైద్యం, విద్య, అందరికీ అందుబాటులోకి వస్తుందా ? మొన్న పేపర్ లో చదివాను. మనకు స్వాతంత్ర్యం వచ్చాకా సాధించింది ఏమీ లేదుట ! కొన్ని కోట్ల రూ. అవినీతి, 70 లక్షల కోట్ల రూ. కుంభ కోణాల్లో గల్లంతైనట్లు అంచనా వేసారట. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి కొన్ని కోట్ల పైమాటే నట ! ఈ సొమ్ముతో మన దేశానికి సంబంధించిన మొత్తం బాకీని వడ్డీతో సహా కొట్టి పారేయ్యచ్చుట... ప్రతి ఊరికి 3 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని సౌకర్యాలతో నెలకొల్ప వచ్చట... దేశంలో ప్రతి భారతీయుడికి 56,000 రూ. జీవన భ్రుతి కింద ఇవ్వచ్చుట... మన దేశ స్థూల ఆదాయం కంటే స్కాముల్లో పోయిందే ఎక్కువట. వీళ్ళెవరినీ జైల్లో పెట్టిన వాళ్ళు లేరట. మరి మీ కాలేజీ లో సమ్మెలు చేసి వీటిని లేకుండా చేస్తారా ? దేశం బాగుంటుంది..” అంది ఆశగా చూస్తూ. శివాని బరువుగా నిట్టూర్చి "ఇంత సేపు నిలబెట్టి పనికి రాని చెత్తంతా వినిపించటం అవసరమా నీకు ? దేశం ఎలా ఉంటే నీకెందుకు? ఈ కొంపలో నీకింత ముద్ద దొరుకుతుంది కదా! అది చాలదా? అయినా ఇవన్నీ ఇంట్లో పని చేసే దీనికెలా తెలుస్తాయే! అంది. వరమ్మ బామ్మ పక్కన చేరి పాత పేపర్లు చదువుతుంది. “ఇంట్లో పనేగా చేసేది అని దాన్ని తక్కువ అంచనా వేయకు. చదివింది టెంతే అయినా తన బుర్రను సాగదీసి ఆలోచించాలని చూస్తుంది", అంది పల్లవి. "అమ్మో! దీన్ని నమ్మకూడదు బాబూ! ఇక్కడే ఉంటే ఇంకా ఏం మాట్లాడుతుందో ఏమో! పద లోపలికి..." అంది శివాని. ముగ్గురూ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూస్తూ నిశ్చేష్టయై నిలబడింది నీలిమ. శివాని, పల్లవిల స్నేహం సంకేతకి అంత మంచిది కాదేమో అంపించింది నీలిమకు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వాళ్ళు ఎక్కూగా సంకేతతో కనిపిస్తున్నారు. పల్లవిని పక్కకు పెడితే శివాని మాటలు నీలిమకు బొత్తిగా నచ్చటం లేదు. "కాలుష్యం పెరుగుతుందంటే చెట్లను పెంచమంటున్నారు...నీళ్ళు చాలీ చాలని చోట్ల సూక్ష్మ సేద్యాలు చెయ్యమంటున్నారు. తినే ధాన్యం పురుగు మందుల వల్ల విషపూరితం అవుతుందంటే సేంద్రీయ ఆహారం వైపు మళ్ళాంటున్నారు....మరి ఈ శివానిలాగా మాట్లాడే వాళ్ళను ఏం చేయాలి?" అని ఆలోచిస్తూ ఒక క్షణం అలాగే నిలబడి ఆ తర్వాత మేడ మీదికి వెళ్ళింది నీలిమ. శ్రీహర్ష ఎప్పుడైనా స్నేహితుని రూంలోనే ఉండి చదువూకుంటూవుంటాడు. తినటానికి మాత్రం ఇంటికి వస్తాడు....పడుకొనేది కూడా స్నేహితుని గదిలోనే...ప్రతి రోజూ ఇంట్లోనే స్నానం చేసి తయారై కాలేజీకి వెళ్తూవుంటాడు. ఆ రోజు శ్రీహర్ష కాలేజీ వదలగానే ఇంటికి రాలేదు. తను రావటం ఆలస్యం అవుతుందని, ప్రస్తుతం రక్తదాన శిబిరం దగ్గర వున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అది విని హతాసురాలయింది తల్లి కాంచనమాల. తనకి తెలీకుండా తన కొడుకు రక్తాన్ని దానమిస్తున్నాడా! అదేమైనా చాక్లెట్టా ! కొని చేతిలో పెట్టటానికి...వద్దని చెప్పేలోపలే శ్రీహర్ష కాల్ కట్ చేశాడు. కాంచనమాల ఉసూరుమంటూ ఓ చోట కూలబడి...దిగులుగా చూస్తూ.... "నా కొడుకు బ్.టెక్., చదువుతున్నాడే కానీ ఇంత అమాయకుడనుకోలేదు. ఒంట్లో ఉన్న రక్తాన్ని శక్తిగా మార్చుకొని ...చదువుకోసం వాడుకోవాలి కానీ అదేదో పంచదార అయినాట్లు పంచిపెడతాడా? వాడు ఏది తింటాడో ఏది తినడో అడిగిమరీ వండి పెట్టేది ఇందుకేనా? ఇదేం బుద్ది? వాడి బుద్దిని నువ్వే మార్చాలి దేవుడా! లేకుంటే ఖర్చు పెట్టే కొద్దీ అకౌంట్లో డబ్బులు తరిగిపోయినట్లు ఒంట్లో రక్తాన్ని కొంచెం కొంచెం కాజేసుకుంటాడు. ఇంత వయస్సు వచ్చినా ఇంకా పిల్లతనమేనా!చిన్నప్పుడు కూడా అంతే! ఆటల పేరు తో దెబ్బలు తగిలించుకొని ఒంట్లో రక్తాన్నంతా పోగొట్టుకొనేవాడు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రక్తం పట్టి ఒళ్ళు చేస్తున్నడని మురిసిపోతుంటే అది కూడా లేకుండా చేస్తున్నడు..." అని పైకే అంటుంటే అక్కడే ఉన్న సంకేత విని అర్ధం చేసుకుంది. ఎంత వాడైనా తల్లికి కొడుకే...ఎంత వయస్సు వచ్చినా ఒళ్ళో పిల్లాడే...అందుకే సంకేత కల్పించుకొని "మీరనేది నిజమే ఆంటీ!నేను నా రక్తం ఇవ్వకుండానే ఆ శిబిరాన్ని దాటుకొని వచ్చేసాను. నా స్నేహితురాలు హిందూ వెళ్ళింది ఇవ్వటానికి.... అదసలే బక్కది.అయినా వెళ్తుంది. ఎంత చెప్పినా వినదు. వినని వాళ్ళకి చెప్పలేం ఆంటీ! మీలాగే నాక్కూడా చెప్పిన మాట వినకపోతే బాధనిపిస్తుంది..."అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. కాంచనమాల ముక్కుచీది "వాడిని నేనెలా పెంచుకున్నాను.చిన్న పని కూడా చెయ్యనిచ్చే దాన్ని కాదు. కోరిందల్ల ఇచ్చేదాన్ని....వాళ్ళ నాన్న గారికి తెలిస్తే ఒప్పుకోరని పక్కకి తీసుకెళ్ళి డబ్బులు కూడా ఇచ్చేదాన్ని....చివరికి నాకు తెలీకుండా రక్తాన్నిస్తాడా!అంటూ అడిగింది. సంకేత ఆమెనే చూస్తూ "ఆంటీ! ఏ స్ఫూర్తీ లేనిదే ఏదీ రాదంటారు. శ్రీహర్షకు చిన్న్నప్పుడు మీ ఒళ్ళో కూర్చో బెట్టుకొని విశేషమైన కబుర్లు లాంటివేమైనా చెప్పారా? అంటే ఐ మేన్ దేశం పట్ల గౌరవాన్ని, దేశభక్తిని పెంచుకోమని...రూల్స్, రెగులేషన్స్ పాటించమని ...క్లాసు పాఠాలే కాదు వ్యక్తిత్వం కూడ్డా కావాలని చెప్పేవాళ్ళా! నాకెందుకో శ్రీహర్ష చాలా మంది అబ్బయిలకన్న డిఫరెంట్ గా అనిపిస్తాడు" అని అంది. ఆమె వెంటనే సంకేత వైపు చూసి "అలాంటి ఏడుపులన్నీ అదిగో ఆ ముసలమ్మ ఏడ్చేది. నేను ఎన్ని చెప్పి ఏం లాభం? చివరకి నాకు చెప్పకుండా రక్తదాన శిబిరం దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఇవ్వకుండా వస్తాడా ? అదిగో వస్తున్నాడు చూడు...." అని ఆమె అంటుండగానే శ్రీహర్ష లోపలికి వచ్చి, చేతులు వాష్ చేసుకొని, ఎప్పటిలాగే వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. కాంచనమాల, సంకేత కూడా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నారు....కాంచనమాల కొడుకునే చూస్తోంది. ఆమె కడుపు రగిలిపోతోంది. సంకేత మాత్రం ఎప్పటిలాగే బుద్దిగా, ఒద్దికగా కూర్చుంది. ఆ ముగ్గురి ముందు ప్లేట్లు పెట్టి నీలిమ వడ్డిస్తోంది. కాంచనమాల కోపంగా "రక్తం ఇచ్చేముందు నాతో ఒక్క మాటైనా చెప్పొద్దా శ్రీహర్షా! నాన్నతో అయినా చెప్పావా? ముఖం చూడు అప్పుడే ఎలా పీక్కుపోయిందో! నువ్వు కోలుకోవాలంటే ఎన్ని రోజులు పట్టాలి?" అంది. ఆమె మాటల్లో కోపం కన్న బాధే ఎక్కువగా వింపిస్తోంది. శ్రీహర్ష తేలిగ్గా నవ్వి..."రక్తం ఇచ్చినంత మాత్రాన అంత ఎఫెక్టేం ఉండదు మమ్మీ! వెంటనే మామూలైపోతాము. పాత బ్లడ్ పోయి ఫ్రెష్ బ్లడ్ పట్టి ఇంకా హుషారుగా ఉంటుంది" అన్నాడు. సంకేత అన్నంలో కూర కలుపుకుంటూ వింటోంది. కాంచనమాలకు కొడుకు మాటలు నచ్చలేదు. వెంటనే నీలిమ కల్పించుకొని "సార్ చెప్పింది నిజమే మేడం! ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 56 రోజులకి ఒక సారి రక్తదానం చెయ్యొచ్చట...అన్నదానం, విద్యాదానం లాగే రక్తదానం కూడా చాలా పుణ్యం, ఎందుకంటే ప్రతి రెండు సెకన్లకోసారి ఎవరికో ఒకరికి రక్తాన్ని ఎక్కించవలసి వస్తుందట...రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరు కదా! దాతల నుండీ రావలసిందే...అంతే కాదు ఒక సారి రక్తదానం చేయడం వలన ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చుట..."అంది. కాంచనమాల నీలిమ వైపు ఉరిమి చూస్తూ "ఇదంతా నీకెలా తెలుసు? మార్కెట్ పని మీద బయటకెళ్ళినప్పుడు రక్తం అమ్ముకొని ఏమైనా వస్తున్నావా? ఈ మధ్యన కొంత మంది తాగుబోతులకు డబ్బుల్లేక రక్తం అమ్ముకొని తాగుతున్నారట....నువ్వు కూడా బయటకి వెళ్ళినప్పుడు చిరుతిళ్లకి అలవాటు పడి, రక్తాన్నేమైనా అమ్ముకుంటున్నావా?" అంది. నీలిమ ఏమాత్రం నొచ్చుకోకుండా శ్రీహర్ష ప్లేట్లో ఇంకాస్త అన్నం వడ్డిస్తూ "లేదు మేడం! ఇంత వరకూ నేను రక్తాన్ని ఇవ్వలేదు. అవకాశం కూడా రాలేదు. వస్తే అమ్ముకోను. ఉచితంగానే ఇస్తాను....నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఒకప్పుడు మా అనాధ ఆశ్రమంలో దీని గురించి చెప్పేవాళ్ళు...అప్పుడప్పుడు రక్త నిధి వాళ్ళు వచ్చి 17 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర రక్తం తీసుకొని వెళ్ళేవాళ్ళు..."అంది. నాకు బాగ తెలిసిన విషయాన్నే మీకు చెబుతున్నాను అన్న ఆత్మ విశ్వాసం, ఆత్మతృప్తి నీలిమ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన శ్రీహర్ష ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం నీలిమ వైపు చూసి, తిరిగి తన దృష్టిని ప్లేటు వైపుకి మళ్ళించాడు. కాంచనమాల నీలిమను వురిమి చూసి "చెప్పింది చాల్లే! నోరు మూసుకొని అవతలికి పో...." అంటూ కసిరింది. ....నీలిమ ముఖం గంటుపెట్టుకొని పక్కకెళ్ళింది. కాంచనమాల తత్వం తెలియనిది కాదు. సందర్భం ఏదైనా కోప్పడుతూనే వుంతుంది...తను అనుకున్న స్థాయిలో బాధ పడుతుందా లేదా అని మధ్య మధ్య లో ముఖం లోకి చూస్తూ కోప్పడుతుంది. ఇది మరీ ఇబ్బందిగా వుంటుంది నీలిమకు....అయినా తప్పదు. ఈ ఇంటిని మించిన రక్షణ బయట ప్రపంచంలో తనకి దొరకదు. ఇది శ్రీహర్షకు తెలుసు. శివరామకృష్ణకు కూడా తెలుసు. నీలిమ పట్ల కాంచనమాల ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు ఏమీ అనలేరు. అంటే నీలిమను ఏ క్షణంలోనైనా కాంచనమాల తరిమేస్తూందన్న భయం....కానీతన వయసే వున్న సంకేత ముందు నీలిమను అలా కసురుకోవడం, నీలిమ పక్కకు వెళ్ళాకా కూడా వదలకుండా అదే విషయమై మాటలు కొనసాగించడం శ్రీహర్షకి విసుగనిపించి తింటున్న ప్లేటును పక్కకి జరిపి మధ్యలోనే లేచి.... " దీన్నెందుకింత పెద్దగా చేస్తున్నావో అర్ధం కావటం లేదు ..." అంటూ ఒక్క క్షణం తల్లి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాంటి సందర్భాల్లోనే తల్లి మీద కోపం వస్తుంది శ్రీహర్షకి. కోపం కన్న ఎక్కువగా తనేంచేసినా తల్లి అర్ధం చేసుకోదన్న బాధనే అధికంగా వుంటుంది అతనికి. అవాక్కయింది కాంచనమాల. సంకేత స్థాణువై - వెళ్తున్న శ్రీహర్ష వైపే చూసింది. కొడుకు తినకుండా వెళ్ళినందుకు కాంచనమాల కన్నీళ్ళు పెట్టుకుంది. నివ్వెరపోయింది సంకేత....ఈ కన్నీళ్ళు ఎందుకొస్తాయి? వీటిని నియంత్రించే మార్గమే లేదా? ప్రపంచ్చంలో ఇంత మంది శాస్త్రవేత్తలు వున్నారు. ఆసాక్తిగా అనిపించిన ప్రతి అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ కన్నీళ్ళ మీద ఎందుకు చెయ్యరు. దీనికో మంచి మందును కనిపెట్టి ఈ కన్నీళ్ళను అరికట్తవచ్చు కదా! వెంటనే కాంచనమాల తలను తన భుజంపై పెట్టుకొని ఓదార్చింది సంకేత. ఆ ఓదార్పు హాయిగా అనిపించి, దుఃఖం ఇంకా ఉదృతమైంది. ఆ దుఃఖాన్ని తమాయించుకుంటూ..."కొడుకు పుడితే అదృష్టం అని అందరూ అంటుంటే నమ్మి ఆనందించాను సంకేతా! నీ లాంటి కూతురు లేనందుకు ఇప్పుడు బాధ పడుతున్నాను". అంది "బాధ పడకండి ఆంటీ! దేన్నైనా తేలిగ్గా తీసుకోవాలి". అంది సంకేత. తేలిగ్గా ఎలా తీసుకుంటాం సంకెతా! అదే నువ్వు చూడుమీ అమ్మ, నాన్న దూరంగా ఉన్నా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసినదానిలా రక్తం ఇవ్వకుండానే వచ్చావు...అదే శ్రీహర్ష అలా రాగలిగాడా!ఏం చెయ్యను చెప్పు?" అంటూ ఆమె లోని అసంతృప్తిని బయటపెట్టింది. సంకేత మౌనంగా ఉంది. కాంచనమాల మాటల్ని వినగానే శ్రీహర్ష గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీహర్ష ఉన్నంత సేపూ సంకేత వైపు చూడలేదు. పలకరించలేదు. హడావిడిగా వచ్చాడు. అలాగే వెళ్లాడు. ఎప్పుడైనా తామిద్దరు తటస్థపడేది ఒక్క డైనింగ్ టేబుల్ దగ్గరే....అయినా అప్పుడప్పుడు తనే విష్ చేస్తుంది. అతను చెయ్యడు, ఎందుకని? ...అహంకారమా! లేక తను వాళ్ళ ఇంట్లో తింటూ డబ్బూ ఇవ్వకుండా చదువుకుంటుందన్న చులకన భావమా! లేక అతన్ని మించిన అందగాడు, అతన్ని మించిన సంపన్నుడు లేడనా! తను కూడా అతని లాగే బి.టెక్ చదువుతోంది, అంతో, ఇంతో అందంగా ఉంది. ఇలాగే చదివితే మంచి ఉద్యోగం కూడా వస్తుంది. ఈ అర్హతలు చాలవాతనతో మాట్లాడడానికి...ఏది ఏమైనా అతనలా ఉండడం మనస్సును చీరేసినంత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఇప్పటికీ తనలో పేదరికాన్నే చూస్తున్నాడు....అదేదో అంటరానితనం అయినట్లుదూరంగా పెడుతుంటాడు. పేదరికం అనేది కుటుంబ నేపథ్యం వల్లనో, అశక్తులైన తల్లి, దండ్రులవల్లనో వస్తుంది. అదేదో మహాపాపమో! నేరమో!అయినట్లు కనిపించిన ప్రతీ సారీ 'నువ్వెవరో నేనెవరో' అన్నట్లు ప్రవర్తించటం దేనికి? పేదరికం అనేది నేరమే అయితే ! పాపమే అయితే ఇండియా లో ఎంతమంది పేదవాళ్ళు లేరు! పేదవాళ్ల మనసుకు పేదతనం ఉంటుందా? చదువుకు పేదర్తనం ఉంటుందా? వ్యక్తిత్వానికి పేదతనం ఉంటుందా? మరి శ్రీహర్ష ఎందుకలా ప్రావర్తిస్తున్నాడు? ఖరీదైన డ్రస్ వేసుకోనంత మాత్రాన, ఖరీదైన జీవితాన్ని అనుభవించనంత మాత్రాన అంత చిన్న చూపు అవసరమా! ఇప్పుడే కాదు అతను తనతో పాటు ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో వేసవి సెలవుల్లో తమ ఊరు వచ్చినప్పుడు కూడా ఎగతాళిగా మాట్లాడాడు....ముఖం మీదే "సంకేతా! మీ ఊరిలో ఈ చింత తోపు, మామిడి వనం, కంది చేలు ఆడుకోడానికి బాగున్నాయి. కానీ మీ ఊరు నాకు నచ్చ లేదు. ఊరి నిండా చిన్న చిన్న 'హట్'లే ఉన్నాయి. అందులో మీ హౌస్ మరీ చిన్నది. చూడడానికి అస్స్సలు బాగాలేదు...మీ అమ్మా, నాన్న ఒక్క రోజు కూడా నీతో గడపకుండా పొలం పనులకి వెళ్ళడం ఇంకా బాగా లేదు... మా ఇంట్లో మా నాన్న ఆఫీసుకి వెళ్ళినా మా అమ్మ ఇంట్లో ఉంటుంది. ఒక వేళ మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ల ఊరెళ్ళినప్పుడు మా నానమ్మ నాకు కధలు చెబుతుంది. నీక చాన్స్ లేదు" అన్నాడు. తనకి కన్నీళ్ళొచ్చాయి. తనకి కూడా మంచి సంపాదన పరుడైన తండ్రి, కధలు చెప్పే నానమ్మ ఉంటే బావుండనిపించింది. తనకు లేని నానమ్మ శ్రీహర్షకు ఉన్నందుకు పైకి చెప్పుకోలేని వ్యధగా ఉంది. ఈ నానమ్మలు ఎక్కడ ఉన్నా కధలే చెబుతారా? అవి తప్ప ఇంకేఅం రావా వాళ్లకి...?తనకి కూడా ఒక నానమ్మ ఉంటే బావుండు కదా. శ్రీహర్షకి ఉన్నవన్నీ తనకి ఎందుకు లేవు? ఉన్నట్టుండి ఒక రోజు శ్రీహర్ష "సంకేతా! మీరు బాగా పేదవాళ్ళట కదా! అందుకే మీ అమ్మ నాన్న రోజూ కూలి పనికి వెళ్తారట ....నిజమేనా!" అన్నాడు. అన్నీ తెలుసుకోవలన్న ఆరటం ఉంటే మంచిదే కానీ ఇవి అంత తెలుసుకో తగిన విషయాలా? అతనికి ఎల ఉందో తెలియదు కానీ తనకి మాత్రం తనని ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలి తన బాధని? తను మాట్లాడకపోవడంతో...."ఇవన్నీ నాకెలా తెలుసు అనూంటున్నావా. నాది మీ ఊరు కాకపోయినా మీ ఊరి దాస్ నా క్లాస్ మేట్! వాడు నీ గురించి చెబుతుంటాడు. మన ముగ్గురం ఒకే హైస్కూల్లో చదువుతున్నాం కాబట్టి నేను కూడా ఆసక్తిగా వింటుంటాను. నువ్వు హైస్కూల్కి రావాలంటే మీ ప్రక్క ఊరికి రావాలి. నేను అలా కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తున్నాను. దాసు, నువ్వూ కలిసే వస్తుంటారు కాబట్టి వాడికి నీ గురించి బాగా తెలుసు. అవునూ!నిన్ను మీ వాళ్ళు పక్క ఊరికి తీసుకెళ్ళాలన్నా బస్ లో తీసుకెళ్ళరట కదా! చార్జీలకి డబ్బుల్లేక ఇసుక లారీ లో ఎక్కించుకెళతారుట.....నిజమేనా!ఇది కూడా వాడే చెప్పాడు. అవునూ..."మీ ఇంట్లో ఆడుకోవడానికి ఒక్క బొమ్మ కూడా లేదేం? నీకు పుట్టినరోజు పండుగలు చెయ్యరా మీ వాళ్ళు...? మీ బంధువులు కాని, తెలిసినవాళ్ళు కాని నీకు బొమ్మలు కొనివ్వరా?" అన్నాడు. "నేనేమైనా చిన్న పిల్లనా బొమ్మలతో ఆడుకోవటానికి..పుట్టిన రోజులాంటి పండుగలు మా ఇంట్లో జరుపుకోం! అలాంటివి మాకు ఇష్టం ఉండదు. దాస్ ఏం చెప్పినా అది నమ్మటమేనా! వినేవాళ్ళుంటే ఏమైనా చెబుతారని తెలియదా?" అంది కన్నీళ్ళాపుకుంటూ. "దాస్ నీగురించే ఎక్కువగా మాట్లాడుతాడు. నేను కూడా ఇష్టంగానే వింటాను. అది తప్పా...!"అనేవాడు. "ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం ఎంత వరకూ ఒప్పో నాకు తెలియదు...అంత అవసరమేంటో మీకే తెలియాలి.అయినా నా గురించి మీ ఇద్దరు అలా మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు."అని అనగానే శ్రీహర్ష మాటలు ఆపేశాడు. ఇక అప్పటినుండి మాట్లాడటమే మానేశాడు. తను తొమ్మిదవ తరగతికి రాగానే దాస్ ఒక రోజు తనకి దగారగా వచ్చి "ఐ లవ్ యు సంకేత!" అన్నాడు. ఆకాశం ఊడి మీదపడినట్లు అదిరిపడింది. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎవరికి చెప్పినా అర్ధం చేసుకోరు. పైగా తననే తప్పు పడతారు. అందుకే నేరుగా హెచ్.ఎం., దగారకి వెళ్ళి ఫిర్యాదు చేసింది. హెచ్.ఎం., దాస్ ను గట్టిగా మందలించాడు. అంతే కాదు లోగడ డయాస్ మీద జరిగిన అల్లరిని, ఆటస్థలం దగ్గర జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని వెంటనే దాస్ ను సస్పెండ్ చేశాడు. పీడ వదిలిందని సంబరపడింది. కానీ దాస్ ఇంట్లో చెప్పకుండా ఆ ఊరినుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. ఒక్క శ్రీహర్షకు తప్ప మిగిలిన స్నేహితులెవ్వరికి అతను అందుబాటులో లేడు. దాస్ ఎడబాటు శ్రీహర్ష కు పెద్ద లోటు అయింది. దాస్ ను గుర్తుచేసుకుంటూ అప్పుడప్పుడు ఒంటరిగా ఓచోటు కూర్చుని ఆలోచించేవాడు. ఆ వయసులో స్నేహితుని ఎడబాటు అనుభవిస్తేనే అర్ధమవుతుంది. ఒక్కో సారి 'ఏంటి శ్రీహర్షా! అలా ఉన్నావు?" అని ఎవరైనా అడిగితే 'దాస్ ఉంటే బావుండేదీ అని చెప్పేవాడు. శక్తి సరిపోవటం లేదు కానీ దాస్ కోసం ఏదైనా చెయ్యాలన్న ఆవేశం కూడా వచ్చేది అతనికి. కొద్ది రోజులు గడిచాకా శ్రీహర్ష తన పక్కనే నడుస్తూ కోపంగా "నువ్వు చేసిన పని రైటనుకుంటున్నావా? వాడేదో ఆవేశంలో వాగాడు....వాడు మాట్లాడింది తపే. తరువాత వాడు కూడా తనది తప్పని ఒప్పుకున్నాడు. నీకంత తొందరపాటు దేనికి? వాడలా అన్నప్పుడు నీవు కూడా ఏదో ఒకటి చెప్పాల్సింది. లేకుంటే మాతో చెప్పల్సింది. అదేంచెయ్యకుండా నేరుగా హెచ్.ఎం. దగ్గరకి వెళ్ళటమేనా! నీ ఒక్క కంప్లయింట్ తో చూడు వాడి జీవితమెలా గాడి తప్పిందో ! ఇంటికి దూరమయ్యడూ. చదువుకి దూరమయ్యడు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడో తెలుసా! హైదరాబాదులో ఇటుకలు మోస్తున్నాడు.,,దీన్ని బట్టి నీకు చాలా దూరంగా ఉండాలని మా క్లాసు అబ్బాయిలంతా అనుకుంటున్నారు. నువ్వేదో మా నాన్నగారి స్నేహితుని కూతురివని చెబుతున్నా...నెకంత బిల్డప్ అవసరం లేదు." అన్నడు గట్టిగా. ఆశ్చర్య పోతూ "నాది బిల్డప్పా!!పదవతరగతి కూడా పూర్తి చెయ్యని అతను నన్ను ప్రేమిస్తానని చెప్పి అల్లరి చెయ్యడం బాగుందా? ఐ లవ్ యు అంటే అర్ధం కూడా తెలియదు నా తల్లిదండ్రులకి. వాళ్ళకి దాని అర్ధం చెప్పి బాధ పెట్టమంటావా? హెచ్.ఎం కి చెప్పకుండా దాస్ ఎలా చెబితే అలా విని నన్ను నేను బాధ పెట్టుకోమంటావా!ఎలాగూ నేను పేదదాన్నని, మా ఇల్లు చిన్నదని, నా దగ్గర బొమ్మలు లేవని, నా పుస్తకాలు సెకండ్ హ్యాండ్ వని, స్కూల్ సెలవుల్లో నేను కూడా కూలి పనికి వెళ్తానని నువ్వూ దాస్ నవ్వుతూనే వున్నారు...ఇంకా నవ్వించుకోవటం ఎందుకు?నాకెందుకో ఎవ్వరు నన్ను చూసి నవ్వినా రోషంగా ఉంటోంది...నన్ను ఏడ్పించడం కోసమే నవ్వుతున్నారని అర్ధమవుతోంది. నా ఏడ్పులో ఏం కనిపించి అంత ఆనంద పడుతున్నారో నాకు తెలియటం లేదు...ఇప్పటికే నేను గట్టిగా రెండు గంటలు చదివితే మిగతా గంటలన్నీ దాస్ నా వెంట పడటం గురించి, నన్ను ఎగతాళి చేస్తున్నవాళ్ళగురించీఅలోచించటానికే సరిపోతుంది. నా ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు...అయినా నాకూ టైమొస్తుంది. అప్పుడు నా వెంట పడినవాళ్ళు, నన్ను గేలి చేసిన వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపపడతారు." అంది. శ్రీహర్ష కోపంగా వెళ్ళిపోయాడు. తొమ్మిదవ తరగతి నుండే తనకి పెళ్ళి సంబంధాలు వచ్చాయి. ఒక్క సంబంధం కూడా తన తల్లిదండ్రులకి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారాణం వాళ్ళుకూడా తమలాంటి పేదవాళే... ఆ సంబంధాలతో సంబంధం కలుపుకుంటే తను కూడా వాళ్ళ లాగా పొలం పనులకి వెళ్ళి బ్రతకాల్సి వస్తుందని గ్రహించి, వద్దనుకున్నారు. అదీకాక ఈ మధ్యన తమతో కలిసి కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు కొందరు తాము తమ తల్లిదండ్రుల్లా కాకూడదని కసితో చదివి సాఫ్ట్ వేర్ రంగాల్లోకీ, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ రంగాల్లోకి ప్రవేశిస్తున్నారట.దాని స్ఫూర్తిగా తీసుకొని తను కూడ ఏదో ఒక రంగంలో రాణించాలని వాళ్ళ కోరిక. ఆ తర్వాతే పెళ్ళి. అయినా పెళ్ళిదేముంది. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడితే ఏ అబ్బయి అయినా వస్తాడు. పెళ్ళి చేసుకుంటాడు అన్నదే వాళ్ళ అభిప్రాయం. ...తన పట్ల తల్లి దండ్రుల అభిప్రాయం ఒక వైపు, శ్రీహర్ష మౌనం మరోవైపు చేరి తనను మొండిగా తయారు చేశాయి. కష్టపడి చదివేలా చేశాయి. పోటీ తత్వాన్ని పెంచాయి... రోజులు గడుస్తున్నాయి. ఎంసెట్ లో శ్రీహర్ష కన్న తనే మంచి ర్యాంక్ సాధించింది. బి.టెక్ లో లో ఫ్రీ సీటు సంపాయించుకుంది... శ్రీహర్షకి జూనియర్ గా అతను చదువుతున్న కాలేజీ లోనే చదువుతోంది. ..అతను తనతో ఇంట్లో ఎలా ఉంటాడో కాలేజీలో కూడా అలాగే ఉంటున్నాడు. ఫష్టియర్ లో ర్యాగింగ్ కూడా చెయ్యలేదు...ఫ్రెషర్స్ పార్టీలో కూడా అంతే ! వెరీ నార్మల్! ఆఫ్ట్రాల్ నువ్వెంత? అన్నట్లే చూస్తున్నాడనిపిస్తోంది. అతనిలో మార్పు రావాలి. అందరమ్మాయిలతో మాట్లాడినట్లే తనతో మాట్లాడాలి, తననూ గుర్తించాలి...అందుకోసం తనేమైనా చెయ్యాలి. ఏమైనా అంటే ఐ మీన్ ఇంకా బాగా చదవాలి. శ్రీహర్ష ను మించి పోవాలి. చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ...ఇదే తపన, ఇదే ధ్యాస... జీవితంలో ఎప్పుడైనా దాస్ తటస్తపడితే, 'నేను ఆ రోజు సంకేతకి అలా చెప్పి ఉండాల్సింది కాదు. అలా చెప్పటం వల్లనే నా జీవితం అదఃపాతాళానికి పోయింది. ఆమె ఉన్నత శిఖరాలకి చేరింది.'అని అనుకోవాలి. శ్రీహర్ష అలా అనుకోక పోయినా మనస్ఫూర్తిగా మాట్లాడగలగాలి..చదువుతో దేన్నైనా సాధించవచ్చట... దేన్నైనా అధిగమించవచ్చట... దేన్నైనా చేరుకోవచ్చట... అందుకే చదువును మించింది లేదు. చదువుల దారిని మించిన దారి లేదు. ఇప్పుడు తన ధ్యేయం, లక్ష్యం అంతా చదువే. కాంచనమాల సంకేతను ఒకటికి రెండు సార్లు పిలవటం తో మూడవసారి ఉలిక్కిపడి 'ఊ' అంటూ గతంలోంచి బయట పడింది సంకేత. "ఏమాలోచిస్తున్నావ్ సంకేత?" అంది కాంచనమాల. "ఏం లేదు ఆంటీ ! నాకు చదివేది ఉంది. నేను వెళ్ళాలి " . అంటూ అక్కడి నుండి లేచింది. సంకేత తప్ప తన గోడు ఇంకెవరు వింటారు అన్నట్లు నిరాశగా చూసి స్నేహితులవల్లనే తన కొడుకు చెడిపోతున్నాడని నిర్ధారణకి వచ్చింది కాంచనమాల. "చిన్నప్పుడంతా దాస్ గాడితో తిరిగేవాడు. ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నాడో ఏమో! దాస్ గాడితో తిరిగినన్ని రోజులు క్రికెట్ జబ్బును తగిలించుకొని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు చూసినా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ల చుట్టూ తిరిగేవాడు ఎటూ వెళ్ళకుండా కట్టుదిట్టం చేస్తే పక్కింటికెళ్ళి టీ. వీ ముందు కూర్చొనేవాడు. దాస్ వాడికి తోక ... శ్రీహర్ష ను తీసుకొద్దామని పక్కింటికి వెళ్తే ఒకవైపు టీ.వీ చూస్తూనే ఇంకో వైపు 'క్రికెట్ విజేతలే ప్రపంచ విజేతలూ ఆంటీ ! మహా చక్రవర్తులు కూడా ... క్రీడాస్ఫూర్తి క్రీడాకరులకన్నా ప్రేక్షకులమైన మనకే ఎక్కువ ఉండాలి. క్రికెట్ చూడని జన్మ జన్మే కాదు ...." అంటూ దాస్ గాడు చేసే దిక్కుమాలిన కామెంటరీ వినాల్సి వచ్చేది. శ్రీహర్ష అయితే నిద్దట్లో కూడా ఫోర్లు, సిక్స్ లు, సెంచరీలు అని కలవరిస్తూ స్టేడియంలో ఉన్నట్లు కేకలేసేవాడు. ...తనకేమో శ్రీహర్ష స్కూలు , సిలబస్ లు, పరీక్షలు గుర్తొచ్చి ఒకటే గుండె దడ ....అయినా ఈ పిల్లలకి వరల్డ్ కప్ ముఖ్యమా ! చదువు ముఖ్యమా! అని తనలో తను అనుకుంటుంటే... దాస్ నవ్వుతూ తనవైపే చూస్తూ"ఆంటీ! నీకో విషయం చెప్పనా! తొలి ప్రపంచ కప్ 1975 లో జరిగిందని అందరూ అనుకుంటారు కానీ నిజానికి 1973 లోనే జరిగిందట....అదికూడా పురుషుల ప్రపంచ కప్ కాదట..మహిళలది. ఆతిధ్య ఇంగ్లాండే ఆ కప్ ను ఎగరేసుకొని పోయిందట.....దీన్ని బట్టి మీ అడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే..."అనేవాడు. అది వినగానే కాంచనమాల వాడి వైపు ఉరిమి చూసి " నూటికో కోటికో ఒక్కరన్నట్లు అవిడెవరో కప్పు గెలిచిందని ఆడవాళ్ళందరం క్రికెట్ ఆడతామా ! ఒరేయ్ ! దాస్ గా నీ వల్ల నాకొడుకు చెడిపోతున్నాడు. మాట్లాడటానికి క్రికెట్ గురించి తప్ప నీ దగ్గర ఇంకేమీ లేవురా?" అనేది. దాస్ హుషారుగా ఆమెనే చూస్తూ "ఇంకేమున్నాయి ఆంటీ!ఊ..ఉండండి ఆలోచించి చెపుతా! జనాభా లో 34 శాతానికి పైగా ఉన్న యువతకు ఉపాధిపరంగా సరైన దశానిర్దేశం కరువైందట. ఇది వారిని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి చేస్తోందట. ఇప్పుడున్న అశాంతికి, సమస్యలకి అదే కారణమట.....దీనికి మీరేమైనా చేయగలరా? చెయ్యగలిగితే మీరు దీని గురించి ఆలోచించండి! మేము క్రికెట్ చూసుకుంటాము!" అనేవాడు టీ.వీ ముందు కూర్చుంటూ...అమె ఆశ్చర్యంగా గుడ్లువెళ్ళబెట్టి "ఓరి!పిడుగా! నువ్వు చాలా ముదుర్రా! టెంత్ క్లాస్ కి వచ్చావ్! క్లాస్ పుస్తకాలు చదువుకోవటం తగ్గించి దేశంలో జరిగేవన్నీ నీకెందుకురా!అంటూ కర్ర పుచ్చుకొని తరిమినట్లే వెంటపడేది. వాళ్ళామె గొంతుకి భయపడేవాళ్ళు ...వాళ్ళంతా స్థిరంగా కూర్చుని 'ఉన్న ఇంటికి కప్పు ఉందా లేదా? అన్న దాన్ని కన్నా ఉన్న దేశానికి కప్పు వస్తుందా లేదా అన్నట్లు ...'నరాలు తెగే ఉత్కంఠతో టీ.వీ. చూస్తూ కూడా తేనె తుట్టు పై రాయి పడట్టు తలో వైపూ పరిగెత్తే వారు. అది చూసి తన భర్త పక్కింట్లో ఉన్న తనని పిలిచి..."అబ్బా! కాంచనా! పిల్లల్ని ఎందుకలా తరుముతావు?చదువుతప్ప మా అమ్మకి సంతోషం అక్కర్లేదు అనుకోడా శ్రీహర్ష. చదువు ముఖ్యం అని వాళ్ళకి తెలియదా? మనమే కాదు టీచర్లు కూడా ఈ విషయం చెబుతూనేవుంటారు. కానీ ఎంత సేపు చదువుతారు. ఎప్పుడైనా సరే! మైండ్ ఎక్కువ వత్తిడి కావాలనుకోదు. కాస్త రిలాక్సేషన్ కోరుకుంటుంది...కాకపోతే మరీ ప్రత్యక్ష ప్రసారం చూడకుండా హైలైట్స్ చూడమని నెమ్మదిగా చెప్పు... నువ్వు చెప్పినట్లే నేను టీ.వీ. కొనలేదు. కనీసం వాడ్ని ఫ్రెండ్స్ తోనైనా తిరగనీ..." అంటూ కొడుకుని వెంటేసుకొచ్చేవాడు. ...తనేది చెప్పినా ఆయన అలాగే మాట్లాడతాడు. మరి అటువంటప్పుడు తనీ రక్తదానం విషయం చెబితే కొడుకుని కేకలేస్తాడా? వెయ్యడు తననే విసుక్కుంటాడు. వీళ్లందరికీ ఇదో పెద్ద జబ్బు. తనేం మాట్లాడినా రాక్షసిని చూసినట్లు చూస్తారు. కాంచనమాలకి అదంతా గుర్తొచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళంత తనకేదో యాంటీస్క్వాడ్ అయినట్లు నీరసం ఎక్కువైంది. నెమ్మదిగా అక్కడినుంచి లేచి పక్కకి వెళ్ళింది. ఈ లోపల నీలిమ వెళ్ళి వరమ్మను పిలవగానే ఆమె వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. వరమ్మకి అన్నం పెట్టి తను కూడా తింటూ కూర్చుంది నీలిమ. ఎప్పుడైనా అంతే. ఆ ఇంట్లో అందరూ తిన్న తర్వాతనే వరమ్మ, నీలిమ కలిసి కూర్చుని తింటారు. అందరితోపాటు వరమ్మకి పెడితే కాంచనమాల ఊరుకోదు.,,,పైగా..."ఆ ముసలమ్మను అందరికంటే త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకురాకు. మేమంతా తిని వెళ్ళాకనే తీసుకురా!" అంటుంది. అదేదో వరమ్మ అంటరానిదైనట్లు. మనిషికి ముసలితనం వచ్చినంత మాత్రాన అంతదూరంగా చూడాలా? మనిషికి ఏది వస్తుందో ఏది రాదో గ్యారంటీ ఇవ్వగలం గానీ ముసలితనం రాదన్న గ్యారంటీని ఇవ్వలేం ! గత ఐదు సంవత్సరాలుగా వరమ్మను అలాగే చూస్తోంది కాంచనమాల...వరమ్మ భర్త రామారావు చనిపోకముందు ఎంతో గౌరవంగా , ఎంతో వినయంగా 'అత్తయ్యా! అత్తమ్మా!" అని పిలిచిన కాంచనమాల ఇప్పుడు 'ముసలిదానా ! ముసలిపీనుగా!' అని సంభోదిస్తుంటే వినటానికి ఏమాత్రం బాగుండటం లేదు నీలిమకు....వరమ్మ కూడా తన ముఖాన్ని బాధగా పెట్టుకుంటుంది... పిలుపు ఆత్మీయంగా ఉంటేనే కదా ఎలాంటి హృదయంలోనైనా సప్తసముద్రాలు ఉప్పొంగేది. అదే సరిగా లేనప్పుడు ఆ హృదయంలో పుట్టే ఘోషకి భాష ఉంటుందా? తల వంచుకొని నిస్సహాయంగా భరించట తప్ప కోడలిని ఏమీ అనదు వరమ్మ... అప్పుడప్పుడు నీలిమతో మాత్రం "నా చిన్నప్పటి నుండి చదువు, పెళ్ళి, సంసారం, పిల్లలు, ఆత్మీయుల బాగోగులు అంటూ మూడొంతుల జీవితాన్ని గడిపేశాను నీలిమా! కనీసం ఇప్పుడైనా మంచి వాతావరణం లో విశ్రాంతి తీసుకోవాలని ...హాయిగా నవ్వుకోవాలని...పదిమందికి ఉపయోగపడే పనులు చెయ్యాలని ఉన్నా స్వేచ్చ లేని బ్రతుకు అయ్యింది. నా స్నేహితురాళ్ళు ఈ వయస్సులో కూడా నాలాగా ఉందకుండా పూర్తి స్వేచ్చతో వాళ్ళ అలోచనలకి తగినట్లు మహిళా మండలి సభ్యులతో కలసి సమావేశాలు అవ్వటం.. అనాధ శరణాలయాలకి వెళ్ళి చిన్నపిల్లల అవసరాలు తీర్చటం...వృద్ధాశ్రమాలకి వెళ్ళి పండ్లు పంచి రావడం లాంటివి చేస్తుంటారు." అంటుంది. నీలిమ ఆశ్చర్యపోతూ "మరి మీరెందుకు ఇలా కాంచన మేడం కి భయపడుతూ, మీతో ఎవరికి ఏ ఉపయోగం లేనట్లు ఉంటారు? అని అడిగితే! "అది విధి అనాలో, నా అసమర్ధత అనాలోతెలియదు కానీ, నా స్నేహితురాళ్ళు యుక్తవయస్సులో ఉన్నప్పుడు కూడా నా కన్నా ధైర్యంగా ఉండేవాళ్ళు....జీవితాన్ని ఓ సవాల్ గా తీసుకొని ప్రశ్నించటం అలవాటు చేసుకున్నారు. నేను మాత్రం ప్రతి ప్రశ్నకూ సమాధానం నేనే అయినట్లు నా భర్తకి వండిపెట్టి, నా కొడుక్కి వండిపెట్టి తరించాను. చివరకి ఈ మెట్లకిందకి చేరాను. ఇక్కడేమో రాత్రీ-పగలు తేడా లేకుండా దోమలు కుడుతున్నాయి." అని నిస్పృహగా అనేది వరమ్మ. వరమ్మ బాధను చూడలేక ప్రతిరోజూ మస్కిటో కాయిల్ వెలిగిచ్చి ఆమె మంచంకింద పెట్టేది నీలిమ...వరమ్మకు మనశ్శాంతి తగ్గకుండా ఉండాలని కొద్ది సేపు యోగా చేయించి, చిన్న చిన్న వ్యాయామాలు చేపించేది....కాంచనమాల అది చూసి విస్తుపోతూ 'వికృతపు చేష్టలంటే ఇవే! టె.వీ లు చూసి చెడిపోతున్నారు జనాలు అంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్నిద్దర్నీ చూస్తుంటే అది నిజమనిపిస్తోంది. ఆవిడగారిని బాదీ బిల్డర్ పోటీకేమైనా పంపుతావా వచ్చి పని చూడు !" అని గట్టిగా కేకలేసేది. అంత వయసు వచ్చినా వరమ్మ జుట్టు వత్తుగా, తెల్లగా వంకీలు తిరిగి ఉంటుంది...సరైన పోషణ లేక పేలు పడుతుంటే అది చూదలేక మెడికేర్ పూసి షాంపూతో తలస్నానం చేయించి, ఎందలో తల ఆరే దాకా కూర్చోబెట్టి తలదువ్వుతుంది నీలిమ....అప్పుడు కాంచనమాల చూస్తే మాత్రం వ్యంగ్యంగా "అంతసేపు ఏం చేస్తున్నావక్కద?ఎంగేజ్మెంట్ కోసం పెళ్ళికాని పిల్లకి మేకప్ చేస్తున్నట్లుంది నీ హడావిడి...సంబరం బాగానే వుంది....మార్కెట్ కి వెళ్ళే టైం అయ్యింది రా! త్వరగా!" అంటుంది. కాంచనమాల ఎన్ని తిట్టినా వరమ్మకి చేసే పనులు చేస్తూనే ఉంటుంది నీలిమ. కోడలు ఏం మాట్లాడినా నోరెత్తదు వరమ్మ....మనసుకి ఎంత నొప్పి కలిగినా మౌనంగానే భరిస్తుంది....నిస్సహాయంగా చూస్తుంది. మెల్లగా లేచి హాలు లోకి వెళ్ళి టీపాయ్ కింద ఉన్న నిన్నటి పేపర్ని తెచ్చుకొని క్షుణ్ణంగా చదువుకుంటుంది. ఏ రోజు పేపర్ ఆ రోజు చదవాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని విసుక్కుంటారేమో అని ఆమె భావన. సాధ్యమైనంతవరకు తననెవ్వరు విసుక్కోకుండా తన ప్రవర్తనలో మార్పులు చేసుకుంటుంది. ప్రతిదీ సున్నితంగా ఆలోచిన్స్తుంది.... అదేం అంటే "ఇది జీవితం నీలిమా! జీవితం అంటే ఏమిటో అర్ధం కాక ముందే అందరి తల్లుల్లాగే నేను కూడా పిల్లల్ని కన్నాను. పెంచాను. వాళ్ళే సర్వస్వం అనుకున్నాను. మొక్కను వృక్షాన్ని చేసి ఆ నీడ లో సేదదీరాలన్నట్లు కొడుక్కి పెళ్ళి చేశాను. వాడి పెళ్ళితో నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. అది నేను ఊహించని జీవితం. కాంచనలో నాకు కూతురు కనిపించలేదు. స్నేహితురాలు కనిపించలేదు. చివరకి కోడలు కూడా కనిపించలేదు. శత్రువు కంపించింది. ఆ శత్రువుతో రోజూ యుద్ధమే. నా కొడుకు నాతో మాట్లాడితే ఒప్పుకోదు....మీ అమ్మ అంటేనే మీకు ఇష్టం!మీ అమ్మతో మాట్లాడినంత ప్రేమగా నాతో మాట్లాడరు. ఆవిడ వల్లనే నా మీద మీకు ప్రేమ తగ్గుతోంది. అది మీ అమ్మకు అర్ధమయ్యే నన్ను చిన్న చూపు చూస్తోంది. ఎంతయినా నేను పరాయి దాన్ని....నన్ను మీకు దూరంగానే ఉండనీయండి. " అంటూ నా కొడుకుని దగ్గరకి రానిచ్చేది కాదు....నరకం చూపించేది. భార్య ఉన్న ఏ మగాడికైనా ఇలాంటి మాటలు మనస్సుపై ఒత్తిడిని పెంచుతాయి. ఆ ఒత్తిడి ప్రభావం పాజిటివ్ గానైనా ఉండవచ్చు, నెగటివ్ గానైనా ఉండవచు. నా కొడుకు బాధను చూడలేక నా కొడుకుతో మాట్లాడడం మానేశాను. ప్రతి చిన్న విషయాన్ని నా కొడుకుతో పంచుకుంటూ గడపిన నేను అకస్మాత్ గా నా కొడుకు తో మాట్లాడకుండా ఎలా ఉండాలి.ఇదెంత నరకం? అయినా ఉన్నాను. మనసు రాయిని చేసుకున్నాను. కానీ ఒక్కోసారి ఎంత గట్టిగా ఉందామన్నాశిలను ఉలితో చెక్కినాట్లు ఏదో బాధ! తల్లడిల్లే బాధ!ఏ తల్లికైనా ఇంతకు మించి శిక్ష ఉండదు. కాంచన నా కడుపున పుట్టలేదు కాబట్టి నన్ను ప్రేమగా చూడకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా, మంచంపై దుప్పటి వెయ్యకపోయినా నాకు ఏమీ అనిపించదు. కానీ నా కొడుకు నా కడుపున పుట్టాడు కదా! వాడికి నేను ఏమీ కాని దానిలా ఎలా ఉండాలి? ఉండలేక దగ్గరవుదామన్నా కాంచన దూరమౌతుందన్న భయం. కాంచన నాకే కానీ, నా కొడుక్కీ, మనవడికీ శత్రువు కాదు....భార్యగా, అమ్మగా ఆమె పాత్రలు ఆమెకున్నాయి. వాటిని మనసా, వాచా తను నిర్వహించాలంటే నేను పంటికింద రాయిలా అంపిస్తున్నాను. అది నా కర్మ. కానీ శ్రీహర్షకి నేనంటే ఇష్టం. నా మనవడిని ఎక్కువగా నేనే పెంచాను. అప్పుడు వాడికి నా అవసరం ఉంది కాబట్టి వాడి పనిని తప్పించుకోవటం కోసం శ్రీహర్షను నాదగ్గరకి రానిచ్చేది...నా కొడుకును మాత్రం నా దగ్గరకి రానిచ్చేది కాదు..ఇలా తల్లికి కొడుకుని దూరం చేసి చాలా మేధావి పని చేస్తున్నాం అనుకునే కాంచన లాంటి కోడళ్ళకి తెలియని ఒక రహస్యం నీకు చెప్పనా నీలిమా! తన తల్లిని అభిమానంగా చూడలేని వాడు భార్యని ప్రేమించలేడు. నటిస్తాడు. ఆ నటనే ప్రేమ అనుకొని నమ్మి నిజమైన ప్రేమకు దూరమౌతున్నారు చాలా మంది భార్యలు. ఇలా నటనకి అలవాటు పడకుండా అత్తల్ని గౌరవించి భర్తలలోని నిజమైన ప్రేమను పొందగలిగే భార్యలు ఎందరున్నారు చెప్పు! అందుకే ఈ మానవ సంబధాలలో మమకారం మాయమౌతోంది. మాయమాత్రమే మిగులుతోంది. ఈ మాయకోసం నిత్యం నటించే అత్తలు ఉన్నారు. కోడళ్ళు ఉన్నారు. భర్తలు ఉన్నారు. భార్యలు ఉన్నారు. అందులో నేనొకదాన్ని." అంటూ బాధపడుతుంది. ఆమె అలా బాధపడుతుంటే, స్పందించే మనసు ఉండికూడా తనేం చేయలేకపోతోంది. తనకేమాత్రం పవర్స్ ఉన్నా కాంచన లాంటి కోడళ్ళకి బుద్ధి చెప్పాలనిపిస్తోంది.ఒక్కోసారి వరమ్మ చెప్పే జీవిత పాఠాలని వింటుంటే వీటిని కాలేజీ పాఠాలలో చేరిస్తే బావుండుకదా అనిపిస్తుంది. అయినా పైకి కనబడకుండా మనసు నడిపే మానవ జీవితం అనే మహానాటకన్ని పాఠాలుగా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ కాలేజీలు, ఈ యునివర్సిటీలు సరిపోతాయా? ఆలోచిస్తోంది నీలిమ. "అన్నం తిను నీలిమా!" అని వరమ్మ నీలిమను చేతిమీద తట్టగనే మన లోకం లోకి వచ్చింది నీలిమ. నీలిమ, వరమ్మ, కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం తిన్నారు. కొడుకు రక్తదానం చేసి వచ్చాడన్న కోపంతో గట్టిగా రెండు ముద్దలు కూడా తినని కాంచనమాలకు మాత్రం కడుపులో ఆకలి మొదలైంది. *------*------*--------*----------* ...నీలిమ ఇంటి పనులు చేసుకుంటూ తీరిక లేకుండా ఉంది. సంకేత కాలేజీకి వెళ్ళింది. సెకండ్ అవర్ లేకపోవడంతో హిందూ, పల్లవి, సంకేత, ఇంకా కొంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారు. పల్లవి ఎవరికోసమో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూసి... "ఇవాళ శివాని రాలేదా?" అంది అందరి ముఖాల్లోకి చూస్తూ ... వాళ్ళలో హిందూ "శివాని వచ్చింది, శ్రావ్య రాలేదు" అంది. "శ్రావ్య ఎందుకు రాలేదు?శివాని వచ్చినా కనిపించదు ఎందుకు? అంది పల్లవి అదేదో మిష్టరీ అయినట్లు! దాన్నిప్పుడే చేదించాలన్నట్లు....పల్లవికి, శివాని అంటే ఎప్పుడూ అనుమానమే! ...హిందూ చాలా మామూలుగా చూస్తూ "శ్రావ్య వాళ్ళ మమ్మీకి హెల్త్ ప్రాబ్లం అనో ఏదో సం రీజన్ చెప్పింది. నాకు తెలిసి దానికి ఇంట్లో ఉండాలనిపించిన ప్రతీ సారి అదే కారనం చెబుతుంది. నో ప్రాబ్లం! శివాని మాత్రం ఇప్పుడే ఎటో వెళ్ళింది" అంది. వాళ్ళలో ఒక అమ్మాయి ఇయర్ ఫోన్స్ తీసి ఒళ్ళోపెట్టుకుంటూ "శివాని వెళ్ళింది ఎటో కాదు. తన బాయ్ ఫ్రెండ్ రూంకి....వెళ్ళేటప్పుడు నాకు చెప్పే వెళ్ళింది" అంది. వాళ్ళలో ఒక అమ్మాయి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టి "బాయ్ ఫ్రెండ్ రూంకా? శివాని ఏంటే మరీ ఇంత ఛేంజ్ అయింది. ఎంత అడ్వాన్స్డ్ అయితే మాత్రం, ఎంత ఫాస్ట్ అయితే మాత్రం, ఇంత ఘోరమా?"అంది. ఆ అమ్మాయి చేతి మీద టప్పున కొట్టి "అబ్బా!నువ్వుండవే! నీకు ప్రతీదీ ఆశ్చర్యమే! శివాని ఏమని చెప్పిందో నువ్వు చెప్పవే!" అంటూ హెడ్సెట్ పెట్టుకున్న అమయివైపు చూసింది ఇంకో అమ్మాయి. వింటర్ వస్తోంది కదా! శివాని వాళ్ళ హాస్టల్లో సెల్ఫోన్ చార్జింగ్ కోసం ఒకే ఒక కనెక్షన్ ఉందట.....తనకి హీటర్ పెట్టుకోటానికి వీలు కావటం లేదుట..." అంటూ ఆగింది హెడ్ ఫోన్స్ అమ్మాయి. మిగతా అమ్మాయిలు ఉలిక్కి పడి "వీలు కకపోతే స్నానం కూడా బాయ్ ఫ్రెండ్ రూంలోనే చేస్తుందటనా...! ఇది మరీ విడ్డూరంగా లేదూ?" అన్నారు కళ్ళు ఇంతింత చేసి చూస్తూ. 'ఛ..ఛ అలా ఎందుకు చేస్తుంది? మీకేమైనా బుద్ధి ఉందా ఇలాంటి కొశ్చన్స్ వేస్తున్నారు?' అంది హెడ్ సెట్ అమ్మాయి దబాయింపుగా. "మరేంటో త్వరగా చెప్పు! మేం వెయిట్ చేయలేం!" అన్నారు మిగతా అమ్మాయిలు టెన్షన్ గా చూస్తూ. "స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని వస్తుందట..." చాలా నింపాదిగా చెప్పింది. "ఆ మాత్రం కనెక్షన్ ఇవ్వటం రాదా శివానికి?బి.టెక్. చదువుతోంది...!"అంది పల్లవి వెంటనే... "అందరూ నీ అంత ఫాస్ట్ అనుకుంటున్నావా?" అంది హిందూ. "అయినా హీటర్లు పెడితే హాస్టల్లో ఒప్పుకోరు కదే!" అంది పల్లవి. "అదేమైనా హాస్టల్ లో వాళ్ళు చూసేలా హీటర్ పెడుతుందా ఒప్పుకోకపోవటానికి...! అమ్మయిలంతా నిద్రలేవక ముందే నిద్రలేచి డోర్ పెట్టుకొని దాని కష్టాలేవో అది పడుతుంది". "మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ రాదా?" వస్తే ఏం! అదేమైనా కడుతుందా? సొమ్మొకడిదీసోకొకడిది....అంతే కానీ'నేను హేటర్ పెట్టి దొంగ కరెంట్ వాడుకున్నానహో! నేను దొంగని....' అని హీటర్ మెళ్ళో వేసుకొని తిరుగుతుందా! దొరికేంత వరకూ అది దొరే! అయినా అది దొరకటం అంత ఈజీ కాదు..." "ఎందుకని...?" "వాళ్ళ హాస్టల్లో అమ్మాయిలకి తన లాప్ టాప్ లో రోజుకో సినిమా చూపించి వాళ్ళను ఇంప్రెస్ చేస్తోంది. అందుకే అది చేసే దొంగ పనులు రహస్యంగా ఉంటున్నాయి. ప్రపంచంలో జరిగే దొంగతనాలన్నీ అలా ఇంప్రెసయ్యే గోప్యంగా ఉంటున్నాయట. దానికెవరు బాధ్యులు? అయినా ఎవరి దొంగ పనులకి వాళ్ళే బాధ్యులు అనే రోజులా ఇవి?" "చ...ఊరుకో, అమ్మాయిల దగ్గర అంత సీనుండదు..." "మన శివాని లాంటి అమ్మాయిల దగ్గర లేని సీనుండదు...అంతా రచ్చ రచ్చే..." "ఏంటే! శివాని గురించి ఇది ఇలా చెబుతోంది? అది విన్నదంటే దీని పని ....?" అంది భయపడుతూ పల్లవికి ఎదురుగా కూర్చొని ఉన్న అమ్మాయి. "విన్నా అదేం ఫీల్ కాదు. నువ్వేం ఫీలవ్వకు. శివానికి ఇలాంటివి చున్నీలు వెయ్యకముందు నుండే అలవాటు...అది బేకరీలో కర్రీపఫ్ తింటున్నప్పుడు మనం కళ్ళారా చూసి అడిగినా "నేను తినలేదు" అనే అంటుంది. నువ్వేమైనా సాక్ష్యం చెప్పగలవా?" అంది హిందూ పలవినే టార్గెట్ పెట్టుకునంట్లు చూస్తూ. "పల్లవి "అబ్బో...! నా వల్ల కాదు. ఈ వరల్డ్ నిండా నాలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకలా ఇరుక్కోవడం ఇష్టం ఉండదు. చూసినా చూడలేదనే చెబుతాను నేను..." అంది. "ఇది మరీ డేంజర్! అందుకే దేశం ఇలా తగలపడి పోతోంది. దేశమే కాదు. దేశంతో పాటు కొందరు అమ్మాయిలు కూడా...!" అంది హిందూ. పల్లవి తిన్నగా కూర్చుని సూటిగా చూస్తూ "నన్నలా మెన్షన్ చేయకు..నేను ఫీలౌతా! ఆకలై కర్రీ పఫ్ తింటే తప్పెంటి? అది మళ్ళీ పైకి చెప్పి వేలెత్తి చూపాలా? ఏం నువ్వు తినవా? తినాలనిపించి తినలేకపోయినప్పుడు కలిగే బాధ తెలిస్తే నువ్విలా చిన్న చిన్న విషయాలను బట్టబయలు చేయవు...శివానికి హాట్ వాటర్ తో స్నానం చేయాలని ఉంది. చెయ్యనీయ్! దాని ఎంజాయ్ దానిది. అది దొంగతనం కూడా చెయ్యొద్దా...? చెబితే ఎలాగూ చేయనివ్వరు. డబ్బులు కట్టమంటారు. కట్టే డబ్బులు చాలక మళ్ళీ ఇదొక లాసా! ప్రతి దానికి డబులు కట్టుకుంటూ నీలాంటి అమాయకులు ఉంటారు కాని శివాని లాంటి మేధవులకి అలాంటి కర్మేంటి?" అంది. ఆ మాటలు వింటుంటే సంకేతకి ఆశ్చర్యంగా ఉంది. తను లేని టైం లో తన గురించి తన ఫ్రెండ్స్ ఇలా మాట్లడుకుంటారని శివానికి తెలుసా? తెలిసి కూడా ఇలా చేస్తుందా? వెంటనే హిందూ"కర్మని ఎవరన్నారు? ఒక్క హేటరే కాదు. శివాని తన కాలేజి బ్యాగ్లో రోజుకో లాప్ టాప్ పెట్టుకొని హాస్టల్ కి తెస్తుంది. వాటిల్లో తన బాయ్ ఫ్రెండ్ ది ఒకటి. మిగతావి, బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ వి...వాటికి రాత్రంతా హాస్టల్లో చార్జింగ్ పెట్టి తెల్లవారి తీసుకెళ్ళి అదే కాలేజి బ్యాగ్ లో వాళ్ళ లాప్ టాప్ లు వాళ్ళకి ఇస్తుందట. దాని వల్ల ఎవరికి నష్టం?" అంది హిందూ. "దానికి కాదుగా! హాస్టల్ వాళ్ళకేగా ! నీకేంటి బాధ?" అంది హెడ్ సెట్ అమ్మాయి కొంచెం సీరియస్ గా. "నువ్వెందుకింత సీరియసై దాన్ని సపోర్ట్ చేస్తున్నావో నాకు తెలుసు. శివాని ప్రతి రోజూ రీచర్జి కర్డులు కొని, నెట్ కనెక్షన్ ఇచ్చి నైటంతా మీ అందరికీ చెత్త ఫిలింస్ చూపిస్తుంది...దాని వల్ల మీ మైండ్ బాక్స్ కి ఎప్పుడో ఇంఫెక్షన్ వచ్చింది మంచి యాంటీ బయాటిక్ పడాలి. లేకుంటే నువ్వు పనికిరావు..." అంది హిందూ అంతకన్నా సీరియస్ గా. దేనికి పనికిరనో చెప్పు! నువ్వు చెప్పలేవు. నీకు తెలియని ప్రపంచాన్ని శివాని ద్వారా మేము తెలుసుకుంటునామని నీకు అసూయ. చేతకాని వాళ్ళే నీలాగా మాట్లాడతారు. నువ్వెలాగూ ఎంజాయ్ చేయలేవు. చేసే వాళ్ళనైనా చేయనీయ్!" అంది గట్టిగా హెడ్ సెట్ అమ్మాయి. "మా రూం అమాయిలు కూడా శివాని దగ్గరకి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుందాం! అని వెళ్తుంటారు... లాప్ టాప్ లతో పనిలేకుండా ప్రాజెక్ట్ వర్క్ చెయ్యలేమా? నోర్లు మూసుకొని కళ్ళప్పగించి కంటిన్యూస్ గా లాప్ టాప్ ముందు కూర్చోవాలా?" అంది హిందు. “నువ్వు ప్రతిదీ నీ వైపు నుండే ఆలోచిస్తుంటావు హిందూ..! అందుకే నిన్నెవరూ పట్టించుకోరు....దానివల్ల నీకేం నష్టం ?ఇప్పటి ట్రెండ్ కి శివాని లాంటి వాళ్ళే కావలి. అందుకే తనదగ్గరకి వెళ్తుంటారు అందరూ... దాన్ని పేరంట్స్ ఆపలేరు. లెక్చరర్స్ ఆపలేరు. చివరకి ప్రొఫెసర్లు, హెచ్. ఓ. డి లు కూడా ఆపలేరు. అసలు ఇలాంటి విషయాలు వాళ్ళదాకా వెళ్ళనే వెళ్ళవు....సీక్రెట్ ! సీక్రెట్!” అంది పల్లవి. “నాకేం నష్టం లేదు. ఆ చూసుకొనే లాప్ టాప్ ఏదో తన బాయ్ ఫ్రెండ్ రూం లోనే చూసుకోవచ్చుకదా! దాన్ని హాస్టల్ కి తేవడం.. చదువుకొంటున్న అమ్మాయిలకి చూపించి వాళ్ళను పాడు చేయడం...అవసరాలకోసమో, అభిరుచులకోసమో, ఎంపిక చేసుకున్న బాయ్ ఫ్రెండ్ ని వాడుకున్నట్లే హాస్టల్లో విద్యుత్ ని వాడుకోవటం.... నాకెందుకో నచ్చటం లేదు...మనం ఎకాడెక్కడ నుంచో వచ్చి హాస్టల్లో వుండి చదువుకుంటున్నాం. మన తలిదండ్రులు మన మీద ఖర్చు పెడుతున్న ప్రతి పైసా పై వాళ్ళకెన్నో ఆశలు వుంటాయి. మనం చేసే ప్రతి పనికి ఫలితం రూపం లో ఎప్పుడో ఒకప్పుడు బయటకి వస్తుందట. అది నష్టం రూపంలో కాని, లాభం రూపం లో కాని. అందుకే మనం మన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలి. హాస్టల్ని సద్వినియోగం చేసుకోవాలి. క్లాసు లో చెప్పేవన్నీబుర్రలోకి శ్రద్ధగా నింపుకోవాలి....అంతే కాని శివానిని గైడ్ గా తీసుకోవద్దు." అంటూ ఆగింది హిందూ. "నీ దిక్కు మాలిన సలహాలతో మా ఆనందం పై నీళ్ళు చల్లకు....ఇప్పటికే శివాని లాప్ టాప్ కి మేమంతా ఎడిక్ట్ అయ్యి వున్నాం.....అది ఒక్క రోజు లాప్ టాప్ తేకపోతే కొకైన్ డ్రగ్ తీసుకోకపోతే నరాలు గుంజి నట్లుంటుంది. మా పరిస్థితి" అంది హెడ్ సెట్ అమ్మాయి. "కాదు. ఫస్టియర్లో వున్న పర్సంటేజ్ శివానికి ఈ ఇయర్లో లేదు...!అది చూడు ముందు". అంది పల్లవి హిందూని సపోర్ట్ చేస్తూ. “నీకో విషయం చెప్పనా? మన సూపర్ సెనియర్ లావణ్య బి. టెక్ మొత్తం నరాలు తెగిపోయేలా చదివి కాలేజి ఫస్ట్ వచ్చింది. చివరకు ఏమైంది. హౌస్ వైఫ్ అయ్యింది. చదివిన చదువును ఆకు కూర కట్టలా ఫ్రిజ్ లో ఓ పక్కన పెట్టింది. మీ అమ్మలాగా, మా అమ్మలాగా అదే వంట, అదే గ్యాస్టౌ,అదే ప్రపంచం అన్నట్లు కలిసిపోయింది. రేపు శివాని కూడా అంతే! దానికి కూడా లావణ్యకి వచ్చినట్లే ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీరో, మిలియనీరో భర్తగా వచ్చాడే అనుకో ! వుద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే వుండిపోవలసి వస్తుంది. ఆ మాత్రం దానికి ఇప్పుడు సోషల్ సింబల్ గా అనిపిస్తున్న బాయ్ ఫ్రెండ్స్ ని, వాళ్ళు గిఫ్ట్ గా ఇస్తున్న టచ్ స్క్రీన్ ఫోన్లని, లాప్ టాప్ లని వదులు కోవాలా? అలా అని సిన్సియర్ గా చదివే వాళ్ళని ఆపగలుగుతున్నామా? ఎవరి లోకం వాళ్ళది. ప్రపంచం మొత్తం శివానియే అయినట్లు మాట్లాడక నీలాంటివాళ్ళున్నారు, నాలాంటి వాళ్ళున్నారు, శివాని లాంటి వాళ్ళున్నారు. పురాణాల నాలెడ్జి నాకు అంతగా లేదు కానీ సత్య హరిశ్చంద్రుడు అంతటి రాజే అబద్దాలు ఆడాడట. సామాన్యులు మనమెంత అంటూ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు. అందుకే శివాని ఆడే అబద్దాలకి అంత తప్పు లేదు..." అంది హెడ్ సెట్ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఇంకో అమ్మాయి. అమితాశ్చర్యంతో హిందూ టక్కున లేచి "తప్పు లేదా! యద్భావం తద్భవతి! మనం ఏది కావాలని అనుకుంటామో అదే అవుతాం! సైంటిస్ట్ కావాలని కష్టపడి రైటర్స్ లా రాయగలమా? ఇంజినీరింగ్ చదివి డాక్టర్ లా వైద్యం చెయ్యగలమా? దేంట్లో కృషి చేస్తే దానికి సంబంధించిన ఫలితాలే వస్తాయి". అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. అందరూ మౌనంగా వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. తరువాత క్లాస్ మొదలు కావటం తో లెక్చరర్ రూం లోకి వచ్చాడు. కాలేజి వదిలాకా - ఇంటికెళ్ళింది సంకేత. నీలిమ ఇచ్చిన కాఫీ తాగి డాబా మీదకి వెళ్ళి కొద్ది సేపు అటు ఇటు తిరిగింది... ఎంత తిరిగినా ఒంటరిగా అనిపిస్తోంది. ప్రస్తుతం తన సమస్య డబ్బు! ఇప్పుడు తనేం చెప్పినా వినే వాళ్ళు కాదు. హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ ఎప్పుడో అయిపోయింది. రికార్డ్ షీట్స్ కావాలి. డ్రాయింగ్ షీట్స్ కొనాలి. మెటీరియల్ జిరాక్స్ తీయించాలి. ఆ మధ్యన లాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్ డామేజ్ అయింది. దానికి తను డబ్బు కట్టాలి. డబ్బు కట్టడానికి వాళ్ళు ఇచ్చిన ఆఖరు తేదీ అయిపోయింది. వెంటనే కట్టాలి. చేతిలో రూపాయి లేదు. శివరామకృష్ణ అంకుల్ ని అడిగితే ఇస్తాడు. ఆయన ఊరిలో లేడు. శ్రీహర్ష ను అడగడం ఇష్టం లేదు. ఆంటీ అడిగినా ఇవ్వదు. నీలిమ దగ్గర డబ్బులు ఉండవు. వరమ్మ అంతకన్నా దరిద్రం. ఇప్పుడెలా? డబ్బు కోసం తనేం చెయ్యాలి? ఎవరిస్తారు తనకి? తండ్రి నిస్సహాయత తనకి తెలియంది కాదు. వర్షాలు లేక పొలం లో పనులు లేవని బాధ పడుతున్నాడు. తల్లి మాత్రం ఏమి చేయగలదు ? నిన్ననే హిందూ కూడ అడిగింది. లాబ్ లో కట్టల్సిన ఫైన్ కట్టావా? అని....అసలు ఆ రోజు హిందూ వచ్చి... "ప్లీజ్! మేడం ! ఆ ఫైన్ని అక్స్పెరిమెంట్ చేస్తున్న ముగ్గురికి షేర్ చెయ్యండి! సంకేత ఒక్కతే కట్టలేదు. పైగా ఎక్స్పెరిమెంట్ ని ముగ్గురు కలిసే కదా చేసుకోవాలి" అంటూ మేడం తో మాట్లాడి తనకెంతో సహాయం చేసింది. ఇప్పుడీ ఫైన్ డబ్బుల్ని కూడా హిందూని అడగాలంటే ఏదోగా ఉంది. ...హిందూ తప్ప తనకేవరిస్తారు? తెల్లవారి .....హిందూ కోసం హిందూ ఉంటున్న హాస్టల్ కి వెళ్ళింది సంకేత. హిందూ హాస్టల్ లో లేదు. దురదృష్టం అనుకొని బాధపడుతూ ఆ గది లోంచి బయటకి వచ్చింది సంకేత. పక్క గదిలో ఉన్న పల్లవి సంకేతను చూసి "హాయ్ ! సంకేతా!" అంది. "హాయ్!" అంటూ నవ్వింది సంకేత. తను హిందూ కోసం వచ్చినట్లు చెప్పింది. "పల్లవి ఆశ్చర్య పోతూ "హిందూ ఊరెళ్ళింది నీకు తెలియదా?ఓ...నీకు చెల్ ఫోన్ లేదు కదా! అందుకే ఎప్పటి ఇంఫర్మేషన్ అప్పుడు నీకు తెలియటం లేదు....రా! మా గది లో కూర్చుందాం!" అంటూ ఆప్యాయంగా పిలిచి సంకేత ను తన గది లోకి తీసుకెళ్ళింది. నిరుత్సాహంగా, దిగులుగా ఉంది సంకేతకి...ఏం చేయాలో తోచటం లేదు. మూభావంగా ఉన్న సంకేతను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది పల్లవి. ...ఆ రూంలో ఉండే అమ్మాయిలు కొందరు సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ ఎవరి ప్రపంచంలో వాళ్ళున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్లన్నీ కలర్ పీస్లు ....'బ్రాండ్ మొబైల్లు...నోకియా, సాంసంగ్, సోనీ ఎర్రిక్సన్, మోటరోలా, బ్లాక్ బెర్రి, ఎల్జీ, హెచ్.టి.సి., ఇవి మన దేశంలో ఉత్పత్తి చేయబడ్తూ మనకే అమ్ముతున్న మనవి కాని బహుళ జాతి కంపనీల బ్రాండ్లు....అంతే కాదు ఆ బ్రాండ్లలో వాళ్ళు వాడుతున్న మొబైల్స్ చాలా ఖరీదైనవి... చూడగానే ఇవి మాకుంటే బావుండనిపించేలా ఉన్నాయి. .....దేనికైనా ఆసక్తి పెరిగే వయస్సు కావడం వల్ల మనసులో ఉన్న బాధని, వచ్చిన పనిని మర్చిపోయి వాళ్ళనే చూస్తోంది సంకేత. సంకేత చూపుల్ని అర్ధం చేసుకొని "ఇవాళ మన సీనియర్ అనంత్ ది బర్త్ డే పార్టీ ఉంది. చాలా గ్రాండ్ గా హోటల్ రాధిక లో ఇస్తున్నాడు. వాళ్ళు కాస్త ముందుగా వెళ్ళలని తయారవుతున్నారు. మేము కూడా వెళ్ళాలి ! నువ్వు కూడా వస్తావా? " అంది పల్లవి. ఉలిక్కి పడి "నేనా?" అంది సంకేత. పల్లవి ఆశ్చర్యపోతూ ఒకక్షణం మౌనంగా ఉండి ఆ తరువాత సంకేతతో "నిన్ను అనంత్ పిలవలేదని ఆలోచిస్తున్నావా? అతను మన సీనియరే కదా! పిలవక పోయినా వెళ్ళొచ్చు. ఇంకా సంతోష పడతాడు. మా హాస్టల్లో చాలా మందిని పిలవలేదు. అందరం వెల్తున్నాం. అతని వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగం రావచ్చు. భవిష్యత్తును ఎవరు చూసొచ్చారు?" అంది. "అబ్బయిలతో ఏం అవసరాలుంటాయి?" అంది సంకేత. "నువ్వు ఈకాలం లో పుట్టిన అమ్మాయిలా మాట్లాడట్లేదు. బహుశా నువ్వు నమ్ముతావో లేదో మనలో చాలా మంది అమ్మాయిలు ఇంటి నుంచీ బయటకి వచ్చి ఇంత ప్రశాంతం గా ఇంత నిశ్చింతగా చదువుతున్నారు అంటే దానికి కారణం మన కాలేజీ లో కొంత మంది అబ్బాయిలు ఇచ్చే ధైర్యం హామీ" అంది పల్లవి. సంకేత ఆశ్చర్య పోతూ "తల్లిదండ్రులు పంపే డబ్బు కాదా" అంది. "తల్లిదండ్రులు పంపే డబ్బు తో సరిపెట్టుకొనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సంకేతా! వాళ్ళు కూడా చిన్న చిన్న అవసరాలకు పక్కమ్మాయిల దగ్గర చేయి చాపు తూనే ఉంటారు. ఖర్చులు పెరిగాయి, అవసరాలు పెరిగాయి. వీటిని ఎంతమంది తల్లిదండ్రులు అర్ధం చేసుకుంటున్నారు? అర్ధం చేసుకున్నా ఆర్ధికస్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఆర్ధిక స్తోమత బాగా ఉన్న వాళ్ళేమో ఒక దాన్ని మించింది ఒకటి కొంటూ పక్కవాళ్ళ మెదళ్ళ తీటకి కారణం అవుతున్నారు" అంది పల్లవి. "నువ్వు నోరు మూయవే . తీట రోత అంటూ నోటికొచ్చిన పదాలను వాడి బ్రతుకు మీద విరక్తి పుట్టేలా చేస్తున్నావు. ఇప్పుడు మనం ప్రేమించే వయస్సు లో ఉన్నాం. మనిషంటే మనిషి పడిచచ్చే వయస్సులో ఉన్నాం. ఈ వయస్సు దాటాకా, నీకోసం ఏదైనా చేయడానికి ఎవరూ ఉండరు. సపోజ్ నీకు పెళ్ళయ్యాకా నీ భర్త కూడా నేకేమీ చెయ్యకపోవచ్చు. చెయ్యకపోయినా అన్నీ చేతాడన్న భ్రమ తో కొద్ది రోజులు, బిజీగా ఉండి చేయలేదులే అన్న భరోసా తో కొద్ది రోజులు, రితైర్ అయ్యాకా నేనే లోకం గా ఉంటాడన్న నమ్మకం త కొద్ది రోజులు గడిపేస్తావు. ఆ తర్వాత గాని తెలిసిరాదు నువ్వేం కోల్పోయావో." అంది శివాని. సంకేత కళ్ళతో పాటు మనసు కూడా అప్పజెప్పి వింటోంది. సంకేత ముఖకవళికల్ని ఆశ్చర్యపోయి గమనిస్తూ... "దీని మాటలు వినకే సంకేతా! ఇదేం చెప్పబోతుందో నాకు తెలుసు. దీనికో బాఇ ఫ్రెండ్ ఉన్నాడు. అందరికి అలానే ఉండాలంటుంది. అంతే కాదు. దీని బాయ్ ఫ్రెండ్ దీనికో పాముని చూపించి ఇది పాము కాదు శివాని ! బెల్ట్ అన్నా నమ్మి నడుం కి పెట్టుకుంటంది. 'నువ్విక్కడే కూర్చో నక్షత్రాలను తెచ్చి నీ చున్నీలో పోస్తా' అన్నా అతనొచ్చేంతవరకు అక్కడే కూర్చుంటుంది నక్షత్రాల కోసం...అతన్ని ఏది అడిగినా తెచ్చి ఇస్తాడని నమ్ముతుంది. కాబోయే భర్త కన్నా బాయ్ ఫ్రెండే గొప్పవాడు అంటుంది. భర్తలెప్పుడూ మంచి వాళ్ళు కాదని దానికి ఉదాహరణగా వాళ్ళ నాన్న గురించి చెపుతుంది. మారుతున్న రోజులతో మనం కూడా మారాలని అంటుంది. అవన్నీ ఒట్టి మాటలు. రోజులు మనం అనుకున్నంతగా ఏం మారడం లేదు సంకేతా! ఇదే మార్చేస్తోంది రోజుల్ని...." అంది పల్లవి శివాని కొడుతుందని కాస్త దూరంగా జరిగి. అప్పటికే ఆ గదిలో అమ్మాయిలంతా పార్టీకి వెళ్ళారు.సంకేత, పల్లవి, శివాని మాత్రమే ఆ గదిలో మిగిలారు. ఆ ముగ్గురి మధ్యన మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని చ్చేదిస్తూ "వీళ్ళెవరూ నన్ను అర్ధం చేసుకోరు, నాస్వభావాన్ని నీకు చెప్తాను విను సంకేతా" అంది శివాని. "తొక్కలో స్వభావం! అదిపూడంత అర్జంటా! అదేదో దేశభక్తుల ఆత్మ కధ అనంట్లు బిల్డప్ కాకపోతే! అదసలే మనీ ప్రాబ్లం లో ఉంది. చేతనైతే దాని గురించి ఆలోచించరాదూ!" అంది పల్లవి. "నా దగ్గర డబ్బుల్లేవు, కావాలంటే నా బాయ్ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ లు ఉన్నాయి. అవి ఇస్తాను. వాటిని అమ్ముకుని క్యాష్ చేసుకుంటావా?"అంటూ సంకేత వైపు చూసింది శివాని. ఒక స్నేహితురాలిగా శివానికి తన పట్ల ఉన్న అభిమానానికి కళ్ళు చెమర్చాయి సంకేత కి. కానీ గిఫ్ట్ లు తీసుకోవాలంటే భయం వేసి వెంటనే "అమ్మో! అంటూ తన చేతుని గుండెలమీద పెట్టుకుంది. శివాని సంకేత వైపు విచిత్రంగా చూసి "ఎందుకే 'అమ్మో' అంటూ చేతులతో గుండెలమీద కొట్టుకుంటావు! నీకు పరిష్కారము ముఖ్యమా! హావభావాలు ముఖ్యమా! ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని చోట్లా వర్కవుట్ అవ్వవు. మనమిప్పుడు బి.టెక్ చదువుతున్నాం. ఇదయ్యాకా అవసరమైతే పర్సనాలిటీ కోర్సులు చేస్తాం ! మేనేజ్మెంట్ స్కిల్స్ లో ట్రైనింగ్ పొదుతాం! బాడీ లాంగ్వేజ్ లో టిప్స్ తీసుకుంటాం! ఇప్పటికే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం....సోషల్ నెట్వర్క్ ను అవగాహన చేసుకున్నాం....పైగా వీటన్నిటికీ కావలసిన కమ్యునికషన్ స్కిల్స్ కూడా మనకున్నాయి. గుండెల మీద చేతులు పెట్టుకొని మన స్కిల్స్ ని మనం అవమానించుకోవడం ఎందుకు చెప్పు!" అంది. శివాని మాటల్ని పట్టించుకోకుండా పల్లవి అనంత్ ఇచ్చే పార్టీ కోసం మేకప్ చేసుకుంటూ ఆర్టిఫీషియల్ గోర్లను ముందున్న ఒరిగినల్ గోళ్ళ మీద అతికించుకొంటోంది. సంకేత శివాని మాటలు వింటూనే పల్లవి వైపు చూసింది. పల్లవి నిన్ననే ఫేషియల్ చేయించుకున్నట్లుంది. ముఖం తేటగా ఉంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా పల్లవికి ఫేషియల్ చేయించుకోవడం అలవాటైయ్యింది. ఇలాగే చేస్తూ పోతే కొంత కాలానికి దీని ముఖం అరిగిపోతుందేమో అన్న ఆలోచన వచ్చి చిన్నగా నవింది సంకేత. శివాని సంకేత వైపు చూడకుండా ఎటోచూస్తొంది. సీరియస్ మూడ్ లోకి వెళ్ళి "సంకేతా! మన మీద ఎవరికి ఏ చిన్న ఫీల్ కలిగినా దాన్ని మనం వెంటనే క్యాచ్ చేయగలగాలి. క్యాష్ చేసుకోగలగాలి. ఎందుకంటే ప్రపంచీకరణ. గ్లోబలైజేషన్ వల్ల వేగం పెరిగి, తెక్నాలజీ పెరిగి, అవసరాలు పెరిగి మనకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. మనమిప్పుడు ఊపిరి పీల్చుకోవాలంటే డబ్బు కావాలి. అది మన దగ్గర లేదు. మా నాన్న దగ్గర ఉన్నా నాకు ఇవ్వడు. సర్దుకు పో అంటాడు. సర్దుకుపోకపోతే చావు అంటాడు. మీ నాన్నకు డబ్బు లేక పోయినా నె మెద ప్రేమ ఉంది. ఆ ప్రేమ తో అప్పుచేసైనా సరే నీ అవసరాలు తీర్చాలని చూస్తాడు. నీకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు ఇబ్బంది పడూతుంటావు...కానీ ఇప్పుడు నెకున్న అవసరం అలాంటి ఇలాంటిది కాదు. కాలేజి లో తప్పనిసరిగా డబ్బులు కట్టాలి. అందుకే నా దగ్గర ఉన్న ఈ గిఫ్ట్ తీసుకెళ్ళు. అది నాకు ఏ విధంగా పనికి రాదు." అందిశివాని. శివాని ఆ మాటల్ని ఓ చోట కూర్చొని మాట్లాడటం లేదు. అటు ఇటూ తిరుగుతూ, తనకి అవసరమైనవి అందుకొని, తనను తాను చక చక అలంకరించుకొంటూ, చురుగ్గా వంగి, లేస్తూ డ్రెస్ మార్చుకొంటూ మట్లాడుతోంది. సంకేత మాత్రం ముందు ఎక్కడ కూర్చున్నదో అక్కడే కూర్చొని వింటోంది. నెమ్మదిగా పెదవి విప్పి "థాంక్స్ శివాని! ఆ గిఫ్ట్ నాకొద్దు. అది నీకు ఎవరో ప్రేంతో ఇచ్చిన కానుక. దాని మీద ఇచ్చిన వాళ్ళ హృదయం ఉంటుంది. హృదయాన్ని పదిలంగా చూసుకోవాలే కానీ అమ్ముకోకూడదు. నా దృష్టి లో ప్రేమించబడడం కానీ, ప్రేమించడం కానె రెండూ అద్భుతాలే. అపురూపాలే. ఎంతైనా అది నీకు ప్రేంతో ఇచ్చిన కానుక". అంది సంకేత. శివాని నవ్వింది. ఆ నవ్వులో ఎలాంటి సున్నితత్వం, నిర్మలత్వం లేవు. అలాగే నవ్వుతూ"నువ్వన్నట్లు ఆ క్షణం లో అది నాకు అతను ప్రమ తో ఇచ్చిందే కావచ్చు. మళ్ళీ అలాంటి క్షణాలు అతనికి చాలా సార్లు వచ్చి ఉంటాయి. నాకు ఇచ్చినట్లే చాఅ మందికి ఇచ్చి ఉంటాడు. ఆశ్చర్యపోకు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడో తప్ప భగ్న ప్రేమలు లేవు. భాష్ప కణాలు లేవు. వెయిటింగ్లు లేవు. ఓదార్పులు లేవు. అంతా వేగంగానే జరిగిపోతుంటుంది. ఒకసారి నచ్చిన వ్యక్తి నచ్చకుండా పోవడానికి అరక్షణం చాలు. మరో కొత్త వ్యక్తి నచ్చడానికి అంతకన్నా తక్కువ సమయమే పడుతుంది. మరి ఈ లోగా మొదటి వ్యక్తి ఇచ్చిన ఈ ప్రేమ కనుకల్ని ఏం చేయాలి? పట్టుకెళ్ళు... అడ్డంగా ఉన్నాయి. నేనెలాగూ ఇక్కడ శుభ్రం చేసేటప్పుడు వాటిని చెత్తలో పడేస్తాను." అని సంకేత తో చెప్పి, పక్కన తయారవుతున్న పల్లవి భుజం పై ఓ తట్టు తట్టి " నేను వెళుతున్నా! ఆలస్యంగా వెళ్తే అనంత్ బాధ పడతాడు. నువ్వు కూడా త్వరగా రా!" అంటూ అనంత్ చేసుకుంటున్న పుటీన రోజు వేడుకకు వెళ్ళింది శివాని. శివాని వెళ్ళాక శివాని బెడ్ వైపు చూసింది సంకేత. అక్కడ ఇంకా కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. కనెసం వాటిని విప్పి చూసిన గుర్తులు కూడా లేవు. నిర్లక్ష్యం గా పడేసినట్లు ఉన్నాయి. దీన్ని బట్టి కొందరు అబ్బాయిలు ఎంత పిచ్చి వాళ్ళో అర్ధమవుతుంది. ఇలాంటి వాళ్ళకి బాధని బట్టే విలువ పెరుగుతుందనీ ఎప్పుడు తెలుస్తుందో ఏమో! సంకేత అంతటితో శివాని గురించి వదిలేసి తనగురించి ఆలోచించుకొంటూ "హిందూ ఎప్పుడొస్తుందో చెప్పిందా పల్లవీ"? అంది. "నాలుగు రోజులు పైనే పట్టొచ్చట. అది ముందుగా అనుకునేం వెళ్ళలేదు. ఇంటి నుండె ఫోన్ రాగానే హడావుడిగా వెళ్ళింది. ఏమైనా పని ఉందా తనతో...? అడిగింది పల్లవి. "డబ్బు కావాలి..." అంటూ ఫైన్ విషయం మళ్ళీ గుర్తు చేసింది సంకేత. "డబ్బు అంటే నా దగ్గర కూడా లేవు. మా హాస్టల్లో అమ్మయిలను అడిగినా వేస్టే! వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళ సెల్ రీచార్జ్ లకే సరిపోతుంది. దీని గురించి మనం పార్టీ కి వెళ్ళొచ్చాకా ఆలోచిద్దాం!" అంది పల్లవి. నా డ్రస్ బాగా లేదు. నేను రాను పల్లవి! అంది. "అదేం పెద సమస్య కాదు. నా డ్రస్ వేసుకో" అంటూ తన డ్రస్ తెచ్చి ఇచ్చింది పల్లవి. సకేతకు కూడా పల్లవితోనే ఉండాలనిపిస్తోంది. ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఊరెళ్ళాలని ఉన్నా, రేపు కాలేజ్ లో ముఖ్యమైన క్లాస్ ఉంది. తను అడగ్గానే ఇవ్వడానికి తండ్రి దగ్గర కూడా డబ్బుల్లేవు. కానీ తను అడగాలే గానీ తన తండ్రి అప్పు చేసైనా తన అవసరం తీరుస్తాడు. వర్షంలో సైతం తడుస్తూ పొలం పనులు చేసే తండ్రి చేత ఇంకా అప్పులు చేయించి, ఆయన్ని బాధపెట్టడం తనకి ఇష్టం లేదు. అందుకే పల్లవి ఇవ్వగానే, డ్రెస్ అందుకుంది సంకేత. వెంటనే డ్రెస్ మార్చుకొని ఫ్రెషప్ అయింది. ఫ్రెషప్ అవుతున్నంత సేపు సంకేత మనసంతా తనకి అవసరమైన డబ్బు చుట్టే తిరుగుతోంది. డబ్బు లేక పోతే ఇంత కష్టమా? ధైర్యంగా ఉండాలన్నా, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా, ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నా డబ్బుతో ఇంత అవసరం ఉంటుందా? ఛ, ఛ తనిప్పుడు అనవసరంగా సమస్యలో ఇరుక్కుంది. ఆ రోజు ల్యాబ్ లో తనెంత జాగ్రత్తగా ఉన్నా పక్కనున్న అమ్మాయి అజాగ్రత్త వల్లనే అలా జరిగింది. "ఏటి! అలోచిస్తున్నావ్! పద! వెళదాం!" అని పల్లవి అనగానే సంకేత ఆలోచన ఆగిపోయింది. ఇద్దరు కలిసి అనంత్ ఇస్తున్న పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీ లో అనంత బ్యాచ్ మేట్స్ కాక అతని జూనియర్స్ కూడా ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా అనంత్ మన వాడు అన్న భావన కంపిస్తోంది ఆ వాతావరణంలో. అనంత్ చాలా ఖరీదైన డ్రెస్ లో అందరికన్నా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్సందరు అనంత్ ని పలకరించి కౌగిలించుకుంటున్నారు. అమ్మాయిలు కూడా నేరుగా అనంత్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి విషెష్ చెప్పి వస్తున్నారు. వాళ్ళలో కొందరు కూర్చొని, కొందరు నిలబడి అక్కడ వినిపిస్తున్న మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు... సంకేత పల్లవి ఇచ్చినంత ఫ్రీగా అనంత్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయింది. అది గమనించాడు అనంత్! ఆ కరస్పర్శ కూడా అందరిలా అనిపించలేదు. ఆ స్పర్శ లో ఏదో భాష ఉంది. ఏం భాయ అది? అర్ధం కాలేదు. ఒక అమ్మాయి అబ్బాయిని తొలిసారిగా తగిలినప్పుడు కలిగే భయం, ఏదో బెదురు అది. మిగతా అమ్మాయిలలో ఈ ప్రత్యేకత కనిపించలేదు. ఏ అబ్బాయి అయినా అమ్మాయిలో ముందుగా గమనించేది అదే! అప్పుడప్పుడు కనిపిస్తున్నా, సంకేతను ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడ లేదు. ఫ్రెషర్స్ పార్టీ రోజు కూడా సంకేత అందరిలా అనిపించలేదు. స్వేచ్చగా తిరగలేదు. అందుకే ఆ రోజు అతను సంకేతను బాగా గమనించాడు. ఇప్పుడు కూడా ఏదో ప్రత్యేకత ఉందన్నట్లు సంకేత మీదనే తన చూపుల్ని ఎక్కువ సార్లు నిలుపుతున్నాడు. అతనలా చూపుల్ని తన మీద నిలుపుతున్న కొద్దీ సంకేత భూమి లోకి క్రుంగిపోతున్న దానిలా అయింది. అనంత్ అలా ఎనుకు చూస్తున్నాడో తనకి అర్ధమైంది. తను వేసుకున్న డ్రస్ పల్లవిదని అతనికి తెలిసి పోయి ఉంటుంది.....అతను కూడా శ్రీహర్ష లాగే తనని ఎగతాళిగా చూస్తున్నట్లు అంపించి త్వరగా ఇంటికెళ్తే బావుండన్నట్లు చూస్తోంది. అసలా వాతావరణమే ఆమెకు కొత్తగా ఉంది. ముళ్ళమేఅద ఊర్చున్నట్లు "ఇప్పుడిప్పుడే ఈ పార్టీ అయ్యేటట్లు లేదుగా! అనంత్ పేరెంట్స్ కూడా రావాలేమో కదా!" అంది సంకేత పల్లవికి మాత్రమే వినిపించేలా.... "ఛ, ఛ ఇలాంటి చోటుకి పేరెంట్స్ వస్తారా ఎక్కడైనా?ఇది కేవలం స్నేహితులకి ఇస్తున్న పార్టీ! అనంత్ చాలా గొప్పవాడు తెలుసా>" "ఎందుకు?" "ఎందుకంటే ! అతనిలా మన కాలేజీ లో ఏ అబ్బాయి అయినా ఇలాంటి పార్టీని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయగలడా? ఇంత ఖర్చు పెట్ట్గలరా? ఈ రోజుల్లో ఇలాంటి ఆనందం రావాలంటే బోలెడంత డబ్బుండాలి....అనంత్ తండ్రి కోటీస్వరుడు తెలుసా?" "నాకేం తెలుసే ! ప్రతీదీ తెలుసా! తెలుసా! అని నన్ను తికమక పెడతావ్? నాకసలే ఇలాంటి పార్టీలు కొత్త! పైగా ఈ డ్రస్సొకటి నన్ను నలిపేస్తోంది..." అంటూ గొణిగింది సంకేత. "ఆ డ్రస్ నీకెంత టైట్ గా ఏం లేదు. నలపటానికి....!రోజుకన్నా ఈ డ్రస్ లో మరింత అందంగా ఉన్నావ్!నేను ఒక్క సారి మాత్రమే ఈ డ్రస్ వేసుకున్నను. ఆ తర్వాత అది నాకు పట్టక పక్కన పెట్టేశాను. ఆ ఒక్కసారి కూడా ఏదో కాలేజీ ఫంక్షన్ లో ...."అంటూ గుర్తుచేసుకుంటుంటే... సంకేత కంగారుగా అటు ఇటు చూసి "చాల్లే ఈ డ్రస్ గురించి అంత చర్చ అవసరమా!" అంది. "నువ్వే కదే డ్రస్ నలిపేస్తొంది అన్నావ్! సౌకర్యంగా లేదా?" అంది. "ఉంది. గట్టిగా అరవకే! ఫంక్షన్ కదా! పక్క వాళ్ళకి ఇబందిగా ఉంటుంది." అంది ఊపిరి బిగబట్టినట్లు చూస్తూ. పల్లవి పక పకా నవ్వి "ఇక్కడ జరిగేది గుడిలో పూజ అనుకుంటున్నావా? అలా చూడు! ఎక్కడి వాళ్ళక్కడ గట్టి, గట్టిగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, అరుచుకుంటూ ఎలా సంబరపడుతున్నారో!" అంటూ సంకేత వైపు పరిశీలనగా చూసి మళ్ళీ తనే "ఏంటే అలా ఉన్నావ్! డబ్బుగురించే ఆలోచిస్తున్నావా" అంది. శివాని వాళ్ళ గుంపు దూరంగా నిలబడి ఉంది. నిజానికి ఆ క్షణం లో తన ఒంటి మీద ఉన్న పల్లవి డ్రస్ తప్ప తనకి ఇంకేం గుర్తు రావడం లేదు సంకేతకి... అనంత్ ఎప్పుడు వచ్చాడో పల్లవి పక్కన నిలబడి పల్లవితో మాట్లాడుతున్నడు. అతను పలకరించగానే సంకేత ఉలిక్కిపడి తననేనా అన్నట్లు చూసింది. చాలా మంది అమ్మాయిలు అతను పలకరిస్తే చాలన్నట్లు చూస్తున్నారు. అతన్ని పలకరిణాలని చూస్తున్నారు. అతని పక్కన నిలబడడానికి ఉవ్విళ్ళొరుతున్నారు. అంత ఒత్తిడిలో కూడా అదంతా తను గమనిస్తోంది. అలాంటిది అతను తనను పలకరించడం ఏమిటి? అదే శ్రీహర్ష అయితే పలకరిస్తాడా? ఎంత స్ఠాయీ బేధాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే శ్రీహర్ష అంటే తనకి నచ్చదు. అనంత్ నవ్వి"మా పల్లవి మిమ్మల్ని బలవంతంగా పార్టీకి తీసుకొచ్చిందా? ఇక్కడేదో ముళ్ళు, గాజుముక్కలు ఉన్నట్లు కష్టంగా నిలబడ్డారు." అంటూ ఒక్క క్షణం నేల వైపు తమాషాగా అటూ ఇటూ చూశాడు. అతను ఎప్పుడైనా పల్లవిని మా పల్లవి అనే చెప్పుకుంటాడు. అతనికి దూరపు బంధువు పల్లవి. ...అదేం లేదన్నట్లు కంగారుగా చూసింది సంకేత. కానీ అతనితో మాట్లాడాలంటే గొంతు పెగలటం లేదు. కారణం, అతను తన సీనియర్ అనా? లేక డబ్బున్న వాడనా? అర్ధం కాలేదు. "ఇట్స్ ఓ.కె. ఇబ్బందిగా ఉన్నట్లుంది. నేను వెళతాను" అంటూ అనంత్ అక్కడ నుండి వెల్తుంటే... "అనంత్!" అంటూ పిలిచింది పల్లవి. అనంత్ ఆగి ఏమిటన్నట్లు చూశాడు. అనంత్ ని కొద్దిగా పక్కకి తీసికెళ్ళి...సంకేత కాలేజీలో ఫైన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. .....పల్లవి అనంత్ తో ఏం మాట్లాడిందో సంకేతకి వినిపించలేదు. సంకేతకే కాదు, అక్కడున్న ఎవరికీ వినిపించలేదు. అనంత్ మాత్రం పల్లవి చెప్పింది విని, ఎవరో విష్ చేయడం తో అటు వైపు వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి పోయాడు. అతన్నుండి ఎలాంటి స్పందన లేకపోవడం పల్లవికి నిరాశ అనిపించింది. ఇలాంటి చోట ఇంతింత ఖర్చు పెట్టుకొనే కన్నా సంకేత లాంటి వాళకి హెల్ప్ చేస్తే తప్పేముంది? దానంగా కాకపోయిన అప్పుగానైనా ఇవ్వొచుగా! ఏంటో ఈ అనంత్! పెద్దవాళు ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు... ఇతరులకి సహాయం చేయడానికి మత్రం ఇష్టపడడు. 'మనం తిన్నది మట్టి పాలు, పరులకి పెట్టింది మనపాలూ అన్నది ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో! అనుకుంది పల్లవి. ఆ తర్వాత కేక్ కట్ చెయ్యటం కేక్ తినిపించుకోవటం...కేక్ ని ముఖానికి పూసుకోవడం... ఒకటే సందడి ! ఫుల్ జోష్ తో డాన్సులు, అరుపులు, కేకలు, ఫాస్ట్ మ్యూజిక్ తో పాటలు.... పార్టీ ముగిసింది. ఎవళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయారు. వెళ్తునప్పుడు సంకేత ఎందుకో డల్ గా కనిపించడంతో పల్లవి సంకేత భుజం తట్టి "మరీ అంత దిగులు పడకు, ఎపుడూ ఇలాగే ఉండదు. నీకో విషయం చెప్పనా. నిన్నటిని చూసి ఎంత నేర్చుకుంటావో, నేటి కోసం అంతే జీవించు. రేపటి మీద ఆశల్ని పెంచుకో. ఆశ మనిషి ఊపిరి. అంతే కానీ ఇలా మాత్రం ఉండకు". పార్టీ నుండి ఇంటికొచ్చాకా, సంకేతకి చాలా సేపు నిద్ర పట్తలేదు. పార్టీలో దేదీప్యమానంగా వెలిగిన ఆ లైట్లు, భూమ్మీద ఉన్న ఆనందం అంతా మాదే అన్నట్లు వినిపించిన ఆ నవులు, ఆ పాటలు, ఆ డాన్సులు, నిజంగానే అది స్వర్గం....ఎక్కువగా హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలే ఆ పర్టీ అటెండ్ అయ్యారు. వాళ్ళంతా ఎంత ఆనందం గా ఉన్నారు...తను కూడా హాస్టల్ లో ఉంటే బావుండు కదా! దేవుడు అన్నీ వాళ్ళకే ఇచ్చినట్లు ఆ హుషారెంటి. ఆ ఉత్సాహం ఏంటి. కళ్ళు గట్టిగా మూసుకున్నా అదే కనిపిస్తోంది. ప్రతి క్షణాన్ని వాళ్ళేంత సంతోషంగా వాడు కుంటున్నారో!! తనీ రోజు హిందూ కోసం వెళ్ళకపోయి ఉంటే తనకీ అవకాశం వచ్చి ఉండేది కాదు. జీవితాన్ని ఆనందంగా గడపటంలో శివానిదే సరైన మార్గం కాదని పల్లవి అంది. హిందూ అంది. విన్నవాళ్ళెవరైనా అంటారు. కానీ ఇప్పుడున్న కాలమానపరిస్థితుల్లో, ఏది సరైనదో ఏది కాదో తనకే సరైన స్పష్టత రావటం లేదు. నిజం చెప్పాలాంటే తన తల్లితండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా తనని చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళని చూస్తుంటే ఒక్క రూపాయి అడగాలన్నా, అడగలేక పోతోంది. అలా అని తల్లితండ్రులని అర్ధం చేసుకున్నంత సులభంగా అవసరాలను దాటి వెల్లలేకపోతోంది. ఎందుకో తమ ఊరును, తల్లిదండ్రులను గుర్తు చేసుకోటానికి మనసు అంగీకరించటం లేదు సంకేతకి. పార్టీ లో చూసిన అనంతే గుర్తుకొస్తున్నాడు. దాస్ కాని, శ్రీహర్ష కానిజీవితం లో ఒక్కసారైనా అనంత్ ఇచ్చిన పార్టీ లాంటిది ఇవగలరా? అలా ఇవ్వడం వాళ్ళకి సాధ్యమవుతుందా? కాదు. మనసులను గాయపరచటం మాత్రమే వాళ్ళకి వచు. వాళ్ళ ప్రపంచం వేరు. అనంత్ ప్రపంచం వేరు. వాళ్ళ స్థాయి వేరు. అనంత్ స్థాయి వేరు..అనంత్ స్థాయి వాళ్ళను మించిన స్థాయి. అయినా శ్రీహర్ష తనని నిర్లక్ష్యం చేసినట్లు, వ్యాఖ్యానాలు చేసినట్లు అనంత్ ఎవరినీ చేసి ఉండడు. చెయ్యడు. చూస్తేనే తెలుస్తోంది అతనెలాంటి వాడో. ఇప్పుడే కాదు ఫ్రెషర్స్ పార్టీలో కూడా తనని పలకరించాడు. తనే సరిగా మాట్లాడ లేదు. తక్కువ భావం తో కుచించుకు పోయింది. తనలో ఏదో కల్లోలం. తనకే తెలియని వ్యాకులత. ఎంత చదివినా తను అందరికన్నా తక్కువే అన ఆత్మన్యూనత...దీన్ని జయించలేకపోతోంది...కారణం ఆ పార్టీ లో చదువుకన్నా సంపదనే ఎక్కువగా పోటీ పడుతుంది. ప్రతిరోజూ ఎ సమయంలో పుస్తకం పట్టుకొని చదువుతూ కూర్చొని ఉండే సంకేత ఈ రోజెందుకు ఆ పని చెయ్యలేదో అర్ధంకాక, అడిగితే బావుండదని అడగలేక, పడుకొని హాయిగా నిద్రపోతోంది నీలిమ....సంకేత మాత్రం ఆలోచిస్తోంది. తెల్లవారి కాలేజీకి వెళ్ళగనే లాబ్ లో మేడం ఫైన్ గుర్తుచేస్తుందని సంకేత భయపడింది...ఇంకొంచెం టైం అడగాలని మేడం దగ్గరికి వెళ్ళింది. సంకేతని చూడగానే "నీ ఫైన్ కట్టినట్లు రికార్డులో ఉంది. ఇంతకముందే కట్టారు" అంది మేడం. "థ్యాంక్ గాడ్! ఈ పని పల్లవిదే! హిందూ మాత్రం కాదు. హిందూ ఇంకా ఊరినుండీ రాలేదు" అని మనసులో అనుకొని "ఓ.కె. మేడం. థ్యాంక్యూ!" అని చెప్పి క్లాసుకెళ్ళింది. సంకేత. సంకేతకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మనసులోంచి వేయి టన్నుల బరువు వెళ్ళిపోయినట్లయింది. వెంటనే పల్లవిని కలిసి "నువ్వు, చేసిన సహాయానికి కృతఙ్ఞతలు పల్లవి!"అంది. పల్లవికి అర్ధం కాక "నేను సహాయం చేయటం ఏంటి! ఏం మాట్లాడుతున్నావే!" అంది. "ల్యాబ్ లో ఫైన్ కట్టింది నువ్వేగా"? అప్పుడు వెలిగింది పల్లవి బుర్ర. తనుకాదు. అనంత్ కట్టి ఉంటాడు. మంచి పనే చేసాడు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు అందరూ చెయ్యాలి. అప్పుడే పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. ముఖ్యంగా అనంత్ లాగా డబ్బున్న వాళ్ళలో ఇలాంటి దయార్ధ హృదయం బయటకి వస్తే డబ్బు దుర్వినియోగం బాగా తగ్గుతుంది. తనవైపు కృతఙ్ఞతతో చూస్తున్న సంకేతకి ఫైన్ కట్టింది అనంత్ అన్న విషయం చెప్పకుండా 'ఓ.కే అంది పల్లవి. క్లాసు మొదలవటం తో వాళ్ళు ఇంకేం మాట్లాడుకోలేదు. ********** రోజులు గడుస్తున్నాయి. సంకేత కాలేజీ నుండి ఇంటికెళ్ళాక ఫ్రెషప్పయి తన బెడ్ మీద కూర్చుని ఫ్యాన్ హై స్పీడ్‍లో పెట్టుకొని చదువుకుంటోంది. “శ్రీహర్ష కాలేజీనుండి ఇంకా ఇంటికి రాలేదు. నీకేమైనా కన్పించాడా? కాలేజీలో ప్రోగ్రాం లాంటిదేమైనా ఉందా వాళ్ళకి?” అని సంకేతను అడిగింది కాంచనమాల. శ్రీహర్ష మీద కోపంతో ఏదో ఒక అబద్ధం చెప్పి కొద్ది సేపు తిట్టిపించి ఎంజాయ్ చేద్దామనుకుంది కాని ఆ మూడ్ లో లేదు సంకేత. అందుకే “ఏమో! ఆంటీ! శ్రీ హర్ష నాకు కనిపించలేదు”. అని తన ఆలోచనలో తనుంది సంకేత. తను ఇప్పుడుబి.టెక్ థర్డ్ ఇయర్ లో ఉంది కాబట్టి ఈ ఇయర్ నుండే గేట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంది. తండ్రి తో చెప్పింది. ఆయన భుజం మీద ఉన్న కండువాతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని “ఇప్పటికే మన ఊరిలో కొంత అప్పు చేశాను. దాన్ని కొద్దికొద్దిగా తీర్చుకుంటున్నాను. ఇప్పుడిక వచ్చేవాళ్ళు కూడా లేరు. నువ్వు ఇంకా పెద్ద చదువులు చదవాలని నాకూ ఉంది. డబ్బులు లేనప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు చదువుతున్న ఈ చదువు పూర్తి కాగానే ఏదైనా ఉద్యోగం చూసుకో!” అన్నాడు. ఆయన అంతకన్నా ఇంకేమీ అనలేడు. గట్టిగా ఒత్తిడి చేస్తే పేద ఏడుపు ఏడుస్తాడేమో మౌనంగా! అది తను తట్టుకోలేదు. అందుకేనేమో పెద్ద పెద్ద చదువులకి తన లాంటి వాళ్ళకి సంబంధం కుదరదు. ముందు ఈ బి.టెక్ పూర్తి చేస్తే చాలు. ఆ తర్వాతైనా తనకి ఎం.టెక్ చెయ్యాలని ఉంది. అసలు గేట్ ఎగ్జామ్‍ను కోచింగ్ తీసుకోకుండా రాయొచ్చు. ఎందుకంటే అందులో వచ్చే క్వశ్చన్సన్నీ బి.టెక్ ఫోర్త్ ఇయర్‍లో చదివిన దానిమీదనే వస్తాయి. కాని కోచింగ్ తీసుకుంటే షార్ట్‍కట్ మెథడ్స్, టిప్స్, కొశ్చన్స్, గురించి ఐడియాస్ తెలుస్తాయి. కోచింగ్ సెంటర్లో అయితేనే మంచి మెటీరియల్ ఉంటుంది. అందుకే ధైర్యం చేసి, తండ్రి చెప్పిన మాటలు కూడా ఆలోచించకుండా, ఎవరో ఒకరు సహాయం చెయ్యకపోతారా అన్న నమ్మకంతో కోచింగ్ సెంటర్‍కి వెళ్ళి కోచింగ్ ఎంట్రన్స్ రాసి వచ్చింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చాయి. కోచింగ్ ఫీజు కొంత తగ్గించారు. మిగతా కొంత తను కట్టాలి. తన దగ్గర డబ్బు లేదు. పల్లవిని అడిగితే? పల్లవికి మంచి సర్కిల్ ఉన్నట్టుంది. లేకుంటే లాబ్ లో తను కట్టవలసిన ఫైన్ ను అంత త్వరగా కట్టగలిగేది కాదు. రేపు కాలేజీలో తన కోచింగ్ ఫీజ్ విషయం పల్లవితో చెప్పాలి. ఏ మాత్రం అవకాశం ఉన్నా తనకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అని ఆలోచిస్తుండగా శ్రీహర్ష మీద కేకలేస్తూ కాంచనమాల గొంతు గట్టిగా విన్పిస్తోంది. “ఆ ఫ్యాన్ ఎందుకు తెచ్చావు శ్రీహర్షా? ఎవరికోసం తెచ్చావు?” అంది కోపంగా అరిచినట్లే కాంచనమాల. “నానమ్మ కోసం తెచ్చాను మమ్మీ! నా ఫ్రెండ్ దాస్ ఈ మధ్యన బ్యాఅంక్ సబ్సిడీలోన్ తీసుకుని ఎలక్ట్రికల్ షాపు పెట్టాడు. వాడ్ని కలవాలని వాడి షాపుకి వెళ్ళగానే కొన్ని ఫ్యాన్లు కన్పించాయి. నాన్నమ్మకోసం ఓ ఫ్యాన్ కొందామని చాలా రోజులనుండి అనుకుంటున్నాను. అందుకే వాయిదాల పద్ధతి ప్రకారం తెచ్చాను. డబ్బు ఒక్కసారిగా కట్టనవసరం లేదు.” అన్నాడు చాలా నెమ్మదిగా నచ్చచెబుతున్న ధోరణిలో... “ఒక్కసారిగా కాకపోయినా డబ్బులైతే కట్టాలిగా! ఎక్కడనుండి తెచ్చి కడతావు? ఇప్పుడొస్తున్న కరెంట్ బిల్ చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇన్ని రోజులు మన రూమ్ కి మాత్రమే ఎసి ఉండేది. సంకేత వచ్చాక అక్కడో ఫ్యాన్ వెయ్యడం జరిగింది. ఇప్పుడు మరొక ఫ్యానంటే మాటలా?” అంది గట్టిగా కాంచనమాల. సంకేత వెంటనే ఫ్యాన్ ఆపేసి కూర్చుంది. కనీసం ఫ్యాన్ ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ కోపంలో తన ఫ్యాన్ ని కూడా తీయించేస్తే ఊపిరాడక చావాలి. ఇన్ని రోజులు నీలిమ ఎలా ఉన్నదో!? వరమ్మ సంగతి దేవుడెరుగు.. “మనం ఎ.సిలో పడుకుంటున్నాం. నాన్నమ్మకి ఫ్యానైనా ఉండొద్దా మమ్మీ! డాడీకి చెబుతానులే! ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తే కట్టమని” అన్నాడు శ్రీహర్ష. “డాడీ కాదు కట్టేది నేను ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి మీ డాడీ నా చేతి ఇస్తున్న డబ్బులు ఏ మూలకి వస్తున్నాయి? నేను చాలా తెలివిగా అవసరాన్ని బట్టి ఖర్చు పెడుతుండబట్టి సరిపోతున్నాయి. నా బాధను అర్థం చేసుకోకుండా ఆ ముసలమ్మను వెనుకేసుకొస్తున్నావు అంది. మెట్లకింద పడుకొని ఉన్న వరమ్మకు కాంచనమాల మాటలు వినిపిస్తున్నాయి. “బయట చాలా మంది ముసలివాళ్ళు సకాలంలో పెన్షన్ డబ్బులు రాక నానా అవస్థలు పడుతున్నారు. మన ముసలమ్మకేం అలాంటి ఇబ్బందులు లేవు. మన పుణ్యమా అని ముద్దకి లోటు లేకుండా జరుగుతోంది.” అంది గొప్ప వాస్తవం చెబుతున్నట్లు. “అలా అని ఈ వయస్సులో గాలి లేకుంటే కష్టం కదా!” అన్నాడు శ్రీహర్ష అసహనంగా. “ఎవరన్నారక్కడ గాలి లేదని? గాలి లేకుంటే ఇన్ని రోజులు ఎలా ఉంది? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ నీలిమ అయినా నేర్పి ఉండాలి లేదంటే ఆవిడగారయినా చెప్పి ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ అంటుంది, రేపు ఎ.సి అంటుంది. “నాన్నమ్మ నాకేం చెప్పలేదు. నాకే అన్పించింది. ఆమెను సౌకర్యవంతంగా ఉంచాలని..” “నీకు అన్పించినట్లే ఒకప్పుడు ఆమెకు అన్పించలేదు.. నాకు పెళ్ళయిన కొత్తలో మీ డాడీ ఆఫీసు నుండి ఇంటికొచ్చేంత వరకు ఫ్యాన్ వేసుకోనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా అదిగో ఆ మెట్ల పక్కన బోగస్ విల్లా చెట్టు కింద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూనో పప్పుల్లో మట్టి బెడ్డలు ఏరుతూనో ఉండేదాన్ని. గొడ్డుచాకిరీ చేయించేది. అప్పుడు నాకీ గొంతు కూడా ఇంత్ గట్టిగా పలికేది కాదు. ఆవిడంటే భయంతో వణికేదాన్ని! ఇప్పుడిది నా టైం” అంది కాంచనమాల. విభ్రమతో చూశాడు శ్రీహర్ష. మానవ సంబంధాలకి టైం టేబుల్ ఉంటుందా? ఎప్పుడో ఏదో జరిగిందని తన తల్లి ఇలా ప్రవర్తిస్తుందేమిటి? పగ తీర్చుకోవడం అంటే ఇదేనా? ఇది పగ తీర్చుకోవడం కాదు నరకం చూపించడం..! శ్రీహర్ష తేరుకొని “జరిగిందేదో జరిగిపోయింది అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఫ్యాన్ వద్దనడం ఏం బాగలేదు మమ్మీ!” అన్నాడు. ఆమె నిర్మొహమాటంగా “ఆ ఫ్యాన్ పెడితే నేను ఆ ఫ్యాన్‍కే ఉరి వేసుకొని చస్తాను” అంటూ బెదిరించి లోపలికి వెళ్ళింది. అప్పుడే ఆఫీసునుండి ఇంటికొచ్చిన శివరామకృష్ణ విషయం తెలిసి బిత్తరపోయాడు. విపరీతంగా కంగారు పడ్డాడు. “కాంచనా! కాంచనా! అంటూ ఆరాటంగా పిలిచాడు. ఆమె ‘ఊ’ అనలేదు. మౌనమే నా భాష అన్నట్లు మౌనంతోనే తన నిరసనను వ్యక్తం చేసింది. ఆయన గుండె జారినట్లయింది. దిగులుగా శ్రీహర్షనే చూస్తూ “నువ్వు మీ అమ్మ అసంగతి తెలిసే ఇలా చేస్తున్నావా? అసలే మీ అమ్మకి రోషం, పౌరుషం ఎక్కువరా! అన్నంత పని చేస్తుంది.” అన్నాడు శివరామకృష్ణ. “అక్కడ మీ అమ్మకి గాలి సరిగా లేదు. దోమలు అది అసలు రూం కూడా కాదు. ఎప్పుడో రూం కట్టిస్తానంటావ్! కట్టించవు. నువ్వు అసలు మీ అమ్మ గురించి ఆలోచించవా నాన్నా..? “ఎందుకు ఆలోచించనురా! ఇంట్లో పాతకక్షలు ఇంకా సద్దుమణగనే లేదు ఇప్పుడేగా విన్నావ్! నాకు మాత్రం తెలియదా మా అమ్మ పడే ఇబ్బంది? అప్పుడెప్పుడో మా శివకి పెళ్ళయ్యాక కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని మా అమ్మ అన్నదట..! అది విని ప్రతిరోజు ఇంటిముందున్న చెట్లకిందకెళ్ళి కూర్చునేది మీ అమ్మ! అంత పంతం మనిషి పౌరుషానికి పోయి ఇప్పుడేమైనా చేసుకుందనుకో మనం దిక్కులేని పక్షులం అవుతాం! అందుకే చాకచక్యంగా నెట్టుకొస్తున్నాను” అన్నాడు. “మీ అమ్మను మెట్లకింద పెట్టి నువ్వెంత బాగా నెట్టుకొస్తున్నావో తెలుస్తూనే ఉంది. నా ఫ్రెండ్స్ కూడా మీ నాన్నమ్మ ఏందిరా బయట పడుకొని ఉంది లోపల స్థలం లేదా అని అంటున్నారు. సమాధానం చెప్పుకోలేక చస్తున్నాను. నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకుంటారేమో! నా స్నేహితులు నన్ను కామెంట్ చేస్తారు.” అన్నాడు శ్రీహర్ష. “కామెంట్ దేముందిలే నేను కూడా చేస్తాను. వాళ్ళకో ముసలమ్మ ఉంటే తెలుస్తుంది” అన్నాడు తనలో తను గొణుక్కుంటూ. “అయితే ఇప్పుడా ఫ్యాన్ పెట్టొద్దా?” “వద్దురా! నా మాట విని అది తీసికెళ్ళి దాస్‍కి ఇచ్చెయ్యి.” “వాడు నా నోట్లో గడ్డి పెడతాడు. సిగ్గుతో నేను చచ్చిపోవాలి.” “మీ అమ్మ అలిగి నా నోటికాడి తిండి పోతే నేను కడుపు మాడి చస్తాను. ఒక రకంగా నేను చావడమే మంచిదనిపిస్తోంది. లేకుంటే మీ అమ్మతో మా అమ్మతో ఎవరు పడతారు ఈ బాధలు?” “నువ్వేం బాధలు పడుతున్నావు నాన్నా..? జీతం తెచ్చి అమ్మ చేతికి ఇస్తావ్! అంతేగా! ఈ మాత్రానికే బాధలా? నాన్నమ్మకి వయసు పైబడింది. నిస్సహాయస్థితిలో ఉంది. ఆమెను మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు. ఆమెనో అంటరానిదానిలా మెట్లకింద ఉంచారు. ఇదెంతపాపమో మీకిప్పుడు అర్థం కాదు. ఈ వయసులో కూడా అమ్మకి మీరు భయపడడం సిగ్గుగా ఉంది” అన్నాడు శ్రీహర్ష. “నీకు పెళ్ళి కానంత వరకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవురా! అప్పటివరకు నేను నీతో మాట్లాడకపోవడమే మంచిది.” ప్రతి ఒక్కరికి ఇలాగే రిలాక్స్‍గా ఉండడం అలవాటైపోయింది. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడం తప్ప కనీసం కన్నతల్లిని కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అడిగితే నువ్వు బాధ పడతావని అడగలేదు కాని ఆ రోజు నాన్నమ్మ బిర్యాని తెమ్మని డబ్బులిస్తే కనీసం అదైనా తెచ్చి పెట్టావా? చూసి చూసి నిద్రపోయింది. నువ్వేమో వెళ్ళి పార్టీలో కూర్చుని వచ్చావు. ఆమె డబ్బుల్ని తినగలదా నాన్నా? ఆమె కనీస కోరికలు తీర్చే బాధ్యత కూడా నీకు లేదా? ఆ డబ్బులు కూడా నీవి కావు. మీ చెల్లెలు చూడడానికి వచ్చినపుడు ఇచ్చి వెళ్ళిందట. కనీసం మీ చెల్లెలు అయినా ఆమె కోరిక తీర్చి వెళ్ళిందా? నువ్వూ, మీ చెల్లెలు కాకుంటే ఎవరు పట్టించుకుంటారు నాన్నా ఆమెను. కడుపున పుట్టిన పిల్లలు మీరే పెట్టకపోతే ఎవరు పెడతారు? ఆ వయసులో ఉన్న వాళ్ళకి కావలసింది పెట్టే చేతులు నాన్నా! కరెన్సీ నోట్లు కాదు.” వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు! వీడిని నీలిమ మార్చేసిందా? వరమ్మ మార్చిందా? ఎలాగైతేనేం తన కన్నకొడుకే తన శత్రువర్గంలో చేరినట్లు విలవిలలాడింది కాంచనమాల. శివరామకృష్ణ కొడుకు ముఖంలోకి చూడలేక నేలచూపులు చూస్తూ “మావి పెట్టే చేతులే శ్రీహర్షా! మీ అమ్మ చూస్తే ఆ మాత్రం బిర్యాని నేను పెట్టలేనా అంటుంది. ఆ భయానికే నేను కాని, మా చెల్లెలు కాని మా అమ్మని పట్టించుకోం! అంతా మీ అమ్మనే చూసుకుంటుంది. గలగల మాట్లాడుతుందనే కాని మీ అమ్మ మనసు మంచిదిరా!” అన్నాడు. తండ్రిని ఏమనాలో అర్థం కాలేదు శ్రీహర్షకి. తండ్రి కాబట్టి అసహ్యించుకోలేకపోతున్నాడు. ఇలాంటి నిస్సహాయుడైన తండ్రి ఏ కొడుక్కి ఉండకూడదనుకుంటున్నాడు. తన తండ్రి లాంటి వాళ్ళు ఇంట్లో కీలకమైన వాటి గురించి క్షణం కూడా ఆలోచించరు. ఎక్కడికక్కడ తప్పించుకు తిరుగుతుంటారు. అదే కెరీర్ విషయంలో అయితే అలా ఉండరు. ఎంత కష్టం అయినా భరిస్తారు. కన్నతల్లి దగ్గర మాత్రం బాగా బలహీనమైపోతుంటారు. ఆ.. వాళ్ళదేముందిలే ముసలోళ్ళయిపోయారు. వాళ్ళేమైనా మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రారంభిస్తారా పాడా! అనుకుంటారేమో! లేకుంటే! పాతకక్షలట. ఫ్యాక్షనిజమట.. ఇది ఇల్లు కదా! దేశం కాదు కదా! ఎందుకీ రాజకీయాలు? ముసలివాళ్ళపై యుద్ధంచేసి ఏం సాధిస్తారు? కన్నకొడుకు కదా ఏమైనా తెచ్చి పెడతాడని ఆశగా చూస్తుంది. ఒక్కరోజు కూడా ఏమీ తెచ్చి పెట్టడు. ఆమె పెట్టింది తినే కదా ఇంత వాడయ్యాడు. అలాంటి తల్లి కోసం ఏం చేస్తున్నాడు? పెట్టిన చేతిని మరచిపోయి మసులుకుంటున్నాడు. శ్రీహర్ష ఆలోచనగా ఉండడం చూసి “నేను రేపు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆ ఫ్యాన్ తీసికెళ్ళి దాస్ షాపులో ఇచ్చి వెళ్తానులే! నువ్వు దానికోసం ఇప్పుడు వెళ్ళనవసరం లేదు. వెళ్ళి చదువుకో! టైం వేస్ట్ చేసుకోకు” అన్నాడు శివరామకృష్ణ. అంత వరకు అక్కడేం జరగనట్లు అతి మామూలుగా ఉంది ఆయన స్వరం ఛ ఛ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ? దేన్ని ముఖ్యంగా తీసుకోవాలో దాన్ని వదిలేసి మరీ ఇంత పట్టి పట్టనట్లు ఎలా ఉండగలుగుతారు? నోట మాట రాలేదు శ్రీహర్షకి.. బాధగా ఉంది. నేనా ఫ్యాన్ని నాన్నమ దగ్గర పెట్టి తీరతాను అని ఖచ్చితంగా అనలేకపోతున్నాడు. తండ్రిని కోప్పడాలో జాలిపడాలో అర్థం కావడం లేదు. అందుకే శ్రీహర్ష మనసంతా అలజడిగా ఉంది. నాన్నమ్మ విషయంలో ఎప్పుడు కూడా ఇలాగే తండ్రికి తనకి వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. తను ఓడిపోతూనే ఉన్నాడు చికాగ్గా అన్పించి విసురుగా బయటకి వెళ్ళాడు శ్రీహర్ష. నీలిమ అటు ఇటు తిరుగుతూ వంటపని చేస్తోంది. సంకేత అలాగే కూర్చుని వాళ్ళ మాటలు విన్నది. కాంచనమాల ఎగిరి గంతెయ్యలేకపోతోంది కాని భర్త కొడుకుతో మాట్లాడిన మాటలు ఆమె చెవుల్లో అమృతం పోసినట్లనిపించాయి. ఎప్పటిగాలే ఆప్యాయంగా భర్త దగ్గరకి వెళ్ళి ఆయన పనులు చూడడంలో నిమగ్నమైంది. అదీ శివరామకృష్ణకి కావలసింది. ఈ వయసులో తను తన తల్లి గురించి ఏ మాత్రం ఆలోచించినా తన భార్య తన గురించి ఆలోచించడం మానేస్తుంది. అప్పుడు పిచ్చి చావు చావాల్సి వస్తుంది. శ్రీహర్ష మనసు కొద్దిసేపు నొచ్చుకున్నా ఫరవాలేదు కాని తన భార్య మనసుకి నచ్చని పని చెయ్యనందుకు హాయిగా ఉందనుకున్నాడు. ఆ రాత్రికి నీలిమ పనంత పూర్తి చేసుకుని పడుకోవడానికి వచ్చినపుడు “వరమ్మకి ఫ్యాన్ పెట్టాడా శ్రీహర్షా?” అని అడిగింది సంకేత. ఫ్యాన్ పెట్టలేదని తెలిసి కూడా సంకేత అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు నీలిమకి.. అర్థం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే శ్రీహర్ష, సంకేత పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. తనకి వాళ్ళంత చదువు లేదు స్థాయి లేదు. వాళ్ళు ఏది మాట్లాడినా విని మౌనంగా ఉండటమే మర్యాదగా ఉంటుంది. అందుకే మాట్లాడలేదు నీలిమ. నీలిమ దుప్పటి కప్పితే దొరకదని వెంటనే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి “నీలిమా వరమ్మను వీళ్ళెందుకిలా చూస్తున్నారో చెప్పనా! వరమ్మ వల్ల వీళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు ఆదాయం లేదు. అనవసరంగా మానవసంబంధాల పేరుతో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ రావనుకుంటున్నారు. వీళ్లెంత అపరమేధావులో చూడు! శ్రీహర్ష ఇంకా పెద్ద మేధావి అంది. సంకేత మాట్లకి ఉలిక్కిపడి అలాగే చూసింది నీలిమ. రెండు సంవత్సరాలుగా చూస్తోంది సంకేతను నీలిమ. ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ఆశ్చర్యపోతోంది. “చూడు నీలిమా! ఇంట్లో వాళ్ళ మమ్మీ వరమ్మను ఎలా చూడాలో అలాగే చూస్తుందని శ్రీహర్షకు తెలియదా! తెలిసి కూడా ఫ్యాన్ తేవడం ఎందుకు? నా మనవడు మహా మంచివాడు అని వరమ్మ గుండెలు బాదుకోవాలనేగా! ఈ వయసులో ఆమె గుండెలకి అంత బాధ అవసరమా? ఈ మధ్యన మొండి సమస్యలపై వాదిస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నట్లు ఫీలయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇవాళ ఫ్యాన్ చేసిన పని కూడా అదే! శ్రీహర్షను ఏ అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందో కాని ఆ అమ్మాయి పని అయినట్టే!” అంది సంకేత. నీలిమ కళ్ళు విప్పార్చి చూస్తోంది. “అదెలాగో చెప్పనా?” అంది ఆత్రంగా చూస్తూ ముందుకు వంగి సంకేత. సంకేత ఏం చెప్పబోతోందో వినాలన్న ఆసక్తితో ఆత్రంగా చూస్తోంది నీలిమ. “శ్రీహర్షకి పెళ్ళై కొడుకు పుడితే! ఆ కొడుకు శ్రీహర్ష భార్యను ఇప్పుడు వీళ్ళు వరమ్మను చూసినట్లే చూస్తాడు. అప్పుడు శ్రీహర్ష భార్య వరమ్మలా మెట్ల కింద ఉండదు. రాబోయే రోజుల్లో నేలకి షార్టేజ్ వస్తుంది కాబట్టి భూమిలోనే సెల్లార్ లాగా ఓ గుంట తీసి అందులో ఉంచుతాడు..” అంది. శ్రీహర్ష భార్య భవిష్యత్తు ఏమిటో ఫుల్ పిక్చర్లో కనిపించినట్లయి షాక్ తిన్నది నీలిమ. వెంటనే తేరుకొని, ‘ఆ’ అంటూ నోరు తెరిచింది. మరీ ఇంత ఘోరంగా ఉంటుందా అని మనసులో అనుకుంది. ఎపుడైనా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెడ్‍కి మధ్యలో కూర్చుని తలమీదుగా దుప్పటి కప్పుకొని మనిషి కొంచెం కూడా కనిపించకుండా కూర్చుని చదువుకునే సంకేతేంటి ఇలా మాట్లాడుతుంది? చదివి చదివి అలిసి పోతుందని తను వెళ్ళి కాంచనమాలకు తెలియకుండా అప్పుడప్పుడు వేడి వేడి పాలు తెచ్చి ఇచ్చేది. అవి తాగుతూ కూడా పుస్తకంలో పేజీలు తిప్పుతూ క్షణం వృధా అయినా అది నీటి చుక్కలా ఆవిరై గతం ఖాతాలోకి వెళ్తుంది నన్ను మాట్లాడించకు అనేది. అలాంటిది ఇప్పుడేంటి ఇంత ఆవేశంగా మాట్లాడుతుంది? అని ఆశ్చర్య పోయింది నీలిమ. “నీకింకో విషయం చెప్పనా! ఎలక్ట్రికల్ షాప్ పెట్టిన దాస్ ఎవరో కాదు శ్రీహర్షకి ప్రాణ స్నేహితుడు. వాడు టెన్త్‍లో ఉన్నపుడు నైన్త్‍లో ఉన్న నాకు ఐ లవ్ యు చెప్పాడు. నేనిచ్చిన కంప్లైట్ తో సస్పెండై చదువు మానేశాడు. నాకు ఐ లవ్ యూ చెప్పడం అంత అవసరమా వాడికి” అంది. ఇన్ని రోజులు చెప్పని రహస్యమేదో ఇప్పుడు చెప్పినట్లు చెప్పి “దాసంటే నాకు అసహ్యం” అంది. ఆమెకు దాస్ గురించి అంత కన్నా ఎక్కువగా ఎలా చెప్పాలో తెలియలేదు. ఎంత చెప్పినా తక్కువే అన్నట్లు మాట్లాడింది. అది విని ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి చూపులు చూసింది. నీలిమ దాసంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ అంత చులకన భావం లేదు. వరమ్మ కూడా దాస్ ని అప్పుడప్పుడు మెచ్చుకుంటూనే ఉంటుంది. చిన్నప్పటికీ ఇప్పటికీ దాస్ లో చాలా మార్పు వచ్చిందని ఒకప్పుడు ఎంత అల్లరి చేసేవాడో నవ్వుకుంటూ చెబుతుంది. అప్పుడప్పుడు దాస్ ని తన పక్కన కూర్చో బెట్టుకుని కబుర్లు కూడా చెబుతుంది. “ఇన్ని రోజులు చెప్పకుండా ఈ విషయంఇప్పుడెందుకు చెప్పానో నువ్వు గెస్ చెయ్యలేవు. అది కూడా నేనే చెబుతాను విను” అంది సంకేత. “నువ్వెన్ని చెప్పినా దాస్ బాబు అంటే నాకు మరీ అంత చెడు భావన లేదు. అందుకే నా మనసు నీ మాటల్ని అంగీకరించలేకపోతోంది.” అంది నీలిమ. “అబ్బా! నువ్వు మరీ అంత ఇదవ్వకు. అతన్ని నువ్వు పూర్తిగా చూస్తే అలా అనవు..” అంది సంకేత. “అతన్ని నేనెందుకు చూడలేదు..? మొన్ననేగా మన ఇంటికి వచ్చాడు” అంటూ ఆవులిస్తూ దుప్పటి కప్పుకుంది. “నేను కూడా చూశానులే! నువ్వు తిప్పుకుంటూ వెళ్ళి కాఫీ కూడా ఇచ్చావు.. నువ్వు మరీ అంత తిప్పుకోకు. వాడి చూపులు అంత మంచివి కావు. నీక్కూడా ఐ లవ్ యూ చెబుతాడు” అంది సంకేత. అదిరి పడి లేచి కూర్చుని “నాకా!!” అంది జీవితంలో ఎప్పుడూ తిననంతగాషాక్ తింది నీలిమ. “అవును నీకే! నీకేం తక్కువ? కాలేజీ అమ్మాయికి ఎక్కువ యూనివర్సిటీ అమ్మాయికి తక్కువ అన్నట్టు ఉంటావు. నీకు తెలుసో లేదో నీ అందం ప్యూర్ గోల్డ్. ఎలాంటి కాస్మోటిక్స్ అంటని స్వచ్చమైన ప్రకృతి సమానమైనది. ఏదో నీ ఖర్మ కాలి ఇక్కడొచ్చి పడ్డావు కాని హాయిగా ఆ అనాధ ఆశ్రమంలోనే ఉండి ఉంటే నీట్ గా చదువుకొని బ్రైట్ గా ఉండేదానివి. ఇప్పుడు చూడు ఏదైనా అవసరం ఉండి శ్రీ హర్ష పిలవగానే ‘యస్ సర్! ఓ.కె సర్! ఇప్పుడే తెస్తాను సర్! రెడీ అయింది సర్!” అంటూ పిచ్చి దానిలా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుంటావు. నువ్వు శ్రీహర్ష పట్ల చూపే గౌరవాన్ని వినయాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. చూడు నీలిమా మనం ఇస్తున్న గౌరవం కాని వినయం కాని అపాత్ర దానం కాకూడదు. అంది సంకేత శ్రీహర్ష మీద ఉన్న కోపంతో.. వింటున్న నీలిమకు ఒకే ఒక్క విషయం దగ్గర ఆశ్చర్యం అనిపిస్తోంది. నిన్ననే శ్రీహర్ష సంకేత గురించి తనతో మాట్లాడాడు. అతను మాట్లాడిన ప్రతి మాటలో సంకేత పట్ల మంచి అభిప్రాయం ఉంది. అభిమానం ఉంది. అంతే కాదు సంకేతను చదువులతల్లిగా, సున్నితమైన అమ్మాయిగా భావిస్తున్నాడు. అతని భావన ఎక్కడ? సంకేత మాటలు ఎక్కడ? సంకేతకు అతనంటే ఇంత చిన్న చూపు ఉందని అతనికి తెలుసా? తెలిస్తే! సంకేత ఆత్మాభిమానం గల అమ్మాయి అని త్వరగా హర్ట్ అవుతుందని వాళ్ళ అమ్మకి కోపం వచ్చినపుడు సంకేతకి సపోర్టుగా ఉండమని తనతో ఎందుకు చెబుతాడు? సంకేతకి మొహమాటం అని కూడా చెప్పాడు. ఇదేనా మొహమాటం అంటే? ఆమె మనసులో తనకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియకుండా ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడినట్లున్నాయి శ్రీహర్ష మాటలు. దీన్ని బట్టి చూస్తుంటే శ్రీహర్ష సంకేతకు తెలియకుండా సంకేతను ప్రేమిస్తున్నట్లుంది. తెలియకుండా ఎంత ప్రేమించి ఏం లాభం? తెలిస్తే సంకేత ఒప్పుకుంటుందా? “ఏంటి నీలిమా? ఆలోచిస్తున్నావ్?” అడిగింది సంకేత. “ఆలోచించలేదు. నిద్రొస్తోంది మేడమ్!” చెప్పించి నీలిమ. “సరే! నిద్రపో! దాస్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. శ్రీహర్ష కూడా అంత మంచివాడేం కాదు. డబ్బులేని వాళ్ళంటే అతనికి తక్కువ చూపు” *** సంకేత మనస్సంతా ప్రస్తుతం తను తీసుకోబోయే కోచింగ్ మీదనే ఉంది. కళ్ళు మూసినా, తెరిచినా అదే ఆలోచన, అదే తిండి. అదే నిద్ర. అదే జీవితం అయినట్లు అదే తపనలో ఉంది. గేట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుందని పల్లవితో చెప్పింది సంకేత.. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తనకి మంచి మార్కులు వచ్చాయి అని కూడా చెప్పింది. పల్లవి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడడం లేదో సంకేతకి అర్థం కాలేదు. చెప్పగానే ‘వావ్!’ అనకుండా ఇంత నిస్తేజంగా ఉందేమిటి? పల్లవి నోరు విప్పి ‘హిందూకి చెప్పావా? అది నీ బెస్ట్ ఫ్రెండ్ కదా!” అంది. “చెప్పాను. హిందూ వద్దంటోంది. బి.టెక్ తోనే ఏదైనా జాబ్ చూసుకో అంటోంది. నాకు ఇప్పుడే జాబ్ చేయాలని లేదు. ఇంకా చదవాలని ఉంది. ఎం.టెక్ లో సీటొస్తే నేను మా పేరెంట్ మీదఈ మాత్రం కూడా ఆధార పడకుండా చదువుకోవచ్చు. పైగా యు.జి.సి వాళ్ళు ఇచ్చే మనీ లోంచి కొంత మిగిల్చి మా నాన్న కోసం నా కోసం చేసిన అప్పు కట్టొచ్చు. నువ్వు ఏమంటావు పల్లవీ?” అంటూ సలహా అడిగింది సంకేత. పల్లవి ఆశ్చర్య పోతూ “పోయి పోయి ఇలాంటి సలహాలు నన్నే అడుగు. నేను ఈ బి.టెక్ నే ఎక్కువ అనుకుంటుంటే నువ్వు ఎం.టెక్ కూడా చదువుతావా? నీదసలు బుర్రేనా ఇప్పటికే నా బుర్ర వేడెక్కి ఎప్పుడు బ్రేక్ అవుతుందో నని అప్పుడప్పుడూ డౌటొతుంది. నీకు రాదా?” అంది. “ నాకు రాదు. ఎందుకంటే మెదడుకున్న కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఐన్ స్టీన్ అంతటి వాడు వాడుకున్నది టు పర్సెంటేనట. ఆఫ్ట్రాల్ మనమెంత? మనం వాడుకునేది ఎంత?” అంది సంకేత. పల్లవి “ఓ అలా ఫిక్సయ్యావన్నమాట.. మరి నీకు గేట్ లో సీట్ వస్తుందంటావా?” “తప్పకుండా వస్తుంది. నేను చిన్నప్పటినుండి చదివింది గవర్నమెంట్ స్కూల్లో. అందులో ఉన్న టీచర్స్ అంతా డియస్సీల్లో ఉత్తీర్ణులైనవారు. అదీకాక నేను స్టేట్ సిలబస్ మ్యాథ్స్ చదివాను. మ్యాథ్స్ విషయంలో సెంట్రల్ కంటే స్టేట్ సిలబస్ చాలా స్టాండర్డ్. కాబట్టి నేను తప్పకుండా గేట్‍లో సీటు సాధించగలను.” అంది కాన్ఫిడెంట్ గా సంకేత. పల్లవి మాట్లాడలేదు. ఆ తరువాత కొద్దిక్షణాలు నిశ్శబ్దం. పల్లవి మాట్లాడకపోవడంతో సంకేత నిట్టూర్చి”ఎందుకో చదువు పిచ్చి రోజురోజుకీ నాకు ఎక్కువవుతుంది పల్లవీ! ఇప్పుడు నీకీ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే మొన్న నువ్వు కాలేజీలో నా ఫైన్ కట్టినట్లే ఈ కోచింగ్ ఫీజు కూడా కడతావని.. ప్లీజ్ పల్లవీ! నాకు మనీ రాగానే ఇచ్చేస్తాను.” అంది రిక్వస్ట్‍గా. “నీ ఫైన్ కట్టింది నేను కాదు” అంది వెంటనే పల్లవి. “నువ్వు కాదా!! ఇంకెవరు? హిందూ కూడా కాదే…!” ఆలోచనలో పడింది సంకేత. “అనంత్!” చెప్పింది పల్లవి. ఆలోచన చెదిరి దిగ్భ్రాంతిగా చూసింది సంకేత. వెంటనే తేరుకొని “అనంత్ కట్టాడా? మరి నాకు చెప్పలేదేం?” “అనంట్ చెప్పొద్దన్నాడు.” ఈసారి ఇంకా షాక్ తినది సంకేత. హెల్ప్ చెయ్యకపోయినా చేసినట్లే పదిమందికి చెప్పుకునే వాళ్ళను చూస్తున్నాం.. హెల్ప్ చేసి కూడా ఇలా సైలెంటయిపోయేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అనంత్ ఎంత మంచి వాడు. మంచివాడే కాదు, గొప్పవాడు కూడా.. తనున్న పరిస్థితిలో తనకి అలాగే అన్పిస్తున్నాడు మరి… “ఎందుకు చెప్పొద్దన్నాడు?” అడిగింది సంకేత. “ఇంత చిన్న విషయానికే నిన్ను డిస్టర్బ్ చెయ్యడం ఎందుకులే అని కావొచ్చు… తెలిస్తే నువ్విక దానిగురించే థింక్ చేస్తూ అతని డబ్బులు అతనికి ఇవ్వాలన్న ప్రయత్నంలో ఇబ్బందిపడతావని కావొచ్చు. ఇది కామన్ సంకేతా! లైట్ తీసుకో!” అంది పల్లవి. ఇది కామనా! ఇది చిన్నవిషయమా! డబ్బు విషయంలో ఎవరూ అలా ఉండరు. అదే శ్రీహర్ష కాని, దాస్ కాని అలా ఇస్తారా? ఒకవేళ ఇచ్చినా వెంటనే “నువ్వో రైతు కూలి కూతురువి…’ అన్నట్లు వాళ్ళు పెట్టే ఎక్స్‍ప్రెషన్స్ కి అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది. అందుఏ అనంత్ నిండుగా ప్రవహించే నదిలా అన్పిస్తే! వాళ్ళేమో త్రుళ్ళి త్రుళ్ళి పడే నీటిచుక్కల్లా అన్పిస్తున్నారు. “ఏంటి సంకేతా! ఆలోచిస్తున్నావ్? ఇలా ఆలోచిస్తావనే అనంత్ చెప్పొద్దన్నాడు. అనంతే కరెక్ట్!” “నాకు తెలిసివుంటే అనంత్ కి అప్పుడే థ్యాంక్స్ చెప్పేదాన్ని.. అలా చెప్పలేకపోయినందుకు గిల్టీగా ఉంది…” “…ముందు నీ సెల్‍ఫోన్లోంచి అనంత్‍కి కాల్ చెయ్యి అతనికి నేను అర్జెంటుగా థ్యాంక్స్ చెప్పాలి” అంది సంకేత. “నా సెల్‍ఫోన్లో బ్యాలెన్స్ లేదు” అంది పల్లవి. “ఇప్పుడెలా?” అంటూ టెన్షన్, టెన్షన్‍గా చూసింది సంకేత. “కొద్దిగా టైం తీసుకోరాదే! ఎందుకంత తొందర!” “ఇది తొందర కాదు. కృతజ్ఞత తెలుపుకోవాలనుకోవటం…” “చూస్తూనే తెలుస్తోందిలే! ఈ విషయంలో నువ్వెంత ఎమోషనల్‍గా ఉన్నావో! కాలేజి నుండి ఇంటికెళ్ళే ముందు మాట్లాడు. ఫోన్లోకన్నా డైరెక్ట్ అయితే ఇంకా బావుంటుంది” చెప్పింది పల్లవి. “సరే! కానీ ఎందుకో అతనితో మాట్లాడాలంటే భయంగా ఉంది. నువ్వు కూడా నాతో ఉండవా? ప్లీజ్!” “నా బైక్‍ను రిపేర్‍కి ఇచ్చాను. త్వరగా వెళ్ళి తెచ్చుకోవాలి. ఆరోజు యాక్సిడెంట్ అయినప్పటి నుండి రిపేర్ మీద రిపేర్ అవుతూ నా బైక్ అసలు కోలుకోవడం లేదు… నా బాడీకి కూడా రిపేర్ వచ్చిందో ఏమో ఒకటే పెయిన్స్.. ఏం చేయాలో తోచటం లేదు” అంటూ తనకి వీలుకాదని చెప్పకనే చెప్పింది పల్లవి. పల్లవి తనతో రాదని తెలిసిపోయింది సంకేతకి… పల్లవి ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉంటుంది. ‘ఎస్‍ఆర్‍నో’ చెప్పిందీ అంటే తర్వాత ఏది ఏమైనా రాజీపడదు. … కాలేజీ వదిలాక అనంత్‍కి థ్యాంక్స్ చెప్పాలనుకున్న విషయం హిందూకి చెప్పలేదు సంకేత. కారణం హిందూ కొన్నివిషయాలను ఒప్పుకోదు. డబ్బులు ఇచ్చేటప్పుడు చెబితే సరిపోతుంది కదా! ప్రత్యేకంగా అతని కోసం ఆగి థ్యాంక్స్ చెప్పడం దేనికి… అందరి దృష్టిలో పడడం దేనికి? అంటుంది. అందుకే హిందూకీ ఏదో పనిఉందని అబద్ధం చెప్పి కాలేజీలోనే ఓ చోట ఆగిపోయింది. సంకేత అనంత్ తన బైక్ దగ్గరకి వెళుతుండగా తను కూడా అటు వైపు వెళ్ళి “అనంత్! మీకు నేను థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను” అంది చాలా నెమ్మదిగా… ముందు ఏమో అనుకుంది కానీ ఆ తర్వాత ఆమె గుండె కొట్టుకోవడం ఆమెకి స్పష్టంగా వినిపిస్తోంది. ,,,స్టూడెంట్‍లు అంతా ఇళ్ళకెళ్తూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. అనంత్ నవ్వి “గెస్ చేశాను” అన్నాదు. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి “అనంత్! మీ మనీ మీకు తిరిగి ఇవ్వాలంటే నాకు కొంత టైము కావాలి…” అంది. “ఎంత టైం కావాలన్నా తీసుకో… దీని గురించి ఎక్కువగా ఆలోచించకు… నువ్వు ఇవ్వకపోయినా ఏమీ అనుకోను… ఎందుకంటే నీలాంటి బ్రిలియంట్, హైపర్సంటేజ్ అమ్మాయికి హెల్ప్ చేయడం నాకు హ్యాపీగా ఉంది…” అన్నాడు. అతను బైక్‍స్టాండ్ తియ్యకుండా దాన్ని ఆనుకుని హుందాగా నిలబడ్డాడు. మళ్ళీ అతనే “నాకు చదువన్నా, బాగా చదివేవాళ్ళన్నా అప్పుడప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే నేను బాగా చదివేవాళ్ళతో పోటీపడి చదవలేను. అది నా బలహీనంగా” అన్నాడు. అదేంటి అన్నట్లు అతని వైపు చూసింది సంకేత. …అతను నిలబడిన విధానం చాలా స్ట్రైల్ గా, పాష్‍గా అన్పిస్తోంది, అతన్ని ఒక్కక్షణం అలాగే చూసి, కాలేజిబ్యాగ్ ఏదో బరువైనట్లు ఈ భుజం నుండి ఆ భుజానికి మార్చుకుంటూ “ఇంక నేను వెళ్తానండీ!” అంది సంకేత, అతను వెంటనే బైక్‍ను స్టార్ట్ చేసి “నేను వెళ్తున్నది కూడా అటువైపే! డ్రాప్ చేస్తాను రండి!” అన్నాడు చాలా క్యాజువల్‍గా “నో థ్యాంక్స్” షాక్ తిన్నాడు అనంత్… అనంతభుజం మీద చేయి పడడంతో సంకేతే తనని తడుతున్నదా అన్నంతగా ఉలిక్కిపడి, షాక్ లోంచి తేరుకున్నాడు, సంకేత కాదు. అనంత్ స్నేహితుడు! సంకేత తనని తిడుతున్నదా అన్నంతగా ఉలిక్కిపడి షాక్ లోంచి తేరుకున్నాడు. సంకేత కాదు. అనంత్ స్నేహితుడు! సంకేత ఎపుడో ఆటోఎక్కి వెళ్లిపోయింది. స్నేహితుడితో మాట్లాడుకుంటూ బైక్ మీద ఇంటికెళ్ళాడు అనంత్. దారిలో బైక్ మీద ఉన్నప్పుడు “అనంత్! ఈ వీకెండ్ ఏ హోటల్ కి వెళ్దాం? మన ఫ్రెండ్స్ అంతా ఈ సారి అనంత్ కే వదిలేద్దాం అంటున్నారు. నువ్విప్పుడు చెబితే నేను అరేంజ్ చేస్తాను” అన్నాడు. అనంత్ ఏ విషయంలోనైనా బ్రాండ్ మెయిన్‍టెయిన్ చేస్తాడని ఫ్రెండ్సందరికీ తెలుసు. అందుకే వాళ్ళనంత్ ని బాగా ఇష్టపడతారు. “నాకెందుకో పార్టీలన్నా ఫ్రెండ్సన్నా బోర్ కొడుతోంది. కొద్దిసేపు ఒంటరిగా కూర్చుని గడపాలనిపిస్తోంది” అన్నాడు అనంత్. స్నేహితుడు అదిరిపడి “ఇలా ఎపుడనిపిస్తుందో తెలుసా! మన మనసు మనకు తెలియకుండానే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నప్పుడు! నువ్వేమైనా అలా ఆలోచిస్తు న్నావా? “ఛ ఛ అలా ఆలోచించే అలవాటు నాకు లేదు.. నువ్వూ.?”? “ఎందుకాలోచించను! నాకు బాడీ లేదా? బాడీ కెమిస్ట్రీ లేదా? హార్మోన్స్ వర్కవుట్ కావా? నేనేమైనా ‘గె’నా?” “అలా అని నేనేమైనా అన్నానా?” “నువ్వు అనవులే! కానీ నేను పర్‍ఫెక్ట్‍లీ ఆల్‍రైట్! అయినా ఒక్క అమ్మాయి కూడా నాతోమాట్లాడడం లేదు. ముఖం మీదనే చెబుతున్నార్రా! ‘నీతో తిరిగితే టైం వేస్ట్!’ అని…” “టైం వేస్ట్ దేనికి?” ఆసక్తిగా చూస్తూ అడిగాడు అనంత్. “నా దగ్గర బైక్ లేదట. పబ్బులకి పార్టీలకి తిప్పలేనట! పైగా వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ కే ఎగ్జయిటై గంటలు, గంటలు మాట్లాడే రోజులు పోయాయట.. పైగా మీకూ, మాకూ తేడా ఏముంది? మీరు పార్టీలల్లో కూర్చుని తాగుతారు. మేం తాగము అంతేకదా! ఇప్పుడు ఆ తేడా కూడా కొద్దికొద్దిగా తగ్గిపోతుంది అంటున్నార్రా! ఇంతెందుకు మన ఫ్రెండ్ రాజీవ్ చచ్చీచెడి ఇన్‍స్టామెంట్‍లో బైక్ కొన్నాడా! వాడసలు బైక్ కొన్నదే అమ్మాయిల్ని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టుకుని తిరగడానికి.. కానీ అది కొన్నప్పటినుండి ఒక అమ్మాయి కూడా ఎక్కట్లేదట.. అప్పు చేసైనా సరే ఆ బైక్ మీద అమ్మాయిల్ని ఎక్కించుకొని తిరగాలిరా! అంటున్నాడు. వాడి ప్రాబ్లమ్ వాడిది. నా ప్రాబ్లమ్ కూడా అదే! డబ్బు అసలు ఈ డబ్బునెందుకు కనిపెట్టారో కాని మనుషులతో ఆడుకొని చంపుతోదిరా! మనసుతో అవసరమే లేకుండా చేస్తోంది..” అన్నాడు స్నేహితుడు. అనంత్ ఏమీ మాట్లాడలేదు, “ఏంటోరా! రోజు రోజుకు నేటి స్టూడెంట్లు కొందరిలో బాగా మార్పు వస్తోంది. అదీ కాక ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇష్టపడిన వ్యక్తితో సహజీవనం చేస్తే తప్పు కాదని జారీచేయడం ఒక అడ్వాంటేజ్ అయిపోయింది మన అబ్బాయిలకి. ఎంత ఎంజాయ్ చేస్త్ అంత ప్రతిష్టగా భావించే అమ్మాయిలు కూడా ఎక్కువే అయ్యారు. కాని వాళ్ళకు వాళ్ళు చేసే పనులు తప్ప మిగతావన్ని తప్పుల్లాగే తోస్తాయి. వాళ్ళ కర్తవ్యం, బాధ్యతను మరచి గొప్పలకు పోయి ముందు జీవితం గురించి మరచిపోతున్నారు. చదువు అనే ఉద్దేశ్యంతో పట్టణాల్లో పెద్ద కాలేజీల్లో చేరి హాస్టల్స్‍లో ఉండే కొందరు అబ్బాయిలు, కొందరు అమ్మాయిలూ చాలా వరకు చదువును పక్కన బెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ వయస్సులో కాక ఇంకెప్పుడు చేస్తాం అంటారు. మరి చదువు ఏ వయస్సులో చదువుతారో..? అన్నాడు స్నేహితుడు. ఆ మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తన గదిలో కూర్చున్నాడు అనంత్. ఎప్పుడైనా మనసనేది తనకి హాయిగా అనిపించే అంశాలనే తనని ఆహ్వానిస్తుంది. ఎంత మర్చిపోదామన్నా సంకేత తన బైక్ మీద కూర్చోకపోవడమే గుర్తొస్తోంది. ఎప్పటికైనా సంకేతను తన బైక్ ఎక్కేలా చెయ్యాలి. అది చూసి తన ఫ్రెండ్స్ అంతా అనంత్ గ్రేట్! అనుకోవాలి. ఇదే ఆలోచనలో ఉన్నాడు. అయినా తనేంటి సంకేత గురించి ఇలా ఆలోచిస్తున్నాడు? అని వెంటనే తల విదిలించి లాప్‍టాప్‍ని ముందు పెట్టుకొని ఏదో సైట్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చున్నాడు. నీలిమ ఎప్పుడైనా కాంచనమాల ఇచ్చే జీతం డబ్బులను తన అవసరాలకు ఖర్చు పెట్టుకుంటుంది. మిగిలినవి దాచుకుంటుంది. అలా దాచుకున్న డబ్బులతో మార్కెట్ కి వెళ్ళినపుడు దగ్గరలోఉన్న హోటల్‍కి వెళ్ళి వరమ్మకోసం బిరియాని కొన్నది. హోటల్లోంచి బయటకొస్తుంటే రోడ్డు ప్రక్కన స్కూటీని పట్టుకొని నిలబడిఉన్న పల్లవి కనిపించింది పల్లవిని చూడగానే బిరియానిని దాచేసింది. తనకి ఎన్నో రోజులుగా వరమ్మకి బిర్యాని తెచ్చి పెట్టాలని ఉంది. కాంచనమాల కావాలనే ఇంట్లో ఆ ఐటమ్‍ని చెయ్యనియ్యదు. అత్తగారి కోరిక తనెందుకు తీర్చాలన్న పంతం కాబోలు. ఎంతైనా వరమ్మ కోరిక తీర్చబోతున్నందుకు తృప్తిగా ఉంది నీలిమకు. పల్లవికి మాత్రం నీలిమను చూడగానే దేవుడే దిగివచ్చినట్లు అన్పించి త్వరగా రా అన్నట్లు చేయిఊపి సైగ చేసింది. నీలిమ వస్తున్న నవ్వును ఆపుకుంటూ ‘నువ్వెందుకు సైగ చేస్తున్నావో నాకు తెలియదా? ఆ స్కూటీని రన్నింగ్‍లో ఉన్నప్పుడు తప్ప ఆపితే నువ్వు పట్టుకోలేవు. పడేస్తుంటావు. చూడటానికేమో నలుగుర్ని పడేసి కొట్టేలా ఉంటావు. ఆగిఉన్న స్కూటీని పట్టుకొని స్టాండ్ వెయ్యలేవు (పార్క్ చెయ్యలేవు). పైగా ఆ స్కూటీకి నీకున్న లింకేంటో తెలియదు కాని అది నీ ఒక్కదానికి మాత్రమే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే చాలు వెనుక నిలబడి ఉన్నవాళ్ళు ఆ పొగపీల్చలేక చావాలి. ఆ డొక్కు స్కూటీతో ఇంకా ఎన్నిరోజులు వేగుతావో ఏమో!’ అని మనసులో అనుకుంటూ పల్లవివైపు వెళ్ళింది. “ఏంటీ! ఏదో అనుకుంటూ వస్తున్నావు?” “ఏం లేదు మేడమ్! స్కూటీని ఎక్కడ పడేస్తావో అని త్వరత్వరగా వస్తున్నాను…” అంటూ నీలిమ వెళ్ళి స్కూటీని పట్టుకునే లోపలే కింద పడేసింది పల్లవి. కిందపడిన స్కూటీని కాలితో ఓ తన్ను తన్ని నీలిమవైపు కోపంగా చూస్తూ “తిన్నగా రాలేవా? మాట్లాడకుండా ఉండలేవా? అసలే ఈ రోజు ఇది నాలుగోసారి పడెయ్యడం… స్కూటీని ఆపాలంటేనే భయంగా ఉంది” అంది. “ఆపకండి మేడమ్! ఈ అవస్థ ఎవరు పడతారు?” “అంటే ఎప్పటికీ స్కూటీమీదనే ఉండమంటావా?” కొట్టేలా చూసింది పల్లవి. “కూల్ కూల్ మేడమ్ ఇప్పుడు కింద పడిన ఈ స్కూటీని లేపేముందు మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి…” అంది ఆ స్కూటీని ఏ మాత్రం తగలకుండా. అర్థం కాక “ఏంటీ?” అంది అరిచినట్లే పల్లవి. “నేను ఇంతకుముందే వరమ్మ బెడ్‍షీట్లు ఉతికి వచ్చాను. స్కూటీని ముట్టుకుంటే ఫరవాలేదంటావా?” పల్లవి తలను వేగంగా, అడ్డంగా ఊపుతూ “వద్దు తల్లీ! నువ్వు వెళ్ళు. నేణు ఎవరో ఒకర్ని పిలుచుకుంటాను…” అంది. నీలిమ అటు ఇటు చూసి “ఇక్కడెవరున్నారు ఖాళీగా! అదిగో ఆ చిత్తుకాగితాలు ఏరుకునేవాడు తప్ప. పిలువు నాకన్నా వాడే బెటర్ నీకునేను వెళ్తున్నా…” వాడిని చూడగానే వాంతి వచ్చినట్లయి “ఆగాగు నీలిమా!” అంటూ పిలిచింది పల్లవి. “నేను ఆగను… నీకు ఇంతకుముందే చెప్పాను స్కూటీపై ఎక్కడికి వెళ్ళినా సంకేత మేడమ్‍ను తీసికెళ్ళమని.. ఆ మేడమ్ అయితేనే ఆ బండిని బలంగా పట్టుకోగలదు”, “అంటే నేను బలంగా లేనా? నాది బలం కాదా? వాపా?” అరిచింది. “అని నేను అన్నానా? అన్నీ మీరే అనుకుంటారు. మళ్లీ బాధపడతారు కనీసం శివానీ మేడమ్ నైనా తోడుగా రమ్మనాల్సింది.” అంది అదోలా చూస్తూ… “సరేలే! వచ్చి దీన్ని లేపు” “నాకు పని ఉంది. నేను వెళ్తున్నా…” అంది స్కూటీని లేపకుండా వెళ్ళిపోతూ… వెళ్తున్న నీలిమను చూసి “ఎంత పొగరే నీకు! ఫ్యూచర్లో నాకు దొరక్కపోతావా! అంది పల్లవి గట్టిగా. నీలిమ నెమ్మదిగా వెనుదిరిగి చూసి “నాది పొగరు కాదు. నా పనులు మీకు నచ్చనప్పుడు మీ పనులు నేనెందుకు చెయ్యాలి? వరమ్మను అంటరానిదానిలా చూసే వాళ్ళెవరూ నాకు నచ్చరు. అర్థమైందా?” అంటూ వెళ్ళిపోయింది నీలిమ. ఇంటికి వెళ్ళగానే కాంచనమాలకి కన్పించకుండా బిర్యాని తీసికెళ్ళి వరమ్మకి పెట్టింది నీలిమ… అది రెండు ముద్దలు తినగానే ఆమె కోరిక తీరినట్లయింది. “నీలిమా! నాచేత బిర్యాని తినిపించి నా కోరిక తీర్చావు. ఇది నాకు రుణమే! ఇదే కాదు. నువ్వు న్కు చేసే పనులన్నీ ఋణమే! నేనెలా తీర్చుకోను” అంది ఆలోచనగా… తన కొడుకు తీర్చలేని కోరికను నీలిమ తీర్చినందుకు కృతజ్ఞతగా చూస్తూ… ఆశ్చర్యపోయి చూసింది నీలిమ… “ఈ వరమ్మ ఏంటి ఇలా మాట్లాడుతోంది? ప్రతిదీ లెక్కలు కట్టుకుంటూ ఇప్పటికే చాలా జీవితాన్ని దాటుకుంటూ వచ్చింది కదా! ఇంకా ఈ ఋణాల ప్రసక్తి దేనికి? ఏంటో ఈ పెద్దవాళ్ళు! హాయిగా తినిపడుకోరు.’ అని మనసులో అనుకుంటూ… “ఎక్కువగా ఆలోచించకు వరమ్మా!” అంది నీలిమ ప్రేమగా వరమ్మ భుజంపై చేయివేసి… వరమ్మ మాట్లాడలేదు. అంతవరకు వరమ్మ చదువుతూ ప్రక్కనబెట్టిన ఆధయత్మిక పుస్తకాన్ని అందుకొని వరమ్మ చేతిలో పెడుతూ “ ప్రశాంతంగా చదువుకుంటూ కూర్చో వరమ్మా!” అంది నీలిమ… శివరామకృష్ణ గది బయట గోడకి అమర్చిన ఏ.సి. స్టాండులోంచి వస్తున్న శబ్దం వరమ్మ, నీలిమ చెవులకి వినిపిస్తోంది. వరమ్మ బెడ్ దగ్గర చీమలు కన్పించడంతో వాటిని దులిపి, శుభ్రం చేసి వెళ్ళింది నీలిమ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * కాలం వేగంగా కదులుతోంది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికొస్తూ “అనంత్ విషయంలో నాకెందుకో భయంగా ఉంది పల్లవీ!” అంది సంకేత. “భయం దేనికి సంకేతా?” అర్థం కాక అడిగింది పల్లవి. “అతను ఈ మధ్యన నాతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నన్నే ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు. ఇంటికెళ్ళాక కూడా బయటకొచ్చి కాయిన్ బాక్స్ లోంచి కాల్ చేయమని అడుగుతున్నాడు. ఏం చేయనే అతను చెప్పినట్టే నాకూ చేయాలనిపిస్తోంది. కానీ చేయలేకపోతున్నా. అతను మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. అతను ఒక్కరోజు మాట్లాడకపోయినా, నావైపు చూడకపోయినా ఎందుకు మాట్లాడటంలేదు? ఎందుకు చూడటం లేదు? అని ఒకటే ఆరాటంగా ఉంటోంది. నన్నేం చేయమంటావో చెప్పవే?” అడిగింది సంకేత. మౌనంగా చూస్తోంది పల్లవి. “ఇన్ని రోజులు నిద్ర లేచినా నిద్రపోతున్నా నాధ్యాసంతా చదువుమీదే ఉండేది. పుస్తకం చేత్లో లేకుంటే చేతులు రెండు పీకినట్లయ్యేది. ఇప్పుడు అలాలేదు పల్లవీ! నాలో ఏదో మార్పు… ఈ మార్పుకూడా బావున్నట్టనిపిస్తోంది. అన్పించడం కాదు. ఈ మార్పే బాగుంది. నేనేం చేయనే…” అంది సంకేత. లోలోన ఆశ్చర్యపోతోంది పల్లవి. ఈ మధ్యన నిజంగానే మారింది సంకేత. అనంత్ అప్పుడెప్పుడో “నీ బాడీ స్కిన్ లో సూపర్ లైటింగ్ ఉంది సంకేతా! ఇంకా కొంచెం ఉంటే ఖతర్నాక్ లా ఉంటావు.” అని అన్నాడని వెంటనే తన హాస్టల్ దగ్గరకి వచ్చి తనని డబ్బులు అడిగి తీసుకొంది. బ్యూటీ ప్రోడక్టులు అయిన ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్, స్క్రబ్, టోనర్స్, క్లెన్సర్స్ కొన్నది. అవి చూడగానే తనకి కళ్ళు తిరిగాయి. ఒకప్పుడు ఎలా ఉన్న సంకేత ఎలా మారింది? నిజం చెప్పాలంటే సంకేతకి ఫెయిర్ అండ్ లవ్లీ వాసన కూడా తెలియకుండా ఉండేది. బి.టెక్ చదువుతున్నావు స్కిన్ మీదకేర్ లేకపోతే ఎలా అంటే అవి ఒంటికి పడవు అనేది. ఇప్పుడేమో అనంత్ కోసం అందంగా ఉండాలనుకుంటోంది. ఉన్న అందాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాలనుకుంటోంది. పల్లవి మాట్లాడకపోవడంతో నెమ్మదిగా తట్టి “నన్ను అర్థం చేసుకో పల్లవీ! నాకిప్పుడు మా తల్లిదండ్రులు గుర్తు రావడంలేదు. అలా రాకపోవడమే బాగుంది. వాళ్లెప్పుడు గుర్తొచ్చినా వాళ్ళు పొలం వెళ్ళి ఎండలో ఎండడం, వానలో తడవడం కళ్ళముందు కదిలి బాధగా అన్పిస్తుంది. ఆ బాధనెందుకో నా మనసు ఇప్పుడు స్వీకరించడం లేదు. ప్రతిక్షణం ఉల్లాసంగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని అలాంటి వాటినే గుర్తుచేసుకోవాలని ఉంది. అసలు నా మనసు మైదానం నిండా స్పోర్ట్ మేన్ లా అనంతే ఉన్నాడు. చాలా చాలా గ్లామరస్ గా ఆడుతున్నాడు. అద్భుతంగా పరుగులు తీస్తున్నాడు. నేనేం చేయను చెప్పు?” అంది సంకేత. సంకేత బాధ పల్లవికి కన్పిస్తూనే ఉంది. ఒకసారెప్పుడో “నువ్వు చాలా స్లిమ్ గా ఉన్నావు సంకేతా! ఇంకా స్లిమ్ గా ఉంటే బాగుంటావ్! అన్నాడట. అప్పటినుండి రోజుల తరబడి తిండి మానేసింది. ‘ఇదేం కర్మే నీకు?” అంటే “ఖర్మేంటీ? నేను డైటింగ్ లో ఉన్నా…” అనేది. “మాట్లాడే ఓపిక కూడా లేకుండా ఇదేం డైటింగే” అని అడిగితే ముఖం అదోలా పెట్టి… “ఏమోనే! అనంత్ అలా అన్నప్పటినుండి నోట్లో అన్నం ముద్ద పెట్టుకోవాలంటేనే దడగా ఉంది. ముద్ద, ముద్దకి బెలూన్ లా ఉబ్బి పోతానేమో! గున్న ఏనుగులా కొండలా కనిపిస్తానేమోనని భయం… నేను కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా అనంత్ కళ్ళకి అద్భుతంగా అనిపించాలి. అలా కన్పించాలి అంటే ఏం తినాలి? ఏం తినకూడదు? తింటే ఎంత తినాలి? తినకపోతే ఎన్నాళ్ళు మానేయాలి? ఈ సమాచారం కోసం ఇంటర్ నెట్ కి వెళ్ళాను. పత్రికల్లో వెదికాను. యోగా గురువు దగ్గరకి వెళ్ళాను. బ్యూటీషియన్ని, డైటీషియన్ని కలిశాను. “ అనేది. “అవన్నీ చేయాల్సింది నేను కదే! నీకెందుకీ బాధ? అయినా నీ పొట్ట నీ చేతిలో పడి అనవసరంగా ఘోష పడుతోంది. మనుషులకి ఉన్నట్లే శరీరభాగాలకి కూడా హక్కులు ఉంటే నీ పొట్ట నేరుగా వెళ్ళీ మానవ హక్కుల కమీషన్ ని కలిసేది. తాడో పేడో తేలేదాకా నిన్ను వదిలేది కాదు.” అని మాత్రం అనేది తను. అంతకన్నా ఎక్కువ అంటే తను పిలిచినప్పుడు స్కూటీ మీద బయటకి రాదేమో నని భయం. సంకేత రాకపోతే స్కూటీని ఆపినప్పుడల్లా దాన్ని పట్టుకోలేక ఆ స్కూటీతో పాటు తను కూడా స్కూటీమీద పడిపోతుంది. ఆ భయానికే స్కిన్ టైట్ డ్రస్సులు కూడా వేసుకోవడం మానేసింది. “మాట్లాడు పల్లవీ!” అంది సంకేత. నేనింత ఆపదలో ఉంటే నీ ఆలోచన ఏంటీ అన్నట్లు చూస్తూ… పల్లవి మన లోకంలోకి వచ్చి “అవునూ! మొన్న మీ మదర్ కి ఒంట్లో బావుండలేదని మీ ఊరినుండి ఎవరో వస్తుంటే మీ ఫాదర్ చెప్పి పంపారు కదా! వెళ్ళావా?” అంది. సంకేత ముఖం అదోలా పెట్టి “అది అనవసరమానే ఇప్పుడు? ఎప్పటిలాగే మా నాన్న మా అమ్మను మా ఊరిలో ఉండే ఆర్.ఎం.పి. డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళే ఉంటాడు. జ్వరమేగా! తగ్గి ఉంటుంది. అసలు ఆ రోజంతా అనంత్ నన్ను పార్క్ కి తీసికెళ్ళీ మాట్లాడుతూనే కూర్చున్నాడు తెలుసా! అందుకే మా ఊరు వెళ్ళలేకపోయాను…” అంది. చివరి వాక్యం అంటున్నప్పుడు ఆమె కళ్ళు అరక్షణం వెలిగి మళ్ళీ మామూలుగా అయ్యాయి. కన్నతల్లికన్నా అనంత్ ఎక్కువా? ఇది మరీ ఆశ్చర్యంగా అన్పించింది పల్లవికి… పల్లవికి సంకేతతో మాట్లాడాలనిపించలేదు. ఇప్పుడున్న అమ్మాయిలకి సంకేతకి ఏదో తేడా ఉందనిపిస్తోంది. అనంత్ పట్ల ఇంత అంకితభావం అవసరమా అన్పిస్తుంది. అందుకే “అవగాహన లేని స్వేచ్చ ప్రమాదకరం సంకేతా! అంది పల్లవి. “స్వేచ్చకు తావులేని అవగాహన అంతకన్నా నిరర్థకం పల్లవీ!” అంది సంకేత. “నువ్వు నడిచి వచ్చిన దారిని మరచిపోతున్నావ్!” “కాదు. కొత్త బాటను, నాకు నచ్చిన బాటను వేసుకొంటున్నాను. నచ్చిన బాట ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. కష్టం లేకుండా ఇష్టమైనది దొరకదు.” అంది సంకేత. “నువ్వు చదువును మరచిపోయి ప్రేమ, అనుభూతుల పేరుతో చెడిపోతున్నావ్!” “ఎంత చదివినా రాని ఆనందం నాకు అనంత్ ఆలోచనల్లో వస్తోంది. నేను పుట్టాక కలగని ఫీలింగ్స్ అనంత్ ఆలోచనలతో కలుగుతున్నాయి. వాటిని ఎంత వద్దనుకొని అదిమి పట్టుకున్నా స్ప్రింగులా లేస్తున్నాయి. ఇప్పుడు నామనసు అనంత్ మీదకి తప్ప చదువు మీదకి పోవడం లేదు” “చూడు సంకేతా! ఇప్పుడు మనం చేస్తున్న మన పనులు రేపటి మన గమ్యానికి దగ్గరకి తీసుకెళ్ళాలన్నా దూరంగా తీసుకెళ్ళాలన్నా కాలమే నిర్ణయిస్తుంది. అలాంటి అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం అనుకున్న గోల్స్ ను చేరుకోగలుగుతాం. ఒక్క క్షణం తేడాతోనే అద్భుతాలను సాధించిన వాళ్ళున్నారు. చేజార్చుకున్న వాళ్ళున్నారు. నువ్వు అనంత్ ఆలోచనల్లోంచి బయటపడు. లేకుంటే అతని ఆలోచనలు నీ కాలాన్ని, నీ ప్రతిభను తన గుప్పెట్లోకి తీసుకుంటాయి. ఇప్పుడు నువ్వు నిస్సహాయురాలివి. నీ నిస్సహాయతకి నువ్వే కారణం. నువ్విలా తయారయితే నీ తల్లి దండ్రులు ఏమైపోతారో ఆలోచించు” అంది. “అబ్బా! టాపిక్ మార్చవే! నేనిప్పుడు అనంత్ ఆలోచనల ఆకలితో ఉన్నాను. ఆకలి లేనివాడికి అన్నం రుచి తెలియనట్లే నా ఆకలి నీకు అర్థం కాదు. కానీ ఎంత ఆకలిగా ఉందో అంత భయంగా కూడా ఉంది. ఆ భయం దేనికో నాకే అర్థం కావడంలేదు.” అంది సంకేత. పల్లవి మౌనంగా ఉంది. “మాట్లాడు పల్లవీ?” అంది సంకేత. పల్లవికి ఏం మాట్లాడాలో తోచలేదు. సంకేత అనంత్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటే, అతను సంకేతను పెళ్ళి చేసుకోకపోతే సంకేత ఏమైపోతుందో అని భయంగా ఉంది. అందుకే “ఏం చెప్పను సంకేతా! నాకు తెలిసిన ప్రపంచం వేరు. నువ్వు ప్రవర్తిస్తున్న తీరు వేరు. దేన్నైనా లైట్ గా తీసుకుంటేనే హాయిగా ఉంటుంది. మరీ ఇంత లోతుకి పోయి ఆలోచించకు. స్నేహం చెయ్యొచ్చు తప్పు లేదు. అనంత్ కీ నీకూ స్నేహం ఉండబట్టే అతను వెళ్ళి నీకోసం కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టి వచ్చాడు. కానీ ఫీజు కట్టాక నువ్వు కోచింగ్ సెంటర్ కు వెళ్ళిందే తక్కువ. కోచింగ్ కి వెళ్తున్నానని ఇంట్లోచెప్పి అనంత్ తో తిరుగుతున్నావు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఎంత ఫ్రెండ్ షిప్ చేసినా ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడినా ఉదయాన్నే నిద్రలేస్తున్నారు. కాలేజీలకి వెళ్తున్నారు. చదువుతున్నారు. కానీ నువ్వు వాళ్ళలా కాకుండా అనంత్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇది తప్పు…! అసలు ఈ ఫ్రెండ్ షిప్ అనేది ఎలా ఉండాలి అంటే సపోజ్ మనం స్టేషన్ వరకు వెళ్ళేంత వరకు బోర్ కొడుతుంది కాబట్టీ ఒక అబ్బాయితో ఫోన్ లో మాట్లాడాలి... ఆ తర్వాత బస్సు వచ్చేంతవరకూ వెయిట్ చెయ్యాలి. కాబట్టి బోర్ అనిపించకుండా ఇంకో అబ్బాయితో మాట్లాడాలి. ఫోన్ లోనే కాబట్టి, ఏం మాట్లాడినా తప్పులేదు. తర్వాత లైట్ తీసుకోవాలి. ఇది ఫాస్ట్ ట్రెండ్ ! అంతా ఫాస్ట్, ఫాస్ట్ గానే ఉండాలి...” అంది. (సశేషం...) తర్వాతి కధ తాజా సంచికలో... క్రింది లింక్ లో చదవండి...
No comments:
Post a Comment