ఇలా ఎందరున్నారు ?- 4
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. శ్రీహర్ష రక్తదానం చేసి రావడంతో అతని తల్లి కాంచనమాల బాధపడుతూ ఉంటుంది . ) కాంచనమాల సంకేతను ఒకటికి రెండు సార్లు పిలవటం తో మూడవసారి ఉలిక్కిపడి 'ఊ' అంటూ గతంలోంచి బయట పడింది సంకేత. "ఏమాలోచిస్తున్నావ్ సంకేత?" అంది కాంచనమాల. "ఏం లేదు ఆంటీ ! నాకు చదివేది ఉంది. నేను వెళ్ళాలి " . అంటూ అక్కడి నుండి లేచింది. సంకేత తప్ప తన గోడు ఇంకెవరు వింటారు అన్నట్లు నిరాశగా చూసి స్నేహితులవల్లనే తన కొడుకు చెడిపోతున్నాడని నిర్ధారణకి వచ్చింది కాంచనమాల. "చిన్నప్పుడంతా దాస్ గాడితో తిరిగేవాడు. ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నాడో ఏమో! దాస్ గాడితో తిరిగినన్ని రోజులు క్రికెట్ జబ్బును తగిలించుకొని ఇంట్లో ఉండకుండా ఎప్పుడు చూసినా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ల చుట్టూ తిరిగేవాడు ఎటూ వెళ్ళకుండా కట్టుదిట్టం చేస్తే పక్కింటికెళ్ళి టీ. వీ ముందు కూర్చొనేవాడు. దాస్ వాడికి తోక ... శ్రీహర్ష ను తీసుకొద్దామని పక్కింటికి వెళ్తే ఒకవైపు టీ.వీ చూస్తూనే ఇంకో వైపు 'క్రికెట్ విజేతలే ప్రపంచ విజేతలూ ఆంటీ ! మహా చక్రవర్తులు కూడా ... క్రీడాస్ఫూర్తి క్రీడాకరులకన్నా ప్రేక్షకులమైన మనకే ఎక్కువ ఉండాలి. క్రికెట్ చూడని జన్మ జన్మే కాదు ...." అంటూ దాస్ గాడు చేసే దిక్కుమాలిన కామెంటరీ వినాల్సి వచ్చేది. శ్రీహర్ష అయితే నిద్దట్లో కూడా ఫోర్లు, సిక్స్ లు, సెంచరీలు అని కలవరిస్తూ స్టేడియంలో ఉన్నట్లు కేకలేసేవాడు. ...తనకేమో శ్రీహర్ష స్కూలు , సిలబస్ లు, పరీక్షలు గుర్తొచ్చి ఒకటే గుండె దడ ....అయినా ఈ పిల్లలకి వరల్డ్ కప్ ముఖ్యమా ! చదువు ముఖ్యమా! అని తనలో తను అనుకుంటుంటే... దాస్ నవ్వుతూ తనవైపే చూస్తూ"ఆంటీ! నీకో విషయం చెప్పనా! తొలి ప్రపంచ కప్ 1975 లో జరిగిందని అందరూ అనుకుంటారు కానీ నిజానికి 1973 లోనే జరిగిందట....అదికూడా పురుషుల ప్రపంచ కప్ కాదట..మహిళలది. ఆతిధ్య ఇంగ్లాండే ఆ కప్ ను ఎగరేసుకొని పోయిందట.....దీన్ని బట్టి మీ అడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే..."అనేవాడు. అది వినగానే కాంచనమాల వాడి వైపు ఉరిమి చూసి " నూటికో కోటికో ఒక్కరన్నట్లు అవిడెవరో కప్పు గెలిచిందని ఆడవాళ్ళందరం క్రికెట్ ఆడతామా ! ఒరేయ్ ! దాస్ గా నీ వల్ల నాకొడుకు చెడిపోతున్నాడు. మాట్లాడటానికి క్రికెట్ గురించి తప్ప నీ దగ్గర ఇంకేమీ లేవురా?" అనేది. దాస్ హుషారుగా ఆమెనే చూస్తూ "ఇంకేమున్నాయి ఆంటీ!ఊ..ఉండండి ఆలోచించి చెపుతా! జనాభా లో 34 శాతానికి పైగా ఉన్న యువతకు ఉపాధిపరంగా సరైన దశానిర్దేశం కరువైందట. ఇది వారిని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి చేస్తోందట. ఇప్పుడున్న అశాంతికి, సమస్యలకి అదే కారణమట.....దీనికి మీరేమైనా చేయగలరా? చెయ్యగలిగితే మీరు దీని గురించి ఆలోచించండి! మేము క్రికెట్ చూసుకుంటాము!" అనేవాడు టీ.వీ ముందు కూర్చుంటూ...అమె ఆశ్చర్యంగా గుడ్లువెళ్ళబెట్టి "ఓరి!పిడుగా! నువ్వు చాలా ముదుర్రా! టెంత్ క్లాస్ కి వచ్చావ్! క్లాస్ పుస్తకాలు చదువుకోవటం తగ్గించి దేశంలో జరిగేవన్నీ నీకెందుకురా!అంటూ కర్ర పుచ్చుకొని తరిమినట్లే వెంటపడేది. వాళ్ళామె గొంతుకి భయపడేవాళ్ళు ...వాళ్ళంతా స్థిరంగా కూర్చుని 'ఉన్న ఇంటికి కప్పు ఉందా లేదా? అన్న దాన్ని కన్నా ఉన్న దేశానికి కప్పు వస్తుందా లేదా అన్నట్లు ...'నరాలు తెగే ఉత్కంఠతో టీ.వీ. చూస్తూ కూడా తేనె తుట్టు పై రాయి పడట్టు తలో వైపూ పరిగెత్తే వారు. అది చూసి తన భర్త పక్కింట్లో ఉన్న తనని పిలిచి..."అబ్బా! కాంచనా! పిల్లల్ని ఎందుకలా తరుముతావు?చదువుతప్ప మా అమ్మకి సంతోషం అక్కర్లేదు అనుకోడా శ్రీహర్ష. చదువు ముఖ్యం అని వాళ్ళకి తెలియదా? మనమే కాదు టీచర్లు కూడా ఈ విషయం చెబుతూనేవుంటారు. కానీ ఎంత సేపు చదువుతారు. ఎప్పుడైనా సరే! మైండ్ ఎక్కువ వత్తిడి కావాలనుకోదు. కాస్త రిలాక్సేషన్ కోరుకుంటుంది...కాకపోతే మరీ ప్రత్యక్ష ప్రసారం చూడకుండా హైలైట్స్ చూడమని నెమ్మదిగా చెప్పు... నువ్వు చెప్పినట్లే నేను టీ.వీ. కొనలేదు. కనీసం వాడ్ని ఫ్రెండ్స్ తోనైనా తిరగనీ..." అంటూ కొడుకుని వెంటేసుకొచ్చేవాడు. ...తనేది చెప్పినా ఆయన అలాగే మాట్లాడతాడు. మరి అటువంటప్పుడు తనీ రక్తదానం విషయం చెబితే కొడుకుని కేకలేస్తాడా? వెయ్యడు తననే విసుక్కుంటాడు. వీళ్లందరికీ ఇదో పెద్ద జబ్బు. తనేం మాట్లాడినా రాక్షసిని చూసినట్లు చూస్తారు. కాంచనమాలకి అదంతా గుర్తొచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళంత తనకేదో యాంటీస్క్వాడ్ అయినట్లు నీరసం ఎక్కువైంది. నెమ్మదిగా అక్కడినుంచి లేచి పక్కకి వెళ్ళింది. ఈ లోపల నీలిమ వెళ్ళి వరమ్మను పిలవగానే ఆమె వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. వరమ్మకి అన్నం పెట్టి తను కూడా తింటూ కూర్చుంది నీలిమ. ఎప్పుడైనా అంతే. ఆ ఇంట్లో అందరూ తిన్న తర్వాతనే వరమ్మ, నీలిమ కలిసి కూర్చుని తింటారు. అందరితోపాటు వరమ్మకి పెడితే కాంచనమాల ఊరుకోదు.,,,పైగా..."ఆ ముసలమ్మను అందరికంటే త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకురాకు. మేమంతా తిని వెళ్ళాకనే తీసుకురా!" అంటుంది. అదేదో వరమ్మ అంటరానిదైనట్లు. మనిషికి ముసలితనం వచ్చినంత మాత్రాన అంతదూరంగా చూడాలా? మనిషికి ఏది వస్తుందో ఏది రాదో గ్యారంటీ ఇవ్వగలం గానీ ముసలితనం రాదన్న గ్యారంటీని ఇవ్వలేం ! గత ఐదు సంవత్సరాలుగా వరమ్మను అలాగే చూస్తోంది కాంచనమాల...వరమ్మ భర్త రామారావు చనిపోకముందు ఎంతో గౌరవంగా , ఎంతో వినయంగా 'అత్తయ్యా! అత్తమ్మా!" అని పిలిచిన కాంచనమాల ఇప్పుడు 'ముసలిదానా ! ముసలిపీనుగా!' అని సంభోదిస్తుంటే వినటానికి ఏమాత్రం బాగుండటం లేదు నీలిమకు....వరమ్మ కూడా తన ముఖాన్ని బాధగా పెట్టుకుంటుంది... పిలుపు ఆత్మీయంగా ఉంటేనే కదా ఎలాంటి హృదయంలోనైనా సప్తసముద్రాలు ఉప్పొంగేది. అదే సరిగా లేనప్పుడు ఆ హృదయంలో పుట్టే ఘోషకి భాష ఉంటుందా? తల వంచుకొని నిస్సహాయంగా భరించట తప్ప కోడలిని ఏమీ అనదు వరమ్మ... అప్పుడప్పుడు నీలిమతో మాత్రం "నా చిన్నప్పటి నుండి చదువు, పెళ్ళి, సంసారం, పిల్లలు, ఆత్మీయుల బాగోగులు అంటూ మూడొంతుల జీవితాన్ని గడిపేశాను నీలిమా! కనీసం ఇప్పుడైనా మంచి వాతావరణం లో విశ్రాంతి తీసుకోవాలని ...హాయిగా నవ్వుకోవాలని...పదిమందికి ఉపయోగపడే పనులు చెయ్యాలని ఉన్నా స్వేచ్చ లేని బ్రతుకు అయ్యింది. నా స్నేహితురాళ్ళు ఈ వయస్సులో కూడా నాలాగా ఉందకుండా పూర్తి స్వేచ్చతో వాళ్ళ అలోచనలకి తగినట్లు మహిళా మండలి సభ్యులతో కలసి సమావేశాలు అవ్వటం.. అనాధ శరణాలయాలకి వెళ్ళి చిన్నపిల్లల అవసరాలు తీర్చటం...వృద్ధాశ్రమాలకి వెళ్ళి పండ్లు పంచి రావడం లాంటివి చేస్తుంటారు." అంటుంది. నీలిమ ఆశ్చర్యపోతూ "మరి మీరెందుకు ఇలా కాంచన మేడం కి భయపడుతూ, మీతో ఎవరికి ఏ ఉపయోగం లేనట్లు ఉంటారు? అని అడిగితే! "అది విధి అనాలో, నా అసమర్ధత అనాలోతెలియదు కానీ, నా స్నేహితురాళ్ళు యుక్తవయస్సులో ఉన్నప్పుడు కూడా నా కన్నా ధైర్యంగా ఉండేవాళ్ళు....జీవితాన్ని ఓ సవాల్ గా తీసుకొని ప్రశ్నించటం అలవాటు చేసుకున్నారు. నేను మాత్రం ప్రతి ప్రశ్నకూ సమాధానం నేనే అయినట్లు నా భర్తకి వండిపెట్టి, నా కొడుక్కి వండిపెట్టి తరించాను. చివరకి ఈ మెట్లకిందకి చేరాను. ఇక్కడేమో రాత్రీ-పగలు తేడా లేకుండా దోమలు కుడుతున్నాయి." అని నిస్పృహగా అనేది వరమ్మ. వరమ్మ బాధను చూడలేక ప్రతిరోజూ మస్కిటో కాయిల్ వెలిగిచ్చి ఆమె మంచంకింద పెట్టేది నీలిమ...వరమ్మకు మనశ్శాంతి తగ్గకుండా ఉండాలని కొద్ది సేపు యోగా చేయించి, చిన్న చిన్న వ్యాయామాలు చేపించేది....కాంచనమాల అది చూసి విస్తుపోతూ 'వికృతపు చేష్టలంటే ఇవే! టె.వీ లు చూసి చెడిపోతున్నారు జనాలు అంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్నిద్దర్నీ చూస్తుంటే అది నిజమనిపిస్తోంది. ఆవిడగారిని బాదీ బిల్డర్ పోటీకేమైనా పంపుతావా వచ్చి పని చూడు !" అని గట్టిగా కేకలేసేది. అంత వయసు వచ్చినా వరమ్మ జుట్టు వత్తుగా, తెల్లగా వంకీలు తిరిగి ఉంటుంది...సరైన పోషణ లేక పేలు పడుతుంటే అది చూదలేక మెడికేర్ పూసి షాంపూతో తలస్నానం చేయించి, ఎందలో తల ఆరే దాకా కూర్చోబెట్టి తలదువ్వుతుంది నీలిమ....అప్పుడు కాంచనమాల చూస్తే మాత్రం వ్యంగ్యంగా "అంతసేపు ఏం చేస్తున్నావక్కద?ఎంగేజ్మెంట్ కోసం పెళ్ళికాని పిల్లకి మేకప్ చేస్తున్నట్లుంది నీ హడావిడి...సంబరం బాగానే వుంది....మార్కెట్ కి వెళ్ళే టైం అయ్యింది రా! త్వరగా!" అంటుంది. కాంచనమాల ఎన్ని తిట్టినా వరమ్మకి చేసే పనులు చేస్తూనే ఉంటుంది నీలిమ. కోడలు ఏం మాట్లాడినా నోరెత్తదు వరమ్మ....మనసుకి ఎంత నొప్పి కలిగినా మౌనంగానే భరిస్తుంది....నిస్సహాయంగా చూస్తుంది. మెల్లగా లేచి హాలు లోకి వెళ్ళి టీపాయ్ కింద ఉన్న నిన్నటి పేపర్ని తెచ్చుకొని క్షుణ్ణంగా చదువుకుంటుంది. ఏ రోజు పేపర్ ఆ రోజు చదవాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అని విసుక్కుంటారేమో అని ఆమె భావన. సాధ్యమైనంతవరకు తననెవ్వరు విసుక్కోకుండా తన ప్రవర్తనలో మార్పులు చేసుకుంటుంది. ప్రతిదీ సున్నితంగా ఆలోచిన్స్తుంది.... అదేం అంటే "ఇది జీవితం నీలిమా! జీవితం అంటే ఏమిటో అర్ధం కాక ముందే అందరి తల్లుల్లాగే నేను కూడా పిల్లల్ని కన్నాను. పెంచాను. వాళ్ళే సర్వస్వం అనుకున్నాను. మొక్కను వృక్షాన్ని చేసి ఆ నీడ లో సేదదీరాలన్నట్లు కొడుక్కి పెళ్ళి చేశాను. వాడి పెళ్ళితో నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. అది నేను ఊహించని జీవితం. కాంచనలో నాకు కూతురు కనిపించలేదు. స్నేహితురాలు కనిపించలేదు. చివరకి కోడలు కూడా కనిపించలేదు. శత్రువు కంపించింది. ఆ శత్రువుతో రోజూ యుద్ధమే. నా కొడుకు నాతో మాట్లాడితే ఒప్పుకోదు....మీ అమ్మ అంటేనే మీకు ఇష్టం!మీ అమ్మతో మాట్లాడినంత ప్రేమగా నాతో మాట్లాడరు. ఆవిడ వల్లనే నా మీద మీకు ప్రేమ తగ్గుతోంది. అది మీ అమ్మకు అర్ధమయ్యే నన్ను చిన్న చూపు చూస్తోంది. ఎంతయినా నేను పరాయి దాన్ని....నన్ను మీకు దూరంగానే ఉండనీయండి. " అంటూ నా కొడుకుని దగ్గరకి రానిచ్చేది కాదు....నరకం చూపించేది. భార్య ఉన్న ఏ మగాడికైనా ఇలాంటి మాటలు మనస్సుపై ఒత్తిడిని పెంచుతాయి. ఆ ఒత్తిడి ప్రభావం పాజిటివ్ గానైనా ఉండవచ్చు, నెగటివ్ గానైనా ఉండవచు. నా కొడుకు బాధను చూడలేక నా కొడుకుతో మాట్లాడడం మానేశాను. ప్రతి చిన్న విషయాన్ని నా కొడుకుతో పంచుకుంటూ గడపిన నేను అకస్మాత్ గా నా కొడుకు తో మాట్లాడకుండా ఎలా ఉండాలి.ఇదెంత నరకం? అయినా ఉన్నాను. మనసు రాయిని చేసుకున్నాను. కానీ ఒక్కోసారి ఎంత గట్టిగా ఉందామన్నాశిలను ఉలితో చెక్కినాట్లు ఏదో బాధ! తల్లడిల్లే బాధ!ఏ తల్లికైనా ఇంతకు మించి శిక్ష ఉండదు. కాంచన నా కడుపున పుట్టలేదు కాబట్టి నన్ను ప్రేమగా చూడకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా, మంచంపై దుప్పటి వెయ్యకపోయినా నాకు ఏమీ అనిపించదు. కానీ నా కొడుకు నా కడుపున పుట్టాడు కదా! వాడికి నేను ఏమీ కాని దానిలా ఎలా ఉండాలి? ఉండలేక దగ్గరవుదామన్నా కాంచన దూరమౌతుందన్న భయం. కాంచన నాకే కానీ, నా కొడుక్కీ, మనవడికీ శత్రువు కాదు....భార్యగా, అమ్మగా ఆమె పాత్రలు ఆమెకున్నాయి. వాటిని మనసా, వాచా తను నిర్వహించాలంటే నేను పంటికింద రాయిలా అంపిస్తున్నాను. అది నా కర్మ. కానీ శ్రీహర్షకి నేనంటే ఇష్టం. నా మనవడిని ఎక్కువగా నేనే పెంచాను. అప్పుడు వాడికి నా అవసరం ఉంది కాబట్టి వాడి పనిని తప్పించుకోవటం కోసం శ్రీహర్షను నాదగ్గరకి రానిచ్చేది...నా కొడుకును మాత్రం నా దగ్గరకి రానిచ్చేది కాదు..ఇలా తల్లికి కొడుకుని దూరం చేసి చాలా మేధావి పని చేస్తున్నాం అనుకునే కాంచన లాంటి కోడళ్ళకి తెలియని ఒక రహస్యం నీకు చెప్పనా నీలిమా! తన తల్లిని అభిమానంగా చూడలేని వాడు భార్యని ప్రేమించలేడు. నటిస్తాడు. ఆ నటనే ప్రేమ అనుకొని నమ్మి నిజమైన ప్రేమకు దూరమౌతున్నారు చాలా మంది భార్యలు. ఇలా నటనకి అలవాటు పడకుండా అత్తల్ని గౌరవించి భర్తలలోని నిజమైన ప్రేమను పొందగలిగే భార్యలు ఎందరున్నారు చెప్పు! అందుకే ఈ మానవ సంబధాలలో మమకారం మాయమౌతోంది. మాయమాత్రమే మిగులుతోంది. ఈ మాయకోసం నిత్యం నటించే అత్తలు ఉన్నారు. కోడళ్ళు ఉన్నారు. భర్తలు ఉన్నారు. భార్యలు ఉన్నారు. అందులో నేనొకదాన్ని." అంటూ బాధపడుతుంది. ఆమె అలా బాధపడుతుంటే, స్పందించే మనసు ఉండికూడా తనేం చేయలేకపోతోంది. తనకేమాత్రం పవర్స్ ఉన్నా కాంచన లాంటి కోడళ్ళకి బుద్ధి చెప్పాలనిపిస్తోంది.ఒక్కోసారి వరమ్మ చెప్పే జీవిత పాఠాలని వింటుంటే వీటిని కాలేజీ పాఠాలలో చేరిస్తే బావుండుకదా అనిపిస్తుంది. అయినా పైకి కనబడకుండా మనసు నడిపే మానవ జీవితం అనే మహానాటకన్ని పాఠాలుగా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ కాలేజీలు, ఈ యునివర్సిటీలు సరిపోతాయా? ఆలోచిస్తోంది నీలిమ. "అన్నం తిను నీలిమా!" అని వరమ్మ నీలిమను చేతిమీద తట్టగనే మన లోకం లోకి వచ్చింది నీలిమ. నీలిమ, వరమ్మ, కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం తిన్నారు. కొడుకు రక్తదానం చేసి వచ్చాడన్న కోపంతో గట్టిగా రెండు ముద్దలు కూడా తినని కాంచనమాలకు మాత్రం కడుపులో ఆకలి మొదలైంది. *------*------*--------*----------* ...నీలిమ ఇంటి పనులు చేసుకుంటూ తీరిక లేకుండా ఉంది. సంకేత కాలేజీకి వెళ్ళింది. సెకండ్ అవర్ లేకపోవడంతో హిందూ, పల్లవి, సంకేత, ఇంకా కొంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారు. పల్లవి ఎవరికోసమో వెతుకుతున్నట్లు అటూ ఇటూ చూసి... "ఇవాళ శివాని రాలేదా?" అంది అందరి ముఖాల్లోకి చూస్తూ ... వాళ్ళలో హిందూ "శివాని వచ్చింది, శ్రావ్య రాలేదు" అంది. "శ్రావ్య ఎందుకు రాలేదు?శివాని వచ్చినా కనిపించదు ఎందుకు? అంది పల్లవి అదేదో మిష్టరీ అయినట్లు! దాన్నిప్పుడే చేదించాలన్నట్లు....పల్లవికి, శివాని అంటే ఎప్పుడూ అనుమానమే! ...హిందూ చాలా మామూలుగా చూస్తూ "శ్రావ్య వాళ్ళ మమ్మీకి హెల్త్ ప్రాబ్లం అనో ఏదో సం రీజన్ చెప్పింది. నాకు తెలిసి దానికి ఇంట్లో ఉండాలనిపించిన ప్రతీ సారి అదే కారనం చెబుతుంది. నో ప్రాబ్లం! శివాని మాత్రం ఇప్పుడే ఎటో వెళ్ళింది" అంది. వాళ్ళలో ఒక అమ్మాయి ఇయర్ ఫోన్స్ తీసి ఒళ్ళోపెట్టుకుంటూ "శివాని వెళ్ళింది ఎటో కాదు. తన బాయ్ ఫ్రెండ్ రూంకి....వెళ్ళేటప్పుడు నాకు చెప్పే వెళ్ళింది" అంది. వాళ్ళలో ఒక అమ్మాయి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టి "బాయ్ ఫ్రెండ్ రూంకా? శివాని ఏంటే మరీ ఇంత ఛేంజ్ అయింది. ఎంత అడ్వాన్స్డ్ అయితే మాత్రం, ఎంత ఫాస్ట్ అయితే మాత్రం, ఇంత ఘోరమా?"అంది. ఆ అమ్మాయి చేతి మీద టప్పున కొట్టి "అబ్బా!నువ్వుండవే! నీకు ప్రతీదీ ఆశ్చర్యమే! శివాని ఏమని చెప్పిందో నువ్వు చెప్పవే!" అంటూ హెడ్సెట్ పెట్టుకున్న అమయివైపు చూసింది ఇంకో అమ్మాయి. వింటర్ వస్తోంది కదా! శివాని వాళ్ళ హాస్టల్లో సెల్ఫోన్ చార్జింగ్ కోసం ఒకే ఒక కనెక్షన్ ఉందట.....తనకి హీటర్ పెట్టుకోటానికి వీలు కావటం లేదుట..." అంటూ ఆగింది హెడ్ ఫోన్స్ అమ్మాయి. మిగతా అమ్మాయిలు ఉలిక్కి పడి "వీలు కకపోతే స్నానం కూడా బాయ్ ఫ్రెండ్ రూంలోనే చేస్తుందటనా...! ఇది మరీ విడ్డూరంగా లేదూ?" అన్నారు కళ్ళు ఇంతింత చేసి చూస్తూ. 'ఛ..ఛ అలా ఎందుకు చేస్తుంది? మీకేమైనా బుద్ధి ఉందా ఇలాంటి కొశ్చన్స్ వేస్తున్నారు?' అంది హెడ్ సెట్ అమ్మాయి దబాయింపుగా. "మరేంటో త్వరగా చెప్పు! మేం వెయిట్ చేయలేం!" అన్నారు మిగతా అమ్మాయిలు టెన్షన్ గా చూస్తూ. "స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో తన బాయ్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని వస్తుందట..." చాలా నింపాదిగా చెప్పింది. "ఆ మాత్రం కనెక్షన్ ఇవ్వటం రాదా శివానికి?బి.టెక్. చదువుతోంది...!"అంది పల్లవి వెంటనే... "అందరూ నీ అంత ఫాస్ట్ అనుకుంటున్నావా?" అంది హిందూ. "అయినా హీటర్లు పెడితే హాస్టల్లో ఒప్పుకోరు కదే!" అంది పల్లవి. "అదేమైనా హాస్టల్ లో వాళ్ళు చూసేలా హీటర్ పెడుతుందా ఒప్పుకోకపోవటానికి...! అమ్మయిలంతా నిద్రలేవక ముందే నిద్రలేచి డోర్ పెట్టుకొని దాని కష్టాలేవో అది పడుతుంది". "మరి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ రాదా?" వస్తే ఏం! అదేమైనా కడుతుందా? సొమ్మొకడిదీసోకొకడిది....అంతే కానీ'నేను హేటర్ పెట్టి దొంగ కరెంట్ వాడుకున్నానహో! నేను దొంగని....' అని హీటర్ మెళ్ళో వేసుకొని తిరుగుతుందా! దొరికేంత వరకూ అది దొరే! అయినా అది దొరకటం అంత ఈజీ కాదు..." "ఎందుకని...?" "వాళ్ళ హాస్టల్లో అమ్మాయిలకి తన లాప్ టాప్ లో రోజుకో సినిమా చూపించి వాళ్ళను ఇంప్రెస్ చేస్తోంది. అందుకే అది చేసే దొంగ పనులు రహస్యంగా ఉంటున్నాయి. ప్రపంచంలో జరిగే దొంగతనాలన్నీ అలా ఇంప్రెసయ్యే గోప్యంగా ఉంటున్నాయట. దానికెవరు బాధ్యులు? అయినా ఎవరి దొంగ పనులకి వాళ్ళే బాధ్యులు అనే రోజులా ఇవి?" "చ...ఊరుకో, అమ్మాయిల దగ్గర అంత సీనుండదు..." "మన శివాని లాంటి అమ్మాయిల దగ్గర లేని సీనుండదు...అంతా రచ్చ రచ్చే..." "ఏంటే! శివాని గురించి ఇది ఇలా చెబుతోంది? అది విన్నదంటే దీని పని ....?" అంది భయపడుతూ పల్లవికి ఎదురుగా కూర్చొని ఉన్న అమ్మాయి. "విన్నా అదేం ఫీల్ కాదు. నువ్వేం ఫీలవ్వకు. శివానికి ఇలాంటివి చున్నీలు వెయ్యకముందు నుండే అలవాటు...అది బేకరీలో కర్రీపఫ్ తింటున్నప్పుడు మనం కళ్ళారా చూసి అడిగినా "నేను తినలేదు" అనే అంటుంది. నువ్వేమైనా సాక్ష్యం చెప్పగలవా?" అంది హిందూ పలవినే టార్గెట్ పెట్టుకునంట్లు చూస్తూ. "పల్లవి "అబ్బో...! నా వల్ల కాదు. ఈ వరల్డ్ నిండా నాలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకలా ఇరుక్కోవడం ఇష్టం ఉండదు. చూసినా చూడలేదనే చెబుతాను నేను..." అంది. "ఇది మరీ డేంజర్! అందుకే దేశం ఇలా తగలపడి పోతోంది. దేశమే కాదు. దేశంతో పాటు కొందరు అమ్మాయిలు కూడా...!" అంది హిందూ. పల్లవి తిన్నగా కూర్చుని సూటిగా చూస్తూ "నన్నలా మెన్షన్ చేయకు..నేను ఫీలౌతా! ఆకలై కర్రీ పఫ్ తింటే తప్పెంటి? అది మళ్ళీ పైకి చెప్పి వేలెత్తి చూపాలా? ఏం నువ్వు తినవా? తినాలనిపించి తినలేకపోయినప్పుడు కలిగే బాధ తెలిస్తే నువ్విలా చిన్న చిన్న విషయాలను బట్టబయలు చేయవు...శివానికి హాట్ వాటర్ తో స్నానం చేయాలని ఉంది. చెయ్యనీయ్! దాని ఎంజాయ్ దానిది. అది దొంగతనం కూడా చెయ్యొద్దా...? చెబితే ఎలాగూ చేయనివ్వరు. డబ్బులు కట్టమంటారు. కట్టే డబ్బులు చాలక మళ్ళీ ఇదొక లాసా! ప్రతి దానికి డబులు కట్టుకుంటూ నీలాంటి అమాయకులు ఉంటారు కాని శివాని లాంటి మేధవులకి అలాంటి కర్మేంటి?" అంది. ఆ మాటలు వింటుంటే సంకేతకి ఆశ్చర్యంగా ఉంది. తను లేని టైం లో తన గురించి తన ఫ్రెండ్స్ ఇలా మాట్లడుకుంటారని శివానికి తెలుసా? తెలిసి కూడా ఇలా చేస్తుందా? వెంటనే హిందూ"కర్మని ఎవరన్నారు? ఒక్క హేటరే కాదు. శివాని తన కాలేజి బ్యాగ్లో రోజుకో లాప్ టాప్ పెట్టుకొని హాస్టల్ కి తెస్తుంది. వాటిల్లో తన బాయ్ ఫ్రెండ్ ది ఒకటి. మిగతావి, బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ వి...వాటికి రాత్రంతా హాస్టల్లో చార్జింగ్ పెట్టి తెల్లవారి తీసుకెళ్ళి అదే కాలేజి బ్యాగ్ లో వాళ్ళ లాప్ టాప్ లు వాళ్ళకి ఇస్తుందట. దాని వల్ల ఎవరికి నష్టం?" అంది హిందూ. "దానికి కాదుగా! హాస్టల్ వాళ్ళకేగా ! నీకేంటి బాధ?" అంది హెడ్ సెట్ అమ్మాయి కొంచెం సీరియస్ గా. "నువ్వెందుకింత సీరియసై దాన్ని సపోర్ట్ చేస్తున్నావో నాకు తెలుసు. శివాని ప్రతి రోజూ రీచర్జి కర్డులు కొని, నెట్ కనెక్షన్ ఇచ్చి నైటంతా మీ అందరికీ చెత్త ఫిలింస్ చూపిస్తుంది...దాని వల్ల మీ మైండ్ బాక్స్ కి ఎప్పుడో ఇంఫెక్షన్ వచ్చింది మంచి యాంటీ బయాటిక్ పడాలి. లేకుంటే నువ్వు పనికిరావు..." అంది హిందూ అంతకన్నా సీరియస్ గా. దేనికి పనికిరనో చెప్పు! నువ్వు చెప్పలేవు. నీకు తెలియని ప్రపంచాన్ని శివాని ద్వారా మేము తెలుసుకుంటునామని నీకు అసూయ. చేతకాని వాళ్ళే నీలాగా మాట్లాడతారు. నువ్వెలాగూ ఎంజాయ్ చేయలేవు. చేసే వాళ్ళనైనా చేయనీయ్!" అంది గట్టిగా హెడ్ సెట్ అమ్మాయి. (సశేషం...)
No comments:
Post a Comment