జోహారు తెలుగుతల్లి ! - అచ్చంగా తెలుగు

జోహారు తెలుగుతల్లి !

Share This
 నమస్కారం !

జోహారు తెలుగుతల్లి ! మన తెలుగు తల్లి పదహారు కళల నిండు జాబిలి. ఆమె సాహితీ చంద్రికలను ఆస్వాదించే మన మనసులు పున్నమి సాగరంలా ఎగసి పడుతుంటాయి. అప్పుడు మన ఆనందాన్ని తెలియచేసే క్రమంలో ‘చంద్రుడికో నూలుపోగు’ లా, చాలా మంది తెలుగువారు ఆమె పద పల్లవాలకు అక్షర కుసుమాలు సమర్పిస్తున్నారు. ఆ క్రమంలో, గత ఏడాది ఫిబ్రవరి లో  మొదలైనదే ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక.
శృంగారం, అశ్లీలం లేకుండా, ఇతరుల వ్యక్తిగత గురించిన అనవసర ప్రస్తావనలతో చేసే ప్రచార హంగామాలు, మిన్ను విరిగిపడే బ్రేకింగ్ న్యూస్ లు లేకుండా... మన సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రకళ, వంటి చక్కటి అంశాలతో ఒక అచ్చ తెలుగు పత్రికను అందిస్తే, తెలుగువారు ఆదరించాలేరా ? ... అన్న ఆలోచనతో మొదలైన ఈ పత్రికకు మీ అందరి అభిమానాన్ని అందించి, ఖచ్చితంగా ఆదరించగాలము, అని నిరూపించారు. ఇలా మీ అభిమాన బలంతో దినదిన ప్రవర్ధమానమవుతున్న మన అంతర్జాల మాస పత్రికకు వచ్చే నెల మొదటి పుట్టినరోజు.
పుట్టిన బిడ్డకు ఏడాది నిండి, మొదటి పుట్టినరోజు వస్తే, ‘అరె, అప్పుడే ఏడాది గడిచిపోయిందా ?’ అని ఆశ్చర్యపోతూనే, ‘నా బిడ్డ పుట్టినరోజుని ఘనంగా జరపాలి...’ అని నిశ్చయించుకునే తల్లిలా... నేనూ నా మానస పుత్రిక ‘అచ్చంగా తెలుగు’ తొలి వార్షిక సంచికను ప్రత్యేకంగా రూపొందించాలని సంకల్పించాను. ఆ సంకల్పంలోంచి జనించిన ఆలోచన... పత్రికారంగంలో ఇంత వరకూ ఎవరూ చెయ్యని మరొక సాహసం... “తెలుగు భాషా ప్రత్యేక సంచిక” ను తీసుకురావడం.
ఈ సంచికలో దేశ, విదేశాల్లో లాభాపేక్ష లేకుండా, తెలుగు భాష కోసం వ్యక్తిగతంగా, లేక అనేక తెలుగు సంఘాల ద్వారా కృషి చేస్తున్న వ్యక్తుల గురించిన విశేషాలను సేకరించి పొందుపరచడం జరుగుతుంది. ఇందుకోసం వారిని సంప్రదించి,  సంస్థ నెలకొల్పిన దగ్గరినుంచి, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, కృషిని వివరిస్తాము. దీని వల్ల, ఆ విశేషాలను చదివిన వారిలో ఒక్కరైనా ప్రేరణ పొందే అవకాశం ఉంటుందని నా గట్టి నమ్మకం.
అలాగే ఫిబ్రవరి సంచికలో తెలుగు భాషకు, సంస్కృతికి సంబంధించిన చక్కటి కధలు, కవితలు,  పొందుపరచడం జరుగుతుంది. ధారావాహికలు మాత్రం యధాతధంగా కొనసాగుతాయి. అయితే... ఈ సంచికకు మీ సహాయం మాకు అవసరం.
మీకు తెలిసి దేశ, విదేశాల్లో తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వ్యక్తులు లేక సంఘాల వివరాలను ఈమెయిలు చిరునామాతో సహా క్రింది మెయిల్ కు పంపితే, వారిని ఈమెయిలు ద్వారా సంప్రదించి, వివరాలు సేకరిస్తాము. మీకు తెలిసిన అటువంటి మహనీయుల వివరాలను క్లుప్తంగా నా ఈమెయిలు కు తెలియజేసి, వచ్చే సంచిక అద్భుతంగా రూపొందేందుకు, మీ వంతు సహాయాన్ని అందించండి. Mail id : chinmayii02@gmail.com
ముచ్చటైన సంక్రాంతి ముగ్గులా తయారైన ఈ నెల సంచికలో కళాతపస్వి కె. విశ్వనాథ్ గారితో ముఖాముఖి, నాట్య పిపాసి తాడేపల్లి సత్యనారాయణ శర్మ గారిని గురించి బ్నిం గారి పరిచయం, చూడ చక్కని బొమ్మల రూపకర్త డి.ఎస్.కె.వి. శాస్త్రి గారి పరిచయం, నాదస్వర ఆచార్య షేక్ చినమౌలా గారి పరిచయం వంటి అంశాలు చదివే కనులకు  విందు చేస్తాయి.  అలాగే షడ్రుచులతో వడ్డించిన ఆరు కధలు, పంచెవన్నెల రామచిలుకలా ఐదు సీరియల్స్, ప్రత్యేక శీర్షికలు... ఎన్నో ఎన్నెన్నో... మీకోసం వేచి చూస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ? సంచిక చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలతో మమ్మల్ని ప్రోత్సహించి, మీ దీవెనలు అందించండి.
కృతజ్ఞాతాభివందనాలతో...  అచ్చంగా తెలుగు బృందం తరఫున ...
భావరాజు పద్మిని .

No comments:

Post a Comment

Pages