తెలుగు మల్లెల పరిమళం – కవితాస్త్రాలయ - అచ్చంగా తెలుగు

తెలుగు మల్లెల పరిమళం – కవితాస్త్రాలయ

Share This

తెలుగు మల్లెల పరిమళం – కవితాస్త్రాలయ

- భావరాజు పద్మిని


సొంతవూరు, కన్నతల్లి, మాతృభాష, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో మరువలేనివి. దేహాలు విదేశాల్లో ఉన్నా, ఆత్మలు స్వదేశీయమే అయిన కొందరు ప్రవాసీయులు కలిసి, తెల్లుగుతల్లి కోసం ఆస్ట్రేలియా లో ‘భువన విజయం’ నెలకొల్పి, భువికి వసంతాన్ని తీసుకు వచ్చారు. ఈ వసంతంలో విరబూసిన మల్లెలే ఆ తెలుగు మనసులన్నీ ! వారంతా కలిసి, తమ మనస్సులో వాడిపోని పూలగుత్తిలాంటి జ్ఞాపకాలన్నీ, అక్షరాల్లో కలబోసి తెలుగు తల్లికి అక్షర నీరాజనం అర్పించారు. ఆ అక్షారాల కదంబ మాలికే భువనవిజయం వారి ప్రచురణ ‘కవితాస్త్రాలయ’. ఎన్ని రకాలో కదా మల్లెల్లో... సూది మల్లెలు, బొండు మల్లెలు, దొంతర మల్లెలు, సెంటు మల్లెలు, కాగడా మల్లెలు... అయినా... ఏ పువ్వు అందం, ముగ్ధత్వం దానిదే ! అలాగే ఈ రచనల్లో దేనికదే ప్రత్యేకం. కొన్ని కడుపుబ్బా నవ్విస్తే, కొన్ని కంటతడి పెట్టించాయి. కొన్ని జ్ఞాపకాల వాకిళ్ళు తెరిచి, మనసు ముంగిట్లో ముగ్గులు పెట్టాయి. కధలు, కవితలు, పండుగల విశేషాలు, జానపద గేయాలు, హాస్యపు జల్లులు, సుభాషితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, విభజన వల్ల కలిగిన  భావాలు, వంటివి ఎన్నో చక్కగా కూర్చి, ఈ పుస్తకాన్ని తయారు చేసారు. ఇక్కడ ఉండే రచయతలే తెలుగు సరిగ్గా రాయలేక, పత్రికల్లోని కధలన్నీ ఆంగ్ల పదాలతో మిళితమై ఉండగా, ప్రవాసీయులు ఇంత చక్కటి కధలు, కవితల్ని అచ్చ తెలుగులో అందించడం చూసి, ముచ్చటేసింది. కధలు, కవితల నాణ్యత లో కాని, వైవిధ్యంలో గాని ఎక్కడా వారు రాజీ పడలేదు. డా.సైబెర్ శాస్త్రి కధ వీక్ ఎండ్ లో విపరీతంగా పనిచేసే జబ్బు గురించి వివరిస్తూ హాయిగా నవ్వించింది. ఏకానేకం కధ... జాతి, మతం, కులం, ప్రాంతం ఏదైనా... మనిషికి ఉండేవి రక్తమాంసాలే కదా, అని ఆలోచింపచేసి, కంట తడి పెట్టిస్తుంది. భామనే సత్యభామనే కధ సరదాగా ఉంది. గంగానది గురించి దూర్వాసుల మూర్తి గారు అందించిన గంగాభవాని వ్యాసం అద్భుతంగా ఉంది. తెలుగు సాహిత్యం గురించిన విశేషాలు, తెలుగు మట్టిలోని మాణిక్యాల గురించిన విశేషాలు, , అరుదైన వృత్తాలలో అందించిన పద్యాలు,  ముఖ్యంగా చిత్రకారులు ‘బాలి’ గారి బొమ్మలు ఇలా చెప్పుకుంటూ పొతే, అన్నీ వేటికవే సాటి ! నవరసాల మేళవింపుతో కూడిన ఈ చక్కటి పుస్తకం చదువరులకు అక్షర విందులు చేస్తుంది. అవును... ఇందులో  మల్లికేశ్వర రావు గారి కవితలో చెప్పినట్లు, ఆంధ్రమాత పరదేశంలో ఈ పరిమళాలు అద్దుకుని పరవశిస్తోంది. భువన విజయం మాతృభాష కోసం చేస్తున్న కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. చదవండి, చదివించండి... ఈ చక్కటి పుస్తకం మీ మిత్రులకూ కానుకగా అందించండి... ఈ పుస్తకం వెల 200 రూ. ప్రతులకు విశాలాంధ్రా బుక్ హౌస్ వారిని సంప్రదించండి.  

No comments:

Post a Comment

Pages