భరతగీతి స్వరచిత్రం – కె.జె.ఏసుదాసు
- పరవస్తు నాగసాయి సూరి ( చాణక్య )
అవమానాలు... ఆయన్ను రాటుదేల్చాయి. పేదరికపు పరిహాసాలు... లక్ష్యాన్ని చేరాలనే కసి పెంచాయి. జీవిత పాఠశాలలో.... అనుభవ పాఠాలతో... " సంగీత చక్రవర్తి" అయ్యారు. " నీ గొంతు పనికిరాదు" అన్న వారికి పాటతోనే సమాధానం చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ... భాష ఏదైనా... ఆ గళం నుంచి కమ్మని పాటగా బయటకు వచ్చింది. తిరస్కారాల్నే పురస్కారాలుగా మార్చుకుని.... ఈసడింపులకు ఎదురొడ్డి... అభిమానుల్ని సంపాదించుకున్న ఆ మధురగాయకుడు... డాక్టర్ కట్టశేరి జోసెఫ్ ఏసుదాసు. 1940 జనవరి 10న కేరళ... కొచ్చిలోని ఓ క్రైస్తవ కుటుంబంలో ఏసుదాసు జన్మించారు. తల్లితండ్రులు ఆగస్టీన్ జోసెఫ్, అలైస్ కుట్టి. జోసెఫ్ మంచి గాయకుడు, నటుడిగా మంచిపేరు గడించారు. ఆయనను కలిసేందుకు ఎందరో ప్రముఖులు వాళ్లింటికి వచ్చేవారు. తండ్రికి ఎంత పేరుప్రఖ్యాతులున్నా సంపాదన అంతంతమాత్రమే కావడం వల్ల.... చిన్నతనంలో ఈ గాయకుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు మనసు పాటలవైపే పరిగెత్తింది. 17ఏళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచాడు. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న అగస్టీన్ తిరుపుణిత్తారయనిలోని సంగీత కళాశాలలో చేర్పించారు. తోటివారంతా క్రైస్తవుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాడట అంటూ గేలిచేసినా... పట్టుదలతో చదివి... కళాశాలలో ప్రథముడిగా నిలిచారు. తర్వాత త్రివేండ్రం సంగీత అకాడమీలో చేరారు. తండ్రి అస్వస్థతతో ఏసుదాసు జీవితంలో ఎదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఇంటి బాధ్యతలు... తండ్రి వైద్యం... చాలీచాలని జీతం... ఏసుదాసులో మరింత పట్టుదల పెంచాయి. గోటిచుట్టుపై రోకటి పోటులా... తండ్రి మరణం. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాలంటే... 800 రూపాయలు చెల్లించాలన్నారు. చేసేదేమీలేక ఇంట్లో వస్తువులు తాకట్టుపెట్టి ఆ సొమ్ము చెల్లించారు. మనుషుల మనస్తత్వాలు ఏసుదాసుకు పరిచయమైన సమయమది. తండ్రి మరణంతో ఏసుదాసు జీవితం... దిశ మారింది. కానీ సంగీతం నేర్చుకోవాలన్న కోరిక మాత్రం ఉండిపోయింది. ఫీజు కడితేగానీ అది సాధ్యం కాదు. ఆ డబ్బే ఉంటే పస్తులుండాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒక్కోరోజు... గంజినీళ్లే ఆ తల్లీకొడుకులకు కడుపు నింపేవి. ఎంత ఆకలితో ఉన్నా పస్తులున్నారే తప్ప ఎవ్వరినీ చేయిచాచి అర్థించకపోవడం ఏసుదాసు ఆత్మాభిమానానికి నిదర్శనం. సంగీతం నేర్చుకోవాలంటే డబ్బు కావాలి... అదే గాయకుడిగా మారితే... ఆ డబ్బు, తనదగ్గరకే వస్తుందని కొండంత ఆశతో చెన్నై బయల్దేరాడు. చేతిలో 16 రూపాయలు... గుండెల్లో కొండంత ఆశ... గొంతులో సముద్రమంత సంగీతం... ఇవి తప్ప ఏసుదాసు దగ్గర ఏమీ లేవు. ఎందరో సంగీత దర్శకులను కలిశాడు. ఎవరూ ఆయన పాటమీద నమ్మకం ఉంచలేదు. కొందరయితే... " నీ గొంతు సినిమా పాటలకు పనికిరాదు. ఎందుకయ్యా అనవసరంగా ప్రయత్నిస్తావు. ఇంకేదయినా పనిచేసుకో" అంటూ ముఖం మీదే చెప్పేశారు. నిరాశ చెందని ఏసుదాసు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే... వీధుల్లోనూ, ఫంక్షన్లలోనూ స్టేజీల మీద పాటలు పాడేవాడు. గాయకుడు కావాలన్న ఏసుదాసు కల 1961లో నిజమైంది. మలయాళ దర్శకుడు కె.ఎస్.ఆంథోని కొత్త గాయకుడి కోసం అన్వేషిస్తూ ఏసుదాసు గురించి విని ఆయనకు అవకాశమిచ్చాడు. ఆయన వైవిధ్యమైన గాత్రాన్ని గుర్తించలేకపోయామని ఎందరో దర్శకులు బాధపడ్డారు. ఆ తర్వాత అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుంచి ఏసుదాసు గాత్రానికి డిమాండ్ పెరిగింది. మలయాళంలో పేరు ప్రఖ్యాతులు వచ్చాక, ఏసుదాసుకు తమిళం, తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, తుళు, మలయ్, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీష్ భాషల్లోనూ పాటలు పాడారు. కాశ్మీరీ, అస్సామీ, కొంకణి తప్ప అన్ని భారతీయ భాషల్లోనూ పాటలు పాడిన ఏకైక గాయకుడు ఏసుదాసు. పలుభాషల్లో ఆయన దాదాపు 50వేల పాటలు పాడారు. తెలుగులో అంతులేని కథ, స్వయంవరం, నిరీక్షణ తదితర చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో ఎన్నో పాటలు పాడిన ఏసుదాసు... మేఘసందేశంలోని " ఆకాశదేశాన" గీతంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఏసుదాసు అంటే మోహన్ బాబుకు ప్రత్యేక అభిమానం. తన సినిమాలో కనీసం ఒక్కపాటైనా పాడిస్తూ ఉంటారు. ఆ గొంతు అంటే మోహన్ బాబుకు అంత ఇష్టం మరి. ఏసుదాసు అవార్డుల్ని లెక్క... ఆకాశంలో నక్షత్రాల లెక్క లాంటిదే. ఉత్తమ గాయకుడిగా అత్యధికంగా ఏడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. కేరళ ప్రభుత్వం నుంచి 24సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇదీ రికార్డే. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8 సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి 5సార్లు, బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం సైతం 2002లో పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది. ఏసుదాసు అంటే చాలామందికి అయ్యప్పపాటలే గుర్తుకువస్తాయి. అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన " హరిహరాసనం" ... చాలా సుప్రసిద్ధమైనది. శబరిమలలోని స్వామివారి మేలుకొలుపు దగ్గర్నుంచి.... పవిళింపు సేవ వరకూ ఏసుదాసు పాటకే ప్రాధాన్యత. 30ఏళ్లుగా చెన్నైలో జరిగే కర్ణాటక సంగీత కచేరీలకు ఏసుదాసు నియమ నిష్ఠలతో హాజరవుతారు. తన పుట్టినరోజున కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయంలో కచేరీ చేస్తారు. మతాలకతీతంగా ఆయన పాటలు పాడతారు. ఏ పాటనైనా భక్తితోనే పాడతానని... దేవుడంటే పాటే అని వినమ్రంగా చెబుతారు ఏసుదాసు. చిన్నతనంలో పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏసుదాసు సమాజానికి చేతనైన సాయం చేసేందుకు " దివ్యకారుణ్య" ట్రస్ట్ ఏర్పాటుచేశారు. హృద్రోగాలతో బాధపడే చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించడమే ఈ ట్రస్ట్ ధ్యేయం. కులమతాలకు అతీతంగా తన పాటతో అందరి మనసులు గెలిచి భారతదేశం గర్వించదగ్గ గాయకుడయ్యాడు. ఇప్పుడు ఏసుదాసు అంటే... అందరివాడు. అందుకే తన పాటలు భారతీయ శైలి అని చెబుతుంటాడు. నిజమే ఏసుదాసు అంటే ఓ వ్యక్తి కాదు... భరతగీతి స్వరచిత్రం.
No comments:
Post a Comment