మనకు జ్ఞానము కలుగు విధము
- వారణాసి రామబ్రహ్మం
ఉపనిషత్తులు, ఇతర తత్త్వశాస్త్ర గ్రంథములలో అందరమూ అనుకుంటున్నట్టు పరము గురించి మాత్రమే లేదు. ఇహము ఎంతో ఉంది. మనకు లౌకిక, ఆధ్యాత్మిక, భాషా, పారలౌకిక జ్ఞానములు కలిగే విధములు వివరముగా వీటిలో చర్చించబడ్డాయి. మనసు, ఇతర అంత:కరణముల పుట్టుపూర్వోత్తరములు, స్వరూప, స్వభావములు విశదముగా అందించబడ్డాయి. మనకు ఏ జ్ఞానమైనా ముందుగా జ్ఞానేంద్రియముల ద్వారా కలుగుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము- ఇవి జ్ఞానేంద్రియములు. కన్నులు దృశ్యములను, చెవి శబ్దములను, మాటలను, ముక్కు సౌరభములను (వాసనలను), నాలుక రుచులను, చర్మము స్పర్శలను, వేడిమి, చల్లదనములను మనసు మాధ్యమము ద్వారా గ్రహిస్తాయి, మనసు మాధ్యమము ద్వారా ప్రపంచం రూపంలో మస్తిష్కంలో భద్రపరుస్తాయి. మనసు మాధ్యమము ద్వారా వెలికి తీయబడి తలపులవుతాయి. దృశ్యములను, శబ్దములను, వాసనలను, రుచులను, స్పర్శలను విషయములు అంటారు. ఈ విషయములు అదే సమయములో కలిగించే అనుభవములను చిత్తము అంత:కరణము గ్రహించి విషయానుభవములు - వాసనలు (మిగిలి ఉండేవి) గా మస్తిష్కంలో భద్రపరుస్తుంది. ఇలా భద్రపరుపబడిన వాసనలే (విషయానుభవములే) మన జ్ఞప్తి. ఈ వాసనలు మళ్ళీ చిత్తము ద్వారానే ప్రేరేపింపబడి తలపులుగా మారి మనసై వర్తిల్లుతాయి. మాటలై విలసిల్లతాయి. మన గ్రహణలన్నీ, గ్రహింపులన్నీ మనసు, చిత్తముల ద్వారా జరుగుతాయి. అంత: కరణము బుధ్ధి విచక్షణనూ, నిశ్చయానిశ్చయములను కలిగిస్తుంది. అంత:కరణము అహంకారము మన వ్యక్తిత్వాన్ని, అహంభావము – నేను అనే భావము – కలిగిస్తుంది. నేను, నాది, నావారు అనేవి ఏర్పడతాయి. దానిని అనుసరించి మమతానురాగములు, ద్వేషములు, కక్షలు, కార్పణ్యములు కలుగుతాయి. మన మానసిక కార్యకలాపములన్నీ ఈ అంత: కరణముల ఆట. సయ్యాట. ఈ అంత: కరణములన్నీ చిదాభాస – చిత్ ఆభాస (ప్రతిఫలనము – మేధలో) యొక్క విభూతులు. చిదాభాసకు మాయ, ప్రణవము, స్ఫోట అనే పేర్లూ ఉన్నాయి. మాయ అంటే ఆత్మ శక్తి ప్రతిఫలనము. మన మానసిక కార్యకలాపములన్నిటినీ అంత: కరణములు, జ్ఞానకర్మేంద్రియముల ద్వారా జరిపించే చిత్ శక్తి విభూతి. మాయ అనగానే మానసిక శక్తి మన దృష్టి పథములోకి రావాలి. మాయలు, మంత్రాలు దృష్టిలోకి రాకూడదు. మిథ్య రావచ్చు, కాని మిథ్యా పదము యొక్క అసలు అర్థము తెలుసుకోవాలి. ఒక సారి ఉండి - దృష్టికి వచ్చి – మరొక సారి (దృష్టిలో) లేనిది మిథ్య. నిజమైనది ఆత్మశక్తి. దాని ప్రతిఫలనమైన మాయ నిజము కాదు, మిథ్య అనే అర్థంలో తెలియాలి. మాయ లేక మన మానసిక కార్యకలాపముల నిర్వహణ జరగదనీ తెలియాలి. మాయామయమ్ ఇదమ్ జగత్ అంటే ఇదే. భావముల జననమే జగజ్జననము. భావముల ఉపసంహరణయే జగత్ ప్రళయము. వ్యక్తిత్వ విరమణము. విస్మరణము. విరామము. ఆత్మానుభవము. చేయి. కాలు, కంఠ స్వరపేటిక, ప్రేవుల, జననేంద్రియ - కదలికలు – వీటిని కర్మేంద్రియములు అంటారు. లౌకిక భౌతిక కార్యకలాపములలోనేకాక, మానసిక కార్యకలాపములలో కూడా కర్మేంద్రియముల బాసట, ఆసరా చాలా అవసరమైనవి, ముఖ్యమైనవి. అంత:కరణములు, జ్ఞానేంద్రియములతో పాటు సమానముగా, అదే వేళలో కర్మేంద్రియములు పనిచేయక మన ఏవిధమైన జ్ఞాన సముపార్జనము, జ్ఞాన భాషాధ్యయనము, అధ్యాపనము జరుగవు. మనం భాషలు నేర్చుకుంటున్నప్పుడు జ్ఞానేంద్రియములైన కన్నులు – అక్షరాలు చూడడానికి, చెవులు – అక్షరాలు వినడానికి, కర్మేంద్రియములైన చేయి – అక్షరాలు రాయడానికి, స్వర పేటికను (నోటిని) అక్షరాలు పలకడానికి ఒకేసారి ఉపయోగిస్తాము. అదే విధముగా లౌకిక జ్ఞానము, కళ అయిన డ్రైవింగు నేర్చుకునేటప్పుడు, కారు, మోటారుసైకిలు, విమానము నడిపేటప్పుడు కన్నులు, చెవులు, కాళ్ళు, చేతులను ఒకేసారి ఉపయోగించి ఆయా జ్ఞానములు, కళలు, నేరుస్తాము, ఉపయోగించుకుంటాము. లలిత కళలైన సంగీతమూ, నాట్యమూ, చిత్రలేఖనము మొదలైనవాటి విషయములలోనూ ఇంతే. భాషలు నేర్చుకున్నాక సమస్త జ్ఞానములను, కళలను, నేర్పరితనములను - అంత:కరణములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములను ఒకే సమయములో అనుసంధాన పరచడము ద్వారా నేరుస్తాము, నేర్పుతాము, ఉపయోగించుకుంటాము. లౌకిక, ఆద్యాత్మిక, తత్త్వ జ్ఞానములలో అనుభవ స్థితి - భాషాధ్యయన, అధ్యాపన స్థితిలో అర్థస్థితి అనబడుతుంది. దీనినే పశ్యంతీ అంటారు. మిగతా జ్ఞానావస్థలలో భావస్థితిని, తలపుల స్థితిని, భాషాజ్ఞానావస్థలో మధ్యమా అంటారు. వాక్యస్థితి లేక విభక్తి స్థితి అన్నాఇదే. వాక్యము లేక తలపు యొక్క ఉచ్ఛారణ స్థితిని వైఖరీ అంటారు. ఏ విషయములు, తలపులు, విషయానుభవములు దృష్టికి రాక విరమింపబడిన అలౌకిక స్థితిని శుధ్ధాహం స్థితి అంటారు. ఈ స్థితికే ఎన్నో పేర్లు. అవి: శాంతము, ఆనందము, మౌనము, వాసనాతీతము, మానసాతీతము, భావాతీతము, నిర్మల మానసము, భక్తి, పరా, మోక్షము, ముక్తి, నిర్వాణము, ప్రజ్ఞానము, బ్రహ్మము, ఆత్మ, రామబ్రహ్మము, ఆత్మారామము, అసలు నేను మొదలైనవి. ఇలా సకల జ్ఞానములు, భాషలు, కళలు, నేర్పరితనములు - చిదాభాసా, మాయా, ప్రణవ, స్ఫోట సదృశ వివిధ నామధేయ యుతమైన – ఆత్మ శక్తి వలన మనకు, ఆ శక్తి చేతనే ప్రేరేపింపబడు తత్సమయ అంత:కరణ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అనుసంధానము వలన కలుగుతున్నాయి. వేదాంతము, శబ్దబ్రహ్మ సిధ్ధాంతముల మేలు కలయిక అయిన ఈ రచన బుధజనులను రంజింపజేయుగాక! సమస్త సన్మంగళాని భవంతు! సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు! శ్రీర్భూయాత్!
No comments:
Post a Comment