న్యూనతా భావానికి గురవుతున్నారా?
- బి.వి.సత్యనగేష్
మనపై మనకే గౌరవం లేనపుడు ఎదుటివారు మనల్ని గౌరవించడం లేదనుకోవడం ఆత్మన్యూనతా భావానికి మూలం. Respect yourself and expect respect from others అని చెప్పుకోవచ్చు. ఆత్మగౌరవం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు. ఆత్మగౌరవానికి, అహంకారానికి చాలా తేడా ఉంది. ‘నేను పాడగలను, నా పాటను విన్నవారు ఆస్వాదిస్తారు’ అని అనుకోవడం ఆత్మగౌరవం, ‘నేను పాడగలను, నాలాగా పాడగలిగే వాళ్ళను వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు’ అనుకోవడం అహంకారం అవుతుంది. ఆత్మగౌరవం వల్ల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. తద్వారా వ్యక్తిగతంగా సంతృప్తిగా ఉంది విజయపధంలోకి నడుస్తూ ఉంటాం. ‘ఆత్మన్యూనతా భావం కలగడానికి అనేక కారణాలున్నాయి. తనలోని లోపాలను పెద్దగ చేసుకుని ఊహించుకోవడంతో బాటు ఇతరులలోని సామర్ధ్యాలను పెద్దగ ఊహించుకోవడం వలన ఆత్మన్యూనతా భావం ఎక్కువవుతుంది. అన్ని కారణాలలో ఈ కారణం అతి ముఖ్యమైనది. పెద్ద వ్యాపారాలు చేస్తూ కోట్లకు అధిపతులు అయిన వాళ్ళను చూస్తుంటాం. అందులో కొంతమంది సరైన చదువు, విజ్ఞానం, సంస్కారం లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే రాజకీయవేత్తలలో కూడా కొంతమందికి సంస్కారం బొత్తిగా ఉండదు. మనం చూస్తూనే ఉన్నాం కూడా. ఉద్యోగ రీత్యా పని చేసే ఉన్నతాధికారులు. రాజకీయవేత్తలతో, వ్యాపారవేత్తలతో మెలిగినపుడు పరస్పరం గౌరవించుకుంటారు. ఒకవేళ ఒకరినొకరు గౌరవించకపోయినా వారు తమను, తమ హోదాను గౌరవిన్చుకుంటారు. కానే ఆత్మన్యూనతకు గురికారు. అలా గురయిన వాళ్ళు వివాదాల్లో చిక్కుకుంటారు. ఎవరి రంగాల్లో వారు గొప్ప. ఉదాహరణకు క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్, అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ఎదురెదురుగా మాట్లాడుకునేటప్పుడు చూస్తె వారిద్దరి ఎత్తులో చాలా తేడా కనిపిస్తుంది. అలానే వారి స్వరాలలో కూడా చాలా తేడా ఉంటుంది. సచిన్ పొట్టిగా ఉంటాడు. గొంతు పీలగా ఉంటుంది. అమితాబ్ గొంతు గంభీరంగా ఉంటుంది, మనిషి ఆజానుబాహువు, అయినంతలో సచిన్ ఏ మాత్రం పట్టించుకోకుండా అతన్ని అతను గౌరవించుకుంటాడు. త్రాసు పధ్ధతి త్రాసులో రెండు పళ్ళాలు (plates) ఉంటాయి. ఒక పళ్ళెం పైకి వెళ్తే, రెండవ పళ్ళెం క్రిందకి దిగుతుంది. చదువు బరువు చూడకుండా వాటి స్థాయి (level) చూస్తె ఈ తేడా కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులలో ఒకరు తనను తానూ తక్కువగా అంచనా వేసుకుంటే రెండవ వ్యక్తి ప్రమేయం లేకుండానే వారు అధికులు అనే భావం మొదటి వ్యక్తిలో కలుగుతుంది. ఆత్మన్యూనతా భావం ఈ విధంగానే మొదలవుతుంది. బాల్యంలో అనుభవాలు ‘నువ్వు నోరు మూసుకో, నీకు ఏమీ తెలియదు, నువ్వు కూడా సలహాలు ఇచ్చే వాదివేనా...’ లాంటి వ్యాఖ్యలకు బాల్యంలో ఎక్కువగా గురై వుంటే న్యూనతా భావం పెరిగే అవకాసం ఉంది. ఈ మాటలను ఉద్రేకంతో తరచుగా ఊహించుకుంటే ఖచ్చితంగా న్యూనతా భావం పెరుగుతుంది. అందుకే పిల్లలను ప్రోత్సహించే మాటలను చెప్పాలంటున్నారు సైకాలజిస్ట్ లు. వారు చెప్పే మాటలను శ్రద్ధగా విని అవసరమైతే సవరించాలి కాని అశ్రద్ధ చేయకూడదంటున్నారు. స్కూలు వాతావరణం చదివే పిల్లలలో ఆర్ధిక అసమానతలుండటం సహజమే. కొంత మంది సంపన్నులుంటే, మరికొంత మంది మధ్య తరగతి వారు, బీదవారు ఉండొచ్చు. చదువుకు, ఆర్ధిక స్థోమతకు సంబంధం లేకపోయినా ఆర్ధికంగా వెనుకబడిన కొంత మంది పిల్లలు సంపన్నులను చూసి ఊహించుకుని న్యూనతా భావాన్ని పెంచుకుంటారు. సంపన్నులను అతిగా ఊహించుకుని, తమను తాము తక్కువగా ఊహించుకోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. ఇతర సమస్యలు తెలిసో, తెలియకో ఎప్పుడో చేసిన తప్పును తలుచుకుని అపరాధ భావంతో న్యూనతా భావాన్ని పెంచుకుంటారు కొంతమంది. ‘ఆ రోజు ఆ సమయంలో అలా చెయ్యడం సబబు అనిపించింది’ - ఈ రోజు ఆ విషయం తలచుకుని కుమిలిపోవడం, ఆత్మన్యూనతా భావం పెంచుకోవడం నాకు మంచిది కాదు’ అని అనుకోవాలి. తన భార్య తనకంటే చాలా అందంగా ఉంటుందని అతిగా ఊహించి, ఆమెకు తాను తగిన భర్త కాదని, కాకి ముక్కుకు దొండపండు సామెత చందంగా తమ జంట ఉందని తలచుకుంటూ న్యూనతా భావానికి లోనయిన భర్తలూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తీ ఒకతను మానసికంగా బాధపడుతూ అందరికీ లోకువయ్యాడు. అంతే కాకుండా మానసికంగా సెక్స్ సమస్యలకు కూడా గురయ్యాడు. ఈ కారణం వల్ల అతని సాంసారిక జీవితంలో అనేక చిక్కులొచ్చి పడ్డాయి. వీటంతటికీ మూల కారణం – ఆటను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల మాత్రమే. నిజానికి అతని భార్య రూపవతి అయినప్పటికీ ఆమెలో అతిశయంగాని, భర్తను తేలిక చూడడం గాని లేదు. కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, సమాజంలో తనను తాను తక్కువగా అంచనా వేసుకునే వారు ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలి. మాట్లాడే మాటల్లో ఉన్నత భావాలుండాలి. అందుకే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్.ఎల్.పి), న్యూరో సెమాంటిక్స్ (ఎన్.ఎస్) అనే శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. మనం మాట్లాడే మాటల్లోనే మన మనోభావాలు, వ్యక్తిత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు మనో శాస్త్రవేత్తలు. ఆత్మగౌరవం, ఆత్మన్యూనతా భావం త్రాసులో రెండు పళ్ళాలు లాంటివి. ఆత్మగౌరవం పెరిగితే న్యూనతా భావం తగ్గుతుంది. పరిస్థితులను బట్టి, ఎదుటి మనిషిని బట్టి వీటి స్థాయి ఆధారపడి ఉంటుంది. అహంకారాన్ని తాకకుండా ఆత్మగౌరవాన్ని పెంచుకుంటే న్యూనతా భావానికి ఆమడ దూరంలో ఉంటాం.
No comments:
Post a Comment