శవానికి సంకెళ్ళు..!!
- వెంకట కోటేశ్వరరావు
"మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాలేదు, వెంటనే బయలుదేరండి. " నాకు కడప జైల్ నుంచి వచ్చిన మెసేజ్ కొద్దిగా కలవరపెట్టింది. మరోసారి చెక్ చేసుకున్నా . జైలర్ గారు చెప్పింది నాకే అని, నా పేరుకే మెసేజ్ వచ్చిందని.. రెండుగంటలు కాలేదు నాన్న నాతో ఫోన్ లో మాట్లాడి డ్యూటీకి వచ్చే ముందే కదా.. ఇంతలో ఏమైందో ఏమో ఆదుర్దాగా ఇంటికి కాల్ చేశా.. సమాధానం రాలేదు .. ఏదైనా హడావుడైతే సెల్ కి కాల్ చేస్తారుకదా .. ఏమై ఉండదు నాన్నకి .. అని నాలో నేను భయాన్ని అణచి, ధైర్యం కూడబలుక్కుని లైట్ గా తీసుకున్నా.. ఇందాక మాటల్లో నాన్నకి కడప నుంచి హైద్రాబాద్ ట్రాన్స్ఫరవ్వడంతో డ్యూటీలో చేరేందుకు రేపు బయలుదేరి వస్తానని చెప్పారు కదా.. అందరం కలిసి ఉండొచ్చు హాయిగా అన్నారు కదా..! మరి ఈ మెసేజ్ ఏంటి.. నాకయ్యుండదులే అనుకున్నా..! అంతలో "“తండ్రికి బాగోలేనపుడు చూడడానికి రానివాడు.... ఛీ, వాడూ ఒక కొడుకేనా, బేటా ?" అని ఇరవై రోజుల క్రితం ఖాన్ అబ్దుల్ అన్న మాటలు గుర్తొచ్చాయ్...! వెంటనే భార్యామణికి కాల్ చేసి బట్టలు సర్ధుకోమన్నా.. దొరికిన బస్సు పట్టుకుని కడప బయలుదేరాం.. మనసంతా ఏదోలా అలజడికి లోనవుతోంది...నా గుండె దడ నాకే వినిపిస్తోంది.. చేతిలో సెల్ నాన్న సెల్ కి డయల్ చేస్తూనే ఉంది.. రింగ్ అవుతున్న ఫోన్ ఎవ్వరూ తీయక పోవడంతో అసహనం పెరిగింది.. ఏదో గుర్తొచ్చినట్లు నాన్న జైలర్ గా పనిచేసే కడప జైల్ కి ఫోన్ చేశా.. కొద్దిగా క్రిటికల్ గా ఉంది . సన్ స్ట్రోక్ తగిలినట్లుంది.. హాస్పటల్ లో చేర్చారు.. ఫోన్ ఇంటి దగ్గర మరచి పోయినట్లున్నారు, కంగారులో ‘హాస్పటల్ చాణక్య’కు వచ్చేసారు, అని అక్కడి వారు చెప్పిన దాని సారాంశం. బస్సు గాలి చీల్చుకు వెళ్తున్నా నాకుమాత్రం నెమ్మదిగా వెళ్తున్నట్టే ఉంది.. కాస్త స్పీడ్ గా పోనివ్వుగురూ అనుకుంటూ ఆలోచనలో పడ్డా. అంతలో మరలా ఖాన్ అబ్దుల్ గుర్తొచ్చాడు.. అతని మాటలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయ్.. ఖాన్ అబ్దుల్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.
******************************************
నేరం చేయకుండా.. జీవితకాలం శిక్ష అనుభవించే వాడెవడ్రా..! అంటే .. 'జైలు ఉద్యోగులు మాత్రమే.. అందులో అనుమానం వీసమెత్తులేదండోయ్.." అవునండీ జైల్ వార్డెన్ గా చేరిన నాకు రోజూ అనిపిస్తోందిదే.. ! వార్డెన్ గా నేను ఉద్యోగంలో చేరి అప్పటికి ఇరవై రోజులు అంతా కొత్త వాతావరణం. ఉదయాన్నే ఐదు గంటలకి డ్యూటీ ఎక్కి బ్యారక్ వద్ద పహారా కాస్తున్న కొద్దిసేపటికి జైలర్ గారి నుంచి కబురొచ్చింది. ఖంగారుగా వెళ్ళిన నాతో. . " గా.. బైట కూర్చుండు సూడు ముసలాడు. ఆణ్ణి దవాఖాన దీస్కబో.. జాగ్రత్త్త ఆ వెంకటసామిని కూడబెట్టుకెళ్ళు అంటూ ఓ సీనియర్ వార్డెన్ ను తోడు తీసుకెళ్ళమని పనికి పురమాయించారు.. దవాఖానాకు రోగిని తీసుకెళ్ళాలా అదికూడా నేను...అది నా పని కాదనుకుంటూనే, బయట ఖళ్ ఖళ్ అని దగ్గుతున్న యాభై ఏళ్ల వృద్ధుడి దగ్గరకెళ్ళా. మాసిన గడ్డం.. మీసం లేకుండా.. ప్రక్కనే ఒక డబ్బా పెట్టుకుని, కళ్ళె దాంట్లో ఉమ్మేస్తూ...!! దేవుడా..! అనుకుంటూ మాట కలిపాను. చూడటానికి అసలు రోగిలా లేడు.. "ఏమైంది" అడిగాను... ఖళ్ ఖళ్ దగ్గుతూనే.. కనబళ్లేదా బేట అన్నాడు. "ఏం పేరు నీ పేరు?" "ఖాన్ అబ్దుల్ " " ఏం నేరం చేశావో.. " హత్యచేశానంటు సిచ్చేసేశారు మరి అన్నాడు.. ఉండే కొద్దీ దగ్గు, ఆయాసం పెరుగుతోందతనికని అర్ధమై నా ప్రశ్నలు ఆపేసి, " సరే వెంకటసామి సారు రాగానే వెళ్దాం కాస్త ఓపిక పట్టుకో.. అంటుండగానే అంబులెన్స్ తో అక్కడికి చేరుకున్నాడు వెంకటస్వామి గారు. సాధారణంగా, పోలీసులు, ఖైదీలను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులకి చూపించి తిరిగి తీసుకు వస్తారు. ఎప్పుడైనా అత్యవసర పరిస్ధితులలో జైలు సిబ్బంది తీసుకువెళతారని వెంకటస్వామి గారి ద్వారా తెలుసుకుని, "బాగానే ఉన్నాడుగా ఇంత హడావుడా మనమెందుకు తీసుకెళ్లాలని అన్నాన్నేను వెంకటస్వామి గారితో . " రాత్రి అంతా దగ్గుతూ నిద్రపోలేదట. ఆయాసం ఎక్కువగా వుందట.. మంత్రసాని తనం ఒప్పుకున్నాక ఏదైనా చెయ్యాలి " సీనియరూ గా చెబుతున్న వెంకటస్వామి గారి మాటతో తలూపాను.. నేను మెల్లగా జైలు ఆంబులెన్స్ వద్దకు నడుస్తుండగా వెంకటస్వామి గారు నన్ను మందలించాడు. రోగిని చేయి పట్టుకుని నడిపించుకు రమ్మని. ఆ ఖాన్ అబ్దుల్ నా వెనకాలే బాగానే నడుచుకుంటూ వస్తూంటే మళ్ళీ చెయ్యెందుకు పట్టుకోవటం, బాగానే ఉన్నాడుగా అనుకుంటూనే, అతని చేయి పట్టుకుని నడిపించి, ఆంబులెన్స్ లోనికి ఎక్కించా.! అంబులెన్స్ లో కూర్చొని చిన్న చిన్నగా దగ్గుతూ తెమడ తన దగ్గర ఉన్న డబ్బాలో ఉమ్మేస్తున్నాడు ఖాన్. ఆసుపత్రికి బయలుదేరాం.... ఆంబులెన్స్ ను కొంచెం మెల్లగా పోనిమ్మని అడిగాడు. “ నా చిన్న కొడుకు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, వాడికి ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడాలని ఉంది ఆసుపత్రికి వస్తాడు. మళ్ళీ చూస్తానో లేదో” అన్నాడు. “మీ వాడికి ఫోన్ చేస్తే, వెంటనే వస్తాడా అని అడిగా”, అలా అడగొచ్చో లేదో ఎప్పటికీ నాకు అనుమానమే. కానీ అడిగేశా! దానికి ఖాన్ తీవ్రంగా స్పందించాడు. “తండ్రికి బాగోలేనపుడు చూడడానికి రానివాడు, వాడూ ఒక కొడుకేనా బేటా” అన్నాడు. ఖాన్ చెప్పిన నెంబర్ కు ఫోన్ చేశా..! కానీ సమాధానం లేదు. ఖాన్ కొంచం అసంతృప్తి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రికి చేరాం. నాతో వచ్చిన వెంకటస్వామి గారెళ్ళి చక్రాల కుర్చీ తీసుకుని వచ్చాడు. ఖాన్ ని అందులో కూర్చోపెట్టే సమయానికి అతనికి ఆయాసం బాగా ఎక్కువైయ్యింది. గుమ్మం దగ్గర ఒక మెడికొ కేస్ వివరాలు అడిగి రాసుకుని, రూమ్ నెంబర్ చెప్పాడు. లోపలికి వెళుతున్న కొద్దీ ఖైదీకి ఆయాసం పెరుగుతుంది. రొప్పు శబ్దం చుట్టూ ప్రతిధ్వనిస్తోంది. ఖాన్ ని మంచంమీద పడుకోబెట్టి అతని ‘మెడికల్ హిష్టరీ’ పుస్తకం చూసి వైద్యానికి సిద్ధమయ్యారు కుర్ర డాక్టర్లు. మధ్య మధ్యలో వెళ్ళి పెద్ద డాక్టరును సంప్రదించి వస్తున్నట్టుగా ఉంది వారి వ్యవహారం. ఇద్దరు, ముగ్గురు యువ డాక్టర్లు వచ్చి, బీపి, జ్వరం, నాడి పరీక్షించారు. ఖైదీకి వీరంతా ఇలా తిరుగుతుంటే, అసహనం పెరుగుతుంది, వారి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక విసుక్కుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆయాసం బాగా ఎక్కువైంది. గుండె దడ పెరిగింది. హడావుడి చేస్తున్నారా జుడాలు. ఎందుకు హడావుడి పడుతున్నారో అర్ధం కావడం లేదు నాకు. అంతా కొత్తలోకం.. నేను వార్డెన్ అవ్వటం ఏంటో.. రోగిష్టి ఖైదీని దవాఖానాకు తేవడం ఏంటో.. ఈ కుర్ర డాక్టర్ల సినిమా బిల్డప్పేంటో.. అంతా మిధ్యలా తోచింది నాకు. నాకు కాస్త వేదాంత గోరోచినం ఎక్కువే ఉందని నానమ్మ అంటూ వుండేదిలే.! ఒక కుర్ర్ర డాక్టరమ్మ కాస్త తిప్పుకుంటూ ఇంజెక్షను తీసుకుని వచ్చింది. అది రక్తనాళానికి చేయాలట. ఆమె ఎంత ప్రయత్నించినా, ఆమెకు ఆ రక్తనాళం దొరకటం లేదు. ఇంకో లేడీ డాక్టర్ వచ్చి ఖైదీ చేయి గట్టిగా పట్టుకొంది. ఇద్దరూ కలిసి ప్రయత్నించారు, వారి వల్ల కాలేదు. ఖాన్ విసుగుతో గొణుగుతున్నాడు. పక్కనే ఉండి కాపలా కాయటమే గాని, నేను చేయగలిగింది ఏమీలేదు. అతని పరిస్ధితి చూసి నాకు జాలి వేస్తోంది. వీళ్ళ్ అవస్థ చూసి మరో కుర్ర డాక్టర్ వచ్చాడు. అతనూ నరంలో సూది గుచ్చేందుకు విఫలయత్నం చేశాడు. అది దొరకటం లేదు. పడుకున ఉన్న ఖైదీ ఖాన్ ని లేపి మంచం మీదే కూర్చొబెట్టి, పక్కనే ఉన్న నన్ను పిలిచి, ఖైదీ చేయిని గట్టిగా బిగపట్టమన్నాడు. నేను ఖైదీ మోచేతి పైభాగం దగ్గర నా రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను. డాక్టరు ఇంజెక్షను చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఖైదీ ఇలా అన్నాడు “ఇక నన్ను బ్రతికించడం మీ వల్లగాదు .. పిల్ల కుంకల్లారా.. వదిలేయండ్రా..!” అంటున్నాడు . నరంలోకి ఇంజెక్షను చేయటం పూర్తి అయ్యిందని డాక్టరు తల వూపాడు. వెంటనే……నా రెండు చేతులలో ఉన్న ఖాన్ చేయి చల్లబడింది. అరే ,ఇంజెక్షను వల్ల వెంటనే జ్వరం తగ్గిందే అనుకున్నాను నేను. కానీ కూర్చొని ఉన్న ఖైదీ వెనక్కు పడిపోతున్నాడు, నేను అతని చేయిమీద ధ్యాసతో ఉన్నాను, అతను బరువుకి వెనక్కు ఒరుగుతున్నాడు. నేను అతని బరువుని ఆపలేక పోతున్నాను. వెంటనే, ఆరేడుగురు డాక్టర్లు వచ్చారు, పరుగు పరుగున, ఖైదీ నోట్లో ఏదో గొట్టాం పెట్టి అతని నాలుక ఆడ్డం తొలగించి, సిపిఆర్ చేసారు, షాక్ ఇచ్చారు అతను లేవటం లేదు. చాలా సేపు ప్రయత్నించాక వదిలేశారు. అతని నోటికి ఒక తెల్లని బుడగ అమర్చి దానిని నన్ను ఒత్తమన్నారు. నేను ఒత్తుతూ కూర్చొన్నాను. పక్కనే ఒక పేషెంట్కి అమర్చిన ఒక మిషను తెచ్చి, ఖైదీకి తగిలించారు. నేను ఆ బుడగను ఒత్తుతూ…… ఖైదీ ఏమన్నా లేస్తాడేమోనని, చూస్తూ కూర్చున్నా. ఓ పది నిమిషాల తరువాత ఒక నర్సమ్మ వచ్చి ఇక ఆపమంది. ఎప్పుడో చనిపోయాడు మార్చురీకి తరలించాలంది. నాకప్పుడు అర్ధమైంది, నాచేతిలో ఉన్న అతని చేయి చల్లబడినపుడే అతను చనిపోయాడు. నా చేతులలో ప్రాణం విడిచాడు. నేను నమ్మలేక పోతున్నాను. అంతా వెంట వెంటనే జరిగిపోయింది. ఎవరికెవరు ఈ లోకంలో అనిపించింది.... అక్కడి శవాలకు తెల్ల గుడ్డ చుట్టేవారు వచ్చి, నువ్వు చుట్టు అంటే నువ్వు చుట్టు అంటూ, వంతులేసుకుంటున్నారు. సాధారణంగా బయట వారు మరణిస్తే ఇలా తెల్ల గుడ్డ చుట్టినందుకు మామూళ్ళు ముడతాయి. ఖైదీలకు, అనాధ శవాలకు మామూళ్ళు ముట్టవని వంతులేసుకుంటున్నారు . అంతలో సమాచారం తెలుసుకున్న హైద్రాబాద్ లో నివాసం ఉండే అతని తాలూకు చిన్న కొడుకు వచ్చాడు… వచ్చిన ఖాన్ చిన్న కొడుకు , మా నాన్న ఏడి అని అడిగాడు. నేను, ఒకేసారి చెబితే తట్టుకోలేడేమోనని, మెల్లగా, తెల్లని గుడ్డ చుట్టబడిన, శవం వైపు వేలితో చూపించా. వెళ్ళి, అసలు వాళ్ళ నాన్నో కాదోనని సరిచూస్తాడనుకున్నా. అలా చూడలేదు. శవం మీద పడి ఏడుస్తాడనుకున్నా! అలా ఏడవలేదు. వస్తున్న ఏడుపుని ఆపుతూ, ఎవరికో ఫొన్ చేసి విషయం చెబుతూ బయటకు వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ కనపడలేదు నాకు. సినిమాల ప్రభావం చాలా ఉంది నా మీద, అని అప్పుడు అనిపించింది. కానీ సినిమాలలో తండ్రి చనిపోయినపుడు కథానాయకునిలాగా ఏడవలేదతను. శవాన్ని మార్చురీకి తరలించే పనిలో భాగంగా, శవాన్ని స్ట్రెచ్చర్ మీద, నెట్టుకుని వెళ్ళాం. వెంకటస్వామి గారు, "నువ్వు ఉండు, నేను శవాన్ని అప్పజెప్పి వస్తాను" అని లోపలికి వెళ్ళాడు. నేను ఆ శవాల గది బయటే ఉండి పోయా..! షాక్ నుంచి నేను ఇంకా తేరుకోలేదు.. నను నేను నమ్మలేకున్నా..! ఇంతలో అసలు ఈ పనంతా చేయవలసిన ఏ ఆర్ పోలీసులు వచ్చారు. వాళ్ళకి శవాన్ని అప్పగిస్తున్నట్టు, కాగితం రాయించారు. ఏ.ఆర్ వాళ్ళు తెచ్చిన సంకెళ్ళు ఇచ్చి లోనికి వెళ్ళి ఆ శవం కాళ్లలో ఒక దానికి సంకెల తగిలించి, తాళం వేసి రమ్మని నాకు ఇచ్చాడు వెంకట స్వామి.. మళ్ళి శవం దగ్గరకా..!! నేను, ఓ ఏఆర్ కానిస్టేబుల్ లోపలికి బయలు దేరాం.. నాకేం అర్ధం కావటం లేదు.,సంకెళ్ళు వేయకుంటే “శవం ఎక్కడికి పారిపోద్ది” అని, నా ప్రక్కన నడుస్తున్న కానిస్టేబుల్ని అడిగా!! అతను వయసులో, అనుభవంలో చాలా ముదిరిపోయిన వ్యక్తి, నా వంక చిరునవ్వుతో చూసి, గుట్కా నములుతూ ఇలా అన్నాడు, “తమ్మీ ఏడ్కీ బోదు, హత్కడి ఎయ్యకుంటె, మన షెవమేదని గెట్లదెల్వాలె ?” అన్నాడు. వెళ్ళి ఖాన్ శవానికి సంకెళ్ళేసా.. అక్కడ నుంచి వచ్చి శవం కాలి సంకెళ్ళు వేయడం గురించి జీర్ణించుకోలేక వెంకటస్వామి సార్ ని అడిగా. "శవాల గదిలో ఎన్నో శవాలు ఉంటాయి, పైగా చచ్చిన వాడి మొహాన్ని ఏ పోలీసులు గుర్తుపట్టలేరు, ఆసుపత్రి ఉద్యోగుల పొరపాటు వలన శవాలు తారుమారైతే అదో పెద్ద కేసు అవుతుంది. గనుక, వాళ్ళు ఈ పద్ధతిని వాడుతున్నారు”, అన్నాడు. ఒక్కొక్కరివి ఒక్కో కష్టాలు అనిపించింది నాకు. నా చేతిలో వాలిన ఖాన్ శవం గుర్తుచేసుకుంటూ జైలుకి తరిగి వచ్చాక పై అధికారులకు, లిఖితపూర్వక వివరణ ఇచ్చి ఇంటికి వచ్చాను. చావుని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి నాకు. సాయంత్రం, మా నాన్నగారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. విధిలో ఇలాంటివి జరుగుతాయి, నువ్వేం బాధపడకు అని చాలా ధైర్యం చెప్పారు నాకు. అంతలో స్పీడ్ బ్రేకర్ వెయ్యడంతో ఈ లోకంలోకి వచ్చా..! ఈ సంఘటన జరిగిన ఇరవై రోజులకు మా నాన్నగారు బాగోలేదని కబురొచ్చి బయలుదేరా.. కడపకు. ఆయనకు సీరియస్ ఏంటీ? ఏం కాదు.. నాన్నకు ఏంకాదు.. నాకు నేను ధైర్యం తెచ్చుకుంటున్నా!.. కానీ కళ్ళ కొనలు తెలియకుండానే తడిబారుతున్నయ్..! ప్రక్కనే ఉన్న భార్యామణి , పిల్లలు నిద్రలోనే ఉన్నారు.. పొంగుకొస్తున్న ఏడుపు కర్చీఫ్లో దాచుకున్నను. కడప చేరుకున్నాం. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఏ అనారోగ్యమూ లేదు. ఈ రోజు ఉదయం నన్న మాట్లాడిన సంగతి గుర్తొచ్చింది. “ నిన్న సాయంత్రం ఇక్కడి ఎండల వేడికి కొంచం నీరసం వచ్చి కళ్లు తిరిగి పడిపోయాను, ఒక సెలైన్ పెట్టగానే, తగ్గింది సాయంత్రం బయలుదేరి హైద్రాబాద్ వచ్చేస్తాను. ఎంచక్కా అందరం కలిసి ఉండొచ్చు. పిల్లలతో ఆడుకోవచ్చు!” అన్నారు. ఎలా ఉందో కనుక్కుందామని మరొక్కసారి ఫోన్ చేశా. పర్వాలేదు ఎలావుందో చెప్పమన్నా ! ఆయన మరణ వార్త నిజమేనని చెప్పరు అవతలి నుంచి. ఏది జరగకూడదనుకున్ననో అదే జరిగింది. గంట క్రితం మా నాన్నగారి మాటలో నాకెలాంటి, అనుమానం రాలేదు. అన్ని రిపోర్టులు నార్మల్ వచ్చాయన్నారు. ఆయన మొండి మనిషి, ఏ అనారోగ్యాన్ని ఆయన ఖాతరు చేసేవారు కాదు. ఎప్పుడూ… పని పని పని. నేవస్తా నాన్నా మీ దగ్గరకు అంటే, ఇంత చిన్న దానికి మళ్ళీ నువ్వు సెలవు పెట్టి రావటం ఎందుకు, తెల్లారేసరికల్లా నేనే వచ్చేస్తాను కదా అన్నారు. ఇంకా తెల్లారలేదు నా జీవితంలో! కడప జైలులో జైలరుగా పని చేస్తున్న ఆయనను, హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసినందుకు పది రోజులనుండి ఆనందం , ఆయన పట్టలేకున్నారు. మేము అంతే. తోటి ఉద్యోగులంతా ఒకటే గోల, అబ్బా తండ్రీ కొడుకులు ఒక చోటికి చేరుతున్నారే అని. మేమూ ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాము. ఆ రోజు సాయంత్రం కడపలో బస్సెక్కి, ఉదయానికి హైదరాబాద్ చేరవలసిన ఆయన, శవమై… మా ఊరైన గుంటూరు చేర్చబడ్డారు. ఒక్క రాత్రిలో నా ప్రపంచమంతా చీకటై పోయింది. ఆయన చివరి ఘడియకు నేను దగ్గర లేకపోయాను. అప్పుడు నాకు ఆ ఖైదీ ఖాన్ అన్న మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి, “తండ్రికి బాగోలేనపుడు చూడడానికి రానివాడు, వాడూ ఒక కొడుకేనా” అని. కాకతాళీయమే అయినా ...ఖాన్ సాహెబ్ నా చేతుల్లో కన్నుమూయడం అంతా నా జీవితంలో జరగబోయే దానికి, నన్ను మానసికంగా సిద్ధం చేయడానికి జరిగిందా ? అన్నట్లు అనిపిస్తోంది.. .. లేకపోతే, అంత మంది ఉద్యోగులు విధులలో ఉండగా… అనుభవం లేని వాడిని, నన్నే ఎందుకు పంపారు ఖైదీతో పాటు ఆ రోజు.?? తలచుకుంటే... ఒకటే వైరాగ్యం..! ఇప్పటికీ మా నాన్నగారు చనిపోయిన బాధలోంచి నే కోలుకోలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.!! నాకు నేను ఉన్నానేమో గానీ, నాలో నేను లేను. ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తారు’, అన్నది నా విషయంలో నిరూపించబడింది. ఎంతటివారైనా దైవేచ్చకు తల వంచాల్సిందేనేమో !
No comments:
Post a Comment