శివం – 9 - అచ్చంగా తెలుగు

శివం – 9

Share This
 శివం – 9 (శివుడే చెబుతున్న కధలు )

- రాజ కార్తీక్

(జరిగిన కధ : రావణుడి శివభక్తిని గురించి చెబుతుంటాడు శివుడు...)


  తర్వాత రావణుడు ప్రేతాలు అన్ని వెళ్ళిపోయాయి. స్మశానమే నా ఆలయం, అదే అంతిమ జ్ఞానం అని తెలుసుకున్న రావణుడు భక్తి పరాకాష్టకు చేరుకున్నాడు. క్రమేణ రావణుడు భక్తితో పాటు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. అతడు ఇంద్రలోకాన్ని కూడా జయించాడు. ఇలా సాగుతున్న రావణుడు నా పూజ మాత్రం ఆపలేదు. కానీ ఒకానొకనాడు రావణుడికి ఒక నాస్తికుడు తారసపడ్డాడు. అతడు రావణుడితో వాదోపవాదాలకు దిగాడు. మహాదేవుడు లేడు ఏమి లేడు, అతడు ఒక విరాగి, వాణ్ని భగవంతుడు అనుకోవటం సరైనది కాదు... వారు నిజంగా భగవంతుడైతే ఎందుకు ఈ సృష్టిలో ఇన్ని అసమానతలు ఉంటాయి అని వాదించసాగాడు. కానీ రావణుడు అతగాడికి సవినయంగా సమాధానాలు చెపుతున్నాడు. అతడు వినకుండా వాదిస్తూనే ఉన్నాడు. ఇంకా నా దూషణ ఎక్కువ చేసేసరికి రావణుడికి తీవ్రమైన కోపం వచ్చింది. అంతే ఒక్క ఉదుటున లేచి తన దశకంఠాలు సాక్షాత్కరించుకొని అతగాడిని విసిరి పడేసాడు. అతడు వెళ్ళి ఎక్కడో సముద్రంలో పడ్డాడు. ”మంచిగా చెపితే వినేవారు మానవులు ఎందుకు అవుతారు ? అందుకే దానవ శైలిలో నేను సమాధానం చెప్పాను. నా ముందు మహాదేవున్ని ఎవరు దూషించినా వారికీ ఇదే గతి పడుతుంది. వారిని చంపటానికి కూడా వెనుకాడను. అలా మహాదేవున్ని దూషించిన వారిని చంపిన మాకు ఎంతో పుణ్యం వస్తుంది. ఊరికే కూర్చొని శివ శివ అనడం కాదు ఓపిక ఉన్నంతవరకు ఎదిరించగలిగినంతవరకు, మన దైవాన్ని ఎవరు దూషించినా వారిని శిక్షించాలి. అపుడు మనం చేసుకునే పూజ సార్ధకత  “ అన్నాడు. అక్కడ అందరు రావణుడికి జయ జయధ్వానాలు   పలికారు. అవి రావణుడి మొహంలో అహంకారం రాజేసాయి... “మహాభక్త రావణ గరళకంఠ భక్త రావణ, అని నినాదాలు చేశారు.... అపుడు ఒకడు దశకంఠ రావణ.... లంకేశ్వర రావణ... అన్ని లోకాల అధిపతి అయిన రావణ...” అంటూ నినాదం చేయసాగాడు. అంతే రావణుడు అతడి వైపు తీక్షణంగా చూశాడు. రావణుడి మొహంలో అతడి మాటలపట్ల ఆకర్షణ పెంచుకున్నాడు.” భేష్ భేష్ , మళ్ళీ అను” అని మరోసారి అడిగి మరి వానిచేత నినాదాలు చేయించుకున్నాడు. అపుడు మొదలైంది అతగాడి అహంకారం. అయినా నా పూజ చేయటం మానలేదు. ఇది వరకు రావణుడు మనసుతో పూజ చేసేవాడు. క్రమేణా రావణుకికి అహంకారం పెరిగి పెద్దదైపోయింది. ఇలా చాలా సంఘటనలు జరిగిపోయాయి. ఇలా రావణుడు భక్తి మార్గం నుండి చిన్న చిన్నగా దూరం అవుతున్నాడు. అనేక వరాలు పొందాడు రావణుడు. అవన్ని అతని స్వార్ధం కోసమే. సన్మార్గంలో ఉన్నవారి భక్తి మాత్రమే నాకు పూర్తిగా చేరుతుంది. నా పూజకు కావాల్సింది... సమయం ,సందర్భం, ఆడంబరం కాదు. కేవలం మనసు !మనసుతో పిలిస్తే పలికే వాడిని నేను. ఏ రూపంలోనైనా వచ్చి ,మీ బాధ తీరుస్తాను. ఒకానొక నాడు రావణుడు కైలాస పర్వతం వచ్చాడు. అక్కడ నంది మరియు నాగులు నా ఆజ్ఞ మేరకు రావణుడిని లోపలికి ప్రవేశించనీయలేదు . దానితో రావణుడు “ఏమి నన్ను మహాదేవుడు రానివ్వద్దు అన్నారా ?” అని అడిగాడు. నంది “మిమ్మలిని కాదు దశకంఠ రావణా, ఎవరినీ రానివ్వద్దు అన్నారు.” రావణుడు : “ఏమి నీ అహంకారం? మహాభక్తుడు, వేదపండితుడు, కైలాస పురోహితుడు, లోకాల పాలకుడు.. మహాదేవున్ని ఎపుడూ ప్రసన్నం చేసుకునే నేను రావటానికి అడ్డు పెడతారా ?” అన్నాడు అహంకారంగా. నంది: కైలాసంలో అలాంటివి ఏవీ ఉండవు దశకంఠ, అందరూ సమానమే మహాదేవుడికి. నువ్వు ఏంతో ఒక చీమ కూడా అంతే ! అది విని రావణుడు నందిని ఎన్నో మాటలతో దూషించాడు. దానితో నంది “ ఏదో ఒకరోజు కోతి నీ లంకకంతా మంటపెడుతుంది” అని శపించాడు.. ఇలా పిలుస్తున్నా నేను ఎందుకు రావణుడికి కనిపించడం లేదో తెలుసా? ఇదివరకు అతడు భక్తితో పిలిచాడు, ఇపుడు అహంకారంతో పిలుస్తున్నాడు. రావణుడు ఒకసారి అతికోపంతో, శివయ్య రాకపోతే కైలాసాన్ని నా లంకకు తీసుకుపోతా అని తన భుజాలతో కైలాసాన్ని ఎత్తటానికి ప్రయత్నించాడు. అలా కైలాసం ఎత్తబోతే, నేను నా బొటనవేలితో ఒక్కసారి గట్టిగా నొక్కాను అంతే రావణుడు క్రింద పడిపోయాడు. అపుడు అతని అహంకారం వమ్ము అయింది. ఇక ఏడుస్తూ “దేవాధిదేవుడవు నీవు, దీనాదిదీనుడను నేను అని గానం చేశాడు. ఇంకా రావణుడు తన కడుపు చీల్చి తన పేగులతో రుద్రవీణ వాయించాడు. అపుడు మొదలైంది అతగాడి ఆర్ధ్రత. ఎందుకంటే ఇపుడు అతడి భక్తి ప్రకంపనం నన్ను చేరుకుంటుంది. కానీ అతని అహంకారం దాన్ని ఆపేస్తుంది. ఇలా చేస్తూ చేస్తూ, తను కన్ను మూసాడు. వెంటనే ఒకసారి రావణుడు కనులు తెరిచాడు. నేను బతికే ఉన్నానా? అని ఆనంద పడ్డాడు... అతని కళ్ళముందు తీక్షణమైన వెలుగు ఉంది. రావణ:  “ ఏంటి ఆ వెలుగు ?ఎవరు నీవు ?” నేను: “ నేను ఆది అంతం లేని వాడిని, అన్ని తెలిసిన వాడిని.. విష్ణువుని.. బ్రహ్మని.. రుద్రున్ని.. సూర్య చంద్రులను పుట్టించినవాడిని.. విశ్వాన్ని ఏలుతున్న వాడిని.. విశ్వాన్ని లీనం చేసేవాడిని.. శక్తిని.. దశావతారాన్ని.. గీత చెప్పబోవు కృష్ణున్ని.. కాలుడిని..” రావణ“మహాదేవా మహాదేవా నువ్వా? నువ్వేనా...” నేను”.......” రావణ  “నువ్వు ఐతే నేను ఎందుకు చూడలేక పోతున్నాను” నేను ”చెప్పా కదా రావణ నన్ను చూడాలంటే జ్ఞాననేత్రం కావాలి... అది నీ అహంకారంతో మూసుకు పోయింది... అందుకే నేను నీకు కనపడలేదు.. చూడు జ్ఞాననేత్రాలతో చూడు... నీ ఊహాశక్తికి అందను నేను... నీ వేదజ్ఞానం నా గురించి చెప్పేది కొంతే.. భక్తుడు మాత్రమే నన్ను చూడగలడు... జ్ఞాని మాత్రమే నను అర్ధం చేసుకోగలడు...” రావణ ”శివయ్యా ఒకసారి కనపడవయ్యా” నేను  “ చూడు రావణ చూడు నేను ఇదివరకు లాగానే ఉన్నా కానీ నీవే ఇదివరకు లాగా లేవు...” రావణుడు తీవ్రంగా రోదించసాగాడు.. వేదనతో గొప్ప స్తోత్రాన్ని కీర్తన చేశాడు... అప్పుడు ఆ స్తోత్ర ప్రభావం వల్ల కాసేపు.. అతన్ని జ్ఞాననేత్రం తెరుచుకుంది అపుడు నేను అతనికి కనపడ్డా... రావణ ”శివయ్యా కనపడ్డావా.. పిలిస్తే పలికే నీవు.. ఏమిటి అయ్యా నన్ను కైలాస పర్వతం మోస్తుంటే తోసావ్”.. నేను “రావణా నేను తోయలేదు నాయనా.. కైలాస పర్వతాన్ని నువ్వు ఎత్తావ్.. కానీ నీలో భక్తి సవ్యం కాలేదు నాయనా అది ఎక్కడ నీ మీద పడుతుందో అని నిన్ను పక్కకు తోసాను... భక్తా..” నంది విస్తుబోయాడు. ”ప్రభూ.. నువ్వు దశకంఠడు కైలాసం ఎత్తుతుంటే కోపగించుకున్నావ్ ఏమో అనుకున్నా.. కానీ నువ్వు రావణుడి ప్రాణాన్ని కాపాడటానికా?.. ఆహా దయామూర్తి.. నీవు.... నీవు..” అని తన్మయత్వంతో అన్నాడు. రావణ : “ స్వామి నేను చేసింది తప్పు అయితే క్షమించు” నేను : “రావణా నీకు ఎన్నడో చెప్పాను.. నాకు నీ మీద భక్తి మాత్రమే కావాలి శివయ్యా అని. నువ్వు అడగనప్పుడు నేను నీవు సన్మార్గంలో ఉన్నంతవరకు అది ఉంటుంది..” రావణుడు ఒకసారి.. నన్ను ప్రత్యక్షం గావించుకోవడం.. శుద్ధ భక్తిని వరంగా కోరుకోవటం.. నా పాదాల మీద అతను తల పెట్టి ఆనందపడడం, నాకు కీర్తన కావించడం నన్ను తాకడం.. నేను స్తోత్రాలు చేసే వరం ఇవ్వడం. నాకు భస్మం పోయడం.. నా మీద చేసిన కీర్తన.. నేను అతనికి సమాధానం చెప్పటం.. గంగ నుండి జలం తీసుకుని అభిషేకించటం.. శివలింగాన్ని వాటేసుకోవడం.. బాలుని కోసం ప్రార్ధన చేయటం.. వేరొక వానికి శివపూజ గురించి చెప్పడం.. స్మశానంలో నాకు శవభస్మంతో మంచుతో అభిషేకించడం మొత్తాన్ని నెమరువేసుకున్నాడు... ఏడుస్తూ “పువ్వులు ఉన్నది మల్లయ్యా.. నవ్వులు ఉన్నవి నీ వల్ల అయ్యా.. చేసిన ప్రార్ధన నీకోసం అయ్యా.... తప్పులు కాయవయ్యా..అయ్యలకన్న అయ్యా...” నేను “రావణా , అహంకారం ఒకటి చాలు అది మన పతనానికి నాంది”. రావణ “......” నేను “నేను ఒక తీర్పు చెప్పేవాడిని రావణా... చేసిన పూజ కైనా, తప్పుకైనా, పుణ్యంకైనా ఫలితం ఇచ్చే వాడిని... నాకు అందరు ఒకటే.. నీ మనసుని ఎలా చూస్తానో... ఒక చీమ మనసుని కూడా అంతే చూస్తాను.. అందుకే అందరూ శివుని అజ్ఞా లేనిదే చీమైనా కుట్టదు అని”. రావణ “నన్ను క్షమించు ప్రభూ! ఇక నా తప్పు తెలుసుకొని ప్రవర్తిస్తాను...” నేను “రావణా ఎప్పటిలాగా నీ స్తోత్రానికి ఎంతో తృప్తి చెందాను. సన్మార్గంలో ఉన్నంతవరకు నిన్ను కాపాడుతాను.. నువ్వు చేసిన స్తోత్రం శివ తాండవ స్తోత్రంగా ఖ్యాతి గడిస్తుంది ఒక సిద్ద మంత్రం అవుతుంది అని ఒక అస్త్రాన్ని ఇచ్చాను..” రావణుడు దాన్ని తీసుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. తర్వాత... కొంతకాలం తర్వాత... సీత స్వయంవరంకి వచ్చాడు అహంకారి రావణ... మరొక్కమారు “కైలాసాన్ని ఎత్తిన నాకు శివుని ధనస్సు ఎత్తడం ఒక లెక్కా... అని దాన్ని ఎత్తబోయి.. అవమానం పాలు అయ్యాడు... `అటుపిమ్మట సీతాపహరణం... నంది శాపం వల్ల హనుమ చేత లంకాపట్టణ దహనం.. చివరగా యుద్ధం... విభీషణుడు చెప్పిన రహస్యం వల్ల... రాముడు కొట్టిన బాణంతో రావణుడు కిందపడి చనిపోయే స్థితిలో ఉన్నాడు.. రావణుడి మదిలో... “శివా.. నువ్వు చెప్పావా అహంకారం విడు అని.. కానీ ఏమి చేయటం.. పరిస్థితి వల్ల ఇలా జరిగింది.. ఇన్ని లోకాల ఆధిపత్యం సాధించి.. సీతను అపహరించి .. నా కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నా.. అంతిమ గమ్యం నేనే అని నీవు చెప్పినమాట స్పురణకు కూడా రాలేదు. అంతా మాయ తండ్రీ.. ఇంకా కొన్ని క్షణాల్లో నేను అంటూ ఉండను.. అది ఇపుడు అర్ధం అయ్యింది ప్రభూ.. ఇక ఈ రావణుడు కథ అయిపొయింది..ఎన్ని సార్లు నువ్వు చెప్పినా సన్మార్గంలో ఉండు అని, నా చెవికి ఎక్కలేదు.. శివయ్యా అని “లేచి కూర్చున్నాడు... ఎదురుగా రావణుడికి రామయ్య విష్ణుమూర్తి లాగా కనపడ్డాడు హనుమ నా అంశ కావున నేను కనపడ్డాను... రావణుడి జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి. ఇపుడు అహంకారం మొత్తం చనిపోయింది. అతనికి అన్ని నా ఊసులే.. నేను అతనికి ప్రత్యక్షమవ్వడం పదే పదే గుర్తుచేసుకున్నాడు... హనుమకి రాముడికి వందనాలు చేసుకొని అతను కన్నుమూసాడు... నేను అతనికి ఎదురుగా ఉన్నా.. రావణుని ఆత్మ నన్ను చూసింది... శివయ్యా వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు... నేను: “ మరణ వేళలో నన్ను తలచుకోండి భక్తులారా, నా వద్దకు చేరుకుంటారు అని నీకు మాట ఇచ్చాను కదా రావణ..” రావణ:  “తండ్రి.. నీ కరుణ నాకు పశ్చాత్తాపం తెప్పిస్తుంది.. ఎన్ని పాపాలు చేసినా.. ఎందుకు తండ్రీ మేమంటే ఇష్టం” నేను: “ చెప్పాను కదా మీరు నేను ఒక్కటే అని.. నన్ను నేను ఇష్టపడక ఎవరిని మనసుపడతాను భక్తులారా..” రావణ: “ ప్రభు ఆత్మ జ్ఞానం అంటే ఇప్పుడు అర్ధం అయ్యింది ప్రభూ.. భోళాతనం అంటే ఏంటో తెల్సింది ప్రభూ.. స్మశానంలో ఎందుకు ఉంటావో నా మనసుకి అందింది స్వామీ...” నేను: “ భక్తులారా.. నన్ను అనన్య చింతన చేయండి.. నన్ను నమ్మండి... నిజము నేను... ఉన్నది నేను...అంతా నేనే.. నీతిని వీడకండి.. వెయ్యి పూజలు చేసినా ఒకటే నీతిగా ఉన్నా ఒకటే” రావణ: “తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే వేలు పట్టి నడిపిస్తారు.. భార్యా బిడ్డలు బంధాలు.. ఊపిరి ఆగగానే .. ఊరి బయట పారేసివస్తారు.. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉంటావు తండ్రీ.. నిన్ను నమ్మిన వాడు.. నిజమైన జ్ఞాని.. అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు” నేను: “ రావణ చెప్పానుగా భక్తి కి దాసుడను నేను...” రావణ: “ నీ కరుణ భరించలేను తండ్రి..” నేను:“ రావణా.. బాధపడకు.. అన్నీ నా ప్రకారమే జరుగుతాయి.. అందరు నిమిత్తమాత్రులు .. నన్ను నమ్మినవారికి అంతా మంచే జరుగుతుంది.. నీవు మరొక జన్మ ఎత్తి విష్ణులోకం చేరుకుంటావు” అని వరం ఇచ్చాడు. రావణ “ స్వామీ శివకేశవులు ఇద్దరు ఒకటే..... ఇప్పడు తెలుసుకున్నాను.. అటుగా హనుమ సీతమ్మను తీసుకొని వస్తున్నాడు... రామయ్య ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.. వారిద్దరూ కలుసుకున్నారు.. హనుమ: “ ఆహా ఈ కోతి ఎంత గొప్ప సన్నివేశం చూస్తుంది..రామయ్య సీతమ్మ ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారు.. ఆహా.. రామా రామా సీతారఘురామా ... రామబంటులో నేను కూడా ఒకడిని.. నా రామయ్య తండ్రి సీతమ్మను కలవడానికి నా వంతు సాయం చేసాను...” అంటూ ఆనందభాష్పాలు విడుస్తున్నాడు. అందరు ఆ దృశ్యం చూసి పులకించిపోయారు...నేను కూడా... రావణుడి ఆత్మ రాముడి దగ్గరకు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి వారిని క్షమాపణలు అడిగింది. వారిరువురు .. రావణుడిని క్షమించారు.. నేను “ శాపంవల్ల ఈ జన్మ ఎత్తావు రావణ” అని అతని కథ మొత్తం చెప్పాను... అలా రావణుడు మళ్ళీ ఆత్మరూపంలో కొంత కాలం నాతో గడిపి.. మరొక జన్మ ఎత్తి.. తర్వాత వైకుంఠంలో ఉండిపోయాడు. భక్తులారా నన్ను నమ్మండి.. మహాభక్తుడగు రావణుడు కైలాసాన్ని ఎత్తాడు.. కానీ అహంకారి అయిన రావణుడు కేవలం నా ధనస్సుని కూడా ఎత్తలేకపోయాడు.. అహంకారం వదిలి నామీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి.. మరొక మంచి కథ మీకు చెప్తాను మీకు....... (సశేషం...)

No comments:

Post a Comment

Pages