నాట్య విద్యా పిపాసి -శ్రీ తాడేపల్లిసత్యనారయణ శర్మ - అచ్చంగా తెలుగు

నాట్య విద్యా పిపాసి -శ్రీ తాడేపల్లిసత్యనారయణ శర్మ

Share This

నాట్య విద్యా పిపాసి -శ్రీ తాడేపల్లిసత్యనారయణ శర్మ

- బ్నిం



ఒక మువ్వ ధ్వని వినిపించాలి అని మా ఫీచర్ ప్రారాంభించాము కదా ! శింజ కావాలి అంటే గజ్జెలు మ్రోగినట్టైంది 'తీగ లాగితే డొంకంతా కదిలిందీ అనేట్టు.... నిజంగా నిజం.
తాడేపల్లి సత్యనారాయణ శర్మ గారు మొన్నీమధ్య ఫేస్ బుక్ లో చాట్ బాక్స్ లో నా ఫోన్ నంబరు కావాలని మెసేజ్ పెట్టారు. ఆయన పేరు ఉండదు దాంట్లో..- ‘కూచిపూడినాట్యం’ అని మాత్రమే ఉంటుంది - మగబ్బాయో ఆడమ్మాయో తెలియకుండా ఆ పేరెంటా అని అనుకోకుండా - అమ్మాయి గారే
అనిపించే ఫోటో ఉంది. వారి వాల్ కి వెళ్ళి వివరాలు చూసే టైం కొరవడి (ఆ సమయంలోనే అండి)ఫోన్ నంబరు అయితే టైప్ చేసాను -
  ఏదో డ్యాన్స్ బేలే రాయడానికి ఏమో అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఫోన్ చేసారు. ఆయన అని తెలిసింది. నేను 12 ఏళ్ళ క్రితం డా . జొన్నలగడ్డ అనురాధ గారికి రాసిన ప్రబుద్ధ మణిమేఖలీయం   అనే నృత్య రూపకం ఈయన ప్రదర్శిస్తున్నారట..దాన్లో కి ఓ రెండు పద్యాలు రాసిమ్మని...సరే రాసి ఫోన్లో చెప్పానో చాట్ లో పంపానో ఆ కధ అలా ముగిసింది- మొన్నీమధ్య ఆయన ఫోన్ చేసి 'రావచ్చా.. హైదరాబాదు వచ్చాను 'అన్నారు. ఆయన ఆయన కాదు..పెళ్ళికాని యువకుడు ...మూడో దశకం లోకి అడుగిడిన అబ్బాయి.
అబ్బాయి అంటే అబ్బాయి లాగా లేడు ..స్పూరద్రూపి అనగా పొడుగైన వాడు అనే అర్ధం లో వాడాను. ధృడకాయుడు - అనగా - మంచి ఒడ్డైనవాడు అనే అర్ధం లో వాడాను. కూచిపూడి డ్యాన్సర్ అనిపించ లేదు కానీ వేద పండితుడు అంటే నమ్మే ఆహార్యం లో ఉన్నారు.(పంచి చొక్కా వగైరా పెద్దరికపు వేషం లో ) ఆయన మాటల్లో వ్యర్ధ పదాలు లేని వేగం ఉంది సంపూర్ణ అవగాహన కలిగిన సాధికారత కనిపించింది . మాట్లాడిన మాటలన్నీ 'నాట్య శాస్త్రం' గురించే. నాట్యం గురించి కాదు నాట్య 'శాస్త్రం' గురించి - ఆయన ఇప్పుడు తిరుపతి లో వేద విద్యా పరిషత్ లో వేద పండితుడు గా పని చేస్తున్నారు . తెలుగు,
సంస్కృతం , ఇంకో రెండు ఎమ్మేలు చదివేశారు. వేద పండితుడు వృత్తి, నాట్య వేదం పై భక్త్యానురక్తి - ఆయన  గురించి శింజారవం లో 2, 3 నెలలు రాసినా తరగని విస్తుపోయే వివరాలున్నాయి.
ఎప్పుడో....10 ఏళ్ళ క్రితం నేను రాసిన నృత్య రూపకాల్లో ఆయన పాత్రలు ధరించారట.
నృత్యం కీ నాట్యం కీ తేడాని స్పష్టీకరిస్తూ అనర్గళ వాగ్ధాటితో ఆయన చెప్పిన మాటలు మంచి స్టాండర్డ్ లెక్చర్ విన్న అనుభూతి కలిగింది.
ఆయనతో మాట్లాడుతుంటే నేను గమనించిన ఒకే విషయం - ఆయనకి అపారమైన గురుభక్తి ఉంది. తన గురంచి ఆడుగుతుoటే, ఆయన తన గురువులు తనకి నేర్పిన విధానాన్ని, వారి బోధనా పద్ధతిని కళపై వారికి ఉన్న పాoడితిని వినిపించారు.
కూచిపూడి లో వేదాంతం, పసుమర్తి, వెంపటి, చిoతా, - వగైరా ప్రసిద్ధ కుటుంబాల్లాగే, తాడేపల్లివారు ఒకరు - మన హీరో తాడేపల్లిసత్యనారాయణ శర్మ గారి ముత్తాతగారి వద్దనే జగమెరిగిన నాట్యగురువు శ్రీ వెంపటి చినసత్యం గారు 'దిద్దిత్తై 'నేర్చుకున్నారుట!
కూచిపూడి గ్రామం లో ముఖ్యంగా భాగవతుల మగపిల్లలకి 5 సంవత్సరాల, 5 నెలల 5 వ రోజు కాలికి గజ్జెలు కట్టి అంబ బాల త్రిపురసుందరి ఆశీర్వాదం తీసుకొని నాట్యారంభం చేయాలన్నది భూమి మీద అవతరించిన నాడే పెట్టేసిన ముహుర్తం!!
అలాగే సత్యనారాయణ శర్మ గారు కూడా నాట్యారంభం కావించారు.
వేదాంతం రాధేశ్యాం గారు వీరి తొలి గురువులు! సత్యభామ అంటే వేదాంతం సత్యనారాయణ శర్మ గారే అని ప్రజల చేత ప్రశంసలందుకొని భారత ప్రభుత్వం చేత 22 ఏళ్ళకే 'పద్మ శ్రీ' గా గౌరవం పొందిన మహనీయులు వీరికి మలిగురువులు.
కేoద్ర సంగీత నాటక అకాడమీ గురువేతనం తో ఆయన నడిపించే శిక్షణా తరగతుల్లో కొంత మంది యువకులను ఎంపిక చేసి కలాపాలపై...ముఖ్యంగా స్త్రీ పాత్రధారణ పై ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు...అలా ఎంపిక కాబడ్డ ప్రియశిష్యుడు మన సత్యనారాయణ శర్మ. వారి వద్ద శిష్యరికం చేసిన అదృష్టవంతులలో తానూ ఒకణ్ణని పులకించి పోతూ చెప్తూ ఉంటారు మన శర్మగారు.
ఇక్కడో విషయం తెలుసుకోవచ్చు. వేదాంతం వారు సత్యభామగా చీర కట్టుకొనే విధానానికి స్త్రీలు కూడా ఆశ్చర్య పోయేవారట. శ్రీమతి ఇందిరాగాoధీ ఈయన ప్రదర్శన చూసి గ్రీన్ రూం లోకి వెళ్ళి ప్రత్యేకత తెల్పమని కోరిందట.
  అలాంటి సత్యనారాయణ శర్మగారి వద్ద మన సత్యనారాయణ శర్మ గారు కూడా స్త్రీ పాత్రాభినయపు మెలుకువలు కులుకులు ఆకళింపు చేసుకొని గురుమోదముపొందారు.
అలాగే చింతా కృష్ణమూర్తి గారు మరో గురువులు గా తన జీవితంలో ప్రవేశించాకా, ఆయన పరిశోధనా సరళికి ముగ్ధులై, కూచిపూడి నాట్య కళాకారులుగా ఆ కుటుంబాలలో జన్మించినందుకు ధన్యతగా భావించే సంస్కారం పొందారు. వారి వల్ల నాకు నాట్య మహోన్నతత్వం తెలిసిందని, తత్వం బోధ పడిందని తెలిపారు సత్యనారాయణ శర్మగారు.
చింతా కృష్ణమూర్తి గారి తండ్రి గారు చింతా వేంకటరామయ్య గారు వారి పూర్వికులు నిర్వహించిన వేంకటరామా నాట్య కళా మండలిని పటిష్ట పరిచి నడిపిస్తే తదనంతరం కృష్ణమూర్తి గారు ఆ కళామండలిని మరింత వైభవోపేతమైన స్థాయికి తీసుకు వచ్చారు. ఈ గురుదేవులు వారికి ఆదర్శకరమైన వారని ముకుళితకరులై చెప్పారు తాడేపల్లి సత్యనారాయణ శర్మగారు.
నాట్య ప్రదర్శనలు చేస్తూనే మరిన్ని విద్యలు సాధించిన శ్రీ తాడేపల్లి సత్యనారాయణ శర్మ గారి ప్రతి మలుపు విద్యావిషయికమైనదే..... విని తీరలిన విస్మయకరమే...వచ్చే నెల ఈయన గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం.

No comments:

Post a Comment

Pages