తన్నులబాబా
- పెయ్యేటి రంగారావు
సుందరికి చాలా గాబరాగా వుంది. ఆమె ఏడేళ్ళ కూతురు మోరీలుకి జ్వరం వచ్చి తగ్గటల్లేదు. మొదట్లో ఏదో మామూలు జ్వరమే అయి వుంటుందన్న ఉద్దేశ్యంతో సుందరే స్వంత వైద్యం చేసింది. ఆయుర్వేదం మాత్రలు, అవి పని చెయ్యలేదని హోమియో మాత్రలు, వాటికీ వెంటనే గుణం కనిపించలేదని ఇంగ్లీషు టాబ్లెట్లు దట్టించింది. ఐనా మోరీలుకి జ్వరం తగ్గలేదు. ఇంక లాభం లేదని పెద్దాసుపత్రికి తీసికెళ్ళాలని నిశ్చయించుకుంది.
ఇన్నాళ్ళుగా జ్వరం తగ్గకపోవడం సుందరికి ఆందోళన కలిగిస్తోంది. స్నానం చేసి సాయిబాబా దగ్గర దీపం వెలిగించి లెంపలు వేసుకుని మొక్కుకుంది. ' బాబా! మోరీలు, కాదు కాదు, మొహరీలుకి ఈ సాయంత్రానికల్లా జ్వరం తగ్గిపోతే షిర్దీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను బాబా!' సుందరికి నిన్నటినించీ సాయిబాబా మీద ఎంతో భక్తి కుదిరింది. దానికి కారణం, ఆమె తెప్పించే ' ఆంధ్రవాణి ' వారపత్రికలో సాయిబాబా యొక్క అద్భుతమైన మహిమల గురించిన సమగ్రమైన వ్యాసం ఆమె ఆసక్తిగా చదివింది. సుందరి ఇంట్లో శివుడి ఫొటోలు మచ్చుకైనా కనిపించవు. దానిక్కారణం, ఆవిడకు జీవితంలో తగిలిన పెద్ద ఎదురుదెబ్బ. రెండేళ్ళక్రితం ఆమె భర్త ఈశ్వరరావు తన తోటి ఉద్యోగస్తులతో కలిసి చిన్న కారు మాట్లాడుకొని శివరాత్రికి శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ మల్లికార్జునుడి దర్శనం చేసుకుని తిరిగి వస్తూంటే వాళ్ళ కారుని టిప్పర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఈశ్వరరావు మరణించాడు. అప్పటినించి శివుడి మీద ఆవిడకున్న భక్తి ఆవిరైపోయింది. సుందరి భక్తిగా సాయిబాబాకి మొక్కుకుని, మోరీలుని తీసుకుని ఆటోలో పెద్దాసుపత్రికి తీసికెళ్ళింది. డాక్టరు మోరీలుని పరీక్షించి టాబ్లెట్లు రాసి ఇచ్చాడు. ' ముందు అమ్మాయికి నేను రాసిన ఈ పరీక్షలన్నీ ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిపించండి. రేపు టెస్టు రిపోర్టులు వచ్చాక అప్పుడు ట్రీట్ మెంట్ మొదలెడతాను. అందాకా ఈ టాబ్లెట్లు వాడండి. అవసరమైతే ఆస్పత్రిలో జాయిను చెయ్యాల్సివుంటుంది. దానికి సిధ్ధపడి రేపు రండి.' ' డాక్టరుగారూ! అసలు అమ్మాయికి వచ్చిన వ్యాధి ఏమిటండీ/' ' అది తెలుసుకోడానికే కదమ్మా, టెస్టులు చేయించమన్నది? రిపోర్టులు వచ్చేదాకా ఏమీ చెప్పలేను.' ' ఏమిటో! శాస్త్రం అభివృధ్ధి చెందింది అంటారు. ఇదివరకు నా చిన్నతనంలో ఆయుర్వేదం డాక్టరు కొండలరావు గారు చెయ్యి పట్టుకుని, నాడి చూసి రోగాన్ని ఠక్కున కనిపెట్టేసేవారు. ఆయనకి వంశపారంపర్య వృత్తే గాని, ఏ ఆయుర్వేద కళాశాలలోను చదువుకోలేదు. ఐనా, అప్పుడు ఆయుర్వేద కళాశాలలు వున్నట్టు కూడా లేదు. ఇక ఎం.బి.బి.ఎస్. చదువుకున్న డాక్టర్లంటే చాలా పేరుండేది. వాళ్ళు రకరకాల, రంగు రంగుల అరకులిచ్చి, రోగాలు ఇట్టే నయం చేసేవారు. రోగులకి ఇబ్బంది కలిగించకుండా ఇళ్ళకి కూడా వచ్చేవారు. ఇప్పుడు స్పెషలిస్టులొచ్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చేసాయి. కాని స్పెషలిస్టులు రకరకాల పరీక్షలు చేయించి, రిపోర్టులు చూస్తే తప్ప రోగనిర్ధారణ చెయ్యరు. చిటికెనవేలు వాచిందన్నా ఆస్పత్రిలో జాయినవమంటారు. ఇదివరకు జ్వరం వస్తే అణా పెట్టి అనాసిన్ మాత్ర వేసుకుంటే తగ్గిపోయేది. ఇప్పుడు ఖర్మకాలి జ్వరం వస్తే, కార్పొరేట్ ఆస్పత్రిలో జాయినయ్యి, ఏభైవేల నించి లక్షరూపాయలు ఖర్చుపెట్టడమే గాని, రోగం పూర్తిగా నయమవడం మాత్రం వుండదు.' సుందరి బాధగా ఆలోచిస్తూ మోరీలుని తీసుకుని ఆటోలో ఇంటికొచ్చేసింది. సుందరి ఎంతో భక్తిగా పొద్దున్న సాయిబాబాకి దణ్ణం పెట్టుకుంది. కాని సాయంత్రానికి మోరీలు జ్వరం తగ్గలేదు. మందులు వేసినా, సాయిబాబాకి దణ్ణం పెట్టుకున్నా జ్వరం తగ్గకపోయేసరికి సుందరిలో ఆందోళన పెరిగింది. ఆ రాత్రంతా సాయిబాబాని ప్రార్థిస్తూనే గడిపింది. పొద్దుటికి కూడా మోరీలుకి జ్వరం తగ్గలేదు. పొద్దున్న పనిమనిషి రత్తాలు వచ్చి ఇల్లు వూడుస్తూ సుందరిని అడిగింది, ' అమ్మా! నిన్న డాకటేరేమన్నాడమ్మా? మందులిచ్చినాడా?' ' ఇచ్చాడే రత్తాలూ. టైము ప్రకారం ఆయనిచ్చిన టాబ్లెట్టన్నీ వేసాను. కాని మోరీలుకి జ్వరం ఇంకా తగ్గలేదే. డాక్టరు చాలా టెస్టులు కూడా రాసాడు. అవన్నీ చేయించాను. ఇవాళ రిపోర్టులు వస్తాయి. అవి చూసి, అవసరమైతే ఆస్పత్రిలో జాయిను చేయాలన్నాడు. నాకు చాలా గాబరాగా వుందే.' ' అయ్యో అమ్మా1' ఈపాటి జొరానికే అంత దిగాలు పడతారేటమ్మా? ఏం ఫరవానేదు. అమ్మాయిగారికి తప్పకుండ తగ్గిపోతాది.' ' రత్తాలూ! ఎంత చల్లగా మాట్లాడావే! నీ నోటివాక్కు ఫలించి, అమ్మాయికి ఇవాళ సాయంత్రానికల్లా జ్వరం తగ్గిపోతే నీకు ఇరవై రూపాయలు ఇనాంగా ఇస్తానే.' ' ఎంత మాటన్నారు తల్లీ? డబ్బు శాశ్వతమేటమ్మా? పిల్లకి జొరం తగ్గితే అదే పదేలు.' ' నీ కడుపు చల్లగా ఎంత మంచి మాటన్నావే! నాకా వెనక ఎవరి ఆసరా లేదు. ఏం చేయాలో కూడా పాలు పోవటల్లేదే. నిన్న సాయిబాబాకి మొక్కుకున్నాను కూడా. సాయంత్రానికల్లా పిల్లదానికి నెమ్మళిస్తే, షిరిడీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను బాబా అని. ఐనా పిల్లకి జ్వరం తగ్గలేదే.' ' అమ్మా, నేనో మాట జెబుతా. ఇనుకుంటారా?' ' చెప్పవే ఆలస్యం చెయ్యక.' ' ఇక్కడికి రొండు వీదులవతల దరగా వుందమ్మగోరూ. మా చంటిదానికి పేనం బాగా నేకపోతే దరగాకి పోయి మిఠాయి చదివించి వచ్చాను. వెంటనే రొండో రోజుకి అమ్మాయి సుబ్బరంగా లేచి గంతులేసిందమ్మా.' ' నిజమా?' ' అవునమ్మగోరూ. నా మాటిని మీరు నాతో ఈ పూట దరగాకి రండి. మాపటేల కల్లా అమ్మాయిగోరు లేచి తిరక్కపోతే నెను చెవి తెగ్గోయించుకుంటానండి.' ' ఐతే పదవే. కాని మరి అమ్మాయిని ఇంటో వుంచే రమ్మంటావా?' ' ఏం పరవానేదమ్మగోరు. ఎంత? అరగంటలో తిరిగి వచ్చెయ్యమూ? అందాకా కావాలంటే మా సెల్లిని అమ్మాయిగోరికి సాయంగా వుండమంటానమ్మా.' ' సరేనే, ఐతే నువ్వెళ్ళి మీ చెల్లాయిని తీసుకురా. ఈ లోపున నేను స్నానం చేసి రెడీగా వుంటాను.' ' అట్టాగేనమ్మగోరూ.' సుందరి శ్రధ్ధగా స్నానం చేసి రత్తాలుని తీసుకుని దరగాకి వెళ్ళి మిఠాయి ఇచ్చి మొక్కుకుంది, ' దేముడా1 మా అమ్మాయి మోరీలు, కాదు కాదు, దాని పేరు మొహరీలు, దానికి ఈ సాయంత్రానికల్లా జ్వరం పూర్తిగా తగ్గిపోతే, పది శుక్రవారాలు నీ దరగాకి వచ్చి, మిఠాయి ఇచ్చుకుంటాను.' సాయంత్రమవుతోంది. మోరీలు జ్వరం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. దరగాలో మొక్కుకున్నా ఇంకా మోరీలు జ్వరం తగ్గలేదే అనుకుంది. ఆ సాయంత్రం మోరీలుని ఆటోలో ఎక్కించుకుని మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళింది సుందరి. డాక్టరుగారు చలా బిజీగా వున్నారు. నర్సు వాళ్ళిద్దర్నీ హాల్లో కూర్చోమంది. సుందరి మోరీలు నుదురు మీద చెయ్యి పెట్టి చూసింది. చాలా వేడిగా వుంది. సుందరికి గాబరా ఎక్కువయింది. కళ్ళలోంచి కన్నీళ్ళు ఉబికి వస్తోంటే రుమాలుతో తుడుచుకుంది. నర్సు, ఆమె పేరు మేరీ, సుందరి ఏడుస్తుండడం చూసి దగ్గరకొచ్చింది. ' గాబరా పడకండమ్మా. ఆ ఏసుప్రభువు చాలా కరుణామయుడు. మీ బిడ్డని చల్లగా చూస్తాడు. ఈ ఆసుపత్రి కాంపౌండు లోనే చర్చి వుంది. నేను మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఇవాళ ప్రార్థనలు చేస్తాను.' సుందరికి ఆమె మాటలు కాస్త ఊరటనిచ్చాయి. మనసులో ప్రార్థించుకుంది. ' ఏసుప్రభూ! నా బిడ్డకి ఈ సాయంత్రానికల్లా తగ్గిపోతే పది ఆదివారాలు చర్చికొచ్చి నీ ప్రార్థనలు చేస్తాను.' ఇంతలో డాక్టరుగారు లోనికి పిలిచాడు. సుందరి మోరీలుని తీసుకుని ఆదుర్దాగా లోనికి వెళ్ళింది. డాక్టరుగా రు అప్పటికే మోరీలు తాలూకు రిపోర్టులు చూస్తున్నాడు. సుందరిని చూసి అన్నాడు, ' రండమ్మా. ఇప్పుడే మీ అమ్మాయి రిపోర్టులు చూస్తున్నాను. పరీక్షల్లో టైఫాయిడ్ కి నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అల్లాగని టైఫాయిడ్ కాదని ఖచ్చితంగా నిర్ధారణ చెయ్యలేం. మలేరియా కూడా కాదని అనిపిస్తోంది. డెంగ్యూఫీవర్ అనిపిస్తోందమ్మా. చాలా జాగ్రత్తగా వుండాలి. అమ్మాయిని ఇరవైనాలుగ్గంటలూ కనిపెట్టుకుని వుండాలి. అంతేకాదు, అమ్మాయి చాలా నీరసంగా వుంది. సైలైన్ కూడా ఎక్కించాలి. మీరు అశ్రధ్ధ చెయ్యకుండా వెంటనే హాస్పటల్ లో జాయిన్ చేసేయండి. నర్సులు ఇరవైనాలుగ్గంటలూ చూసుకుంటూ టైము ప్రకారం ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇస్తూవుంటారు.' సుందరికి ఏడుపు వచ్చేసింది. వెక్కుతూ అడిగింది, ' ఫరవాలేదంటారా డాక్టరుగారూ?' ' అయ్యో, అదేమిటమ్మా? చిన్నపిల్లలా అంత గాబరా పడతారూ? మేమంతా లేమా? అమ్మాయికి తప్పకుండా నయమవుతుంది.' అని మళ్ళీ నర్సు కేసి తిరిగి, ' ఈ పాపకి వెంటనే బెడ్ అలాట్ చేసి సెలైన్ పెట్టండి. పది నిముషాల్లో నేను వచ్చి ట్రీట్ మెంట్ మొదలెడతాను.' అని మళ్ళీ సుందరితో అన్నాడు, ' వెళ్ళండమ్మా. మీరు అమ్మాయి దగ్గర వుండండి. ఏం పరవాలేదు. అంతా నేను చూసుకుంటాను. ఈలోగా కవుంటార్లో ఐదువేలు అడ్వాన్సు కట్టి రండి.' ' అలాగేనండి.' మోరీలుతో పాటు సుందరి కూడా ఆస్పత్రిలో వుండిపోయింది. మోరీలు బెడ్ మీదకి చేరగానే ఆమెకి సెలైన్ ఎక్కించడం మొదలుపెట్టారు. డాక్టరుగారు వచ్చి కేస్ షీట్ లో ఇవ్వవలసిన ట్రీట్ మెంట్ గురించి రాసారు. ఆ ప్రకారం నర్సులు అరగంటకోసారి మోరీలుకి ఇంజక్షన్లు ఇవ్వడం, బి.పి. చెక్ చేయడంలాంటివన్నీ యాంత్రికంగా చేసేస్తున్నారు. ఆ సాయంత్రానికి కూడ మోరీలుకి జ్వరం తగ్గలేదు. అ మర్నాడు కూడా తగ్గలేదు. ఆ మూడోరోజు కూడా తగ్గలేదు. డెంగ్యూ ప్రాణాంతకమైన వ్యాధి అని పేపర్లలో చదివింది. సుందరి మనసు మనసులో లేదు. ' ప్రభూ, వేంకకటేశా! మోరీలుకి వెంటనే జ్వరం తగ్గిపోతే నీ కొండకి నడిచివచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను స్వామీ!' అని మనసులో మొక్కుకుంది. ఐనా మోరీలు జ్వరం తగ్గుముఖం పట్టలేదు. ఆ రాత్రి సుందరి గాబరాగా పక్క ఊర్లో వున్న తన తమ్ముడికి ఫోను చేసి చెప్పింది, ' ఒరేయి తమ్ముడూ! మోరీలుకి ఐదు రోజుల్నించీ జ్వరంరా. ఆస్పత్రిలో జాయిన్ చేసాను. డాక్టరుగారు డెంగ్యూ అంటున్నారు. నాకేం పాలు పోవటల్లేదురా. ఏమనుకోకుండా ఒక్కసారి రారా.' ఆమె తమ్ముడు అన్నాడు, ' అలాగే అక్కా. నువ్వేం కంగారు పడకు. రేపు ఫస్ట్ బస్ లో వచ్చేస్తాను.' మోరీలుని జాయిన్ చేసిన మర్నాడు ఆమె పక్క బెడ్ మీద ఒక కుర్రాడిని తీసుకువచ్చి పడుకోబెట్టారు. ఆ కుర్రాడి తల్లి వాడి పక్కనే కూర్చుని వాడికి సపర్యలు చేస్తోంది. ఆ కుర్రాడికి జాయిన్ అయిన రెండో రోజునే నిమ్మళించింది. ఇంక ఇంటికి తీసుకుపోవచ్చని చెప్పారు. సుందరి ఆశ్చర్యపోయింది. మోరీలు కన్నా తరవాత జాయిన్ అయ్యాడు. రెండో రోజుకే తగ్గిపోయి ఇంటికి వెళిపోతున్నాడు. కాని తన రాతే ఇలా వుంది అనుకుంటూ నిట్టూర్చింది. ఆ కుర్రాడి తల్లి సుందరి దగ్గిరకి వచ్చి, ' అమ్మాయికెలా వుందమ్మా?' అని అడిగింది. సుందరి కళ్ళనీళ్ళతో చెప్పింది, ' ఏం చెప్పమంటావమ్మా? ఇప్పటికి వారం రోజుల్నించీ పిల్ల నలిగిపోతోంది. జ్వరం ఏం తగ్గటల్లేదు.' ' డాక్టరుగారేమంటున్నారమ్మా?' ' డాక్టర్లేమంటారమ్మా? 'ఏం ఫరవాలేదు, తగ్గిపోతుంది, కాదా అంటే కొంచెం టైము పడుతుంది, గాబరా పడితే ఎల్లాగు?' అంటారు. నాకేం పాలు పోకుండా వుందమ్మా.' ' అయ్యో, అల్లాగా అమ్మా? మా అబ్బాయికి జ్వరం వస్తే, నిన్న సాయంత్రం ఇక్కడికి దగ్గర్లోనే తన్నులబాబా వున్నారు. ఆయన చాలా మహిమ గలవారు. ఆయన దగ్గిరకెళ్ళి అబ్బాయి పేరు చెప్పి, ఐదువేలు దక్షిణగా డబ్బు కట్టి, ఆయన చేత నాలుగు తన్నులు తిని వచ్చాను. చూసావమ్మా? ఒక్కరోజులో అబ్బాయికి నయమైపోయింది.' సుందరి ఆత్రంగా అడిగింది, ' ఆయన ఎక్కడుంటారమ్మా?'
ఆవిడ వివరాలన్నీ చెప్పింది. సుందరి మరి ఆలస్యం చెయ్యకుండా మోరీలుని చూస్తూండమని నర్సులకి అప్పజెప్పి ఉరుకులు పరుగుల మీద ఆ బాబా దగ్గిరకెళ్ళింది.
అక్కడ జనం కిటకిటలాడుతున్నారు. తన్నులబాబా ఒక సింహాసనం మీద కూచుని వున్నాడు. ఒక్కొక్కరే క్యూలో ఆయన దగ్గరకు వెడుతున్నారు. ఆయన వాళ్ళని వివరాలేమీ అడక్కుండా వీపు మీద నాలుగైదు సార్లు తంతున్నాడు. వాళ్ళు తన్నులు తిని ఆయన పాదాలకు మొక్కుతున్నారు. ఆయన వాళ్ళకి విభూతి బొట్టు పెట్టి పంపిస్తున్నాడు. సుందరి అక్కడ డబ్బు చెల్లించి, తను కూడా క్యూలో నించుని మోరీలు పేరు మీద ఆయన చేత నాలుగు తన్నులు తిని, విభూతి పెట్టించుకుని ఆస్పత్రికి తిరిగి వచ్చింది. ఆశ్చర్యం! మోరీలు జ్వరం తగ్గుముఖం పట్టింది. సుందరి బాబాని మనసులో తలుచుకుని శ్రధ్ధగా దణ్ణం పెట్టుకుంది. హు! ఏ దేముడూ నయం చెయ్యలేని వ్యాధి ఆ బాబా క్షణంలో నయం చేసాడు. ' తన్నులబాబా! మోరీలుని డిశ్చార్జి చేసాక మళ్ళీ నీ దగ్గిరకి వచ్చి మోరీలుకి కూడా తన్నులు తినిపిస్తాను బాబా!' ఆ మర్నాడు మోరీలుని డిశ్చార్జి చేసారు. మోరీలుని తీసుకుని ఇంటికి చేరుకుంది సుందరి. అప్పుడే ఆమె తమ్ముడు వంశీ ఆటో దిగుతున్నాడు. వంశీని చూడగానే సుందరి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ' రారా తమ్ముడూ! నిన్న ఒక అద్భుతం జరిగింది. దాంతో మోరీలు జ్వరం దెబకి తగ్గిపోయింది. నీకన్నీ వివరంగా చెబుతా. ముందు లోపలికి పద.' సుందరి కాఫీ చేసి, ఒక కప్పు వంశీకిచ్చి, మరో కప్పు తను తీసుకుంది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా మోరీలుకి జ్వరం రావడం దగ్గిర్నుంచీ, తను చేసిన వైద్యం, తను మొక్కిన మొక్కులు, అవి పని చెయ్యకపోవడం, అన్నీ వివరంగా చెప్పింది. ఆఖరున తన్నులబాబా మహత్యం గురించి వివరంగా చెప్పింది. వంశీ దీర్ఘంగా నిట్టూర్చాడు. సుందరి వంశీ మొహంలోకి దీక్షగా చూస్తూ అంది, ' నాకు తెలుసురా. నువ్విలాంటివేవీ నమ్మవని. కాని నాకు ప్రత్యక్షంగా అనుభవమైన దాన్ని కూడా నువ్వు నమ్మకపోతే ఇంకేం చెప్పను?' ' అక్కా! మోరీలుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. చాలా సంతోషం. ఐతే, నేను నీకు ఒక కథ చెబుతాను. ఏమనుకోకుండా పూర్తిగా విను. ఒక ఆసామీకి ఒక సాధువు కనిపించి, ' నాయనా! నువ్వు శివాలయం ఎదర వున్న చెరువులో స్నానం చేసి శ్రధ్ధగా బిందెతో నీళ్ళు నింపుకుని శివుడికి అభిషేకం చెయ్యి. అలా వందసార్లు చేసినట్లయితే నీకు శివానుగ్రహం లభిస్తుంది.' అని చెప్పాడు. ఆ ఆసామి ఆ సాధువు చెప్పినట్లే శ్రధ్ధగా చెరువులోంచి నీళ్ళు బిందెతో మోసుకు వెళ్ళి శివుడికి అభిషేకం చెయ్యసాగాడు. అల్లా వంద బిందెల నీళ్ళతో అభిషేకం చేసినా ఏమీ మహత్యం జరగలేదు. ఆ శివుడి దర్శనం కలగలేదు. ఆ ఆసామీకి ఆ సాధువు మీద, శివుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది ' ఛీ, వాడొక దొంగ సాధువు. ఈ శివుడు అంతకన్నా మాయగాడు. రాక్షసులైన భస్మాసురుడికి, రావణాసురుడికి వాళ్ళ స్తోత్రాలకి, తపస్సులకి ఉబ్బిపోయి అడ్డమైన వరాలూ ఇచ్చేసాడు. కాని నేను ఇంత నిష్టగా అభిషేకం చేస్తే నన్నసలు పట్టించుకోలేదు. ఛీ! శివా1 ఇవాళ్టినించీ నేను నిన్ను తలవను గాక తలవను.' అనుకున్నాడు. ఇంతలో అతడికి పెద్ద నవ్వు వినిపించింది. ఏమిటా అని అటూ ఇటూ చూసాడు. శివలింగం నించి అతడికి మాటలు వినిపించాయి. ' ఓయి అమాయకుడా! నీ తప్పులకి నన్ను బాధ్యుడిని చేస్తున్నావా? నువ్వు లెక్క తప్పు పెట్టావు. నువ్వు తొంభైతొమ్మిది బిందెలే అభిషేకం చేసావు. మరొక్క బిందె నీళ్ళు అభిషేకించి వుంటే నేను నీకు ప్రత్యక్షమై వుండే వాడిని. ఇప్పుడు నువ్వు నామీద నమ్మకం కూడా పోగొట్టుకుని ఇంకా మరిన్ని మెట్లు కిందికి జారిపోయావు.' సుందరికి కోపమొచ్చింది. ' అంటే ఏమిట్రా తమ్ముడూ నువ్వనేది? నేను భక్తి శ్రధ్ధలతో దేవుడిని ప్రార్థించలేదంటావా?' ' ముమ్మాటికీ అంతే అక్కా. కాసేపు సాయిబాబాని ప్రార్థించావు. ఇన్ స్టెంట్ ఫుడ్ లాగా, ఇన్ స్టెంట్ కాఫీ లాగా దేవుడు కూడా క్షణాల్లో ప్రత్యక్షమై మహిమలు చూపించాలని అత్యాశ చూపించావు. మహిమ కనబడలేదని, అల్లాకి మిఠాయిలు నైవేద్యం పెట్టావు. ఆయన కూడా కరుణించలేదని ఏసుక్రీస్తుని ప్రార్థించావు. ఆయన కూడా నీ మొరాలకించలేదని వేంకటేశ్వర స్వామికి మొక్కేసావు. ఆయన కూడా నిన్ను పట్టించుకోలేదని తన్నులబాబాని ఆశ్రయించావు. కాని ఒక్క విషయం చెప్పనా అక్కా? ఏ దేవుడూ మన ప్రారబ్ధాన్ని తప్పించడు. మన పురాకృత పుణ్య పాప ఫలితాలని మనం, మళ్ళీ చెబుతున్నాను, మనం మాత్రమే అనుభవించి తీరాలి. అంతేకాని ఆ ఫలితాలని దేవుడు కూడా తారుమారు చెయ్యడు. ఇంకో వాస్తవమేమిటంటే, రోగం వస్తే దేవుడూ! తగ్గించమని ప్రార్థనలు చేస్తూ కూచోడం కాదు, సరైన వైద్యం చేయించుకోవాలి. నువ్వు మోరీలుకి సరైన వైద్యమే చేయించావు. ఐతే ఎంత మందులు వాడుతున్నా, రోగతీవ్రతని బట్టి నిమ్మళించడం కూడా వుంటుంది. అంతేకాని మందు వేసుకున్న అరనిముషంలో గుణం కనిపించాలని అనుకోకూడదు. ఆయనిచ్చిన మందులు పనిచేసాయి కనుకనే మోరీలుకి నయమైంది. అంతేగాని తన్నులబాబా నిన్ను తన్నడం వల్ల కాదక్కా. తుంటిమీద కొడితే పళ్ళు రాలాయన్నట్లు, అసలు తన్నులు నువ్వు తింటే మోరీలుకి ఎలా నయమవుతుందక్కా?' సుందరి అయోమయంగా అంది, ' అంతేనంటావురా తమ్ముడూ/' ' ముమ్మాటికీ అంతే అక్కా. భగవంతుడు లేడని నేను అనటం లేదు. కాని మానవ ప్రయత్నం చెయ్యకుండా, హోరుగాలిలో దీపం పెట్టి, ' దేవుడా! నీదే భారం.' అనకూడదు. చెట్టునున్న కాయ మన చేతుల్లోకి రావాలంటే, అది పూర్తిగా మగ్గిన తర్వాతనే నేల రాలుతుంది. ఒక బిడ్డ ఈ భూమి మీదకు రావాలంటే, ఒక ఇల్లాలు నవమాసాలు ఆ బిడ్డను మోసి, దారుణమైన ప్రసవ వేదనను అనుభవించి తీరాలి. అంతేగాని చెట్టున పిందె రాగానే, ' దేవుడా1 వెంటనే ఆ పిందె పండుగా మారి నా చేతుల్లో పడాలి అని ప్రార్థనలు చేసేస్తే ఎలా అక్కా? సాధకులు అమాయకులయ్యే హిమలయాలలో ఏళ్ళతరబడి తపస్సు చేస్తూ వుంటారా అక్కా? జీవుడు కొన్ని జన్మల సాధన అనంతరం మాత్రమే మోక్షానికి అర్హత సంపాదించుకుంటాడు. ఈ తత్వం అర్థం చేసుకోకుండా, అన్నీ క్షణాల్లో జరిగిపోవాలని, మనం కోరుకున్నవన్నీ కనురెప్ప మూసి తెరిచేలోగా జరిగిపోవాలనీ ఆశపడితే ఎలా అక్కా? అల్లా ఆశపడి, అవి జరగక పోతే, దేవుడు లేడని, అసలు సైన్సు వల్లే ఈ ప్రపంచం, ఈ పంచభూతాలు పుట్టాయని వితండవాదం చేస్తే ఎల్లా అక్కా?' సుందరి ఆలోచిస్తూ వుండిపోయింది.
*************************
No comments:
Post a Comment