అమ్మను బాధించకూ.... - అచ్చంగా తెలుగు

అమ్మను బాధించకూ....

Share This

అమ్మను బాధించకూ....

- పిన్నలి గోపీనాథ్ 


సీ. అమ్మ బాసకు మెప్పు అదియె నందరి కొప్పు ... గౌరవించ మనకె గర్వ మగును !
     ఎన్ని వర్ణములున్న నేమి అదియె మిన్న .. నేర్వ వలయు నన్ని నేర్పు గాను !!
     దిద్దుచున్న కొలది దిద్దబడును శైలి ... నిఖిల జగతి మెచ్చు నిన్ను జూసి !
     తెలుగు భాషె లెస్స తెలుసు జగతి కెల్ల ... మమత బెంచు నెపుడు మాతృ భాష !!
ఆ.వె. అచ్చు తోడ హల్లు నదియె దీనికి మెఱపు
        మరియు నిదియె మధురమైన దంటు
        వివిధ దేశములలొ వినుతి గెక్కెను గాన
        గౌరవించ దగును గర్వముగను...!!
  " అ .. మ్మ ." .  ఎంత కాదనుకున్నా ఒడలు పులకరింప జేసే పదం కదా ఇది.! ఎంతటి కఠినాత్ముడైనా ఆఖరుకు తల్లినే నానా హింసలూ పెట్టే వాడు సైతం చిన్న దెబ్బ తగిలితే అమ్మా అనో అమ్మో అనాల్సిందే కదా. అందుకే పిల్లలు పలుకులు నేర్చేటపుడు వారి బోసి నోట నుంచి వెలువడే తొలి పదం తాత అయినప్పటికీ బాస మాత్రం అమ్మదే నంటున్నాం. అదీ అసలు విశేషం.
ఇక దీనిని ఇలా వ్యవహరించడానికి కారణం .. నాకు తెలిసి సంస్కృతిలో వచ్చిన పెనుమార్పులే !. నిజం. పూర్వం ఉత్త రాదిన మాత్రమే అంటే ఆర్యులలో మాత్రమే మాతృస్వామ్యం వేళ్ళూనుకుని యుండేది. గనుకే చంద్ర గుప్తుడు మౌర్య చంద్రగుప్తుడైనాడు. దక్షిణాన మాత్రం సర్వత్రా పితృస్వామ్యమే రాజ్యం చేసిందనేది తిరుగులేని వాస్తవం. నేడు కూడా పిల్లలకు తండ్రి వంశనామమే తరాలుగా వస్తుంది.స్త్రీలు వివాహనంతరం తిరిగి పురుషుని వంశనామంతోనే గుర్తుంపు పొందుతున్నారు. తమిళనాట అయితే పూర్తిగా తండ్రి పేరే వంశనామం అవుతున్నది కదా !. అయితే, భాషను అమ్మ భాష అనకుండా ఆది నుంచే మాతృభాష అనడానికి కారణం ఆలోచిస్తే ఉత్తరాది ప్రభావమే ఇందుకు కారణం అనుకోవాలి. ఆంగ్లేయులు సైతం Mother Tongue అనడానికి ఇదే కారణం అనుకోవచ్చు నేమో...
 తల్లికి లభించాల్సిన గౌరవం ఇంత గొప్పది కావడం వెనుక ఉన్న మతలబు ... నా చిన్నప్పుడు విన్న సినిమా పాట చివరి చరణం ...పట్టరాని శోకంతో పుట్టడమే పాపం, దేవుడైనా తీర్చలేడు తల్లి లేని లోపం...
అదీ విషయం. అంతే కాదు అనాదిగా వస్తున్న ఒక ఉక్తి ..మగవాని చేతి బిడ్డడు సవ్యంగా యెదగనేరడు.. అందుకే నేటికీ " ఏం పెంపకమమ్మా?", " ఆ తల్లి యెలా పెంచిందో వీడిని!" ఇవే మాటలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. యువకులు కాలం మారిందంటూ తాము సైతం భార్యతో సమానంగా పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఈ నానుడి మాత్రం పోవడం లేదంటే ఆలోచించాల్సిందే ....అంటే మగవాడికి జరుగుతున్న అన్యాయం గురించి అని కాదు, తల్లికి లభిస్తున్న విలువ గురించి. పార్వతీ పరమేశ్వరులు, గౌరీశంకరులు, సీతారాములు, శ్రీపతులు, వనజనాభులూ వివరిస్తున్న వాస్తవమూ ఇదే. ఇదే. ఇదే. !!
కనుకనే తల్లికే కాదు, అమ్మ భాషకూ తగిన గౌరవం ఇవ్వాల్సిందే. కదా !!

No comments:

Post a Comment

Pages