చందమామ తాతయ్య - ఆర్టిస్ట్ శంకర్ - అచ్చంగా తెలుగు

చందమామ తాతయ్య - ఆర్టిస్ట్ శంకర్

Share This
చందమామ తాతయ్య - ఆర్టిస్ట్ శంకర్
 - భావరాజు పద్మిని 

"పనిమీద ప్రేమ ఉండాలి. ప్రేమతో చేసే పనిలో ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ప్రేమతో చేసిన పని పదికాలాల పాటు నిలుస్తుంది." అక్షర సత్యంలాంటి మాటలివి. ఆ ప్రేమే, ఆరు దశాబ్దాలుగా ఆయన్ను ‘చందమామ’ తో పనిచేసేలా చేసింది. ఒక రకంగా చూస్తే ఇవి ఈ తరం వారికి అంత సులువుగా బోధపడవు కూడా. ఇప్పటి తరం వారికి అర్థంకాని ఆ పని ప్రేమికుడు.. తన సంప్రదాయ విశ్వాసాలన్నింటిని ఆవహించుకుని మరీ చందమామ పౌరాణిక చిత్రాలకు ప్రాణ ప్రతిష్ట పోస్తూ వచ్చిన చందమామ తాతయ్య.... దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు... ఆర్టిస్ట్ శంకర్ గారు. పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్ గారు ... (కె.సి. శివశంకర్).... ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు! వారితో ‘అచ్చంగా తెలుగు’ ప్రత్యేక ముఖాముఖి మీ కోసం... 
మీరు బొమ్మలు వెయ్యటం ఏ వయసులో మొదలుపెట్టారు ? మీ కుటుంబంలో ఎవరైనా చిత్రకారులు ఉన్నారా లేక స్వతహాగానే మీకా ఆసక్తి కలిగిందా ? 
 పదేళ్ళ వయసు నుంచే నేను బొమ్మలు వెయ్యటం మొదలుపెట్టాను. మా కుటుంబంలో చిత్రకారులు ఎవరూ లేరు. నాకే చిత్రకళ పట్ల మక్కువ ఏర్పడింది. మాది తమిళ కుటుంబం, అయినా ఆసక్తితో తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. 
మీ చిత్రకళా గురువుల గురించి చెబుతారా ? 
నాకు గురువులు ఎవరూ లేరు. నా స్వంత పరిశీలన, సాధనతో ఈ స్థాయికి చేరుకున్నాను.  
మీరు చిత్రకళ పై ఆసక్తి చూపేలా మీకు ప్రేరణ కలిగించింది ఏది? 
కధలకు వేసిన బొమ్మల్లో కంటికి ఇంపైనది ఏదైనా, చూసినప్పుడు అది వెయ్యాలన్న ప్రేరణ కలిగేది. 
మొదట్లో మీరు బొమ్మలు వెయ్యటాన్ని వృత్తిగా స్వీకరించారా, లేక ప్రవృత్తి గానా ? 
మొదట్లో ఇది నాకొక ఆసక్తికరమైన ప్రవృత్తి. నేను హై స్కూల్ లో ఉండగా, మా ఆర్ట్ టీచర్ నా బొమ్మల్ని హాలా మెచ్చుకుని, ప్రోత్సహించేవారు. ఆదివారాలు ఇంటికి రమ్మని, తగిన సూచనలు ఇచ్చి, ప్రోత్సహించేవారు. మేము ఇద్దరం కలిసి మిగతా పిల్లల బొమ్మలు సరిదిద్దేవాళ్ళం. 
మీరు చిత్రకళా రంగంలోకి వచ్చిన కొత్తల్లో మీకు ప్రేరణ కలిగించినవారు, మీ అనుభవాలు మాకు చెబుతారా ? 
పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. నేను పైన చెప్పినట్లు ముతైల్పేట హై స్కూల్ లో చదువుతుండగా, పరిచయమైన మా ఆర్ట్ టీచర్ , నన్ను ఎంతో
ఆత్మీయంగా ప్రోత్సహించేవారు. ఒకసారి ఆయన ‘బాబూ, అందరిలా నువ్వు B.A లేక M.A చదువుకు వెళ్ళకు. నాకు నీ సత్తా తెలుసు, నువ్వు ఆర్ట్ స్కూల్ లో చేరాలి,’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో పాతుకుపోయాయి, నేను కష్టపడి, బొమ్మవేసి, అక్కడి టీచర్లను మెప్పించి, కోర్స్ లో చేరాలనుకున్నాను. బ్రష్ సరిగ్గా లేకపోయినా నేను వేసిన బొమ్మను చూసి, ఆశ్చర్యపోయిన ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రాయ్ చౌదరి గారు నేరుగా నన్ను 2 వ సంవత్సరంలో చేర్చుకున్నారు. అక్కడి కోర్స్ పూర్తి చేసాకా ‘కలై మగళ్ ‘ అనే తమిళ పత్రికలో చేరాను.   
చందమామ లోకి మీరు వెళ్ళటం ఎలా సంభవించింది ? 
నేను 1946 లో ‘కలై మగళ్ ‘ అనే తమిళ పత్రికలో 85 రూపాయిల జీతానికి చేరాను. 1952 కల్లా, నాకు 150 రూ. జీతం రాసాగంది. కాని, ఒక పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు అది సరిపోదు. అదే ఏడాది చక్రపాణి గారు నన్ను ౩౦౦ జీతానికి పనిలోకి తీసుకున్నారు. అప్పటికే చిత్రా గారు 4 ఏళ్ళుగా చందమామలో పని చేస్తూ, 350 రూ. జీతం తీసుకోసాగారు. 
ఎటువంటి రిఫరెన్స్ పుస్తకాలు దొరకని రోజుల్లో, మీరు అద్భుతమైన చిత్రాలను సృష్టించారు. ఇది ఎలా సాధ్యమయ్యింది ? 
మద్రాస్ లో ఉన్న ‘థియొసాఫికల్ లైబ్రరీ’ లో అన్నీ విదేశీ చిత్రకారుల బొమ్మలే ఉండేవి. అప్పుడప్పుడూ అక్కడకు వెళ్ళినా, అక్కడా, కావలసిన
బొమ్మలు దొరికేవి కావు. విదేశీ బొమ్మలకు దీటుగా, భారత బొమ్మను , రాజుల బొమ్మల్ని నిలబెట్టిన మొట్టమొదటి ఆర్టిస్ట్ రాజా రవివర్మ అని నేను నమ్ముతాను.   దైవానుగ్రహం వల్ల నా స్వంత ఊహతో చిత్రాలను రూపొందించే వాడిని. దైవానుగ్రహం లేకుండా కళలు సంప్రాప్తించవని నా నమ్మకం. 6 అడుగుల ఒక మనిషిని, అతని పరిసరాలను 4 అంగుళాల బొమ్మలో ఇమడ్చాలి అంటే, అతనికి తగ్గ తల, దేహం కాళ్ళు ఏ విధంగా ఉండాలి, అని ఊహించుకునే వాడిని. బొమ్మను ఆకర్షణీయంగా వెయ్యాలని అనుకునేవాడిని. అప్పట్లో అప్పుడప్పుడూ వచ్చే చదువరుల లేఖలు మాకు ఇచ్చేవారు. అందులో ఉన్న వ్యాఖ్యలను బట్టీ, మార్పులు చేసుకుని, కళను మెరుగు పరచుకున్నాను. 
చందమామ గురించి , మీ మనసులో నిలిచిపోయిన కొన్ని అనుభూతులు చెప్తారా ? 
నాకు చందమామ 4 గోడలు తప్ప, ప్రపంచం తెలియదు. అప్పుడప్పుడూ, ఎంప్లాయిస్ ఫంక్షన్ పెడితే వెళ్ళేవాడిని, అంతే. చందమామ గురించి చెప్పాలంటే, చక్రపాణి గారి గురించి చెప్పాలి. చక్రపాణి గారు ఒక మహామేధావి. ఆయనకు, మాకూ చందమామ హృదయం వంటిది. చందమామ లేదంటే, మేము చచ్చినట్లే భావిస్తాము. ప్రతి పేజి కి బొమ్మ అన్న కాన్సెప్ట్ ను మొదటగా ఆయనే తీసుకువచ్చారు. ఆయన ఒక కధను ఎంపిక చేసారంటే, అది మిగతా 12 భాషలలోని ప్రజల జీవనశైలికి, సంస్కృతికి సరిగ్గా సరిపోయేటట్టు ఉండేది. ఆయన చాలా సహృదయులు. అవసరాన్ని బట్టి, తమ ఉద్యోగులకు అన్నీ సమకూర్చేవారు. మొదట్లో నేను మందవల్లి లో
ఉంటూ, 2 ట్రాములు మారి రావలసినందువల్ల, ఆఫీస్ కు అరగంట ఆలస్యంగా వచ్చేవాడిని. అది తెలుసుకున్న ఆయన నాకొక స్కూటర్ కొనిచ్చారు. ఉద్యోగుల కోసం చవక ధరలకు వస్తువులు అందుబాటులో ఉండే కో- ఆపరేటివ్ సొసైటీ ను మొదట పెట్టింది ఆయనే. మాకు అన్ని సౌకర్యాలు , మమ్మల్ని కన్నబిడ్డల లాగా చూసుకునేవారు. ‘చిత్రా, శంకర్ ఇద్దరూ చందమామ అనే ఎడ్లబండికి, జోడెడ్ల వంటివారు, ఏ ఒక్కరు లేకపోయినా చందమామ ఈ స్థాయికి చేరుకునేది కాదు’, అనేవారు ఆయన. 'చందమామ పనిలో ఒత్తిడిలేదు. పనిలో దిగితే బోర్ అనే ఫీలింగ్ నా చెంతకు రాదు. గత 60 ఏళ్లలో బోర్ అనే పదం నాకు తగల్లేదు. ఇన్నేళ్ల కాలంలో పని చేయడం ఒక్కటే నాకు తెలుసు. యాజమాన్యం మా పని విషయంలో ఏ మాత్రం జోక్యం కల్పించుకునేది కాదు. ఆర్టిస్ట్ ల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒకరి బొమ్మలు బాగుంటే, మరొకరం అభినందించేవాళ్ళం. ఆర్టిస్ట్ లకు బొమ్మలు వేసేందుకు ఒక పెద్ద గది ఉండేది. అక్కడే మాకు నీళ్ళు మార్చేందుకు ఆఫీస్ బాయ్స్ ఉండేవారు. 4 గురు ఆర్టిస్ట్ లం ఒక గదిలో వేస్తుంటే, వడ్డాది పాపయ్య గారు మాత్రం, తను బొమ్మలు వేసేటప్పుడు ఏకాగ్రత చెదరకూడదు అని, వేరే గది అడిగి తీసుకుని, అక్కడే బొమ్మలు వేసేవారు. నా ప్రపంచమే చందమామ గా బ్రతికాను. నాకు జీతం పట్టింపు కాదు, వ్యక్తిగతంగా పేరు ఉండేది కాదు. అయినా, వారిచ్చిన జీతంతో నా జీవనం గడుస్తోంది అన్న విశ్వాసంతో పనిచేసాను. ఉద్యోగం మారాలన్న ఆలోచనే నాకు లేదు. వారు కూడా మమ్మల్ని అంత ఆదరంగా, గౌరవంగా చూసారు. నాగిరెడ్డి గారి భార్య శేషమ్మ గారు కూడా చాలా ఆత్మీయంగా చూసేవారు. ఇప్పుడు అటువైపు వెళ్తే, అవన్నీ తల్చుకుని, ఏడుపు వస్తుంది. 
వడ్డాది పాపయ్య గారి గురించి మీ జ్ఞాపకాలు కొన్ని మాతో పంచుకుంటారా ? ఆయన గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి కూడా. ఆయన ఏ బొమ్మకూ పెన్సిల్ స్కెచ్ వేసుకునేవారు కాదు. నేరుగా బ్రష్ తో గీసేసేవారు. అంతేకాక, ఒక అట్టపెట్టె ముక్కనో, లేక కలర్ చార్ట్ నొ ఇచ్చినప్పుడు, ఆయన దాన్నే బ్యాక్ గ్రౌండ్ గా వాడుకుని, ఆ రంగుకు అనుగుణంగా బొమ్మలు గీసేవారు. అంత గొప్ప ఆర్టిస్ట్. ఆయన పంచె, జుబ్బా వేసుకు వచ్చేవారు. ఆ పంచెలు డిజైన్ అంచులతో చక్కగా ఉండేవి. మద్రాస్ లో అటువంటి పంచెలు దొరకవు. ఒకసారి నేను ఆయన పంచె బాగుందంటే, నాకు రెండు పంచెలు కొనుక్కు వచ్చారు. నేను డబ్బు ఇవ్వబోతే, నిరాకరించి, ‘డబ్బులు ఇస్తానంటే, నేను పంచెలు ఇవ్వను, నావి నాకు తిరిగి ఇచ్చెయ్..’ అని మందలించారు. నా బొమ్మలు మెచ్చుకుని, ప్రోత్సహించేవారు. 
చందమామ కాకుండా మీరు ఏ ఇతర పత్రికలకైనా బొమ్మలు వేసేవారా ? సమయం ఉన్నప్పుడు మొదట్లో వేసేవాడిని. తర్వాత కుదరలేదు. 
మీకు లభించిన అవార్డులు/ సత్కారాల గురించి చెబుతారా ? 
ఈ మధ్యనే కృష్ణా స్వీట్స్ వారు ఆర్ట్ లెజెండ్ క్రింద నాకు అవార్డు ఇచ్చారు. అలాగే శ్రీ రామకృష్ణ మఠం వారు, స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్భంగా నన్ను సత్కరించారు. 
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ? 
చెప్పేంత గొప్ప వాడిని కాదండీ, అంటారు మితభాషి, యెంత ఎదిగినా ఒదిగి ఉండే శంకర్ గారు. అయినా,మీరు ఒక బొమ్మ వేస్తున్నప్పుడు మీరు ఆ బొమ్మగా మారాలి. ఉదాహరణకు శివుడి బొమ్మ వేసే చిత్రకారుడు, శివుడిగా భావించుకుని వేస్తే తప్ప, ఆ బొమ్మ సజీవం కాదని, నేను అనుకుంటాను. పనే దైవంగా భావించి పట్టుదలతో కృషి చెయ్యండి. 
ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ లపై పని చేస్తున్నారు ? 
90 ఏళ్ళు వచ్చినా, దైవానుగ్రహం వల్ల నా చేతిలో పట్టు సడలలేదు. ఇప్పటికీ ట్రాన్స్పరెంట్ కలర్స్ తో చార్ట్ పై బొమ్మలు వేస్తుంటాను. చందమామ మూసేసాకా, తమిళ రామకృష్ణా మిషన్ ప్రెసిడెంట్ వెంకట రమణారెడ్డి గారు, ‘ మీకు ఇంటికే మేటర్ పంపుతాను, బొమ్మలు వేసివ్వండి,’ అని కోరారు. వారికి వేస్తున్నాను, తర్వాత చందమామ పునఃప్రారంభించాకా వారికీ, ఇంటి నుంచే వేసి ఇస్తున్నాను. నాకు తెలుగు చదవటం రాదు కనుక, తెలుగు కధ చదవి, బొమ్మలు వెయ్యాల్సి వచ్చినప్పుడు, నా మిత్రుడు ముగ్దా విశ్వనాథం అనే ఆయన నాకు కధ చదివి పెడితే, నేను బొమ్మలు వేస్తాను. 

శంకర్ గారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ప్రస్తుతం ఆయన భార్య శంబగవల్లి, కుమార్తె తో విరుగంబాకం లో ఉంటున్నారు. విక్రమ భేతాళ కధలు, పౌరాణిక పాత్రల చిత్రీకరణతో మేటిగా ఉంటూ, పిల్లలుగా ఉన్నప్పుడే, మన మనసుల్లో ఆ కధలను సజీవం చేసి, ఇప్పటికీ ‘నాదేమి లేదు, అంతా దైవానుగ్రహమే,’ అని నవ్వుతూ చెప్పేసే ఈ చందమామ తాతయ్య పధం అందరికీ ఆదర్శవంతం ! అనుసరణీయం. చందమామ తాతయ్య చక్కటి మాటలని క్రింది లింక్ లో చూడండి...

No comments:

Post a Comment

Pages