బస్సు ప్రయాణం
- తురగా శివరామ వేంకటేశ్వర్లు
ఒక రోజున పనిమీద రాజమండ్రిలో బస్సెక్కి విజయవాడ బయలు దేరాను .బస్సు ఆ వేళ రద్దీ గా ఉంది . బస్సులో ఒక వైపు ముగ్గురు కూర్చునే సీట్లు ,ఇంకొక వైపు ఇద్దరు కూర్చొనే సీట్లు వరుసగా ఉన్నాయి.బస్సు మద్య ముగ్గురు కూర్చొనే సీటు లో నాకు చోటు దొరుకుతుంది. బస్సు బయలు దేరి వేగం పుంజుకుంది. నా పక్కన కూర్చొన్న ఇద్దరు విజయవాడలో ఒక కాంట్రాక్ట్ పనిలో కళాసీలని పలకరి౦పులో తెలిసింది. రెండు సీట్ల వరుసలో నా ముందు ఒక కాలేజి స్టూడెంట్ చెవుల్లో వైరులు పెట్టుకొని పాటలు వింటోంది.వెనకాల సీట్లో వాళ్ళు ఇప్పుడు మండుతున్న ధరల గురించి చెప్పుకుంటున్నారు .ఇంకో పక్క ఇద్దరు రైతులు నకిలీ విత్తనాలు ,ఎరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంకో మూల వాళ్ళు పిల్లల పెళ్లి సంభందాల గురించి గట్టిగా మాట్లాడు కుంటున్నారు .ఏలూరు దాటాక ఒక అమ్మి తట్టలో ఆకు కూరలు పెట్టుకొని బస్సెక్కింది.
కండక్టరు టిక్కెట్టు ఇచ్చి ఆమెను మెంతి కూర కట్టేంత ? అని నవ్వుతూ అడిగాడు. “కట్ట ఇరవై కొంటావా? అని వెటకారంగా అంది.బస్సు పరుగేడుతుంటే అద్దాలు లేని కిటికీల నుండి గాలి హాయిగా వీస్తూ ఉంది .ఈ మద్యనే “వక్తిత్వ వికాసం “ మీద నా స్నేహితుడు వ్రాసిన పుస్తకం సంచిలోంచి తీసి చదవటం మొదలు పెట్టాను . కొన్ని పేజీలు చదివి చిన్న కునుకు తీసాను .షోడాలు ,పళ్ళు ,వేరుసనక్కాయలు అమ్ముకునే వాళ్ళు కేకలకి కలిగిన మెలుకువతో చుట్టూ చూసాను .
బస్సు గన్నవరం స్టాండ్ లో ఆగింది .డ్రైవర్ ,కండక్టర్ టీ త్రాగటానికి కిందికి దిగుతున్నారు. ఇంతలో ఒక నలబై ,నలభై దేళ్ళ అమ్మి చేతిలో ఒక సంచితో బస్సేక్కింది .కొద్దిగా రేగిన జుట్టు ,సాదా పాత నేత చీర కట్టుకుంది .మొదటి సీటు నుంచి మొదలు పెట్టి కూర్చొన్న వాళ్ళను అడుగుతుంది .”అమ్మా!బాబూ! మా వూరు బస్సుకోసం ఎదురు చూస్తూ స్టాండు లో నిద్రపోయాను .నిద్రలో ఎవరో నా డబ్బులు కొట్టేసారు .మా వూరు వెళ్ళటానికి ఎనభై రూపాయలు కావాలి .తలో కొంత సాయం చెయ్యండి .ధర్మం చెయ్యండి .నేను అడుక్కునే దాన్ని కాను నమ్మండి!”.
ఆ అమ్మి మాటలు నా చెవిలో పడగానే నాలో ఆలోచనలు మొదలయ్యాయి .’ఆహ ! ఈ ముష్టి వాళ్ళకి ఎన్ని తెలివితెటలబ్బాయి.వీళ్ళు ఎన్ని రకాలు గా అడుక్కుంటున్నారు .ఎంత బాగా నమ్మిస్తున్నారు .గతం లో అడగటం ,ఇవ్వటం లో ఒక దర్మం ఉందేది .ఊళ్ళలో ఉండే ఇద్దరో ముగ్గురో బీద బ్రహ్మనుణులు యాయ వారానికి ఇంటికి వెళ్లి “సీతా రామాభ్యాన్నమ:” అనగానే ఆ ఇంటి ఇల్లాలు ఆరోజు తిది ,వారం ,వర్జ్యం అడిగి ఆయన సంచిలో ఒక గ్లాసుడు బియ్యం పోసి ,ఓ పండో కాయో ఇవ్వటం జరిగేది .అలా ఇవ్వటం తన ధర్మం గా పుణ్యం గా అనుకునేది .రాత్రి వేళ ఒక సాధువో ,లేని వాడో “ మాధకోళం అమ్మా!” అనగానే ఇంత అన్నం కూర వేసేవారు . ఆనాడు జాలి ,దయ, ధర్మం ,సానుభూతి కలిగించే దారిద్ర్యం ,అంగవైకల్యం ,వృద్దాప్యం ,దిక్కు లేని తనం ,నిరుద్యోగం వంటివి బిచ్చమేత్తటానికి కారణాలుగా ఉండేవి . కాని నేడు? వాటితో పాటు సోమరితనం ,డబ్బు మీద ఆశ,మోసం కూడా కారణాలవుతున్నాయి.ముష్టి ఎత్తటం ఒక వ్రుత్తి,వ్యాపారం అయిపొయింది. ఆ మద్య పేపరు లో చదివిన వార్త గుర్తుకొచ్చింది.కొంతమంది బిచ్చమెత్తటానికి ఆనాధ పిల్లల్ని,ఇంట్లో నుండి పారిపోయిన వాళ్ళని నియమించి పెద్ద పట్టణాల లో ,చిన్న చిన్న నగరాలలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన కారులు ,మోటారు బళ్ళు వాళ్ళని ,బస్సు స్టాండ్లో ,రైలు స్టేషన్ లో ,వీధులలో జనాన్ని డబ్బులిచ్చే వరకు అడిగి అడిగి ,విసిగించి వాళ్ళు తెచ్చిన డబ్బులో పాతికో పరకో వాళ్ళ చేతిలో పెట్టి మిగతాది తమ జేబులో వేసుకున్తున్నారట .ఇట్లాగ సంపాదించిన తాలూకు డబ్బు టర్నోవర్ వేలాది రూపాయల్లో ఉంటోందట.ఈ అమ్మి అందరి చెవుల్లో ఎంత బాగా పువ్వులు పెడుతోంది!.తను బస్సు కోసం ఎదురు చూస్తోందట .నిద్ర పోయిందట ,డబ్బులు ఎవరో కాజేసారుట.తనకి ఎనభై రూపాయలు కావాలట.అంటే ఈ బస్సులో తను బిచ్చం ఎత్తి ఎంత రాబట్టుకోవాలో ఒక టార్గెట్ పెట్టుకొని ,బిచ్చమేసే వాళ్ళకి కూడా ఒక టార్గెట్ ఇస్తోంది .ఈ బస్సు వెళ్ళేక ఇంకో బస్సులో వంద అడుగుతుంది .రోజుకి ఇలా నాలుగైదు బస్సుల్లో తిరిగి ఐదు వందల వరకు సంపాదిస్తుంది.ఇలా బిచ్చం ఎత్తకపోతే మనిషి ఆరోగ్యం గానే ఉంది . వయస్సులో ఉంది . ఎక్కడైనా పని చేసుకొని బ్రతకోచ్చు కదా! చేయరు .ఇటువంటి వాళ్ళను నమ్మకూడదు .వీళ్ళ మీద జాలి పనికిరాదు .ఒక్క రూపాయి కూడా ఇవ్వ కూడదు .అనుకున్నాను.
కాని ఆ అమ్మి అడుగుతుంటే ప్రతి సీటు లోను ఎవరో ఒకరు ఎంతో కొంత చేతిలో పెట్టటం గమనించాను .నాలాగ ఎవరు ఆలోచించట్లేదు.కూరలమ్మి తన చిన్న గుడ్డ సంచి లోంచి ఐదు రూపాయలు తీసి అమ్మి చేతిలో పెట్టింది.పాటలు వింటున్న స్టూడెంట్ లేచి నుంచొని ప్యాంటు వెనుక జేబులో నుంచి పర్సు తీసి పదిచ్చింది.నా పక్కన కూర్చొన్న కళాసీలు జేబులోంచి తీసి చెరో ఐదిచ్చారు .ఆమె నా సీటు దాటి నా వెనుక వైపుకి వెళ్ళాక ,”ఇదుగో . ఇంద ! తీసుకో “అనే మాటలు వినపడుతూనే ఉన్నాయి.
ఈ స్థితి లో వాళ్ళ నుంచి నాకు కొంత స్ఫూర్తి ,ఆపరాద భావము ,కలిగి ,కాసేపటికి వెనక నుండి నా సీటు దాటి ముందుకెళ్ళి బస్సు దిగబోతున్న అమ్మిని పిలిచి ,”నీ పేరేమిటి “ అని అడిగాను .”సత్తి వానండి” అంది.
“సత్య వాణి” కదా? అన్నాను . అవునండి ! అంది .నా జేబులోనుండి ఒక పది నోటు తీసి చేతికి ఇవ్వబోయాను .వెంటనే ఆమె తన చెయ్యి వెనక్కి లాక్కొని “వద్దండి బాబూ !బస్సుక్కావలిసిన ఎనభై రూపాయలు సాయం చేసేసారు .మా వూరు వెళ్లి పోగలను .ఇంక నాకు ఏమి వద్దండి.మీరు చల్ల గుండాల !” అని బస్సు దిగి వెళ్లి పోయింది.ఒక్కసారిగా అవాక్కయ్యాను.ఆచ్చర్యపోయాను.మనసులో సిగ్గుపడి పోయాను .సిని బాషలో చెప్పాలంటే నా మైండ్ బ్లాకైంది.ఈ లోగా డ్రైవర్ ,కండక్టర్ బస్సు ఎక్కారు . బస్సు కదిలింది. గన్నవరం దాటి విజయవాడ చేరబోతోంది కాని సత్యవాణి నా బుర్రలో మేదులుతూనే ఉంది .అయితే ముందు నాలో ఆలోచనలు ,భావాలు అన్ని తప్పేనా? వాటిలో వాస్తవం లేదా ?? ఈ ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి.ఆలోచించగా కొంత సేపటికి సామాదాన పరుచుకున్నాను .బహుళ పక్షం అంత అన్ని రోజులు చీకటే ఉండదు. వెన్నెల కూడా కొంత ఉంటుంది .ఆ వెన్నెలకు గుర్తు సత్యవాణి .చదువు కున్న వాడినని లేదా సంస్కార వంతుడినని లేదా అనుభవం గలవాడినని ఎదో నా గురించి నాలో కలిగిన భావం నుంచి పుట్ట్టిన ఒక అహంకార పోర వల్ల చీకటి మాత్రమే కనపడింది.ఒక కూరలమ్మి ,ఒక స్టూడెంట్ ,శ్రమ జీవులు కళాసీలు వగైరాలు నుంచి స్ఫూర్తి పొంది నా నుంచి ఆ పొర తొలగటం ఈ బస్సు ప్రయాణం లో విశేషం.
No comments:
Post a Comment