భువన విజయం - ఆస్ట్రేలియా
1. "భువన విజయం" ను ఎప్పుడు ప్రారంభించారు ? మొదట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ?
భువన విజయం - సాహితీ సంవేదిక, మే 28, 2010 వ తేదీన ప్రారంభించాం. ప్రముఖ నవలా రచయిత శ్రీ ఎస్పీ చారి గారు మెల్బోర్న్ నగరంలోని ఔత్సాహికులైన రచయితలనందరినీ ఒక వేదికపై చేర్చి ఈసాహితీసంవేదికను“భువన విజయం” అని నామకరణం చేసారు. మొదట 12 మంది సభ్యులతో (అందరూ మెల్బోర్న్ నగరంలో నివసించే వారే) ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని అన్ని నగరాలలోని రచయితలను తనలో కలుపుకొని సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
దీన్ని స్థాపించినప్పుడు మీ మనోభావాలు/లక్ష్యాలు ఏమిటి ?
కొంతమంది సాహిత్యాభిలాషులు కలిసి తమలో వున్న భాషాభిమానాన్ని
కవితలు, కధలు, శాయిరీలు, పద్యాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇతరులతో పంచుకోవాలన్న తపనతో మొదలుపెట్టడం జరిగింది. మేము నిర్వహించిన మొదటి కార్యక్రమానికి అంచనాలకు మించి అనూహ్య స్పందన రావడం, మన భాష, సంస్కృతి పట్ల ఎంతోమంది ప్రగాఢమైన అభిమానంతో మమ్మల్ని ప్రోత్సహించడం మేము మరింత ముందుకు వెళ్ళడానికి తోడ్పడింది. సాహితీ సదస్సులు/కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడి తెలుగువాళ్ళలో మన భాషపట్ల అభిమానం పెంచడం, “మనం” అన్న పదంలో మన భాష ఒక పాశంలా ఇమిడివుందన్న సత్యాన్ని తెలుపడం మా కర్తవ్యంగా భావించాం. ఆ లక్ష్యసాధనతోనే ముందుకు వెళ్తున్నాం.
మొదట్లో మీకు లభించిన స్పందన ఎలా ఉంది ? ఎంతమంది స్వచ్ఛందంగా మీకు సహాయం అందించేందుకు వచ్చారు ?
అనూహ్య స్పందన. మాలో మేమే కొంతమేర తర్జుమా పడ్డాము. ఈ సాహితీ కార్యక్రమాలకు స్పందన వుంటుందా అన్న మీమాంసతో మొదట ఉగాది కార్యక్రమం చేసాము. అందులో ముఖ్యంగా కవితలు, కధలు, పంచాంగ శ్రవణంతో పాటుగా తెలుగు వంటకాలకు ప్రాముఖ్యతనిచ్చాం. ఉగాది పచ్చడితో పాటు అన్ని రకాల తెలుగు వంటకాలు మాత్రమే అందులో వడ్డించడం జరిగింది. అంటే కేకులు, బిస్కట్లు మొదలైన ఇతర వంటకాలు ఏమీ లేవన్నమాట. వచ్చిన ప్రతీ వారు వారికి తెలిసిన ఒక తెలుగు వంటకాన్ని తీసుకువచ్చారు. తెలిసినవాల్లంతా ఎవరికివారు స్వచ్చందంగా రావడం గొప్ప విశేషం.
ఈ సంస్థ ద్వారా మీరు మొదట్లో చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి ?
నెల నెలా కలిసి అందరూ వ్రాసిన క్రొత్త కవితలను, శాయిరీలను, కధలను వినిపించడం, ఎవరైనా క్రొత్త కధలను, పుస్తకాలను చదివితే వాటి గురించి చర్చించడం. ఇక్కడి తెలుగు సంఘం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం తెలుగు భాషా పరిమళాలను అందరికీ తెలిపే విధంగా కవితలు చదవడం, పద్యాలు పాడడం ఇలా “అమ్మ” భాషను అభివృద్ధి పరచడంలో ఎంతో కృషి చేసాం.
దీనికి ప్రవాసీయుల నుంచి, విదేశీయుల నుంచి లభించిన స్పందన ఎలా ఉంది ?
మేము ప్రవాసంలో నివసించడం వలన ఇక్కడి తెలుగువారిలో మాకంటూ ఒక గుర్తింపుని సాధించాం. “భువన విజయం” అన్న పేరు వింటేనే అదొక గౌరవానికి సూచికగా గుర్తింపు రావడం జరిగింది. ఇక్కడి తెలుగువారందరూ ఎంతో అప్యాయతగా ఎక్కడ కలిసినా ఒక కవిత చెప్పండనో, ఒక పద్యం పాడండనో తెలుగుభాషకు ఒక ముఖచిత్రంగా అభిమానించారు, ఆదరించారు.
నడక నేర్చుకునేటప్పుడు తడబాటులు, తిరిగి పట్టువదలకుండా ప్రయత్నించడాలు, సహజమే కదా ! మరి మీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కున్నారు ?
ఈ భాషోద్యమం ఎవరో ఒకరు చేపడితే మున్డుకేల్లేది కాదు. ఒక సమూహంగా ముందుకు సాగాలి. సాగర మధనం చేయాలి. సాన పట్టాలి. భాషా ప్రాతిపదికగా ముందుకేల్లడం వలన కొంతమందికి రుచించలేదు. అయితే మా ఉద్దేశ్యం ఒక మంచి ఉద్దేశ్యంతో ముందుకెళితే 80 – 90 శాతం మంది మమ్మల్ని అనుకరిస్తారన్న నమ్మకం. 5 – 10 శాతం మంది ముందుకొచ్చి మాకు సహకారాన్నందిస్తారని నమ్మకం. ఇలానే ముందుకు సాగుతున్నాం. తడబాటులు, ఎడబాటులు సర్వసాధారణం. అవి మనుషులకే గానీ లక్ష్యాలకు కాదు. మా లక్ష్యమే మా గమ్యం.
ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేస్తారా...
భువన విజయానికి సమాంతరంగా “తెలుగుమల్లి” అనే అంతర్జాల పత్రికను నిర్వహిస్తూ ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లోని తెలుగు వారు నిర్వహించుకునే సాహితీ కార్యక్రమ విశేషాలను ప్రచురిస్తుంటాము. 2010 లో భువన విజయ సభ్యులందరూ వ్రాసిన “కవితాస్త్రాలయ” సంకలనాన్ని శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రెండవ సంకలనం “కవితాస్త్రాలయ – 2014” ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, తత్త్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా ఆగష్టు 2014 లో జరిగిన సాహితీ సదస్సులో ఆవిష్కరించడం జరిగింది. ఈ సాహితీ సదస్సులో తెలుగుభాష వెయ్యేళ్ళ చరిత్ర పై (నన్నయ దగ్గరనుండి ఆధునిక కవులను కలుపుకొని శ్రీ భరణి వరకు) ఒక రూపకాన్ని ప్రదర్శించడం జరిగింది. అదొక అత్యద్భుతమైన కళాఖండంగా శ్రీ భరణి గారు అభివర్ణించారు.
ఇవే కాకుండా కొంతమంది సభ్యులు తమ రచనలను స్వతహాగా ప్రచురించడాన్ని “భువన విజయం” ప్రోత్సహించింది. గత 5 ఏళ్లుగా ఎన్నో సాహితీ కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా 2013 లో సిడ్నీ నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో పాల్గొని ఆస్ట్రేలియా తెలుగు వారి చరిత్రలో కనీ వినీ ఎరుగని మధురానుభూతులను మిగిల్చింది.
తెలుగు నేర్చుకోవడానికి ఒక బడిని కూడా నిర్వహిస్తున్నాం. అలాగే తెలుగు నేర్పే ఎంతోమంది అవిశ్రాంత శ్రామికుల్ని మా శక్తి కొలది సాయం చేస్తుంటాం.
మీరు చేస్తున్న కృషికి మీరు అందుకున్న ప్రశంసలు/అవార్డులు , లేక మీరు మర్చిపోలేని అనుభూతిని గురించి చెబుతారా ?
సంస్థా పరంగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో “భువన విజయం” తెలుగు సాహితీ సంవేదికగా మంచి గుర్తింపు పొందింది. క్రొత్తగా విడుదలైన “కవితస్త్రాలయ – 2014” పుస్తక సమీక్షలు భారతదేశంతో సహా ఇతర అంతర్జాతీయ అంతర్జాల పత్రికల్లో వచ్చాయి. మీరు వ్రాసిన సమీక్ష అత్యద్భుతంగా వుంది.
వ్యక్తిగతంగా మా సభ్యులు వివిధ సాహిత్య సభల్లో పాల్గొనడం, కొన్ని పురస్కారాలు అందుకోవడం జరిగింది.
ప్రస్తుతం మీ సంస్థ/సంఘం లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ?
ప్రస్తుతం షుమారు 25 మంది క్రియాశీలక సభ్యులున్నారు. అయితే మాకున్న అభిమానులు కొండంత అండ. మేము నిర్వహించే కార్యక్రమాలకు ఎక్కువమంది ఏదోరకంగా సహాయపడుతుంటారు. మాకు వంటకాలు దగ్గరనుండి రంగస్థలం పై అభినయం చేసేవాళ్ళు, ఆర్ధికంగా ప్రోత్శాన్నిచ్చే
వాళ్ళు, రంగస్థలాన్ని అలంకరించే వాళ్ళు, ఆహార్యాలను తాయారు చేసే వాళ్ళు, వస్త్రాభరణాలు సమకూర్చేవాళ్ళు ఇలా ఎందరో మహానుభావులు తమ సమయాన్ని బట్టి శక్తి కొలది మా కార్యక్రమాలకు తోడ్పడుతూ వుంటారు.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
తెలుగు భాషే మా ఆయుధం. దానికోసమే మా ఉద్యమం. భాషతోనే మన ఉనికి, సంస్కృతి ముడి పడి ఉన్నాయన్న సత్యాన్ని ఇక్కడి వారందరూ గుర్తించేలా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
మరికొంతమంది రచయితలను ప్రోత్సహించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలనే మా తపన. మరికొన్ని పుస్తక సంకలనాలను రాబోయే సంవత్సరాల్లో ప్రచురించాలని అనుకుంటున్నాం.
ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలను తెలుగు నేర్చుకోవడంలో సఫలీక్రుతులను చేయాలనే సంకల్పం. తరువాత తరానికి ఈ తర తరాల వెలుగుని అందివ్వాలన్న దీక్ష.
ప్రస్తుతం మీరు ఏ ఏ దేశాల్లో మీ సేవలను అందిస్తున్నారు ? ఏ విధంగా సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు ?
ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగువారికి తెలుగుమల్లి ద్వారా సాహితీ సుగంధాలను అందిస్తున్నాం. కొన్ని తెలుగు సంఘాలను వారి వార్షిక స్మారక సంచికలను ప్రచురించేలా ప్రోత్సహిస్తున్నాం. వీటి ద్వారా ఇక్కడి తెలుగు ప్రజల జీవన స్రవంతిని వారి చరిత్ర పుటల్లో ఒక జ్ఞాపికగా మిగిలిపోతుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగులో మాట్లాడడం, పద్యాలు, శ్లోకాలు పాడడం చదవడం మొదలైన విషయాల్లో మాకున్న వనరులలో తగినంత ప్రోత్సహన్నిస్తుంటాము.
ముఖ్యంగా జానపదాలు, పౌరాణిక నాటకాలు ప్రదర్శించటానికి మా సహాయ సహకారాలను అందజేస్తుంటాము.
మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలు , అవి కొనుగోలుకు ఎక్కడ అందుబాటులో ఉంటాయో చెబుతారా ?
2010 లో భువన విజయ సభ్యులందరూ వ్రాసిన “కవితాస్త్రాలయ” సంకలనాన్ని శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. రెండవ సంకలనం “కవితాస్త్రాలయ – 2014” ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, తత్త్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా ఆగష్టు 2014 లో జరిగిన సాహితీ సదస్సులో ఆవిష్కరించడం జరిగింది. ఈ రెండవ సంకలనం ప్రస్తుతం విశాలాంధ్ర, హైదరాబాద్ లో కొనుగోలుకు దొరుకుతుంది. ఎవరైనా ఎక్కువ సంఖ్యలో కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
తెలుగు భాషాభివృద్ధికి మనం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ? భాష పట్ల మక్కువ ఉన్నవారికి మీరిచ్చే సందేశం...
మన భాషలో వున్న పదాలను ఇతర భాషా పదాలతో భర్తీ చేస్తే మన భాష ఉపయోగం తగ్గిపోతుంది. అది కాకుండా ఇతర భాషల్లోని పదాలు మనభాషలో ఇనుమడిమ్పజేస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఇదొక యజ్ఞంలా ఉద్యమించాలి. ప్రతీ బడిలోనూ తెలుగు భాషను తప్పనిసరిగా నేర్పించాలి. ఇతర భాషలకు కూడా ప్రాముఖ్యతనివ్వాలి. ఇతర భాషలతో పోలిస్తే మన భాష ఎంత మధురమైనదో తెలియజేయాలి.
తెలుగు భాష గ్రంధాలను ఇతర భాషలకు అనువాదం జరగాలి. ప్రభుత్వం అనువాద ప్రక్రియకు ప్రోత్సహించాలి.
పిల్లలకు నేర్పే తెలుగు వారి స్థాయిలోనే వుండాలి. వారికోసం రచించే కధలకు ప్రాముఖ్యతనివ్వాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాన్ని ఉపయోగించి వనరులను తయారు చేయాలి. మరింత పరిశోధన జరగాలి. చెట్టు వేరు బలంగా వుంటే కాండం బలంగా వుంటుంది. వీచే గాలి కూడా బలంగా వీస్తుంది. ఆ గాలి మరింతమందికి స్పూర్తినిస్తుంది.
ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ? వివరాలు తెలుపగలరు ?(మీ సంస్థకు సంబంధించిన వెబ్ సైటు వివరాలు, యు ట్యూబ్ లింక్ లు ,చిరునామా, ఈమెయిలు, వంటి వివరాలు అందించగలరు)
ఈమెయిలు:australiabhuvanavijayam@gmail.com
Website: www.telugumalli.com
Address: P.O.Box 1161
Blackburn North
VICTORIA 3130, Australia
No comments:
Post a Comment