సినీ(మా) చదువులు - అచ్చంగా తెలుగు

సినీ(మా) చదువులు

Share This
సినీ(మా) చదువులు
 

పెయ్యేటి శ్రీదేవి


          ' ఊ ' టి.వి.లో సినీహీరో కమల్ తో ఇంటర్వ్యూ జరుగుతోంది.హీరోగారి తల్లి, తండ్రి, తమ్ముడు టి.వి. ముందు కూచుని ఇంటర్వ్యూ కళ్ళార్పకుండా చూస్తున్నారు.' నమస్కారం కమల్ గారూ!' ' నమస్కారం.' ' మీరు నటించిన ' శనిగాళ్ళకి మొనగాడు ' చిత్రం సూపర్ హిట్టయింది.  రేపు వందరోజుల పండగ జరుపుకుంటోంది.  ఈ సినిమా వల్ల మీకు మంచి పేరొచ్చింది.  దీనికి మీరెలా ఫీలవుతున్నారు?' ' చాలా చాలా హేపీగా వుందండి.  ఈ సినిమా ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకదేవుళ్ళకు, నన్ను ఆదరించిన ఎంతోమంది నా అభిమానులకు, అలాగే మా డైరెక్టరు సన్యాసిరావుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.' ' మీరు నటించిన మొదటి చిత్రం, ' అ ఆ ఇ ఈ ఉ ఊ ' లో మీ నటనకి మీకు నంది అవార్డు వచ్చింది.  దీనికి మీ స్పందన ఏమిటి?' ' చాలా థ్రిల్లింగ్ గా వుంది.  నా నటనకి నంది అవార్డు వస్తుందని అసలు నేనూహించలేదు.' ' ఇంకా ఏమన్నా చిత్రాలు చేస్తున్నారా?' ' ఇప్పుడు ' సోనీ ' చిత్రం ఆస్ట్రేలియాలో షూటింగ్ లో వుంది.' ' ఇంకా చిత్రాలున్నయా?' ' ఆ.  చాలా వున్నాయండి.  ఒక హిందీ చిత్రం, రెందు తమిళ చిత్రాలు, నాలుగు తెలుగు చిత్రాలు.' ' తెలుగు చిత్రాలుంటే ఏమేమిటి?' ' ఎటు పోతోందీ దేశం?, మదరాసీ మామీ, రుద్రాక్ష, ఒరే పైలట్!' ' రుద్రాక్ష అంటే పౌరాణిక చిత్రమా?' ' కాదు.  సాంఘికచిత్రమే.  వినూత్నమైన స్టోరీ.  పెళ్ళయిన ఆడవారికి గుర్తుగా మెడలో మంగళసూత్రాలుంటాయి.  మగవాళ్ళకు కూడా పెళ్లయిన గుర్తుగా కుడిచేతికి వధువు రుద్రాక్ష కడుతుంది.  ఆ రుద్రాక్ష చూసి పెళ్ళయిందని తెలుసుకుని, ఏ అమ్మాయీ ప్రేమించి మోసపోదు.  అత్తలని కోడళ్ళు, కోడళ్ళని అత్తలు బాధలు పెట్టకుండా ఎలా అరికట్టవచ్చో, కట్నాలు తీసుకోకుండా ఎలా నియంత్రించ వచ్చో ఈ చిత్రంలో బాగా చెప్పారు.' ' ఒరే పైలట్ టైటిల్ కూడ వెరైటీగా వుంది?' ' అవును.  కథ కూడా చిత్రంగానే వుంటుంది.  అందులో హీరో గోల్డ్ మెడలిస్ట్.  ఉద్యోగం కోసం ఇంటర్ వ్యూలకు వెడుతూంటాడు.  ఒక ఇంటర్ వ్యూ అధికారి ఏభయి వేలు లంచం అడుగుతాడు.  హీరో అతన్ని చీవాట్లు పెట్టి, విసురుగా బైటికొచ్చేస్తాడు.  తరువాత బతుకుతెరువు కోసం రిక్షా తొక్కుతాడు.  మిగతా ఇంటర్వ్యూలకు కూడా అటెండవుతూంటాడు.  ఒకసారి లంచం అడిగిన ఇంటర్వ్యూ అధికారి, ' ఒరే రిక్షా, ఇలారా' అంటూ హీరో రిక్షా ఎక్కుతాడు.  హీరోని గుర్తు పట్టడు.  అనుకోని పరిస్థితుల్లో హీరో అతని కూతుర్నే ప్రేమిస్తాడు.  తరువాత అతడికి ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడంతో పైలట్ గా ఉద్యోగం వస్తుంది.  ఏరోడ్రోములో ఆ అధికారి ఫ్లైట్ ఎక్కుతూ తన కూతురు పైలట్ తో పాట పాడుతుంటే, కోపంగా పళ్ళు నూరుతూ, ' ఒరే, పైలట్!' అని అరుస్తాడు.  ఇలా సాగుతుంది స్టోరీ.' ' బాగుందండి.  మీరు చేస్తున్న చిత్రాలు చాలా వైవిధ్యంగా వుంటున్నాయి.  కథ బాగుంటేనే ఒప్పుకుంటారా?' ' నేను ఒప్పుకోవడం కాదు.  మంచి కథాచిత్రాలే నా దగ్గరకు వస్తున్నాయి.' ' మీ మొదటి చిత్రంలో హీరో పేరు కమల్.  మీ పేరూ కమల్ యేనా?' ' కాదు.  నా అసలు పేరు వాసు.  నా మొదటి చిత్రదర్శకుడు నా పేరు కమల్ గా మార్చారు.  నా మొదటి చిత్రంలో హీరో పేరు కూడా కమల్ యే.' ' ఆఖరిగా ఒక ప్రశ్న.  మీరు సినీహీరో ఎల అయ్యారు?  కొంతమంది హీరోలు డాక్టరు అవాలనుకునో, ఇంజనీరు అవాలనుకునో యాక్టరయిన వాళ్ళున్నారు.  మీరూ అలాగేనా, లేక హీరో అవాలని ప్రయత్నాలు చేసారా?' ' పెద్దగా నేనేం ప్రయత్నాలు చెయ్యలేదు.  మా ఇంట్లో టి.వి. వుండేది కాదు.  సినిమాలు చూడాలన్నా ఆంక్షలు.  కనీసం వారపత్రికలు కూడ చదవనిచ్చేవారు కాదు.  నన్ను పెద్ద డాక్టరు చెయ్యాలని మా అమ్మగారి ఆశయం.  ఒక విధంగా మా అమ్మగారే కారణం నేను యాక్టరు కావడానికి.' ' విచిత్రంగా వుంది.  మీ ఇంట్లో టి.వి. లేదు.  సినిమాలు చూడనిచ్చేవారు కాదంటున్నారు.  డాక్టరు చెయ్యాలని మీ అమ్మగారి ఆశయం అంటున్నారు.  మరి మీరింత గొప్ప సినిమా హీరో  ఎలా అయ్యారు?  కొంచెం ఆ వివరాలు మా ' ఊ టి.వి. ' ప్రేక్షకులకు చెబుతారా?' ' తప్పకుండా చెబుతానండీ.'
***************  

          ' ఆంటీ!  మా మమ్మీ ఈ వారం పత్రిక ఆంధ్రరత్న ఇమ్మన్నారు.' అంటూ పక్కింటి రాజేశ్వరి గారమ్మాయి, పదేళ్ళ స్వాతి వచ్చి అడిగింది.సుమిత్ర, రాజేశ్వరి ఎంతో స్నేహంగా వుంటారు.  అందరూ స్కూళ్ళు, ఆఫీసులకి వెళ్ళాక పని పూర్తి చేసుకుని కబుర్లలో పడతారు.  టి.వి.లగురించి, వాటివల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయని, క్రికెట్, దేశరాజకీయాలు, సినిమాలు, ఇలా దేశంలో జరిగే అన్ని విషయాలూ చర్చించుకుంటారు.  అసలు వాళ్ళు మాట్లాడుకోని విషయం వుండదేమో.  ఎక్కువగా సుమిత్ర వీటి గురించి మాట్లాడుతుంది.  రాజేశ్వరిది వినడం వంతు.సుమిత్ర ఇంట్లో చిన్న పోర్టబుల్ టి.వి. వుంది.  పిల్లల చదువులు పాడవుతాయని కేబుల్ కనెక్షను తీసుకోలేదు.  పెద్దాడు వాసు టెంత్ లోకొచ్చాడు.  చిన్నాడు శ్రీకాంత్ సెవెంత్.  ఒకడ్ని డాక్టరు, రెండవ వాడిని ఇంజనీరు చదివించాలని ఆవిడ తాపత్రయం.  ప్రతి రోజు ఇద్దరూ స్కూల్ నించి రాగానే ఏదో టిఫిను పెట్టి, కాసేపు వాళ్లని ఆడుకోనిచ్చి, తరవాత దగ్గరుండి చదివిస్తుంది.  తొమ్మిది కొట్టగానే భోజనం పెట్టి, మళ్ళీ ఓ గంట చదివించి, టి.వి.లో ఏమన్నా విజ్ఞాన విషయాలు వస్తే చూడమంటుంది.  మళ్ళీ తెల్లవారుఝామున నాలుగ్గంటలకే లేపేసి చదివిస్తుంది.  వాళ్ళు నిద్రమొహాల్తో తిట్టుకుంటూ, జోగుతూ ఎలాగో చదువుతారు.  తల్లి ఏ పనిలోనో వుంటే, ' అమ్మయ్య ' అనుకుంటూ ముసుగు తన్ని పడుకుంటారు.  ఆవిడ కేకలు పెట్టగానే గమ్మున లేచి, ఆమె పెట్టిన టిఫిన్ తిని, ఇంకా ఎన్నేళ్ళు చదవాలిరా బాబూ ఈ చదువు అనుకుంటూ బధ్ధకంగా స్కూలుకి బయలుదేరతారు.  ఇదీ ఆ బుధ్ధిమంతుల రోజువారీ దినచర్య.  సుమిత్ర ఎం.ఏ చదివినా ఇంట్లో పని, పిల్లలని చదివించడం కుదరదని, వచ్చిన ఉద్యోగం కూడా మానుకుంది.  పిల్లలు వెళ్ళాక సుమిత్ర ఇంటిపని ముగించుకుని, ఆ వారం వీక్లీలన్నీ తిరగేస్తుంది.  సుమిత్ర, రాజేశ్వరి కలిసి వీక్లీలన్నీ కొంటారు.  సుమిత్ర కొననివి రాజేశ్వరి కొంటుంది.  రాజేశ్వరి కొననివి సుమిత్ర కొంటుంది. ఆ వీక్లీలలో పిల్లలు చదవకూడని, దాంపత్యం గురించిన ప్రశ్నలు, అశ్లీలపు సినిమా బొమ్మలు, ఇలా పెద్దవాళ్ళకి సంబంధించిన శీర్షికలు, అన్నీ చింపగా, ఆ పుస్తకం అట్టతో కలిపి ఆరు పేజీలకి వస్తుంది. ఆ ఆరు పేజీల పుస్తకం ఆ వారం వీక్లీ రత్నావని, ఆంధ్రమాల రాజేశ్వరి కూతురు స్వాతికిచ్చి పంపింది.  మిగతా చింపిన పేజీలు రాజేశ్వరికిచ్చింది. ' నీ పిచ్చిగాని, సుమిత్రా!  నువు పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెట్టినా బైటి వాతావరణం ఎలా వుందో వాళ్ళకి తెలీదూ?  ఈ పుస్తకాలు వాళ్ళ ఫ్రెండ్సిళ్ళలోనో, ఇంకో రకంగానో చదవకుండా వుంటారా?  ' ఆరు పేజీల పుస్తకం పది రూపాయలేమిటమ్మా?  పేజీ రూపాయికన్నా ఎక్కువా?' అంటూ మా స్వాతి నవ్వుకుంది.  నేనూ అలాగే మొన్న ' ఖ్యాతి ' పత్రికలో పిల్లలు చదవకూడదని ఏదో ఘోరంగా వుంటే, ఆ పేజీ చింపేసాను.  తీరా ఆ పుస్తకం అంతకు ముందరే వాళ్ళ ఫ్రెండింట్లో మా స్వాతి చదివిందని తెలిసింది.  నువ్వు పుస్తకాల్లో పేజీలన్నీ చింపేసి సెన్సారు చేస్తున్నావు గాని, అవన్నీ మనకన్నా ముందరే పిల్లలు చదివేసి వుంటారు.  పిల్లల్ని ఎంత కంట్రోల్లో పెట్టాలన్నా వాళ్ళకి అన్ని విషయాలూ మనకన్నా ఎక్కువే తెలుసు.  నువ్వు కంట్రోల్లో పెట్టిన కొద్దీ ఆసక్తి ఎక్కువై వాళ్ళలో వున్న కోరికలు, ఆశలు ఏదో ఒకరోజు ఒక్కసారిగా పడగ విప్పి బుస్సున కాటేస్తాయి.  అప్పుడు నిన్ను కూడా లెఖ్ఖ చేయని పరిస్థితి వస్తుంది.  వాళ్ళని చదివిస్తూనే, తగిన స్వేఛ్ఛని కూడా ఇవ్వాలి.  ఇంట్లో కేబుల్ లేనందున ఫ్రెండ్సిళ్ళలో చూడటానికి అలవాటు పడతారు.  అదే నీ ఇంట్లో వుంటే కొత్తలో చూస్తారు.  తరవాత పెద్దగా పట్టించుకోరు.  వాళ్ళు టి.వి. చూడకూడదని, పత్రికలు చదవకూడదని ఎందుకనుకుంటావు?  వాళ్ళకి తగినంత స్వేఛ్ఛ ఇస్తే మంచి, చెడు వాళ్ళే తెలుసుకుంటారు.' ఇంతలో సుమిత్ర కొడుకు వాసు కోపంగా వచ్చాడు.  పుస్తకాల సంచి టేబుల్ మీదకి విసిరేసాడు. సుమిత్రకి కంగారొచ్చింది.  పరీక్ష సరిగా రాయలేదేమోనని.  అక్కడికీ రాత్రి అన్నీ కూచోబెట్టి చదివించింది. ' ఏరా, పరీక్ష సరిగ్గా రాయలేదా?' ' ఇవాళ ' ఊ టి.వి.వాళ్ళు క్విజ్ కండక్ట్ చేసారు.' ' 1. బాలసుబ్రహ్మణ్యానికి సౌందర్య కోడలిగా నటించిన చిత్రమేది?' ' 2. పొద్దస్తమానూ తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?  మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి.' ఈ సంభాషణ చెప్పిన నటుడు ఎవరు, ఏ చిత్రంలో?' ' 3. ముమైత్ ఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రమేది?' ' 4. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవుతుందో, వాడే పండు.'  ఈ డైలాగు ఏ చిత్రంలోనిది?' ' 5. నాగేశ్వరరావు నారదుడిగా నటించిన చిత్రమేది?' ' 6. ' సండే అననురో, మండే అననురో, ఎన్నడు నీదానరో' ఈ పాట ఏ చిత్రం లోనిది?' ' 7. ఎన్.టి.ఆర్. నటించిన మొదటి చిత్రం ఏది?' ' 8. ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించిన హీరోయిన్లుగా వేసిన ఇద్దరి పేర్లూ ఏమిటి?' ' 9. మానాన్నకి పెళ్ళి చిత్రానికి మాటల రచయిత ఎవరు?' ' 10. య, ర, ల, వ తర్వాతి అక్షరాలు ఏమిటి?' ఇవీ, వాళ్ళిచ్చిన ప్రశ్నలు!  అందరూ చాలా బాగా చెప్పారు.  నేనొక్కణ్ణీ ఏమీ చెప్పలేకపోయాను.  మనింట్లో అన్నీ ఆంక్షలేగా?  టి.వి. చూడకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు.  ఎక్కడ చెడిపోతామో అని నీ భయం.  అందరిళ్ళలో కేబుల్ టి.వి.లున్నాయి.  వారపత్రికలూ చదువుతారు, సినిమాలూ చూస్తారు.  అందుకే వాళ్ళకి జనరల్ నాలెడ్జి బాగా వుంది.  వాళ్ళేమన్నా చెడిపోయారా?  నీలా వాళ్ళిళ్ళల్లో ఆంక్షలు పెట్టరు.' తల్లితో కోపంగా అన్నాడు వాసు. ' ఏరా వాసూ?  య ర ల వ తర్వాత అక్షరాలు కూడా నీకు తెలీవా పోనీ?' ' ఆ.  అదొక్కటే చెప్పాను.  మిగతా వాళ్ళు ఆ ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ చెప్పారు.' ఆ సాయంత్రం సుమిత్ర భర్త రాఘవ వస్తూనే పెద్ద టి.వి. కొని తెచ్చాడు.  వెంటనే వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టి, కేబుల్ కనెక్షను కూడా తీసుకున్నాడు. ' ఏమండీ!  ఏమిటిది?  పిల్లల చదువులు...........' ' ఇంక నువ్వేం మాట్లాడకు సుమిత్రా!  ఇందాక వాసు మాస్టారు కనిపించి, ' ఏమండీ, మీ అబ్బాయి బాగా చదువుతాడు.  ఎంతో తెలివైన వాడు అనుకుంటే, ఇవాళ ఊ టి.వి.వాళ్ళు కండక్ట్ చేసిన క్విజ్ లో ఒక్క ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పగలిగాడు.  అన్నీ ఈజీ ప్రశ్నలే కదా!  రోజూ టి.వి.ల్లో వస్తున్న విషయాలే కదా?  అందరూ చకచకా చెబుతూంటే, మీ అబ్బాయి ఒక్కడూ దిక్కులు చూస్తూ కూచున్నాడు.'  ఇలా మాస్టారు అనేసరికి నా తల తీసేసినట్టయింది సుమిత్రా!  అప్పటికీ, ఇప్పటికీ రోజులు మారాయి.  చదువులు మారాయి. మనుషులూ మారారు.  కాలం మారుతోంది.  కాలంతో పాటు మనమూ మారాలి.  అందుకే నువ్వూ మారు.  వాళ్ళ గురించి టెన్షను పెట్టుకోకు.  ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది.' నచ్చజెప్పాడు భర్త. ఇంతలో స్కూలు నించి రెండో కొడుకు వచ్చి, కొత్త టి.వి. కేబుల్ కనెక్షను చూసి, ' అమ్మయ్య, ఇప్పటికైనా పెట్టించారు.  ఇవాళ అంత్యాక్షరి పాటల పోటీలో ఒక్కటీ పాడలేకపోయాను.' అంటూ కాళ్ళు కూడా కడుక్కోకుండా, అన్న వాసు చేతిలోంచి రిమోట్ లాక్కుని టి.వి.ముందర కూచున్నాడు.  తల్లి అన్నం తినమని పిలిచినా వాళ్ళకి వినిపించలేదు.  అన్నం కలిపి తీసుకొచ్చి, వాళ్ళు టి.వి. చూస్తూంటే బలవంతంగా తినిపించింది సుమిత్ర.  ఆ ఇద్దరు సుపుత్రులు ఎంత చెత్త ప్రోగ్రాములు కళ్ళప్పగించి చూస్తున్నా సుమిత్ర ఏమనలేక పోయింది.  అలవాటుగా తెల్లవారుకట్ట పిల్లల్ని నిద్రలేపి చదివిద్దామని వచ్చిన సుమిత్రకి ఎప్పుడూ విసుగుతో తిట్టుకుంటూ లేచే సుపుత్రులిద్దరూ ఇంకా టి.వి. చూస్తూనే వున్నారు.  టి.వి.లో వచ్చే జుగుప్సాకరమైన సన్నివేశాలకు బాధగా కళ్ళు తుడుచుకుంది.  ఎక్కడ వాళ్ళ జనరల్ నాలెడ్జి దెబ్బ తింటుందోనని ఏమనలేక పోయింది సుమిత్ర.  ఇద్దరికీ రాను రాను సినిమాల మీద వ్యామోహం పెరిగింది.  ' వై ' ఛానెల్ వాళ్ళు నిర్వహించిన నూతన నటీనటుల పోటీలో సెలక్టయ్యాడు వాసు.  మొదటి చిత్రంలోనే మంచి పేరు రావడంతో బిజీ నటుడైపోయాడు.  తమ్ముడు సినీపాటల రచయిత అయ్యాడు.
**************

          ' అంటే మీరు సినీహీరో అవడం చాలా చిత్రంగా జరిగింది.  ఐతే చివరిగా ఒక ప్రశ్న.  మీ కిష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరు?'' నాకిష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరూ లేరు.  ఆ మధ్య సినిమా షూటింగ్ కి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, సిడ్నీలో ఒకరింట్లో పాతచిత్రాలు చూసాను.  ' వెలుగునీడలు ', ' సిరిసంపదలు ', ' పూజాఫలం ;, ఇంకా ఎన్.టి.ఆర్. గారి సినిమాలు, అవన్నీ చూస్తుంటే సావిత్రిగారు మహానటి అనిపించింది.  ఆవిడని అంత మహానటిగా అందరూ ఎందుకు చెప్పుకుంటారో, ఆవిడ నటన చూసాక అర్థమైంది.  అటువంటి మహానటి మరొకరు లేరు, ఉండబోరు.  తరవాత, హీరోల విషయానికి వస్తే, ఇప్పుడన్నీ మూసలో పోసిన చిత్రాలే కనక ఎవరికీ తమ నటనని ప్రదర్శించే అవకాశమే రావడం లేదు.  ఇదివరకు ఎన్.టి.ఆర్. గారు, నాగేశ్వరరావు గారు, ' సీతారామకళ్యాణం ', ' లవకుశ ', ' దేవదాసు ', ' విప్రనారాయణ ' లాంటి చిత్రాలలో వెరైటీగా వుండే ఛాలెంజింగ్ పాత్రలు తపోదీక్షతో చేసారు కనక వారి కీర్తి అజరామరమైంది.'' చాలా సంతోషమండీ కమల్ గారూ!  మా ' ఊ టి.వి.' ప్రేక్షకులకి ఎన్నో విషయాలు చెప్పారు.' ' ఊ టి.వి. ప్రేక్షకులకి, నన్ను పరిచయం చేసిన ఊ టి.వి. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.'
****************  

          టి.వి.లో ఇంటర్వ్యూ చూసిన సుమిత్రకి తన కొడుకు పెద్ద సినీహీరో అయినందుకు సంతోషించాలో, డాక్టరవనందుకు బాధపడాలో అర్థం కాలేదు.  ఒకప్పుడు రాజేశ్వరి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.  రాజేశ్వరి కొడుకు డాక్టరు, కూతురు ఇంజనీరు అయ్యారు.  సుమిత్ర ప్రఖ్యాత హీరోకి, ప్రఖ్యాత సినీ బూతుపాటల రచయితకి తల్లి అయింది.
*****************

No comments:

Post a Comment

Pages