ఇలా ఎందరున్నారు ?- 5
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ లో సెకండ్ అవర్ లేకపోవడంతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సంకేత, పల్లవి, ఇతర స్నేహితులు. ఇక చదవండి... ) "మా రూం అమాయిలు కూడా శివాని దగ్గరకి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుందాం! అని వెళ్తుంటారు... లాప్ టాప్ లతో పనిలేకుండా ప్రాజెక్ట్ వర్క్ చెయ్యలేమా? నోర్లు మూసుకొని కళ్ళప్పగించి కంటిన్యూస్ గా లాప్ టాప్ ముందు కూర్చోవాలా?" అంది హిందు. “నువ్వు ప్రతిదీ నీ వైపు నుండే ఆలోచిస్తుంటావు హిందూ..! అందుకే నిన్నెవరూ పట్టించుకోరు....దానివల్ల నీకేం నష్టం ?ఇప్పటి ట్రెండ్ కి శివాని లాంటి వాళ్ళే కావలి. అందుకే తనదగ్గరకి వెళ్తుంటారు అందరూ... దాన్ని పేరంట్స్ ఆపలేరు. లెక్చరర్స్ ఆపలేరు. చివరకి ప్రొఫెసర్లు, హెచ్. ఓ. డి లు కూడా ఆపలేరు. అసలు ఇలాంటి విషయాలు వాళ్ళదాకా వెళ్ళనే వెళ్ళవు....సీక్రెట్ ! సీక్రెట్!” అంది పల్లవి. “నాకేం నష్టం లేదు. ఆ చూసుకొనే లాప్ టాప్ ఏదో తన బాయ్ ఫ్రెండ్ రూం లోనే చూసుకోవచ్చుకదా! దాన్ని హాస్టల్ కి తేవడం.. చదువుకొంటున్న అమ్మాయిలకి చూపించి వాళ్ళను పాడు చేయడం...అవసరాలకోసమో, అభిరుచులకోసమో, ఎంపిక చేసుకున్న బాయ్ ఫ్రెండ్ ని వాడుకున్నట్లే హాస్టల్లో విద్యుత్ ని వాడుకోవటం.... నాకెందుకో నచ్చటం లేదు...మనం ఎకాడెక్కడ నుంచో వచ్చి హాస్టల్లో వుండి చదువుకుంటున్నాం. మన తలిదండ్రులు మన మీద ఖర్చు పెడుతున్న ప్రతి పైసా పై వాళ్ళకెన్నో ఆశలు వుంటాయి. మనం చేసే ప్రతి పనికి ఫలితం రూపం లో ఎప్పుడో ఒకప్పుడు బయటకి వస్తుందట. అది నష్టం రూపంలో కాని, లాభం రూపం లో కాని. అందుకే మనం మన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోవాలి. హాస్టల్ని సద్వినియోగం చేసుకోవాలి. క్లాసు లో చెప్పేవన్నీబుర్రలోకి శ్రద్ధగా నింపుకోవాలి....అంతే కాని శివానిని గైడ్ గా తీసుకోవద్దు." అంటూ ఆగింది హిందూ. "నీ దిక్కు మాలిన సలహాలతో మా ఆనందం పై నీళ్ళు చల్లకు....ఇప్పటికే శివాని లాప్ టాప్ కి మేమంతా ఎడిక్ట్ అయ్యి వున్నాం.....అది ఒక్క రోజు లాప్ టాప్ తేకపోతే కొకైన్ డ్రగ్ తీసుకోకపోతే నరాలు గుంజి నట్లుంటుంది. మా పరిస్థితి" అంది హెడ్ సెట్ అమ్మాయి. "కాదు. ఫస్టియర్లో వున్న పర్సంటేజ్ శివానికి ఈ ఇయర్లో లేదు...!అది చూడు ముందు". అంది పల్లవి హిందూని సపోర్ట్ చేస్తూ. “నీకో విషయం చెప్పనా? మన సూపర్ సెనియర్ లావణ్య బి. టెక్ మొత్తం నరాలు తెగిపోయేలా చదివి కాలేజి ఫస్ట్ వచ్చింది. చివరకు ఏమైంది. హౌస్ వైఫ్ అయ్యింది. చదివిన చదువును ఆకు కూర కట్టలా ఫ్రిజ్ లో ఓ పక్కన పెట్టింది. మీ అమ్మలాగా, మా అమ్మలాగా అదే వంట, అదే గ్యాస్టౌ,అదే ప్రపంచం అన్నట్లు కలిసిపోయింది. రేపు శివాని కూడా అంతే! దానికి కూడా లావణ్యకి వచ్చినట్లే ఏ సాఫ్ట్ వేర్ ఇంజినీరో, మిలియనీరో భర్తగా వచ్చాడే అనుకో ! వుద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే వుండిపోవలసి వస్తుంది. ఆ మాత్రం దానికి ఇప్పుడు సోషల్ సింబల్ గా అనిపిస్తున్న బాయ్ ఫ్రెండ్స్ ని, వాళ్ళు గిఫ్ట్ గా ఇస్తున్న టచ్ స్క్రీన్ ఫోన్లని, లాప్ టాప్ లని వదులు కోవాలా? అలా అని సిన్సియర్ గా చదివే వాళ్ళని ఆపగలుగుతున్నామా? ఎవరి లోకం వాళ్ళది. ప్రపంచం మొత్తం శివానియే అయినట్లు మాట్లాడక నీలాంటివాళ్ళున్నారు, నాలాంటి వాళ్ళున్నారు, శివాని లాంటి వాళ్ళున్నారు. పురాణాల నాలెడ్జి నాకు అంతగా లేదు కానీ సత్య హరిశ్చంద్రుడు అంతటి రాజే అబద్దాలు ఆడాడట. సామాన్యులు మనమెంత అంటూ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు. అందుకే శివాని ఆడే అబద్దాలకి అంత తప్పు లేదు..." అంది హెడ్ సెట్ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఇంకో అమ్మాయి. అమితాశ్చర్యంతో హిందూ టక్కున లేచి "తప్పు లేదా! యద్భావం తద్భవతి! మనం ఏది కావాలని అనుకుంటామో అదే అవుతాం! సైంటిస్ట్ కావాలని కష్టపడి రైటర్స్ లా రాయగలమా? ఇంజినీరింగ్ చదివి డాక్టర్ లా వైద్యం చెయ్యగలమా? దేంట్లో కృషి చేస్తే దానికి సంబంధించిన ఫలితాలే వస్తాయి". అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది. అందరూ మౌనంగా వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. తరువాత క్లాస్ మొదలు కావటం తో లెక్చరర్ రూం లోకి వచ్చాడు. కాలేజి వదిలాకా - ఇంటికెళ్ళింది సంకేత. నీలిమ ఇచ్చిన కాఫీ తాగి డాబా మీదకి వెళ్ళి కొద్ది సేపు అటు ఇటు తిరిగింది... ఎంత తిరిగినా ఒంటరిగా అనిపిస్తోంది. ప్రస్తుతం తన సమస్య డబ్బు! ఇప్పుడు తనేం చెప్పినా వినే వాళ్ళు కాదు. హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ ఎప్పుడో అయిపోయింది. రికార్డ్ షీట్స్ కావాలి. డ్రాయింగ్ షీట్స్ కొనాలి. మెటీరియల్ జిరాక్స్ తీయించాలి. ఆ మధ్యన లాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్విప్మెంట్ డామేజ్ అయింది. దానికి తను డబ్బు కట్టాలి. డబ్బు కట్టడానికి వాళ్ళు ఇచ్చిన ఆఖరు తేదీ అయిపోయింది. వెంటనే కట్టాలి. చేతిలో రూపాయి లేదు. శివరామకృష్ణ అంకుల్ ని అడిగితే ఇస్తాడు. ఆయన ఊరిలో లేడు. శ్రీహర్ష ను అడగడం ఇష్టం లేదు. ఆంటీ అడిగినా ఇవ్వదు. నీలిమ దగ్గర డబ్బులు ఉండవు. వరమ్మ అంతకన్నా దరిద్రం. ఇప్పుడెలా? డబ్బు కోసం తనేం చెయ్యాలి? ఎవరిస్తారు తనకి? తండ్రి నిస్సహాయత తనకి తెలియంది కాదు. వర్షాలు లేక పొలం లో పనులు లేవని బాధ పడుతున్నాడు. తల్లి మాత్రం ఏమి చేయగలదు ? నిన్ననే హిందూ కూడ అడిగింది. లాబ్ లో కట్టల్సిన ఫైన్ కట్టావా? అని....అసలు ఆ రోజు హిందూ వచ్చి... "ప్లీజ్! మేడం ! ఆ ఫైన్ని అక్స్పెరిమెంట్ చేస్తున్న ముగ్గురికి షేర్ చెయ్యండి! సంకేత ఒక్కతే కట్టలేదు. పైగా ఎక్స్పెరిమెంట్ ని ముగ్గురు కలిసే కదా చేసుకోవాలి" అంటూ మేడం తో మాట్లాడి తనకెంతో సహాయం చేసింది. ఇప్పుడీ ఫైన్ డబ్బుల్ని కూడా హిందూని అడగాలంటే ఏదోగా ఉంది. ...హిందూ తప్ప తనకేవరిస్తారు? తెల్లవారి .....హిందూ కోసం హిందూ ఉంటున్న హాస్టల్ కి వెళ్ళింది సంకేత. హిందూ హాస్టల్ లో లేదు. దురదృష్టం అనుకొని బాధపడుతూ ఆ గది లోంచి బయటకి వచ్చింది సంకేత. పక్క గదిలో ఉన్న పల్లవి సంకేతను చూసి "హాయ్ ! సంకేతా!" అంది. "హాయ్!" అంటూ నవ్వింది సంకేత. తను హిందూ కోసం వచ్చినట్లు చెప్పింది. "పల్లవి ఆశ్చర్య పోతూ "హిందూ ఊరెళ్ళింది నీకు తెలియదా?ఓ...నీకు చెల్ ఫోన్ లేదు కదా! అందుకే ఎప్పటి ఇంఫర్మేషన్ అప్పుడు నీకు తెలియటం లేదు....రా! మా గది లో కూర్చుందాం!" అంటూ ఆప్యాయంగా పిలిచి సంకేత ను తన గది లోకి తీసుకెళ్ళింది. నిరుత్సాహంగా, దిగులుగా ఉంది సంకేతకి...ఏం చేయాలో తోచటం లేదు. మూభావంగా ఉన్న సంకేతను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది పల్లవి. ...ఆ రూంలో ఉండే అమ్మాయిలు కొందరు సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ ఎవరి ప్రపంచంలో వాళ్ళున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్లన్నీ కలర్ పీస్లు ....'బ్రాండ్ మొబైల్లు...నోకియా, సాంసంగ్, సోనీ ఎర్రిక్సన్, మోటరోలా, బ్లాక్ బెర్రి, ఎల్జీ, హెచ్.టి.సి., ఇవి మన దేశంలో ఉత్పత్తి చేయబడ్తూ మనకే అమ్ముతున్న మనవి కాని బహుళ జాతి కంపనీల బ్రాండ్లు....అంతే కాదు ఆ బ్రాండ్లలో వాళ్ళు వాడుతున్న మొబైల్స్ చాలా ఖరీదైనవి... చూడగానే ఇవి మాకుంటే బావుండనిపించేలా ఉన్నాయి. .....దేనికైనా ఆసక్తి పెరిగే వయస్సు కావడం వల్ల మనసులో ఉన్న బాధని, వచ్చిన పనిని మర్చిపోయి వాళ్ళనే చూస్తోంది సంకేత. సంకేత చూపుల్ని అర్ధం చేసుకొని "ఇవాళ మన సీనియర్ అనంత్ ది బర్త్ డే పార్టీ ఉంది. చాలా గ్రాండ్ గా హోటల్ రాధిక లో ఇస్తున్నాడు. వాళ్ళు కాస్త ముందుగా వెళ్ళలని తయారవుతున్నారు. మేము కూడా వెళ్ళాలి ! నువ్వు కూడా వస్తావా? " అంది పల్లవి. ఉలిక్కి పడి "నేనా?" అంది సంకేత. పల్లవి ఆశ్చర్యపోతూ ఒకక్షణం మౌనంగా ఉండి ఆ తరువాత సంకేతతో "నిన్ను అనంత్ పిలవలేదని ఆలోచిస్తున్నావా? అతను మన సీనియరే కదా! పిలవక పోయినా వెళ్ళొచ్చు. ఇంకా సంతోష పడతాడు. మా హాస్టల్లో చాలా మందిని పిలవలేదు. అందరం వెల్తున్నాం. అతని వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగం రావచ్చు. భవిష్యత్తును ఎవరు చూసొచ్చారు?" అంది. "అబ్బయిలతో ఏం అవసరాలుంటాయి?" అంది సంకేత. "నువ్వు ఈకాలం లో పుట్టిన అమ్మాయిలా మాట్లాడట్లేదు. బహుశా నువ్వు నమ్ముతావో లేదో మనలో చాలా మంది అమ్మాయిలు ఇంటి నుంచీ బయటకి వచ్చి ఇంత ప్రశాంతం గా ఇంత నిశ్చింతగా చదువుతున్నారు అంటే దానికి కారణం మన కాలేజీ లో కొంత మంది అబ్బాయిలు ఇచ్చే ధైర్యం హామీ" అంది పల్లవి. సంకేత ఆశ్చర్య పోతూ "తల్లిదండ్రులు పంపే డబ్బు కాదా" అంది. "తల్లిదండ్రులు పంపే డబ్బు తో సరిపెట్టుకొనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సంకేతా! వాళ్ళు కూడా చిన్న చిన్న అవసరాలకు పక్కమ్మాయిల దగ్గర చేయి చాపు తూనే ఉంటారు. ఖర్చులు పెరిగాయి, అవసరాలు పెరిగాయి. వీటిని ఎంతమంది తల్లిదండ్రులు అర్ధం చేసుకుంటున్నారు? అర్ధం చేసుకున్నా ఆర్ధికస్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఆర్ధిక స్తోమత బాగా ఉన్న వాళ్ళేమో ఒక దాన్ని మించింది ఒకటి కొంటూ పక్కవాళ్ళ మెదళ్ళ తీటకి కారణం అవుతున్నారు" అంది పల్లవి. "నువ్వు నోరు మూయవే . తీట రోత అంటూ నోటికొచ్చిన పదాలను వాడి బ్రతుకు మీద విరక్తి పుట్టేలా చేస్తున్నావు. ఇప్పుడు మనం ప్రేమించే వయస్సు లో ఉన్నాం. మనిషంటే మనిషి పడిచచ్చే వయస్సులో ఉన్నాం. ఈ వయస్సు దాటాకా, నీకోసం ఏదైనా చేయడానికి ఎవరూ ఉండరు. సపోజ్ నీకు పెళ్ళయ్యాకా నీ భర్త కూడా నేకేమీ చెయ్యకపోవచ్చు. చెయ్యకపోయినా అన్నీ చేతాడన్న భ్రమ తో కొద్ది రోజులు, బిజీగా ఉండి చేయలేదులే అన్న భరోసా తో కొద్ది రోజులు, రితైర్ అయ్యాకా నేనే లోకం గా ఉంటాడన్న నమ్మకం త కొద్ది రోజులు గడిపేస్తావు. ఆ తర్వాత గాని తెలిసిరాదు నువ్వేం కోల్పోయావో." అంది శివాని. సంకేత కళ్ళతో పాటు మనసు కూడా అప్పజెప్పి వింటోంది. సంకేత ముఖకవళికల్ని ఆశ్చర్యపోయి గమనిస్తూ... "దీని మాటలు వినకే సంకేతా! ఇదేం చెప్పబోతుందో నాకు తెలుసు. దీనికో బాఇ ఫ్రెండ్ ఉన్నాడు. అందరికి అలానే ఉండాలంటుంది. అంతే కాదు. దీని బాయ్ ఫ్రెండ్ దీనికో పాముని చూపించి ఇది పాము కాదు శివాని ! బెల్ట్ అన్నా నమ్మి నడుం కి పెట్టుకుంటంది. 'నువ్విక్కడే కూర్చో నక్షత్రాలను తెచ్చి నీ చున్నీలో పోస్తా' అన్నా అతనొచ్చేంతవరకు అక్కడే కూర్చుంటుంది నక్షత్రాల కోసం...అతన్ని ఏది అడిగినా తెచ్చి ఇస్తాడని నమ్ముతుంది. కాబోయే భర్త కన్నా బాయ్ ఫ్రెండే గొప్పవాడు అంటుంది. భర్తలెప్పుడూ మంచి వాళ్ళు కాదని దానికి ఉదాహరణగా వాళ్ళ నాన్న గురించి చెపుతుంది. మారుతున్న రోజులతో మనం కూడా మారాలని అంటుంది. అవన్నీ ఒట్టి మాటలు. రోజులు మనం అనుకున్నంతగా ఏం మారడం లేదు సంకేతా! ఇదే మార్చేస్తోంది రోజుల్ని...." అంది పల్లవి శివాని కొడుతుందని కాస్త దూరంగా జరిగి. అప్పటికే ఆ గదిలో అమ్మాయిలంతా పార్టీకి వెళ్ళారు.సంకేత, పల్లవి, శివాని మాత్రమే ఆ గదిలో మిగిలారు. ఆ ముగ్గురి మధ్యన మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని చ్చేదిస్తూ "వీళ్ళెవరూ నన్ను అర్ధం చేసుకోరు, నాస్వభావాన్ని నీకు చెప్తాను విను సంకేతా" అంది శివాని. "తొక్కలో స్వభావం! అదిపూడంత అర్జంటా! అదేదో దేశభక్తుల ఆత్మ కధ అనంట్లు బిల్డప్ కాకపోతే! అదసలే మనీ ప్రాబ్లం లో ఉంది. చేతనైతే దాని గురించి ఆలోచించరాదూ!" అంది పల్లవి. "నా దగ్గర డబ్బుల్లేవు, కావాలంటే నా బాయ్ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ లు ఉన్నాయి. అవి ఇస్తాను. వాటిని అమ్ముకుని క్యాష్ చేసుకుంటావా?"అంటూ సంకేత వైపు చూసింది శివాని. ఒక స్నేహితురాలిగా శివానికి తన పట్ల ఉన్న అభిమానానికి కళ్ళు చెమర్చాయి సంకేత కి. కానీ గిఫ్ట్ లు తీసుకోవాలంటే భయం వేసి వెంటనే "అమ్మో! అంటూ తన చేతుని గుండెలమీద పెట్టుకుంది. శివాని సంకేత వైపు విచిత్రంగా చూసి "ఎందుకే 'అమ్మో' అంటూ చేతులతో గుండెలమీద కొట్టుకుంటావు! నీకు పరిష్కారము ముఖ్యమా! హావభావాలు ముఖ్యమా! ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని చోట్లా వర్కవుట్ అవ్వవు. మనమిప్పుడు బి.టెక్ చదువుతున్నాం. ఇదయ్యాకా అవసరమైతే పర్సనాలిటీ కోర్సులు చేస్తాం ! మేనేజ్మెంట్ స్కిల్స్ లో ట్రైనింగ్ పొదుతాం! బాడీ లాంగ్వేజ్ లో టిప్స్ తీసుకుంటాం! ఇప్పటికే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాం....సోషల్ నెట్వర్క్ ను అవగాహన చేసుకున్నాం....పైగా వీటన్నిటికీ కావలసిన కమ్యునికషన్ స్కిల్స్ కూడా మనకున్నాయి. గుండెల మీద చేతులు పెట్టుకొని మన స్కిల్స్ ని మనం అవమానించుకోవడం ఎందుకు చెప్పు!" అంది. శివాని మాటల్ని పట్టించుకోకుండా పల్లవి అనంత్ ఇచ్చే పార్టీ కోసం మేకప్ చేసుకుంటూ ఆర్టిఫీషియల్ గోర్లను ముందున్న ఒరిగినల్ గోళ్ళ మీద అతికించుకొంటోంది. సంకేత శివాని మాటలు వింటూనే పల్లవి వైపు చూసింది. పల్లవి నిన్ననే ఫేషియల్ చేయించుకున్నట్లుంది. ముఖం తేటగా ఉంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా పల్లవికి ఫేషియల్ చేయించుకోవడం అలవాటైయ్యింది. ఇలాగే చేస్తూ పోతే కొంత కాలానికి దీని ముఖం అరిగిపోతుందేమో అన్న ఆలోచన వచ్చి చిన్నగా నవింది సంకేత. శివాని సంకేత వైపు చూడకుండా ఎటోచూస్తొంది. సీరియస్ మూడ్ లోకి వెళ్ళి "సంకేతా! మన మీద ఎవరికి ఏ చిన్న ఫీల్ కలిగినా దాన్ని మనం వెంటనే క్యాచ్ చేయగలగాలి. క్యాష్ చేసుకోగలగాలి. ఎందుకంటే ప్రపంచీకరణ. గ్లోబలైజేషన్ వల్ల వేగం పెరిగి, తెక్నాలజీ పెరిగి, అవసరాలు పెరిగి మనకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. మనమిప్పుడు ఊపిరి పీల్చుకోవాలంటే డబ్బు కావాలి. అది మన దగ్గర లేదు. మా నాన్న దగ్గర ఉన్నా నాకు ఇవ్వడు. సర్దుకు పో అంటాడు. సర్దుకుపోకపోతే చావు అంటాడు. మీ నాన్నకు డబ్బు లేక పోయినా నె మెద ప్రేమ ఉంది. ఆ ప్రేమ తో అప్పుచేసైనా సరే నీ అవసరాలు తీర్చాలని చూస్తాడు. నీకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు ఇబ్బంది పడూతుంటావు...కానీ ఇప్పుడు నెకున్న అవసరం అలాంటి ఇలాంటిది కాదు. కాలేజి లో తప్పనిసరిగా డబ్బులు కట్టాలి. అందుకే నా దగ్గర ఉన్న ఈ గిఫ్ట్ తీసుకెళ్ళు. అది నాకు ఏ విధంగా పనికి రాదు." అందిశివాని. శివాని ఆ మాటల్ని ఓ చోట కూర్చొని మాట్లాడటం లేదు. అటు ఇటూ తిరుగుతూ, తనకి అవసరమైనవి అందుకొని, తనను తాను చక చక అలంకరించుకొంటూ, చురుగ్గా వంగి, లేస్తూ డ్రెస్ మార్చుకొంటూ మట్లాడుతోంది. సంకేత మాత్రం ముందు ఎక్కడ కూర్చున్నదో అక్కడే కూర్చొని వింటోంది. నెమ్మదిగా పెదవి విప్పి "థాంక్స్ శివాని! ఆ గిఫ్ట్ నాకొద్దు. అది నీకు ఎవరో ప్రేంతో ఇచ్చిన కానుక. దాని మీద ఇచ్చిన వాళ్ళ హృదయం ఉంటుంది. హృదయాన్ని పదిలంగా చూసుకోవాలే కానీ అమ్ముకోకూడదు. నా దృష్టి లో ప్రేమించబడడం కానీ, ప్రేమించడం కానె రెండూ అద్భుతాలే. అపురూపాలే. ఎంతైనా అది నీకు ప్రేంతో ఇచ్చిన కానుక". అంది సంకేత. శివాని నవ్వింది. ఆ నవ్వులో ఎలాంటి సున్నితత్వం, నిర్మలత్వం లేవు. అలాగే నవ్వుతూ"నువ్వన్నట్లు ఆ క్షణం లో అది నాకు అతను ప్రమ తో ఇచ్చిందే కావచ్చు. మళ్ళీ అలాంటి క్షణాలు అతనికి చాలా సార్లు వచ్చి ఉంటాయి. నాకు ఇచ్చినట్లే చాఅ మందికి ఇచ్చి ఉంటాడు. ఆశ్చర్యపోకు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడో తప్ప భగ్న ప్రేమలు లేవు. భాష్ప కణాలు లేవు. వెయిటింగ్లు లేవు. ఓదార్పులు లేవు. అంతా వేగంగానే జరిగిపోతుంటుంది. ఒకసారి నచ్చిన వ్యక్తి నచ్చకుండా పోవడానికి అరక్షణం చాలు. మరో కొత్త వ్యక్తి నచ్చడానికి అంతకన్నా తక్కువ సమయమే పడుతుంది. మరి ఈ లోగా మొదటి వ్యక్తి ఇచ్చిన ఈ ప్రేమ కనుకల్ని ఏం చేయాలి? పట్టుకెళ్ళు... అడ్డంగా ఉన్నాయి. నేనెలాగూ ఇక్కడ శుభ్రం చేసేటప్పుడు వాటిని చెత్తలో పడేస్తాను." అని సంకేత తో చెప్పి, పక్కన తయారవుతున్న పల్లవి భుజం పై ఓ తట్టు తట్టి " నేను వెళుతున్నా! ఆలస్యంగా వెళ్తే అనంత్ బాధ పడతాడు. నువ్వు కూడా త్వరగా రా!" అంటూ అనంత్ చేసుకుంటున్న పుటీన రోజు వేడుకకు వెళ్ళింది శివాని. శివాని వెళ్ళాక శివాని బెడ్ వైపు చూసింది సంకేత. అక్కడ ఇంకా కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. కనెసం వాటిని విప్పి చూసిన గుర్తులు కూడా లేవు. నిర్లక్ష్యం గా పడేసినట్లు ఉన్నాయి. దీన్ని బట్టి కొందరు అబ్బాయిలు ఎంత పిచ్చి వాళ్ళో అర్ధమవుతుంది. ఇలాంటి వాళ్ళకి బాధని బట్టే విలువ పెరుగుతుందనీ ఎప్పుడు తెలుస్తుందో ఏమో! సంకేత అంతటితో శివాని గురించి వదిలేసి తనగురించి ఆలోచించుకొంటూ "హిందూ ఎప్పుడొస్తుందో చెప్పిందా పల్లవీ"? అంది. "నాలుగు రోజులు పైనే పట్టొచ్చట. అది ముందుగా అనుకునేం వెళ్ళలేదు. ఇంటి నుండె ఫోన్ రాగానే హడావుడిగా వెళ్ళింది. ఏమైనా పని ఉందా తనతో...? అడిగింది పల్లవి. "డబ్బు కావాలి..." అంటూ ఫైన్ విషయం మళ్ళీ గుర్తు చేసింది సంకేత. "డబ్బు అంటే నా దగ్గర కూడా లేవు. మా హాస్టల్లో అమ్మయిలను అడిగినా వేస్టే! వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళ సెల్ రీచార్జ్ లకే సరిపోతుంది. దీని గురించి మనం పార్టీ కి వెళ్ళొచ్చాకా ఆలోచిద్దాం!" అంది పల్లవి. నా డ్రస్ బాగా లేదు. నేను రాను పల్లవి! అంది. "అదేం పెద సమస్య కాదు. నా డ్రస్ వేసుకో" అంటూ తన డ్రస్ తెచ్చి ఇచ్చింది పల్లవి. సకేతకు కూడా పల్లవితోనే ఉండాలనిపిస్తోంది. ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఊరెళ్ళాలని ఉన్నా, రేపు కాలేజ్ లో ముఖ్యమైన క్లాస్ ఉంది. తను అడగ్గానే ఇవ్వడానికి తండ్రి దగ్గర కూడా డబ్బుల్లేవు. కానీ తను అడగాలే గానీ తన తండ్రి అప్పు చేసైనా తన అవసరం తీరుస్తాడు. వర్షంలో సైతం తడుస్తూ పొలం పనులు చేసే తండ్రి చేత ఇంకా అప్పులు చేయించి, ఆయన్ని బాధపెట్టడం తనకి ఇష్టం లేదు. అందుకే పల్లవి ఇవ్వగానే, డ్రెస్ అందుకుంది సంకేత. వెంటనే డ్రెస్ మార్చుకొని ఫ్రెషప్ అయింది. ఫ్రెషప్ అవుతున్నంత సేపు సంకేత మనసంతా తనకి అవసరమైన డబ్బు చుట్టే తిరుగుతోంది. డబ్బు లేక పోతే ఇంత కష్టమా? ధైర్యంగా ఉండాలన్నా, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా, ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నా డబ్బుతో ఇంత అవసరం ఉంటుందా? ఛ, ఛ తనిప్పుడు అనవసరంగా సమస్యలో ఇరుక్కుంది. ఆ రోజు ల్యాబ్ లో తనెంత జాగ్రత్తగా ఉన్నా పక్కనున్న అమ్మాయి అజాగ్రత్త వల్లనే అలా జరిగింది. "ఏటి! అలోచిస్తున్నావ్! పద! వెళదాం!" అని పల్లవి అనగానే సంకేత ఆలోచన ఆగిపోయింది. ఇద్దరు కలిసి అనంత్ ఇస్తున్న పార్టీకి వెళ్ళారు. ఆ పార్టీ లో అనంత బ్యాచ్ మేట్స్ కాక అతని జూనియర్స్ కూడా ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా అనంత్ మన వాడు అన్న భావన కంపిస్తోంది ఆ వాతావరణంలో. అనంత్ చాలా ఖరీదైన డ్రెస్ లో అందరికన్నా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఫ్రెండ్సందరు అనంత్ ని పలకరించి కౌగిలించుకుంటున్నారు. అమ్మాయిలు కూడా నేరుగా అనంత్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి విషెష్ చెప్పి వస్తున్నారు. వాళ్ళలో కొందరు కూర్చొని, కొందరు నిలబడి అక్కడ వినిపిస్తున్న మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు... సంకేత పల్లవి ఇచ్చినంత ఫ్రీగా అనంత్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయింది. అది గమనించాడు అనంత్! ఆ కరస్పర్శ కూడా అందరిలా అనిపించలేదు. ఆ స్పర్శ లో ఏదో భాష ఉంది. ఏం భాయ అది? అర్ధం కాలేదు. ఒక అమ్మాయి అబ్బాయిని తొలిసారిగా తగిలినప్పుడు కలిగే భయం, ఏదో బెదురు అది. మిగతా అమ్మాయిలలో ఈ ప్రత్యేకత కనిపించలేదు. ఏ అబ్బాయి అయినా అమ్మాయిలో ముందుగా గమనించేది అదే! అప్పుడప్పుడు కనిపిస్తున్నా, సంకేతను ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడ లేదు. ఫ్రెషర్స్ పార్టీ రోజు కూడా సంకేత అందరిలా అనిపించలేదు. స్వేచ్చగా తిరగలేదు. అందుకే ఆ రోజు అతను సంకేతను బాగా గమనించాడు. ఇప్పుడు కూడా ఏదో ప్రత్యేకత ఉందన్నట్లు సంకేత మీదనే తన చూపుల్ని ఎక్కువ సార్లు నిలుపుతున్నాడు. (సశేషం...)
No comments:
Post a Comment