మన్మధునికో ప్రేమలేఖ - అచ్చంగా తెలుగు

మన్మధునికో ప్రేమలేఖ

Share This

మన్మధునికో ప్రేమలేఖ

(కవితకు అమర్చిన చిత్రం : బాపు గారి సౌజన్యంతో... )

 - యనమండ్ర శ్రీనివాస్ 


మనసును మధనపరచు మధురాలోచనలు

వయసుకు గిలిగింతలు పెట్టు మాఘమాస సమయమున

సొగసుల అక్షరమాలిక సాక్షిగ నా ప్రేమను

తెలుసుకొని నా సరసకు త్వరగ రావేలరా ప్రియ మన్మధా

 

వసంత గానమున సుస్వాగత సంబరములు

వాసంత సమీర వీచికన ముదము రేపు పరిమళములు

ఆద్యంత రహితుడగు కృష్ణ లీలా గానములు

చేమంతులు పూబంతులు నీకై వేచియున్నవిరా మన్మధా

 

గ్రీష్మ తాపము ఒకింత ఓపవచ్చునేమొగాని

ఊష్మధ్వనుల విరహ జ్వాలలు ఓపనలవిగాజాలవురా

సూక్ష్మమగు ఈ ప్రేమసూత్రము మరువక

తీక్ష్ణమగు నీ వలపు బాణములు వదలవేలరా మన్మధా

 

వర్షపు చినుకుల సవ్వడులు పుడమితాకగ

హర్షము నిండిన నెమలి నాట్య భంగిమలు చూచినంతనే

కర్షక జీవులమయ్యెదము రార సయ్యాటన

శీర్షము నిండెడి కంబళి చాటు చాలుర మనకు మన్మధా

 

శరత్కాలపు చల్లని వెన్నెల జల్లు కురిసిన

ఆపత్కాలపు రాతిరి వేళయందు మాట వినని వయసు

విపత్తు బారినుండి నన్ను ఓలలాడించరా

నిస్సత్తువ లేక జతకట్టెద నీతొ, జాగు నీకేలరా మన్మధా

 

హేమంతమున గిరి శిఖరముల సాక్షిగ

హిమవంతపు ధవళకాంతుల శోభయందలి ఉత్తేజము

బలవంతముగ బద్ధకమును జోకొట్టగ

రసవంతము చేసెదము నిశీధి పెన్నిధిలు రార మన్మధా

 

శిశిరము తట్టినంతనే ఉత్సాహమునంత

శిధిలము కానీయక ముదమార దరికి చేర్చుకుని ప్రేమ

శిఖరము మీద నిను నిలిపిన, చుంబన

శిక్షార్హము కాదె నీవు నన్ను వీడిన యెడల ఓయి మన్మధా

 

రానున్నది నవ మన్మధనామ సంవత్సరము

కానున్నది నా మది తవ నామస్మరణనానంద భరితము, నీ

తోడున్నది నా ఇహ జీవ సాఫల్య సూత్రము

లేదన్నది నిరుత్సాహము నీవుండగ నా మదిననునిత్యము, మన్మధా

No comments:

Post a Comment

Pages