రక్తకన్నీరు నాగభూషణం
ఆచార్య చాణక్య ( పరవస్తు నాగసాయి సూరి)
నాయకుడు.... ప్రతినాయకుడు.... సినిమాల్లో ఈ రెండు పాత్రలు ముఖ్యమైనవే. అయితే వీళ్లకుండే ప్రత్యేక మేనరిజాలు... మిగతావారితో పోలిస్తే మరింత గుర్తింపు తెస్తాయి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరయశస్సును సాధించిన ప్రతినాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచే పేరు రక్తకన్నీరు నాగభూషణం. విలనిజానికి ఓ ప్రత్యేక పంథాను ప్రవేశపెట్టి... కామెడీ టచ్ ఇచ్చిన ఆయన... తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 19న ఆయన జయంతి. నాటక రంగం నుంచి సినిమా రంగంలో స్థిరపడిన నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే రెండు రంగాల్లో ఏకకాలంలో సమాన ప్రతిభను కనబరస్తూ... బిజీ అయిన వారు కొందరే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచే పేరు రక్తకన్నీరు నాగభూషణం. ప్రతినాయక పాత్రలో సరికొత్త మేనరిజంతో కామెడీటచ్ ని ప్రవేశపెట్టి.... కొత్తఒరవడికి శ్రీకారం చూట్టారు నాగభూషణం. చిన్నతనం నుంచీ నాటకాలపై మక్కువ పెంచుకున్న నాగభూషణం చదువు, ఉద్యోగం, సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా... ఎక్కడా నాటకాల్ని విడిచిపెట్టలేదు. వీటిల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది రక్తకన్నీరు నాటకం గురించే. M.R. రాధా తమిళనాటకాన్ని తెలుగులో రక్తకన్నీరు పేరుతో రాయించి, 2వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు నాగభూషణం. చివరకు ఈ నాటకం పేరే ఆయన ఇంటిపేరుగా మారి రక్తకన్నీరు నాగభూషణమయ్యారు. నటజీవితపు తొలిరోజుల్లో నటించిన పాత్రలు ఆయనకు సరైన గుర్తింపు తేలేదు. అనంతరం ప్రత్యేకమైన ఆయన మేనరిజం నాగభూషణానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సాంఘిక పాత్రలతో పాటు పౌరాణికాల్లోనూ తనదైన ముద్రను వేశారు. విలనిజానికి ఆయన ఇచ్చిన కామెడీ టచ్ తర్వాతి తరాల వారికి ఆదర్శప్రాయమయ్యాయి. అడవిరాముడు, వేటగాడు చిత్రాల్లో రావుగోపాలరావు... నాగభూషణం పంథాను అనుసరించడం విశేషం. అంతేకాదు... దాసరినారాయణరావు, కోట శ్రీనివాసరావులాంటి నటులతో పాటు కొందరు కథానాయకులు సైతం నాగభూషణాన్ని అనుకరించిన సందర్భాలు అనేకం. సినిమాల్లోనూ, నాటకాల్లోనూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరించారు నాగభూషణం. రెండు రంగాల్లోనూ ఆయనకు ఎన్నో సత్కారాలు గౌరవాలు లభించాయి. ప్రముఖ నటీమణులు శారద, వాణిశ్రీలు ఆయన నాటకబృందంలోని వారే. ఇలా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన నాగభూషణం... ప్రతినాయక పాత్రలు ఉన్నంతకాలం చిరస్మరణీయులు.... తెరస్మరణీయులు.
No comments:
Post a Comment