ప్రమద ప్రమిద - మాలతీ చందూర్ - అచ్చంగా తెలుగు

ప్రమద ప్రమిద - మాలతీ చందూర్

Share This
ప్రమద ప్రమిద - మాలతీ చందూర్
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల. 22.02.2015 


1930 లలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నూజివీడు కి చెందిన శ్రీ జ్ఞానాంబ వెంకటేశ్వర్లు దంపతుల ఆరుగురు సంతానంలో ఆఖరున పుట్టిన అమ్మాయికి మాలతి అని నామకరణం చేశారు.. ఆమె పుట్టుకకు గుర్తుగా ఇంటి పెరట్లో మాలతీ తీగెను వేశారు. మాలతీ తీగెతో పాటే పెరిగి పెద్దైన మాలతీ ప్రపంచం గర్వించదగ్గ స్త్రీవాద రచయిత్రిగా ఎదిగారు. తెలుగు భాషకు, తెలుగు మహిళకు పట్టాభిషేకం చేశారామె. ఆమే ప్రముఖ నవలా రచయిత్రి, కేంద్రసాహిత్య అకాడామీ అవార్డు గ్రహీత శ్రీమతి మాలతీ చందూర్. నిన్న మొన్నటి వరకూ తెలుగు తెలిసి, ఏ కొద్దిపాటో చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలిసిన రచయిత్రి మాలతీ చందూర్. మహిళల మానసిక వికాసానికి తన రచనలతో ఎనలేని కృషి చేసిన మాలతో చందూర్ గారి గురించి ...బహు కొద్దిగా.. జీవితాన్ని కాచి వడబోసిన మాలతీ గారికి ముగ్గురు అన్నయ్యలు . ఇదరు అక్కయ్యలు. పెద్దక్క సీతాబాయి హైద్రాబాద్ లో నివసించేవారు. మద్రాస్ లో టీచరైన రెండవ అక్కగారు శారదాంబ చాలాకాలం మాలతీ గారితోనే కలిసున్నారు. బాల్యం : ముంజెలు చప్పరిస్తూ , ఇసుకలో ఆడుకుంటూ, గోలీషోడా త్రాగుతూ, మొక్కజొన్నపొత్తులు తింటూ, దసరాకి బాలపూజలందుకుంటూ, మామిడికాయలు స్నేహితులతో పంచుకుంటూ అందమైన ఆనాటి బాల్యాన్ని కళ్ళ ముందు నిలుపుకున్న మాలతీ చందూర్.. నూజివీడులోని ఉయ్యూరు రాజావారి దివాణం పక్కనే ఉన్న ఎస్ఆర్ఆర్ పాఠశాల లో 8వ తరగతి వరకు చదువుకున్నారు. అధికంగా ఆమె బాల్యం నూజివీడులోనే ఆనందంగా గడిచింది. నూజివీడులో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. అక్కడ తన మామయ్యగారైన నాగేశ్వర్ రావు చందూరి (చందూర్) ఇంట్లో ఉండి, ఏలూరులోని వల్లూరు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. 
ఏలూరులో మాలతీ గారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వారందరినీ చూసే భాగ్యం ఆమెకు కలిగింది. (ఇక్కడే కొందరు వ్యాసకర్తలు ఆమె గురించి అందించిన సమాచారంలో మేనమామ అయిన చందూర్ గారిని మేనరిక బాల్యవివాహం చేసుకున్నారని,పెళ్ళితర్వాత ఎస్.ఎస్.ఎల్.సి చదివారని .. 'కథావీథీ పత్రిక సంపాదకులు చందూర్ గారని కొంత అస్పష్టత గా చెప్పడం జరిగింది.. ... .. .) అయితే వాస్తవం ఆమె మాటల్లోనే..
 " మా ఊర్లో ఎనిమిదవ తరగతి పూ ర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళాను. అక్కడ మా మామయ్యగారి (చందూర్‌) ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని. ఏలూరులోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరాను. అప్పుడు చందూర్‌ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో మేమున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ చూడడం జరిగింది. 1947లో నేను, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నాం. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నాం. 1947 చివర్లో నేను చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యాం. మద్రాసుకు వచ్చిన తరువాతే ్రపైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశాను. నేను ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు". - ఆన్ లైన్ నాబాల్యం శీర్షికలో ఆమె జ్ఞాపకాల వ్యాసం నుంచి )
 వివాహం : 1947లో మాలతీ, ఆమె మామగారైన చందూర్ గారి తో కలిసి జిటి ఎక్స్ప్రెస్ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్లో దిగి సరదాగా ఒంటెద్దు బండెక్కి జార్జిటౌన్లో తీసుకున్న్ అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో మాలతీ చందూర్ గారినే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. మద్రాసుకు వచ్చిన తరువాతే పైవేటుగా ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. అంతకు మించి ఏమీ చదువుకోని మాలతీ చందూర్ తాను చదివిన జీవితం నుంచి 1949లో తన రచనా వ్యాసంగం ప్రారంభించారు. అప్పట్లో రేడియోలో రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్లో ఉన్న రేడియో స్టేషన్ కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేదిట. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం ఆమెకు కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు ఆమె.. సంతానం లేక పోవడం తో సాహిత్య సేవకే అంకితమయ్యారీ దంపతులు. 
 'జగతి' పత్రిక సాంపాదకులైన ఎన్.ఆర్ చందూర్ (నాగేశ్వర్ రావు చందూరి ) , మహిళా మానసపుత్రి గా మాలతీ ఇరువురూ తమిళదేశంలో తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలందించారు.మద్రాసు మహానగరంలో అడుగెట్టిన తొలినాళ్ళల్లో పురసవాక్కం ప్రాంతంలోని ముక్కద్దాల్ వీథిలో (1947 నుండి 64 వరకు )అద్దె ఇంట్లో నివాసం ఉన్న ఈ సాహితీ జంట,, అనంతరం 1964 లో మద్రాసు లోని మైలాపూర్ ప్రాంతంలో కచ్చేరీ రోడ్డులో నివాసం ఏర్పరచుకున్నారు. రచనా వ్యాసంగం : 1947 లో వివాహమైన మాలతీ... మాలతీ చందూర్ గా మారారు. ఆమె వ్రాసిన మొదటి కథ "రవ్వల దుద్దులు"... ఆంధ్రవాణిలో వచ్చింది. 26 నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారామె. ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి,, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు ప్రాచుర్యం పొందాయి. ఇవి గాక చంపకం,- చెదపురుగులు, శతాబ్ధి సూరీడు, కాంచన మృగం, మధుర స్మృతులు, వంటి నవలలు రచించారామె.. 
 'ఆంధ్రప్రభ' సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం 'ప్రమదావనం' అనే శీర్షికను ఐదు దశాబ్దాలకు పైగానే నిర్వహించారామె. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ, ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. మాలతీ గారు రచించి ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. . తెలుగు శాఖాహార వంటల గురించి "వంటలూ - పిండి వంటలూ" అని మాలతీ చందూర్ వ్రాసిన పుస్తకం తెలుగు నాట ఒక సంచలనమే. ఇది లేని ఇళ్ళు, చదవని ఇల్లాలు లేరంతే అతిశయోక్తి కాదు. పెళ్ళిళ్ళలో సారెలోకూడా ఈ పుస్తకం స్థానం సంపాదించిందంటే ఆ పుస్తకం ఎంతటి క్రేజ్ సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ పుస్తకం 30 సార్లు పునర్ముద్రణ గావించబడింది. ఆ స్థాయిలో తెలుగు రచనల్లో పునర్ముద్రితాలు ఏవెనా ఉన్నాయేమో అని పరికించిన పెద్దలకు విశ్వనాథ వారి ' వేయిపడగలు ' మాత్రమే కనబడింది. మాలతీ చందూర్ రాసే "జవాబులు" ఆడవారితో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా చేసి అపురూపంగా భద్రపరచుకునేవారు.. అప్పట్లో.! "
52 సంవత్సరాలు ఆగకుండా పాఠకలోకాన్ని తన 'ప్రమదావనం' అనే శీర్షికతో అలరించిన ఘనత మరే రాష్ట్రంలోనూ, ఏ భాషలోనూ ఎవ్వరూ సాధించలే"దని మాలతీ చందూర్ కుటుంబానికి సన్నిహితులైన ప్రముఖ కాలమిస్ట్, నటులు గొల్లపూడి మారుతీ రావుగారు.. (వారి జ్ఞాపకాలలో) .. ఉటంకించారు. 'ప్రమదావనం' శీర్షిక గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది కూడా.! స్వాతి వారపత్రికలో "నన్ను అడగండి" కాలం కూడా చాలా కాలం నిర్వహించారామె. భారతదేశ స్వాతంత్ర్యంలో బ్రిటీష్ పార్లమెంట్ లో కూడా ప్రశస్తి కొచ్చిన ఉద్యమం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలోని చీరాల- పేరాల ఉద్యమం. ఆ చీరాల - పేరాల ఉద్యమ నేపథ్యంలో ' 1990 దశకంలో ఆమె వ్రాసిన ' హృదయనేత్రి ' నవలకు ప్రతిష్టాత్మక ' భారతీయ భాషా పరిషత్ ' (కలకత్తా) అవార్డు దక్కింది. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుకూడా ఈ నవల కు లభించింది. ఇదే నవలను "ఇదయ విళిగళ్ " పేరుతో శాంతాదత్ తమిళంలోకి అనువదించారు. 
 ఆమె రచనల్లో మరికొన్ని : వంటలు పిండి వంటలు , అందాలు అలంకారాలు, మహిళలకు మధుర జీవనం, జాబులు జవాబులు, ప్రశ్నలు జవాబులు, వారు వ్రాసిన ముద్రితాలు. తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు మాలతీ చందూర్ గారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి, తమిళ భాష నేర్చుకున్నారంటే అమె శ్రద్ధ, ఆసక్తి ఏపాటియో అర్ధమౌతుంది. తమిళం నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి ప్రముఖ తమిళ రచయితలు శివశంకరి, జయకాంతన్, ఎన్.ఎ.పార్థసారథి, పుళమై పిత్తన్, సుజాత, కలైంజర్ కరుణానిధి తదితరులు చేసినతమిళ రచనలను సైతం మాలతి తెలుగులోకి అనువదించారు. . దాదాపు 11 ఏళ్ల పాటు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. కేవలం పదవతరగతి మాత్రమే చదివి.. 
భర్త చందూర్ మార్గదర్శకంలో, ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈమె.. భర్త చందూర్ గారు వారి 94 ఏట పరమపదించాక బాగా కృంగిపోయారనే చెప్పొచ్చు. . స్త్రీ విజయం వెనుక కూడా పురుషుడుంటారనడానికి ప్రత్యక్ష్య సాక్ష్యం చందూర్ గారు. ఇంతటి తేజోవంతమైన మాలతి గారి జీవితచరిత్రలో చందూర్ గారు లేకుండా ఏమీ లేదనేది నిస్సందేహం అందుకే వారి గురించీ కొద్దిగా.... చందూర్ గారు మృదుస్వభావి, ఎదుటివారితో జగడం అస్సలు ఇష్టపడని వ్యక్తి, . మాలతీ గారిని కూడా సమస్యాత్మకమైన విషయాల జోలికి వెళ్లనిచ్చేవారు కాదు. మాలతీ గారు రాయదలుచుకున్నది రాస్తే.. ఆ రచనలు సరిదిద్ది, ఒక పద్దతిలో కూర్చి ఆయనే , స్టాంపులంటించి పోస్ట్ చేసేవారట. ఎన్.ఆర్ చందూర్ గారు మంచి కథకులు, 'జగతి' పత్రిక సంపాదకులు కూడా. ఆయన వ్రాసిన వాటిల్లో . "వాళ్ళు నలుగురూ..", "సీతతో సినిమాకి" వంటి కథలు వారు బాగా ప్రాచుర్యం పొందాయి. .
 " నెలనెలా తెలుగు సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసే పెద్దమనిషి 'జగతి'. నిజానికి ఈమాట చందూర్ గారికే వర్తిస్తుంది. ఆయన పత్రికా అంతే. అత్యంత ఉదారంగా, గంభీరంగా జీవితంలో మంచి చెడుల్ని సమతుల్యంగా బేరీజు వేసే పెద్దమనిషి చందూర్. సాహితీ ప్రపంచంలో ఎందరో ప్రముఖులకు ఆయనతో ప్రాణస్నేహం. చలం గారు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ శ్రీ, ఆరుద్ర - ఎవరయినా సరే - విశ్వనాధవారన్నట్టు - చెన్నైలో చందూర్ దంపతుల సౌహార్ధాన్ని చవిచూడనివారు అరుదు." అని చందూర్ గారి గురించి తెలిపారు గొల్లపూడి మారుతీరావు గారు తన కాలంలో. అవార్డులు - రివార్డులు: ఎన్నో పురస్కారాలు మాలతీ చందూర్ ని వరించి ఆనందించాయి. 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, 1987లో రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి, పద్మావతీ విశ్వవిద్యాలయం డాక్టరేట్, గృహలక్ష్మి కంకణం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటి పురస్కారాలెన్నో ఆమెను వరించాయి. 
 ఆఖరి శ్వాస : తెలుగు మహిళను పరోక్షంగా చదవడం వైపు దృష్టి మళ్లేలా చేసిన ప్రతిభావంతురాలు, బహు భాషా కోవిదులు, తెలుగు భాషకు కు చివరి క్షణాల వరకూ అహర్నిశలూ సేవ చేసిన ప్రమద ప్రమిద 2013 ఆగస్టు 21 బుధవారం సాయంత్రం 4.30 లకు కాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆమె కోరిక మేరకు భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనలకు అందించారు బంధువులు. " నా వయసు అప్పటికి 8సంవత్సరాలు. ఇక సంక్రాంతి పండగనైతే చాలా సంబరంగా జరుపుకునే వాళ్ళం. సుతార్ల వీధిలోని రామమందిరంలో తెల్లవార్లూ శ్రీ కృష్ణలీలలు నాటకాన్ని వేసేవారు. ఈ నాటకంలో వెన్న చిలికే సన్నివేశాలలో నురగ వస్తుంటే వెన్న వస్తుందేమో తిందామని ఆశగా చూసేదాన్ని. అయితే ఒకసారి నాటకం మొత్తం పూర్తయ్యాక ఆ నురగ వెన్న వల్ల రావడం లేదని కుంకుడుకాయ రసం వల్ల వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ విషయం గుర్తుకువస్తే ఇప్పటికీ నవ్వు వస్తుంటుంది." - అని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మాలతీ చందూర్ గారిలోని ఆ నిశిత పరిశీలనే ఇంతటి ప్రఖ్యాత రచయిత్రిగా మలిచిందేమో అనిపిస్తూ ఉంటుంది..! అంతటి విద్వత్ శిఖామణి గురించి ఎంత వ్రాసినా తక్కువే..! ఆ సరస్వతీ ప్రియ పుత్రిక గురించి వీలైనంత స్పష్టమైన ఆధారిత సమాచారం అందించే భాగ్యం కలిగినందుకు అదృష్టవంతుడిననే భావిస్తున్న! - కరణం. ఉపకరించిన రచనలు : శ్రీ గొల్లపూడి మారుతీరావు జ్ఞాపకాలు (మారుతీయం), గొల్లపూడి కాలం (చందూర్ స్మృతి....) , వికీపీడియా, , ప్రజాశక్తి దినపత్రిక, 22 ఆగస్టు 2013, గురువారం, పేజీ నం. 4లో ప్రచురిత మైన రెంటాల జయదేవ గారి వ్యాసం, ఆగస్టు23 , 2013 నాటి సాక్షి వార్త వ్యాసం, నా బాల్యం శీర్షిక, - (ఆంధ్రజ్యోతి దినపత్రిక లోదనుకుంటా.. ఆన్ లైన్ వారి ఇంటర్వూ), జంధ్యావందనం.కాం , తదితరాలు.
***

No comments:

Post a Comment

Pages