// రుద్రజ్వాల // - అచ్చంగా తెలుగు

// రుద్రజ్వాల //

Share This

 // రుద్రజ్వాల //

          - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల


అదో కార్పొరేట్ స్కూల్ . రాష్ట్రంలో  పేరు ప్రఖ్యాతున్న ఆ స్కూల్ లో .. పదవతరగతి గది....
ఆంగ్ల మాధ్యమమే  ప్రధానమైన ఆ స్కూల్ లో.... తెలుగు పిరియడ్ జరుగుతోంది...
వ్యాకరణం లో కొత్త విషయాలతో మొదలెట్టాడు తెలుగు టీచర్ విశ్వేశ్వరరావు.  కొత్త విషయాలు పిల్లల్లో ఆసక్తి రేకెత్తిస్తాయనేది ఆయన ఆలోచన.
"అచ్చంగా తెలుగు అక్షరాలెన్నో చెప్పండ్రా ఎవరైనా.."
 "56 సార్.." క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ రిప్లై.
కాదు పిల్లలూ ..ముఫ్ఫై ఆరు మాత్రమే ..
అదేంటి  సార్ .. ఇంగ్లీషులో కదా   ముఫ్ఫై ఆరు అక్షరాలుండేది.
   " కాదర్రా పిల్లలు అచ్చంగా తెలుగు అక్షరాలు 36 మాత్రమే.  అచ్చంగా తెలుగు అక్షరాలకు మరికొన్నిసంస్కృత అక్షరాలు కలుపుకుని 56 అయ్యాయి.. ఇది మీకు జ్ఞానం కోసం చెప్పేది.. అర్ద మైఁదా??"
 "సరే ఇంకోటి అడుగుతా చెప్పండి పిల్లలూ ..!"  ఇంట్రస్టింగా పిల్లలు వింటున్నారని అర్ధం చేసుకున్నవిశ్వేశ్వరరావు తన తెలుగు పాండిత్యాన్ని కొనసాగించాడు.
 సరే నేను కొన్ని రెండు మూడు పదాలు  అడుగుతాను అవి ఏ భాషచెందినవో చెప్పాలి. సరేనా.. పిల్లల్లో యాంగ్జైటీ పెరుగుతోందని అర్ధం చేసుకున్నాడు విశ్వేశ్వరరావు..
  "జామ, వేరుశనగ, క్యాబేజి, బంగాళదుంప, మేజా" ఈ పదాలు ఏ భాష కు చెం దినవో చెప్పుకొండి చూద్దాం?"
  "ఓ ఆ మాత్రం తెలీదా మాకు .. ఇవన్నీ తెలుగు పదాలే సార్.."అన్నారు ముక్తకంఠంతో..
ఒక కుర్రాడు లేచి "కాదు సార్.. క్యాబే..జీ అంటే ఉర్దూపదం సార్ "
 "తువ్వాల ఇంగ్లీషే టవల్ మాట్లాడటం రాక అలా అనుంటారు.." తెలివిగా చెప్పాడు ఇంకోకడు.
  కాదర్రా పిల్లలూ .. అవన్నీ మన భాషాపదాలు కాదంటే కాదు అవన్నీ పోర్చుగీసు పదాలు అని  విశ్వేశ్వరరావు చెప్పడంతో ఖంగుతిన్న విద్యార్ధులంతా చెవులు కొరుక్కుంటున్నారు .
 సైలెన్స్... సైలెన్స్ ...
అల్లరి చేయకండి.. చిన్న పిల్లాలు కాదు మీరు..  నిశబ్దం..గా ఉండండర్రా..!  సరే ఇక పాఠం చెప్పుకుందాం.!
 'శకుంతలోపాఖ్యానం ' -  నన్నయ్య వ్రాసిన ఈ చిన్న కథ  అద్భుత మైన అనువాద కథ.. ప్రేమించి మరచిన రాజుకు తానెవరో గుర్తుచేసే యువతి కథ ఇది. అని విశ్వేశ్వరరావు పద్యం మొదలెట్టే లోపల
  "ఎందుకుసార్.. మాకా ఫెయిల్డ్  లవ్ స్టోరీస్ ..సరదాగా అనేశాడు డేవిడ్ అనే క్లాస్ టాప్ విద్యార్ధి అంతటితో ఆగకుండా..
 " తెలుగు దేనికి పనికొస్తుంది సార్ చెప్పండి.. మమల్ని పరీక్షలు తప్పించడానికి కాకుంటే..! ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అసలు తెలుగు మాట్లాడొద్దంటూనే .. తెలుగు సబ్జెక్ట్ పెట్టినోళ్ళని ఏంచేసినా పాపం లేదు.. ఐ డిడంట్ అండర్ స్టాండ్  ఎ లిటిల్ బిట్.. థిస్ డర్టీ తెలుగు యునో.. అన్నాడు డేవిడ్.
  తనకు అత్యంత ఇష్టమైన విద్యార్ధి అలా మాట్లాడటం తో..ఖంగుతిన్న విశ్వేశ్వరరావు.....
  " ఏవిట్రా ఆ ప్రేలాపన..? ఆ .. నువ్ పుట్టిన గడ్డ మీద మమకారం లేకుండా..?? అలా మాట్లాడటం నీకు మంచిది కాదు. కన్నతల్లిలాంటిదిరా  తెలుగు.  "దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయులంతటి వారే మెచ్చుకున్న భాషరా ఇది.. నువ్ తల్లి భాష మీద పట్టు సాధిస్తేనే  నీకు ఇతర భాషలు అబ్బుతాయ్.. " అన్నాడు విశ్వేశ్వరరావు ఒకింత కోపంగా.
  "ఎందుకుసార్ అలా అరుస్తారు.. ఆయన కాలం లో ఇంగ్లీషు ఉండి ఉండదు అందుకే అలా అని ఉంటాడా కృష్ణదేవ్.  కె.   బట్ నౌ వి ఆర్ హావింగ్ ద వరల్డ్ లాంగ్వేజ్ గ్రేట్ ఇంగ్లీష్..
 తొక్కలో తెలుగు చదవలేక రాయలేక.. ఇంట్లో తన్నులు తిన్లేక, ఇక్కడేమో మీ సోది విన్లేక చస్తున్నాం.. అది మానెత్తినెక్కిన దరిద్రపు భాష. దేశభాషలందు తెలుగు లెస్ ..అంతే.! ఏమాత్రం తగ్గలేదు డేవిడ్.
   రేయ్ తప్పురా అలా అనకూడదురా వెధవయ్ ..ఆ!! అంటూ చేతిలో ఉన్న చాక్ పీస్ ని డేవిడ్ వైపు గట్టిగా విసిరేశాడు విశ్వేశ్వరరావు.
      డేవిడ్ చాక్ పీస్ ను తప్పించుకునేందుకు చటాలున క్రిందకి కూర్చున్నాడు.. ఆ ఆదుర్ధాలో ముందు బెంచ్ చివర కోణం డేవిడ్ గడ్డానికి తగిలి గడ్డం చీలిపోయింది.. ధారగా రక్తం కారిపోసాగింది.  నెత్తురు చిందటంతో ఖంగారు పడ్డ విశ్వేశ్వరరావు వడివడిగా తన భుజం మీదున్న కండవ చించి గట్టిగా నెత్తురోడకుండా  అదిమి పట్టుకున్నాడు. డేవిడ్ కి దెబ్బతగలటంతో సరదాగా గడుస్తున్న క్లాస్ రూం లో విద్యార్ధులు ఒక్కసారిగా భయానికి గురైయ్యారు.. ఎంత గట్టిగా పట్టుకున్నా రక్తం ఆగడంలేదు. ఒకణ్ణి గుడ్డ గట్టిగా పట్టుకోమని చెప్పి..   పరుగు పరుగున ప్రిన్సిపాల్ వద్దకెళ్ళి డేవిడ్ ను  వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాలంటూ జరిగిన విషయం  ప్రిన్సిపాల్ కి చెప్పి  పర్మిషన్ కోరాడు.
        ప్రిన్సిపాల్ విశ్వేశ్వరరావు కి క్లాస్ పీకారు.  " క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ని అలాగేనా డీల్ చేసిది.. అసలు పెద్దవారు మీకు బుద్దుందా" అంటూ తెగతిట్టి..
  " హడావుడి చేయకుండా హాస్పటల్ కి తీసుకెళ్ళండి అదికూడా తన కార్ లో తీసుకెళండంటూ" డ్రైవర్ ని పిలిచి పంపించాడు.   విశ్వేశ్వరరావుకి చెమటలు పడుతున్నాయ్..ఏంచేయాలో పాలు పోవడం లేదు.. జేబులో చిల్లుగవ్వకూడాలేదు.
       విశ్వేశ్వరరావు కి వయస్సు అరవై పైనే..వుంటాయ్.. గతంలో కొన్నాళ్ళు  తెలుగు టీచర్ గా ట్యూషన్లు చెప్పిన అనుభవంతో స్కూల్స్ లో తెలుగు చెప్పేందుకు కుదిరాడు విశ్వేశ్వరరావు.  తెలుగు ను విద్యార్ధులకు నేర్పాలన్న కోరికతో ఊర్లో ఉన్న స్కూల్స్ లలో అతి తక్కువ జీతంతో తెలుగు పాఠాలు చెబుతుంటాడు. తెలుగులో ఆయన పాండిత్యానికి దాసోహమంటుంటారు యాజమాన్యాలు..
    ఇక డేవిడ్ అన్నీ సబ్జెక్ట్లలో ముందు వరసలో ఉంటాడు.. ఒక్కోసారి ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తుంటుంది డేవిడ్ కి.  కానీ తెలుగులో వ్రాయడం లో కాస్త ఇబ్బంది పడతాడు. పదవ తరగతి .. లైఫ్ లో ఇంపార్టెంట్. ఈ సమయంలో తెలుగు తనని ఇబ్బంది పెడుతోందనేది డేవిడ్ భావన.  ఒక్క తెలుగు పేరు చెబితే జ్వరం వచ్చేస్తుంది డేవిడ్ కి.  ప్రక్క జిల్లా డి.ఆర్.ఓ  మాత్యూస్ డిసౌజా కొడుకు డేవిడ్.  స్కూల్ యాజమాన్యం కి డేవిడ్ లాంటి బ్రైట్ స్టూడెంట్స్ అంటే  వల్ల మాలిన ప్రేమ.
           హాస్పటల్ కి డేవిడ్ ని తీసుకెళ్లే సరికి అక్కడ రాష్ట్రంలోని దాదాపు అన్ని  చానెళ్ల కార్లు ఆగి వున్నాయ్.. ఫలానా కార్పొరేట్ స్కూల్ లో  విద్యార్ధిపై తెలుగు మాస్టర్ దాడి.. రాక్షసత్వం మూర్తీభవించిన తెలుగు టీచర్.. పరారీలో ప్రిన్సిపాల్ అంటూ ..మైకులు పట్టుకుని ఎవరికి తోచింది వారు ఊదరగొట్టేస్తున్నారు.  "  ఇదిగో ఇప్పుడే హాస్పటల్ కి కూడా తెచ్చారు.. అంటూ కారు వెంటపడ్డారు..  "ఏం జరిగిందో చెప్పండి.. పిల్లాడ్ని ఎందుకు కొట్టారు??" అని విశ్వేశ్వరరావు  ని  ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  అది అడుగుతున్నట్లు లేదు..  ఒక మంత్రిని ప్రజాసంఘాల నాయకులు ఘెరావ్ చేస్తున్నట్లు ఉంది
   మొఖం పగలకొట్టినట్లు ఉన్నాయ్ వారి ప్రశ్నలు.. కోర్టులో న్యాయమూర్తి కూడా ఇలా అడగరేమో అనుకున్నాడు విశ్వేశ్వరరావు  లోలోన. మైకులు మొఖాన పెడుతున్నారు. నరనరంలో ఒణుకు మొదలైంది.వస్తున్న కోపాన్ని తమాయించుకుని  "ముందు లోపలికి పోనివ్వండి పిల్లాడ్ని హాస్పటల్ లో చేర్పించనీయండి.. రక్తం చాల పోయింది" .. ప్లీజ్ హాస్పటల్ లో చేర్పించనీయండి "అంటూ ప్రాధేయ పడుతున్నాడు విశ్వేశ్వరరావు..  కారు అద్దాలు వేస్తూ.!
     కారు నేరుగా కార్పొరేట్ హాస్పటల్ ఎమర్జెన్సీ వార్డు వైపు వెళ్ళింది. అంతలో ఒక చానల్ వాడు మొదలెట్టేశాడు.. "రక్తం స్రావం విపరీతంగా  కావడం వల్ల విద్యార్ధి బ్రతుకుతాడా అనే అనుమానాలు వ్యక్తమౌతునాయ్ అంటూ ..
       లోపలికి వెళ్ళి డేవిడ్ ను స్ట్రెచ్చర్ పై లోపలికి పంపించే సరికి  అన్నీ టివీల్లో  ఈ ఘటన లైవ్ వస్తోంది.. విద్యార్ధి పై  తెలుగు టీచర్ దాష్టీకం..దారుణం గా దాడి చేసి గాయపరచిన తెలుగు టిచర్ పై చర్యలకు పలు సంఘాల డిమాండ్"
      అతనెవరో మైక్ ముందరా గడగడ మాట్లాడేస్తున్నాడు.. అదేదో కులానికి ప్రతినిధి అంటూ.. ఇంతకీ ఆ మాట్లాడే వారికి అసలు తాను కానీ, తన కులం గానీ తెలుసా?   అనుకున్నాడు విశ్వేశ్వరరావు లోలోన.
    బయట నుంచి లోపలికి వచ్చిన పోలీసులు హడావుడిగా " మీరు స్టేషన్ కి పదండి " అంటూ తోసేస్తున్నారు. "అరే.. ఉండడయ్యా.. నేను దొంగని కాదు ఎందుకలా నెడతారు?.. ముసలివాడ్ని కాస్త చూసి ప్రవర్తించండి" అన్నాడు కాస్తా విసురుగా  విశ్వేశ్వరరావు.. "పిల్లాడికి  ఎలా వుందో తెలుసుకున్నాక  మీరెలా చెబితే అలా చేద్దాం సరేనా అన్నాడు...!"
         ఏంటి నువ్ మాకు నేర్పుతున్నావా..  ముందు పదవోయ్ ముసిలోడా స్టేషన్ కి అక్కడ సార్ తో మాట్లాడుకుందువులే" అంటూ విసురు గానెట్టి, తీసుకెళ్ళి స్టేషన్ లో కూర్చో పెట్టారు.
 స్టేషన్ లో  ఒంటరిగా కూర్చుని,  ఇప్పటి పరిస్థితి  కి తనలో తాను నవ్వుకుంటున్న విశ్వేశ్వరరావుకి గతం స్ఫురణ కొచ్చింది.. ఆయనకి ఈ జైలు, పోలీసులు .. తొలి అనుభవం కాదు.
**************************************
 ఓ ఆహ్లాదమైన సాయంత్ర వేళ !.. అప్పటి మడ్రాస్ రాష్ట్రంలోని  ఓ గదిలో ..
  "ఏంటోయ్ విశ్వం ఎప్పుడొచ్చావ్.. ఏం రాశావ్ ఈ మధ్య..? గుప్పు గుప్పున సిగరెట్టు పొగ వదుల్తూ ఆప్యాయంగా పలకరించాడు శ్రీశ్రీ"
 శీనన్న ఇదిగో ఈ మధ్య వ్రాసిన కవితలో కొద్ది భాగం..
"పొద్దు పొడవక మునుపె
పొగచుట్ట నోటబెట్టి
తలకేమో పాగచుట్టి
పలుగు పార చేత బట్టి
భుజాన హలము బట్టి
బురదనేమో తొక్కి పట్టి
గింజ గింజ నారు బెట్టి
మాకేమో తిండి బెట్టి
నీ కడుపును మాడబెట్టి
ఎందుకా శ్రమ నీకు ఓ హాలికా..!
ఆ రైతన్న కష్టాల కన్నీళ్ళు ..
నిత్య శ్రామికా సంకెళ్ళు..
కనిపించదా నీకు..ఓ పాలకా
పాషాణమురా నీ మనసు ఏలికా.!!"
"శభాష్ రా  విశ్వం...!  బాగా రాశావ్..  నీలో మాంచి ఫైరుందోయ్.. రుద్రజ్వాల వైపోయావ్ అన్నారు శ్రీశ్రీ.. ఆనాటి నుంచి రుద్రజ్వాల కలం పేరుతో ఎన్నో కవితలు.. కథానికలు వ్రాశాడు విశ్వేశ్వరరావు.. వి.సం., అ.సం వంటి సంఘాలలో సభ్యుని గా ఉన్నాడు.. హాలికుడు, శ్రామికుడు దళితుడు , దరిద్రుడు.. వనిత ..భవిత.. ఎక్కడ లోటు వున్నా అక్కడ రుద్రజ్వాల కలం పోటు ఉండేది..
"తిరగబడరన్నా
కండకావరపు
నల్ల దొరలపై
తిరగబడరన్న
ఖాకి గుడ్డలు
కరకు లాటీల్
ఆగవు చాలవు
నీవెదురొడ్డోయ్
చిందిన ..
సలసల కాగే
నీ నెత్తుటికి
అవి దూదిపింజలోయ్
పోరాడితే పోయేది ప్రాణాలేలే
ముందుతరానికి అవి బాటలే లే"
అంటూ  విశ్వేశ్వరరావు ఆవేశం గా వ్రాసిన ఉడుకు పాటకు జైల్లో కూడు తప్పలేదు..విప్లవ గీతాలు రాశాడంటూ కేసెట్టారు. జైల్లో తోసేశారు. జైలు తొలి అనుభవం నేర్పిన పాఠాలతో విశ్వేశ్వరరావుకి   ఇంకా కసి పెరిగింది.. శ్రీశ్రీ వంటి అభ్యుదయ వాదుల సాహచర్యంతో  ఎదుగుతున్నాడు...  రుద్రజ్వాల కవితలు వాడవాడలా ప్రచారాల  హోరందుకున్నాయ్.. పల్లెపల్లెలో పైరు పాటలయ్యయ్.. దండకారణ్యంలో  అడవి బిడ్డల పాటలై మ్రోగాయ్.. తానెవరో మరిచిపోయాడు విశ్వేశ్వరరావు. తన వెదుకులాట  దేనికోసమో కూడా అర్ధం కాని పరిస్థితి ..కవిత్వమే జీవనం కవనమే పానం గా మారిపోయాడు .
      ఇల్లు పట్టించుకోవడం కూడా మానేశాడు.  రచనల్లో పడి తనకి అత్యంత ప్రాణప్రదమైన  భార్య కూడా గుర్తులేనంతగా తిరగుతున్నాడు.  విప్లవకారునిలా గడ్డం పెంచుకుని, జోలి సంచి వేసుకుని  తెనాలి వారి కలం తో సిరా బదులు నెత్తురు కక్కిస్తూ.. గడిపేస్తున్నాడు విశ్వేశ్వరరావు. తెలుగులో ఉన్న అక్షరాలలో ఎంతో మహత్తుందోయ్.. అంటూ ఎన్నో ప్రక్రియలకు జీవంపోయడం మొదలెట్టాడు విశ్వేశ్వరరావు.  దేశాటన  చేపట్టాడు.. అడవులు, కొండలు, కోనలు, మైదానం సముద్రం.. ఏ ప్రాంతమంతే ఆ ప్రాంతంలో పిచ్చివాడిలా తిరుగుతూ.. తాను చూసిన వారి కస్టాలన్నీ తనవిగా చేసి కవితలు వ్రాయడం .. అక్కడే ఉన్న ఎవరో ఒకరికి ఇచ్చి వెళ్ళడం చేస్తుండేవాడు రుద్రజ్వాల.  చివరకు తాను దేనికోసం దేశాతన చేస్తున్నడో మరీచిపోయేవాడు. తన అసలు పేరే మరచిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడప్పుడూ తన కవి మిత్రులకి లేఖలు వ్రాయడం మినహా ఏమీ పట్టటం లేదు .
               భర్త  విశ్వేశ్వరరావు ఇంటి ని పట్టించుకోక పోవడం , విశ్వేశ్వరరావు గురించి నిత్యం పోలీసుల వేధింపులు, బెదిరింపులతో  దిగులు చెందిన అతని భార్య సుందరమ్మ ఓ రోజు  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆరోజు గుర్తొచ్చి కన్నీరు ఉబికాయి విశ్వేశ్వరరావుకి.. తనంటే ఎంత ప్రాణమో ..!  "ప్రేమ లేదనుకున్నావా నాకు నీమీద పిచ్చిదానా..ఒంటరిని చేసెళ్ళిపోయావా " అనుకుంటూ ఏడ్చిన ఏడ్పు గుర్తొచ్చి కన్నీళ్ళు విశ్వేశ్వరరావు చెంపను తడిపేశాయ్.
 తన భార్య అలోచనలో ఉన్న విశ్వేశ్వరరావుని కానిస్టేబుల్ రమణి పిలిచింది.
" ఇదిగో నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారేమో పిలుచుకో . బాగా ఖర్చవుతుంది అట్రాసిటీ అయ్యేలా వుంది,  ఆ స్కూల్ ఓళ్ళు నీ తెలుగు ఉజ్జోగం కుడా పీకిపారేశారంట. "  గతంలో ఉన్న విశ్వేశ్వరరావుని జబ్బపట్టి కదిపి వర్తమానం లోకి తెచ్చి మరీ చెప్పిందా లేడీ కానిస్టేబుల్ రమణి. అది అభిమానమో , బెదిరింపో అర్ధం కాని విశ్వేశ్వరరావు ఓ చిరునవ్వు నవ్వాడు.. అంతలో తన భార్య ఆత్మహత్య గుర్తొచ్చింది.. మరల గతంలోకి జారుకున్నాడు.
        ఒకరోజు అ.సం సభ్యులైన ఉద్దండపండితులంతా కూర్చుని భువన విజయాన్ని తలపించేరీతిలో కవితా గోష్టి నిర్వహిస్తున్నారు. .. తెలుగు కవితల ప్రవాహమై పరుగిడుతోంది.   అంతలో ఇనుపబూట్ల చప్పుడు ఎవరికోసం ఖాకీలు చుట్టు ముడుతున్నాయ్ .. ఏరా రుద్రజ్వాలా ఏమన్న మళ్ళీ వ్రాశావా?? అనుమానంతో అడిగారు మిత్రుల్లో ఒకరు.  ఏం లేదన్నవిశ్వేశ్వరరావు సమాధానం.
         వచ్చిన పోలీసులు విశ్వేశ్వరరావుని చుట్టు ముట్టి తీసుకెళ్ళారు.. అక్కడున్న ఉద్దండులంతా వర్తమానంలోకి వచ్చేసరికి  విశ్వేశ్వరరావుని ఎక్కించుకున్న జీప్ తుర్రుమంది.  భార్య  హత్య క్రింద కేసు నమోదు చేశారు..  పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడింది విశ్వేశ్వరరావుకి. శిక్షా కాలం పూర్తై జైలు నుంచి వచ్చేసరికి కవి మిత్రులైన పెద్దలంతా కాలంచేశారు.
         జైలు గోడలు దాటి బాహ్యప్రపంచంలోకి వచ్చేసరికి  ఏకాకిగా మిగిలాడు విశ్వేశ్వరరావు.. ఎప్పుడో  తను వ్రాసిన విప్లవ గీతం అద్భుతంగా వినిపిస్తోంది.. ఆ పాట వినిపిస్తున్న వైపు వడివడిగా అడుగులేశాడు . ఓ టీ కొట్టు లోని రికార్డర్ నుంచి వస్తోంది తన కవిత పాటరూపంలో.. ! ఈ పాట ఎక్కడిదీ.. అడిగాడు.
          మాసిన గడ్డం.. భుజాన వ్రేలాడే సంచి.. అక్కడక్కడ చినిగినట్లున్న చీకిపోయిన బట్టలతో ఉన్న విశ్వేశ్వరరావుని చూసిన టీ స్టాల్ అతను తెలీలా "ఈగలదండు" సినిమా లోది.. మస్త్ రాసిండు.. కొత్త రచయితంట అన్నాడు.  ఓ చిరునవ్వు నవ్విన విశ్వేశ్వరరావు.. అది ఎప్పుడో  రుద్రజ్వాల వ్రాశాడయ్యా..! అనుకుని గాలిలో దేనినో వెతుక్కుంటున్న వాడిలా అడుగులేశాడు.
           లోకం పోకడ మారింది.. స్వార్ధం నిండిన ప్రపంచానికి మనం దివిటీలం కాలేము..   "ముందుతరం దూతలని" శ్రీశ్రీ అన్న మాట గుర్తుకు వచ్చి   తనకు తన పూర్వీకుల నుంచి అబ్బిన   తెలుగు పాండిత్యాన్ని  ఈనాటి విద్యార్ధులకి అందించాలని నిర్ణయించుకున్నాడు   వెంటనే రంగంలోకి దిగి ఇంగ్లీష్ లో మునిగి తేలుతున్న కార్పొరేట్ స్కూల్స్ ని టార్గెట్ చేసుకుని తన ప్రాణప్రదమైన తెలుగు నేర్పించేందుకు సిద్దమైయ్యాడు విశ్వేశ్వరరావు.
**********************************
       స్కూల్ లో జరిగిన హడావుడి, చానళ్ళ హోరు చూసిన కార్పొరేట్ స్కూల్ చైర్మన్ నాగేంద్రబాబు "తెలుగు టీచర్  ను తొలగించేశాం" అని ప్రకటించాడు. మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి .. తన క్లాస్ మేట్ అయిన డి.ఎస్.పి ఫిరోజ్ ని కలిశాడు.  కేసు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు.
      అంతలో ఫిరోజ్ ,  సి.ఐని పిలిచి, ఆ తెలుగు టీచర్ ఎవరో ఇటు పిలిపించు  కౌన్సిలింగ్ ఇచ్చి పంపిద్దాం అన్నాడు. అంతలో డి.ఆర్.వో. మాత్యూస్ పోలీస్ స్టేషన్ కు పరుగు పరుగున చేరుకుని  "తప్పంతా తన కొడుకు డేవిడ్ దే అని.. పాపం ఆ తెలుగు మాస్టర్ వచ్చాకే మావాడు కొద్దిగైనా తెలుగు వ్రాయగలుగుతున్నాడని చెప్పాడు. ఆయన మీద తాను ఫిర్యాదు చేయదలుచుకోలేదంటూ చెప్పి అనవసరంగా కొందరు ఈ దుర్ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు .. ఆ స్కూల్ టీచర్ని వదిలేయండి ప్లీజ్ "  అని తన పెద్దమనసు చాటుకున్నాడు మాత్యూస్.   అంతలో స్కూల్ చైర్మన్ నాగేంద్రబాబు .. డిసౌజా  కదా నువ్వు అని,  తాను గుర్తుపట్టి .. డిఎస్.పి ఫిరోజ్ ని చూపించి డిసౌజా  వీడు మన ఫైవ్ రోజ్  గుర్తుపట్టావా అన్నాడు. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం కలిసి చదువుకున్న రోజులు గుర్తుచేసుకుంటూ   ముగ్గురూ మాట్లాడుకుంటుండగా ,  విశ్వేశ్వరరావుని లోపలికి కరుకుగా తీసుకొచ్చారు కానిస్టేబుళ్ళు.  "మాస్టారూ..!  మీరా.. మాత్యూస్ లేచి నించుని కుర్చీ ఆఫర్ చేశాడు విశ్వేశ్వరరావుకి.  మాస్టారూ నేను నాగేంద్రాన్ని, ఇదిగో వీడు ఫిరోజ్ .. ఇతను డిసౌజా ,.. మీ ఇంట్లో  ట్యూషన్ చెప్పించుకున్నాం..మీ ఇంట్లో అన్నం తిన్నాం గుర్తుపట్టారా??  అంటూ ముగ్గురూ ఒకేసారి .
"పరిగేత్తేవాడికి అలసటుండదు
పడుకున్నోడికి పనేఉండదు
కులానికి కూడువుండదు
మతానికి మానం వుండదదు
లక్ష్యం లేనిది ప్రపంచముండదు
అలక్ష్యానికి రోజులుండవని"
మీరు చెప్పిన మాటలే,  మమ్మల్ని ఈ స్థాయికి చేర్చాయ్ మాస్టారూ.. అంటూ ఉక్కిరి బిక్కిరి చేశారు విశ్వేశ్వరరావుని ...
"మంచిదోయ్ మీరు ఉన్నతంగా ఎదిగారు.. కాస్త వ్యవస్థనీ గాడిన పెట్టండి..:"
"విదేశాన కాలిడినా
నాదేశం మిన్నరా
ఏభాష అడుగిడినా
తల్లి తెలుగు తీపిరా
అమ్మ చేతి కమ్మనైన
ముద్దుమురిపపు భాషరా
తెలుగు మన తల్లిరా..!
జై తెలుగు తల్లి..
జైజై తెలుగుతల్లి "
అనుకుంటూ బయటకు అడుగులేశాడు విశ్వేశ్వరరావు.
 తను ఉంటున్న ఇంటి వద్దకు చేరుకోగానే ప్రక్కింటి వారి మాటలు విశ్వేశ్వరరావు చెవిని సోకాయ్.  "పాపం పిల్లాడ్ని చదువుకోమన్నందుకు ఈయన్ని జైల్లో ఎట్టించారట, ఆ హడావుడి చేసిన టివిలోల్లు.. పోలీసోళ్ళు..సంగాలోళ్ళు  పైసల్ దీసుకుని వదిలేసిండ్రంట.. పోన్లే ఈయన కాడ అద్దురూపాయ్ ఉండదాయ.. సదువు సెప్పి వచ్చినయన్నీ ఆ శరణాలయంలో ఇత్తడు.. తిండిగింజలకి, పుత్తకాలకే ఖర్చుచేస్తుంటాడూ.. పాపం ఇస్కూల్లో కూడా తీసేశారంట.. రేపటి సంది ఎట్టా బతుకుతాడో ఏందో.. అన్నీ కష్టాలే ఈ సారుకి"
 చుట్టు ప్రక్క ఆడోళ్ల  జాలిమాటలు విశ్వేశ్వరరావుని కలిచి వేశాయ్...!
 గదిలో కెళ్ళి తలుపేసుకున్నాడు..!
    తర్వాత రోజు అమెరికా నుంచి ఓ లేఖ వచ్చింది విశ్వేశ్వరరావుకి ..
కానీ తీసుకునేందుకు లోపల వేసిన గొళ్ళెం తెరుచుకోలేదు. గది వెలుగు చూడలేదు.
   ఆ లేఖలో ...ఇలా వుంది.
" పూజ్యులైన విశ్వేశ్వరరావు మాస్టారికి రుద్రజ్వాలగా మీరు తెలుగుకు చేసిన సేవ అనిర్వచనీయం.. పెద్దలైన శ్రీశ్రీ తదితరులతో అతి పిన్న వయస్కులిగా మీ  రచనలు కొనసాగించడం చాలా గొప్ప విషయం.  వెలుగు చూడని రుద్రజ్వాల మీరని తెలిసి పరవశమై అమెరికా లోని మేమంతా తెలుగు భాషా వికాసానికై, మా పిల్లలకు తెలుగు నేర్పుతారని మిమ్మల్ని అమెరికా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము..మీరు వ్రాసిన అన్నీ రకాల గేయాలు ముద్రించాలని నిర్ణయించాం. మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాం.. ఇట్లు  అమెరికా తెలుగు భాషా వికాస సేవా సమితి.. న్యూజెర్సీ."

No comments:

Post a Comment

Pages