స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ (SILC) - అచ్చంగా తెలుగు

స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ (SILC)

Share This
స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ (SILC) 
 - డాక్టర్ జాస్తి శివ రామ కృష్ణ 




1. స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ను ఎప్పుడు ప్రారంభించారు ? మొదట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ? 
 స్కూల్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ (SILC) 1979 లో, మిన్నియాపోలిస్ - సెయింట్ పాల్ జంట నగరాలలో (మిన్నెసోటా రాష్ట్రము, అమెరికా దేశము), 35 మంది విద్యార్ధులు, 12 మంది స్వచ్చంద సేవకులతో ప్రారంభమయింది. 
 2. దీన్ని స్థాపించినప్పుడు మీ మనోభావాలు/లక్ష్యాలు ఏమిటి ? 
 భారత దేశము నుండి అమెరికాకు వచ్చిన ప్రవాస భారతీయులకు, వారి పిల్లలకు, భారత దేశ భాషా సంస్కృతులపై ఆసక్తి ఉన్న జంట నగరాల ప్రజలకు, విద్యా సౌకర్యాలు, అవగాహనా కార్యక్రమాలు అందించటము ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశాలు. భారతీయ భాషా, సంస్కృతుల వైవిధ్యాన్ని అర్ధము చేసుకోవటము వివిధ భారతీయ భాషలను నేర్చుకోవడానికి సౌకర్యాలు అందించడం. భారతదేశం యొక్క చరిత్ర, భూగోళశాస్త్రం, తత్వశాస్త్రం, కళలు, సంగీతము, మరియు సాహిత్య సంపదల గురించి విద్య మరియు అవగాహన కల్పించడం. భారతదేశ సాంస్కృతిక విలువలను, వివిధ కార్యక్రమాలలో ప్రదర్శించడం. ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్వచ్చంద సంస్థలతో, సాంస్కృతిక, సామాజిక, విద్యాపరమైన కార్యకలాపాలు చేపట్టటము.  
 3. మొదట్లో మీకు లభించిన స్పందన ఎలా ఉంది ? 
ఎంతమంది స్వచ్ఛందంగా మీకు సహాయం అందించేందుకు వచ్చారు ? జంట నగరాలలో సిల్క్ మొదలు పెట్టిన సమయములో, మన భారతదేశము నుండి వచ్చిన ప్రవాసులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఒకరితో మరొకరు సంభాషించటానికి, చేదోడు వాదోడు గా ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. ఈ నెపేధ్యములో, ప్రవాస భారతీయులు తమ భాషా సంస్కృతులు పరి రక్షించుకోవటానికి సిల్క్ ఒక మంచి వేదికను అందచేసింది. గత 35 సంవత్సరాలుగా, జంట నగరాలలో ఈ సంస్థ తన కార్యక్రమాలు దిగ్విజయముగా నడుపుతోంది. ఈ సంస్థలో పని చేసేవారందరూ స్వచ్చంద సిబ్బంది మాత్రమే! ఈ స్వచ్చంద సేవకుల అంకిత భావము, భాష సంస్కృతుల పట్ల వారికున్న ప్రేమానురాగాలు మా సంస్థ కు ఊపిరి, ప్రాణము! 
 4. ఈ silc ద్వారా మీరు మొదట్లో చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి ? 
 సిల్క్ ప్రారంభ సంవత్సరాలలో, మేము చేసిన కార్యక్రమాలను రెండు అంశాలుగా చెప్పవచ్చు. * వారాంతపు పాఠశాల (స్కూల్): oభారతీయ భాషలు (తెలుగు, హిందీ, మళయాళము, కన్నడ, గుజరాతి, తమిళ్, నేపాలి, బెంగాలీ మరాఠీ సంస్కృతము, మొదలైనవి) నెర్పించటము oయోగా తరగతులు నిర్వహించటము oపాఠశాల పత్రికను ప్రచురించటము * సమాజ సంబంధాలు (అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్): o ప్రతి సంవత్సరము, "ఫెస్టివల్ అఫ్ నేషన్స్" అనే కార్యక్రమములో (మిన్నియాపోలిస్ - సెయింట్ పాల్ జంట నగరాలలో స్థిరపడిన వివిధ దేశాల పౌరులు, దాదాపుగా 90 దేశాలకు చెందిన పౌరులు, తమ దేశ సంసృతిని ప్రతిబింబిస్తూ, ఈ సాంస్కృతిక సంబరాలలో పాల్గొంటారు), భారత దేశ సంసృతిని తెలియజేస్తూ వివిధ సాంస్కృతిక
కార్యక్రమాలను ప్రదర్సించటము. oభారతీయ, అమెరికా పత్రికలకు, భారతదేశానికి సంబంధించిన వివిధ విషయాలపై అవగాహనా వ్యాసాలు అందించటం oఓ మిన్నెసోటా రాష్ట్రములో జరుగుతున్న సామాజిక కార్యక్రమాల్లో (ఫుడ్ డ్రైవ్, స్ట్యాచూ అఫ్ లిబర్టి కు నిధుల సేకరణ), తమ వంతు సాయము చేయటము oప్రమాదాలు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు (ఉదాహరణకు, లాతూర్ భూకంపము), భారత దేశానికి తమ వంతు సహాయ సహకారాలు అందించటం . 
5. దీనికి ప్రవాసీయుల నుంచి, విదేశీయుల నుంచి లభించిన స్పందన ఎలా ఉంది ? 
 మా సంస్థ ఉన్నదే విదేశములో! చాలా మంది ప్రవాస భారతీయులు, ముఖ్యముగా 2000 సంవత్సరానికి ముందు వచ్చినవారు, అమెరికా వాసులు అయిపోయారు. మన భారత దేశము వచ్చి, అక్కడి పిల్లలను దత్తు తెచ్చుకున్న, అమెరికాలో జన్మించిన స్థానికులు కూడా కొంతమంది మా స్కూలు కు వస్తుంటారు. కొంతమంది భారతీయులు యిక్కడకు వచ్చి, అమెరికా వారిని వివాహము చేసుకొని, వారికి మన దేశ భాషలు, సంస్కృతులను పరిచయటము చేయటానికి, కుటుంబ సమేతముగా మా స్కూలు లో చేరతారు. మన భారత దేశము అందించిన సంగీతము, నృత్యాలు, కళలు, వంటలు, యోగా, సాహిత్యము, ఆటలు, సంబరాలు, పండుగలు, సాంప్రదాయాలు - వీటన్నిటి మీద అభిలాష, అభిరుచి, ఆసక్తి ఉన్న విదేశియులు కూడా మా స్కూలు కు వస్తుంటారు. చాల మంది విదేశీయులు, సిల్క్ నిర్దేశక మండలి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) లో కూడా, వివిధ పదవులు, బాధ్యతలు నిర్వహించి, చాల విలువైన సేవలు అందించారు.యిప్పుడూ అందిస్తున్నారు. 
 6. నడక నేర్చుకునేటప్పుడు తడబాటులు, తిరిగి పట్టువదలకుండా ప్రయత్నించడాలు, సహజమే కదా ! మరి మీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కున్నారు ? 
 బోధనా సిబ్బంది: నిజమైన బోధనా అనుభవం ఉన్న తల్లిదండ్రులు, స్వచ్చంద సేవకులు దొరకటము చాలా అరుదు. ప్రతి సంవత్సరము పొందిన అనుభవాలే మాకు అందరికీ పాఠాలు! ఈ రోజు మేము అనుసరిస్తున్న విధానము, నిన్నటి కంటే మెరుగా? -- ఆ మూల సూత్రాన్ని మేము ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటాము. బోధనా సాధనములు (టీచింగ్ రిసోర్సెస్): భారతీయ భాషలు, సంస్కృతి నేర్చుకోవటానికి, నేర్పటానికి పుస్తకాలు
అమెరికాలో మొట్టమొదట్లో దొరికేవి గాదు. పాఠ్యాంశాలను, పుస్తకాలను కొన్ని సంవత్సరాలుగా, రూపకల్పన చెస్తున్నాము. మెరుగు పరుస్తున్నాము. ఆ తరువాత కాలములో, ప్రవాస భారతీయులు, సెలవు దినాలకు భారత దేశము వెళ్ళినప్పుడు, కొన్ని పుస్తకాలు కొని, మా స్కూలుకు డొనేట్ చేసేవారు. దృష్టి గోచరత (విజిబిలిటి ): 30 సంవత్సరాల క్రితము, ఇండియా కు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి కావు. సిల్క్ లో చదువుతున్న కుటుంబాలు, సిల్క్ గురించి సమాచారము కొత్త కుటుంబాలకు అందించేవారు. దేవాలయాలు, సామాజిక సంబంధాల వెబ్ సైట్లు, ప్రాంతీయ సంఘాలు, భాషా సమాఖ్యలు ఏర్పడినతరువాత, యిప్పుడదంత పెద్ద సమస్య అనిపించటము లేదనుకోండి!  
నిధుల సమకూర్పు: సిల్క్ ప్రారంభంలో చాలా కొద్ది మంది విద్యార్ధులు ఉండేవారు. స్థానికముగా ఉన్న స్కూల్ ను అద్దెకు తీసుకొని, తరగతులు నిర్వహించటము ఒక పెద్ద సమస్యగా ఉండేది. అందరూ స్వచ్చంద సేవకులు అవ్వటము వలన, ప్రతి సంవత్సరము సిల్క్ అనే వేదిక ద్వారా, భారతీయ భాషా సంసృతులను పరిరక్షించుకోవాలి అనే తపన వలన - గత 35 సంవత్సరాలుగా సిల్క్ నిరాటంకముగా కొనసాగుతుంది. 
 7. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలియచేస్తారా... 
 మా సంస్థ ప్రధానముగా ఒక వారాంతపు పాఠశాల. యిక్కడ సెప్టెంబర్ లో స్కూలు మొదలవుతుంది. జూన్ మొదటి వారములో విద్యా సంవత్సరము పూర్తవుతుంది. దాని ప్రకారము, మా పాఠశాల కూడా సెప్టెంబర్ నుండి జూన్ వరకు, ప్రతి శనివారము ఉదయము 10 గంటల నుండి 12:30 వరకు, ఈ తరగతులు నిర్వహిస్తాము మా సంస్థ ప్రధానముగా ఒక వారాంతపు పాఠశాల. యిక్కడ సెప్టెంబర్ లో స్కూలు మొదలవుతుంది. జూన్ మొదటి వారములో విద్యా సంవత్సరము పూర్తవుతుంది. దాని ప్రకారము, మా పాఠశాల కూడా సెప్టెంబర్ నుండి జూన్ వరకు, ప్రతి శనివారము ఉదయము 10 గంటల నుండి 12:30 వరకు, ఈ తరగతులు నిర్వహిస్తాము స్కూలు ప్రారంభము: ప్రతి ఉదయము 10 నిమిషాలు పాటు అసెంబ్లీ ఉంటుంది. "వందే మాతరం" పాడి
స్కూలు మొదలు పెడతాము   
మొదటి గంటలో: 
 [1] భారతీయ భాషలు: తెలుగు భాషతో పాటు, హిందీ, తమిళ్, గుజరాతీ, పంజాబీ, కన్నడ, మరాఠి, బెంగాలీ, మళయాళము నేర్పిస్తాము. కొన్ని సంవత్సరాలు నేపాలీ, ఉర్దూ, సంస్కృతము కూడా నేర్పించాము. కొన్ని భాషా తరగతుల్లో, రెండు మూడు సెక్షన్స్ కూడా (వయసును బట్టి, సామర్ధ్యాన్ని బట్టి) ఉంటాయి. 
 రెండవ గంటలో: [2] సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్: వయసును బట్టి, పిల్లలందరూ వివిధ తరగతుల్లో సమావేశము అవుతారు. ఈ తరగతుల్లో, భారత దేశమునకు సంబంధించిన వివిధ విషయాలపై (జాతీయ చిహ్నాలు, ప్రదేశాలు, ముఖ్య వ్యక్తులు, పండుగలు, కళలు, చరిత్ర, వేష భాషలు, మొదలైనవి) పాఠాలు చెబుతాము. యు ట్యూబ్ వీడియోలు, అంతర్జాల సాధనాలు, ఆటలు, పాటలు, ప్రాజెక్టులు, మొదలైన బోధనా సాధనాలు ఉపయోగించి, పిల్లలకు భారత దేశము గురించి చెబుతాము 
 [3] భారతీయ సాహిత్యము (లిటరేచర్ స్టడీస్ ఇన్ ఇండియన్ లిటరేచర్): నాలుగు సంవత్సరాల పాటు, మా స్కూలులో "సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్" చదివిన పిల్లలు, ఈ తరగతులు తీసుకుంటారు. భారత దేశానికి సంభందించిన పుస్తకము గాని, భారతీయ రచయత / రచయత్రులు వ్రాసిన పుస్తకము గాని ఎంపిక చేసుకొని, ఆ పుస్తకము చదువుతారు. ఆ పుస్తకాన్ని విశ్లేషిస్తారు. సంవత్సరము చివరలో, విశ్లేషణా వ్యాసము వ్రాస్తారు. కొన్ని సార్లు, ఆ పుస్తకాన్ని సంక్షిప్తము చేసి, ఒక నాటకాన్ని ప్రదర్శిస్తారు. 
 [4] స్పెషల్ అచీవ్ మెంట్ ప్రాజెక్ట్: ఉన్నత తరగతులలో (11 / 12 వ తరగతులలో) ఉన్న విద్యార్ధులు, తమకు నచ్చిన ప్రాజెక్టు ఎంపిక చేసుకుని, ఆలోచన నుండి, ఆచరణ పూర్తయ్యే వరకు, ఆ ప్రాజెక్టు మీద ఒక జట్టులా పనిచేస్తారు. ఉదాహరణకు, గత సంవత్సరములో, ఈ తరగతి విద్యార్ధులు, మిన్నియాపోలిస్ - సెయింట్ పాల్ జంటనగరాలలో ఉన్న వివిధ నృత్య బృందాలతో ఒక నాట్య ప్రదర్సన ఎర్పాటు చేసి, ఆ టిక్కెట్టు డబ్బుల ద్వారా వచ్చిన ఆదాయముతో, బెంగుళూరు లో ఉంటున్న "గురుకుల్" అనే ఒక అనాధ శరణాలాయానికి, సహాయము చేసారు. 
 [5] పెద్ద వారికి నాట్య తరగతులు (డ్యాన్స్ క్లాస్ ఫర్ అడల్ట్స్): వారి పిల్లలను, మా స్కూలుకు తీసుకు రావటానికి, దాదాపుగా 100 కిలో మీటర్లు తమ కారులో ప్రయాణము చేసి వచ్చే తల్లి దండ్రులు కూడా కొంతమంది ఉన్నారు. వారి పిల్లలందరూ, సోషల్ అండ్ కల్చరల్ స్టడీస్, లిటరేచర్ క్లాస్ లలో వున్నప్పుడు, పెద్ద వారు ఏదైనా భారతీయ నృత్యాన్ని నేర్చుకుంటారు. ఏదైనా బాలీవుడ్ డ్యాన్స్ గాని, లేదా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన జానపదనృత్యము గాని నేర్చుకుంటారు. మూడవ గంటలో: చివరి గంటలో, పిల్లలు వారి అభిరుచికి తగినట్లు, ఈ క్రింద తరగతుల్లో ఏదో ఒక్క దానిని ఎంపిక చేసుకుంటారు 
 [6] మ్యూజిక్: భారతీయ సంగీతము మీద ఉత్సాహము ఉన్నవారు, తబలా వాయిద్యము నేర్చుకుంటారు. 
 [7] యోగా: గత 30 సంవత్సరాలనుండి, పంజుభాయి పటేల్ అనే స్వచ్చంద సేవకుడు, సిల్క్ లో యోగా తరగతులు చెబుతున్నారు. చాలా మంది కొత్త వాలంటీర్స్ కు, పంజుభాయి ఆదర్శము. 
 [8] వంటలు: చాలా మందికి భారతీయ వంటలు, మసాలాదినుసులు, సుగంధ/ పరిమళ ద్రవ్యాలు అంటే చాలా యిష్టము. అవి నేర్చుకోవటానికి, సిల్క్ కు వస్తారు. ప్రతి వారము, ఎవరో ఒకరు తమ రాష్ట్రానికి సంబంధించిన వంటకాన్ని గాని, తమకు యిష్టమైన వంటకాన్ని గాని, కుకింగ్ క్లాసులో చేసి చూపిస్తారు. 
 [9] చదరంగము: మన భారత దేశములో పుట్టిన ఈ ప్రాచీన ఆటను కూడా, ఈ క్లాసులో నేర్పిస్తాము. 
[10] క్రికెట్: స్కూల్ జిమ్నాసియం లో కొంత మంది పిల్లలు క్రికెట్ నేర్చుకుంటారు. 
 [11] కళలు (విస్యువల్ ఆర్ట్స్ క్లాస్): ఈ తరగతిలో పిల్లలు భారతీయ కళలు కొన్ని నేర్చుకుంటారు - మెహేంది/గోరింటాకు డిజైనులు, రాక్ ఆర్ట్, మట్టితో శిల్పాలు చేయటము, దీపావళి ప్రమిదలకు రంగులు దిద్దటము, పండుగల సందర్భముగా గ్రీటింగ్ కార్డులు తయారు చేయటము మొదలైన విషయాలు నేర్చుకుంటారు 
 [12] కళలు (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ క్లాస్): చాలా మంది అమ్మాయిలు, ఈ క్లాసులో డ్యాన్స్ నేర్చుకుంటారు. వయసును బట్టి, విద్యార్ధులందరూ మూడు గ్రూపులుగా ఏర్పడి (6 నుండి 8; 9 నుండి 12; 13 సంవత్సరాల పైన), ఏదైనా బాలీవుడ్ డ్యాన్స్ గాని, లేదా ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన జానపదనృత్యము గాని నేర్చుకుంటారు. ముగింపు: 17 tabla performance by silc students చివరగా, మన జాతీయ గీతము "జన గణ మన" తో, శనివారము పాఠశాల పూర్తవుతుంది. పైన చెప్పిన ప్రకారము, పిల్లలు, పెద్ద వారు తమ అభిరుచులకు తగ్గట్టుగా, తమకు నచ్చిన భారతీయ భాషను, తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి శనివారము సిల్క్ లో జరిగే ఈ మూడు గంటల బోధనా కార్యక్రమాలు, ఒక్క భాషకో, ఒక్క ప్రాంతానికో, ఒక్క మతానికో పరిమితము కాకుండా, భారతదేశము గురించి తెలుసుకోవటానికి చాలా సహాయ పడతాయి. సోషల్ స్టడీస్ డే, యాన్యువల్ డే -- ఈ ప్రత్యెక దినాల్లో, మా స్కూలు పిల్లలు వారు నేర్చుకున్న విషయాలను ఆటలు, పాటలు, మాటలు, నాటికల ద్వారా ప్రదర్శిస్తారు. సిల్క్ మేళా, ఫీల్డ్ ట్రిప్స్, హోలీ, దీపావళి, పిక్చర్ డే, హ్యల్లోవీన్, క్రిస్టమస్ -- ఈ రోజులలో, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాము పాఠశాలలొ జరిగే ఈ కార్యక్రమాలతో పాటు, జంట నగరాలలో జరిగే చాల కార్యక్రమాల్లో, సిల్క్ పాల్గొంటుంది. ఈ కార్యక్రమాల్లో, డ్యాన్స్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ప్రదర్శనలు యిస్తారు. 
మచ్చుకి కొన్ని వివరాలు... [1] ఫెస్టివల్ అఫ్ నేషన్స్ [2] ఇండియన్ అసోసియేషన్ అఫ్ మిన్నెసోటా - కనెక్ట్ ఇండియా [3] ఇండియన్ అసోసియేషన్ అఫ్ మిన్నెసోటా - ఇండియా ఫెస్ట్ [4] ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బర్న్స్ విల్, మిన్నెసోటా [5] హోలీ, దీపావళి ఈవెంట్స్ - హిందూ మందిర్, మిన్నెసోటా [6] కల్చరల్ ఫెస్టివల్ - మిన్నెసోటా హిస్టారికల్ సొసైటీ [7] హెరిటేజ్ ఫెస్టివల్ - వుడ్ బరి, మిన్నెస్తొఅ [8] ఫ్లింట్ హిల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్, సెయింట్ పాల్ ప్రతి సంవత్సరము, కనీసము ఒక ఫీల్డ్ ట్రిప్ కు మా పిల్లలను తీసుకు వెళ్తాము. ఒక్కోసారి, భారతీయ నిపుణులను, మా స్కూలు కు ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమాలలో, మా పిల్లలు భారత దేశము గురించి, నాటకాల ద్వారా, సంగీత కచేరిల ద్వారా, కథలు వినటము ద్వారా తెలుసు కుంటారు.  
8. మీరు చేస్తున్న కృషికి మీరు అందుకున్న ప్రశంసలు/అవార్డులు , లేక మీరు మర్చిపోలేని అనుభూతిని గురించి చెబుతారా ? 
 అవార్డ్స్ 1997-98: - మిన్నెసోటా స్టేట్ కౌన్సిల్ నుండి ఆసియా-పసిఫిక్ మిన్నెసోటన్స్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డు 2009: ఇండియన్ అసోసియేషన్ అఫ్ మిన్నెసోటా అచీవ్ మెంట్ అవార్డ్ ఈ అవార్డులతో పాటు, 35 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో, ఎన్నో మైలు రాళ్ళు, గురుతులు, అనుభూతులు వున్నాయి. ప్రతి సంవత్సరము చివరలో, ఆ విద్యా సంవత్సరములో జరిగిన విషయాలన్నీ సంగ్రహించి, ఒక "ఇయర్ బుక్" ప్రచురించటము. 10, 20, 25, 30 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవటము 20 సంవత్సరాల క్రితము ఈ స్కూలు లో చదివిన పిల్లలు, తమ తమ రంగాలో నిష్ణాతులై, తిరిగి మా దగ్గరకు వచ్చి, సిల్క్ లో వారు పొందిన అనుభవాలు తమను పరిపూర్ణమైన వ్యక్తులుగా మారటానికి ఎలా దోహదపడ్డయో చెప్పటము. 30 సంవత్సరాల నుండి, స్వచ్చందముగా యోగా తరగతులను నిర్వహిస్తున్న పంజా భాయి పటేల్ ను, సన్మానించటము! గత 35 సంవత్సరాలనుండి, క్రమము తప్పకుండా, ఫెస్టివల్ అఫ్ నేషన్స్ లో, భారత దేశ కళా సంస్కృతులకు ప్రాతినిధ్యము వహించటము. "విజ్ఞుల మాటలు, విజయానికి బాటలు" పుస్తకానికి ఆర్ధిక సహాయము అందించటం, దాని అనుబంధ పుస్తకము "మాటలతో ఆటలు" ప్రచురించటము. మి న్నెసోటా హిస్టారికల్ సొసైటీ వారు, ఆసియన్ యిండియన్ పౌరుల సామాజిక జీవన విధానాలను "ఓరల్ హిస్టరీ" గా సంకలనము చేసినప్పుడు, ఆ ప్రాజెక్టులో చురుకుగా పాల్గొనటము 2014 లో జార్ఖాలాండ్ (ఇండియా) నుండి, ఆల్ గర్ల్స్ ఫుట్ బాల్ టీం మిన్నియాపోలిస్ కు వచ్చినప్పుడు, వారికి ఆహార సదుపాయాలు అమర్చటానికి, జంట నగరాల ప్రజలతో, సంస్థలతో అనుసంధాన కర్తగా పాత్ర వహించటము. ఒక భాషకు, మతానికి, ప్రాంతానికి పరిమితము కాకుండా, ఒక లౌకిక సంస్థగా జంట నగరాల ప్రజల మన్నన పొందటం. 9. ప్రస్తుతం మీ సంస్థ/సంఘం లో ఎంతమంది సభ్యులు ఉన్నారు ? 
 ప్రతి సంవత్సరము - దాదాపుగా 40 మంది స్వచ్చంద సేవకులు, వివిధ తరగతులు తీసుకుంటారు. 125 నుండి 175 వరకు విద్యార్ధులు ఉంటారు. సిల్క్ నిర్దేశక మండలిలో 12 సభ్యులు వున్నారు.గత 35 సంవత్సరాలుగా, జంట నగరాలలో ఉన్న ఎంతో మంది విద్యార్ధులకు , కుటుంబాలకు - భారత దేశము గురించి తెలియ జేసింది. వాళ్ళందరినీ, మా సంస్థ సభ్యులుగా, భారతదేశము బ్రాండ్ అంబాసడర్స్ గా పరిగణిస్తాము. 
 10. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? 
 యిక్కడ పిల్లలు, తమ మాతృ భాష ఆంగ్ల భాష నేర్చుకోవటానికి, ఎన్నో సాధనాలు ఉంటాయి. ఉదాహరణకు, ఆటలు, పాటలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పజిల్స్ - ఎన్నో సాధనాలు, పద్ధతులు - టీచర్స్ కు అందుబాటులో ఉంటాయి. కాని మన భారతీయ భాషలు నేర్చుకోవటానికి, ఇలాంటి సాధనాలు, పద్ధతులు తయారు చేయాలంటే , చాల సమయముతో కూడిన పని, ఉదాహరణకు, కూరగాయల గురించి చెప్పేటప్పుడు, 10 కూరగాయల పేర్లు ఉండే ఒక పద బంధము / వర్డ్ సెర్చ్ పజిల్ చేయాలనుకుందాం. ఇంగ్లీషులో, ఇలాంటి పజిల్స్ చేయటానికి, చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి గాని, మన తెలుగు లో గాని, యితర భారతీయ భాషల్లో గాని, ఇలాంటి పజిల్స్ చేయటానికి అవకాశము లేదు. మన భారతీయ భాషలను, ఆటలు, పజిల్స్ ద్వారా ఎలా నేర్పించవచ్చు? భాషా సేవకులకు, ఈ సాధనాలు అందచేసి, వారి విలువైన సమయాన్ని, ఎలా సద్వినియోగ పరుచుకోవచ్చు? ప్రస్తుతము, మా స్కూలు ఈ విషయము పై, చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే, ఒక ప్రాంతానికి గాని, ఒక భాషకు గాని, ఒక మతానికి గాని పరిమితము కాకుండా, భారత దేశము గురించి, ప్రవాస భారతీయులకు, మన దేశము గురించి తెలుసు కోవాలనుకొనే విదేశీయులకు, అధునాతన బోధనా పద్దతులతో (ఇంటర్ నెట్, పేస్ బుక్, యు ట్యూబ్, ఐ పాడ్, మొబైల్) విషయ సమాచారాలు ఎలా పంచుకోవచ్చు? ఈ విషయము కూడా, మా లక్ష్యాలలో మరొకటి. అన్ని భాషలూ, ఒక్క ప్రదేశములో నేర్పుతాము కాబట్టి, గత 35 సంవత్సరాలుగా ఈ స్కూలు నడుపుతున్నాము కాబట్టి, చాలా అనుభవాలు, సాధనాలు, ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని, పుస్తక రూపములో (ఎలక్ట్రానిక్ బుక్) తీసుకు వచ్చి, ప్రపంచములో వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు, అంద చేయాలని ఒక కోరిక. ఆ ఆశయ సిద్ది కోసము, ప్రస్తుతము కృషి చేస్తున్నాము. 
 11. ప్రస్తుతం మీరు ఏ ఏ దేశాల్లో మీ సేవలను అందిస్తున్నారు ? ఏ విధంగా సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు ? ప్రస్తుతము, అమెరికాలోని మిన్నియాపోలిస్ - సెయింట్ పాల్ జంట నగరాలలో మాత్రమే మా స్కూలు ఉంది. మా వెబ్ సైట్లో, పేస్ బుక్ గ్రూపులో మేము పొందు పరిచే పాఠ్యాంశాలను ప్రపంచములో ఎవరైనా ఉచితముగా వాడుకోవచ్చు. కాంతి ఫౌండేషన్ విజ్ఞుల అధ్యక్షులు కందుకూరి రాము గారు వ్రాసిన "మాటలు - విజయానికి బాటలు" పుస్తక ప్రచురణకు, సిల్క్ కొంత ఆర్ధిక సహాయము చేసింది. దానికి అనుబంధ పుస్తకము "మాటలతో ఆటలు" ప్రచురణ కూడా సిల్క్ చేపట్టింది. ముందు ముందు, మరి కొన్ని పుస్తకాలు, ముఖ్యముగా, ప్రవాస భారతీయులు తెలుగు నేర్చుకోవటానికి ఉపయోగ పడే పుస్తకాలు, మన తెలుగు వారి, భారతీయుల భాషా సంస్కృతులు పరి రక్షించటానికి ఉపయోగ పడే పుస్తకాలు, మీ ముందుకు తేవాలని మా ఆకాంక్ష. 
 12. తెలుగు భాషాభివృద్ధికి మనం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ? భాష పట్ల మక్కువ ఉన్నవారికి మీరిచ్చే సందేశం... అమెరికాలో పిల్లలకు యింగ్లీష్ భాషను ఎలా నేర్పుతున్నారో పరిశీలించి, ఆ బోధనా పద్ధతులను అధ్యయనము చేసి, అదే పద్ధతులను, సాధనాలను తెలుగు భాష కోసము ఎలా రూపొందించాలి? అలాగే, ఆధునిక పద్ధతులను, సాంకేతిక సామర్ధ్యాలను, మన తెలుగు భాష ప్రాచుర్యము కోసము ఎలా ఉపయోగించుకోగలము? ఈ విషయము పై కూడా దృష్టి సారించాలి. విదేశాల్లో ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి! అన్ని సంఘాలకు ఉన్న ప్రధాన ఉద్దేశము - తెలుగు భాషా సేవ! తెలుగు భాషను నేర్ఫించటానికి అవసరమైన సాధనాలు సృష్టించటములో, ఈ సంఘాలన్నీ సమన్వయముతో పని చేస్తే బాగుంటుంది. 
 13. మీరు ఇంకేమైనా చెప్పదలచుకుంటే ఇక్కడ వివరించండి... అచ్చంగా తెలుగు - అంతర్జాల పత్రిక ద్వారా, పేస్ బుక్ ద్వారా మీరు తెలుగు భాషకు చేస్తున్న సేవలు ప్రశంసనీయము. మీరు చూపిస్తున్న శ్రద్ధాసక్తులకు, వెచ్చిస్తున్న సమయానికి నా తరపున, సిల్క్ తరపున ధన్యవాదాలు, అభినందనలు. 
 14. ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా ? వివరాలు తెలుపగలరు ?(మీ సంస్థకు సంబంధించిన వెబ్ సైటు వివరాలు, యు ట్యూబ్ లింక్ లు ,చిరునామా, ఈమెయిలు, వంటి వివరాలు అందించగలరు) 
 చిరునామా: School of India for Languages and Culture (SILC) Como Park High School; 740 West Rose Avenue; St. Paul, MN-55117 వెబ్ సైట్: www.silcmn.com బ్లాగ్స్ www.silcblogs.com పేస్ బుక్ సైట్ : www.facebook.com/silcmn ఈ మెయిల్: info@silcmn.com (general) siva.jasthi@gmail.com (for telugu language) ఫోన్ నెంబర్: (651) 894-2551

No comments:

Post a Comment

Pages