బంగారు భవితకు బాట వేస్తున్న 'సిలికాన్ ఆంధ్రా '
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరినీ ఒక త్రాటి పైకి తెచ్చి, తెలుగు పాట, తెలుగు మాట, తెలుగు ఆటకు ప్రాణం పోస్తూ, అమ్మ భాషపై మమకారం ఉన్నవారందరినీ తెలుగుబాట పట్టిస్తున్నారు సిలికాన్ ఆంధ్రా వారు. సాహిత్యపరంగా కాని, సాంస్కృతిక, సాంకేతిక పరంగా కానీ తెలుగుభాషకు ఎనలేని సేవలు అందిస్తూ, ఎందరికో స్పూర్తిగా నిలిచిన సిలికాన్ ఆంధ్రా స్థాపకులు, అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుచిభొట్ల గారితో ‘అచ్చంగా తెలుగు’ తరఫున భావరాజు పద్మిని ముచ్చటించిన విశేషాలు...
1. భాష పట్ల మీ అభిరుచికి నేపధ్యం గురించి చెబుతారా ?
చిన్నప్పుడు ఇంట్లో అమ్మానాన్నలవల్లనే నాకు భాషాభిమానం మొదలయ్యింది. ఆ రోజుల్లో నేను స్కూల్ కి వెళ్లి చదువుకోలేదు. ఇంట్లోనే చదువుకున్నాను. అప్పట్లో తెలుగు భాష అంటే, పద్యాలు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణం వంటివి ఉండేవి. మా గురువుగారైన తంగిరాల జయలక్ష్మి గారి చక్కటి బోధన, అందమైన వర్ణనలు భాష పట్ల ఆసక్తిని కలుగజేసి, అభిరుచిని పెంచాయి.
2. మీరు అధ్యాపకులని విన్నాను...
నేను చదివింది, చేసేది దేనికీ పొంతన లేనటువంటి ఒక విచిత్రమైన జీవితం నాది. B.sc చదివాకా, అప్పట్లో M.A ఎకనామిక్స్ చేస్తే ఎవరో అమెరికా వెళ్ళారని చెప్పటంతో, అందులో చేరాను. మా తండ్రిగారు అకస్మాత్తుగా చనిపోయేటప్పటికి నాకు 20 ఏళ్ళు. అప్పుడు చదివిన చదువు అక్కరకు వచ్చి, మళ్ళీ మా ఊళ్లోనే, ‘ ఆంధ్ర జాతీయ కళాశాల’ లోనే ఆర్ధికశాస్త్ర అధ్యాపకుడిగా చేరటం జరిగింది. తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీ లలో, అమెరికా దేశంలో కూడా పనిచేసినా, ఇప్పటికీ మా ఊళ్ళోని కళాశాలలో పనిచేసిన మూడేళ్ళు , నా జీవితంలో స్వర్ణయుగమని భావిస్తాను. దాదాపు నావయసున్న, నాకంటే పెద్ద శరీరాకృతి ఉన్న విద్యార్ధులకు బోధించిన అనుభవం, నా శక్తియుక్తులను పెంచుకునేందుకు బాగా ఉపయోగపడింది.
3. మీరు అమెరికాకు వెళ్ళటం ఎలా సంభవించింది ?
నేను అధ్యాపకుడిగా ఉన్నప్పుడే, వివాహం చేసుకోవడం, పాప పుట్టడం, తర్వాత ఇంకా ఏదో సాధించాలి అన్న ఉద్దేశంతో యేవో పరీక్షలు రాసి, భార్యాపిల్లల్ని అక్కడే వదిలి, విద్యార్ధిగా ఇక్కడకు వచ్చి, ఒక విచిత్రమైన జీవితం గడపడం, తర్వాత అక్కడే ఉద్యోగం రావడం, జరిగాయి. అలా 87 వ సంవత్సరంలో ఇక్కడకు వచ్చాకా, అప్పటినుంచి ఇప్పటివరకూ 27 సం. ఇక్కడే గడపడం జరిగింది.
4. సిలికాన్ ఆంధ్రా ఆవిర్భావం వెనుక ఉన్న స్పూర్తిని గురించి చెబుతారా ?
2001 ఆగష్టు 4వ తేదీన సిలికాన్ ఆంధ్రా పుట్టింది. అమెరికాలో లక్షలాది మంది తెలుగువాళ్ళు, అనేక తెలుగు సంఘాలు కూడా ఉన్నాయి. అయితే, ఒక సంఘం అనగానే కొన్ని బాధ్యతలు, అంతా సహాయం చెయ్యడాలు ఉంటాయి.
కాలక్రమంలో సంస్కృతికి, వినోదానికి మధ్య ఉన్న తేడాని పూర్తిగా విస్మరించడం జరిగింది. వినోదం వేరు, సంస్కృతి వేరు. ముఖ్యంగా మన దేశానికి దూరంగా విదేశాల్లో ఉన్నప్పుడు రేపటితరం పిల్లలకు మన సంస్కృతిని, సాహిత్యాన్ని , సంప్రదాయాల్ని తెలియచెప్పవలసిన అవసరం ఉంది. కాని, దురదృష్టవశాత్తూ, ప్రతీది, చలనచిత్ర ఆధారితమై పోవడంతో, ఉగాదైనా, సంక్రాంతైనా ఏ పండుగైనా, సినిమాల చుట్టూ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. అప్పుడు, ఇలా కాదు, రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగువారికి, చలనచిత్ర చరిత్ర కేవలం 75 సం.లే కదా, మరి మిగతా 1925 సం. వారు వినోదం లేకుండా గడపలేదు కదా, అనుకుని, చలనచిత్రం మనపై ఇంతగా దాడి చెయ్యాలా అన్న ఆలోచన నుంచి పుట్టిన ఒక సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్పూర్తితో స్థాపించిన జగమంత కుటుంబం సిలికాన్ ఆంధ్రా.
ఈ కుటుంబం ప్రారంభించిన నాటినుండి, మేము చలనచిత్ర ఆధారిత కార్యక్రమాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవీ ఈ వేదికపై ప్రదర్శించలేదు. అంటే, మేము చలనచిత్రాన్ని నిషేధిస్తున్నామని కాదు. అవి అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. కాని మన అష్టావధానం, జానపద గేయ రూపకం, కూచిపూడి నాట్యం, పౌరాణిక పద్య నాటకం, వంటివి మన సంస్కృతిని ప్రతిబింబించేవి, మనకు అందుబాటులో లేనటువంటివి. ఉగాదికి కార్యక్రమం అంటే, ఒక కవిసమ్మేళనం చేసి, వివిధ రకాల భావనల్ని, భావుకతల్ని అందించాలి కాని, సినిమా వినోదం కాదు, అనుకుని, మొదలుపెట్టి, ఇప్పటికి 14 సం. నుండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాము.
తెలుగుదనం అనేది, ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోనూ నిద్రాణంగా ఉంటుందని, అది తట్టి లేపితే అంతా ఆనందిస్తారని, రుజువయ్యింది.
5. మొదట్లో సిలికాన్ ఆంధ్రా లో ఎంతమంది సభ్యులు ఉండేవారండి ? కొత్తల్లో స్పందన ఎలా ఉండేది ?
సిలికాన్ ఆంధ్రా మొట్టమొదట పెట్టిన కార్యక్రమం గరికపాటి నరసింహారావు గారి అష్టావధానం. వారు అమెరికా వస్తున్నారు, ఎవరో ఒకరి ఇంట్లో చిన్న కార్యక్రమం చెయ్యండి, అన్నారు ఒకరు. ఇదివరలో కార్యక్రమం పెడితే, 50 మంది కంటే రారు, నిర్వాహకులకు కష్టం అన్నారు. నాదృష్టిలో అష్టావధానం అనేది, ఒక అపూర్వమైన సాహితీ ప్రక్రియ, అందుకే, తెలుగు సాహితీ ప్రతిభకు ప్రపంచ వేదికపై పట్టం కట్టాలి అనుకున్నాను. ఇంటింటికీ తిరిగి, అష్టావధానం అంటే ఏమిటో వివరిస్తూ కరపత్రాలు పంచాము. అప్పుడే పుడుతున్న ఈ సంస్థ నిర్వహించే అష్టావధాన కార్యక్రమానికి వెయ్యి మంది పైన రావడం, 3.5 గంటల సేపు కదలకుండా కూర్చోవడం, ధారణా సహిత అవధాన కార్యక్రమం నిర్వహించమని, ప్రేక్షకులే కోరుకుని విజయవంతం చెయ్యడం అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి సారి. అప్పటినుంచి సిలికాన్ ఆంధ్రా కార్యక్రమం అంటే, కొన్ని ప్రమాణాలు పాటిస్తారు అన్న నమ్మకం ఏర్పడి, జనం వస్తూనే ఉన్నారు.
మొన్న డిసెంబర్ 2014 లో జరిగిన 4 వ ‘అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం’ కోసం కూచిపూడి నాట్యమే నాడిగా జరిగిన కార్యక్రమానికి 35,౦౦౦ మందికి పైగా ప్రేక్షకులు రావడం, అనేది, మనం సరైన పద్ధతిలో క్రమాలు చేస్తే, ఆదరణ ఉంటుందని ఆరంభించిన నాటినుండి ఈ నాటివరకూ రుజువు చేసింది.
6. ‘మనబడి’ స్థాపించడం వెనుక సంకల్పం ఏమిటండి ?
2007 సం. వచ్చేసరికి ఇక్కడి పిల్లలు మన కట్టూ, బొట్టూ , ఆహార్యంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూనే అమెరికా వ్యవస్థలో విజయాల్ని సాధించారు . కాని వేదికపై జరిగే అనేక కార్యక్రమాలకు మూలం, వారికి ఈ సంస్కృతిసాహిత్యంతో అనుబంధం ఏర్పడాలంటే వారికి భాష వచ్చి ఉండాలి అనే ఆలోచన నుంచి ఫిబ్రవరి 21, 200 7 సం. లో ప్రారంభించినదే మనబడి. మన పిల్లలకు ఇక్కడ ఒక ప్రణాళికా బద్ధమైన తెలుగు విద్యా వ్యవస్థను రూపొందించాము. ఉగాది రోజున ఒక 100 మంది పిల్లలకి సామూహిక అక్షరాభ్యాసం చేసి, ప్రారంభించిన మనబడి, ఇవాళ 5 సం. పాఠ్య ప్రణాళికతో, అంటే, ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము అనే నిబద్ధమైన ప్రణాళికగా మారింది. ఇవాళ అమెరికాలో 35 రాష్ట్రాల్లోనూ, బయట 10 దేశాల్లోనూ, 4000 మందికి పైగా పిల్లలకు శిక్షణ ఇస్తోంది. వందలాది మంది స్వచ్చందంగా బోధించే ఉపాధ్యాయులు, వెనుక విస్తృతమైన కార్యవర్గం ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో స్వచ్చందంగా తెలుగు బోధించే అతిపెద్ద వ్యవస్థ మనబడి అని చెప్పుకోవచ్చు.
7. మనబడిలో తరగతులు రోజూ నిర్వహించబడతాయా లేక వారాంతాల్లోనా ?
శుక్ర, శని, ఆదివారాల్లో ఉంటాయి. గత 60,70 ఏళ్ళ నుంచి తెలుగువారు అమెరికాకు అవకాశాల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక 3 నెలల క్రితం తెలుగు భాషను, కాలిఫోర్నియా రాష్ట్రంలో, సీమొంట్ జిల్లాలో వారు అధికారికంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఉన్నతవిద్యాల్లో ఆంగ్లం కాని భాషను చదవాలి, అలా ఇప్పుడు మనబడి లో తెలుగును చదివినా, వారు ఆమోదించి, విద్యార్ధులు ముందుకు వెళ్ళవచ్చని చెప్పటం, ఒక అద్భుతమైన విజయమని, మనం భావించవచ్చు.
8. మనబడిలో పిల్లలకు చదువుతో పాటుగా నేర్పేవి ఏమైనా ఉన్నాయా ?
మాట్లాడడం, చదవడం, రాయడం, నేర్పుతాము. ఇవి కాకుండా, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు 5 సం. పూర్తి చేసేసరికి, వారిని ఛందోబద్ధంగా కంద పద్యాలు రాసే స్థాయికి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ప్రతి సంవత్సరం జరిగే మనబడి సాంస్కృతికొత్సవంలో , తెలుగు మాట్లాట, పదరంగం అనే ఆటలు, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి, వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాము.
9. యూనివర్సిటీ అఫ్ సిలికాన్ ఆంధ్రా స్థాపన గురించి చెబుతారా ?
ఇవాళ అమెరికాలో 3 లక్షల మంది తెలుగువారు, ౩౦ లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడ అనేక వేలమంది మన శాస్త్రీయ సంగీతం, నాట్యం , వీణ, వయోలిన్ వంటివి నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒక సమాంతర వ్యవస్థ ఉంది. కాని, ఇక్కడ నేర్చుకుంటున్న కళలకు భాష తెలియకుండా, అందులో ప్రావీణ్యం సంపాదించడం సాధ్యం కాదు. అందుకే భారత దేశం వెలుపల, భారతీయ కళలకు భారతీయ భాషలకు , భాషాశాస్త్రాలకు ఇంతవరకూ ప్రపంచ స్థాయిలో విశ్వవిద్యాలయం లేనటువంటి కొరతను సిలికాన్ ఆంధ్రా ద్వారా తీర్చాలి అనేది లక్ష్యం. దానికోసం ఇక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆఖరి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము. అది పొందితే, 20 15 విద్యా సంవత్సరంలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయం ప్రారంభిస్తాము.
10. ఇందులో ఉన్న 3 భాగాలు, యూనివర్సిటీ అఫ్ మ్యూజిక్, డాన్స్, లిటరేచర్ లో 2 భాగాలు ఉంటాయట. చారిత్రాత్మకంగా థియరీ చెప్పడం వేరు, కాని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో సంగీతం బోధించడం అనేది ఎలా సాధ్యం ?
అంటే ఇవాళ సంగీత పాఠాలు బోధించాలి అంటే, ఎదురుగుండా కూర్చుని చెప్పనక్కర్లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో, ‘మాసివ్ ఆన్లైన్ కోర్స్ ‘ల ద్వారా, గురువు చెప్పిన రాగలక్షణాలు, రాగారీతుల గురించి చెప్పిన పాఠం అంతర్జాలంలో చూసి, ప్రపంచంలోని ఏ మూల ఉన్నా , గురువుతో చర్చించి, వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరైనా వీలైన సమయంలో ఆ పాఠం అందుకుని, మెళకువలు నేర్చుకుంటున్నారు, ఇదే మేమూ ఉపయోగించుకోనున్నాము.
11. ప్రచ్చనంగా భాషాభివృద్ధికి , సాంకేతికపరంగా మీరు ఎంతో దోహదపడుతున్నారు. మీరు రూపొందించిన 18 రకాల ఫాంట్ లను గురించి, అలాగే, గురుస్వర గురించి, తెలుగులో వికీపీడియా రూపొందించడం గురించి, చెబుతారా ?
మనకి తెలుగులో యూనికోడ్ ఫాంట్(విశ్వ సంకేత ఖతులు) లు అతి తక్కువ ఉన్నాయి. ఇవాళ భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగు భాష ఆదిమానవుల కంటే ముందున్న స్థితిలో ఉంది. అంతర్జాలం అనేది, బ్రహ్మాండం వంటిది. అందులో ఏది వెతికి పట్టుకోవాలన్నా, ఏ భాషకు సంబంధించినది అయినా, అది యూనికోడ్ లో ఉంటేనే సాధ్యం. ఇవాళ ఆంగ్లంలో ఒక బిలియన్ పుటలు అంతర్జాలంలో ఉంటే, తెలుగులో పట్టుమని పది లక్షల పేజీలు కూడా లేవు. అది గమనించిన తర్వాత, దీనికి కారణం తెలుగులో, యూనికోడ్ లో అందమైన ఖతులు లేకపోవడమే అనిపించింది. వైవిధ్యమైన ఖతులు తీసుకురావాలని, సిలికాన్ ఆంధ్రా, ఆంధ్ర ప్రభుత్వ సాయం, అనేకమంది దాతల సాయంతో, 18 ఖతులు రూపొందించింది. తర్వాత ప్రపంచంలో అగ్రగామి అయినట్టి గూగుల్ తో కలిసి, 18 ఖతుల్లో 16 ఖతుల్ని గూగుల్ ద్వారా మొన్న సంక్రాంతి నాడు ప్రపంచానికి అందించడం జరిగింది. ఇవాళ భారతీయ భాషల్లో ఎక్కువ ఖతులు ఉన్నది, తెలుగు భాష. ఇది మొదటి అడుగు.
ఇప్పుడు ఆప్టికల్ క్యారెక్టర్ రెకగ్నిషన్ టెక్నాలజీ (ocr) పై గూగుల్ వారు పరిశోధనలు చేస్తున్నారు. తిరిగి సిలికాన్ ఆంధ్రా వారితో చేతులు కలిపి, పనిచేయ్యబోతోంది. ఎందుకంటే, భవిష్యత్ తరాలవారికి తెలుగు భాష కనిపించేది, వినిపించేది, అంతర్జాలంలో లేక వారి చేతుల్లో ఉన్న చరవాణుల్లో. వీటిల్లోకి కావలసిన పరిజ్ఞానం మనం తయారు చెయ్యగలిగితే, వారు రేపు ఉదయం ఒక కావ్యం చదవాలంటే, కవిత చదవాలన్నా, వీలౌతుంది. ఇందుకు మేము పూనుకున్నాము.
12. పుస్తకాల డిజిటలైజేషన్ గురించి కృషి చేస్తున్నారట...
అది ఇంకా ఆరంభించలేదండి. ఆలోచనలో ఉన్నాము. ఈ ఏడాది, OCR పరిజ్ఞానం వస్తే, అది చాలా సులువు అవుతుంది.
13. కూచిపూడి గ్రామం దత్తత తీసుకున్నారు కదా. దాని గురించి చెబుతారా ?
‘కూచిపూడి తెలుగువారి జీవనాడి’ అని సిలికాన్ ఆంధ్రా నమ్ముతుంది. కూచిపూడి నాట్యానికి విస్తృతమైన ప్రాచుర్యం కల్పించి, ఎక్కువమంది చూడాలి, నేర్చుకునేలా చెయ్యాలి అన్న ఆలోచనతో రకరకాల కార్యక్రమాలు చేస్తూ, 2008 లో మొదటి ‘కూచిపూడి నాట్య సమ్మేళనం’ నిర్వహించి, అప్పటి నుంచి ప్రతి 2 సం. కు ఒక సమ్మేళనం నిర్వహిస్తున్నాము. కుచిపూడిని ప్రజలు ఆదరించాలి, అన్న ఉద్దేశంతో, 4 వ సమ్మేళనం కు వచ్చేసరికి, నాట్యం చేసేవారు 6000 మంది పాల్గొని, సంప్రదాయ నాట్యాన్ని చూసేందుకు 35,000 మంది తరలి రావటం అనేది, తెలుగు సాంస్కృతిక చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని భావిస్తున్నాము.
దాన్ని చూసిన ఇప్పటి ముఖ్యమంత్రి గారు, కూచిపూడిలో ఒక ప్రపంచస్థాయిలో అంతర్జాతీయ హంగులతో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించాలని, తలపెట్టారు. దీనికై ఆ ఊళ్ళో నాట్యారామం నిర్మించేందుకు ఆ ఊరిని కూడా దత్తత తీసుకోవాలని, ప్రతిపాదించారు. అందుకు మేము ముందుకు వచ్చాము.
14. మీరు ఎన్.టి.ఆర్ అవార్డును అందుకున్నప్పటి మీ మనోభావాలు చెబుతారా ?
అది చాలా అందమైనటువంటి అనుభూతండి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళిన అన్నగారి అవార్డు అనగానే ఆనందం వేసింది. మరిన్ని సాధించాలి అనేవాటికి, ఈ అవార్డు ఒక స్పూర్తి.
నేను సామాన్యంగా పురస్కారాలకు దూరం. సేవ చేస్తున్నాం అని కూడా అనుకోను. మిగతా వారు చెయ్యట్లేదు కనుక, చేస్తున్నవారు ‘సేవ చేస్తారు’ అంటూ ఉంటారు. భాషా పరిరక్షణ ప్రతి తెలుగువాడి బాధ్యత అని నా నమ్మకం.
15. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
రాబోయే 24 నెలలు, కూచిపూడి నాట్యారామం, సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం మీద శక్తియుక్తులను కేంద్రీకరిస్తాము.
16. ఇన్నాళ్ళ మీ ప్రయాణంలో, మీరు మర్చిపోలేని అనుభూతి గురించి చెబుతారా ?
ఎవరో ఒక రచయత చెప్పినట్లు, ‘జీవితం అనుభూతుల పుష్పగుచ్చం.’ ఎక్కడో అమెరికాలో పుట్టిన పిల్లాడు పారిజాతాపహరణం లోని పద్యం ఎటువంటి యాసా లేకుండా పాడుతున్న ఆనందం దగ్గర నుంచి, చిన్న చిన్న గ్రామాల నుంచి తెలుగు భాష, భారత సంస్కృతి తెలియని వారు వచ్చిన ఒక రష్య, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారు నాట్యం నేర్చుకోవడం వంటి ఎన్నో అనుభూతులు ఉన్నాయి. చిన్న చిన్న విజయాలను ఆనందిస్తూ పోతూ ఉంటే, ప్రతిదీ ఒక అందమైన అనుభూతి అని నేను నమ్ముతాను.
17. ఇక్కడి తెలుగువారు భాష పట్ల చెయ్యాల్సిన కృషి ఏదైనా ఉందా ?
అమ్మభాష అన్నం పెట్టదు, అన్న ఆలోచనలో వారంతా ఉన్నారు. వ్యవస్థ వారిని ఆ దిశగా తీసుకువెళ్ళింది. వారు అటు ఆంగ్లంలోనూ, ఇటు తెలుగులోనూ ప్రావీణ్యం లేని స్థితిలో ఉన్నారు. ఇంకా చాలా జరగాల్సి ఉంది, అమ్మభాష అన్నం పెట్టగలదు అన్న నమ్మకం వారికి కలిగించాలి. ఒక్కొక్కళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి. చెప్తే వినేవారు ఉన్నారు, కాని చెప్పేవారే లేరు. అందుకే, ఆశావహ దృక్పధంతో ముందుకు వెళ్ళాలి.
“ అసాధ్యాలను సుసాధ్యాలను చెయ్యటమే మనం నడిపే అధ్యాయాల్లో అక్షరాలు కావాలి “ అన్నది మా సిలికాన్ ఆంధ్రా నమ్మకం. అలా చెయ్యగలమన్నదే మా ఆశ, ఆశయం, ఆకాంక్ష.
18. మా ‘అచ్చంగా తెలుగు’ చదువరులకు మీరు ఇచ్చే సందేశం...
గూగుల్ వాళ్ళు మా ఖతుల్ని మరింతగా చెక్కి, 1000kb నుంచి 350kb మలచి, ఉచితంగా అందిస్తున్నారు. ఈ యూనికోడ్ ఖతులను గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని వినియోగించండి. పేజి మేకర్ లో వాడే ఫాంట్స్ కాకుండా, వీటితో పుస్తకాలు రూపొందిస్తే, గూగుల్ సెర్చ్ లో అందుబాటులో ఉండవు. అవి ముద్రించి, పంచిపెట్టుకోవడం తప్ప ఉపయోగం ఉండదు. అదే ,తెలుగు పుస్తకాలు ముద్రిస్తే యూనికోడ్ ఖతుల్లో ముద్రించండి. అప్పుడు అది అంతర్జాలం లో పెట్టుకోవడానికి, సులువుగా గూగుల్ సెర్చ్ లో అందరికీ వెతకడానికి, అనువుగా ఉండి, వారి రచనలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. కలం పట్టిన ప్రతి రచయత, లేక రచయిత్రి, పుస్తకాల్ని యూనికోడ్ ఖతుల్లో రూపొందించడం అనేది, ఒక ఉద్యమంలా చేపట్టండి. ఇలా చేస్తే మీరు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసినట్లు అవుతుంది.
భాషా పరిరక్షణకు ‘అమ్మకు’ దూరంగా ఉన్నా, అమ్మపై అసలైన ప్రేమతో సిలికాన్ ఆంధ్రా వారు చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడి వారికీ స్పూర్తిగా నిలవాలని, మనము సైతం ఉద్యమించి, సరికొత్త పధకాలతో భాషా పరిరక్షణకు కంకణం కట్టాలని, ఆశిస్తున్నాం. సిలికాన్ ఆంధ్రా వారు మరిన్ని కొత్త విజయాలు, అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి, విజయయాత్ర కొనసాగించాలని, ‘అచ్చంగా తెలుగు’ మనస్పూర్తిగా ఆకాక్షిస్తోంది. శుభం !
ఆనంద్ గారితో నా ముఖాముఖి ని క్రింది లింక్ లో వినండి...
No comments:
Post a Comment