శ్రీధరమాధురి -12
‘వాడికే అంతుంటే నాకు ఎంతుండాలి...’ అనడం వింటూ ఉంటాం. ఇంతకీ నిశితంగా పరిశీలిస్తే... ఆ ‘అంత’ పేరు ఏమిటో తెలుసా ? “అహం!!!” మనకు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పైగా ఇది ప్రేమకీ, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతిబంధకం కూడానూ ! మరి ఈ అహాన్ని జయించడం ఎలాగో పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజి మాటల్లో చదవండి...
**********
అహం మరియు దురహంకారం చెయ్యి చెయ్యి పట్టుకునే ఉంటాయి. అహం అనేది, కాస్తంత ఉండవచ్చు, లేక ఆత్మన్యూన్యతా భావంతో కలిసి దురహంకారపు మూలంగా పరిణమించవచ్చు. కపటమైన బుద్ధిలో ఉండే అపరాధభావన కొన్నిసార్లు నిజాన్ని కప్పిపుచ్చేందుకు అహంగా మారుతుంది. అటువంటప్పుడు దురహంకారం జనిస్తుంది... వ్యవ్యస్తీకృత ఆలోచనలు లోపరహితంగా ఉండాడానికి ఆజ్యం పోస్తాయి... తానొక్కడే సమగ్రంగా (సరిగ్గా) ఉన్నానన్న ఆలోచన అధికారానికి, గర్వానికి ఆజ్యం పోస్తుంది.... దీనివల్ల కలహాలు పెట్టుకునే లక్షణం జనిస్తుంది ... దానివలన కోప పెరుగుతుంది ... కోపం అనేది అహానికి ఆజ్యం పోస్తుంది... దానివలన దురహంకారం జనిస్తుంది...
***********
మనలో చాలామంది అహం మరియు ఆశించడం అనేవాటివల్ల జీవితంలో ఆనందంగా ఉండలేరు. ఆ వ్యక్తిలో ఉన్న మొండితనం అతన్ని జీవితానికి లొంగకుండా, అంగీకరించకుండా అడ్డు పడుతుంది. అందుకే మీరు కలహాలకు పాల్పడి, గెలిస్తే అహంకారిస్తారు, ఓడితే నిరాశకు గురౌతారు. మీకు జీవితం అంటే ఒక సవాలు అని చెప్పారు. మీకు జీవితం క్లిష్టరమని, దాన్ని ఎదుర్కునేందుకు మీరు సిద్ధం కావాలని, నూరిపోసారు. అందుకే మిమ్మల్ని పోటీ పడమన్నారు. పిచ్చి వారిలా పరుగులు తియ్యమన్నారు. మీ ఆశ మీరు ఈ ఆటలో గెలుస్తారని. యెంత కష్టించినా, అనుకున్నవి జరగకపోవడంతో మీరు నిరాశకు గురౌతారు. ఇదే ఆశించడం వల్ల జనించే దుఃఖం. జీవితం చాలా సులువు. మీరు పనులను చేస్తున్నా, అసలు కర్త మీరు కాదు. మీతో ఉన్న శక్తే అన్నింటికీ కర్త. అందుకే, ఆ శక్తికి తలవంచి, పూర్తిగా లొంగిపొండి. బుద్ధితో ఆలోచించే వ్యక్తి కావద్దు. మనసు నిండా బేషరతైన ప్రేమ కల వ్యక్తిగా, ఈ సృష్టి మొత్తం మీదా దయ, ప్రేమ కల వ్యక్తిగా ఉండండి. అహాన్ని వీడండి. పోటీ పడకండి. మీరు అనుకున్నట్లుగా కాక, దైవం సంకల్పించినట్లుగా అన్నీ జరుగుతాయి. దీన్ని గుర్తించి, ఎదగండి, వీటిని అధిగమించి పరిణమించండి.
***********
జ్ఞానం అనేది ఒకరకంగా ప్రమాదకరమైనది. తెలివిని బందించినట్లు దాన్ని బంధించలేరు. జ్ఞానం కలవారిని ఏమార్చలేరు. మేధ తంత్రంతో, అవకతవకలతో కూడుకున్నది. జ్ఞానం సహజమైనది, ఆధారభూతమైనది. మేధ నిబంధనలకు లోబడి పెరగడం వల్ల వస్తుంది. జ్ఞానం వాస్తవిక స్థితి యొక్క అంతర్గత అనుభూతిని, విస్మయం చెందే కళను పాడుచెయ్యకుండా కలిగించేలా చేస్తుంది. మేధ క్రమబద్ధమైన జీవితాన్ని నమ్ముతుంది. జ్ఞానం జీవితపు ప్రవాహంలో , మీరు ఏ నిబంధనలకు లోబడకుండా, ధైర్యంగా ఆ మార్గంలో పయనిస్తూనే , జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.
**************
జ్ఞానం మీ స్వస్థితి . అది సహజమైనది. దైవానుగ్రహం వల్ల సిద్ధించినది, మీ నిజ స్థితి. మీరు పుట్టకా వచ్చిన తెలివితేటలు భ్రాంతి. దానివలన మనం పుట్టినప్పుడు ఉన్న జ్ఞానాన్ని మర్చిపోయి, మధ్యలో వచ్చిన విజ్ఞానాన్ని పట్టుకు వేళ్ళాడుతూ ఉంటాము. దాని ఉత్పన్నాలు అహం, స్వార్ధం, ద్వేషం, కోపం, అసూయ వంటివి. కాబట్టి, మనల్ని దైవం పుట్టించిన స్థానానికి మనం తిరిగి చేరుకోవాలంటే, మనం నేర్చుకున్నది అంతా మర్చిపోవాలి. నిజంగా దైవం మిమ్మల్ని విడిచిన చోటే, మీకోసం వెతుకుతున్నారు, దాని చిరునామా c/o జ్ఞానం కాని, మీరు మీ చిరునామాను c/o తెలివితేటలు గా మార్చుకున్నారు. నేర్చినవి మర్చిపోండి... బంధనాలు వీడండి... అంతా దైవానుగ్రహం.
**************
మీరే కర్తలని భావించడం వల్ల, మీరు మంచివారనో, లేక చెడ్డవారనో; లోపాలు లేనివారు లేక లోపాలు కలవారనో, నేను సరిగ్గా చేసాను, లేక తప్పు చేసాననో భావిస్తూ ఉంటారు. కర్తృత్వం సరిగ్గా ఆచరించాలని, సమగ్రంగా ఉండాలని, మంచి- చెడ్డ అని, ఎంచేలా చేస్తూ, అహానికి ఆజ్యం పోస్తుంది. అహం మీ మేధస్సుతో ఆటలాడుతుంది. మీరు గర్వంతో ఉప్పొంగుతూ మాట్లాడేలా చేస్తుంది. మీరు నిర్వహించనప్పుడు భయపడేలా చేస్తుంది. మీరు సరిగ్గా చెయ్యనప్పుడు బాధపడేలా చేస్తుంది. అహం ఒక రకమైన భయాన్ని కూడా కలిగిస్తుంది. దైవానుగ్రహం వల్ల, మేము కర్తలం కాదని మాకు బాగా తెలుసు. అందుకే అహం మచ్చుకైనా లేదు. గర్వించడానికో, నిరాశ పడేందుకో ఏమీ లేదు. దైవానుగ్రహం వల్ల, దైవం నిర్మించిన గొప్ప ఆకృతిలో మేము ఒక చిన్న భాగమని మాకు బాగా తెలుసు. అందుకే మంచి- చెడు, తప్పు- ఒప్పు, లోపభరితం – లోపరహితం అనేవి మీపై ప్రభావం చూపుతాయి, మాపై కాదు. ************
తెలివితేటలు అహానికి, దురహంకారానికి దారితీస్తాయి. ఇది నిజమైనప్పుడు, ఒక మంచి కారణం కోసం మేధావులు కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు. ఆ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు, వారే సరైనవారని భావిస్తూ, ఇతరుల దృక్పధాన్ని వినిపించుకోరు. వారు వారి స్వంత ప్రపంచంలో, సమాజానికి ఉపయోగించని వారి ఆలోచనల్ని భద్రపరచుకుంటూ బ్రతుకుతారు.
************
విజ్ఞానం అనేది జ్ఞానానికి, తదుపరి వచ్చే ఆత్మ జ్ఞానానికి, అతి పెద్ద ప్రతిబంధకం. తెలివి తనకు అంతా తెలుసని భావిస్తుంది. ఇంకా అది ప్రశ్నించడం ద్వారా ఏదైనా తెలుసుకోవచ్చు, అని నమ్ముతుంది. తెలివి మనుషుల్ని ఏమార్చడం వల్ల, దాని పరిణామంగా వారు జీవితం, సృష్టి యొక్క గూఢతను చూసి, ఆశ్చర్యపోలేక పోతున్నారు. తెలివి/ మేధ మొండితనానికి, అహానికి కీలకమైనవి. నేను అటివంటి వారిని చూసి, హాయిగా నవ్వుకుంటాను. వారంతా నాకు విదూషకుల్లా కనిపిస్తారు, దైవం ఆ రూపంలో నాకు వినోదం కల్పిస్తూ ఉంటారు.
*************
ఆత్మబంధం... అహపు బంధం కాదు, ధనపు బంధం కాదు, మోహపు బంధం కాదు, జీవించండి, నవ్వించండి, ప్రేమించండి.
*************
అహం, స్వార్ధం, లోభం, లక్ష్యం, అసూయ, గర్వం, ద్వేషం, దుష్టత్వం వంటివాటి పేరుతో మీరు మీకు చేసుకున్న హానిని, తొలగించడానికే నా ప్రయాస అంతా. నాకు కర్తలు మీరూ కాదు, నేనూ కాదు అని తెలుసు కనుక, ఇందుకై నేను చేసే ప్రయాస చాలా తేలిగ్గా అనిపిస్తూ, నాకు కష్టం లేకుండా చేస్తుంది. ఓ దైవమా, నీవంత గొప్పవాడివి... పుస్తకాల్లో, ఇతర మాధ్యమాల్లో ఏదైతే ఉందో, దేన్నైతే బోధించగలరో అది మేధస్సు. దానికి పదును పెట్టడమే అధ్యాపకుడి పని. పుస్తకాల్లో , ఇతర మాధ్యమాల్లో ఏది దొరకదో, దేన్నైతే బోధించలేరో, అదే జ్ఞానం. గురువు మాటలపై మీకు గల విశ్వాసం, అదే మీ చేతల్లో ప్రతిబింబిస్తూ ఉండడం అనేది మిమ్మల్ని ఆత్మసాక్షాత్కారం యొక్క ద్వారాల వద్దకు తీసుకు వెళ్తుంది, ఇదే జ్ఞానానికి చివరి మజిలీ. అధ్యాపకుడు మీలో తెలివిని పెంచడానికి బోధిస్తాడు, కాని గురువు మీకు బోధించరు, జీవిత క్రమంలో మిమ్మల్ని సాగిపోయేలా చేస్తూ, మీరు జ్ఞానం పొందాకా, మీ ప్రక్కనే నిల్చుంటారు.
************
అన్ని ఆశయాలు కేవలం అహపు ప్రయాణాలు. గురువుతో ఉన్నపుడు అది సాధ్యం కాదు. ఆయన లక్ష్యాలతో జీవనం సాగించరు. అందువల్ల, ఆయన మిమ్మల్ని శిష్యుడిగా అంగీకరిస్తే, మీ లక్ష్యాలు ఆయనకు సరిపడవు. అందుకే, గురువు ఎవరు తన శిష్యులో చెప్పరు. ఒకవేళ మీరు నిరహంకారిగా, లక్ష్యాలు లేనివారిగా ఉంటే, మీరు అద్భుతాలు జరగడాన్ని చూడవచ్చు. మీరు మీ గురువును అన్నింటా, అంతటా చూడగలరు. మీరు గురువును చూడగలరు, తినగలరు(ఆహారం కూడా ఆయన స్వరూపంగా చూస్తూ ), అనుభూతి చెందగలరు, మాట్లాడగలరు, వాసన చూడగలరు. లేకపోతే, మీరు కేవలం అహాన్ని మరియు ఆశయాన్ని వాసన చూస్తూ, అసహ్యంగా కనిపించగలరు. అంతా దైవానుగ్రహం.
*********
ప్రామాణికమైన వ్యక్తి నిరహంకారి అయి ఉంటాడు. అతను పూర్తిగా దయ, ప్రేమ కలిగి ఉంటాడు. అహం అనేది పిరికివాళ్ళ సంపద, అబద్ధం యొక్క మారురూపం. అహంకారం కలవారు అబద్ధపు జీవితాన్ని గడుపుతూ, వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. కాని సృష్టిలో వారివలన కూడా చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు ‘ఎలా ప్రవర్తించకూడదో’ తెలిపే సజీవ సాక్ష్యాలు. మీరు అహంకారులని కలిసినప్పుడు, వారినుంచి దూరంగా వెళ్ళకండి. వారిని గమనించండి. వారిని మాటల్లోకి దింపండి. వారి గొప్పలు కొట్టుకునే స్వభావాన్ని చూడండి. దాన్నుంచి నేర్చుకోండి. అటువంటి వారిముందు మీరు చాలా నమ్రతతో, వినయంగా ఉండాలి. అప్పుడే మీరు అంచనా వెయ్యగలుగుతారు. మీరు వారిలో రావణుడి 10 తలలను చూడవచ్చు. అందుకే, అహంకారులతో మీ సంబంధాలను తెంచుకోకండి, అది నేర్చుకునేందుకు ఒక గొప్ప అవకాశం. అంతా దైవానుగ్రహం.
**********
మీ జీవితాన్ని మరీ వ్యవస్థీకృతంగా ఉంచకండి. మరీ క్రమబద్ధమైన జీవనం యాంత్రికంగా అనిపించి, చివరికి విసుగు, నైరాశ్యానికి దారి తీస్తుంది. మరీ క్రమశిక్షణ కలవారు జీవితపు ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అవుతారు. జీవితం సంపూర్ణమైనది. సరదాగా ఉండండి. తీవ్రమైన ఏ విషయమైనా మీరు దానివైపు చూడగానే హాస్యాస్పదంగా మారిపోవాలి. మీతో చాలామంది కలిసి నవ్వుతారు. హృదయం నిండుగా వినోదం నింపుకుని, అన్నింటివైపూ చూడండి. అప్పుడు తీవ్రమైన విషయాలు కూడా సరదాగా మారిపోతాయి. సమతుల్యమైన జీవితాన్ని గడపండి. ఒక లీటరు వంటాముదం త్రాగినట్లు మొహం పెట్టుకు తిరక్కండి. దైవానుగ్రహంతో , జీవితాన్ని ఆస్వాదించండి. సరదాగా ఉండండి.
**********
No comments:
Post a Comment