తెలుగు కోసం ఉద్యమిద్దాం !
- భావరాజు పద్మిని.
సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. భావరాజు పద్మిని అనబడే నేను తెలుగు భాషా పండితురాల్ని కాదు, జర్నలిస్ట్ ని అసలే కాదు. వాగ్దేవి దయతో ప్రాప్తించిన ,ఏవో నాలుగు అక్షరాలను మాలిక కూర్చి, అందరికీ ఆహ్లాదకరంగా అందించడం ఒక్కటే తెలుసు నాకు. దైవేచ్చ నన్ను ఆ దిశగా నడిపింది, కొందరు ఆత్మీయుల సహకారం నాకు దన్నుగా నిలిచింది. ముఖ్యంగా పెద్దలు, పత్రిక సంపాదకులుగా మాకు చెరుకు రామమోహనరావుగారు ,అలాగే శ్రీ పెయ్యేటి రంగారావు, శ్రీదేవి దంపతులు రచనాపరంగా, ప్రతి నెలా అందించిన సహకారానికి కృతజ్ఞతాభివందనాలు .పత్రిక ఉపసంపాదకులు ఆచార్య చాణక్య తన విలువైన రచనలు, డిసైనింగ్ సాయం అందించారు. సహాయకులైన కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు అడిగిందే తడవుగా, ఎడిటింగ్ లో, కధలకు అవసరమైన మార్పులు చేసి ఇవ్వడంలో ఎంతగానో సహకరించారు. యధాలాపంగా పరిచయమయ్యి, చక్కటి బొమ్మలతో పత్రికకు వన్నెలు దిద్దుతున్న మా ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. చిన్నవాడైనా అందరికంటే మిన్నగా మాకు వెబ్సైటు రూపొందించి, కొన్నాళ్ళ పాటు నిరహణలో నాకు అన్నివిధాలా సహకరించిన కానం శ్రీకాంత్ సాయం నేను ఎప్పటికీ మరువలేను. నాకు అన్నివిధాల అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తున్న మా శ్రీవారు భావరాజు సతీష్ గారికి నమస్సులు. మా బృందంలో కొందరిని పై ఫోటోలో చూడవచ్చు. చిన్న కధ చెప్పుకుందాం. ఆంగ్లేయులు మన దేశంలోకి వ్యాపారం పేరుతో చొరబడ్డాకా, వారికి మన బలమైన సంస్కృతి, విలువలను చూసి, ఆశ్చర్యం వేసింది. లార్డ్ మెకలే బ్రిటిష్ పార్లమెంట్ కు రాసిన లేఖ ప్రకారం, ‘ఇంత గొప్ప విలువలున్న దేశాన్ని మనం జయించాలంటే, మనం వీరి ఆధ్యాత్మిక మూలాలను, సంస్కృతి మూలాలను దెబ్బతియ్యాలి. దీనికి మార్గం... ఆంగ్ల విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి, వీరి కంటే మనం, మన సంస్కృతి గొప్పవని వీరిని నమ్మించడం.’ దీనికి వారొక పధకం పన్నారు. తమిళనాడు లోని కుంభకోణం అనే ప్రాంతం నుంచి, ఆంగ్ల విద్యను మన మీద రుద్దడం ప్రారంభించారు. అందుకే, ఇప్పటికీ, మనం ఏదో ‘కుంభకోణం’జరిగింది, అన్న జాతీయాన్ని వాడుతూ ఉంటాం. విషమైనా నెమ్మదిగా ఎక్కిస్తే, స్లో పాయిసన్ లాగా పనిచేస్తుంది. నెమ్మదిగా హిందూ సంస్కృతి లోని లోపాల్ని ఎత్తి చూపారు. మన నమ్మకాన్ని దెబ్బ తీసారు. మత మార్పిడులను ప్రోత్సహించారు, ఇదే విషయాన్ని స్వామి వివేకానంద, చికాగో సభలో, ‘ఆకలితో ఉన్నవాడికి, రొట్టె బదులు మతాన్ని ఇస్తామని ముందుకు వచ్చారు, ఇది అత్యంత హేయమని,’ బహిరంగంగా విమర్శించారు. మన సంస్కృతిని నిరసించారు. మొత్తంగా, అమ్మ భాషకు మన పిల్లల్ని దూరం చేసారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినా, వారు నాటిన విషవృక్షం ఇప్పటికీ ఎదుగుతూనే ఉంది. ఫలితం - ఇప్పుడు తెలుగు తెలిసిన మన పిల్లలు తగ్గిపోయారు. తల్లిదండ్రులకే తెలుగు రాని స్థితి. 10 వ తరగతి ఉత్తీర్ణులైన మన పిల్లలు కూడా, తెలుగు సరిగ్గా రాయలేరు, చదవలేరు. కారణం – కేవలం తెలుగును కేవలం ఒక ‘పాస్ ఐతే చాలు’ అనుకునే భాషగా పరిగణించి, అధ్యాపకులే, దానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. పొరుగు రాష్ట్రాలలోని పాఠశాలల్లో, ఏ సిలబస్ అయినా, వారి భాషను చదవడం తప్పనిసరి ! మనకు ఆ సౌకర్యం కూడా లేదు. తల్లిదండ్రులకు ఎదురు తిరిగే పిల్లలు, విచ్చిన్నమయ్యే బంధాలు, అరాచకాలు, అత్యాచారాలు ఇవన్నీ మనపై పాశ్చాత్య పోకడల ప్రభావాలే. భాషను ముందు తరాలకు అందించడం అంటే, దానితో పాటే అంతర్లీనంగా పిల్లలకు మన సంస్కృతిని, విలువల్ని అందించడం. తెలుగు ఒక్కటీ నేర్పితే, విస్తారమైన మన సాహిత్యాన్ని వారు చదివేందుకు మనం ద్వారాలు తెరిచినట్టే ! ఎక్కడో విదేశాల్లో ఉంటున్న ప్రవాసీయులు తెలుగు పాఠశాలలు స్థాపించి, భాషను, కళలను తమ పిల్లలకు అందిస్తూ, ప్రతి పండుగను అపురూపంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఇక్కడున్న మనం మాత్రం మన పిల్లలకు తెలుగు చదివే అదృష్టాన్ని ఎందుకు అందించకూడదు ? ఏవో భాషా సంఘాలో, పాఠశాలలో తెలుగును ఉద్ధరించాలి, అన్న భావన నుంచి బయటపడి, ప్రతి వ్యక్తి తనకు తానుగా ఉద్యమించాలి. ప్రతి ఒక్కరూ, తమ చుట్టుప్రక్కల ఉన్న పిల్లలను చేరదీసి, వారికి వారాంతాల్లో పద్యాలు, కధలు చెప్పాలి. అలాగే, వేసవి సెలవల్లో పిల్లలకు ‘సమ్మర్ క్యాంపు’ లాగా ఏర్పరచి, తెలుగు భాష, సంస్కృతిలో శిక్షణ ఇవ్వాలి. ఒక పదేళ్ళలో తెలుగునాట, ‘ తెలుగు రాదు’ అని చెప్పేవారు ఉండకూడదు, అన్న ధృడ సంకల్పంతో ఉద్యమిద్దాం ! ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆనిమేషన్ వీడియోలు, కధలు, తెలుగు పజిల్ ల ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా తెలుగు నేర్పవచ్చు. త్వరలోనే, వేసవి తరగతులకు అనువైన సిలబస్ ను రూపొందించనుంది ‘అచ్చంగా తెలుగు’ దీన్ని మా సోషల్ నెట్వర్క్ లలో, వెబ్ సైట్ లో ఉచితంగా అందరికీ అందించానున్నాము. మీరూ మాతో చేతులు కలిపి, తెలుగు పరిరక్షణకై కలిసి నడవాలని, మరొక్కసారి మనవి చేసుకుంటున్నాము. ఇక ఈ వార్షిక సంచిక అనేకమంది స్పూర్తిదాయకమైన వ్యక్తుల ముఖాముఖితో, 10 కధలతో, చక్కటి కవితలతో, భాష గురించిన సరికొత్త కధనాలు, ఎప్పటిలాగే ఐదు పంచెవన్నెల ధారావాహికలతో అన్నింటినీ మించి ఉగాది కళకళలతో ముస్తాబై మీ ముందుకు వచ్చింది... చదివి ఆనందించండి, మీ అభిప్రాయాలు అందించి, మమ్మల్ని దీవించండి. మా ‘ అచ్చంగా తెలుగు’ తరఫున చదువరులు అందరికీ కృతజ్ఞతాభివందనాలు... ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగిస్తారని, మా ఆకాంక్ష !
No comments:
Post a Comment