తొలిపలుకు తెలుగులో…
(కవితకు చిత్రం : చిత్రకారుడు హంపి )
జి.ఎస్.లక్ష్మి
పల్లవి_
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
అనుపల్లవి_
అమ్మ ఒడి నిశ్చింత ఆదిగా మొదలై
ఇల్లంత నిండగా ఈడుగా పదములూ
ఉదయ సంధ్యల నెపుడు ఊయలలు ఊగగా
ఎల్లారు రారండి ఏకమౌదాము
ఐకమత్యము కలిగి మనమంత ఒకటైతె
ఓటమే లేదండి ఔనౌననండీ
అందలం యెక్కంగ అందరూ రండీ
అంతఃపుర మంతటా కాంతి నింపండీ…
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
కదలి వచ్చిన మెరియు సంద్రంబు
పగిది
ఖర్మలను తునిచీ, ప్రాణంబు నిలిపీ
గళములన్నియు కలసి జయగీతి
పాడగ
ఘనఘనా ఘనఘనా స్వరములే మోగగ
ఙ్ఞాపకాలన్నిటినీ కలబోసి అందరం
చప్పట్ల హోరుతో సందడులు చేసీ
ఛత్రమొకటే ననుచు ఆ నీడ గుమిగూడ
జడుపేమి లేదండి జనులార మీకు
ఝుంకార ధ్వనులతో కొత్త పదములు
నేర్వ
ఙ్ఞాన దీపిక పట్టి చేరగా రండీ…
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
టముకు లేయుచు జనులు సంతసంబందగా
ఠీవిగా నిలబడీ దీటుగా తలయూచి
డోలు, సన్నాయిలే జోడుగా మోగగా
ఢమఢమల ధ్వని మనల నుత్సాహపరుచగా
వాణి నా రాణి యన్న పెద్దలను కొలిచి
తగువులాడక తరతమములే యెంచక
కథలుగా మార్చి మన గొప్పలే తెలుపగా
దగ్గరవుదామండి దరిజేర రండీ
ధనము మన కేమిటికి మన జాతి
కన్నా
నగము కదిలిద్దాము నవ్వుతూ
రండీ…
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
పరదేశమేగినా పదిమంది కలిసీ
ఫణి మీద మణి వోలె మన భాష
నిలిపీ
బడులు గుడులూ కట్టి సభలెన్నొ
చేసీ
భయమేమిలేదు మన భాషకికనంచు
మధురవాక్కులు పలుక మనకేమి వెరపూ…
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
యశము మనదేనండి రథము కదిలించండి
లక్షల్లొ జనులనూ వుద్వేగపరచండి
శమదమాదులను "షట్" యంటు తోసేసి
సరిగమల హలముతో దున్ని పారేసి
యేళ్ళగా గల చరిత ఊళ్ళన్ని తెలియగా
క్షీరాభిషేకమ్ము చేదాము తెలుగుకు...
తలవంచి మొక్కరా తల్లి భారతికీ
జయమంచు చెప్పరా తొలిపలుకు తెలుగులో…
No comments:
Post a Comment