అదృష్టం మాటేంటి?
- బి.వి.సత్యనగేష్
ఏ ప్రయత్నం చేయకుండా, కనీసం మన దృష్టికి కూడా కనపడకుండా, అనుకోకుండా కలిసి వచ్చేదానిని ‘అదృష్టం’ అంటాం. ఇదే నిజమైతే.... పుట్టుకతోనే ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ శారీరక లోపాలు లేకుండా పుట్టడం అదృష్టమే కదా! నిర్వచనం ప్రకారం చూస్తే మనందరం అదృష్టవంతులమే! అంగవైకల్యం వున్నవారు కూడా అద్భుతాలను చేసి చూపిస్తున్నారు, ప్రతీరోజూ దినపత్రికల్లో, టీవీ ల్లో వారి గురించి తెలుసుకుంటున్నాం కూడా, కనుక ఏ లోపం లేని శరీరం వున్నవాళ్ళు ఆ శరేరాన్ని ఉపయోగించి ఏం చెయ్యాలనే విషయం గురించి చూద్దాం, అదృష్టం కలిసొస్తుందని మరీ గుడ్డిగా నమ్మేవాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రారు. అటువంటి వారు తమ జీవితాన్ని తామే సరిదిద్దుకోవాలనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి.
సరే....అంతా మన విధి, తలరాత, ఖర్మ అనే అనుకుందాం, అంటే మనం చేసేది ఏమీ లేదా? ఈ విధి, తలరాత, అదృష్టాన్ని నమ్మిన వాళ్ళు కూడా మానవ ప్రయత్నాన్ని అశ్రద్ధ చెయ్యరు. మరి ఆ మానవ (మన) ప్రయత్నం అంటే ఏంటో చూద్దాం!
ఒక రైలు డ్రైవర్ ను ఉదాహరణగా తీసుకుందాం, డ్రైవర్ విధులు (డ్యూటీ ) కు రిపోర్టు చేసినపుడు.... “నువ్వు ఫలానా రైలును బెంగుళూరు కు చేర్చాలి” అని యాజమాన్యం “విధి” నిర్వహణ అనే పేరుతొ పనిని నిర్ణయిస్తుంది, విధుల ప్రకారం రైలును బెంగుళూరు మార్గంలోనే నడిపించి, బెంగుళూరు కు చేర్చాలి.
“మార్గాన్ని నిర్దేశించేది”, “ఏ స్టేషన్ లో ఎంతసేపు రైలును నిలపాలి”, “ఏ నంబర్ ఫ్లాట్ ఫామ్ పై నిలపాలి” అనే విషయాలను యాజమాన్యం నిర్దేశిస్తుంది, ఈ విషయాలు రైలును నడిపించే డ్రైవర్ చేతిలో వుండవు. ఇది విధి, తలరాత అనుకుందాం. మరి మానవ ప్రయత్నం ఏంటో చూద్దాం!
- ఇంజన్ సరిగ్గా వుందో, లేదో చూసుకోవడం,
- గార్డు, కో-డ్రైవర్ తో సత్సంబంధాలు పెంచుకోవడం,
- సిగ్నల్స్ ను అనుసరించడం,
- ట్రాక్ క్లియర్ గా వుందో, లేదో చూసుకోవడం,
- ట్రాక్ పైన జంతువులు లేదా మనుషులు వుంటే రైలును ఆపడం,
- రైలును నడపటానికి కావలసిన ఇంధనం వుందో, లేదో చూసుకోవడం,
- రాబోయే స్టేషన్ తో అనుసంధానం కలిగివుండడం,
- నిర్దేశించిన వేగంతో రైలుని నడపడం,
- క్రమశిక్షణతో ఉద్యోగం చేయడం,
- నిర్దేశించిన సమయంలో గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించడం,
- ప్రయాణీకులను సురక్షితంగా గమ్యానికి చేర్చడం.
పై విషయాలన్నీ మానవ ప్రయత్నంలోకి వస్తాయి. పై విషయాల్లో పొరపాట్లు చేసి “విధి” వక్రీకరించిదనుకుంటే విధులను వెక్కిరించినట్లే, మానవ ప్రయత్నాల్లో లోపాలు చేసి అదృష్టం, దురదృష్టం అనడం సమంజసం కాదు. కనుక మనం అదృష్టవంతులం అనే భావనతో వుంటూ మన ప్రయత్నంలో లోపాలు చేయకుండా పనిచేస్తే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment