చైత్రాగమనం - అచ్చంగా తెలుగు

చైత్రాగమనం 

************  

- ఆచంట హైమవతి.


చైత్రమాసం  వచ్చింది-

చైతన్యం  ఉప్పొంగ... 

వసంత ఋతువు  

అరుదెంచె వన్నె-చిన్నెలుగ !

 

ఆమని  కోయిల తియ్యగా 

కూహుక్కుహూ  రవముల,

ఆలాపనను  ఆరంభించెనదిగో-

శుభ మంగళములకాహ్వానముగా!    

వనాంతరముల - మోడులన్నీ

ఉత్సహించి, పల్లవించుచున్నవి!

ఘన ఉదారి  ప్రకృతి  రమణి... 

ఆశలొసగి  అలరించుచున్నది!

సకల  జీవరాసుల  ఉదాసీనమును- 

పోనాడు 'ఇక్షు ధన్వుడు' ప్రేమాంగుడై-

ఎల్లెడలా  వ్యాపించి, విహరించి... 

కుసుమ  శరాఘాతముల అలరించు!

శిశిర వ్యధా నంతరం- చిగురుజొంపములందు      

వికసిత  సుమాలపై - శిలీముఖములు 

దాడి చేయు వైఖరిగా...నేటి 'నెలతల' పై 

అత్యాచారాలను- ఏ 'యుగాదీ' మాన్పదుగదా!

చాన  చాతుర్యాలన్నీ- దుష్టల్నెదుర్కోలేనివై-

తమ మృదుత్వ పరిధి దాటలేక-

అర్ధరాత్రి  ప్రయాణించలేని అబలత్వంతో

ఆరాట పడుతూ అలమటిస్తున్నాయ్!

ఈ మన్మధ నామ సంవత్సరాన... 

మనుజులందరం-మానవత్వంగలవారమై 

ఇంతుల మాన-మర్యాదలను, బాధ్యతతో 

కాపాడుకుందాం- దేశ సౌభాగ్యాన్ని రక్షిద్దాం!!

యుగ యుగాల మన భారతదేశ చరిత్ర-

నిష్కళంకతలను  చాటి , నాటి పూర్వ- 

వేద విహితంగా జీవించగల పటిష్టమైన  

                                      భద్రతలననురించి  విజయులమౌదాం!!                                    

 

No comments:

Post a Comment

Pages