సైబెర్ ప్రేమలు - అచ్చంగా తెలుగు

సైబెర్ ప్రేమలు

Share This

 సైబెర్ ప్రేమలు

 - భావరాజు పద్మిని


ప్రేమ...పెళ్లి ...ప్రతి మనసు కనే కల. ఆ కలలు ఏ రూపంలో సాకారమవుతాయో, తన జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో, అని ఎన్నో ఆశలు, ఊహలు. తన భావాలు, అభిరుచులు అర్ధం చేసుకున్న మంచి నేస్తం, జీవితంలోకి అడుగుపెడితే, ఇక ఆ అనుబంధం సుఖమయమే , జీవితం స్వర్గమే ! ఇదే భావనతో నేటి యువత ప్రేమ పెళ్ళిళ్ళ వైపు మొగ్గు చూపుతోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో, మొబైల్, ఈ- మెయిల్, సామజిక నెట్ వర్క్ లయిన పేస్ బుక్, ఆర్కుట్, ట్విట్టర్ వంటివి అందుబాటులోకి రావడంతో, యువత వీటి ద్వారా, తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నం చేస్తోంది. దేశ విదేశాలలో ఉన్న ఎంతో మంది తమ వివరాలను , ఫోటోలను, అంతర్జాలం ద్వారా బదిలీ చేసుకునే అవకాశాలు ఉండడంతో , అనేక మాట్రిమొని సైట్ లు వచ్చాయి. ముఖ్యంగా, సమయాభావం ఉన్న ప్రవాసీయులు , పెళ్లి సంబంధాలకై , ఈ వెబ్ సైట్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే అనుబంధం కోసం ఒక మనసు పడే తపనను, కొందరు తమ అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. అంతర్జాలపు మాయాజాల ప్రేమల్లో ఇరుక్కుని, మధన పడుతున్నారు.   మన రాష్ట్రంలో సైబర్ క్రైమ్‌లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని తాజా గణాంకాల ద్వారా తెలిసింది. 2011వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాల కింద అరెస్టయిన వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2010వ సంవత్సరం 197గా ఉన్న సైబర్ క్రైమ్‌ల సంఖ్య 2011లో 350కి పెరిగింది. సైబర్ క్రైమ్ కారణాలతో 2010వ సంవత్సరం 60 మంది అరెస్టు కాగా 2011లో వంద మంది సైబర్ నేరాల కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గణాంకాల వివరాలు చెబుతున్నాయి. అలాగే మహిళలకు వ్యతిరేకంగా సోషియల్ నెట్‌వర్క్‌లలో అశ్లీల ఈ-మెయిల్స్ పంపడం వంటి విభాగాల్లో 90కి మించిన కేసులు నమోదు కావడం గమనార్హం.   సైబర్ నేరాలకు సంబంధించి ఎక్కువ కేసుల్లో మహిళలే బాధితులవుతున్నారని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత ఏడాది 350కి పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ భాగం మహిళలను వేధింపులకు గురిచేసినవే కావడం గమనార్హం. సామాజిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడివారో ఇంటర్నెట్‌లో పరిచయాలు పెంచుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఈ వెబ్‌సైట్లలో ఇచ్చే వివరాల్లో నిజానిజాలేమిటో తెలుసుకోకుండానే పరస్పరం దగ్గరవుతున్నారు. మహిళల్ని వేధించేలా వారి అశ్లీల ఫొటోలు, అసభ్యకరమైన రాతలు వెబ్‌సైట్ల లో దర్శనమిస్తున్నాయి. మహిళల స్నేహితులు, సన్నిహితులే సైబర్ నేరాల్లో నిందితులు కావడం సర్వసాధారణమైంది. ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉన్నపుడు మహిళలను సెల్‌ఫోన్లలో అశ్లీలంగా చిత్రీకరించి ఆ ఫొటోలను వెబ్‌సైట్లలోకి ఎక్కిస్తూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితుల సెల్‌ఫోన్ నెంబర్లు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ చిరునామాల ఆధారంగా పోలీసులు వివరాలను రాబడుతున్నారు. అయితే, నిందితులు విదేశాల్లో ఉన్నట్లయితే వారి ఆనుపానులు తెలుసుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయంతో పోలీసులు ‘ఇంటర్‌పోల్’ను ఆశ్రయించాల్సి వస్తోంది.   ఫేస్ బుక్ లో మోసపోతున్న అమ్మాయిలు   ఫేస్ బుక్ లో దాదాపు అన్ని ప్రొఫైల్స్ నకిలీవే ఉంటున్నాయి.  తాము మంచి ఫొజిషన్ లో ఉన్నామంటూ, అందమయిన యువకుల ఫోటోలు పెట్టుకుని, అమ్మాయిలను మోసం చేస్తున్నారు . అందమైన అబ్బాయి ఫొటో వివరాలు ,చూడగానే   అమ్మాయిలు వాళ్ళను తన ప్రెండ్స్ లో ఏడ్ చేసుకుంటారు . మొదట  దాదాపు ఆరునెలల వరకు, మర్యాదస్తులలాగా  ాట్లాడి , ఆ అమ్మాయి ఫొటో , ఫోన్ నెంబర్ తీసుకున్న తరువాత తన శాడిజాన్ని బైట పెడతారు .  అప్పటికే తన ఇంటి వివరాలు తన పేరు, ఫోన్ నెంబరు. ఫోటొ ఇస్తుంది.  ఇంకేముంది ఆ అమ్మాయి ఫొటో మార్ఫింగ్  చేసి నెట్ లో పెడతానని బెదిరింపులు మొదలుపెడతారు. క్రింది సంఘటన చదవండి.   వాడిది ఓ డిటిపి సెంటర్. కొన్ని కవితలు రాసి,  ఆ కవితల క్రింద సెల్ నెంబర్ ఇస్తాడు.  ఆమ్మాయిలు చేసే నెంబర్లను తన ఫెండ్స్ అందరికి ఇచ్చి , ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫ్రెండ్ మాట్లాడే ఏర్పాటు చేసాడు.  అలా, ఒకే నంబరుకు , రోజూ, ఎనిమిది మంది అమ్మాయిలు మాట్లాడేవారు . తన ఫ్రెండ్స్ తో మొదట సరదాగా మాట్లాడించి, అమ్మాయిలను ఆకర్షించి , ఫోన్ నెంబరు తీసుకున్న తరువాత  వేదింపులు మొదలుపెట్టేవారు .  పోలీసులు వాడిని , వాడి ఎనిమిది మంది ఫ్రెండ్స్ ను అరెస్ట్ చేసారు. కొంతమంది  పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా , ఇలా అమ్మాయిల తో పరిచయాలు పెంచుకొని మొదట డీసెంట్ గా మాట్లాడి, ఉద్యోగం ఇప్పిస్తాను అని నమ్మబలికి,   కూతురు వయసున్న అమ్మాయిని వేదిస్తుంటే, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు పెద్ద మనిషి కంప్యూటర్ క్రాక్ చేస్తే ,  అన్నీ బూతు వీడియోలు ,మార్పింగ్ చేసిన అమ్మాయిల ఫోటోలు దొరికాయి. తెల్సిన వాళ్ళకు ఫోన్ నెంబర్ , ఫొటోలు ఇస్తేనే వేదిస్తున్న రోజులు ఇవి . ఎవరో తెలియదు. ప్రొఫైల్  లో అందమైన అబ్బాయి ఫొటోలు చూసి  స్నేహం చేస్తే ,  చివరికి అమ్మాయిలకు మిగిలేది తీరని మానసిక వేదన. అమ్మాయిలూ...తస్మాత్ జాగ్రత్త !   ప్రేమ పేరుతో వంచించిన మరుగుజ్జు    ఒక మరుగుజ్జు  , ఫేస్ బుక్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు.  ఒక అందమైన అబ్బాయి ఫోటోలను ప్రొఫైల్ లో పెట్టాడు.  అమ్మాయిలను మోసగించేందుకు మంచి పధకం వేసాడు .  ఒక విద్యాధికుడిగా, అందమైన వాడి గా ఇతడిచ్చిన బిల్డప్ కు గుంటూరుచెందిన ఒక అమ్మాయి పడిపోయింది. ఆ అమ్మాయి బీటెక్ విద్యార్థిని.  ఆ అమ్మాయిని మంచి మాటలతో ,ఆకర్షించి , ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఆ అమ్మాయి ఎంతగా ఇతడిని నమ్మిందంటే…ఐదు లక్షల రూపాయల డబ్బు, 50 తులాల బంగారం ఇతడికి ఇచ్చేసేంతలా! తనకు ఆనారోగ్యమని, ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బు లేదని, ఆసుపత్రిలో ఉన్నానని, ఒక వ్యక్తిని పంపిస్తాను అతడికి డబ్బు నగలు ఇవ్వమని పలుదఫాలుగా నాటకాన్నినడిపాడు . ఆ అమాయకురాలు ఇంట్లో తన, తన అక్క పెళ్లి కోసం తండ్రి దాచి ఉంచిన నగలను, డబ్బును ఈ ఫేస్ బుక్ ప్రేమికుడు పంపించిన ప్రతినిధికి ఇచ్చిపంపింది. అలా కొన్ని రోజుల్లో 50 తులాల బంగారం అతని ఖాతాలో చేరిపోయింది. ఇంకే ముంది ఫేస్ బుక్  ఖాతా మూసేసాడు. ఫోన్ నంబర్ మార్చేశాడు. ఆ గుంటూరమ్మాయి తన ప్రేమికుడికి ఏమైందో అని ఆందోళన చెందసాగింది. అతడిచ్చిన వివరాల ప్రకారం అన్వేషిస్తే ఆర్థమైంది --తను దారుణంగా మోసపోయానని, అంత వరకూ అతని ఒరిజినల్ ఫోటో ఆమె చూడలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ కేసును సీఐడీ అధికారులకు అప్పగించారు . అతడి ఫేస్ బుక్ అడ్రస్ ద్వారా అది ఆపరేట్ అయిన సిస్టమ్ ఐపీ అడ్రస్ ద్వారా వివరాలు రాబట్టారు. చివరకు ఈ మరగుజ్జు యువకుడి నిజస్వరూపాన్ని బయట పెట్టారు సీఐడీ అధికారులు. కొంచెం విచారణ జరిపితే మొత్తం వివరాలను బయటపెట్టాడు మరుగుజ్జు , ఇంకా మరి కొందరు అమ్మాయిలను కూడా తాను ట్రాప్ చేశానని ఒప్పేసుకున్నాడు! ఇతడు అమ్మాయి నుంచి దోచిన బంగారంలో కొంత భాగాన్ని అయితే రికవరీ చేయగలిగారు. కేవలం అందమయిన ఫోటోలు చూపించి, నాలుగు అబద్ధాలు చెబితే అమ్మాయిలు నమ్మేస్తారా?  మోసం చేసే టాలెంట్ ఉండాలి కానీ, మోసపోయే వారిని దొరకబుచ్చుకోవడం మాత్రం చాలా సులభం అని అర్థం అవుతుంది ఈ సంఘటనతో!   పెళ్లి పేరుతో ఐదుగురిని వంచించిన మహిళ    మోసగించడానికి ఆడ, మగా అనే భేదం లేదు. ఒక మహిళ ఇంటర్నెట్ లో మోసాలు చేస్తూ ఇప్పటికే 5 పెళ్ళిళ్ళు చేసుకుంది.  భారత్ మాట్రిమొని లో తాను డాక్టర్ నంటూ నమోదు చేసుకున్న ఈమె, అమెరికా లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్ళికి సుముఖంగా ఉన్నట్లు చెప్పి, పరిచయం పెంచుకుంది. ఒక పేద కుర్రవాడికి బ్రెయిన్ ఆపరేషన్ అంటూ , దూర విద్యా కేంద్రం పెడుతున్నానంటూ, ఎప్పటికప్పుడు వివిధ కధలు అల్లి, పద్నాలుగు లక్షల పైన సొమ్ము లాగింది. అనుమానం వచ్చిన యువకుడు ఫిర్యాదు చెయ్యడంతో, ఈమెను అరెస్ట్ చేసి విచారించగా, ఈమె మరొక ఐదుగురు యువకులను ఇదే విధంగా మోసగించి, డబ్బు గుంజినట్లు తెలిసింది. ఇలా వసూలు చేసిన సొమ్ము ఈమె , తన విహారాలకు, విలాసాలకు, ఇంటికి హంగులు అద్దేందుకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది.   సోషల్ నెట్ వర్క్ లో అందమయిన యువకుల ఫోటోలు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నామంటూ ప్రొఫైల్స్ సృష్టించుకుని, అమ్మాయిలను ఆకర్షించి, వారి ఫోటోలు, ఫోన్ నంబెర్ లు సేకరించి, తీరా అవి చేతికోచ్చకా, అవి మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలుగా మార్చి,  ఇంటర్నెట్ లో పెడతామంటూ బెదిరిస్తున్న యువకుల ఉదంతం ఈ మధ్యనే వెలుగు చూసింది.    క్రింది కధ చదివితే, ఒక విధంగా, పై యువతి నయం ,అనిపించక మానదు.   మాజీ భార్యను వేధించిన భర్త   హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ కిల్వత్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఒకతను ,మొదటి భార్యకు మతసాంప్రదాయం ప్రకారం తలాక్‌ ఇచ్చాడు. ఆ తరువాతనుంచీ ఆమెకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపడం, ఆమె తనతో కలసి ఉన్న సమయంలో సరదాగా అంటూ తీసిన కొన్ని అభ్యంతరకరమైన దశ్యాలను వెబ్‌సైట్‌లో ఉంచడం, లేదా కొన్ని మ్యారే జ్‌ బ్యూరోలకు పంపడం మొదలు పెట్టాడు.   రానురాను అతడి వేధింపులు ఎక్కువయిపోవడంతో బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.   నిందితుడు తన వ్యక్తిగత కంప్యూటర్‌ ఉపయోగించే మాజీ భార్యఫోటోలను వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్‌ చేయడంతో పాటు అనేకమందికి ఇమెయిల్స్‌ కూడా చేశాడని , విచారణలో తేలింది.  నిందితుడిపై పోలీసులు మోపిన అభియోగాలు రుజువుకావడంతో అతడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, 12 వేల రూపాయల జరిమానా విధించారు.     స్నేహితురాలే వంచించింది    ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం అసభ్యకర ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టే వరకు వెళ్లింది. చీరాలలోను ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ విద్యార్థి అశ్లీల వెబ్ సైట్ క్రియేట్ చేయడంతో పాటు ఫేస్‌బుక్‌లో ఆమెకు సంబంధించిన చిత్రాలను ఉంచాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో వేటపాలెం పోలీసులు సంతోష్ అనే విద్యార్థిని అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలను పెట్టడానికి కారణమైన ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు విద్యార్థునుల మధ్య వివాదం కారణంగా అందులో ఓ యువతి బాధితురాలి ఫోటోను తన స్నేహితుడితో వెబ్ సైట్లో పెట్టించింది.   కక్ష్య సాధించబోయిన ప్రేమికుడు   కొన్నాళ్ల క్రితం వరకూ ఆ ప్రేమికులు ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ఇంజనీరింగ్ చదువుతున్న ఆ ఇద్దరూ కలసి బతకాలని  ఎన్నో బాసలు చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో కథ మలుపు తిరిగింది. ఆ అమ్మాయికి ప్రేమికుడి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన అమ్మాయి అశ్లీల ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి ఆ యువకుడు కక్ష సాధించసాగాడు. యువతి ఫిర్యాదు మేరకు ప్రేమికుడిని సైబర్ నేరాల చట్టం క్రింద  పోలీసులు అరెస్టు చేశారు.   ప్రాణం తీసిన ఫేస్బుక్ ప్రేమ   సోషల్ వెబ్‌సైట్‌లో చిగురించిన ప్రేమ చివరకు ప్రాణం తీసింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఫేస్‌బుక్‌లో ఇరవై ఆరేళ్ల యువకుడితో ఇరవై రెండేళ్ల యువతికి పరిచయం అయింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే వీరి మధ్య కొద్దిరోజుల్లోనే విభేదాలు వచ్చాయి. తనతో మాట్లాడ వద్దని ప్రియురాలు చెప్పింది. అయితే దీనిని అతను పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌లో సదరు యువకుడిపై పైన ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి మందలించారు. ప్రేమలో మోసపోయానంటూ ఆ యువకుడు రెండు రోజులుగా డిసప్పాయింట్‌కు గురై, తన చావుకు ప్రియురాలు కారణమని లేఖలో రాసి గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   ఫేస్ బుక్ పేరు తో  ప్రేమ - పెళ్లి - హత్య   నమ్మకం, ప్రేమ, అనురాగాలు నేటి యుగంలో ఎలా తయారయ్యాయో నిరూపించేందుకు ఈ కధ ఒక చక్కటి ఉదాహరణ.   రెండు సంవత్సరాల క్రితం ఒక యువతి  , ఫేస్ బుక్ ద్వారా అతనికి పరిచయం అయింది. అతడు బెంగుళూరు లోని అక్షెన్చర్  సంస్థలో పనిచేస్తాడు. ఈ పరిచయం కాస్తా ఒకరినొకరు ఇష్టపడటం వరకూ వెళ్ళి , ప్రేమకు దారి తీసింది. వీరి కులాలు వేరైనా ఇరువురూ తమ తమ తల్లిదండ్రులను పెళ్ళికి ఒప్పించారు. ఈ నేపధ్యంలో వీరి నిశ్చితార్ధం జరిగి పోయింది.   కొద్ది రోజుల తరువాత  ఆమెకు ,మరో యువకుడిపై ప్రేమ పుట్టుకొచ్చింది.  తన కాబోయే భర్తను మరచిపోయి , కొత్త ప్రేమికుడిని వివాహం చేసుకోవాలనుకుంది. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కలిసి ఆమెతో నిశ్చితార్ధం అయిన యువకుడిని ,తమ మార్గం నుంచి తప్పించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె దారుణమైన పధకాన్ని రచించింది.   ఒక అజ్ఞాత సిమ్ కార్డును కొని, ఆమె, కాబోయే భర్త మొబైల్ కు మెస్సెజెస్ పంపేది. అలానే ఫేస్ బుక్ లో మాయ అనే అమ్మాయిలా ఒక ఖాతా తెరిచి  అతనికి  ప్రేమ  సందేశాలను  పంపేది. ఈ మెసేజెస్ను తానే స్వయంగా  అతని ముందుంచి, ఎవరు ఈ అమ్మాయి చెప్పు అని నిలదీసేది. అభం శుభం తెలియని అతనికి , ఏం చెప్పాలో అర్ధం కాక సతమతమయ్యేవాడు. అసలు ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని నచ్చజెప్పే ప్రయత్నం చేసే వాడు. అలా ఒక రోజు అతన్ని ,  ఆమె  ఒక ప్రదేశానికి రమ్మని కబురు పంపించింది.  అక్కడ ఆమె, “నీకు వేరే అమ్మాయిలతో పరిచయం ఉంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు” అని  గొడవ పెట్టుకుంది. తనకేమీ తెలియదని, తనను నమ్మమని అతను బతిమాలాడు. అప్పుడు  ఆమె తన వెంట తెచ్చిన వోడ్కా సీసా ఇచ్చి – అయితే ఇది తాగు, దీనిని తాగితే నిజాలు చెబుతారంట, దీనిని తాగి నాతో చెప్పు ఏ అమ్మాయితో నీకు పరిచయం లేదని అని  అతడిని కోరింది.   పాపం అలాగయినా తాను ప్రేమించిన అమ్మాయి నమ్ముతుందని భావించి, అతను విషం కలిపిన వోడ్కాను తాగేశాడు. నురగలు కక్కుతూ, కాసేపటికి ప్రాణాలు విడిచాడు.  అక్కడ అతని శవాన్ని వదిలి ,ఇద్దరూ ఎంచక్కా ద్విచక్రవాహనం పై ఇళ్లకు వచ్చేశారు. ఈ ప్లాన్ ను ఆమె తన కొత్త ప్రేమికుడి  సహాయంతో అమలు చేసింది.   పోలీసులు పకడ్బందీగా ఈ హత్య వెనుక సూత్రధారి తాను ప్రేమించిన అమ్మాయే అనే విషయాన్ని చేధించి ఇద్దరినీ కటకటాల వెనుకకు పంపారు.   యువతులను ట్రాప్ చేసి హైటెక్ పద్ధతిలో వ్యభిచారం   హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును సీసీ‌ఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీ సులు రట్టు చేశారు.  నలుగురు నిందితుల్ని అరెస్టు చేసి, ఐదుగురు యువతులకు విముక్తి కల్పించారు. నగరంలో స్థిరపడిన ఒక యువకుడి  నేతృత్వంలో ఏర్పడిన ఓ ముఠా ఇంటర్‌నెట్ ద్వారా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతుల్నీ ట్రాప్ చేసి వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు సేకరిస్తోంది. ఇతను భార్య సహాయంతో, కొంతమంది యువతులను ట్రాప్ చేసి, వారి వివరాలు నెట్ లో పెడతాడు. భార్యాభర్తలు యువతులను బెదిరించి, లోబరచుకుని, విటుల వద్దకు తరలిస్తారు. వీరి గురించి సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని, వీరిని అరెస్ట్ చేసారు.   ప్రేమ - సాన్నిహిత్యంతో వంచన   యుకెలో ఎం .ఎస్ చదువుతున్న సమయంలో వివేక్(పేరు మార్చబడింది) అనే యువకుడు ,సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా చెన్నైకి చెందిన ఓ మహిళా టెక్కీతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి విశ్వాసం కలిగించిన వివేక్  ఆమె ఆన్‌లైన్ ఖాతాలను, పాస్‌వర్డ్స్‌ను పొందాడు. ఆమె వ్యక్తిగత విషయాలన్నీ తవ్వి తీశాడు. స్కైప్ చాట్ సెషన్‌లో ఆమెను మభ్యపెట్టి దుస్తులు విప్పేసేలా చేసి , దాన్ని రికార్డు చేశాడు. దాంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ అమ్మాయి హెచ్చరించింది. ఈ స్థితిలో ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి హైదరాబాదు వచ్చాడు. ఆ తర్వాత వివేక్కు ఇతర అమ్మాయిలతో కూడా అటువంటి సాన్నిహిత్యం ఉందని తెలుసుకుని, ఆమె దూరంగా ఉండసాగింది.  దాంతో వివేక్ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అందుకు అతను ఆమె న్యూడ్ ఫోటొలోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టడమే కాకుండా ఆమె కాలేజ్ గ్రూప్ సభ్యులకు వీడియోను పంపించాడు.   అతని ఆగడాలను భరించలేక ఏప్రిల్ 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని బుధవారం అరెస్టు చేశారు. మధ్యవర్తుల సమక్షంలో వారు న్యూడ్ ఫోటోలున్నవివేక్ కు  చెందిన ల్యాప్‌టాప్‌ను, డివీడీని స్వాధీనం చేసుకున్నారు.   నేటి యువతలో ,రోజు రోజుకూ పెరుగుతున్న సామాజిక నెట్ వర్క్ ల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి అనేక కొత్త వలలు పన్నుతున్నాయి వెబ్ సైట్ లు. ప్రేమికుల రోజుకు ఒక ప్రేమికురాలు ఉండాలి కనుక, ఏకంగా అద్దెకు ఒక ప్రేమికురాలిని ఇస్తామంటూ ముందుకు వచ్చింది ఒక వెబ్ సైట్.   ప్రేమికుల రోజుకు అద్దెకు గర్ల్ఫ్రెండ్   నమరోఫేక్.కామ్ అనే వెబ్ సైట్, ప్రేమికుల రోజు కోసం ఒక ప్రేయసిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించింది. ఇందులో, ఒక ఫేక్ అకౌంట్ ద్వారా రిలేషన్‌షిప్ స్టేటస్‌లో గర్ల్‌ఫ్రెండ్ దర్శనమిస్తుందన్నమాట!రిలేషన్‌షిప్ స్టేటస్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ అకౌంట్‌ను మెన్షన్ చేస్తే ,తన స్నేహితుల ముందు యెంత గొప్ప! మరి అలాంటి వారి మధ్య ‘నాకూ ఓ లవరుంది’ అని గర్వంగా చెప్పుకోవాలంటే... ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ మన రిలేషన్‌షిప్ స్టేటస్‌ను చూసి కుళ్లు కోవాలంటే... సింపుల్ గా ఈ వెబ్‌సైట్‌ను ఆశ్రయించవచ్చు! వారానికి 39 డాలర్ల ఖర్చుతో ఇది ఫేస్‌బుక్‌లో ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను అరేంజ్ చేస్తుంది. ఆ అకౌంట్‌తో చాటింగ్‌కు మాత్రం అవకాశం ఉండదు. కానీ ‘ఫేక్ లవర్’ నుంచి ఎన్నో సర్‌ప్రై జ్‌లు వస్తుంటాయి. మీరు ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టులకు ఎన్నో స్వీట్ రిప్లయ్‌లు వస్తుంటాయి. ఇంకా ప్రతిదానికీ లైకులు, షేరింగ్‌లు, కామెంట్లు!   అవన్నీ ఫేక్ అని మీకు మాత్రమే తెలుసు, కానీ మీ ఫేస్‌బుక్ స్టేటస్‌ను గమనించేవారు మాత్రం... మీ ఫాలోయింగ్ గురించి ఎన్నో ఊహించుకుంటారు! బ్రెజిల్‌కు చెందిన ఈ వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్నిసూటిగా చెబుతోంది! మరి దీన్ని అనైతికం అనాలో, మోసం అనాలో, లేక వెర్రి అనాలో కానీ ఈ ఆఫర్ ప్రకటించిన రెండోరోజునుంచీ వేలాది మంది తమను సంప్రదిస్తున్నారని వెబ్‌సైట్ ప్రకటించింది. తాము లైక్ చేసే పోస్టులతో, షేరింగ్ చేసే ఫోటోలను చూసి ఎదుటి వారు తమ మీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటారని నెటిజన్లు భావిస్తుండటం అత్యంత విచారకరమైన అంశం!   అంతెందుకు, ఏకంగా హోం మంత్రి పేరుతో ఐదు నకిలీ అకౌంట్ లు ఉన్నాయంటే, పరిస్థితి యెంత దారుణంగా ఉందో , అర్ధం అవుతుంది.   హోం మంత్రి ఫోటో, పేరుతో ఐదు ఖాతాలు   అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫేస్‌ బుక్‌ను దుండగులు మరోసారి దుర్వినియోగం చేశారు. ఈసారి ఏకంగా రాష్ట్ర హోం మంత్రి సబితారెడ్డి పేరును ఉపయోగించుకుని ఐదు అకౌంట్లను తెరిచిన దుండగులు రెండింటిలో ఆమె ఫోటోలు కూడా పొందుపరిచారు. ఇది హోంశాఖలో కలకలం రేపింది. దీనిపై హోం శాఖ విచారణకు ఆదేశించంగా వెంటనే రంగంలో దిగిన సిఐడి దుండగుల కోసం వేట మొదలుపెట్టింది.   నేటి ఆధునిక యుగంలో మగవారికి ఆడవారు కూడా సమానం అని చాటిచెబుతున్న తరుణంలో, దారుణాలు, హత్యలలో కూడా తాము ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు.  దేశంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ-పరిజ్ఞానంతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా కొన్ని విదేశీ ముఠాలు ఇదే వృత్తిగా పెట్టుకున్నాయి. విదేశీ లాటరీలు, విదేశీ ఉద్యోగాలు, యువత ఉజ్వల భవిష్యత్‌కు ఐటిలో శిక్షణ, భారీ వెంచర్లలో విదేశీ పెట్టుబడులు, నైజీరియన్ల మోసాలు, ఎక్కువ వడ్డీల పేరుతో కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసి కనుమరుగవ్వడం, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి మూస్తే ఇంట్లోనే కూర్చొని సంపాదన, ఎస్‌ఎసంఎస్‌ మోసాలు, క్రెడిట్‌ కార్డ్‌ మోసాలు ఇలా పలు రకాలుగా ఆన్‌లైన్‌ మోసగాళ్లు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఎంతో మంది సర్వం కోల్పోతున్నారు.   ప్రేమ పేరుతో అంతర్జాలంలో వంచించే  సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతునే ఉన్నాయి. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లే ఫిర్యాదులు తక్కువే. నలుగురికీ తెలిస్తే కుటుంబం పరువు బజారుకెక్కుతుందన్న భయంతో చాలామంది మహిళలు వౌనంగానే వేధింపులు భరిస్తునే ఉన్నారు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ తరహా నేరాలు అన్ని ప్రాంతాల్లోనూ అధికమవుతున్నాయి.   సైబర్ నేరస్తులను ఏం చెయ్యాలి ?   సామజిక నెట్ వర్క్ వినియోగదారులు ముక్కూమొహం తెలియని వారితో, అతి సంభాషణలు చెయ్యకూడదు. పేస్ బుక్ వంటి వాటిలో ఇతరులు ఇచ్చే వివరాలను గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత ఫోన్ నంబెర్ లను, అడ్రస్ లను వీటిలో అందరికీ కనబడేలా ఇవ్వకూడదు. మీ ఫోటోలు,  మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బహిరంగంగా పెట్టకూడదు. తెలియని వారిని నమ్మి , ప్రేమ , పెళ్లి వంటి అనుబంధాల దాకా వెళ్ళకూడదు. కుటుంబ గౌరవం,  పరువుప్రతిష్టలుపొతే, తిరిగి రావు. మీ చర్యలు మీకు, మీ కుటుంబానికి తలవంపులు కాకూడదని గుర్తుంచుకుని, అప్రమత్తంగా ఉండాలి. మోసానికి మందులేదు , మనోవేదన తప్ప .   నేటి కాలంలో సెల్‌, ఇంటర్నెట్‌లను యువత మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ముందు జాగ్రత్త వహించి సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి దుర్వినియోగాన్ని తెలియజేయాలి. టేక్నాలజీ పెరిగిందికదా మనం ఎవ్వరితో ఎలాగైనా ప్రవర్తించొచ్చు మనం ఎవ్వరికీ దొరకం అని రెచ్చిపోతే ..పొలీసులు ఊరుకోరు...ఇలా ఇంటర్నెట్ లనుంచి అసభ్యకరమైన మెస్సేజ్ లు పంపినా సెల్ఫొన్లనుంచి పంపినా ఇక జైలుకూడు తినాల్సిందే .. ఇలాంటి నేరాలు చేస్తే కొత్తగా వచ్చిన ఐటి యాక్టు IT (Amendment) Act 2008, sec 509 IPC ప్రకారం ,కటినమయిన శిక్షలు విధించే వీలుంది. నగరం తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు నెలలో కనీసం పది మంది సిఐడి లోని సైబర్ విభాగం మెట్లెక్కుతున్నారు.  ఎవరికయినా ఇటువంటి బాధాకరమయిన పరిస్తితి ఎదురయితే ఈ క్రింది నంబర్ లలో సంప్రదించ వచ్చు.   sp cid సైబర్ క్రైం 9440700893 acp హైదరాబాద్ సైబర్ 9490616168 acp సైబరాబాద్ సైబర్ క్రైం 9490617228  

No comments:

Post a Comment

Pages