బహుముఖ ప్రజ్ఞాశాలి - డొక్కా ఫణి గారితో ముఖాముఖి
- భావరాజు పద్మిని
‘ ప్రపంచంలో మంచి మనుషులుగా ఉండడం అన్నది చాలా కష్టం, ఎందుకంటే మంచిని నిలుపుకోవడమే కష్టం. అందుకే విలువలు ఒక్కటీ అందిస్తే చాలు.... ఏ దశలోనైనా తనలోని పసిపాపను భద్రంగా కాపాడుకోవడం నేర్పితే చాలు... అన్నింటా రాణిస్తారు... ‘ అంటారు బహుముఖప్రజ్ఞాశాలి డొక్కా ఫణి గారు. అచ్చంగా తెలుగుతో వారు జరిపిన ముఖాముఖి... మీరూ చదవండి...
- నమస్కారం ఫణి గారు. మీ స్వగ్రామం, కుటుంబ నేపధ్యం గురించి చెబుతారా ?
నమస్కారమండి. నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో. పెరిగింది, 13 ఏళ్ళ వరకూ చదువుకున్నది, అమలాపురంలో. ఆ తర్వాత మా కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం, నేను అక్కడే చదువుకుని, సెంట్రల్ యూనివర్సిటీ లో M.Sc సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ చేసి, 94 లో అమెరికా వచ్చేసి, అప్పటినుంచి, ఇక్కడే స్థిరపడడం జరిగాయి. 21 సం. క్రితం అట్లాంటాలో ఎం.ఎస్ కంప్యూటర్ సైన్సు చేసి, ఇక్కడే ఉద్యోగంలో చేరి, ఉద్యోగాలు మారుతూ అప్పటినుంచి ఇక్కడే ఉన్నాను.
మాది కోనసీమలో అందరికీ తెలిసినటువంటి నిరతాన్నదాత్రి ‘ డొక్కా సీతమ్మ’ గారి వంశం. మా తాత రామభద్రుడు గారు ఆవిడ కొడుకు కొడుకు (మనవడు). మా నాన్న సూర్యనారాయణ గారు ఆవిడ మునిమనవడు. అమ్మ బాలాత్రిపురసుందరి. నాకు అన్న, తమ్ముడు ఉన్నారు. ఇదీ మా కుటుంబ నేపధ్యం.
- సాహిత్యం పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది ?
మా అన్నయ్య రామభద్రుడు గారు మంచి కవి, కధకులు. తను ఎప్పుడూ నాకు ప్రేరణగా నిలిచేవారు.
సాహిత్యాభిరుచి అమ్మ నుంచి, సంగీతం పట్ల మక్కువ నాన్న నుంచి వచ్చాయి. మా పెద్దమావయ్య గారు మంచి సాహితీపిపాసి. ఆయనవద్ద కల నోటు పుస్తకాల్లో కాళిదాసు పద్యాలు, శ్లోకాలు, ఆయన వ్రాసిన పద్యాలు, సేకరణలు ఉండేవి. అవన్నీ అమ్మ మాకు తీసి చూపించేది. అలా తెలుగు పట్ల మాకు మక్కువ కలిగింది. వేసవి సెలవల్లో మా సీనియర్స్ ను పాఠ్య పుస్తకాలు అడిగి తెచ్చుకుని, తెలుగు వాచాకంలోని పద్యాలు ముందే బట్టీ కొట్టేసేవాళ్ళం. ముందుగానే చదివిన ఆ పద్యాలు మాకు బాగా గుర్తుండిపోయేవి.
నాకు చిన్నప్పటి నుంచి కధలు చెప్పడం అంటే ఇష్టం. ఆశువుగా కధలు చెప్పేవాడిని. వేసవిలో సాయంత్రం 6 నుంచి 9 వరకూ, అంతా నా చుట్టూ చేరి, కధలు చెప్పమని అడిగేవారు. కధ మొదలుపెట్టినప్పుడు అది ఎలా ముగించాలో నాకు తెలియదు. కాని, అలా అల్లుకుంటూ పోయేవాడిని. చివరికి కధ ముగిసాకా అందరికీ నచ్చేది. అలాగే అమలాపురం జిల్లా పరిషత్ స్కూల్ లో కూడా నేను 6,7 తరగతులు చదువుతూ ఉండగా, పి.టి క్లాస్సులో 50 మంది పిల్లలకు నన్ను కధలు చెప్పమనేవారు మాష్టార్లు. కధలు విని ఎంతో మెచ్చుకునేవారు. అలా వాళ్ళందరి ప్రోత్సాహంతో సాహిత్యం అబ్బింది.
3. మీరు రాసిన వాటిలో మొదట ప్రచురించబడ్డ కధ/ కవిత ఏది ?
పదవ తరగతి నుండే కధలు రాసేవాడిని, రాసి ఎక్కడో పారేసుకునేవాడిని. డిగ్రీ మొదటి చదువుతూ ఉండగా, ‘సాయంకాలం’ అనే గల్పిక రాసాను. అది ప్రతి సాయంత్రం నాలో కలిగే భావాలకు అక్షర రూపం ! అందులో పెద్దగా పాత్రలు ఏమీ ఉండవు... నేను, సూర్యుడు, పక్షులు, ఆకాశం... కాస్తంత వేదాంతం, అంతే . ఆ కధను అన్నయ్యకు ఇస్తే దాచిపెట్టాడు. తాను రాసినవి దాచుకోక, నేను రాసినవి దాచేవాడు. అలా అన్నయ్య వద్ద 7,8 కధలు పోగయ్యాయి.
నేను 94 లో అట్లాంటా వెళ్ళాకా, అక్కడి వేంకటేశ్వర స్వామి గుడిలో ఒక 20- 25 మందిమి కలిసి, మొదటిసారిగా సాహితీ సదస్సును ప్రారంభించాము. మా ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులు వేలూరి వేంకటేశ్వర్లు గారు, పెమ్మరాజు వేణుగోపాల్ గారు, రవిశర్మ గారు, వంటివారు ఇదివరలో మనవూరి మాట పత్రిక ప్రారంభించి, చాలాకాలం నడిపారు. తరవాత అది ఆగిపోయింది. దాన్ని మేము పునరుద్ధరించాకా, నా ‘సాయంకాలం’ కధను మొదటిసారిగా అందులో ప్రచురించుకున్నాను.
తర్వాత నేను ఇక్కడ జరిగే ఉగాది పోటీలకు కధలు పంపేవాడిని. నా మొదటి కధల సంపుటి – పల్లకి. ఇందులో 20 – 25 కధలున్నాయి. వీటిలో ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, గల్పికలు ఉన్నాయి. ఈ కధలకు ముళ్ళపూడి వేంకటరమణ, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి వంటి వారు ముందుమాట రాసారు. ఈ పుస్తకం వీరందరి మన్ననలు పొందింది. ఇందులోని ‘వినాయకచవితి’ కధ చదివిన ముళ్ళపూడి వారు, ఒకరోజు రాత్రి 10.30 కు నాకు ఫోన్ చేసి, తన చిన్నప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి, అంటూ ఎంతో భావోద్వేగానికి గురౌతూ అభినందించారు. నాకు నోట మాట రాలేదు. ఏ రచయతలనైతే మనం దేవుళ్ళ క్రింద మన మనస్సులో కొలువుంచుకున్నామో, వారే ప్రశంసించారు ! ఇంతకంటే... ఈ జీవితానికి ఏం కావాలి ? అనిపించింది.
నా రెండవ కధల సంపుటి , కౌముది అంతర్జాల పత్రికలో అత్యంత ప్రాచుర్యం పొందిన నా ‘టేక్ ఇట్ ఈజీ’ హాస్య ఖండికల సంకలనం. ఇందులో కూడా పై ప్రముఖులంతా ముందుమాట రాసారు. పల్లకి పుస్తకాన్ని ఆ దశాబ్దపు ఉత్తమ పుస్తకంగా రాజా రామమోహన్ రాయ్ ఫౌండేషన్ గుర్తించి, నాకు అవార్డు ఇచ్చింది. ఈ పుస్తకాన్ని కొని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రంధాలయాలకూ పంపింది. ఇది నా తొలి పుస్తకానికి దక్కిన అరుదైన గౌరవం.
4. నవరసాల్లో హాస్యాన్ని పండించడం చాలా కష్టం అంటారు. మరి మీకు చక్కటి హాస్యం పండించడం ఎలా అబ్బింది ?
నేను కోనసీమలో పుట్టడమే హాస్యాన్ని పండించగలిగేందుకు ప్రధాన కారణమని చెప్పగలను. అక్కడ ఉండే 80 – 90 % మంది, ఎన్ని బాధలున్నా అందులో హాస్యాన్ని స్వీకరిస్తారు. చూసేవాళ్ళకి అది కష్టం అనిపిస్తుంది, వాళ్ళు దాన్ని సరదాగా మార్చుకునేవారు.
ఉదాహరణకు – ఒకరి ఇంట్లో దోమలబాధ ఎక్కువగా ఉండేది. మేము వారింటికి వెళ్లి, దోమల్ని కొడుతుంటే –‘ మీరు మమ్మల్ని ఏమైనా అనండి, కాని మా దోమల్ని ఏమీ అనకండి, పచ్చి రక్తమిచ్చి పెంచుకుంటున్నాము...’ అనేవారు.
అలాగే, ఇంట్లో అసలు చదవని పిల్లాడు ఉన్న తండ్రి, - ‘మా అబ్బాయిని, ఒక్కసారి చదవరా, చూసి చచ్చిపోతాను, అంటే, మా అబ్బాయి నేనెక్కడ నిజంగానే చనిపోతానో అని చదవడండీ...’ అని చెప్పేవారు. ఇటువంటివి చూడడం వల్ల, జీవితంలో ప్రతి అంశాన్ని హాస్యంగా మార్చుకోవడం అబ్బింది. ఈ లక్షణాన్ని బాపు, రమణలు, శ్రీరమణ గార్లు పెంచి పోషించారు. శ్రీరమణ గారి రంగులరాట్నం అనే చిన్ని కదల సంపుటి, ముఖ్యంగా మిధునం కధ, నాకు చాలా ఇష్టం.
మరొక ముఖ్యమైన విషయం – హాస్యాన్ని అందరూ పండించలేక పోవడానికి కారణం, వారి అహం. ఈ అహం వారికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇతరుల్ని అన్నప్పుడు నవ్వే మనం, మనల్ని అంటే, కోపగించుకుంటాము. మనలోని చిన్న పిల్లాడిని కాపాడుకోకపోతే, హాస్యం పండదు. హాస్యమే కాదు, ఏ కళ అయినా నైపుణ్యంతో పాటు, మనలో ఒక అమాయక ప్రాణి భద్రంగా ఉంచుకోలేకపోతే, పండదు. ఇతరులకి కనెక్ట్ కాదు. ప్లాస్టిక్ పువ్వుల్లా నిర్జీవంగా తోస్తుంది.
5. మీరు రాసిన కూచిపూడి నృత్యరూపకాల గురించి వివరిస్తారా ...
అమెరికాలో ప్రతి వారాంతం ఏదోఒక కార్యక్రమం జరుగుతూ ఉండేది. నేను అమెరికా వెళ్ళిన తర్వాత 3 ,4 ఏళ్ళు స్టేజి మీద పాటలు, మిమిక్రీ, నటన వంటివి చేస్తూ ఉండేవాడిని. అది చూసిన వెంపటి చినసత్యం గారి శిష్యురాలైన పెనుమర్తి శశికళ గారు, నా ఎక్స్ప్రెషన్స్ చూసి, నన్ను రుక్మిణీ కల్యాణం లో అగ్నిజ్యోతనుడి వేషం వెయ్యమన్నారు. నాకు నాట్యం రాదంటే, ఈ పాత్రకు ఆంగికం ముఖ్యం అన్నారు. చిన్నప్పటి నుంచి, ఏదైనా ఛాలెంజ్ గా తీసుకునే అలవాటున్న నేను, అంతటి ఆవిడ అడిగారు అంటే, నాలో ఏదో స్పార్క్ ఉన్నట్లే కదా, అని ఒప్పుకుని, ఆ వేషం వేసాను. తర్వాత ‘రేవతి’ గారు మేనకా- విశ్వామిత్ర అనే డాన్స్ బాలే లో మేల్ వాయిస్ కు పాడమన్నారు. పాడాను.
9 ఏళ్ళ తర్వాత, శశికళ గారు నన్ను ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ డాన్స్ బాలే రాయమని అడిగారు. 8 పాటలు కావాలి, అంటే... ఇది రాయలేనేమో, ఒక పాట ట్రై చేసి, రాలేదని, చెప్పేద్దాము... అనుకున్నాను.
చిన్నప్పటి నుంచి నాకు బాధ, బెంగ ఉన్న కధలు అంటే ఇష్టం లేదు. ముఖ్యంగా, పూర్ణమ్మ కధ, ఆవు- పులి కధ నా మనసుకు బాగా నచ్చిన ఉద్వేగభరితమైన కధలు. అందుకే పూర్ణమ్మ కధ అనగానే, దానికి ఒక కల్పనగా, మొదటి సీన్ లో పూర్ణమ్మ ‘చిన్ని కృష్ణుడి’ బొమ్మతో ఆడుకునే పాటను రాయాలని అనుకున్నాను. దైవానుగ్రహం వల్ల ఆపాట చాలా గొప్పగా కుదిరింది...
‘ బుజ్జి కృష్ణుడా నా బుల్లి కృష్ణుడా – ఏడబోతివయ్య నీవు రాతిరంతను...’ అని అడుగుతుంది యశోద.
‘ఏటిలోన మొసలి పట్టె ఏనుగమ్మను చక్రమేసి కాచినాను జామువేళను‘ – అంటే, గజేంద్రమోక్షం సన్నివేశం అన్నమాట !
‘చక్రమేసి వచ్చినాక చక్కనయ్య, నిన్ను పక్కమీద చూడలేదె మాయలయ్య...’ అంటూ తిరిగి అడుగుతుంది యశోద.
‘పుడమినెత్తు కెళ్లేనమ్మ బూచివాడు – వాని బుగ్గి చేసి కాచినాను భూమినంతను...’ అంటాడు వరాహావతారం గుర్తుకు వచ్చేలా కృష్ణుడు.
అప్పుడు యశోద, ఎక్కడా దొరకట్లేదే అనుకుంటూ ...’ భూమినంత కాచివస్తే బుజ్జి కృష్ణుడా – నీకు బూరిబుగ్గలెందుకొచ్చె ముద్దు కృష్ణుడా...’ అంటూ అడుగుతుంది. అంటే, వెన్న తింటే కృష్ణుడి బుగ్గలు పొంగాయని, ఆ సంగతి రాబట్టాలని, చూస్తుంది.
వెంటనే గడుసు కృష్ణుడు – ‘ బుగ్గ గిల్లి ముద్దులిడితె పల్లె పడచులు –చాల కందిపోయె మోము పొంగె ఇరు కందువలు...’ అంటాడు. అప్పుడు యశోద కోపంతో...
‘వెన్న దొంగ నేర్చినావు వేల ఆటలు – ఆన, ఎపుడు విడిచి పోకు ఇంక యశోదమ్మను...’ అంటుంది.
‘అందుకే చేరినాను అమ్మచెంతను – ఆల గాచను , లోకాల గాచను...’ అంటూ, ఆవుల్ని, కాపాడేందుకే, నీ వద్దకు వచ్చానమ్మా, అంటాడు కృష్ణుడు.
ఇలా మంచి మంచి పదాలు పడిపోయాయి. ఈ పాట చూసుకుంటూ, తక్కిన పాటలు రాసాను. పూర్ణమ్మ ఉప్పులకుప్ప ఆడేటప్పుడు...
‘ఒప్పులకొప్ప వయ్యారిభామ – ఉరుకులు పలుగులు చాలమ్మా
ఓగేపెనిమిటికూతము నీవై – ముదుసలి బరువును మోయ్యాలమ్మా...’ అని రాసాను.
ఈ పాటలను డి.కే. పట్టమ్మాళ్ గారి మనవరాలు అద్భుతంగా స్వరపరిచారు. గత ఏడాది ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించినప్పుడు, మా పాప పల్లవి, ఇందులో చిన్ని కృష్ణుడి వేషం వేసింది. ఈ ప్రదర్శన విశేష ప్రజాదరణ పొందింది.
6. వాయిస్ కల్చర్ లో మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా ? లేదండి, చిన్నప్పటి నుంచి, నాకు అందరినీ అనుకరించడం ఇష్టం. ఏదైనా ఒక్కసారి వింటే, గుర్తుండిపోయేది. మా చిన్నప్పుడు అమలాపురంలో ఎన్. టి. ఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక సభకు వచ్చినప్పుడు, అక్కడి ప్రజల్ని ఉద్దేశించి – ‘ ఆకాశం చిలలుపడిందా, ఒక ఏరు కట్టలు ప్రవహిస్తోందా, నేల ఈనిందా అన్నట్లుగా ఉన్న ఈ తెలుగుదేశ జన సందోహాన్ని చూస్తే, బహు ముచ్చటేస్తోంది...’ అన్నారు. ఆ సభకు వెళ్ళిన నేను, అవే వాక్యాల్ని, ఆయన స్వరంతో అనుకరిస్తూ ఇంటికి వచ్చాకా చెప్పాను. మా మావయ్యలు, మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, టేప్ రికార్డర్ లో రికార్డు చేసారు. నాకు చదువుల కన్నా, కళల్లో ఎక్కువ ఆనందం కనిపించేది. అలాగని, చదువుల్లోనూ ఎప్పుడూ మేటిగా ఉండేవాడిని. GRE పరీక్ష ఎల్లుండి ఉందనగా, వినయాకచవితి పందిట్లో నాటకం వేస్తుంటే, ఎవరో నాన్నగారికి చెప్పారు. ఆయన మందలించారు, అయినా అందులో ఉత్తీర్ణత పొంది, అమెరికా వచ్చిన ఘనుడ్ని నేను ! 7. మీ పల్లకీ కధను లఘు చిత్రంగా తీసిన వైనం చెప్పండి. పల్లకి కధకు, చిత్రం తియ్యడానికి మధ్య ఒక దశాబ్దం అంతరం ఉంది. ఇది నా జీవితంతో బాగా ముడిపడిన కధ. నేనెన్నడూ చూడని మా తాతగారి గురించి, మా నాన్నగారుచెబుతుండగా విని, కొన్ని పాత్రల్ని ఊహించుకుని రాసాను. మాల్గుడి డేస్ లాగా ఎప్పటికైనా దీన్ని లఘు చిత్రంగా తియ్యాలని అనుకునేవాడిని. 2 ఏళ్ళు అట్లాంటాలో ‘ఫిలిం డైరెక్షన్ కోర్స్’ కూడా చేసాను. ఈ కధ చదివిన తనికెళ్ళ భరణి గారు, ఎప్పటికైనా దీన్ని లఘు చిత్రంగా తియ్యమని, తీస్తే తాను ఉచితంగా నటిస్తానని, చెప్పారు. సరే అని, ఈ కధకు స్క్రీన్ ప్లే రాసాను. దాన్ని గొల్లపూడి మారుతీరావు గారి సూచనతో మరింత విస్తృతం చేసి, ఆయనకు చూపితే, చాలా మెచ్చుకున్నారు. చివరికి అట్లాంటాలో ఉన్న ఒక సహృదయులైన సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత స్పోన్సర్ చెయ్యగా, ఈ లఘు చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. ఈ చిత్రానికి నేను రాసిన టైటిల్ సాంగ్ ను మాధవపెద్ది సురేష్ గారు స్వరపరచగా, బాలు గారు అద్భుతంగా పాడారు. ఎల్.బి.శ్రీరామ్ గారు ఈ స్క్రిప్ట్ ను అమితంగా ప్రేమించి, ఆ పాత్రలో మమేకమైపోయి నటించారు. ఇక ముందే మాటిచ్చినట్టుగా తనికెళ్ళ భరణి గారు, గొల్లపూడి మారుతీరావు గారు ఇందులో గొప్పగా నటించారు. ఈ ప్రముఖులంతా స్క్రీన్ ప్లే విని, ఉచితంగా పనిచేసారు. బ్నిం గారు అందరి మధ్య వ్యవహారకర్తగా ఉంటూ, నా కల సాకారమయ్యేందుకు ఎంతగానో సహకరించారు. వ్యాఘ్రేశ్వర పురం లో 6 రోజులపాటు జరిగిన షూటింగ్ కి తన ఆరోగ్యం బాగోలేక పోయినా, వచ్చి, నాకు అమూల్యమైన సూచనలు, సాయం అందించారు. వారి మేలు ఎప్పటికీ మరువలేను. ఈ చిత్రాన్ని గతవారం అట్లాంటాలో మూడు మార్లు ప్రదర్శించగా, మూడు షో లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఎంతో మంది ఉద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది తమ జ్ఞాపకాలు నెమరువేసుకుని, నన్ను ఎంతగానో అభినందించారు. చాలా ఆనందం కలిగింది. 8. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? నేను రాసిన మరికొన్ని కధలు లఘు చిత్రాలుగా తియ్యాలని ఉంది. అలాగే, కధనంలో పట్టు ఉండే ఒక పూర్తి స్థాయి హాస్య చిత్రం తియ్యాలని కోరిక. నేను కౌముదిలో 4 ఏళ్ళు ‘టేక్ ఇట్ ఈజీ’ హాస్య గల్పికలు రాయగా, 2 ఏళ్ళు రాసినవి, పుస్తకంగా ప్రచురించాను. మరో రెండేళ్ళు రాసినవి పుస్తకంగా తేవాలని ఆలోచిస్తున్నాను. అలాగే మరికొన్ని కధలు, కవితలు రాయాలి. ఐన్స్టీన్ చెప్పినట్లు...’ కలలు కనలేకపోవడం దౌర్భాగ్యం. కలలు కనడం మానేస్తే జీవితం ఆగిపోతుంది. అందుకే, ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలని ఎర్పరుచుకుంటూ ఉంటాను. 9. మీరు మనబడి, ఇతర స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారట ? నాకెందుకో ‘సేవ’ అనే పేరు నచ్చదు. మన మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు సేవ అని ఎందుకు అనాలి? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్లుగా అన్ని అహంకారాల కంటే, ధర్మ, సేవాపరమైన అహాలు చాలా చెడ్డవి. అందుకే, వాటిని దరిచేరనియ్యకుండా పనిచెయ్యడం మా కుటుంబం నుంచే వచ్చింది. కొన్నాళ్ళు పాఠ్య పుస్తకాల్లో డొక్కా సీతమ్మ గారి కధ ఉండేది, తర్వాత తీసేశారు. ‘కోనసీమ అన్నపూర్ణ’ గా చెప్పే ఆవిడ ఫోటో బాలయోగి గారు ఇంగ్లాండ్ పార్లమెంట్ లో చూసి, ఆంగ్లేయులు, ‘ఈవిడ మీ ప్రాంతం వారే, మీకు తెలీదా ?’ అని అడిగితే ఆలోచించి, వెనక్కు వచ్చి, డి. గన్నవరం బ్రిడ్జి వద్ద ఆవిడ విగ్రహం పెట్టించారు. అంటే – మనం మరచిపోతున్న మనవారిని బ్రిటిష్ వారు గుర్తుంచుకున్నారు. ఎంత గొప్ప సంగతి... అందుకే, తర్వాతి తరానికి ఆడియో, వీడియో, లేక అక్షరాల ద్వారా ఇలా ఉండేవి – అన్న క్లూ వదలి వెళ్ళాలి. ప్రతి ఆదివారం మన బడిలో క్లాస్సులు చెప్పేవాడిని. మధ్యలో కొంత విరామం వచ్చింది. అన్నయ్య 2 ఏళ్ళు కష్టపడి, 15 పుస్తకాలతో ఒక సిలబస్ రూపొందించారు. మేము ‘అంతర్జాతీయ తెలుగు బడి’ ని స్థాపించి, ఈ పాఠాల్లో ఉన్న విలువలతో కూడిన నీతి పద్యాలు, నీతి కధలు వంటివి పిల్లలకు బోధిస్తున్నాము. సుమారు 350 మంది ఇందులో చదువుతున్నారు. చిన్మయా మిషన్ వారు ఈ పుస్తకాలు అడిగి తీసుకుని, పిల్లలకు బోధిస్తున్నారు. కొన్నేళ్లుగా అడిగిన పత్రికలకు రాస్తున్నాను, తోరి రేడియో లో ‘అనగనగా’ అనే కధల కార్యక్రమం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైనది, మంచి మనిషిగా బ్రతకడం అని నాకు అనిపిస్తుంది. విలువలు నేర్పితే చాలు, పిల్లలకు మంచి నడవడి అలవడుతుంది. అందుకే విలువలతో కూడిన బోధన మా ప్రధాన లక్ష్యం. గొప్ప వంశంలో పుట్టి, ఆ వంశానికే వన్నె తెస్తున్న డొక్కా ఫణి గారు, కోరుకున్న లక్ష్యాలను చేరుకొని, మరిన్ని విజయాలను సాధించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిద్దాము. శుభం. పూర్తి ముఖాముఖి ని క్రింది లింక్ లో వినండి...
No comments:
Post a Comment