ఇలా ఎందరున్నారు ?- 6
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. సంకేతనే చూస్తూ ఉంటాడు అనంత్... ఇక చదవండి... )
అతనలా చూపుల్ని తన మీద నిలుపుతున్న కొద్దీ సంకేత భూమి లోకి క్రుంగిపోతున్న దానిలా అయింది. అనంత్ అలా ఎనుకు చూస్తున్నాడో తనకి అర్ధమైంది. తను వేసుకున్న డ్రస్ పల్లవిదని అతనికి తెలిసి పోయి ఉంటుంది.....అతను కూడా శ్రీహర్ష లాగే తనని ఎగతాళిగా చూస్తున్నట్లు అంపించి త్వరగా ఇంటికెళ్తే బావుండన్నట్లు చూస్తోంది. అసలా వాతావరణమే ఆమెకు కొత్తగా ఉంది. ముళ్ళమేఅద ఊర్చున్నట్లు "ఇప్పుడిప్పుడే ఈ పార్టీ అయ్యేటట్లు లేదుగా! అనంత్ పేరెంట్స్ కూడా రావాలేమో కదా!" అంది సంకేత పల్లవికి మాత్రమే వినిపించేలా....
"ఛ, ఛ ఇలాంటి చోటుకి పేరెంట్స్ వస్తారా ఎక్కడైనా?ఇది కేవలం స్నేహితులకి ఇస్తున్న పార్టీ! అనంత్ చాలా గొప్పవాడు తెలుసా>"
"ఎందుకు?"
"ఎందుకంటే ! అతనిలా మన కాలేజీ లో ఏ అబ్బాయి అయినా ఇలాంటి పార్టీని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయగలడా? ఇంత ఖర్చు పెట్ట్గలరా? ఈ రోజుల్లో ఇలాంటి ఆనందం రావాలంటే బోలెడంత డబ్బుండాలి....అనంత్ తండ్రి కోటీస్వరుడు తెలుసా?"
"నాకేం తెలుసే ! ప్రతీదీ తెలుసా! తెలుసా! అని నన్ను తికమక పెడతావ్? నాకసలే ఇలాంటి పార్టీలు కొత్త! పైగా ఈ డ్రస్సొకటి నన్ను నలిపేస్తోంది..." అంటూ గొణిగింది సంకేత.
"ఆ డ్రస్ నీకెంత టైట్ గా ఏం లేదు. నలపటానికి....!రోజుకన్నా ఈ డ్రస్ లో మరింత అందంగా ఉన్నావ్!నేను ఒక్క సారి మాత్రమే ఈ డ్రస్ వేసుకున్నను. ఆ తర్వాత అది నాకు పట్టక పక్కన పెట్టేశాను. ఆ ఒక్కసారి కూడా ఏదో కాలేజీ ఫంక్షన్ లో ...."అంటూ గుర్తుచేసుకుంటుంటే...
సంకేత కంగారుగా అటు ఇటు చూసి "చాల్లే ఈ డ్రస్ గురించి అంత చర్చ అవసరమా!" అంది.
"నువ్వే కదే డ్రస్ నలిపేస్తొంది అన్నావ్! సౌకర్యంగా లేదా?" అంది.
"ఉంది. గట్టిగా అరవకే! ఫంక్షన్ కదా! పక్క వాళ్ళకి ఇబందిగా ఉంటుంది." అంది ఊపిరి బిగబట్టినట్లు చూస్తూ.
పల్లవి పక పకా నవ్వి "ఇక్కడ జరిగేది గుడిలో పూజ అనుకుంటున్నావా? అలా చూడు! ఎక్కడి వాళ్ళక్కడ గట్టి, గట్టిగా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, అరుచుకుంటూ ఎలా సంబరపడుతున్నారో!" అంటూ సంకేత వైపు పరిశీలనగా చూసి మళ్ళీ తనే "ఏంటే అలా ఉన్నావ్! డబ్బుగురించే ఆలోచిస్తున్నావా" అంది. శివాని వాళ్ళ గుంపు దూరంగా నిలబడి ఉంది.
నిజానికి ఆ క్షణం లో తన ఒంటి మీద ఉన్న పల్లవి డ్రస్ తప్ప తనకి ఇంకేం గుర్తు రావడం లేదు సంకేతకి...
అనంత్ ఎప్పుడు వచ్చాడో పల్లవి పక్కన నిలబడి పల్లవితో మాట్లాడుతున్నడు. అతను పలకరించగానే సంకేత ఉలిక్కిపడి తననేనా అన్నట్లు చూసింది. చాలా మంది అమ్మాయిలు అతను పలకరిస్తే చాలన్నట్లు చూస్తున్నారు. అతన్ని పలకరిణాలని చూస్తున్నారు.
అతని పక్కన నిలబడడానికి ఉవ్విళ్ళొరుతున్నారు. అంత ఒత్తిడిలో కూడా అదంతా తను గమనిస్తోంది. అలాంటిది అతను తనను పలకరించడం ఏమిటి? అదే శ్రీహర్ష అయితే పలకరిస్తాడా? ఎంత స్ఠాయీ బేధాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే శ్రీహర్ష అంటే తనకి నచ్చదు.
అనంత్ నవ్వి"మా పల్లవి మిమ్మల్ని బలవంతంగా పార్టీకి తీసుకొచ్చిందా? ఇక్కడేదో ముళ్ళు, గాజుముక్కలు ఉన్నట్లు కష్టంగా నిలబడ్డారు." అంటూ ఒక్క క్షణం నేల వైపు తమాషాగా అటూ ఇటూ చూశాడు. అతను ఎప్పుడైనా పల్లవిని మా పల్లవి అనే చెప్పుకుంటాడు. అతనికి దూరపు బంధువు పల్లవి.
...అదేం లేదన్నట్లు కంగారుగా చూసింది సంకేత. కానీ అతనితో మాట్లాడాలంటే గొంతు పెగలటం లేదు. కారణం, అతను తన సీనియర్ అనా? లేక డబ్బున్న వాడనా? అర్ధం కాలేదు.
"ఇట్స్ ఓ.కె. ఇబ్బందిగా ఉన్నట్లుంది. నేను వెళతాను" అంటూ అనంత్ అక్కడ నుండి వెల్తుంటే...
"అనంత్!" అంటూ పిలిచింది పల్లవి.
అనంత్ ఆగి ఏమిటన్నట్లు చూశాడు.
అనంత్ ని కొద్దిగా పక్కకి తీసికెళ్ళి...సంకేత కాలేజీలో ఫైన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది.
.....పల్లవి అనంత్ తో ఏం మాట్లాడిందో సంకేతకి వినిపించలేదు. సంకేతకే కాదు, అక్కడున్న ఎవరికీ వినిపించలేదు. అనంత్ మాత్రం పల్లవి చెప్పింది విని, ఎవరో విష్ చేయడం తో అటు వైపు వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి పోయాడు. అతన్నుండి ఎలాంటి స్పందన లేకపోవడం పల్లవికి నిరాశ అనిపించింది. ఇలాంటి చోట ఇంతింత ఖర్చు పెట్టుకొనే కన్నా సంకేత లాంటి వాళకి హెల్ప్ చేస్తే తప్పేముంది? దానంగా కాకపోయిన అప్పుగానైనా ఇవ్వొచుగా! ఏంటో ఈ అనంత్! పెద్దవాళు ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు... ఇతరులకి సహాయం చేయడానికి మత్రం ఇష్టపడడు. 'మనం తిన్నది మట్టి పాలు, పరులకి పెట్టింది మనపాలూ అన్నది ఎప్పుడు గ్రహిస్తాడో ఏమో! అనుకుంది పల్లవి.
ఆ తర్వాత కేక్ కట్ చెయ్యటం కేక్ తినిపించుకోవటం...కేక్ ని ముఖానికి పూసుకోవడం... ఒకటే సందడి ! ఫుల్ జోష్ తో డాన్సులు, అరుపులు, కేకలు, ఫాస్ట్ మ్యూజిక్ తో పాటలు....
పార్టీ ముగిసింది. ఎవళ్ళకు వాళ్ళు వెళ్ళి పోయారు. వెళ్తునప్పుడు సంకేత ఎందుకో డల్ గా కనిపించడంతో పల్లవి సంకేత భుజం తట్టి "మరీ అంత దిగులు పడకు, ఎపుడూ ఇలాగే ఉండదు. నీకో విషయం చెప్పనా. నిన్నటిని చూసి ఎంత నేర్చుకుంటావో, నేటి కోసం అంతే జీవించు. రేపటి మీద ఆశల్ని పెంచుకో. ఆశ మనిషి ఊపిరి. అంతే కానీ ఇలా మాత్రం ఉండకు".
పార్టీ నుండి ఇంటికొచ్చాకా, సంకేతకి చాలా సేపు నిద్ర పట్తలేదు.
పార్టీలో దేదీప్యమానంగా వెలిగిన ఆ లైట్లు, భూమ్మీద ఉన్న ఆనందం అంతా మాదే అన్నట్లు వినిపించిన ఆ నవులు, ఆ పాటలు, ఆ డాన్సులు, నిజంగానే అది స్వర్గం....ఎక్కువగా హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలే ఆ పర్టీ అటెండ్ అయ్యారు. వాళ్ళంతా ఎంత ఆనందం గా ఉన్నారు...తను కూడా హాస్టల్ లో ఉంటే బావుండు కదా! దేవుడు అన్నీ వాళ్ళకే ఇచ్చినట్లు ఆ హుషారెంటి. ఆ ఉత్సాహం ఏంటి. కళ్ళు గట్టిగా మూసుకున్నా అదే కనిపిస్తోంది. ప్రతి క్షణాన్ని వాళ్ళేంత సంతోషంగా వాడు కుంటున్నారో!! తనీ రోజు హిందూ కోసం వెళ్ళకపోయి ఉంటే తనకీ అవకాశం వచ్చి ఉండేది కాదు.
జీవితాన్ని ఆనందంగా గడపటంలో శివానిదే సరైన మార్గం కాదని పల్లవి అంది. హిందూ అంది. విన్నవాళ్ళెవరైనా అంటారు. కానీ ఇప్పుడున్న కాలమానపరిస్థితుల్లో, ఏది సరైనదో ఏది కాదో తనకే సరైన స్పష్టత రావటం లేదు. నిజం చెప్పాలాంటే తన తల్లితండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా తనని చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళని చూస్తుంటే ఒక్క రూపాయి అడగాలన్నా, అడగలేక పోతోంది. అలా అని తల్లితండ్రులని అర్ధం చేసుకున్నంత సులభంగా అవసరాలను దాటి వెల్లలేకపోతోంది.
ఎందుకో తమ ఊరును, తల్లిదండ్రులను గుర్తు చేసుకోటానికి మనసు అంగీకరించటం లేదు సంకేతకి. పార్టీ లో చూసిన అనంతే గుర్తుకొస్తున్నాడు. దాస్ కాని, శ్రీహర్ష కానిజీవితం లో ఒక్కసారైనా అనంత్ ఇచ్చిన పార్టీ లాంటిది ఇవగలరా? అలా ఇవ్వడం వాళ్ళకి సాధ్యమవుతుందా? కాదు. మనసులను గాయపరచటం మాత్రమే వాళ్ళకి వచు. వాళ్ళ ప్రపంచం వేరు. అనంత్ ప్రపంచం వేరు. వాళ్ళ స్థాయి వేరు. అనంత్ స్థాయి వేరు..అనంత్ స్థాయి వాళ్ళను మించిన స్థాయి. అయినా శ్రీహర్ష తనని నిర్లక్ష్యం చేసినట్లు, వ్యాఖ్యానాలు చేసినట్లు అనంత్ ఎవరినీ చేసి ఉండడు. చెయ్యడు. చూస్తేనే తెలుస్తోంది అతనెలాంటి వాడో. ఇప్పుడే కాదు ఫ్రెషర్స్ పార్టీలో కూడా తనని పలకరించాడు. తనే సరిగా మాట్లాడ లేదు. తక్కువ భావం తో కుచించుకు పోయింది. తనలో ఏదో కల్లోలం. తనకే తెలియని వ్యాకులత. ఎంత చదివినా తను అందరికన్నా తక్కువే అన ఆత్మన్యూనత...దీన్ని జయించలేకపోతోంది...కారణం ఆ పార్టీ లో చదువుకన్నా సంపదనే ఎక్కువగా పోటీ పడుతుంది.
ప్రతిరోజూ ఎ సమయంలో పుస్తకం పట్టుకొని చదువుతూ కూర్చొని ఉండే సంకేత ఈ రోజెందుకు ఆ పని చెయ్యలేదో అర్ధంకాక, అడిగితే బావుండదని అడగలేక, పడుకొని హాయిగా నిద్రపోతోంది నీలిమ....సంకేత మాత్రం ఆలోచిస్తోంది.
తెల్లవారి కాలేజీకి వెళ్ళగనే లాబ్ లో మేడం ఫైన్ గుర్తుచేస్తుందని సంకేత భయపడింది...ఇంకొంచెం టైం అడగాలని మేడం దగ్గరికి వెళ్ళింది.
సంకేతని చూడగానే "నీ ఫైన్ కట్టినట్లు రికార్డులో ఉంది. ఇంతకముందే కట్టారు" అంది మేడం.
"థ్యాంక్ గాడ్! ఈ పని పల్లవిదే! హిందూ మాత్రం కాదు. హిందూ ఇంకా ఊరినుండీ రాలేదు" అని మనసులో అనుకొని "ఓ.కె. మేడం. థ్యాంక్యూ!" అని చెప్పి క్లాసుకెళ్ళింది. సంకేత.
సంకేతకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మనసులోంచి వేయి టన్నుల బరువు వెళ్ళిపోయినట్లయింది.
వెంటనే పల్లవిని కలిసి "నువ్వు, చేసిన సహాయానికి కృతఙ్ఞతలు పల్లవి!"అంది.
పల్లవికి అర్ధం కాక "నేను సహాయం చేయటం ఏంటి! ఏం మాట్లాడుతున్నావే!" అంది.
"ల్యాబ్ లో ఫైన్ కట్టింది నువ్వేగా"?
అప్పుడు వెలిగింది పల్లవి బుర్ర. తనుకాదు. అనంత్ కట్టి ఉంటాడు. మంచి పనే చేసాడు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు అందరూ చెయ్యాలి. అప్పుడే పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. ముఖ్యంగా అనంత్ లాగా డబ్బున్న వాళ్ళలో ఇలాంటి దయార్ధ హృదయం బయటకి వస్తే డబ్బు దుర్వినియోగం బాగా తగ్గుతుంది. తనవైపు కృతఙ్ఞతతో చూస్తున్న సంకేతకి ఫైన్ కట్టింది అనంత్ అన్న విషయం చెప్పకుండా 'ఓ.కే అంది పల్లవి.
క్లాసు మొదలవటం తో వాళ్ళు ఇంకేం మాట్లాడుకోలేదు.
**********
రోజులు గడుస్తున్నాయి.
సంకేత కాలేజీ నుండి ఇంటికెళ్ళాక ఫ్రెషప్పయి తన బెడ్ మీద కూర్చుని ఫ్యాన్ హై స్పీడ్‍లో పెట్టుకొని చదువుకుంటోంది.
“శ్రీహర్ష కాలేజీనుండి ఇంకా ఇంటికి రాలేదు. నీకేమైనా కన్పించాడా? కాలేజీలో ప్రోగ్రాం లాంటిదేమైనా ఉందా వాళ్ళకి?” అని సంకేతను అడిగింది కాంచనమాల.
శ్రీహర్ష మీద కోపంతో ఏదో ఒక అబద్ధం చెప్పి కొద్ది సేపు తిట్టిపించి ఎంజాయ్ చేద్దామనుకుంది కాని ఆ మూడ్ లో లేదు సంకేత. అందుకే “ఏమో! ఆంటీ! శ్రీ హర్ష నాకు కనిపించలేదు”. అని తన ఆలోచనలో తనుంది సంకేత.
తను ఇప్పుడుబి.టెక్ థర్డ్ ఇయర్ లో ఉంది కాబట్టి ఈ ఇయర్ నుండే గేట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకోవాలనుకుంది. తండ్రి తో చెప్పింది.
ఆయన భుజం మీద ఉన్న కండువాతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని “ఇప్పటికే మన ఊరిలో కొంత అప్పు చేశాను. దాన్ని కొద్దికొద్దిగా తీర్చుకుంటున్నాను. ఇప్పుడిక వచ్చేవాళ్ళు కూడా లేరు. నువ్వు ఇంకా పెద్ద చదువులు చదవాలని నాకూ ఉంది. డబ్బులు లేనప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు చదువుతున్న ఈ చదువు పూర్తి కాగానే ఏదైనా ఉద్యోగం చూసుకో!” అన్నాడు.
ఆయన అంతకన్నా ఇంకేమీ అనలేడు. గట్టిగా ఒత్తిడి చేస్తే పేద ఏడుపు ఏడుస్తాడేమో మౌనంగా! అది తను తట్టుకోలేదు. అందుకేనేమో పెద్ద పెద్ద చదువులకి తన లాంటి వాళ్ళకి సంబంధం కుదరదు. ముందు ఈ బి.టెక్ పూర్తి చేస్తే చాలు. ఆ తర్వాతైనా తనకి ఎం.టెక్ చెయ్యాలని ఉంది. అసలు గేట్ ఎగ్జామ్‍ను కోచింగ్ తీసుకోకుండా రాయొచ్చు. ఎందుకంటే అందులో వచ్చే క్వశ్చన్సన్నీ బి.టెక్ ఫోర్త్ ఇయర్‍లో చదివిన దానిమీదనే వస్తాయి. కాని కోచింగ్ తీసుకుంటే షార్ట్‍కట్ మెథడ్స్, టిప్స్, కొశ్చన్స్, గురించి ఐడియాస్ తెలుస్తాయి. కోచింగ్ సెంటర్లో అయితేనే మంచి మెటీరియల్ ఉంటుంది.
అందుకే ధైర్యం చేసి, తండ్రి చెప్పిన మాటలు కూడా ఆలోచించకుండా, ఎవరో ఒకరు సహాయం చెయ్యకపోతారా అన్న నమ్మకంతో కోచింగ్ సెంటర్‍కి వెళ్ళి కోచింగ్ ఎంట్రన్స్ రాసి వచ్చింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చాయి. కోచింగ్ ఫీజు కొంత తగ్గించారు.
మిగతా కొంత తను కట్టాలి. తన దగ్గర డబ్బు లేదు. పల్లవిని అడిగితే? పల్లవికి మంచి సర్కిల్ ఉన్నట్టుంది. లేకుంటే లాబ్ లో తను కట్టవలసిన ఫైన్ ను అంత త్వరగా కట్టగలిగేది కాదు. రేపు కాలేజీలో తన కోచింగ్ ఫీజ్ విషయం పల్లవితో చెప్పాలి. ఏ మాత్రం అవకాశం ఉన్నా తనకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అని ఆలోచిస్తుండగా శ్రీహర్ష మీద కేకలేస్తూ కాంచనమాల గొంతు గట్టిగా విన్పిస్తోంది.
“ఆ ఫ్యాన్ ఎందుకు తెచ్చావు శ్రీహర్షా? ఎవరికోసం తెచ్చావు?” అంది కోపంగా అరిచినట్లే కాంచనమాల.
“నానమ్మ కోసం తెచ్చాను మమ్మీ! నా ఫ్రెండ్ దాస్ ఈ మధ్యన బ్యాఅంక్ సబ్సిడీలోన్ తీసుకుని ఎలక్ట్రికల్ షాపు పెట్టాడు. వాడ్ని కలవాలని వాడి షాపుకి వెళ్ళగానే కొన్ని ఫ్యాన్లు కన్పించాయి. నాన్నమ్మకోసం ఓ ఫ్యాన్ కొందామని చాలా రోజులనుండి అనుకుంటున్నాను. అందుకే వాయిదాల పద్ధతి ప్రకారం తెచ్చాను. డబ్బు ఒక్కసారిగా కట్టనవసరం లేదు.” అన్నాడు చాలా నెమ్మదిగా నచ్చచెబుతున్న ధోరణిలో...
“ఒక్కసారిగా కాకపోయినా డబ్బులైతే కట్టాలిగా! ఎక్కడనుండి తెచ్చి కడతావు? ఇప్పుడొస్తున్న కరెంట్ బిల్ చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇన్ని రోజులు మన రూమ్ కి మాత్రమే ఎసి ఉండేది. సంకేత వచ్చాక అక్కడో ఫ్యాన్ వెయ్యడం జరిగింది. ఇప్పుడు మరొక ఫ్యానంటే మాటలా?” అంది గట్టిగా కాంచనమాల.
సంకేత వెంటనే ఫ్యాన్ ఆపేసి కూర్చుంది. కనీసం ఫ్యాన్ ఉంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ కోపంలో తన ఫ్యాన్ ని కూడా తీయించేస్తే ఊపిరాడక చావాలి. ఇన్ని రోజులు నీలిమ ఎలా ఉన్నదో!? వరమ్మ సంగతి దేవుడెరుగు..
“మనం ఎ.సిలో పడుకుంటున్నాం. నాన్నమ్మకి ఫ్యానైనా ఉండొద్దా మమ్మీ! డాడీకి చెబుతానులే! ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తే కట్టమని” అన్నాడు శ్రీహర్ష.
“డాడీ కాదు కట్టేది నేను ఇప్పుడు పెరిగిన రేట్లను బట్టి మీ డాడీ నా చేతి ఇస్తున్న డబ్బులు ఏ మూలకి వస్తున్నాయి? నేను చాలా తెలివిగా అవసరాన్ని బట్టి ఖర్చు పెడుతుండబట్టి సరిపోతున్నాయి. నా బాధను అర్థం చేసుకోకుండా ఆ ముసలమ్మను వెనుకేసుకొస్తున్నావు అంది.
మెట్లకింద పడుకొని ఉన్న వరమ్మకు కాంచనమాల మాటలు వినిపిస్తున్నాయి.
“బయట చాలా మంది ముసలివాళ్ళు సకాలంలో పెన్షన్ డబ్బులు రాక నానా అవస్థలు పడుతున్నారు. మన ముసలమ్మకేం అలాంటి ఇబ్బందులు లేవు. మన పుణ్యమా అని ముద్దకి లోటు లేకుండా జరుగుతోంది.” అంది గొప్ప వాస్తవం చెబుతున్నట్లు.
“అలా అని ఈ వయస్సులో గాలి లేకుంటే కష్టం కదా!” అన్నాడు శ్రీహర్ష అసహనంగా.
“ఎవరన్నారక్కడ గాలి లేదని? గాలి లేకుంటే ఇన్ని రోజులు ఎలా ఉంది? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ నీలిమ అయినా నేర్పి ఉండాలి లేదంటే ఆవిడగారయినా చెప్పి ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ అంటుంది, రేపు ఎ.సి అంటుంది.
“నాన్నమ్మ నాకేం చెప్పలేదు. నాకే అన్పించింది. ఆమెను సౌకర్యవంతంగా ఉంచాలని..”
“నీకు అన్పించినట్లే ఒకప్పుడు ఆమెకు అన్పించలేదు.. నాకు పెళ్ళయిన కొత్తలో మీ డాడీ ఆఫీసు నుండి ఇంటికొచ్చేంత వరకు ఫ్యాన్ వేసుకోనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా అదిగో ఆ మెట్ల పక్కన బోగస్ విల్లా చెట్టు కింద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూనో పప్పుల్లో మట్టి బెడ్డలు ఏరుతూనో ఉండేదాన్ని. గొడ్డుచాకిరీ చేయించేది. అప్పుడు నాకీ గొంతు కూడా ఇంత్ గట్టిగా పలికేది కాదు. ఆవిడంటే భయంతో వణికేదాన్ని! ఇప్పుడిది నా టైం” అంది కాంచనమాల.
విభ్రమతో చూశాడు శ్రీహర్ష.
మానవ సంబంధాలకి టైం టేబుల్ ఉంటుందా? ఎప్పుడో ఏదో జరిగిందని తన తల్లి ఇలా ప్రవర్తిస్తుందేమిటి? పగ తీర్చుకోవడం అంటే ఇదేనా? ఇది పగ తీర్చుకోవడం కాదు నరకం చూపించడం..!
శ్రీహర్ష తేరుకొని “జరిగిందేదో జరిగిపోయింది అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఫ్యాన్ వద్దనడం ఏం బాగలేదు మమ్మీ!” అన్నాడు.
ఆమె నిర్మొహమాటంగా “ఆ ఫ్యాన్ పెడితే నేను ఆ ఫ్యాన్‍కే ఉరి వేసుకొని చస్తాను” అంటూ బెదిరించి లోపలికి వెళ్ళింది.
అప్పుడే ఆఫీసునుండి ఇంటికొచ్చిన శివరామకృష్ణ విషయం తెలిసి బిత్తరపోయాడు. విపరీతంగా కంగారు పడ్డాడు.
“కాంచనా! కాంచనా! అంటూ ఆరాటంగా పిలిచాడు. ఆమె ‘ఊ’ అనలేదు. మౌనమే నా భాష అన్నట్లు మౌనంతోనే తన నిరసనను వ్యక్తం చేసింది. ఆయన గుండె జారినట్లయింది.
దిగులుగా శ్రీహర్షనే చూస్తూ “నువ్వు మీ అమ్మ అసంగతి తెలిసే ఇలా చేస్తున్నావా? అసలే మీ అమ్మకి రోషం, పౌరుషం ఎక్కువరా! అన్నంత పని చేస్తుంది.” అన్నాడు శివరామకృష్ణ.
“అక్కడ మీ అమ్మకి గాలి సరిగా లేదు. దోమలు అది అసలు రూం కూడా కాదు. ఎప్పుడో రూం కట్టిస్తానంటావ్! కట్టించవు. నువ్వు అసలు మీ అమ్మ గురించి ఆలోచించవా నాన్నా..?
“ఎందుకు ఆలోచించనురా! ఇంట్లో పాతకక్షలు ఇంకా సద్దుమణగనే లేదు ఇప్పుడేగా విన్నావ్! నాకు మాత్రం తెలియదా మా అమ్మ పడే ఇబ్బంది? అప్పుడెప్పుడో మా శివకి పెళ్ళయ్యాక కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని మా అమ్మ అన్నదట..! అది విని ప్రతిరోజు ఇంటిముందున్న చెట్లకిందకెళ్ళి కూర్చునేది మీ అమ్మ! అంత పంతం మనిషి పౌరుషానికి పోయి ఇప్పుడేమైనా చేసుకుందనుకో మనం దిక్కులేని పక్షులం అవుతాం! అందుకే చాకచక్యంగా నెట్టుకొస్తున్నాను” అన్నాడు.
“మీ అమ్మను మెట్లకింద పెట్టి నువ్వెంత బాగా నెట్టుకొస్తున్నావో తెలుస్తూనే ఉంది. నా ఫ్రెండ్స్ కూడా మీ నాన్నమ్మ ఏందిరా బయట పడుకొని ఉంది లోపల స్థలం లేదా అని అంటున్నారు. సమాధానం చెప్పుకోలేక చస్తున్నాను. నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకుంటారేమో! నా స్నేహితులు నన్ను కామెంట్ చేస్తారు.” అన్నాడు శ్రీహర్ష.
“కామెంట్ దేముందిలే నేను కూడా చేస్తాను. వాళ్ళకో ముసలమ్మ ఉంటే తెలుస్తుంది” అన్నాడు తనలో తను గొణుక్కుంటూ.
“అయితే ఇప్పుడా ఫ్యాన్ పెట్టొద్దా?”
“వద్దురా! నా మాట విని అది తీసికెళ్ళి దాస్‍కి ఇచ్చెయ్యి.”
“వాడు నా నోట్లో గడ్డి పెడతాడు. సిగ్గుతో నేను చచ్చిపోవాలి.”
“మీ అమ్మ అలిగి నా నోటికాడి తిండి పోతే నేను కడుపు మాడి చస్తాను. ఒక రకంగా నేను చావడమే మంచిదనిపిస్తోంది. లేకుంటే మీ అమ్మతో మా అమ్మతో ఎవరు పడతారు ఈ బాధలు?”
“నువ్వేం బాధలు పడుతున్నావు నాన్నా..? జీతం తెచ్చి అమ్మ చేతికి ఇస్తావ్! అంతేగా! ఈ మాత్రానికే బాధలా? నాన్నమ్మకి వయసు పైబడింది. నిస్సహాయస్థితిలో ఉంది. ఆమెను మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు. ఆమెనో అంటరానిదానిలా మెట్లకింద ఉంచారు. ఇదెంతపాపమో మీకిప్పుడు అర్థం కాదు. ఈ వయసులో కూడా అమ్మకి మీరు భయపడడం సిగ్గుగా ఉంది” అన్నాడు శ్రీహర్ష.
“నీకు పెళ్ళి కానంత వరకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవురా! అప్పటివరకు నేను నీతో మాట్లాడకపోవడమే మంచిది.”
ప్రతి ఒక్కరికి ఇలాగే రిలాక్స్‍గా ఉండడం అలవాటైపోయింది. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడం తప్ప కనీసం కన్నతల్లిని కూడా పట్టించుకునే స్థితిలో లేరు. అడిగితే నువ్వు బాధ పడతావని అడగలేదు కాని ఆ రోజు నాన్నమ్మ బిర్యాని తెమ్మని డబ్బులిస్తే కనీసం అదైనా తెచ్చి పెట్టావా? చూసి చూసి నిద్రపోయింది. నువ్వేమో వెళ్ళి పార్టీలో కూర్చుని వచ్చావు. ఆమె డబ్బుల్ని తినగలదా నాన్నా? ఆమె కనీస కోరికలు తీర్చే బాధ్యత కూడా నీకు లేదా? ఆ డబ్బులు కూడా నీవి కావు. మీ చెల్లెలు చూడడానికి వచ్చినపుడు ఇచ్చి వెళ్ళిందట. కనీసం మీ చెల్లెలు అయినా ఆమె కోరిక తీర్చి వెళ్ళిందా? నువ్వూ, మీ చెల్లెలు కాకుంటే ఎవరు పట్టించుకుంటారు నాన్నా ఆమెను. కడుపున పుట్టిన పిల్లలు మీరే పెట్టకపోతే ఎవరు పెడతారు? ఆ వయసులో ఉన్న వాళ్ళకి కావలసింది పెట్టే చేతులు నాన్నా! కరెన్సీ నోట్లు కాదు.”
వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు! వీడిని నీలిమ మార్చేసిందా? వరమ్మ మార్చిందా? ఎలాగైతేనేం తన కన్నకొడుకే తన శత్రువర్గంలో చేరినట్లు విలవిలలాడింది కాంచనమాల.
శివరామకృష్ణ కొడుకు ముఖంలోకి చూడలేక నేలచూపులు చూస్తూ “మావి పెట్టే చేతులే శ్రీహర్షా! మీ అమ్మ చూస్తే ఆ మాత్రం బిర్యాని నేను పెట్టలేనా అంటుంది. ఆ భయానికే నేను కాని, మా చెల్లెలు కాని మా అమ్మని పట్టించుకోం! అంతా మీ అమ్మనే చూసుకుంటుంది. గలగల మాట్లాడుతుందనే కాని మీ అమ్మ మనసు మంచిదిరా!” అన్నాడు.
తండ్రిని ఏమనాలో అర్థం కాలేదు శ్రీహర్షకి. తండ్రి కాబట్టి అసహ్యించుకోలేకపోతున్నాడు. ఇలాంటి నిస్సహాయుడైన తండ్రి ఏ కొడుక్కి ఉండకూడదనుకుంటున్నాడు. తన తండ్రి లాంటి వాళ్ళు ఇంట్లో కీలకమైన వాటి గురించి క్షణం కూడా ఆలోచించరు.
ఎక్కడికక్కడ తప్పించుకు తిరుగుతుంటారు. అదే కెరీర్ విషయంలో అయితే అలా ఉండరు. ఎంత కష్టం అయినా భరిస్తారు. కన్నతల్లి దగ్గర మాత్రం బాగా బలహీనమైపోతుంటారు. ఆ.. వాళ్ళదేముందిలే ముసలోళ్ళయిపోయారు. వాళ్ళేమైనా మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రారంభిస్తారా పాడా! అనుకుంటారేమో! లేకుంటే! పాతకక్షలట. ఫ్యాక్షనిజమట.. ఇది ఇల్లు కదా! దేశం కాదు కదా! ఎందుకీ రాజకీయాలు? ముసలివాళ్ళపై యుద్ధంచేసి ఏం సాధిస్తారు? కన్నకొడుకు కదా ఏమైనా తెచ్చి పెడతాడని ఆశగా చూస్తుంది. ఒక్కరోజు కూడా ఏమీ తెచ్చి పెట్టడు. ఆమె పెట్టింది తినే కదా ఇంత వాడయ్యాడు. అలాంటి తల్లి కోసం ఏం చేస్తున్నాడు? పెట్టిన చేతిని మరచిపోయి మసులుకుంటున్నాడు.
శ్రీహర్ష ఆలోచనగా ఉండడం చూసి “నేను రేపు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆ ఫ్యాన్ తీసికెళ్ళి దాస్ షాపులో ఇచ్చి వెళ్తానులే! నువ్వు దానికోసం ఇప్పుడు వెళ్ళనవసరం లేదు. వెళ్ళి చదువుకో! టైం వేస్ట్ చేసుకోకు” అన్నాడు శివరామకృష్ణ. అంత వరకు అక్కడేం జరగనట్లు అతి మామూలుగా ఉంది ఆయన స్వరం ఛ ఛ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ? దేన్ని ముఖ్యంగా తీసుకోవాలో దాన్ని వదిలేసి మరీ ఇంత పట్టి పట్టనట్లు ఎలా ఉండగలుగుతారు?
నోట మాట రాలేదు శ్రీహర్షకి.. బాధగా ఉంది. నేనా ఫ్యాన్ని నాన్నమ దగ్గర పెట్టి తీరతాను అని ఖచ్చితంగా అనలేకపోతున్నాడు. తండ్రిని కోప్పడాలో జాలిపడాలో అర్థం కావడం లేదు. అందుకే శ్రీహర్ష మనసంతా అలజడిగా ఉంది. నాన్నమ్మ విషయంలో ఎప్పుడు కూడా ఇలాగే తండ్రికి తనకి వాగ్యుద్ధం జరుగుతూనే ఉంది. తను ఓడిపోతూనే ఉన్నాడు చికాగ్గా అన్పించి విసురుగా బయటకి వెళ్ళాడు శ్రీహర్ష.
నీలిమ అటు ఇటు తిరుగుతూ వంటపని చేస్తోంది.
సంకేత అలాగే కూర్చుని వాళ్ళ మాటలు విన్నది. కాంచనమాల ఎగిరి గంతెయ్యలేకపోతోంది కాని భర్త కొడుకుతో మాట్లాడిన మాటలు ఆమె చెవుల్లో అమృతం పోసినట్లనిపించాయి. ఎప్పటిగాలే ఆప్యాయంగా భర్త దగ్గరకి వెళ్ళి ఆయన పనులు చూడడంలో నిమగ్నమైంది. అదీ శివరామకృష్ణకి కావలసింది. ఈ వయసులో తను తన తల్లి గురించి ఏ మాత్రం ఆలోచించినా తన భార్య తన గురించి ఆలోచించడం మానేస్తుంది. అప్పుడు పిచ్చి చావు చావాల్సి వస్తుంది. శ్రీహర్ష మనసు కొద్దిసేపు నొచ్చుకున్నా ఫరవాలేదు కాని తన భార్య మనసుకి నచ్చని పని చెయ్యనందుకు హాయిగా ఉందనుకున్నాడు.
ఆ రాత్రికి నీలిమ పనంత పూర్తి చేసుకుని పడుకోవడానికి వచ్చినపుడు “వరమ్మకి ఫ్యాన్ పెట్టాడా శ్రీహర్షా?” అని అడిగింది సంకేత. ఫ్యాన్ పెట్టలేదని తెలిసి కూడా సంకేత అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు నీలిమకి..
అర్థం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే శ్రీహర్ష, సంకేత పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. తనకి వాళ్ళంత చదువు లేదు స్థాయి లేదు. వాళ్ళు ఏది మాట్లాడినా విని మౌనంగా ఉండటమే మర్యాదగా ఉంటుంది. అందుకే మాట్లాడలేదు నీలిమ.
నీలిమ దుప్పటి కప్పితే దొరకదని వెంటనే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి “నీలిమా వరమ్మను వీళ్ళెందుకిలా చూస్తున్నారో చెప్పనా! వరమ్మ వల్ల వీళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు ఆదాయం లేదు. అనవసరంగా మానవసంబంధాల పేరుతో ఉన్న డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ రావనుకుంటున్నారు. వీళ్లెంత అపరమేధావులో చూడు! శ్రీహర్ష ఇంకా పెద్ద మేధావి అంది.
సంకేత మాట్లకి ఉలిక్కిపడి అలాగే చూసింది నీలిమ. రెండు సంవత్సరాలుగా చూస్తోంది సంకేతను నీలిమ. ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ఆశ్చర్యపోతోంది.
“చూడు నీలిమా! ఇంట్లో వాళ్ళ మమ్మీ వరమ్మను ఎలా చూడాలో అలాగే చూస్తుందని శ్రీహర్షకు తెలియదా! తెలిసి కూడా ఫ్యాన్ తేవడం ఎందుకు? నా మనవడు మహా మంచివాడు అని వరమ్మ గుండెలు బాదుకోవాలనేగా! ఈ వయసులో ఆమె గుండెలకి అంత బాధ అవసరమా? ఈ మధ్యన మొండి సమస్యలపై వాదిస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నట్లు ఫీలయ్యే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇవాళ ఫ్యాన్ చేసిన పని కూడా అదే! శ్రీహర్షను ఏ అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందో కాని ఆ అమ్మాయి పని అయినట్టే!” అంది సంకేత.
నీలిమ కళ్ళు విప్పార్చి చూస్తోంది.
“అదెలాగో చెప్పనా?” అంది ఆత్రంగా చూస్తూ ముందుకు వంగి సంకేత. సంకేత ఏం చెప్పబోతోందో వినాలన్న ఆసక్తితో ఆత్రంగా చూస్తోంది నీలిమ.
(సశేషం...)
No comments:
Post a Comment