// కొత్తపుస్తకం //
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్, చీరాల.
20.03.2015
"వద్దు నన్నేం చెయ్యొద్దు..అంటు అరుస్తోంది సుభద్ర.. కన్నీరు వరదౌతుండగా, పెట్రోల్ పైన పోసేందుకు దగ్గర కొస్తున్న భర్త ,అత్తలను తప్పించుకునేందుకు గదిలో పిల్లిలా తిరుగుతోంది.. ఏంచెయ్యొద్దంటూ ప్రాధేయపడుతోంది.. మా పేరెంట్స్ ఆల్రెడీ నీకు కట్నం ఇచ్చారు.. .. ఆడపిల్ల పుట్టడం నా తప్పుకాదు.. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు.. నేను మీ భార్యని, అత్తయ్యగారూ మీరైనా చెప్పండి నన్నేం చెయ్యొద్దు.. మీకు అడ్డం అనుకుంటే మా ఇంటికెళ్ళిపోతా.. నన్నేం చెయ్యొద్దు.." భర్త తన పైన పెట్రోల్ పోయడం తో ఒళ్ళు తడిసి.. ఒడలు ఝల్లుమన్నాయ్ సుభద్రకి.. భర్త అగ్గిపుల్ల గీస్తున్నాడు.. అది చూసి ..
.. "నో.".అంటూ గది ప్రతిధ్వనించేలా పెద్దగా.. కేకేసింది.. గుండెదడ..లబ్డబ్..అని తన గుండె చప్పుడు తంకే వినిపిస్తోంది సుభద్రకి.
దబదబా.. తలుపు చప్పుడు...
"అమ్మాయ్.. అమ్మాయ్.. ఏంటే ఆ మొద్దు నిద్ర" లే..లే.. పెళ్ళిచూపులకి పెళ్ళివారు వచ్చే వేళైంది.. మీ నాన్న ప్రొద్దుట్నించీ కాళ్ళుకాలిన పిల్లిలా రోడ్డుమీదే ఉన్నాడు.. నువ్ ఇంకా రెడీ కాలేదని తెగతిట్టి పోస్తున్నారు.. లే.. " అంటూ అమ్మ పిలుపులతో ఈ లోకంలోకి వచ్చింది సుభద్ర.. కెవ్ మంటూ లేచి కూర్చుని తనది కలని అర్ధం చేసుకుంది.. ముఖానికి పట్టిన చెమటను టవల్ తో అద్దుకుంది.
"వస్తున్నానమ్మా!... లేచాను రెడీ అవుతా" అంటూ బెడ్ మీద నుంచి దిగింది.
రెండు రోజుల క్రితం మాట్రిమొని డాట్ .కాం ద్వారా వచ్చిన సంబంధం .., పెళ్ళిచూపులకి సిద్ధంగా ఉండమని వారు కోరడం తో సుభద్ర తల్లిదండ్రులు సంతోషపడ్డారు. పెళ్ళి సంబంధం ఓ.కె అయితే చాలు అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నారు. మరి కొద్ది గంటల్లో సుభద్రకు పెళ్ళిచూపులు జరబోతున్నాయ్.
*******************************
సుభద్ర కూడా అందమైన పిల్ల.. అల్లరికి కూడా కేరాఫ్ అడ్రస్.. స్వేచ్చ ..బాలికా స్వేచ్చ, మహిళా స్వేచ్చ అని వినబడితే గంటలసేపూ క్లాస్ ఇచ్చేస్తుంది.. చుట్టూ జరిగే అన్యాయాలను తనకి అన్వయించుకుని భయపడటం, కలలుగనటం ఆమెకు ఉన్న బలహీనతలు.
చదువంటే ఇష్టం లేకున్నా డిగ్రీ పూర్తి చేశాననిపించింది .. ఎంతో తెలివి ఉన్నా చదువంటే ఆడవాళ్ళకు ఏమాత్రం ఉపయోగముండదని సుభద్ర ఫీలింగ్..ఎంత చదివినా, పెళ్ళైనాక ఇంట్లో వంటింటి కుందేలుగానో, పనిమనిషి లాగానో బ్రతకాల్సిందే కదా అనేది ఆమె అభిమతం. దానికి ఎదురింట్లోని లెక్చరర్ గా పనిచేసి పెళ్ళి తర్వాత ఉద్యోగం మానేసిన పద్మని, ఇంజనీరింగ్ చేసి ఇంట్లో భర్త , అత్త మామల సేవలో తరిస్తున్న వీణని చూసి, ఎంత చదివినా ఇంతే కదా మహిళ జీవితం అని ఫిక్స్ ఐపోయింది.. అడపాదడపా 'వీరి విద్వత్తంతా అడవి గాచిన వెన్నెలే కదా' అని వారిని చూసినప్పుడల్లా బాధపడేది. అందుకే చదువు మీద అంత అనాసక్తి సుభద్రది.,
ఇక పెళ్ళికొడుకు సుందరం... అతని వ్యూస్ వేరు. ఎంత కష్టపడి చదివైనా సరే, పెద్ద ఉద్యోగం సంపాదించాలనేది సుందరం టార్గెట్. ఉన్నతాధికారిగా ఇండియాలో ప్రజాసేవ చేయాలి లేదా ఫారెన్ వెళ్ళి విదేశీయులకు పాఠాలు చెప్పి భారతదేశ గొప్పదనం ఇదీ..! అని అక్కడి వాళ్ళకి బల్లగుద్ది చెప్పాలనేది సుందరం లక్ష్యం..
పిజి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ, ఖాళీగా ఉండటం ఇష్టం లేక 'సుందరం ఫైనాన్స్ కంపెనీ' లో గుమస్తాగా చేరాడు సుందరం .. 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' సూత్రాన్నినమ్మిన వ్యక్తిత్వం అతనిది.. . అదే అతనికి బలం, బలహీనత కూడా..!
లక్ష్యం కోసం సుందరం చేయని కష్టం లేదు. పోటీ పరీక్షలు ఏవైనా సరే, వ్రాస్తూ తన జాతకాన్ని పరీక్షించుకోవడం.. అవి వాయిదాపడటమో.. రద్దవ్వడమో.. జరగటం షరామామూలైంది. కొండకచో ఫలితాలు వచ్చినా సుందరం హాల్ టికెట్ నెంబర్ మాత్రం కనబడేది కాదు.
"వయసైపోతోంది, పెళ్ళిచేసుకోరా నాయనా..! జుట్టు మొత్తం తెల్లబడ్డాక పిల్లనెవ్వరూ ఇవ్వరు" అంటూ తల్లిదండ్రులు పెట్టే పోరు పడలేక పెళ్ళి చూపులకి సరే అన్నాడు సుందరం. అందాల రాశిలా పోతపోసిన సుభద్రను చూసిచూడగానే ఓకే చెప్పేద్దాం అని డిసైడ్ అయ్యాడు. . అమ్మాయి , అబ్బాయ్ లని ఒంటరి గా మాట్లాడుకోమని గదిలో వదిలేశారు పెద్దలు...
మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి అంది సుభద్ర కాస్త ధైర్యంగా..
ఏమీలేవు అన్నాడూ సుందరం. ఇక ఆపుకోలేక ప్రశ్నల వర్షం కురిపించింది సుభద్ర.
"మీరు ఎక్కువగా నవ్వరా??"
'లేదు'
"మీకు తరచూ కోపం వస్తుందా..? "
"వస్తుంది.."
"మీకు కట్నం కావాలా..?"
"కావాలి"
సుందరాన్ని మరింత అల్లరి పెట్టాలని.. " మీ ఇంట్లో వంటమనిషి ఉందనుకోండి.. నేను వచ్చాక ఆమెను తీసేసి నేను వంట చేస్తే నాకెంతిస్తావ్ " అంది సుభద్ర ? బిత్తర పోయిన సుందరం వెంటనే తేరుకుని.. "అప్పుడు నా ఇన్స్యూరెన్స్ ఎమౌంట్ అంతా నీదేగా "అని సెటైర్ వేయడంతో షాక్ తినటం సుభద్ర వంతైంది.. సుందరం మేని చాయ, అతను చెప్పిన నిర్మొహమాటపు సమాధానాలు నచ్చి ఓకె అంది సుభద్ర.. గుండెలో మాత్రం పగటి కల వెంటాడుతూనే ఉంది..
అమ్మాయి, అబ్బాయి ఓకె అని తలఊపుడు చూశారో లేదో తాంబూలు మార్చేసుకున్నారు పెద్దలు.. ఇళ్ళల్లో బాజా మ్రోగింది..
****************************************************
కొన్నాళ్ళ అనంతరం....
పెళ్ళికి ముందు తమాషాగా వ్రాసిన గ్రూప్ 2 పరీక్షలలో సుభద్ర నెంబర్ ఉందని ఆమె స్నేహితురాలు జ్యోతి చెప్పేంత వరకూ తెలీదు.. ఎందుకంటే సుభద్ర ఇష్టం లేకుండా వ్రాసిన పరీక్షలో ఇది ఒకటి .
అయ్యో ఇప్పుడెలా?? భర్త సుందరం ఉద్యోగం చెయ్యడానికి ఒప్పుకుంటారో లేదో తెలీదు. అసలే ఈ మధ్య కాస్త ముభావంగా ఏదో పోగొట్టూకున్నట్లు ఆలోచిస్తూ ఉంటున్నాడు.. ప్రైవేట్ గా ఏదైనా చేస్తానంటే అత్తగారూ ఆ మధ్య సీరియస్ అయ్యారు.. అనుకుంటూ సాయంత్రం సుందరం వచ్చేంతవరకూ ఎదురు చూసింది...
భర్తకు ఎలా చెప్పాలో అర్ధం కాని సుభద్ర , అతను సీరియస్ గా ఉండటం గమనించి, చెప్పే ధైర్యం చాలక చెప్పకుండా వదిలేద్దామని ఫిక్స్ అయ్యింది.. నిద్ర పోకుండా మేల్కొని ఆలోచిస్తూ,... నిద్ర నటిస్తున్న భార్యను గమనించిన సుందరం " ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావ్ ఏంటది?" అని అడిగేశాడు.. తప్పదని తాను గ్రూప్ 2 లో పాస్ అయ్యానని చెప్పింది సుభద్ర.. సుందరం మొఖంలో కవళికలు ఎలా మారుతున్నాయో అని తలెత్తి చూద్దామని ట్రై చేద్దామనుకున్నది. ఆమెకు ధైర్యం చాలలేదు.
ఉద్యోగం చెయ్యాలన్న తన కోరిక తన కాపురంలో ఎంతటి నిప్పులు పోయనుందో అని భయపడింది. తాను వద్దంటే ఏమి చెయ్యాలి? .. అని టెన్షన్ కి లోనైంది సుభద్ర.
చటాలున పైకి లేచిన సుందరం సుభద్రని ఎత్తుకుని గిరగిరా తిప్పి "ఇంతటి మంచి వార్త ఇంత ఆలస్యంగానా చెప్పేదంటూ" కోపగించుకున్నాడు. ఆ కోపంలో ప్రేమే కనబడింది సుభద్రకు..అంతవరకూ బిగుసుకుపోయిన సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకుంది.
"మరి మీ అమ్మగారినెలా ఒప్పిస్తారు.." అంది అమాయకంగా.." అలోచనలో పడ్డ సుందరం " ఆ విషయం నాకొదిలేయ్ నువ్ ఇంటర్వూకి ప్రిపేర్ అవ్వు.." అని ఆమె తల నిమిరాడు.. ఎప్పుడూ సీరియస్ ఫేస్ తో చిటచిటలాడుతూ ఉండే సుందరం ని అలా చూసే సరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది సుభద్ర.
" అదేవిట్రా.. ఎక్కడాలేని వింత చేష్ట.. ఇంటి కోడల్ని కష్టపెట్టడం మన వంశంలోనే లేదూ.." దీర్ఘాలు పోయిన తల్లికి.. " ఇంట్లో చేస్తోంది కూడా జీతం లేని పనిమనిషి ఉద్యోగమే కదమ్మా..!" అని సమాధానమిచ్చాడు సుందరం.
సుందరం తీరు చోద్యంలా తోచింది సుందరం అమ్మ రమణమ్మకు.
"ఇంత కష్టపడి వాడ్ని చదివిస్తే.. ఇలా అంటాడేవిటీ..?" అని నాన్న వెంగళ్రావ్ నోరు నొక్కుకున్నాడు.
అనుకోకుండా ఒకరోజు ...
మిత్రుడు సుధేష్ రోడ్డుమీద కనబడి .. "అడ్వాన్స్ హ్యాపీ బర్థ్ డే బావా?? ఎల్లుండి నీ బర్త్ డే అనుకుంటా??. అని పలకరిస్తూ .. .ముభావంగా ఉన్న సుందరాన్ని చూసి " ఏరా అదోలా ఉన్నావ్?? అని అడిగాడు
"ఏం లేదు "
మరి ఎందుకలా దిగులుగా ఉన్నావ్?
"పేరుగొప్ప కులంలో ఎందుకు పుట్టామా అని?"
"అయ్యో ఏమైంది అంతలా వేదాంతం? నువ్వేదో చాలా రోజులకి కనబడితే, ఎల్లుండి నీ పుట్టిన రోజని విష్ చేస్తే, సంతోషించాలి గానీ ... వీడెందుకు పలకరించాడా? అని అలా ఏడుస్తున్నావ్.. ఆ.. ఏమైంది నీకీవేళ?"
"ఏం లేదురా.. బర్త్ డే అంటే అందరూ సంతోషిస్తారేమో గానీ నా బర్త్ డే ని నేను అసహ్యించుకుంటున్నా..! కారణం చెప్పినా నీకర్ధం కాకపోవచ్చు.. రెండురోజుల్లో వచ్చే పుట్టిన రోజు నా ఆశల సమాధి చేసే రోజు.. ఆరోజు తలుచుకుంటే నే అసహ్యం, భయం వేస్తున్నాయ్ రా... !"అన్నాడు సుందరం.
"అరే ఏమైందంటే చెప్పకుండా ఈ కొత్త సిద్ధాంతాలేవిట్రా?? సుభద్రతో ఏవైనా గొడవలా..?" నిలదీశాడు సుధేష్.
"అదేం కాదురా..! ఎల్లుండి నీవు చెప్పే నా బర్త్ డేకి .. నేను ప్రభుత్వోద్యోగానికి అనర్హుడిని కాబోతున్నాన్రా..! మరి ఏడ్వక సంతోషించాలా?? ఎన్ని ఆశలు.. ఎన్ని ఆశయాలు.. ఎన్నో రాత్రులు..ఎన్ని పగటి కలలు కన్నానో.. తెలీదారా నీకు..?
సుధేష్ నుంచి సమాధానం కొసం చూడకుండా కొనసాగిస్తున్నాడు సుందరం..
" ఏళ్ళకు ఏళ్ళు ఉద్యోగం కోసం వేలకు వేలు వసూలు చేసి , ఇప్పుడు అకస్మాత్తుగా నీకు ఏళ్ళు మించి పోయాయ్ వెళ్ళిపో మిత్రమా అని గెంటేస్తోందీ ప్రభుత్వం.. నాకన్నా తక్కువ మార్కులతో పాసైన మన స్నేహితుల్లో కొందరు ఇప్పటికే సర్కారీల్లో కొలువైయ్యారు .. నేను మాత్రం ఇలాగే... మిగిలిపోయా.. ఏం చెయాలో తెలీదు.. ఎవరెస్టంత లక్ష్యం నీరుకారిపోయింది సుధేష్.. కేవలం నా కులం నన్ను అగాధంలో తోసింది.. మరి ఈ కులవివక్ష పోరాట నాయకులు ఏం చేస్తున్నారో.. నాలాంటి వారిపై అందరికీ వివక్ష ఎందుకో.. ? ప్రపంచం మీదే అసహ్యం వేస్తోంది.. అన్నాడు సుందరం తడిబారుతున్న కళ్ళు బయటకి కనిపించకుండా..
"అదేంటి బావా . .. నీ లక్ష్యం అటకెక్కినట్లేనా.. ? మగవాళ్ళం... కనీసం ఇంట్లో వంట చేయడానికి కూడా పనికి రాం రా..! పురుషలక్షణం అనిచెప్పుకోడానికి ఏదో ఒకటి చేస్తున్నవ్ గా దాంతో తృప్తిపడు అన్నాడు సుధేష్.
జీవం లేని నవ్వు ఒకటి నవ్వి .. అక్కడ నుంచి నిష్క్రమించాడు సుందరం.
అప్పటిదాకా నోరెళ్ళబెట్టుకుని సుందరం సుధీర్ఘ ఉపన్యాసం విన్న సుధేష్ " పాపం ఉద్యోగం కోసం ఎన్ని కలలు కన్నాడో పిచ్చిమారాజు." వీడి భవిష్యత్తు ఏమౌతుందో అని దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు.
సుందరం ఇంటికి వెళ్ళేసరికి...
కమీషనరేట్ నుంచి ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకుంది సుభద్ర.
ఉద్యోగానికి పంపేందుకు సుందరం ఓకే అనేశాడు. కానీ..
"అమ్మాయి ఉద్యోగంలో చేరితే మా పరిస్థితేంట్రా.. మేమా ముసలి వాళ్లం.. నిన్ను చదివించింది నీ అభ్యుదయాలతో మమ్మల్ని వేధిస్తావని కాదు.." దెప్పిపొడిచింది రమణమ్మ.
భర్త , అతని తల్లిదండ్రులతో గొడవ పడతాడేమోనని భయపడ్డ సుభద్ర సుందరాన్ని గదిలోకి తీసుకెళ్ళింది..
"వద్దులేండీ.. నేను ఉద్యోగం చేరను లే..! వాళ్ళ మనసు కష్టపెట్టడం నాకూ ఇష్టం లేదు.." అంది..
"తల ఉండే మాట్లాడుతున్నావా.. తల బిరుసుతో మాట్లాడుతున్నావా??! కోపంతో ఊగి పోయాడు సుందరం.. ఏళ్ళతరబడి కష్టపడ్డా నా నుదట ప్రభుత్వోద్యోగం రాత లేదు.. నీకు ఎదురొచ్చిన అదృష్టాన్ని కాలితో తంతావా..?
లోపల సుందరం సుభద్రలు గొడవపడుతుంటే.. బయట ..
అత్తగారు రమణమ్మ , మామ గారు వెంగళరావులు
సుందరం దంపతులకి వినబడేలా మాట్లాడుకుంటున్నారు.
"ఇదిగో వాళ్ళ పని వాళ్ళని చేసుకోనీయ్.." అన్న వెంగళరావు ఆదేశానికి ...
"ఏంటి చేసుకుండేది.. ఆడపిల్లని వీథిలోకి పంపి, రేపు తలెట్టా ఎత్తుకు తిరగాలి ఆ..!" అంటూ తిరగబడింది రమణమ్మ.
"ఇదిగో నాలో మృగాన్ని తట్టిలేపొద్దు .. చిన్నగా మాట్లాడమని చెప్తుళ్ళా..! పెళ్లాం పై ఆగ్రహించాడు వెంగళరావు.
"ఆ బోడి... లేపండి జంతువుని.. పిల్లిని చూసి ఎవ్వడూ భయపడ్డు తెలీదేమో ..ఆ..!!...దేవుడనే వాడుంటే... వాడి బుద్ధే మారుస్తాడు.." అంది భర్త వెంగళరావు బెదిరింపుకి నిరసనగా.!
"గాడిదగుడ్డు.. ఎక్కడున్నాడే దేవుడు.. పిలువ్ దేవుట్ట దేవుడు.. పిల్లల బాధలు పిల్లల్ని పడనివ్వవే అంటే వినవూ వాళ్ళు వింటే బాధపడతారు.." అన్నాడు వెంగళరావు.
"ఆ.. దేవుడెందుకులేడూ..! ఎన్ని గొడవలొచ్చినా.. ఒకళ్ళ పీక మరొకరు పిసికేయాలన్నంత కోపమొచ్చినా సర్ధుకుని మనం ఇన్నేళ్ళు కాపురం చేశామంటే.. దేవుడున్నట్లే కదా..! కోపంలో కూడా తానెప్పుడో చదివిన జోక్ పేల్చింది అత్త రమణమ్మ.! మామగారి మాట సంతోషాన్ని కలిగిస్తున్నా.. అత్తగారి మాట కటువుగా తగులుతున్నాయ్ సుభద్రకు.
సుధేష్ మాటలు గుర్తొచ్చిన సుందరం.. ఒక నిర్ణయానికి వచ్చిన వాడీలా గబగబా గదిలోంచి బయటికొచ్చి....
"అమ్మా, నాన్న మీరు కాస్త సైలెంట్ గా ఉండండీ .. తన ఉద్యోగ విషయంలో నా నిర్ణయంలో మార్పులేదు.. మన కుటుంబమా అంతంత మాత్రం.. తను ఉద్యోగం చేస్తుంది..సంపాదిస్తుంది.. ఈ వృధాప్యంలో మీకే ఇబ్బందీ కలగదు. నేను ఉద్యోగం మానేసి ఇంటిపని చేద్దామని నిర్ణయించుకున్నా.. అని చెప్పేశాడు.. సుందరం.. బిత్తరపోయారు మిగిలిన ముగ్గురూ.. ఒక్కరికీ నోటమాటరాలేదు..
సుందరం పైప్ తో ఇంటి ముందు నీళ్ళు చల్లటం.. మంచినీళ్ళు పట్టుకురావడం.. బయటకెళ్ళి పాలు తేవడం , పాలు కాచి కాఫీ పెట్టడం.. అందరికీ కాఫీ ఇవ్వడం . బెట్ కాఫీతో భార్యను లేపడం..మధ్యాహ్నాన్నికి వంట చేయడం.. బట్టలు వాషింగ్ మెషీన్ లో వేసి ఆరబెట్టడం, భార్య సుభద్రను ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి , మరలా ఆఫీస్ టైం అయ్యేసరికి ఆఫీస్ దగ్గరకి వెళ్ళి తీసుకురావడం..రాత్రికి వంటచేయడం, అన్నీ చకచకా రమణమ్మ కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదిలాయి..
"నో.. అలా జరగడానికి వీల్లేదు.. ఏవండీ చెప్పరేవిటండీ వాడికీ .. ఆడంగి పనులు చేస్తాట్ట" అంటూ వెంగళరావు జబ్బ మీద ఒకటి చరిచింది రమణమ్మ.
"అమ్మా.. ఏం ఆడోళ్లే ఇంటి పని, వంట పని చెయ్యాలా? అలాగని ఎక్కడైనా ఉందా..? ఏం నేను చేస్తే తప్పేంటీ.. భీముడు చెయ్యలేదా.. ? నలుడు వంట చేయలేదా.. ? ఏం హోటళ్లలో వంట చేస్తున్న వారంతా మగవాళ్ళు కాదా..? ఇళ్ళల్లో బంతికి చేయడానికి వస్తున్న వంట వాళ్ళలో మగవాళ్ళు లేరా? ఇదే నా ఆఖరి, సరియైన నిర్ణయం . ఇక మారదు గాక మారదు.. అని ఖరాకండిగా చెప్పేశాడు సుందరం.
ఆ క్షణంలోనే ఈ మధ్య కొన్న మాలతీ చందూర్ పుస్తకం "వంటలు - పిండివంటలు " తీసుకుని వంటింటి లోకి అడుగులేశాడు సుందరం.
సుందరాన్ని అనుసరించిన సుభద్ర.. అతన్ని వెనుకనుంచి గాడంగా కౌగిలించుకుంది .."ఎందుకండీ మనం ఒక మనిషిని పెట్టుకుందాం.. అమే చేస్తుంది కదా వంట..మీకెందుకీ తంటా" అంది.
"ఇక నోమోర్ డిస్కషన్స్.... ఈరోజునుంచి మనింట..నావంట.. ఇన్స్ స్ట్రక్టెడ్ బై మాలతీ చందూర్..
మరి నాకెంతిస్తావేటి?" అన్నాడు..
" అవునా.. అయితే నా ఇన్స్యూరెన్స్ ఎమౌంట్ అంతా నీదే అన్నమాట" అంది సుభద్ర గలగలా నవ్వులు రువ్వుతూ..!!
ఆమె బంధనాల నుంచి విడిపడి, వెనెక్కు తిరిగి "ఆమాట మాత్రం అనకు" అంటూ ఆమె నోటిని తన నోటితో మూసేశాడు సుందరం..
*******************************************
ఎట్టకేలకు కొత్త కొలువులో అడుగెట్టింది సుభద్ర.. తొలిరోజు ఆఫీస్ కి భయం భయంగా వెళ్ళింది. చుట్టూ మగవాళ్ల తోడేలు చూపుల మధ్య లాక్కురాగలనా అన్నది ఆమె భయానికి కారణం..! కానీ ఆమె అనుకున్నదానికంటే సరదాగా మొదలైంది ఆమె ఉద్యోగ జీవితం. ..
అందరూ ఒకేలా ఉంటారనుకునే, తన అనుమానాల బుద్ధికి తానే చిన్నబుచ్చుకుంది సుభద్ర.
ఆరోజు నుంచి ఆమె జీవిత పుస్తకంలో కొత్త పుటలు ప్రారంభమయ్యాయ్.!!
***********************************************
పెద్దల మాట: : కలిసి ఉంటే మాత్రమే సంసారం కాదు..కష్టాలెదురైనా.. కన్నీరు వరదైనా ఒకరికొకరు తోడై నీడై ఒకటై ఉండటమే సంసారం. అదే సుఖజీవన సారం.
No comments:
Post a Comment