మహిళల పాత్రే కీలకం... - అచ్చంగా తెలుగు

మహిళల పాత్రే కీలకం...

Share This

మహిళల పాత్రే కీలకం...

భావరాజు పద్మిని


ఒక బిడ్డ పుట్టిన క్షణం నుండి ప్రపంచాన్ని అమ్మ కళ్ళతోనే చూస్తుంది...
‘ ఇదిగో, నాన్న చూడమ్మా, ... నాన్న... నాన్న అనమ్మా... ‘ పెదాలు ఆడిస్తూ, అలా పలికేందుకు ప్రయత్నిస్తుంది బిడ్డ.
‘ అదిగో చందమామ... యెంత బాగుందో... చూడు...’ కేరింతలు కొడుతూ, కాళ్ళు ఆడిస్తూ, బోసినవ్వు నవ్వుతుంది పాప.
‘ ఇది నిమ్మకాయ, పులుపు... ‘ అంటూ ఒక రకంగా మొహం పెడుతుంది తల్లి, అదే అనుకరిస్తుంది బిడ్డ.
బిడ్డ కళ్ళు తెరవంగానే చూసేది తల్లినే ! గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లి స్పర్శ, మాట అన్నింటికీ బిడ్డ అలవాటు పడుతుంది. ఇలా మాట్లాడాలి, ఈ పని ఇలా చెయ్యాలి ,  ఇలా చెయ్యకూడదు.. అంటూ... చెబుతుంది అమ్మ. చిన్నప్పటి నుంచి బిడ్డ తల్లి చెప్పిందే నమ్ముతుంది. అమ్మ చెప్పినట్లే చేస్తుంది...  అందుకే బిడ్డలను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్ర కీలకమైనది !
ప్రస్తుత సమాజం ఎంతో పురోగతిని సాధించిందని మురిసిపోతున్నా... అన్యాయాలు, అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం... కొందరి కుటుంబ నేపధ్యంలో బాల్యం నుంచి విలువలు నేర్పకపోవడం ! ‘నేటి బాలలే రేపటి పౌరులు...’ అన్నారు కదా ! అందుకే, ఈ సమాజాన్ని సంస్కరించాలంటే, తొలి అడుగు ప్రతి ఇంటి నుంచి, ఆ ఇంటి దీపమైన ఇల్లాలి నుంచే మొదలవ్వాలి !
ఎంత వయసొచ్చినా , బిడ్డ తల్లి మాటను తప్పక వింటుంది, నమ్ముతుంది. అందుకే, సమాజాన్ని తీర్చిదిద్దడంలో స్త్రీలదే ప్రముఖ పాత్ర ! పెద్దలను, స్త్రీలను గౌరవించడం, దయ, ధర్మం, దానం వంటి విలువలు తల్లే బిడ్డలకు నేర్పాలి. కేవలం ఉత్తి మాటలే కాకుండా ఆచరించి చూపాలి. తల్లి ఎప్పటికప్పుడు తన బిడ్డ నడవడిని గమనిస్తూ సరిచెయ్యాలి. అలా చెయ్యగలిగితే, ఆ దిశగా ప్రతి స్త్రీ అడుగు వెయ్యగలిగితే... ప్రస్తుతం ఉన్న చీకటిని మనం నిందించుకుంటూ కూర్చోనక్కర్లేకుండా, మార్పుకు చిరుదీపాన్ని వెలిగించినట్లే !
ఇక ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక 13 వ సంచిక పలు వన్నెల సీతాకోకచిలుకల వంటి రచనల్ని మీ ముందుకు తీసుకు వచ్చింది. ‘పల్లకి’ లఘు చిత్ర రచయత డొక్కా ఫణి గారి పరిచయం, ఆర్టిస్ట్ రాజు గారితో ముఖాముఖి, రాధామోహన్ గారి శింజారవం ఈ సంచికలో ప్రత్యేకం !
ఈ సంచికలో మూడు కొత్త ధారావాహికలు మొదలు కావడం విశేషం ! మూడూ దేనికదే ప్రత్యేకం ! ముఖ్యంగా యనమండ్ర శ్రీనివాస్ గారి ‘ ప్రేమతో నీ ఋషి’ ...ధారావాహిక ఆద్యంతం అలరిస్తూ మేధో రచన అంటే ఏమిటో నిరూపిస్తుంది. అలాగే సూర్య ‘రుద్రాణి రహస్యం’ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. చల్లని వెన్నెల్లో కొత్త జంట కలబోసుకునే భావనల ‘వెన్నెల యానం’ మీ మనసును మురిపిస్తుంది. ఈ సారి కధల్లో, కొత్త పుస్తకం, స్వయంవరం, నీలి కళ్ళు, వంటి కధలు బంధానికి, భావాలకు ఊపిరి పోస్తే, ఊపిరి కధ ఆలోచింప చేస్తుంది, ఒరేయ్ పైలట్ నవ్వుల్లో తెలుస్తుంది. ఇలా... ప్రతి రచన అద్భుతమే ! చదివి ఆనందించండి, మీ దీవెనలను అభిప్రాయాల రూపంలో అందించండి.
చదువరులకు కృతజ్ఞతాభివందనాలు ! మా అచ్చంగా తెలుగు సంపాదక వర్గం తరఫున శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

No comments:

Post a Comment

Pages