"మంగళ" స్నానం "
- మధురిమ
టైము రాత్రి 10:30 అయ్యింది. ఆఫీసులో అలసి సొలసి ట్రాఫిక్ లో డ్రైవ్ చెయ్యలేక చేసుకుంటూ నీర్సంగా ఇంటి తలుపు తట్టాడు రమేష్. భార్య రాణి తలుపు తీయగానే ఒక్కసారిగా సొఫాలో కూలపడి అబ్బబ్బ... వెధవ ట్రాఫిక్ లో డ్రైవ్ చెయ్య లేక చచ్చాననుకో.. అంటూ నిట్టూర్చాడు.అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి అరగ్లాసుడే మంచినీళ్ళు ఇచ్చిన ఇల్లాలిని అదోలా చూసడు రమేష్. ఆ చూపుకి సమాధానంగా రాణి "మంచినీళ్ల వాడొచ్చీ మూడు రోజులైంది మరి. బిందెడు నీళ్ళతో మూడు రోజులుగా కాలక్షేపం చేస్తున్నా రేపటి వంటకి కాసిన్ని నీళ్ళే ఉన్నైమరి"అంది. చేసేదిలేక ఆ అరగ్లాసుడి నీళ్ళనీ ఆరు గుక్కలో తాగి, సరే రాణి కాస్త స్నానం చేసొస్తానే ఒళ్లంతా నెప్పులుగా ఉందే... కాస్త స్నానం చేస్తే అలసట తీరుతుంది అన్నాడు నీర్సంగా.
అప్పుడు రాణి అయ్యో రామ స్నానానికి నీళ్ళెక్కడివండీ ?? ఈవాళ టేంకర్ రాలేదు, రేపు పొద్దునే వస్తుందన్న ఆశతో ఉన్నా.. అంటూ ఇంకా ఎదో చెప్పబోతోంది ఈలోగా రమేష్ "ఒక్క బకెట్ నీళ్ళు పట్టి పెట్టచ్చుకదే రాణీ చిరాగ్గా ఉందే స్నానం చెయ్యకపోతే చచ్చేలా ఉన్నాను. అసలు చచ్చినా బావుంటుంది ఇంటికొస్తే చాలు వెధవ నీళ్ళ గోల"అంటూ విసుక్కున్నాడు.
మీకేమైనా మతిపోయిoదా ?? మనం హైదరాబాద్ లో ఉన్నాం స్నానానికి బకెట్టుడు నీళ్ళా?? అన్ని నీళ్ళు స్నానానికి కావాలంటే మీ ఊరెళ్ళండి.గోదావరిలో మునిగి నచ్చినంతసేపు స్నానం చెయ్యండి అంది రాణి.ఆ అలాగే నేను గోదావరి లో మునిగి జలకాలాడిన వాడినే హాయిగా ఇంటిముందు నీళ్ళ కాలవ,అందుబాటులో మంచి నీళ్ళు ఆ రోజులేవేరు , మా అమ్మ, నేను ఇంట్లో లేకపోతే కాలవదగ్గరికి వొచ్చి వెత్తుకునేది ..తెలుసా ?అంతా నా ఖర్మ అంటూ తల బాదుకున్నడు రమేష్.
ఇదిగో ఎమండీ.. అలా బాధపడకండీ" శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నాయి "కదా ఇదిగో ఈ ఫ్రెష్ టిష్యూ తీస్కోండి ఇదిపెట్టి మొహం తుడుచుకున్నా కూడా హాయిగా ఉంటుందండీ అంది రాణి. ఛీ ఛీ వెధవ కంపు కాయితం ముక్క నాకు అసహ్యం అవంటే.. వీటితో తుడుచుకు ఛచ్చేకన్నా ఇలానే ఉంటా నాకు స్నానం లేకపోయినా బానే ఉంటుందికానీ ఈ కాయితం ముక్కలంటే వెగటే అన్నాడు రమేష్.
సరెలే ఆకలి దంచేస్తోంది త్వరగా వడ్డించు అన్నాడు రమేష్. రమేష్ కి భోజనంపెడుతూ ఇలా అంది రాణి అయ్యో చెప్పడం మర్చిపోయానండీ ఇందాక మావయ్యగారు ఫొన్ చేసారండీ, మీ చెల్లెల్లి ఫోటో నచ్చిందనీ, జాతకాలు కుదిరాయనీ ఆ కూకట్పల్లి సంబంధం వాళ్ళు ఫోన్ చెసారట. అమ్మాయిని చూస్తాము ఇక్కడికి తీసుకురమ్మన్నారట. మావయ్యగారు ఆదివారం మంచిరోజు పెళ్ళిచూపులు ఏర్పాటు చేద్దాం అన్నారండీ. నేను కూడా ఆదివారమైతే మీకు సెలవని సరే అన్నాను. శనివారనికే అత్తయ్యని ,మావయ్యగారినీ మీ చెల్లెలు శారద ని ఇక్కడికి మన ఇంటికే వచ్చేయమన్నానండీ అంది.
అది విన్న రమేష్ ఎవిటీ శనివారానికే రమ్మన్నావా?? మనకే నీళ్ళు లేక చస్తూఉంటే వళ్లెందుకూ ఇప్పుడు? అన్నాడు కోపంగా.అదేమిటండీ అలాంటారు?? మనంకాక వాళ్ళ మంచీ చెడ్డ చూడడానికి ఇంకెవరు ఉన్నారు? పెళ్ళిచూపులంటే ఎర్పాట్లవీ చూసుకోవద్దూ?? ఇక నీళ్ళంటారా.. ఎదో ఒకటి చేద్దామండీ మనం రోజు గడుపుకోవట్లే?? అంటూ ఇదిగో నాకు నిద్రొస్తోంది. మళ్ళా పొద్దున్నే నీళ్ళొస్తాయి పెంద్రాళే లేచి నీళ్ళు పట్టుకోవాలి త్వరగాతినేసి పడుకోండి అంటూ నిద్రపోయింది.
భోజనం ముగించి సరిగ్గా చెయ్యి కడుక్కోవడానికి కూడా నీళ్ళులేని ఈ దుర్భర జేవితంపై విసుగుతో నిద్దర రాని రమేష్ కాసేపు టీ .వి చూద్దాం అని టి ఇ.వి ఆన్ చెయ్యగానే "గొంతెండి పోతున్న రాష్ట్రం " అంటూ ఒచానెల్ లో నీళ్ళులేని కధ రావడంతో ఇంకో చానెల్ మార్చగానే "బిందెడు నీళ్ళకై బారులు తీరిన జనం "అంటూ ఇంకో చానెల్ లో కూడా ఇదేగోల . టి.వీ లో కూడా ఈగోలేనా అనుకుంటూ కట్టిపదేసాడు. టేబుల్ పై పేపర్ తిరగ్గేద్దామని పేపరు తీయ గానే"ఫలించిన మంగళయానం" అన్న వార్త చూసి చదవడం మొదలు పెట్టాడు. దాని సారాంశం ఎమిటంటే.. మార్స్ పై భూమిపైలాగానే మంచినీటి నదులున్నాయని... ఎప్పటికైనా అతితక్కువ ఖర్చుతో భూమిపైకి నీళ్ళు తెచ్చుకునేలా ప్రయత్నాలు త్వరలో మొదలపెట్టాలని ఇస్రో శాస్త్రవేట్టలు ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అందులోఉంది.
ఈవార్త చదువుతూ రమేష్ నిద్రలోకి జారుకున్నాడు.
సీన్ "పెళ్ళి చూపులు"
అబ్బాయి,అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి ఇంకేముంది "శుభస్య శీఘ్రం" అయ్యా, పరంధామయ్యగారూ ఆ నీళ్ళ విషయ్యాలేవో మీరు మీరు కాస్త మాట్లాడేసుకుంటే నేను ముహుర్తం ఖాయం చేసేస్తా మరి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య.
ఇంతలో పెళ్లికొడుకు తల్లి మాట్లాడుకోవడానికి ఎముంది పెరయ్యగారు?? మా పెళ్ళిళ్ళప్పుడు కట్న కానుకలు మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు మరి??అబ్బాయికి మంగళ స్నానానికి ఎన్ని బిందెలు నీళ్ళిస్తారు? ఎంతమంది మొగపెళ్ళివారికి స్నానానికి నీళ్ళివ్వగలరు ?? ఇవేగా మేము అడిగేవి అంది వెటకారంగా..
ఇంతలో పెళ్ళికొడుకు తండ్రి ఇదిగో బావగారూ మాకు కాస్త బంధువులెక్కువ.. నావాళ్ళు ,మా ఆవిడవైపు వాళ్ళూ కలిపి మొత్తం వందమందనుకోండి, కాబట్టి మీరు పెళ్ళికి మాకు కనీసం ఒక్కపూటైనా వచ్చిన పెళ్ళివారందరికీ స్నానానికి,తాగడానికి, తిన్నాక చెయ్యి కడుక్కొవటానికీ నీళ్ళివ్వలిమరి అన్నాడు ఖచ్చితంగా. నాకు ఆడపొడుచు లాంచనంగా కాస్త తలంటు కోవడానికి నీళ్ళిప్పించాలి మావయ్యగారూ అంది ఆడపడుచు లేనివయ్యారాలుపోతూ...
ఇదిగో అన్నయ్యగారూ మా అబ్బయ్ కూకట్పల్లి సెంటర్లో పెద్ద ఫ్లాట్ కొన్నాడు. కనుక మా అబ్బాయికి మీరు కట్నకానుకలేవీ ఇవ్వకర్లేదుకానీ పెళ్ళయాక కొత్తల్లుడికి కాస్త ఓ మూడు నెలలు మంచి టేంకర్ వాడితో నీళ్ళు సప్లై చెయించగలిగితే చాలు అన్నాడు పెళ్ళి కొడుకు తండ్రి. నీళ్ళ విషయంలో తప్ప మాకు ఇంకేపెట్టు పోతల్లో ఏ పట్టింపులూ లేవు.పెళ్ళిమీకు ఎలాకావంటే అలాచేసుకోవచ్చు అన్నారు...పరంధామయ్య ,పార్వతమ్మ వారి మాటలకు ఒకరిమొహాలు ఒకరు అయోమయంగా చూస్కుంటున్నరు.
అబ్బాయ్ ఏమీ మాట్లాడట్లేదు అబ్బాయ్ కూడా తనకి ఏమైనా కావలంటే అడగమనండి పేరయ్యగారూ అంది రాణి. అబ్బాయ్ ఎంతో మొహమాటంగా నాకేవి వద్దండీ మీ అమ్మాయి చాలా నచ్చింది తనని ఇచ్చి పెళ్ళి చెయ్యండి చాలు అనగానే రమేష్,రాణి ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు చూస్కున్నారు,కానీ ఇంతలోనే అబ్బాయి కానీ అనేసేరికి కాస్త అనుమానంగా అందరూ అబ్బాయి వైపు చూసారు ఏం చెప్తాడాని? అబ్బాయి కాస్త గొంతు సవరించుకుని నాకేమీ అఖర్లేదండీ కాస్త పెళ్ళిరోజు మంగళ స్నానానికి ఓ నాలుగు బిందెల నీళ్ళిప్పించండి చాలు..పెళ్ళినాడైనా కాస్త తనివితీరా స్నానం చేస్తా అన్నాడు నెమ్మదిగా..
ఇంతలో రాణి "అత్తయ్యా మావయ్యా ఇదిగొ యావండీ మీరు కూడా ఓసారి ఇలావస్తారూ "అంది.
సీన్ "అందరూ చర్చించుకుంటున్నారు"
పిల్లాడు చంద్రుడిలా ఉన్నాడు పైగా మీచెల్లెలు బాగా నచ్చింది కూడా, మీ చెల్లెల్లికి కూడా నచ్చాడు ,ఒక్కడే కుర్రాడు,మంచి ఉద్యోగం, ఒక్కడే కొడుకు, సొంత ఇల్లు కూడా ఉందంటున్నారు ఇంకేంకావాలి చెప్పండీ?అంది రాణి.ఈ సంబంధం చెసుకుంటే మన పిల్ల అదృష్టవంతురాలవుతుండండీ అంది పార్వతమ్మ .
కానీ 100మంది పెళ్ళివారికి అన్ని నీళ్ళంటే కాస్త కష్టం అనిపిస్తోందమ్మా అన్నాడు. రమేష్... పరంధామయ్య కూడా తన అభిప్రాయం అదే అన్నట్లుగా తలూపాడు.
కోడలు మంచి మాటందండీ వాళ్ళేమైనా కట్నాలడిగారా కానుకలడిగారా? ఎలాగోలాగ తలతాకట్టు పెట్టైనా సరే పిల్లకి ఆ మూడు ముళ్ళూ వేయించేస్తే ఇక మన భాద్యతకూడా తీరుతుంది కదండీ అంది పార్వతమ్మ.ఇంతలో రాణి ఇంకేమీ అలోచించకండి మావయ్యా సరే అనండి అంది. రమేష్ కూడా "పోనీలే నాన్నా కాస్త్ ఖర్చయినా ఫరవాలేదు లోన్ పెట్టయినా వాళ్ళడిగినన్ని నీళ్ళిచ్చి చెల్లాయి పెళ్ళి నేను చేస్తా అన్నాడు.మంగళ గ్రహం నుంచీ ఇంకోమూడు నెలల్లో నీళ్ళొస్తాయిట మనం కాస్త ముందుగా బుక్ చెసుకుంటే దొరుకుతాయి. ఆ నీళ్ళ పంపిణీ ఆఫీసరు రవి నా క్లాస్మేట్ రవే నాన్నా అన్నాడు.ఈ సంబంధం ఖాయం చేసుంటున్నమని వాళ్ళతో చెప్పండి నాన్నా అన్నాడు.
అందరూ ఆ గంగమ్మ తల్లిపై భారంవేసి సరే అన్నారు. పేరయ్య " శుభం " పలికి ముహుర్తం ఖాయంచేసాడు.పెళ్ళికింకా మూడు నెలలు సమయం ఉంది
మగ పెళ్ళివారితో మాటలై వారిని సాగనంపుతూ ఉంటే గుమ్మం దగ్గర ఎదురింటి కామాక్షమ్మ పార్వతమ్మని పలకరించి ఎప్పుడొచ్చావు ఒదినా? అంది ఆప్యాయంగా.ఇవాళ పొద్దున్నే.. పిల్ల చూపులని వచ్చాం వదినా అంది పార్వతమ్మ.సంబంధం ఖాయం చేసుకున్నాం అనుకో ... కానీ ఇక అంతా ఆ గంగమ్మతల్లి దయ అంది.ఎంతమంది మొగపెళ్ళివారికి నీళ్ళివాలొదినా అని అడిగింది కామాక్షమ్మ?? 100మందికనుకో... ఇవికాక అబ్బాయికి నాలుగు బిందెల నీళ్ళు మంగళస్నానానికి అంది.ఇంకా కుర్రాడికి సొంత ఇల్లు ఉందిట దానికి మూడు నెలలు నీళ్ళింమన్నారు మరి.వాళ్ళు అడిగినవి మాతాహతకి ఎక్కువే అనుకో కానీ కుర్రాడు బావున్నాడు ,మంచి ఉద్యోగం,ముందూ వెనక భాద్యతలు లేవు అందుకని మా కొడుకూ, కోడలూ సరే అన్నారు కానీ నాకూ, మీ అన్నయ్యకి మనసులో భయం గానే ఉందనుకో అంది పార్వతమ్మ.
మనకి నీటి ఎద్దడి ఉన్నా అదేదో గ్రహం మీద నీళ్ళు ఉన్నాయిటగా?ఆనీళ్ళొచ్చేటైముకి బుక్ చెద్దామన్న ధైర్యంతో సంబంధం ఒప్పేసుకున్నాం అంటూ ఇంతకీ మీ సరస్వతిని పురిటికి తీస్కొచ్చారా? ఎన్నోనెల దానికీ అంది పార్వతమ్మ. దానిప్పుడు ఎడోనెల వదినా కానీ తొమ్మిదో నెల వచ్చేవరకూ పురిటికి తీస్కురాము అసలే ఈహైదరాబాదులో నీళ్ళు లేవు.దానిపాట్లేవో అక్కడ దాని ఇంట్లో అదే పడుతోంది.మా సతీష్ ని కూడా ఆ గ్రహం మీద నీళ్ళేవో బుక్ చెయ్యమని చెప్తా. అంది కామాక్షమ్మ... చెప్పొదినా చెప్పు. ఇప్పుడు చెసుకుంటే రేపు పిల్ల పురిటికొచ్చినప్పుడు పనికొస్తాయి. కనీసం పురిటిసుద్ధినాడైనా పిల్లకి ఆ చంటివాళ్ళకి స్నానానికి నీళ్ళు కావాలిగా వదినా అంది పార్వతమ్మ..
రమేష్ చెల్లేలి పనులు నెమ్మది నెమ్మదిగా ఒక్కొకటీ నడుస్తున్నయి.కానీ అందరికీ నీళ్ళ సంగతి తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గుబులుగానే ఉంది.శుభలేఖలు పంచడం కూడా మొదలయింది. పెళ్ళిపిలుపులు ఈవిధంగా ఉన్నాయి.ముందుగా కామాక్షమ్మ ఇంటికి వెళ్ళారు."ఇదిగో వదినా పెద్దముత్తైదువని నీతో మొదలెడుతున్నాం మరి" పెళ్ళికి నువ్వు,అన్నయ్యా మీ అబ్బయి సతీషు అందరూ తప్పకుండా రావాలి.కానీ ఏమీ అనుకోకుండా ఎవరిచెంబులో వారు తాగడానికి నీళ్ళు ఓ సీసాలో చెయ్యి కడుక్కోవటానికి నీళ్ళు తెచ్చుకోవాలి మరి.ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు మగపెళ్ళి వారి కోరికలు చెప్పాగా వాళ్ళే వందమదాయే అందుకే మనవైపు మరీ ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుస్తున్నామనుకో.. అయినా వదినా అందరినీ పిలిచేస్తే సరేనా మర్యాదకైనా ఓగ్లాసుడునీళ్ళివ్వడం ఎంత కష్టం ఈరోజుల్లో అంది పార్వతమ్మ.
ఏంచేస్తాం వదినా కలికాలం అంటే ఇదేమరి...అందుకే బ్రహ్మం గారు ఆరోజుల్లోనే నీళ్ళు నిప్పులు పుట్టని రోజులొస్తాయన్నారు ఇవేనేమో మరి, తులం బంగారం కొనడం సులువేనేమో కానీ బిందెడు నీళ్ళు కొనలేని రోజులోచ్చాయి మరి అని నిట్టూర్చి... సరేలే వదినా నీళ్ళు తెచ్చుకునే పెళ్ళికి వస్తాం కానీ ఇంకా పిలుపులకెళ్ళాలిగా వెళ్ళిరండి మరి అంటూ పంపింది కామాక్షమ్మ.
ఇలా పనులూ పిలుపులూ విడ్డూరంగా జరుగుతూ ఉండగా ఓరోజు రమేష్ ఫ్రెండ్ రవి ఫోన్ చెసి "ఒరేయ్ రమేష్ రేపట్నుంచే మార్స్ వాటర్ డిష్ట్రిబ్యూషన్ జరుగుతుందిరా నువ్వు రేపు ఒక్కసారి మా ఆఫీసుకొచ్చి నన్ను కలవరా నేను నీకు ఒక స్లిప్ ఇస్తా అది భద్రం గా పెట్టుకో పెళ్ళప్పుడు నీకు ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు నువ్వు నీకు ఎలాట్ చేసిన వాటర్ తీస్కెళ్ళచ్చురా.. అ న్నాడు" చాలా సంతోషంరా రవి నీ పుణ్యమా అని మా నా చెల్లెలి పెళ్ళి జరుగుతోంది. నీ మేలు ఈజన్మకే కాదురా ఎన్ని జన్మలెత్తినా మరువలేనురా అన్నాడు రమేష్ ఎంతో సంతోషంగా.. ఊరుకో రా ఫూల్ శారద నాకూ చెల్లేరా "డోంట్ బి సో ఎమోషనల్" నాకు చాల పని ఉందిరా మరి ఉంటా అని ఫోన్ పెట్టేశాడు.
రమేష్ కి చెల్లేలి పెళ్ళి అయ్యిపోయిందన్నంత ఆనందంగా ఉంది. నాన్నా.. నాన్నా.. ఆ గంగమ్మతల్లి మనలిని కరుణించింది నాన్నా.. ఇప్పుడే రవి ఫోన్ చేసాడు మనకి సమయా నికి నీళ్ళు ముట్టాయి నాన్నా ఇక నిస్చింతగా చెల్లెలి పెళ్ళి చేసెద్దాం అన్నాడు.. అందరూ ఎంతో సంతోషించారు.రమేష్ మర్నా డే s రవి ఆఫీసుకి వెళ్ళి కలిసాడు.అక్కడ పెద్ద తిరణాళ్ళలాగా ఉంది రవి కనుక తనకి తెలియకపోతే లోపలకి వెళ్ళగలిగేవాడే కాదు ఎలాగో వెళ్ళి రవి ని కలిసి స్లిప్ తీసుకోగలిగాడు.
పెళ్ళికి ముందురోజు కావలిసిన నీళ్ళని తెచ్చుకోవడంకోసం వాటర్ ఆఫీసుకి వెళ్ళాడు.అక్కడ మునుపు కంటే పరిస్థితి చాల ఘోరంగా ఉంది. ఇసకేస్తే రాలనంత జనం ఎంత కష్టపడినా కనీసం లోపలకి కూడా వెళ్ళలేక పోయాడు.రవి కి ఫోన్ చేస్తే కూడా నో రిప్లై వస్తోంది. ఇంతలో జనం మధ్య తొక్కిసలాట జరిగి ఒకడు రమేష్ పై పడ్డాడు. ఆ పడడంలో రమేష్ చేతిలో స్లిప్ కిందపడి కనబడకుండా పోయింది. రమేష్ కంగారుగా నాస్లిప్, అయ్యో నా చెల్లెలి జీవితం ఉండండయ్యా.. నా ఛెల్లెలి జీవితం అంటూ గట్టి గట్టి గా అరుస్తూ సోఫాలోంచి కిందకి దబ్బని పడ్డాడు. ఈలోగా రాణి వచ్చి ఏమిటండీ రాత్రి ఈ సోఫాలోనే నిద్రపోయారా? మీకసలే దొర్లడం అలవాటు ఎలపడి పోయారో చూడండీ అంది నవ్వుతూ ...
హా... ఇదంతా కలా అనుకుని రాణివైపు చూసాడు. లేవండీ టాంకర్ వచ్చింది త్వరగా రెడీ అవ్వాలి ..లేండీ అంది.రమేష్ కి ఇంకా తను కలకన్ననా లేక నిజమా అర్థం కావట్లేదు. ఇదిగో తొందరగా లేకపోతే మళ్ళీ స్నానానికి నీళ్ళుండవు జాగ్రత్త అంటూ వంటింటిలోనుంచి రాణి అరుపువినగానే కల కాదని తేరుకుని తన పక్కనే కిందపడి ఉన్న పేపరులో ఉన్న "ఫలించిన మంగళయానం" చూసి నవ్వుకున్నాడు.ఏమో అలాంటి రోజులు కూడా త్వరలో వస్తాయేమో అనుకున్నాడు.బంగారం కొనగలమేమో కానీ బిందెడు నీళ్ళు కొనలేమేమో అనుకున్నాడు. ఈలోగా రాణి యావండోయ్ ....ధార సన్నబడుతోంది త్వరగా వెళ్ళండి అనగానే "అమ్మో"అనుకుంటూ బాత్ రూం వైపు పరుగు తీసాడు.
No comments:
Post a Comment