శ్రీమన్మథనామ సంవత్సర పంచాగం - అచ్చంగా తెలుగు

శ్రీమన్మథనామ సంవత్సర పంచాగం

Share This

శ్రీమన్మథనామ సంవత్సర  పంచాగం (అంతర్జాల సేకరణ )


మన్మథ  అంటే  -ఉత్తేజం, ఆనందం, వైభోగం,సుఖం అనే అర్థాలు ఉన్నాయి. మన్మథ అనే పేరు కలిగిన సంవత్సరం గనుక మంచి జరగాలని కోరుకునే ప్రతీఒక్కరికీ, ఈ మన్మథనామసంవత్సరం సుఖసంతోషాలు కలిగించాలని భగవంతుడ్ని ప్రార్ధిద్దాం . అందుకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి. అందుకే మన్మథనామ సంవత్సరంలో ప్రతిరోజూ శుభం, లాభం, జయం, కలగాలని తొలిపూజలందుకునే సిద్ధిబుద్ధిసమేత గణనాధుడిని , ఆదిశక్తి జగజ్జననిని ,ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను, లోకకల్యాణకారకులైన లక్ష్మీనారాయణులను, సృష్టికారకులైన బ్రహ్మసరస్వతులను, కలియగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుణ్ణి, భూదేవీపతి వరాహస్వామిని, భక్తవరదుడు శ్రీలక్ష్మీనృసింహుడిని, లోకప్రభువు శ్రీరామచంద్రుడ్ని, పశుపాలకుడైన శ్రీకృష్ణపరమాత్ముడ్ని, అభయాన్ని అనుగ్రహించే హనుమంతుడిని, దోషాలను హరించే శ్రీవల్లిదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామిని, సకలదేవతలకు ,అష్టదిక్పాలకులను, నవగ్రహాధిపతులను, నదీమతల్లులను, దివ్యరుషులును, మీ ఇంటి ఇలవేల్పులను మనసారా ప్రార్ధిద్దాం !
ఈ మన్మథనామ సంవత్సరంలో ఆచరించే జప తప వ్రత దానధర్మాదికార్యాలు మహాఫలాన్నిఇస్తాయి. భక్తులందరికీ సుఖసంతోషాలను అందించే సంవత్సరం  ఇది. ఈ సంవత్సర అధిపతులు  త్రిమూర్తులు - అంటే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు.
  మన్మధాబ్దే తథాలోకాస్సత్కేళీ రసలోలుపాః శాలీక్షు యవగోధూమైః నయనానంద ధరా ||  
సంతోషాలకు, విలసాలకు ప్రతీకగా నిలిచే ఈ మన్మథనామ సంవత్సరంలో అందరూ ఆనందాన్ని కోరుకుంటారు. ఫలపుష్పాలు, సుగంధద్రవ్యాలు, ధాన్యాలతో, ప్రకృతి నయనానందకరంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా, ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.
 ఈ సంవత్సరంలో నవనాయక ఫలితాలు
మనకున్న సంవత్సరాల్లో ప్రతిసంవత్సరానికీ నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరిస్తారు. గ్రహసంచా రస్థితిని అనుసరించి, రాజు, మంత్రి, ఇత్యాదిస్థానాలు మారుతుంటాయి. మన్మథనామ సంవత్సరంలో శనైశ్చరుడు రాజయ్యాడు. వివిధశాఖలకు నాయకత్వం వహించిన నవగ్రహాధిపతులు అనుగ్రహించే ఫలితాలు ఇవి. మొత్తం చూస్తే ప్రజలకు అన్నదాతలకు, మిశ్రమఫలితాలు ఉంటాయి.
రాజు:  శనైశ్చరుడు
నవగ్రహాల్లో మందగమనుడైన శనైశ్చరుడు రాజుగా ఉన్నందున వర్షాలు స్వల్పంగానే కురుస్తాయి. పంటలు మధ్యమంగా పండుతాయి. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆహారధాన్యాల విషయంలో స్థిరత్వం ఉంటుంది. చిన్నపాటి రాజకీయ సంక్షోభాలు, అశాంతి ఉండవచ్చు.
2.మంత్రి:  కుజుడు
మంగళాధిపతి కుజుడికి అమాత్య పదవి లభించినందున అగ్నిప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువ. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. సాంఘికపరమైన కలహాలు జరిగే అవకాశం. కానీ ప్రభుత్వాల నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
3.సేనాధిపతి:  చంద్రుడు
సేనాధిపతి బాధ్యతలు చంద్రుడికి రావడంతో.. ప్రజలకు ఆరోగ్యపరమైన సంతోషం లభిస్తుంది. అనారోగ్యం దరిచేరదు. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
4.సస్యాధిపతి:  శుక్రుడు
శుక్రుడికి పంటలపై ఆధిపత్యం రావడం చేత తెల్లటి ధాన్యం, పత్రి వంటి పంటలు బాగా పండుతాయి. తెల్లటి భూములు మంచి దిగుబడినిస్తాయి. వ్యాపారపరమైన అభివృద్ధి కూడా ఉంటుంది.
5.ధాన్యాధిపతి:  బుధుడు
పచ్చరంగు ధాన్యాలకు లాభకరం. బఠాణి, పెసలు, ఏలక్కాయలు, ఉసిరి, మామిడి, ద్రాక్షవంటి పంటలు లబ్ధినిస్తాయి. నలుపు నేలల్లో దిగుబడులు అధికం. వర్షాలు మధ్యమంగానే ఉంటాయి. వ్యాపారపారిశ్రామిక రంగాల్లో అనుకూలత ఉండే అవకాశం ఉంది
6.అర్ఘాధిపతి:  చంద్రుడు
ధాన్యం, పాలు, పాలఉత్పత్తులు, వెండి ధరలు పెరుగుతాయి. వ్యాపారుల వల్ల ధరలు అధికమవుతాయి. వర్షాలు బాగానే కురుస్తాయి. కానీ ఆరుమాసాల తర్వాత ప్రకృతి వైపరిత్యాలు జరిగే అవకాశం ఉంది.
7.మేఘాధిపతి:  చంద్రుడు
మేఘాధిపతి కూడా చంద్రుడే అయినందున వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే.. ప్రకృతి వైపరిత్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు అనుకున్న సమయంకంటే కొంచెం ఆలస్యంగా వస్తాయి. ధరలు పెరుగుతాయి
8.రసాధిపతి:  సూర్యుడు
నూనె ధరలు అందుబాటులోనే ఉంటాయి. నెయ్యి, బెల్లం, ఉప్పు వంటివాటికి గిరాకీ పెరుగుతుంది. గోధుమపంటకు అనుకూలకాలం. విదేశీ వాణిజ్యానికి ఈ ఏడాది అనుకూలం
9.నీరసాధిపతి:  శుక్రుడు
కర్పూరం, గంధం, అగరు వంటి సుగంధద్రవ్యాల ధరలు పెరుగును. స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. కళాకారులకు మంచి సమయం. అన్నిరంగాల్లోనివారికి శుభాలు కలుగుతాయి.
శ్రీమన్మథనామ సంవత్సంలో గ్రహణాలు
 మన్మథనామ సంవత్సరంలో మొత్తంగా ఐదు గ్రహణాలు ఏర్పడతాయి. కానీ ఒక చంద్రగ్రహణం... ఒక సూర్యగ్రహణం మాత్రమే మనదేశంలో కనిపిస్తాయి.
2015, ఏప్రిల్్ 4 - సంపూర్ణ చంద్రగ్రహణం - మనదేశంలో కనిపిస్తుంది
2015 సెప్టెంబరు 13 - పాక్షిక సూర్యగ్రహణం - మనదేశంలో కనిపించదు
2015 సెప్టెంబరు 28 - సంపూర్ణ చంద్రగ్రహణం - మనదేశంలో కనిపించదు
2016 మార్చి 9 - సంపూర్ణ సూర్యగ్రహణం - మనదేశంలో కనిపిస్తుంది
2016 మార్చి 23 - ప్రచ్ఛాయ చంద్రగ్రహణం - మనదేశంలో కనిపించదు
శ్రీమన్మథనామ సంవత్సరంలో ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నప్పటికీ.. మనదేశంలో రెండు గ్రహణాలు మాత్రమే కనిపిస్తాయి. ఛైత్రపూర్ణిమకు సంభవించే చంద్రగ్రహణాన్ని.. మాఘఅమావాస్యనాడు ఏర్పడే సూర్యగ్రహణాన్ని మాత్రమే గ్రహణాలుగా పరిగణించాలి. కనిపించని గ్రహణాలు పాటించాల్సిన అవసరం లేదు. మిగతా గ్రహణాలు కనిపించకపోయినా ఆయారోజుల్లో శివాలయ సందర్శనం, అభిషేకం, నవగ్రహ ప్రదక్షిణం సత్ఫలితాలను ఇస్తుంది.
ఏప్రిల్్ 4, 2015, శనివారం -  చైత్రపూర్ణిమనాడు సంపూర్ణ చంద్రగ్రహణం
గ్రహణ స్పర్శకాలం (ప్రారంభ సమయం):  మధ్యాహ్నం 3.46 గంటలకు
గ్రహణ మోక్షకాలం (ముగింపు సమయం):  రాత్రి 7.15 గంటలకు
మార్చి 9, 2016 బుధవారం - మాఘఅమావాస్యనాడు సంపూర్ణ సూర్యగ్రహణం
గ్రహణ స్పర్శకాలం (ప్రారంభసమయం):  ఉదయం 5.46 గంటలకు
గ్రహణ మోక్షకాలం (ముగింపు సమయం):  ఉదయం 9.08 గంటలకు
గ్రహణ సమయంలో దేవతాస్తోత్రాల పారాయణ చెప్పదగిన విశేష సూచన. గ్రహణకాలం పూర్తయిన తర్వాత ప్రతిఒక్కరూ విధిగా గ్రహణ విడుపు స్నానం ఆచరించాలి. గ్రహణస్నానం తర్వాతే ఆహారాన్ని స్వీకరించాలి. ద్వాదశరాశుల శుభాశుభాలతో నిమిత్తం లేకుండా గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. విడుపు స్నానం తర్వాత.. ఆలయ దర్శనం లేదా ఇష్టదైవారాధన శుభఫలితాలను ఇస్తుంది. గర్భిణులు, చిన్నారులు మన సంప్రదాయాలను అనుసరించి వీక్షించకుండా ఉండటం సర్వదా శ్రేయస్కరం
శ్రీమన్మథనామ సంవత్సరంలో మకరసంక్రాంతి -  (జనవరి 15, 2016)
శ్రీమన్మథనామ సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి 15నే వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి 14న అర్ధరాత్రి 1 గంట 26 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అందుకే.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సమయంలో సూర్యుడు లేనందున మరుసటిరోజు - అంటే జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకోవాలని పంచాంగం చెబుతోంది. ప్రతి మకరసంక్రాంతికీ శుభాశుభాలను తెలియజేసే విధంగా పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్ముడినే సంక్రాంతి పురుషుడు అంటాం. మన్మథనామ సంవత్సరంలో మకర సంక్రాంతికి సాక్షాత్కరించే సంక్రాంతి పురుషుడి పేరు మిశ్రుడు. త్రిముఖుడై.. అష్టభుజాలతో.. సూకరవాహనుడై దర్శనమిచ్చే మిశ్రుడు.. పేరుకు తగినవిధంగానే మిశ్రమ ఫలితాలను అనుగ్రహిస్తాడు. ప్రజలకు ఆరోగ్యం,సౌఖ్యం, ధనలాభం కలుగుతాయి. యుద్ధభయం, ధాన్యపుపంటల దిగుబడి తగ్గటం, లోహపు వస్తువుల ధరలు పెరగడం జరుగుతాయి. మకరసంక్రాంతినాడు శుభఫలితాలు పొందేందుకు.. శక్త్యానుసారం దానాలు చేయడం మంచిది. ఫలాలు, వస్త్రాలు, ధాన్యం, నువ్వులు, గుమ్మడికాయ వంటివి దానం చేయడం శుభప్రదం. శివదర్శనం చేసుకుంటే మంచిది.
 మూఢాలు - కర్తరులు (సుముహూర్తాలు లేని సమయం)
మనం చేసే ప్రతికార్యానికీ అది మంచిరోజు అవునో కాదో చూసుకుంటాం. కొన్ని సందర్భాల్లో తిధి, వార, నక్షత్రాలు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పంచాంగం  చెబుతోంది. శ్రీమన్మథనామసంవత్సరంలో సుముహూర్తం లేనటువంటి కర్తరి, మూఢమి రోజులు ఇవి.
కర్తరి అంటే..
భరణి నక్షత్రం 3, 4 పాదాలలో, కృత్తిక నక్షత్రం నాలుగు పాదాలలోను, రోహిణి నక్షత్రం మొదటి పాదంలో గనుక సూర్యుడు సంచరిస్తున్నట్టైతే ఆ కాలాన్ని కర్తరి అంటారు. ఈ సమయంలో ఇల్లు కట్టడం, బోరుబావి ప్రారంభించడం, తవ్వడం, రాతి, చెక్క, మట్టి వీటిని ఉపయోగించి పనులు ప్రారంభించడం చేయరాదు. నిర్మాణదశలో ఉన్న ఇంటికి కర్తరి వర్తించదు. సామాన్యంగా ఈ కాలం ఆంగ్ల కేలండరు ప్రకారం ఏప్రిల్్, మే నెలల్లో వస్తుంది.
మూఢమి అంటే..
ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యు఼డికి సమీపంగా వస్తే శక్తిహీనమవుతుంది. ఇది అన్ని గ్రహాలకూ ఉంటుంది. కానీ జ్యోతిషశాస్త్రం మాత్రం గురు,శుక్ర,చంద్ర గ్రహాల శక్తిహీనతను మాత్రమే దోషంగా పరిగణిస్తుంది. చంద్రుడి శక్తిహీనతే ప్రతిమాసంలోనూ వచ్చే అమావాస్య. గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమిగానూ.. శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగానూ పరిగణిస్తారు. దీన్నే వ్యావహారిక భాషలో మూఢం అంటారు. మౌఢ్యమి శుభకార్యాలకు అనువు కాదు. శ్రీమన్మథనామ సంవత్సరంలో సింహస్థగురుదోషకాలం నడుస్తున్న సమయంలోనే గురు,శుక్ర మౌఢ్యాలు వచ్చాయి. కాబట్టే.. ఆ సమయంలో శుభకార్యాల ప్రస్తావనే ఉండదు.
కర్తరీ నిర్ణయం (మే 4, 2015 నుంచి మే 29, 2015వరకు)
దీన్నే వాస్తకర్తరి అని కూడా అంటారు. శ్రీమన్మథనామ సంవత్సరంలో మే 4 నుంచి మే 29వరకు అంటే వైశాఖ బహుళ పాడ్యమి నుంచి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశివరకు నూతన గృహప్రవేశాలు, భూమిపూజలు, శంఖుస్థాపనలు, షెడ్ల నిర్మాణాలు, వాస్తుపరమైన మార్పుచేర్పులు నిషిద్ధం.
గురుమౌఢ్యమి (ఆగస్టు 12, 2015 నుంచి సెప్టెంబరు 10, 2015వరకు)
గ్రహాల స్థితిగతులరీత్యా శ్రీమన్మథనామ సంవత్సరంలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10వరకు అంటే.. నిజఆషాఢమాసం బహుళత్రయోదశి నుంచి శ్రావణమాసం బహుళత్రయోదశివరకు గురుమౌఢ్యమిగా పరిగణించాలి. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు.
 శుక్రమౌఢ్యమి (ఆగస్టు 10, 2015 నుంచి ఆగస్టు 20, 2015వరకు)
గ్రహాలస్థితిగతులరీత్యా శ్రీమన్మథనామ సంవత్సరంలో ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20వరకు అంటే.. నిజఆషాఢమాసం బహుళ ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ షష్ఠివరకు శుక్రమౌఢ్యమిగా పరిగణించాలి. ఈ సమయం కూడా వివాహాది శుభకార్యాలకు పనికిరాదు.
గోదావరి పుష్కరాలు - 2015
(జూలై 14 నుంచి జూలై 25వరకు)
గోదావరి మహాత్మ్యం
రేవాతీరే తపఃకుర్యాత్మరణం జాహ్నవీతటే
దానందద్యా త్కురుక్షేత్రే గౌతమీమ్యాంత్రితయంపరం
నర్మాదానదీతీరాన తపస్సు చేస్తే ముక్తి లభిస్తుంది. గంగాతీరాన తనువు చాలిస్తే ముక్తి కలుగుతుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం కలుగుతుంది. అటువంటిది గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ మూడు పుణ్యాలు ఇట్టే లభ్యమవుతాయి.
అంతటి పునీతమైన గోదావరి నదికి మన్మథనామ సంవత్సరంలో పుష్కరాలు జరుగుతాయి. గౌతమమహర్షి తపోఫలితంగా బ్రహ్మగిరులపై ఉద్భవించి.. త్ర్యంబకేశ్వరుడ్ని అభిషేకించి.. సరస్వతీ క్షేత్రంలో జ్ఞానతీర్థమై... కాళేశ్వరుడ్ని అర్చించి... భద్రాద్రిలో రామయ్య పాదాలు కడిగి... వేదమంత్రాల ప్రతిధ్వనుల నడుమ రాజమహేంద్రి నుంచి ముందుకుసాగి.. కోటిలింగేశ్వరుడ్ని ఆరాధించి.. సప్తగౌతమిగా సముద్రుడిలో సంగమించే దివ్యనది గోదావరి. మరాఠానేలపై ఉద్భవించినా.. తెలుగింటి ఆడపడుచుగా పూజలందుకుంటున్న పణ్యనదీమ తల్లి గోదావరి. అటువంటి గోదారమ్మకు పుష్కరాలతో స్వాగతం పలుకుతోంది మన్మథనామ సంవత్సరం.
  పుష్కరనిర్ణయం
శ్రీమన్మాథనామ సంవత్సరంలో.. జూలై 14, 2015న అంటే అధికఆషాఢమాసం బహుళత్రయోదశి మంగళవారం రోజున ఉదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు దేవగురు బృహస్పతి సింహరాశిలోని మఘనక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 25, 2015న అంటే నిజఆషాఢమాసం శుద్ధ నవమి శనివారం రోజున ముగుస్తాయి. అంటే... మొత్తం 12 రోజులపాటు గోదావరి నదికి పుష్కరాలు. పుష్కరాల సమయంలో పుష్కర సహితుడైన బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు గోదావరి నదిలోనే ఉంటారని పురాణవచనం. అందుకే పుష్కరాల సమయంలో పుణ్యస్నానం కోటిజన్మల పుణ్యఫలం అని ప్రతీతి. ఈ పన్నెండురోజుల కాలంలో గోదావరి తీరంలో పవిత్రస్నానాలు, దైవదర్శనాలు, దానాలు, పితృదేవతలకు తర్పణాది పిండప్రదనాలు చేయడం సకలశుభకరం.
 గోదావరి పుష్కర స్నాన విధి
గోదావరి పుష్కరాల సమయంలో.. పుణ్యస్నానం ఆచరించడానికి నదిలో దిగినప్పుడు గోదావరిదేవిని, వినాయకుడ్ని, సూర్యభగవానుడ్ని, బ్రహ్మసరస్వతులను, లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, పుష్కరుడిని, బృహస్పతిని, ఇంద్రుడిని, సప్తర్షులను, పంచభూతాలను, మీరు స్నానం చేస్తున్న క్షేత్రదైవాన్ని, మీ ఇంటి ఇలవేల్పును, మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా స్మరించి... అర్ఘ్యాన్ని సమర్పించి... గోదావరికి పసుపుకుంకుమలు అర్పించి పుణ్యస్నానాలు ఆచరించాలి. దీపనీరాజనాలు అర్పించాలి. గోదావరి పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడం అంటే.. భక్తిశ్రద్ధలతో సకలపాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మూడు మునకలు వేయడం. భార్యభర్తలైతే వేణీస్నానం చేయాలి. అంటే భార్య కొంగును.. భర్త కండువాకు కట్టుకుని ఇద్దరు ఒకేసారి మునకలు వేయాలి. భార్యభర్తలు ఒకేసారి పుష్కరస్నానాలకు వెళ్లలేకపోయిన పక్షంలో స్త్రీలైతే మాంగళసూత్రంపై చేయిపెట్టుకుని స్నానం చేయాలి. పురుషులైతే హృదయంపై చేయిపెట్టుకుని స్నానం చేయాలి. అప్పుడు భార్యభర్తలు ఒకేసారి పుణ్యస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సూతకం ఉన్నవారు సైతం పుష్కరస్నానం చేయవచ్చు. పుష్కరస్నానం తర్వాత.. గోదావరిదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.
వీలైతే బ్రహ్మణుడి చేత పూజాక్రతువు నిర్వహించుకోవచ్చు. మీ శక్త్యానుసారం దానాదికాలు చేయాలి. పితృదేవతలకు పిండప్రదానం చేసినట్లైతే పునఃస్నానం చేయాలి. నదీ తీరాన ఉన్న క్షేత్రదర్శనం చేసుకోవాలి. పుష్కరాలకు రాలేకపోయిన బంధమిత్రుల కోసం నదీజలాన్ని తిరుగుప్రయాణంలో ఇంటికి తీసుకెళ్లాలి.                      గోదావరి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.
 గోదావరి పుష్కరాల సమయంలో చేయాల్సిన దానాలు
పుష్కరాల సమయంలో శక్త్యానుసారం ఏ చిన్నదానం చేసినా అది కోటిజన్మల
పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రవచనం. అందుకే.. వారి వారి శక్తిని అనుసరించి.. గోదావరి తీరాన పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత.. ఆయా రోజుల్లో పేర్కొన్న దానాలు చేయవచ్చును.
జూలై 14, 2015 - మంగళవారం - బంగారం, ధాన్యం, భూమి, అన్నదానం
జూలై 15, 2015 - బుధవారం - రత్నాలు, గోవు, ఉప్పు, వస్త్రాలు
జూలై 16, 2015 - గురువారం - బెల్లం, పళ్లు, ఆకుకూరలు, వెండి గుర్రంప్రతిమ
జూలై 17, 2015 - శుక్రవారం - నెయ్యి, నువ్వులనూనె, పాలు, తేనె, చక్కెర
జూలై 18, 2015 - శనివారం - ధాన్యం, ఎద్దు, గేదెలు, నాగలి
జూలై 19, 2015 - ఆదివారం - గంధపుచెక్క, ఔషదాలు, కర్పూరం, కస్తూరి
జూలై 20, 2015 - సోమవారం - పీట, మంచం, వాహనం, గృహం
జూలై 21, 2015 - మంగళవారం - గంధం, కందమాలలు, పూలు
జూలై 22, 2015 - బుధవారం - 16 రకాల దానాలు, పిండప్రదానాలు
జూలై 23, 2015 - గురువారం - పూలమాల, ముత్యాలహారం, వెండి
జూలై 24, 2015 - శుక్రవారం - పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలం
జూలై 25, 2015 - శనివారం - నువ్వులు, 16 రకాల దానాలు
షోడశదానాలు (16రకాల దానాలు):  1.ఇల్లు, 2.బంగారం, 3.చామరం 4.త్రాసు, 5.బంగారం, 6.వెండి, 7.పత్తి, 8.తేనె, 9.మంచం, 10.రత్నాలు, 11.పుస్తకం, 12.గోవు, 13.ఏనుగు, 14.గుర్రం, 15.మేక, 16.కన్యాదనం
(గోవు, ఏనుగు, అశ్వం వంటివి దానం చేయడం అంటే.. వాటిని ప్రతిమలు రూపంలో దానం చేయడమన్నమాట)
 గోదావరి పుష్కరాల సమయంలో చేయాల్సిన పిండప్రదానాలు
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి.. పితృదేవతలకు పిండప్రదానం చేస్తే.. ఆ వంశంలో గతించినవారికి సద్గతి కలుగుతుందని.. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం. అందుకే పుష్కరాల సమయంలో పితృదేవతలకు పిండప్రదానం తప్పక ఆచరించాలి. పుష్కరాల సమయంలో మొత్తం 30మందికి పిండప్రదానం చేయాలని శాస్త్రం చెబుతుంది. అయితే.. గతించిన వారి బంధుత్వాన్ని అనుసరించి పిండప్రదానం చేయవచ్చు. గోదావరి పుణ్యస్నానాలు జరిగే తీరాల్లో బ్రాహ్మణపురోహితుల
ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పిండప్రదానం చేస్తే పితృదేవతలందరికీ సద్గతి లభిస్తుంది. కింద పేర్కొన్న బంధుత్వాల్లో ఎవరు మరణించిన ఉన్నా.. వారందరికీ పిండప్రదానం చేయడం శాస్త్రప్రమాణం. పుష్కరాల్లో తొమ్మిదోరోజున చేసే పిండప్రదానం విశేషమైనదిగా చెబుతారు (గోదావరి పుష్కరాల్లో తొమ్మిదోరోజు జూలై 22, 2015). అలాగే పుష్కరాల సమయంలో వచ్చే అధికఆషాడఅమావాస్య (జూలై 16, 2015) రోజున కూడా పిండప్రదానం పుణ్యప్రదంగా భావిస్తారు... లేదా గతించిన వారి తిధిని అనుసరించి కూడా పిండప్రదానం చేయవచ్చు.  గతించినవారికి పిండప్రదానాలు
1.తండ్రి
2.తల్లి/ సవతితల్లి
3.ముత్తాత (తాతకు తండ్రి)
4.జేజమ్మ (తాతకు తల్లి)
5.తాత (తండ్రికి తండ్రి)
6.తాత (తల్లికి తండ్రి)
7.అమ్మమ్మ
8.నాన్నమ్మ
9.భార్య
10.కొడుకు/ కూతురు
11.అన్న/ తమ్ముడు
12.అక్క/ చెల్లెల్లు
13.పెద్దనాన్న/ చిన్నాన్న
14.పెద్దమ్మ/ పిన్ని
15.మేనమామ/ మేనత్త
16.మేనల్లుడు/ మేనకోడలు
17.అల్లుడు/ కోడలు
18.బావ/ మరిది (అక్కా లేదా చెల్లిలి భర్త)
19..మామ/ అత్త
20.ప్రభువులు/ యజమానులు
21.గురువులు
22.ధనసహాయం చేసినవారు
 వివాహాది శుభకార్యాలు చేయవచ్చునా?  లేదా?
పుష్కరాల సమయంలో బృహస్పతి సింహరాశిలో ఉండటాన్ని సింహస్థగురుదోషకాలంగా వ్యవహరిస్తారు. అంటే ఆ సమయం వివాహాది శుభకార్యాలకు అనువైనది కాదు అని అర్థం. సింహరాశిలో బృహస్పతి సంచారాన్ని అనుసరించి శుభకార్యాలు ఎన్ని రోజులు చేయకూడదు అనే అంశాన్ని ధర్మసింధు, పంచాంగశాస్త్రం నిర్ణయించాయి. గురుగ్రహం మఘ నక్షత్రం ఒకటవ పాదం ప్రవేశించడం మొదలు (అంటే జూలై 14 నుంచి) శుభకార్యాలు చేయడాన్ని నిషిద్ధంగా వ్యవహరిస్తారు. అయితే.. ఇది ఏడాది కాలంపాటు అన్ని ప్రాంతాలవారికి వర్తిస్తుంది అనేది వాస్తవం కాదు. గురుగ్రహం పుబ్బ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించిన తర్వాత గోదావరి పరీవాహక శుభకార్యాలు నిర్వహించవచ్చు అని పంచాంగశాస్త్రం చెబుతోంది. ఆ లెక్కన చూసుకుంటే... బృహస్పతి మఘనక్షత్రం ఒకటవపాదంలోకి ప్రవేశించిన జూలై 14, 2015 నుంచి పుబ్బ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించే సెప్టెంబరు 30వరకు శుభకార్యాలు చేయకూడదు. ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం ఏమిటంటే.. మన్మథనామ సంవత్సరంలో అధికఆషాడమాసంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నిజఆషాఢమాసంలో ముగిశాయి. ఆషాఢమాసాల్లో ఎలాగూ వివాహాది శుభకార్యాలు చేయరు. ఆ తర్వాత వచ్చే శ్రావణమాసంలో గురు,శుక్ర మౌఢ్యమిలు ఉన్నందున ఆ మాసం కూడా ముహూర్తాలకు పనికిరాదు. ఇక ఆ తర్వాత వచ్చే భాద్రపదమాసం కూడా శూన్యమాసమే. మొత్తంగా చూస్తే అక్టోబరు 13, 2015 నుంచి ప్రారంభమయ్యే ఆశ్వీయుజమాసం వరకు పుష్కరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు చేయడానికి అర్హమైన కాలం లేదు.
ఆశ్వీయుజమాసం (అక్టోబరు 13) నుంచి వివాహాది శుభకార్యాలు చేయడానికి అర్హమైన ప్రదేశాలవారు:
ఆంధ్రప్రదేశ్లో: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుజిల్లాలవారు
తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలవారు వివాహాది శుభకార్యాలు చేయవచ్చు
----------------------------------------------------------------------------------------------
గురుడు సింహరాశిని వదిలి కన్యారాశిలో ప్రవేశించేవరకు
వివాహాది శుభకార్యాలు చేయడానికి అనర్హమైన ప్రదేశాలవారు:
( జూలై 14, 2015 నుంచి ఆగస్టు 11, 2016వరకు)
ఆంధ్రప్రదేశ్లో:  తూర్పుగోదావరిజిల్లా, పశ్చిమగోదావరిజిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలవారు
తెలంగాణలో: ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలవారు
అయితే.. ఇక్కడ మరో వెసలుబాటు ఉంది.
" గోదావరి నద్యాం ఉభయ పార్శయోః వింశతి యోజనాత్ పరతః శుభకార్యాణి ఆచరంతి"  అని పండితవచనం.
అంటే.. పైన పేర్కొన్న ప్రాంతాలవారు గోదావరి నదీ పరీవాహక ప్రాంతానికి 260 కిలోమీటర్ల (20 యోజనులు) దూరంలో గనుక ఉంటే.. వారు ఆలయల్లో కాని.. కల్యాణమండపాల్లో కాని గురువు పుబ్బ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించిన తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది
 చేయదగిన/ చేయకూడని శుభకార్యాలు
దిగువ పేర్కొన్న అంశాలు పుష్కరాలు జరుగుతున్న సమయంలో అన్ని ప్రాంతాలవారికి వర్తిస్తాయి. అయితే.. ముందుగా చెప్పిన విధంగా.. బృహస్పతి పుబ్బ నక్షత్రం 2వ పాదంలోకి అడుగుపెట్టిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాలు మినహా (శుభకార్యాలు చేయవచ్చునా?  లేదా?  పరిశీలించండి) మిగతా ప్రాంతాలవారికి ఈ నియమాలు వర్తించవు.
సింహస్థగురుదోషకాలంలో (పుష్కరాలకాలంలో) చేయదగిన శుభకార్యాలు:
సీమంతం, పురుడు కోసం పుట్టింటికి వెళ్లడం, పుట్టినబిడ్డతో అత్తవారింటికి రావడం, బారసాల, పెళ్లిచూపులు, వివాహ విషయాలు మాట్లాడటానికి,  వివాహమైన దంపతులు కొత్తకాపురం, ఇళ్లస్థలాలు కొనటం, రిజిస్ట్రేషన్్లు, అద్దెఇంట్లో మారటం, వాణిజ్యవ్యాపారపరమైన పనులు ప్రారంభించడం తదితర కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. సింహస్థగురుదోషకాలంతో సంబంధం లేకుండా ఈ కార్యాలు చేపట్టవచ్చు.
సింహస్థగురుదోషకాలంలో (పుష్కరాలకాలంలో) చేయకూడని శుభకార్యాలు:
వివాహం, ఉపనయనం, శంఖుస్థాపన, గృహప్రవేశం, దేవతాప్రతిష్టలు, తొలిసారి పుట్టువెంట్రుకలు, చెవులు కుట్టడం, బోరింగ్్ వేయటం, మొదటిసారి తీర్థయాత్రకు వెళ్లడం, యజ్ఞాలు, అక్షరాభ్యాసాలు వంటి శుభకార్యాలు సింహస్థగురుదోషకాలంలో చేయకూడదు.
----------------------------------------------------------------------------------------------
                 గోదావరి అంత్యపుష్కరాల తేదీలు
          జూలై 31, 2016 నుంచి ఆగస్టు 11, 2016వరకు
----------------------------------------------------------------------------------------------
            శ్రీదుర్ముఖినామ సంవత్సరంలో కృష్ణానదిపుష్కరాలు
            ఆగస్టు 12, 2016 నుంచి ఆగస్టు 23,2016వరకు
----------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Pages