నిజమైన భక్తుడు - అచ్చంగా తెలుగు

నిజమైన భక్తుడు

Share This

నిజమైన భక్తుడు

- చెరుకు రామమోహనరావు 


భూలోకంలో ఓ పేదరైతు తన వ్యవసాయం తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని, తను పోషించుకుంటూ, ప్రతి పనికీ ముందూ శ్రీహరి నామాన్ని జపిస్తూ అంతా స్వామిదయ,నాదేమీ లేదు అని తలపోస్తూ జీవితాన్ని గడుపుతూ కనబడతాడు.
ఒకనాడు నారదుడు నారాయణ జపము చేస్తూ విష్ణు దర్శనమునకై వైకుంఠము చేరుతాడు. ఆ సమయములో విష్ణువు ఆ భక్తుని భక్తికి ఎంతో మురిసిపోతూ తదేకముగా ఆ భూలోక వాసిని చూస్తూ ఉంటాడు. అదిచూసి నారదుడు శ్రీమన్నారాయణా! ఆ రైతు తన పనులు తాను చేసుకుంటూ, అప్పుడప్పుడు మాత్రమే నీ నామాన్ని జపిస్తున్నాడు. నిరంతరమూ ని నామమె జపించేనాకంటే నీకు ఆ సాధారణ వ్యక్తి  ఎలా ఆప్తుడౌతాడు? అని ప్రశ్నించినాడు. అంత నారాయణుడు నవ్వి సరే నారదా! నీకు ఓ పరీక్ష పెడతాను అందులో నీవు నెగ్గితే నీవే గొప్ప భక్తుడవని అంగీకరిస్తాను.  లేదంటే ఆ సామాన్యుడే అసామాన్య భక్తుడని నీవు నమ్మవలసి ఉంటుంది అన్నాడు. నారదుడు అందుకు ఆనందంగా అంగీకరించి మరి పరీక్ష ఏమిటో చెప్పు స్వామీ' అన్నాడు.. విష్ణువు వెంటనే ఒక  నూనెతో నిండిన  పాత్రను తెప్పించి అది నారదుని తలపై పెట్టుకొని  ఒక్క చుక్క కూడా నూనె క్రింద పడకుండా  రోజంతా  భూలోకం చుట్టిరమ్మన్నాడు. నారదుడు సరేనని నెత్తిపై నూనెగిన్నె పెట్టుకొని సంచారానికి సన్నద్ధమైనాడు.
పందెంలో గెలవాలని, నూనె చుక్క క్రిందపడకూడదనే తలంపుతో సంచరిస్తూ, నారాయణ నామాన్ని స్మరించడం మరచిపోయినాడు. అలా తిరిగి సాయంత్రానికి విష్ణులోకం చేరుకుని, ప్రభూ నీవు చెప్పినట్లే నూనె చుక్క క్రింద పడకుండా లోకాలు సంచరించి వచ్చితినన్నాడు. అంతటితో ఆగక మరి నేను పందెం గెలిచినట్లే కదా! అని అడిగినాడు. అందుకు విష్ణువు  'నూనె క్రిందపడలేదు కాని నా నామాన్ని ఎన్ని మార్ల జపించేవు?' అని ఎదురు ప్రశ్న వేసినాడు. అందుకు నారదుడు సిగ్గుతో  'అయ్యో! స్వామీ  పాత్రమీద ధ్యాసతో నీ నామం పలకడమే మరచిపోయినాను.' అన్నాడు. అపుడు శ్రీహరి తెలిసిందా  నారదా! నీకు వేరేపని లేదు కనుక నిరంతరాయంగా నా నామాన్ని స్మరిస్తున్నావు. కానీ పని చేతికొస్తూనే  నా నామం పలకడం మరిచిపోయినావు. కాని ఆ రైతు తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ మనసులో నన్నే స్మరిస్తూ జీవిస్తున్నాడు. మరి మీ ఇరువురిలో ఎవరు గొప్ప అంటావో నీవే చెప్పు.' 'నన్ను ఎవరైతే మనసా, వాచా, కర్మణా  ధ్యానిస్తూ ఉంటారో వారికి తామరాకు నీటిబొట్టు సామేతలోని వాస్తవములా ఏ  పాపములూ  అంటనీక నా ఆప్తునిగా చేసుకొంటాను. అవసాన దశలో నా  సన్నిధి చేర్చుకుంటాను.'. అని పల్కి 'నీవు కూడా నాకు ఆప్తుడవే 'అని తన సహజమైన శైలిలో నారదునితో అన్నాడు. అప్పుడు నారదుడు శ్రీహరితో స్వామి నన్ను క్షమించండి. నిజమైన భక్తులపై నీవు తారతమ్యాలు చూపవని నిరూపించి , నా గర్వాన్ని పోగొట్టినావు. మీ మనసునేరుగుట నా తరము కాదని స్వామికి నమస్కరించి సంచారానికి బయలుదేరినాడు. .

No comments:

Post a Comment

Pages