ఒరే పైలట్! (ఇదో సినిమా కథ) - అచ్చంగా తెలుగు

ఒరే పైలట్! (ఇదో సినిమా కథ)

Share This
ఒరే పైలట్!(ఇదో సినిమా కథ)
 

పెయ్యేటి శ్రీదేవి


' ఓహో ఓహో పైలట్టూ........తినిపించావు మంచి పెసరట్టూ!' అనే పాటను నెమ్మదిగా కూనిరాగం తీసుకుంటూ ఇంటికి వచ్చింది, నందిని....
          కుర్చీలో కూర్చుని పేపరు చదువుతున్న మామయ్య ప్రసాదరావుని చూసి , ' ఎంత సేపైంది మామయ్యా నువ్వొచ్చి?' అని అడిగింది.'కొత్త సినిమా కదా అని వెడదామంటే టిక్కట్టు దొరకలేదమ్మా.  హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టారు.  సరే, ఇంకో రోజెళ్ళచ్చులే అని వెడుతూ వెడుతూ ఇటొచ్చాను.  మీ అమ్మేమో నన్ను కూచోమని ఇప్పుడే వస్తానంటూ ఎటో వెళ్ళింది.  అవునుగాని, కాలేజి నించి ఏమిటింత లేటుగా వచ్చావు?  ఇప్పుడు టైము ఏడు కావస్తోంది.'' ఇవాళ కాలేజి జరగలేదు మామయ్యా.  లెక్చరర్లు రాలేదు.  ఫ్రెండ్సందరం కలిసి సినిమాకెళ్ళాం ' అంటూ నందిని మొహం కడుక్కుని, కాఫీ చేసి, ఓ కప్పు మామయ్య కిచ్చి, తను కూడా తాగుతూ, ' చెప్పు మామయ్యా!  ఏమిటీ విశేషాలు?' అని అడిగింది. ' కాఫీ చాలా బాగుందమ్మా.' ' ఔను మామయ్యా.  నే కాఫీ కలిపితే అందరూ బాగుందంటారు.  సరేగాని మామయ్యా, అత్తయ్యని కూడా తీసుకురాలేక పోయావా?  రమ ఎలా వుంది?  చాలా రోజులయింది చూసి.' ' సర్లే, మీ అత్తయ్యని తీసుకొస్తే  మీ యిద్దరికీ సరిపోతుంది.  అదేదో సినిమాలో శ్రీలక్ష్మి లాగ సినిమా కథలన్నీ వరస పెట్టి నోటితో చెప్పేస్తావు.  మీ అత్తయ్య టైము తెలీకుండా ఎన్నాళ్ళైనా నీతో గడిపేస్తుంది.  రమకేమో పరీక్షలు.  సరేగాని ఇంతకీ ఏ సినిమాకెళ్ళారే నందూ?' ' ఒరే పైలట్.' ' అయ్యో, ఆ సినిమాకే వెడదామనుకున్నాను.  టిక్కట్టు దొరకలా.  ఎలా వుంది?  బాగుందా?' ' ఉండు, ఈ కాఫీ కప్పులు కడిగేసొచ్చి చెబుతాను.' ' ఊ..........చెబుతాను విను.  మధ్యలో ప్రశ్నలు వెయ్యకు. ఢం......ఢం...........ఢం..........టట్టడాయ్........... ఇది బేక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట!  ఇప్పుడే టైటిల్సు వస్తూంటాయి.' ' నువ్వు చెప్పకు.  నేను సినిమా చూస్తా......' ' అదుగో, మధ్యలో మాటాడొద్దన్నానా?  చెప్పింది విను.' అంటూ చేత్తో మామయ్య నోరు మూసింది నందిని మాట్లాడనివ్వకుండా. ' ఒరే పైలట్!.......చలన చిత్రం! ముఖ్యతారాగణం....సుధీర్, నమ్రత పడుకొనె, సలోని బింద్రె, మోహను, ఆత్మానందం, ఢిల్లీనందిని, పద్మసుధ మొదలైనవారు. స్టంట్లు - కె. భాస్కర్ సంగీతం - వీరవాణి పాటల రచయిత - విజయేంద్ర గానం - వినీత, సంధ్య, మధు నృత్యాలు - జయంత్ ఫొటోగ్రఫీ - హనుమంత్ కథ - జయశ్రీ నిర్మాత - బుధ్ధదేవ్ దర్శకత్వం - శచీంద్ర సినిమా మొదలవగానే............... ఉదయం ఆరుగంటలకి అలారం మోగుతుంది.  వాసు మంచం మీంచి ఇంకా లేవలేదు.  ఇంతలో చెల్లెలు స్వాతి వచ్చి, ' అన్నయ్యా!  త్వరగా లే.  అలారం మోగుతోంది.  వినబడటల్లా?  లే అన్నయ్యా.  అమ్మ టిఫిను కూడా రెడీ చేసి పెట్టింది.  నువ్వు త్వరగా లేస్తే ప్రేమగా ఎప్పుడు నీ నోట్లో కూరదామా అని చూస్తోంది.  ఈ రోజు ఇంటర్వ్యూకెళ్ళాలి కదా?' సరే తల్లీ!  ఇప్పుడే బ్రష్ చేసుకుని, స్నానం చేసి ఐదు నిముషాల్లో రెడీ అయి వచ్చేస్తాను.' వాసు స్నానం చేసి రెడీ అయి వచ్చేసరికి అమ్మ నవ్వుతూ ప్రేమగా టిఫిను ప్లేటు పట్టుకు నుంచుంది.  పాత సినిమలో గుమ్మడి లాగ నాన్న నులకమంచంలో దగ్గుతూ నల్లరగ్గు కప్పుకుని పడుకున్నాడు.  ఆయనకి ఉబ్బసం.  అందుకు దగ్గండం ఆయన జీవితంలో భాగమైపోయింది.  ఆయన దగ్గు భరించలేక ఆఫీసువాళ్ళు ఆయన్ని ఇంటికి పంపేసారు.  అలా వున్న చిన్నపాటి ఉద్యోగం ఊడింది.  పాతసినిమా కష్టాల్లాగ ఈ కష్టాలని ఎదుర్కొనే కుటుంబం బాధ్యత వాసు మీద పడింది.  దేముడికి నమస్కారం చేసి, అమ్మ ప్రేమతో తినిపించిన టిఫిను తిని, అమ్మ పాదలకి నమస్కారం చేసి ఫైలు తీసుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు వాసు.  స్వాతి ఎదురొచ్చి, ' ఆల్ ది బెస్ట్ ' చెప్పింది.  ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు.  వాళ్ళడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్టుగానే సమాధానాలు చెప్పాడు.  వాసుకి డిగ్రీలకేం లోటు లేదు.  తెలివితేటలూ తక్కువేం లేవు.  అన్నీ వున్నాయి.  కాని అతని దగ్గర లేనిది ఇంటర్వ్యూ అధికారి అడిగినంత లంచం ఇచ్చుకోలేని డబ్బు.  అవును.  ఆ ఇంటర్వ్యూ అధికారి రెండు లక్షలు లంచం అడిగాడు. ' ఆ రెండులక్షలే నా దగ్గరుంటే ఈ వుద్యోగానికెందుకొస్తాను?' అంతూ విసురుగా తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. లంచం ఇచ్చుకోడానికి వాసు దగ్గర అంత డబ్బూ లేదు.  ఒకవేళ ఇచ్చుకునే డబ్బున్నా లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడం అతనికిష్టం లేదు.  ఎవరి రికమెండేషన్లు అవసరం లేకుండా నీతిగా నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు.  కాని కాసులకమ్ముడు పోయే ఈ అవినీతి దేశంలో అది అసాధ్యమని తెలుసుకున్నాడు. ' ఇంటర్వ్యూ జరిగిందాన్నయ్యా?  జాబ్ దొరికినట్లేనా?' ' లేదమ్మా.  రెండులక్షలు లంచం అడిగాడు.  అందుకే ఇంటర్వ్యూ బాగా చేసినా లంచం ఇవ్వందే దొరికేట్టు లేదు.  ఆల్రెడీ ఆ జాబ్ లంచం ఇచ్చిన ఏ తలమాసిన వాడికో నిర్ణయం అయిపోయుంటుంది.  అన్నట్టు కాలేజి ఫీజు కట్టాలన్నావుగా?  రేపు తెచ్చిస్తాను.' ' ఎక్కడ్నించి తెస్తావన్నయ్యా?' ' ఎలాగో తెస్తాను గాని, పరీక్షలకి బాగా చదువు.  ఫస్ట్ క్లాస్ రావాలి.  అన్నట్టు అమ్మకి ఇంటర్వ్యూ గురించేం చెప్పకు.  ఆవిడకసలే బి.పి.' అంటూ బైటకెళ్ళాడు వాసు.  వారం రోజుల్నించీ ఆటో అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు.  బాగానే గిట్టుబాటవుతోంది.  వాసు వారం రోజులయ్యాక వచ్చాడు.  వస్తూనే తల్లికి, చెల్లికి చీరలు తెచ్చాడు. ' అన్నయ్యా!  ఉద్యోగం వచ్చిందా?  కాలేజి ఫీజు మర్నాడే తెచ్చిస్తానన్నావు.  ఫీజు కట్టాలేదని కాలేజికి రానివ్వలేదు.' ' అదేమిటమ్మా?  నా ఫ్రెండ్ రమేష్ కిచ్చి పంపాను.  ఇవ్వలేదా?' ' లేదు.  నేనే పిల్లలకి ట్యూషన్లు చెబుతున్నాను.' ఆటో నడుపుతున్న విషయం చెల్లెలికి చెప్పలేదు.  తన దగ్గరున్న డబ్బు కాలేజి ఫీజు కట్టమని చెల్లెలికిచ్చాడు. ' ఎక్కడిదన్నయ్యా ఇంత డబ్బు?' ' అవన్నీ తరువాత చెబుతాను.  ముందు కాలేజిఫీజు కట్టు.  నీతిగా సంపాదించిన డబ్బేలే.  నేనర్జంటుగా వెళ్ళాలి, వస్తా.' అంటూ వెళ్ళిపోయాడు. వాసు ఆటో వెడుతూండగా ఒక పెద్దాయన ' అర్జంటుగా విజయా నర్సింగ్ హోం కి పోనీ.' అంటూ వాసు పర్మిషను లేకుండా ఆటో ఎక్కి కూచున్నాడు.  ఆయన వాసుని గుర్తు పట్టలేదు.  వాసు మాత్రం ఆయన్ని గుర్తు పట్టాడు.
          ఇప్పుడు విరామం.
          ' ఇదుగో మామయ్యా, ఈ కారప్పూస తిను.  ఇవిగో మంచినీళ్ళు.  వుండు, చాయ్ కూడా తెస్తా.................ఇదుగో, చాయ్ తాగు.  మళ్ళీ సినిమా మొదలౌతోంది.  విను...........ఆ.........ఇప్పుడెంతదాకా చెప్పానూ?.....ఉండు, ఉండు.  నువ్వు మాట్లాడకు.  గుర్తొచ్చింది.ఆటోలో వున్న ఆ పెద్దమనిషిని వాసు గుర్తు పట్టాడన్నమాట.  వాసుని ఆయన గుర్తు పట్టడు.  వాసు ఒక ఇంటర్వ్యూకెడితే ఇంటర్వ్యూ చెసిన అధికారి ఇప్పుడు ఈ ఆటోలో కూర్చున్న పెద్దమనిషి నాగభూషణం.  ఆయనో పెద్ద వ్యాపారవేత్త.  ఐనా అలాంటి వాళ్ళక్కూడా డబ్బు ఇబ్బందేమో, రెండు లక్షలు లంచం అడిగాడు.  మధ్యతరగతి వాళ్ళని అటు కిందతరగతి వాళ్ళూ పీడిస్తారు, ఇటు కోటీశ్వరులూ పీడించుకు తింటారు.  అందరివల్లా ఎటూ నష్టపోయేది మధ్యతరగతి వాళ్ళే.  కిందతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళని వాళ్ళ దగ్గరేదో వుందనుకుని డబ్బులు పీడించి సొమ్ము చేసుకుంటారు.  ఉన్నవాళ్ళు ఎంతున్నా దాహం తీరక మధ్యతరగతి వాళ్ళని ఇంకా దోచుకు తింటారు.  తను ఇంటర్వ్యూ చాలా బాగా చేసాడు.  అంత మాత్రాన ఉద్యోగం రావాలనేం లేదు.  వాళ్ళడిగిన లంచం ఇవ్వలేకపోయాడు.  పైగా ఏ రికమెండేషనూ లేదు.  అందుకే నిరుద్యోగిగానే వుండి, ఎన్ని డిగ్రీలున్నా ఆటో నడుపుకుంటున్నాడు.  కారులో తిరిగే ఈ పెద్దమనిషికి ఆటో ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు వాసుకి. విజయా నర్సింగ్ హోం దగ్గర ఆపాడు. ' ఎంతిమ్మంటావు?' అడిగాడు ఆయన. ' ఏభయి వేలు!' ' నేనేం విమానంలో రాలేదు.  కారు రిపేరొచ్చి గత్యంతరం లేక నీ బోడి ఆటో ఎక్కాల్సి వచ్చింది.' ' మీరిచ్చే బోడి ఉద్యోగానికి రెందు లక్షలు లంచం అడిగారు.  ఇప్పుడు నేనడిగింది అన్యాయంగా తోచిందా?  సరే, మీ తాహతుని బట్టి ఇవ్వగలిగినంత ఇవ్వండి.' అలా అనేసరికి అహం దెబ్బ తిని వెయ్యి కాగితం ఇచ్చాడు. ' అంతొద్దులెండి.  ఐదొందలు చాలు.' అని మిగతా ఐదువందలు ఇచ్చేసాడు. వాసు తరవాత ఆటో నడుపుతూనే ఇంటర్వ్యూలకి వెడుతున్నాడు.  నేషనల్ ఫ్లైట్ లో పైలట్ ఉద్యోగానికి సెలెక్టయ్యాడు.  పైలట్ ట్రైనింగ్ లో కావ్య అనే అమ్మాయితో పరిచయం అవుతుంది.  వాళ్ళ స్నేహం ముదిరి ప్రేమగా మారుతుంది.  ఫ్లైట్ దగ్గర ఇద్దరూ డ్యూయెట్ పాడుకుంటుంటే కావ్య తండ్రి చూస్తాడు అదే ఫ్లైట్ ఎక్కబోతూ ఇద్దర్నీ. ' ఒరే పైలట్!  ఎంత ధైర్యంరా నీకు?  నా కూతుర్నే ప్రేమిస్తావా?' అంటూ పళ్ళు పట పట నూరుతూ, ' నీ అంతు చూస్తా.' అంటుంటే, ' శాంతించండి ..........శాంతించండి.  ప్రేమించుకునేవాళ్ళు తిధి వార నక్షత్రాలు, కులగోత్రాలు, పుట్టుపూర్వోత్తరాలు, వాళ్ళ తలిదండ్రులెవరో ఆ వివరాలు తెలుసుకుని ప్రేమించుకోరు సార్!  మీ కూతురని ఆ అమ్మాయి మొహం మీద రాసిలేదు.  అందుకే ప్రేమించాను.'
          ఇద్దరూ అక్కడే దండలు మార్చుకుంటారు.  ఎయిర్ పోర్టు సిబ్బంది అంతా వచ్చి అక్షింతలు చల్లుతారు.' మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్యా! '' అవున్నాన్నా.  మమ్మల్ని ఆశీర్వదించండి.  వాసు చాలా మంచివాడు.  ఎవడో ఇంటర్వ్యూ అధికారి రెండు లక్షలు లంచం అడిగాడని అతడి అవినీతి ప్రవర్తనని కడిగేసి, నీ బోడి వుద్యోగం నాకక్కర్లేదంటూ వచ్చేసి, ఆటో నడుపుతూ మిగతా ఇంటర్వ్యూలకి వెడుతూ, స్వశక్తి మీద ఈ పైలట్ వుద్యోగం సంపాదించుకున్నాడు.  అందుకే అతని నిజాయితీ నచ్చి నేను అతడ్ని ప్రేమించాను.  పెద్దమనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నా.' ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు.  ఆయనెవరో కాదు.  వాసుని ఇంటర్వ్యూ చేసి రెండు లక్షలు లంచం అడిగిన అధికారే.  ఆయనే కావ్య తండ్రి నాగభూషణం.  ఆయన కూతురని తెలియకే వాసు కావ్యని ప్రేమించాడు. ' ఒరే పైలట్!  ఆటో నడుపుకుంటూ పైలట్ అయిన నువ్వు, అదీ నేషనల్ పైలట్ అయిన నువ్వు, మా అమ్మాయిని డబ్బు చూసి ప్రేమిస్తావా?' అంటూ చెయ్యెత్తబోతాడు.  మంత్రాలు చదువుతూ పురోహితుడు ఆయన చేతిలో అక్షింతలు వేసి ఆశీర్వదించమంటాడు.  అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి నోరెళ్ళబెట్టి, వాళ్ళ మీద అక్షింతలు చల్లుతాడు.  ఫ్లైట్ లోకి పెసరట్లు తీసికెడుతూ ఎయిర్ హోస్టెస్ ఒక పెసరట్టు ఆయన నోట్లో కూరుతుంది.  ఎయిర్ పోర్ట్ ఆవరణలో విమానం సాక్షిగా ఎయిరిండియా సిబ్బంది మధ్య వాళ్ళ పెళ్ళి ఘనంగా జరిగింది. హనీమూనుకి ఊటీ వెళుతూ ఫ్లైట్ లోంచి ఇద్దరూ చెయ్యి ఊపుతారు.  అనుకోకుండా కావ్య తండ్రి చెయ్యి వూపి వాళ్ళకి వీడుకోలు చెబుతాడు. ' ఓహో ఓహో పైలట్టూ, తినిపించావు మంచి పెసరట్టూ, నువ్వు చేసిందే కరట్టూ, రిక్షా కన్నా ఆల్ వేస్ సూపర్ హిట్టూ ' అంటూ బేక్ గ్రౌండ్ లో పాట వినిపిస్తూ వుంటుంది.
శుభం
          ఇది మామయ్యా ' ఒరే పైలట్!' సినిమా.  వెరైటీగా వుంది.  ' ఓహో ఓహో పైలట్టూ' అన్న పాట చాలా బాగుంది.  సినిమా తప్పకుండా చూడు.' అంది విపులంగా సినిమా కథంతా చెప్పిన నందిని.' ఎంతో ఆశతో ఆ సినిమా చూడాలనుకున్నాను.  సినిమా ఎలా వుంది అని అడిగిన పాపానికి సినిమాలో శ్రీలక్ష్మి లాగ టైటిల్సు నించి విరామం, శుభం దాకా ఏదీ విడిచిపెట్టకుండా కళ్ళక్కట్టినట్లు కథంతా చెప్పేసావు.  ఇంక సినిమా ఏం చూడనమ్మా?  ఇక నే వస్తానమ్మా.  ఇప్పటికే బాగా లేటయింది.  ఈసారి అత్తయ్యతో మరో సినిమా చూస్తాలే.  నీ దగ్గరకొస్తే కానీ ఖర్చు లేకుండా సినిమా చూడచ్చు.' అంటూ, ఓహో ఓహో పైలట్టూ, తినిపించావు మంచి పెసరట్టూ ' అని పాడుకుంటూ ప్రసాదరావు బయలుదేరాడు.
*************************

No comments:

Post a Comment

Pages