రామలింగేశ శతకము - అడిదము సూరకవి
అడిదము సూరకవి పేరువినని తెలుగు భాషాభిమానులు చాలా అరుదు. ఈ అడిగమువారు మొదట "మోదుకూ"రివారని, "గ్రంథావరణం" వారానే ఇంటిపేర్లతో విరాజిల్లి తుదకు సూరకవి పూర్వీకుడైన నీలాద్రికవి బ్రాహ్మణుద్య్యు యుద్దమున చూపిన కరకౌశలముచే అడిదము అనే బిరుదువహించి చివరకు అదే ఇంటిపేరుగా స్వీకరించారు.
ఇరువదిమూఁడు పూరుషము లిప్పటికయ్యెఁ గవిత్వ వృత్తిచే
నరపతు లెల్ల మెచ్చఁ బదునాల్గుతరంబులు మించుఁ బిమ్మటన్
వెరవగుజీవనస్థితి లభించుట తొమ్మిది యయ్యెఁ బూరుషాం
తరములు నిక్కళింగ వసుధాధవు చెంగట నాశ్రయించుటల్ (సూరకవి చాటువు)
అన్న చాటువుని బట్టి ఈవంశమువారు ప్రాచీనకాలమునుండియూ కవులయి, సూరకవి కాలానికే తొమ్మిదితరములుగా కళింగరాజుల ఆశ్రయంలో ఉండేవారని తెలుస్తున్నది.
సూరకవి క్రీ.శ.1720 ప్రాంతమున జన్మించి 63 సంవత్సరాలు జీవించి దాదాపు 1785 ప్రాంతాల మరణించినాడు. బాల్యమున "భూపాలరాజు రేగ" అనే గ్రామమున తండ్రి వద్ద విద్యనభ్యసించి, తండ్రిమరణాంతరం చీపురుపల్లె అనుగ్రామంలో నివాసం ఏర్పర్చుకొన్నాడు. వీరి చాటువులు అత్యంత ప్రసిద్ధం. ఈకవి శాపానుగ్రహ సమర్ధుడని బిరుదువహించినవాడు. దేశములోని అనేక ప్రాంతాలను దర్శించినవాడు. సంవత్సరకాలంలో సుమారు ఆఱుమాసములు దేశసంచారములోనే ఉండేవాడని ప్రతితి. సూరకవి కి ఆనాటిసమకాలీనులైన అనేక మంది కవులతో వాగ్వివాదములు జరిగేవి. వాటిలో సోమకవి నె వైదీకబ్రాహ్మణునితో వాదప్రతివాదాలు ఈనాటికీ చాతువులరూపంలో ప్రసిద్ధి.
అడిదము సురకవి బహుగ్రంధకర్త. 1. చంద్రమతీపరిణయమను నామాంతరం గల కవిజనరంజనము, 2. కవిసంశయవిచ్ఛెద మనె చిన్న లక్షణ గ్రంథము, 3. చంద్రలోకమనే భాషాంతరీకరణాలంకారగ్రంథము, 4. ఆంధ్రనామశేషమనె నిఘంతువు, 5. రామలింగేశ శతకము, 6. పొణ్గుపాటి వేంకటమంత్రి శతకము, 7. రామదండకము మొదలైనవి వీరిరచనలలో కొన్ని.
ఈకవి తన గ్రంథాల నన్నిటినీ రామచంద్రపురములోని రామలింగేశ్వరస్వామికి అంకితం చేసాడు.
శతక పరిచయం:
"రామలింగేశ రామచంద్రపురవాస" అనే మకుటంతో, చక్కని తెలుగు పదాలతో అలరారే భక్తి, నిందాగర్భ, అధిక్షేప సీసపద్య శతకం రామలింగేశ శతకము. విజయనగరరాజులైన పూసపాటి విజయరామరాజుగారి సవతి అన్న సీతారామరాజుగారు తమ్ముని తరఫున రాజ్యభారము వహించి నిరంకుశుడై పరిపాలనం చేస్తుండేవాడు. ఆయనపాలన సమస్త ప్రజలకు అనేక బాధలు కష్టాలు తెచ్చిపెట్టగా సూరకవి ఈ నిందాగర్భ శతకాన్ని వారాడని ప్రతీతి. ఈశతకము జరిగిన అన్యాయాలకు సూరకవి హృదయలో రేగిన కోపాగ్నిని, బాధని మన కళ్ళముందు ఉంచుతుంది. అచ్చతెలుగు లో చెప్పిన ఈ ప్రథమపద్యం ఎంత అందంగా ఉన్నదో చూడండి
శ్రీగౌరి సామేన శిరసునఁ జదలేఱుమురు వైనకేల ముమ్మొనవాలు
గుజ్జువేలుపు ముద్దుఁగుఱ్ఱ మిక్కిలికన్ను పునుకకంచంబును భూతిపూఁత
గిబ్బరాతత్తడి బెబ్బులిదోలును గాలిమేపరి సూడిగములజోడు
గట్టురావిల్లును గడలి బత్తలికయు వలమురిదాలుపువాఁడితూపు
గలిగి భువనత్రయంబు రక్షణసేయ నభిలషించెడి నీపేర నంకితముగ
సీసశతకంబుఁ జెప్పెదఁ జిత్తగింపు రామలింగేశ రామచంద్రపురవాస
(సామేన=సగము శరీరమున, చదలేఱు = గంగ, ఆకాశగంగ, ముమ్మొనవాలు=త్రిశూలము, గుజ్జువేలుపు= వినాయకుడు, మిక్కిలికన్ను=మూడవ కన్ను, పునుక = కపాలం, గిబ్బ = ఎద్దు, బెబ్బులి తోలు= పులిచర్మం, గాలిమేపరి సూడిగముల జోడు= పాముల కంకణములు గట్టు=కొండ, బత్తలిక = అమ్ములపొది, వలమురిదాలుపువాడు = శ్రీమహావిష్ణువు, )
రాజులపై న అక్కసుని ఎంత నిఖచ్చిగా వెళ్ళగక్కాడో ఈ క్రింది పద్యంలో తెలుస్తుంది
మాన్యంబులీయ సమర్థుఁడొక్కఁడులేఁడు మాన్యము ల్చెఱుప సామంతులంద
ఱెండినయూళ్ళగో డెఱిగింపఁ డెవ్వఁడుఁ బండినయూళ్ళెన్నఁ బ్రౌఢులంద
ఱితఁడు పెద యటంచు నెఱిగింపఁ డెవ్వఁడుఁ గలవానిసిరి యెంచఁగలరు చాలఁ
దనయాలి చీఁకటితప్పెన్నఁ డెవ్వఁడు బెఱకాంతఱంకెన్నఁ బెద్దలంద
ఱిట్టిదుష్టుల కధికారమిచ్చినట్టి, రాజుననవలెఁ గాక దుర్ణయులననఁగ
నేమిపని యున్నయది సత్కవీంద్రులకును రామలింగేశ రామచంద్రపురవాస
పైపద్యం ఈ రోజులకే కాక ఈ రోజులకు కూడా ఎంత చక్కగా అన్వయిస్తుందో కదా!! ఇటువంటి పద్యాలు ఈశతకంలో అనేకం. మరిన్ని పద్యాలు చూడండి.
మేలుచేసినయట్టి మిత్రునిఁ జెడఁగొట్టి పెద్దకిరీటంబు బెట్టనేల
తనప్రాపుఁగోరు భూధవుని కెగ్గొనరించి గంధసింధూరములఁ గట్టనేల
తను గొల్చుబంట్ల జీతములు తక్కువఁజేసి ఘోటకంబులు పెక్కుగూర్పనేల
ప్రజలను బడరానిపాట్ల కగ్గముచేసి యగ్రహారంబులీయంగనేల
యధిక నిందలకొడిగట్టి యలరునట్టి, నృపునికీదృశవిభవసమృద్ధులెల్ల
శవకృతాలంకృతులుగావె చర్చసేయ, రామలింగేశ రామచంద్రపురవాస
ఆనాటి పాలకులకు, ఈనాటి అధికారులకు కూడా సరిపోయే ఈ పద్యం చూడండి.
మౌనంబుఁదాల్చుట మన సిచ్చగింపమిగడపి వేయుట లోభకారణంబు
దర్శనం బీయమి తప్పుసైఁపకయున్కి పెడమోముఁ బెట్టుట ప్రియములేమి
గర్వంబు దెల్పుట కారాంతరాసక్తి సమయముగాదంట జరపునేర్పు
నరయుదమన్న రంథ్రాన్వేషణాసక్తి యతివినయంబు ధౌర్త్యంబుఁ దెలుపు
నిట్టిప్రభుదుర్ణయపుఁజేష్టలెఱుఁ గక వెంబడించెడివాఁడెపో వెఱ్ఱివాఁడు
దాని కొడఁబడఁ డింగిత జ్ఞానశాలి రామలింగేశ రామచంద్రపురవాస
నీతులు కూడా ఈ కవి తనదైన శైలిలోనే చెప్పాడు. క్రిందిపద్యాలు చూడండి.
కోఁతికి జల్తారుకుళ్ళాయి యేటికి విరజాజిపూదండ విధవకేల
ముక్కిఁడితొత్తుకు ముత్యంపునత్తేల యద్ద మేటికిని జాత్యాంధునకును
మాచకమ్మకు నేల మౌక్తికాహారంబు క్రూరచిత్తునకు సద్గోష్ఠియేల
ఱంకుఁబోతునకు సద్వ్రతనిష్ఠలేటికి వావి యేమిటికి దుర్వర్తనునకు
మాతనిలకడ సుంకరమోతకేల, చెవిటివానికి సత్కధాశ్రవణమేల
సరసకవితారసంబు ముష్కరునికేల రామలింగేశ రామచంద్రపురవాస
కోయిల రొదసేయ కూయదే కాకంబు దంతివచ్చినబాట దుంతరాదె
పొగడపూఁదొడిగినఁ బూయదే మోదుగు పాలపండిన వేముపండకున్నె
శివుడు నర్తింప నాడవే పిశాచంబులు నడువదే రాయంచ నడువ బకము
దొర దాల్చురవణముల్ తొడుగఁడే భృత్యండుకొండిక వ్రాయఁడే గురుఁడు వ్రాయ
దొడ్దవాఁడు కవిత్వంబు దొడరి చెప్ప, నల్పుఁడు కవిత్వము రచింప నభిలషించు
వారి వారింపఁ బనిలేదు వరకవులకు, రామలింగేశ రామచంద్రపురవాస
ఆశకు ముదిమియు నర్ధికి సౌఖ్యంబు, ధనపరాయణునకు ధర్మచింత
కఠినమానవునకుఁ గరుణాపరత్వంబు వెఱ్ఱిమానిసికి వివేకగరిమ
యల్పవిద్యునకు నహంకార శూన్యత జారకామినికి లజ్జాభరంబు
బహుజనద్వేషికిఁ బరమాయు రభివృద్ధి గ్రామపాచకునకు గౌరవంబు
తామసగుణాఢ్యునకును నుత్తమగుణంబు పాపభీరుత సంతానబాహ్యునకును
గలుగు ననువార్తగలదె లోకములయందు రామలింగేశ రామచంద్రపురవాస
ఇలా చెప్పుకుంటుపోతే ఈశతకంలోని ప్రతిపద్యం ఒక అమూల్య రత్నం. ఎన్నొ నీతులు ఎంతో అర్ధవంతమైన భాష అన్ని కలిసినది ఈ శతకము అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ప్రఒక్కరు చదివి పాటించాల్సిన నీతులు ఎన్నెన్నో. తప్పక చదవండి. ఇతరులచేత చదివించండి.
No comments:
Post a Comment